ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/డిసెంబరు 1939/వయోజనవిద్య - గ్రంథాలయములు
వయోజనవిద్య - గ్రంథాలయములు
శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు, ఎం.ఏ.
ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘాధ్యతులు
మనదేశమునందు ప్రజల దుస్థితి తొలగుటకు ప్రబలమయిన యాటంకము మహాజనమునందు నూటికి తొంబదిగురకు చదువను వ్రాయను రాక వారికి విషయపరి జ్ఞానము లేకపోవుటేయని అంగీకరింపక తప్పదు.
సంపూర్ణ స్వరాజ్య సంపాదనకు మనముచేసే కృషి ఫలించలేదనినా, సాధారణ పరిస్థితులలో ప్రభుత్వమువారు వ్యవసాయాదికముల అభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలింపలేదనినా, ప్రజాసేవకులు జనుల ఆర్థికాభివృద్ధికి చేసే కోఆపరేటివు, ఆరోగ్యోద్యమాలు ఫలింపలేదనినా, ఇదియే ప్రథమ కారణము.
ఇందుచేతనే లోకములోని ప్రముఖ రాష్ట్రాలన్నీ కూడ ప్రజల అక్షరజ్ఞతను పరిపూర్ణంగా సాధించే ప్రయత్నము మొట్టమొదటి మెట్టుగా బెట్టుకున్నారు. దానితో గూడ సర్వవిషయాలను గురించి సులభమగు గ్రంథాలు రచింపించి ప్రకటిస్తూ అవి ప్రజలకందడానికి గ్రంథాలయాలు స్థాపించుకొన్నారు. పత్రికా ప్రకటన మనంతముఖములు సాగించి గ్రంథాలయాలతో పఠనాలయాలు తప్పక చేర్చుచు, పఠనాలయాలను ప్రత్యేకముగా గూడ నెలకొల్పుకొనుచున్నారు.
అక్షరజ్ఞత ఉన్నచో విషయగ్రహణానికి మానవుడింకొకరు వచ్చి చెప్పువరకు వేచియుండ నక్కరలేదు. నేడు వ్రాసి ప్రకటించే విషయాలే కాక యుగాలతరబడిని వ్రాసి ప్రకటించిన సందర్భాలన్నీ గ్రహించడం వీలవుతుంది. దినదినం క్రొత్తక్రొత్త వివరాలు అన్ని శాస్త్రాలలోను - బండ్లు నడపడం, వ్యవసాయం చేయడం, వృత్తులు జరిగించడం, పరిశ్రమలు సాధించడం, భోజనసామగ్రి గుణాలెరగడం, రోగములు కలిగించే శత్రువులను గుర్తించడం, రాజ్యాలేలుకోడం, ఒక్కటా? మన ఇరువదినాల్గు గంటల జీవితానికి సంబంధించిన అన్ని సంగతులకు సంబంధించిన అన్ని శాస్త్రాలలోను - ఆకాశవిమానవేగంతో - మన పెద్దలు వ్రాసిన వాయువేగ మనోవేగాలతో - సిద్దమౌతున్నవి. ఎక్కడ? ఒక ఊళ్ళోకాదు, ఒక దేశంలో కాదు, ఒక జాతిలో గాదు. మానవుడనేవా డెక్కడెక్కడున్నాడో అక్కడక్కడంతాను - అయిదు ఖండాలలోను, నూర్లకు లెక్క-య్యే దేశాలలోను, రెండునూర్ల కోట్లయ్యే ప్రజాసమూహంలోను, తెల్ల నల్ల పసుపు జాతులలోను, చీనీ, ఇంగ్లీషు, రుష్యను, జర్మను, హిందీ, ఫ్రెంచి, స్పానిషు, జపానీసు, పోర్చుగీజు, ఇటాలియను, బంగాళీ, అరబిక్కు, పోలిషు, తెలుగు, కొరియ౯, మరాఠి, అరవము, టర్కిషు వగైరా నూర్లభాషలు మాట్లాడేవారిలోను ప్రచండవేగంతో నవీన భావాలు పుట్టుకొనివస్తున్నవి. ఇన్నిటినుంచీ ఎవరికి కావలసింది వారికి ఏర్చి కూర్చి బోధించే వ్యక్తులుండరు. ఉంటే అందరివద్దకు పోలేరు. పోతేనూ అందరిని కలుపలేరు. కలిపినా అందరికి అన్నీ చెప్పలేరు. కాబట్టి యీ దినం అచ్చుకూ కాగితానికి చతురక్షరసంయోగానికి ఎక్కడలేని విలువా కలిగింది.
ఒక దేశాన్ని మించి ఒక దేశం తన ప్రజను అక్షరజ్ఞులను చేసుకొంటుంది. నాలుగుదేశాల లెక్క చూడండి.
| దేశము | విద్యావంతులు | ||
|---|---|---|---|
| ౧ | ఇంగ్లాండు | ౧౦౦కి | ౯౯.౬౬ |
| ౨ | ఆమెరికా సంయుక్త రాష్ట్రాలు | " | ౯౬.౧ |
| ౩ | జాపాను | " | ౧౦౦ |
| ౪ | రుష్యా | " | ౯౦.౨ |
౧౯౧౫ లో రుష్యాలో నూటికి 30 మాత్రము విద్యాగంధము కలవారు. ౧౯30 నాటికి ౬౭గురు, ౧F33లో నూటికి ౯౦ మంది అయినారు. అమెరికాలోని నీగ్రోలు ౧౮౬౫ ౮౩లో విద్యాగంధమే లేనివారు నేడు నూటికి ౮౩. ౭ విద్య కలవారైనారు.
మన గతి చూడండి. ౧౮౮౧ మనలో విద్యాగంధము కలవారు ౧౦౦ కి ౩. ౫ గురు, ౧౯౩౧లో ౯.౦. అందులోను బ్రిటిషు పరగణాలకంటే కొన్ని స్వదేశ సంస్థానాలే మేలుగా ఉన్నవి. తిరువాన్కూరులో నూటికి ౨౫. ౭౧, కొచ్చి౯ లో ౨౧.౬, బరోడాలో ౧౪.౪ విద్యావంతులు కన్పింతురు. ఇది ఇతరదేశాలతో పోలిస్తే ఎంత తక్కువో చూడండి !
గాంధియుగంలో ఎంతో రాజకీయవికాసం కలిగిందనుకుంటున్నాము. నిర్మాణ కార్యక్రమము బాగా సాగవలెనని ప్రయత్నిస్తున్నాము. సత్యమును అహింసను స్థాపించవలెనని చూస్తున్నాము. మనదేశముద్వారా వీటినే ప్రపంచ జీవితానికి ప్రపంచ శాంతికి మూలాధారము చేయవలెనని గాంధీజీ సంకల్పం. ఇంతేకాదు. కాన్స్టిట్యూయంట్ అసెంబ్లీ ఏర్పరచవలెనంటున్నాము. ప్రతి వయోజనునికి వోటిచ్చి తా నెట్లు ఏలబడవలెనో చెప్పే హక్కు - అతనికి సంక్రమింప జేయవలయు నంటున్నాము. ఇవన్నిటిని అంధప్రాయముగా ఏవ్యక్తీ చేయరాదంటున్నాము. కాని అక్షరజ్ఞానము ప్రజకు లేక పోవడము చేత ఎవడో చెప్పినమాట వినడం మాత్రముతో సాదాప్రజ అంగీకరించి పడియుండవలసిన స్థితి ఏర్పడడముచేత కొంతదూరం మనము ప్రయాణం చేయగలిగినా మెట్టుమెట్టుకు ఎక్కువెక్కువ ఆటంకాలు కలుగడం సంభవిస్తుంది. గాంధియంతటి ప్రజాపక్షపాతి అక్షరజ్ఞతకలవానికే వోటియ్యడం బాగని ఆ అక్షరతను త్వరపరచండని ప్రకటించుకోవలసివస్తూ ఉన్నది.
కాబట్టి వయోజనవిద్యకు వికాసానికి ఆధారభూతమయిన అక్షరజ్ఞత కల్పించడము నేడందరు దేశాభిమానుల ప్రథమ కర్తవ్యమయిపోయినది.
కాంగ్రెసు మంత్రివర్గాలు అధికారములో నున్నప్పుడు మనకోస్తాలో ఈ ప్రయత్నం అంత ఎకువగా జరుగ లేదు. ఇతరకోస్తాలలో జరిగిన తీష్ణ కృషిచేసి గురించి ఈ పత్రిక మొదటి సంచికలో వ్రాసినారు. మన మంత్రివర్గంవారి మాట ఎట్లున్నా మన ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమమువారు ఈ కర్తవ్యాన్ని గుర్తించక పోలేదు. ౧౯౩౬ డిసెంబరులోనే గ్రంథాలయ సర్వస్వములో 'నిరక్షరాస్మ నిర్మూలనము ఐదు సంవత్సరాల కార్యక్రమము' అని నేనే వ్రాసి స్వయముగా కొన్ని గ్రంథాలయాలకు వెళ్లి ప్రచారము కూడ కావించితిని. కాని మన సంస్థలకు ద్రవ్యము లేక పనిచేయు వారలకు ప్రోత్సాహము లేక గవర్న మెంటువారు ఇదివరలో ఇచ్చుచుండిన గ్రాంటులు కూడ అదృశ్యము కావడముచేత పనికుంటు పడినది.
ఎన్నికష్టములున్నను ఇది నిద్రించుటకు సమయముమాత్రము కాదు. సర్దారు వారు సహాయము చేతురా సంతోషము. చేయకున్నను మనము నిస్పృహ చెందరాదు. ఆంధ్రోద్యమచరిత్రలో భాగముగా మద్రాసుజిల్లా ఆంధ్ర కాంగ్రెసు సంఘమువారు చెన్నపురినగరములో ఈ ఉద్యమాన్ని సాగించే సూచనలు కన్పించుచున్నవి. నిజానికీ యుద్ధ్యమము ప్రధానంగా సాగించవలసిన నిర్మాణ కార్యక్రమము. సర్వజీవితాశయాల సాధనకూ ఇది యావశ్యకమని నమ్మేవారము గ్రంథాలయోద్యోగపరులైన మనము. కాబట్టి గ్రంథాలయ సేవకు అందరును ఎక్కడివారక్కడ ఏ ప్రజాహిత సంస్థనో ప్రోత్సాహపరచి ఈయుద్యమాన్ని ఉపక్రమించి కొనసాగించుటకు కంకణము కట్టుకొందురుగాక యని కోరుచున్నాను.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse