Jump to content

ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/డిసెంబరు 1939/వయోజన విద్యాప్రచారము

​

వయోజన విద్యాప్రచారము

"To carry knowledge free to the doors of the ignorant, to educate them in the righteous path: nothing can be equal to that form of charity; even to give away the whole world can never come to its level"

Manu.

అజ్ఞానులకు విద్యగఱపుట మహాపవిత్రకార్యం. దీనికి మించిన ధర్మకార్యం మరొకటి లేదు. భారతదేశమున నిప్పుడు నూటికి తొంబదికి పైగా నిరక్షరాస్యులే. వారికి ప్రస్తుత ప్రపంచ పరిస్థితులేమీ అర్ధంకావు. సాంఘికంగా కాని, రాజకీయంగాకాని వారు తమ బాధ్యత గుర్తించలేరు. అట్టి యజ్ఞానముచే దేశమునకు కలుగుచున్న యనర్ధకములు విద్యాధికు లెఱుంగనివి కావు. కాన నీ యజ్ఞానులకు విద్యగఱపుటే విద్యాధికుల ధర్మం.

దేశమందెల్లెడల విద్యావ్యాప్తి కలిగినగాని, ప్రస్తుత పరిస్థితులనుండి నిజమగు విముక్తి కలుగదు, రాజకీయంగాకాని, సాంఘికంగాకాని, నైతికంగా కాని, ఆధ్యాత్మికంగాకాని, ఎట్టి సంస్కరణలు తలపెట్టినను, విద్యావ్యాప్తి కలుగనంతవరకు అవి కృత్రిమ పునాదులమీద నిలువవలసినదే. ఏ గాలిపాటున కవి ఎట్లుపరిణమించునో ! ...!

విద్య నేర్వనివారు పసివారలందును, పెద్దలందునుగూడనున్నారు. పసివారల కొఱకు ప్రాథమిక పాఠశాలలు నెలకొల్పబడుచున్నవి. కాని నిర్బంధము లేమి, తల్లిదండ్రులనేకులు తమబిడ్డల పాఠశాలకు బంపుట లేదు. కాన ప్రాథమిక విద్య నిర్బంధము కావలెను. నిర్బంధం చేయడంలో కొన్ని కష్టాలున్నాయి. కుటుంబ పోషణార్ధం పసిపిల్లలచేగూడ పొలములందు పగలు పనిచేయించుకొనవలసిన బీదలనేకు లున్నారు. వారికొఱకు రాత్రి పాఠశాలలు అవసరం. ప్రాధమిక విద్య పూర్తికాగానే, పాఠశాలలను వదలిన వారు నేర్చినవిద్యను స్వయంకృషిచే తీరిక సమయము లందభివృద్ధి జేసికొని, నిత్యజీవిత సమస్యల నెదుర్కొనుటకు తగిన విషయములను తెలిసికొనవలెను. కాని తగిన సదుపాయములు లేమి, నేర్చిన విద్య అభివృద్ధి చేసికొనుటటుండగా నిరక్షరాస్యతలోనికి మరలు చున్నారు. స్వయంకృషిచే నఅభివృద్ధి చేసికొనువారికీ గ్రంథములే ప్రధానాధారముగనుక గ్రంధసంచయకారులును, సర్వజనీన గ్రంధసేవా నిర్మాతలునగు గ్రంథపాలకులే యీ బాధ్యతను వహించవలసియున్నది. జీవితమంతయు తెంపులేకుండ సాగవలసిన ఈ స్వయంకృషి విద్యావిధానమును నడుపుటలో గ్రంథాలయముల అవసర ప్రాముఖ్యతలను గుర్తించిననాడు, ప్రతి యూరను ప్రాథమిక పాఠశాలలతోబాటు గ్రంథాలయమునుగూడ స్థాపించవలసి యుండును. నిరక్షరాస్యులగు వయోజనులు గ్రంథాలయముల నుపయోగించుకొనలేరు. వారి ​కొఱకు విద్యాలయముల నేర్పాటు జేసినను పగలు పనిమానుకొని పాఠశాలలకు పోవుట కష్టము. కాన వారికి తీరికగానుండు కాలములందు వేసవిలోనో, శీతాకాలమందో, ఆయా ప్రదేశములందుండు పరిస్థితులనుబట్టి విద్య నొసగుటకు తగిన సదుపాయముల నేర్పాటు చేయాలి. మరొక విషయం - వయోజనుల విజ్ఞానమును గ్రంథములద్వారా నేర్చుకొనుటకు తగిన తర్బీదు నియ్యవలెనను ఉద్దేశముతో అక్షరజ్ఞాను లగువరకు వేచియున్న లాభము లేదు. జాగ్రత్తగ నాలోచించి తయారు చేసిన ఉపన్యాసముల ద్వారా వారికి విజ్ఞానము నంద జేయాలి.

విద్యావ్యాప్తి ప్రజలలో నెట్టి పరివర్తన జనింపజేసి పురోగాములు చేయునో 'డెన్మారు' చరిత్ర చదివితే తెలుస్తుంది. విజ్ఞానసంపద మూలమున డెన్మారు - ప్రజలెట్టి కష్టములనుండైనను గట్టెక్కగల సామర్ధ్యం సంపాదించారు. వారికి తమ భూములు నిస్సారమైనవను విచారం లేదు; విజ్ఞానసాధనముతో పలురకముల పంటలు పండించుకొనుచున్నారు. పండించిన పంటలు, తయారుజేసిన యితరములు అమ్ముకొనుట ఎట్టులా అను భయములేదు; విద్యాబుద్ధులగుటచే సహకార సంఘాల నేర్పాటు చేసికొని పని నెరవేర్చుకొనుచున్నారు. పెట్టుబడిసొమ్ము ఎక్కడ తీసికొని వస్తామా అను బెంగ లేదు. పరపతిసంఘాల నేర్పాటు చేసికొని సహాయమును పొందవలెనను జ్ఞానము వారికబ్బినది. ఇది అది అని లేదు. విద్యాబుద్ధు లగుటచే డేనులు సర్వవిధముల సౌఖ్యము అనుభవించు చున్నారు.

మన దేశమందీ సందేశము నందుకొన్నారు. సంయుక్త రాష్ట్రములలోను, మధ్యరాష్ట్రంలోను, ఒరిస్సా, బొంబాయి, బీహారు రాష్ట్రములలోను నిరక్ష్యరాస్యతా నిర్మూలనోద్యమం అత్యుత్సాహంతో నడుపుచున్నారు. ఈఉద్యమఫలితం తృప్తికరంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

పై బేర్కొనిన రాష్ట్రములందు కాంగ్రెసువారు ప్రభుత్వం సాగిస్తున్న రోజులలో ఆ ఉద్యమమారంభమై వ్యాప్తినొందింది. మదరాసు రాష్ట్రంలో ప్రభుత్వం వారు మరొక వైపునుండి సంస్కరణల ప్రారంభించి, నిరక్షరాస్యతా నిరూర్మలనోద్యమం సాగిద్దామనుకొనేటప్పటికి రాజీనామా లివ్వవలసి వచ్చింది. కనుక మదరాసు రాష్ట్రంలో గవర్నరుగారి సలహాదారు లేమైన అభిమానిస్తేతప్ప, ఎప్పటివలెనే వయోజనులకు విద్యగఱపు బాధ్యత ప్రజలమీదే ఉంటుంది. అందులోను ఆంధ్రరాష్ట్రంలో ప్రజలే బాధ్యతవహించి వయోజన విద్యాప్రచారం సాగించవలసిందే కాని, కాంగ్రెసువారు మరల పదవులు స్వీకరించినా అరవవారి చేతిలో అధికార మున్నంతకాలం ఆంధ్రులు కేవిధమైన సహాయం జరుగుతుందని తోచదు. ఇంతవరకు కాంగ్రెసు ప్రభుత్వం తలపెట్టిన ముఖ్యమైన కార్యాలన్నీ తమిళ జిల్లాలలోనే ప్రారంభమైనవన్న సంగతీ, వారు ఒకప్పుడీ విషయాన్నే బహిరంగంగా, సగర్వంగా ​వెలిపుచ్చారన్న సంగతి ఆంధ్రు లెఱుగకపోరు. మాట ఉండిపోతుందిగాని, అక్షర జ్ఞానోద్యమ విషయంలో ఆంధ్రదేశంలోగల ఉత్సాహం, పట్టుదల యింకే ప్రాంతాల లోను లేదు; బ్రిటిష హిందూ స్థానంలో ముందంజవేసి, పశ్చిమ దేశస్థులనుగూడ దిగ్భ్రామ చెందించునంతటి నేర్పుతో గ్రంథాలయోద్యమము నడపిన ఆంధ్రులకు నే డీ నిరక్షరాస్యతా నిర్ములానోద్యమ మొక కష్టమైన పనిగాదు!


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse