Jump to content

ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/డిసెంబరు 1939/ఆసియాఖండ గ్రంథాలయ సంఘములు

​

ఆసియాఖండ గ్రంథాలయ సంఘములు

శ్రీ పాతూరి నాగభూషణం డిప్.లిబ్.

ఆంధ్రదేశ గ్రంథాలయసంఘ కార్యదర్శి

౧.చీనాదేశము

ప్ర పపంచములోని ఖండములన్నిటిలో ఆసియాఖండము పెద్దది. ఇందు చీనాదేశము జనాభా యందేగాక ప్రాచీన నాగరకతకును ప్రపంచమున నగ్రస్థానము వహించి యున్నది. చారిత్రకముగ నీదేశము విజ్ఞాన వ్యాప్తికి దారితీసినట్లు చెప్పబడుచున్నది. ముద్రణా విధాన మిచ్చటనే ప్రారంభమైనట్లును, 1750వ సం॥ నాటికి ప్రపంచమున గల తక్కి-నభాష లన్నిటిలో కలసి యున్నవానికంటె చీనా భాషలో నెక్కుడు గ్రంథములున్నట్లును, 1850వ సం॥ నాటికి సహితము మరేభాషలోను చీనాభాషలో నున్నన్ని గ్రంథములు లేనట్లును వినుచున్నాము. ఇప్పటికీ చాలకాలము క్రితమే ప్రపంచమందలి యేభాషయందుగాని నింతవరకు వెలువడని సాటిలేని ఉద్గ్రంథము - 11,000 సంపుటముల విశ్వకోశ మొకటి చీనాభాషయందు తయారైనది. మరియు క్రీస్తుకు పూర్వము 7వ శతాబ్దములోనే చీనాలోని రాజమందిరములలో గొప్పగొప్ప గ్రంథాలయములున్నట్లును తెలియుచున్నది. పదిసంవత్సరముల క్రితముకూడ చీనా లోని షాంఘై పట్టణమున ప్రపంచమున కెల్ల పెద్దపుస్తక ప్రచురణాలయ ముండెడిది.

గ్రంథాలయ సంఘముల పుట్టుక

చాల కాలముగ విజ్ఞానాభివృద్ధి 'కాలవాలముగనున్న చీనాదేశమున గ్రంథాలయోద్యమ ప్రచారము నేడెట్లు సాగుచున్నదీ తెలిసికొనుటనసరము. దీనికిగా నీదేశమున బయలుదేరిన గ్రంథాలయసంఘముల పుట్టుపూర్వోత్తరముల నరయుదము. ప్రపంచములోని తక్కిన దేశములందువలెనే చీనాయందలి గ్రంథభాండాగారులును తమలో పరస్పర స్నేహసహకారములు పెంపొందుటకై వివిధ సంఘములుగ నేర్పడిరి. ఇట్లేర్పడిన గ్రంథాలయ సంఘములు మూడురకములుగనున్నవి.

1.చీనాదేశమున కంతటికీ చెందిన జాతీయసంస్థయగు “చీనాదేశ గ్రంథాలయ సంఘము".
2.వేరువేరు రాష్ట్రములందేర్పడిన రాష్ట్రీయ గ్రంథాలయసంఘములు ​
3.పెద్ద పెద్ద ప్రాంతములందు గాని సర్వసాధారణముగ నగరములందు గాని స్థాపింపబడిన స్థానిక గ్రంథాలయసంఘములు.

1922వ సం॥లో చీనా జాతీయవిద్యాభివృద్ధి సంఘ యాజమాన్యమున గ్రంథాలయశిక్షణ, గ్రంథాలయాభివృద్ధిని గూర్చి వి చారించుటకై యేర్పాటు చేయబడెను. చీనాయందంతటను గ్రంథాలయోద్యమమును సాగించుటకై జులై 22 వ తేదీన నచ్చటి ప్రధానవిద్యాసంస్థల గ్రంథ భాండాగారులు కూడి కొన్ని తీర్మానములగావించిరి. చీనాయందలి వివిధ రాష్ట్రములలోగల ప్రధాననగరములందలి గ్రంధభాండాగారులు, స్థానిక గ్రంథాలయ సంఘముల నేర్పాటు చేయవలసినదిగ కోరు తీర్మానము వీనిలోనొకటి. వీనిస్థాపనతో కొంత కాలమునకు గ్రంథాలయోద్యమాభివృద్ధి నిమిత్తమై దేశమందంతట పనిచేయు నొక జాతీయసంస్థ స్థాపింపబడుననియునీ తీర్మానమాశించెను. ఈ యాశ ఫలించుట కెక్కువకాలము పట్టలేదు. పై తీర్మానము ప్రకారము కొలది కాలములో వివిధ రాష్ట్రములలోని చాల నగరములందు స్థానిక గ్రంథాలయసంఘములును, 1925వ సం॥లో చీనాదేశ గ్రంథాలయ సంఘమును ప్రారంభింపబడెను.

1925వ సం. మార్చి నెలలో పెకింగునగరములో ఉద్యమాభిమానులు కొందరు సమావేశమై పై సంఘమును స్థాపింప నిశ్చయించుకొనిరి. ఏప్రిల్ నెలాఖరున దీని నిర్మాణనిబంధన అంగీకరింపబడి కార్యవర్గ మేర్పాటు చేయబడెను. ప్రారంభోత్సవము మాత్రము జూ౯ 2 వ తేదీ పెకింగ్ నగరమున యథాక్రమముగ జరుపబడెను. ఈ సందర్భమున విఖ్యాత గ్రంథాలయనేతయు, అమెరికాదేశ గ్రంథాలయసంఘ ప్రతినిధియునగు డాక్టరు ఆర్దర్ ఇ.బాస్టిక్ అనునాత డచ్చట హాజరయ్యెను. చీనాదేశ గ్రంధాలయములు పరిస్థితులు నారసి నివేదించుటకై ఇత డా దేశమునకు చైనా ఫౌండేష౯ ధర్మసంస్థవారిచే నాహ్వానింపబడెను.

చీనా దేశగ్రంథాలయ సంఘనిర్మాణము

చీనాదేశ గ్రంథాలయ సంఘము ప్రారంభమైనప్పుడు 15 మంది సభ్యులతో కూడిన పాలకవర్గమును, ముగ్గురు సభ్యులుగల కార్యనిర్వాహక సంఘమును గలిగి యుండెను. కాని 1929 వ సంవత్సరంలో నానికింగ్ నగరమున సమావేశమైన ప్రథమవార్షిక మహాసభలో కమిటీ విధాన మంగీకరింపబడి కార్యనిర్వాహక సంఘ సభ్యత్వము 15కు పెంచబడెను. పాలకవర్గముస్థానే 9మంది సభ్యులతో కూడిన తనిఖీసంఘ (సూపర్ వైజరీ కమిటీ) మేర్పాటు చేయబడెను. వీరందరును సభ్యులచే నెన్నుకొనబడుచుండిరి. సంఘకార్యక్రమమునకు సంబంధించిన శాస్త్రీయవిషయముల ​నిర్వహించునిమిత్తము, కార్యనిర్వాహక సంఘమువారు వివిధవిషయములను గూర్చి శ్రద్ధవహించుటకై పదునొకండు ప్రత్యేకోపసంఘముల సృష్టించిరి.

సభ్యత్వము

1925వ సం॥లో 200 మంది సభ్యులతో ప్రారంభమైన ఈసంఘమున 1935 నాటికి 739 మంది సభ్యులు చేరిరి. ఇందు గౌరవసభ్యులు 31 మందితో చేరి వ్యక్తులు 481; సంస్థలు 258. దీనిలో గ్రంథాలయ నిర్వహణయందు నిమగ్నులైన శాస్త్రవేత్తలే సభ్యత్వము నొందవలెనను నియమము లేదు. గ్రంథాలయోద్యమన్నను, గ్రంథాలయ శాస్త్రాభివృద్ధియన్నను ఆదరాభిమానములున్న ప్రతియొక్కరు చీనాదేశ గ్రంథాలయ సంఘసభ్యులు కావచ్చును. వీరు ముఖ్యముగ నైదువిధములుగ నుందురు.

  1. సంవత్సరమునకు 2 డాలర్లు చెల్లించు వ్యక్తులు.
  2. సంవత్సరమునకు 5 డాలర్లు చెల్లించు సంస్థలు: గ్రంథాలయములు, స్థానిక, రాష్ట్రీయ గ్రంథాలయ సంఘములు ఇందు చేరును.
  3. యావజ్జీవ సభ్యులు : ఒకేసారి 50 డాలర్లు చెల్లించు వ్యక్తులు; 100 డాలర్లు చెల్లించు సంస్థలు.
  4. పోషక సభ్యులు : 100 డాలర్లు విరాళమునిచ్చువారు.
  5. గౌరవసభ్యులు: గ్రంథాలయోద్యమమునకు ప్రసిద్ధమగు సేవజేసిన వారు గౌరవసభ్యులుగు నెన్నుకొనబడెదరు.

సంఘకార్యక్రమము

గ్రంథాలయస్థాపన, నిర్వహణములకు దోహదమునిచ్చుచు, దేశము నలుమూలలగల వివిధ గ్రంథాలయములమధ్య పరస్పర సహకారమును పెంపొందించు నాదర్శముగల చీనాదేశగ్రంథాలయసంఘ కార్యక్రమము నొకింత పరికింతము. ఆ దేశపు ప్రభుత్వ మీసంఘము నూతనముగ స్థాపింపబడినప్పుడు ప్రారంభఖర్చులకుగాను 5,000 డాలర్లు విరాళమునిచ్చెను. ఇంక దీని నిత్యనిర్వహణమునకగు వ్యయము సభ్యత్వచందాలవలనను ఇతర విధముల సప్పుడప్పుడు లభించు విరాళముల మూలమునను భరింపబడుచున్నది. దీని ఖర్చులకుగాను శాశ్వతమగు నేర్పాటులకై ప్రయత్నములు చేయబడెను గాని యవి ఫలింపలేదు. ​దీని కార్యాలయము పీపింగ్ నగరమునగల జాతీయ గ్రంథాలయ భవనమున నుంచబడియున్నది. దీనియందు వేతనముపై పనిచేయు కార్యదర్శితో చేరి నలుగు రుద్యోగులున్నారు.

మహాసభలు

ఈ సంఘము స్థాపింపబడినప్పటినుండి ఇప్పటికి 3 మహాసభలు మాత్రము జరిగినవి. ఇందు మొదటిసభ 1929వ సం జనవరి 28వ తేదీనుండి 1వ ఫిబ్రవరి వరకు నా౯కింగ్ విశ్వవిద్యాలయమున సమావేశ మయ్యెను. ఈసభ కచ్చటిజాతీయ ప్రభుత్వము, మహాసభాప్రతినిధులు కఖండస్వాగతము నిచ్చుటయేగాక, ఆర్థికముగను సాయపడెను. దేశమునందలి వివిధ ప్రాంతముల నుండి 179 మంది ప్రతినిధులీసభ నలంకరించిరి. గ్రంథాలయ నిర్వహణ విధానములకు సంబంధించిన ముఖ్యములగు ననేక సమస్యలపై సంపూర్ణమగు చర్చలు జరిగి, చక్కని పరిష్కారములు చేయబడెను. మొత్తముపై నీ మొదటి సభ దిగ్విజయముగ ముగిసెను.

రెండవసభ 1933 వ సం॥ వేసవిలో పీపింగ్ నగరమునందలి జాతీయ విశ్వవిద్యాలయావరణమున నడచెను. దేశమునగల ముఖ్యులగు గ్రంథభాండాగారులనేకులీ సమావేశమున పాల్గొనిరి. ఈ సభయు మిగుల నుత్సాహముతో పరిసమాప్తమయ్యెను.

మూడవ సభ ఈ సంఘముయొక్క దశమ వార్షికోత్సవ సందర్భమున 1935వ సం॥ లో నానికింగ్ పట్టణమున నత్యంత వైభవముగ నడచెను.

ప్రచురణములు

చీనాదేశ గ్రంథాలయ సంఘపత్నమున ప్రచురింపబడువానిలో ముఖ్యమైనవి

1. సమాచారపత్రిక (బులెటిను) 2. గ్రంథాలయశాస్త్ర త్రైమాసిక పత్రిక. ఇవి రెండును సంఘస్థాపన నాటినుండియు నడుపబడుచున్నవి. ఇందు మొదటిదగు సమా చారపత్రిక సంఘకార్యాలయమునుండి బయల్వెడలుచు సంఘవృత్తాంతములను, గ్రంథాలయ క్షేత్రముననడచు వివిధానేక కార్యక్రమ సమాచారములను ప్రకటిం చు ఇక గ్రంథాలయశాస్త్ర త్రైమాసిక పత్రిక చీనాదేశ గ్రంథాలయ సంఘ ముతోపాటు, దేశమందలి గ్రంథాలయ నిర్వాహకులకును నిజమగు ప్రతినిధియై గ్రంథాలయములకు సంబంధించిన ప్రామాణిక వ్యాసరాజములతోను గ్రంథాలయ శాస్త్రసంబంధమైన ముఖ్యములగు నూతన గ్రంథములపై చక్కని విమర్శనలతోను విరాజిల్లుచు, గ్రంథాలయ శాస్త్రమునందు నిత్యముగలుగుచున్న అభివృద్ధి నెప్పటి ​కప్పుడు గమనింపగోరువారి కత్యంతావశ్యకమై యెప్పారుచుండును. శాస్త్రజ్ఞులకే గాక గ్రంథాలయ విద్యార్థులకును, నీపత్రిక అత్యంతో పయుక్తమై ఆనందమును గూర్చునన్న నిందతిశ యోక్తి యుండజాలదు.

ఇవిగాక ఈ సంఘము చీనాభాషయందలి వివిధ విధములగు గ్రంథముల పట్టికలు, సారస్వత శాస్త్రీయాది ఆధునిక పత్రికలకు సూచికలు, మహాసభల నివేది కలసహితము ప్రకటించి ఉద్యమాభివృద్ధికి చక్కని దోహదములు గల్పించినది.

స్థానిక సంఘములు

కేంద్ర సంఘము 4 పర్యాయములు దేశమునందలి వివిధ గ్రంథాలయముల పరిస్థితులు పరిగణనము చేసి, దేశమందలి లెక్కలోనున్న గ్రంధాలయము లన్నింటికినీ అనేక పర్యాయములు స్థానిక గ్రంథాలయసంఘములు నెలకొల్పుకొనవలసినదిగ హెచ్చరింపు లేఖల సంపుచు వచ్చెను. ఈ లేఖల ఫలితముగను, వీనికి పూర్వమును నేర్పడిన ఈస్థానిక సంఘముల సంఖ్య 1932వ సం." నాటికి యేబదికి మించలేదు. వీనిలో సగము మాత్రమప్పటికి కేంద్ర సంఘమున సభ్యత్వము గల్గియుండెను. ఈ స్థానిక సంఘముల సంఖ్య నానాటికి దేశమున వృద్ధిచెందుచున్నను, ఇప్పటికిని అనేక స్థలములలో నివి యేర్పడియుండ లేదు.

ఈ స్థానిక సంఘములలో ముఖ్యమైనవి పీపింగ్, షాంఘై నగరములందలి వై యున్నవి. ఇవి మొదటినుండియు చక్కగ పని చేయుచున్నవి. పీపింగ్ గ్రంథాలయ సంఘము 1924వ సం౹౹ సంస్ధలో నొక సమాచార పత్రికను ప్రకటించుట కారంభము చేసెను. అప్పటినుండి ఈ సంఘము వివిధ గ్రంథాలయములందున్న ఉపయుక్తము లగు పలువిషయములను గూర్చిన సంయుక్త గ్రంథపట్టికలను, స్థానిక గ్రంథాలయ ములకు సంబంధించిన చరిత్ర, నిర్మాణము, సిబ్బంది, నిర్వహణము మున్నగు వివర ముల నుల్లేఖించు గైడులను ప్రకటింపజొచ్చెను. ఇక షాంఘై గ్రంథాలయ సంఘము గ్రంథాలయ శాస్త్ర సంబంధమగు పాఠ్యపుస్తకములను, ఎడతెగకనడచు నొక సమా చారపత్రికను నడపుచుండెను. గ్రంథాలయశిక్షణమును సహితము ఉత్తర ప్రత్యు త్తరముల ద్వారా దీని సభ్యులుకొందరు 1932వ సం౹౹ ప్రాంతములో నడపుచుండిరి.

ఇట్లేర్పడిన స్థానిక సంఘములు ఉద్యమవ్యాప్తిని గావించుటలో కేంద్ర సంఘ మున కెంతయు సాయపడుచున్నవి. వివిధ ప్రాంతములలో నేర్పడిన వీని యాదర్శము లీ క్రిందివిధముననున్నవి.

1. ఉపన్యాసములు, చర్చలు, కరపత్రములు మున్నగు సాధనముల ద్వారా గ్రంథాలయపాలన కార్యమున నభివృద్ధిజూపుట. ​
2. ఒకటికి మించిన గ్రంథముల ప్రతులను పరస్పరము మార్చుకొనుట ద్వారాను, గ్రంథాలయము లొండొంటికి తమ గ్రంథముల నరునిచ్చు విధానము వలనను స్థానిక గ్రంథాలయముల మధ్య సంపూర్ణ సహకారమును పెంపొందించుట.
3. స్థానిక గ్రంధభాండాగారుల పరిస్థితులు బాగుపడుటకై ప్రజలు వివేకముతో కూడిన ఆదరాభిమానములు చూపునట్లు ప్రోత్సహించుట.

గ్రంథాలయశిక్షణ

అతి ప్రాచీన కాలమునుండియు చీనాదేశమున గ్రంథాలయములు నిర్వహింప బడుచున్నను, మొదటి దినములలో నిచ్చట గ్రంథాలయ నిర్వహణము ప్రత్యేక మొక వృత్తిగ పరిగణింపబడ లేదు. అప్పుడు ప్రాచీన గ్రంథములు పరిచయమున్న వారు గ్రంథాలయ నిర్వహణమున కర్హులుగ నెంచబడుచుండిరి. మున్ముంది 'దేశమున నేర్ప డిన రాజప్రాసాదములందలి గ్రంథ భాండాగారముల రక్షణ యాజమాన్యములు ప్రసిద్ధ పండితులగు 'జేకువా౯' వంశీయుల చేతిలోనుండెను. వీరు రాజదర్బారు లలో కార్యదర్శులుగనుండి, దర్బారుకు సంబంధించిన అన్ని విధములగు రికార్డులను భద్రపరచు చుండిరి.

ముద్రణావిధానముతో పుస్తకముల వ్యాప్తియు వృద్ధి జెంది, తద్వారా వ్యక్తు లును గ్రంథసంగ్రహణ కార్యక్రమమునకు పూనుటతో, దేశమున రాజ ప్రాసాదము లందేగాక, సామాన్యుల గృహములందును గ్రంథాలయములు విరివిగ వెలసెను. వీని అభివృద్ధితో వీని రక్షణ నిర్వహణ సమస్యలును బయలుదేరి, ఈవిషయమై పలు వురు తమతమ మనస్సులకు తోచిన పద్ధతుల నవలంబించు చుండిరి. ఈ విధానములు, పూర్వికుల అనుభవములు వంశపారంపర్యముగ ఆచరణలోకి వచ్చెను. కాని గ్రం థాలయ శాస్త్రమును బోధించుటకు ప్రత్యేకపుటేర్పాట్లాకాలమున లేవు. ఆధునిక యుగమున నిందువిషయమై జరిగిన పనినిగూర్చి కొంత తెలుప బ్రయత్నింతును. చీనాదేశమున ఆధునిక గ్రంధాలయోద్యమాభివృద్ధికై కృషి సల్పిన మేరీ ఎలిజబత్ వుడ్ కుమారి (అమెరికా దేశీయురాలు) 1914వ సం॥ లో నొకరిని, 1917 సం॥లో నొకరిని గ్రంధాలయ శిక్షణ నిమిత్తము అమెరికా దేశమునకు పంపు నేర్పాటుల గావించెను. ఈమె స్థాపించిన 'బూన్ లైబ్రరీ' యందు 1920వ సం॥ జనవరిలో నొక గ్రంధాలయ పాఠశాల ప్రారంభింపబడెను. ఇదియే చీనాయందు గ్రంధాలయ శిక్షణ నిచ్చుటకై చేసిన మొదటి ప్రయత్నమని చెప్పవచ్చును. తదుపరి కొలది మాసములకు గ్రంథాలయ శిక్షణ నిచ్చుటకై పెకింగునగరమునందలి 'హైనార్మల్ కాలేజీ'లో వసంత విద్యాలయమొకటి యేర్పాటు చేయబడెను. ​దీనియందు 69 మంది పురుషులు 9 మంది స్త్రీలు విద్యాభ్యాసము చేసిరి. అప్పటి నుండి దేశమునందలి పలు ప్రాంతములలో గ్రంధాలయ శిక్షణ కేర్పాటులు విరివిగ జరిగెను. ఇందునిమిత్తము ప్రత్యేకపాఠశాలలేగాక, ఇతర విషయములతో పాటు గ్రంథాలయ నిర్వహణమును సహితము బోధించు విద్యాలయములును చాల వెలసెను.

ఉపాధ్యాయుల కళాశాలలందును, నార్మల్ స్కూళ్ళయందును, గ్రంథాలయ నిర్వహణమును వాని పాఠ్యక్రమములో చేర్చునట్లు చేయవలసినదిగ, చీనా జాతీయ విద్యాభివృద్ధి సంఘము వారి యొకానొక వార్షిక సభలో, విద్యామంత్రిని కోరుచు నొక తీర్మానము చేయబడెను. దీని ఫలితముగ చీనాయందలి చాల పాఠశాలలందును కళాశాలలందును ఐచ్ఛికముగను విద్యార్థుల అవసరమును బట్టియు గ్రంధాలయ పాఠములు నేర్పబడుచున్నవి. ఇట్లే విశ్వవిద్యాలయములందును విద్యార్థుల విద్యావిధానములో గ్రంథాలయశిక్షణ మొకభాగముగ నేర్పడినది. గ్రంథాలయశిక్షణలో భాగమైన గ్రంథనిర్మాణశాస్త్రమునకు సంబంధించిన పూర్వకాలపు పాఠ్యక్రమము, నేటికిని చాల విశ్వవిద్యాలయములలో నడచుచున్నది. ఇది చీనా దేశపు ప్రాచీనవాఙ్మయమునకు సంబంధించిన పాఠ్యక్రమములో భాగముగ నున్నది.

బూన్ గ్రంధాలయ పాఠశాల

చీనాదేశములో గ్రంథాలయనిర్వహణమున పూర్తిశిక్షణనిచ్చు సంస్థ 'బూన్ గ్రంథాలయ పాఠశాల' యొక్కటియే. కళాశాలల౦దొకవత్సరము చదివిన వారలకు మూడేండ్ల పాటీ సంస్థలో గ్రంథాలయశాస్త్రము మొదట బోధింపబడుచుండెను. తదుపరి ఈ శిక్షణకాలము రెండేండ్లకు తగ్గింపబడి, కళాశాలలో రెండు సంవత్సరముల చదువును పూర్తిచేసినవారు మాత్రము దీనిని జదువ నర్హులుగ పరిగణింపబడిరి. ఈ పాఠశాల బూన్ విశ్వవిద్యాలయమందలి సారస్వత కళాశాలలో నొకభాగముగ నుండి అమెరికాదేశ గ్రంథాలయ పాఠశాలలననుకరించుచున్నది. చీనాదేశ విద్యావిజ్ఞానములు అభివృద్ధినిమిత్త మేర్పడిన ధర్మసంస్థ పై పాఠశాలయందలి విద్యార్థుల యొక్కయు, ఉపాధ్యాయులయొక్కయు ఉపకార వేతనములక్రింద వార్షిక విరాళముల నొసగుచున్నది. చీనాదేశ గ్రంథాలయసంఘము యొక్కయు, బూన్ లైబ్రరీ స్కూలుయొక్కయు యాజమాన్యమున పీపింగ్, షాంఘై, నా౯కింగ్, కాంటర్, పూచాంగ్ నగరములందు పోటీ పరీక్షలు జరుపబడి అందుత్తీర్ణులగు విద్యార్థులకు ఉపకారవేతనము లొసంగబడును. ​

చీ. దే. గ్రం. సంఘ తీర్మానములు

గ్రంథాలయములు తమవిధుల సక్రమముగ నిర్వహించుట కత్యంతావశ్యకమగు శిక్షణవిషయములో, చీనాదేశ గ్రంథాలయ సంఘము మొదటినుండియు జూపుచువచ్చిన శ్రద్ధను సూచించు క్రింది తీర్మానములు, దీని ప్రధమ వార్షికోత్సవ సందర్భమున చేయబడినవి.

  1. అప్పటికి గ్రంథాలయోద్యోగులుగ నున్నవారి నిమిత్తము చీ. దే. గ్రం.సంఘ పక్షమున దేశములోని వివిధ కేంద్రములలో వరుసను గ్రంథాలయ శిక్షణనొసగు తాత్కాలిక పాఠశాలల నిర్వహించుటకును;
  2. గ్రంథాలయ నిర్వహణమున ఉన్నత శిక్షణము నిమిత్తము కేంద్రప్రభుత్వ విద్యాశాఖవారు, చీ. దే.గ్రం. సంఘమువారు, రాష్ట్రీయప్రభుత్వ విద్యాసంస్థలు, విద్యార్థి వేతనముల నేర్పాటుచేసి - అనుభవపరులగు గ్రంథభాండాగారుల నుండిగాని, పోటీ పరీక్షలలో విజయులగు అభ్యర్థులనుండిగాని, ఉభయవర్గముల నుండిగాని విద్యార్థులనేరి — వారిని విదేశములందు చదివి వచ్చుటకైన, నచ్చటి గ్రంథాలయ పరిస్థితుల చూచివచ్చుటకైన పంపుటకును;

1929 వ సం॥ లో నాకింగ్ విశ్వవిద్యాలయమున సమావేశమైన సంఘముయొక్క ప్రథమవార్షిక సభలో తీర్మానింపబడెను.

౨. జపాను

విస్తీర్ణతయందుగాని, జనాభాలోగాని జపాను చీనాదేశమున కీడురాదు. ప్రాచీన నాగరికత విషయమునను ఈ రెండుదేశములకు సామ్యములేదు. అయినను నేడు జపాను చీనాకంటే అన్ని విషయములందును ముందున్నది. అర్ధశతాబ్దికి పైగ నీదేశము పాశ్చాత్య నాగరికతను బాగుగ జీర్ణించుకొని ప్రాచ్య ప్రపంచమునకు రాణిగ వెలయుచున్నది. 1892వ సంవత్సరమందే ఇచ్చట జపాను దేశ గ్రంథాలయసంఘ మేర్పడినది. ప్రత్యేక వ్యక్తులచేతను, సంఘములద్వారాను నడుపబడు గ్రంథాలయముల సేవకులొకనాడు టోకియోనగరమున గూడి గ్రంథాలయోద్యమ పరిశీలనా ప్రచారముల నిర్వహించు నిమిత్తము పైసంఘమును స్థాపించిరి. మొదట 29 మంది సభ్యులతో ప్రారంభింపబడిన ఈ సంఘము 1985వ సం॥ నాటికి 1405 మంది సభ్యుల సంపాదించగలిగినది. ​

జపానుదేశ గ్రంథాలయసంఘ కార్యక్రమము

విజ్ఞానసంబంధమైన పలువిషయములలో పాండిత్యమును పెంపొందించుటకును, గ్రంథాలయోద్యమ వ్యాప్తికిని, జపానుదేశ గ్రంథాలయసంఘ మొనర్చిన కృషి చాలగలదు. జపానులో నూతన గ్రంథాలయముల స్థాపించుటకును, ఉన్నదాని నభివృద్ధికి దెచ్చుటకును ఈ సంఘము పలువిధములు పాటుపడెను. ఇందునిమిత్త మనేక పర్యాయము లచ్చటి ప్రభుత్వముతో నీ సంఘము సంప్రదించెను. ఉద్యమమునకు క్రొత్త సేవకుల తయారుచేయు సంకల్పముతో తాత్కాలిక పాఠశాలల నేర్పాటు చేసి, ఇందు గ్రంథాలయసంబంధమైన ఉపన్యాసముల నిప్పించుటయే గాక, గ్రంథాలయనిర్వహణమును గూర్చిన మూలసూత్రములు ప్రతిపాదించు నొక ప్రధమపాఠ పుస్తకమును సహిత మీసంఘము ప్రచురించినది. మరియు 'జపా౯ లైబ్రరీ అసోషియేష౯ లైబ్రరీ జర్నల్' అను పేరుతో నొక పత్రికయు దీనిపక్షమున నడచుచున్నది. ఈపత్రిక సంఘ సభ్యులలో నీయుద్యమమును గూర్చి చక్కని ప్రబోధమును గావించు చున్నది. జపాను, చీనాభాషలలో ప్రకటింపబడు గ్రంధములకు పట్టికలను తయారు చేయుటలో ఏకైక విధానమును సాధించనెంచి, ఇందునిమిత్తము కొన్ని నియమములనుకూడ ఈసంఘము గావించియున్నది. బెల్జియం నందున్న 'ఇంటర్ నేషనల్ బిబ్లియోగ్రాఫికల్ సొసైటీ' యందు సభ్యత్వము వహించి, దాని కార్యకలాపమునకిది చాలగ తోడ్పడు చున్నది.

గ్రంథపట్టికలు

1930వ సం౹౹ లోనీ సంఘము. జపాను ప్రభుత్వము యొక్క ఆమోదమును బడసినది, నాటినుండి సార్వజనిక విద్యావిషయమై దీని కృషి పెంపొందినది. దేశమున వెలువడు గ్రంథములనుండి ప్రజాసామాన్యము చదువదగిన గ్రంధముల నేర్చి, నూతనముగ బయల్వెడలు సద్గ్రంథ పట్టికల నీసంఘము 1981 వ సం॥ నుండి ప్రకటించు చున్నది. ప్రతి గ్రంథమునందును గల విషయముల వివరించు నీపట్టికలు దేశమందంతట ప్రచారము చేయబడుచు, గ్రంథాలయములు తమకు కావలసిన పుస్తకముల నేరుకొనుట కుపయోగించు చున్నవి.

గ్రంథాలయ సప్తాహములు వగైరా

ప్రతిసంవత్సరము నవంబరు నెలలో దేశమందంతటను జరుపబడు గ్రంథాలయ సప్తాహ మహెూత్సవముల వలనను, ఈ సంఘపక్షమున టోకియోలోను, ఇతర స్థలములందును ఏటేట నేర్పాటుచేయబడు వార్షిక గ్రంథాలయసభల మూలమునను, ​ప్రజలలో విజ్ఞానదృష్టి, గ్రంథాలయోద్యమాభిమానము పెంపొందుచున్నవి. వీని ఫలితముగ సిద్ధించిన ప్రయోజనములు ముఖ్యముగ రెండు. ప్రత్యేక స్థానిక పరిస్థితులకు సంబంధించిన వాఙ్మయము సేకరింపబడి, ఉపయోగమునకు తేబడుట చాలచోట్ల జరిగెను. గ్రంథాలయ నిర్వహణము ద్వారా సమాజవిజ్ఞానమును ప్రచారము లోనికి దెచ్చుటకై అసంఖ్యాకములగు నూతన సంఘములు దేశము నలుమూలల వ్యాపించెను. గ్రంథాలయ మహాసభలలోను, గ్రంథాలయసేవకుల తదితర సమావేశములందును, స్థానికముగ స్థాపింపబడు ప్రత్యేక గ్రంథాలయముల విషయమై చర్చలు, తీర్మానములు తరచు జరుగుచుండును.

జపాను దేశమందలి గ్రంథాలయములలో చాలభాగము ప్రాచీనపద్ధతులనదగు ప్రదర్శనవిధానములు, సార్వజనికోపన్యాసములు, చలనచిత్రములు యేర్పాటులేగాక - సంచార భాండాగార నిర్వహణము, ప్రత్యేక విషయములపై ప్రవీణుల ఉపన్యాసములు మున్నగు ఆధునిక విధానముల నవలంబించుటకీ సంఘముయొక్క - ప్రోత్సాహమే కారణము. 1932వ సం౹౹ లో జరిగిన జపాను గ్రంథాలయ మహాసభలో ఏప్రిల్ 2వ తేదీ ప్రతిసంవత్సరము గ్రంథాలయ విజయోత్సవమును జరిపి ప్రజలు గ్రంథాలయోద్యమ వ్యాప్తికి తోడ్పడునట్లు కృషి సలుపుటకై తీర్మానింపబడెను. 1931వ సం॥ ఏప్రిల్ 2వ తేదీ జనాను చక్రవర్తి 'టోకియో' యందలి ఇంపీరియల్ లైబ్రరీ డైరెక్టరును పిలిపించి, గ్రంథాలయముల కార్యక్రమమును గూర్చి తన యెదుట నుపన్యసింప వలసినదిగా నాతని కోరుటచే, దీని జ్ఞాపకార్ధము పై యుత్సవమును జపానుదేశ గ్రంథాలయము వారేర్పాటు చేసిరి. చక్రవర్తి తమ యుద్యమము నాదరించుటచే, దేశమునందలి గ్రంథాలయ సేవకులందరును పైతీర్మానము నేకగ్రీవముగ నప్పటినుండి ఏమరక అమలుపరచు చున్నారు.

ప్రభుత్వవిద్యాశాఖ - గ్రంథాలయపాఠశాల

జపానుదేశ గ్రంథాలయసంఘ కార్యక్రమమునకు తోడ్పాటుగా గ్రంథాలయ సేవకులకు శిక్షణనొసగు నిమిత్తము 1921 సం॥ లో సచ్చటి ప్రభుత్వమువారు 'విద్యాశాఖ గ్రంథాలయ పాఠశాల' నొకదానిని ప్రారంభించిరి. ఈ పాఠశాల ప్రతి సంవత్సరము ఏప్రిల్ మాసారంభమున ప్రారంభమై సంవత్సరము పాటు నడచును. ఇంపీరియల్ లైబ్రరీ భవనమున నడుపబడు నీపాఠశాలలో ఏటేట స్త్రీ పురుషులు కలసి 25 మొదలు 30 మందివరకు విద్యాభ్యాసము చేయుచుందురు. మాధ్యమిక పాఠశాలలోను, స్త్రీల ఉన్న తవిద్యాలయములందును చదువుపూర్తి జేసి పట్టభద్రులైన వారుమాత్ర మీ పాఠశాలలో చేర్చుకొనబడుదురు. ఇందు గ్రంథాలయములకు సంబంధించిన ప్రత్యేక శాస్త్రీయ విషయములు, సమాజవిజ్ఞానము, భాషలు ​బోధీ౦పబడును. దీనికితోడు ప్రభుత్వ విద్యాశాఖవారు గ్రంథాలయ నిర్వహణముకు సంబంధించిన కొలదిపాటి ప్రణాళికతో తాత్కాలిక పాఠశాలలను సహితము పారంభించిరి. ఈ మార్గ మచ్చట పలువురు కాదర్శమయ్యెను.

ఇతర సంఘములు

దేశమునందంతటను పనిచేయు జ.దే.గ్రం. సంఘము 1915వ సం॥ నుండియు పలుప్రాంతముల శాఖాసంఘములు నిర్మించుచు వచ్చెను. ఇవియన్నియు కేంద్రసంఘ కార్యక్రమమునకు బలమును గలిగించు పనుల చేపట్టి నడపుచుండును. ఇట్టివానిలో సుఖ్యమైనవి:-

  1. సామ్రాజ్యమందలి ముఖ్య గ్రంథాలయ సంఘము. ప్రతీ మండలమునందు గల పెద్ద గ్రంథాలయము లేక మండల కేంద్రగ్రంథాలయము, స్థానిక గ్రంథాలయముల సభివృద్ధికి దెచ్చుటకై చిన్న గ్రంథాలయములకు సహాయపడుచు, వానిమధ్య పరస్పర సహకారమును పెంపొందించు చుండును. 1930 వ సం॥ లో నీమండల కేంద్ర గ్రంథాలయము లన్నియు టోకియోయందలి ఇంపీరియల్ లైబ్రరీ ఆధ్వర్యమున సమావేశమై దానిని కేంద్రముగ జేసికొని పై సంఘమును స్థాపించెను. స్థానిక కేంద్రగ్రంథాలయములకు సంబంధించిన సమస్యల బాగుగ పరిశీలించి, వాని అభివృద్ధికి పాటుపడుటయే ఈసంఘాదర్శము.
  2. మండల లేక ప్రాంతీయ గ్రంథాలయసంఘములు. కొలది సంవత్సరములుగ జపాను నందలి మండలగ్రంథాలయ సంఘముల సంఖ్య నెమ్మదిగ నభివృద్ధి జెందుకున్నది. మండలముల వైశాల్యమునకు మించిన ప్రదేశములలో నేర్పడిన సంఘములలో ఉత్తర హన్స్, హొకెయిడో ప్రాంతీయ సంఘమును (1928), టైవా౯ గ్రంథాలయ సంఘమును (1927), షేకోకూ గ్రంథాలయ సంఘమును ప్రధానమైనవి.
  3. బాల భాండాగారుల సమాజము. ఇది 1227వ సం॥లో స్థాపింపబడినది. గ్రంథాలయముల అభివృద్ధికై పాటుబడుట, దీనికవసరమైన అధ్యయనమును గావించుట, ఈ సమాజముయొక్క ప్రధానోద్దేశములు. ఇందునిమిత్తము వీరు నడపుచున్న త్రైమాసిక గ్రంధాలయపత్రికసేవ జపాను గ్రంధాలయోద్యమమునకు చక్కని చేయూతగ నున్నది.

3.ఫిలిప్పైను దీవులు

ఫిలిప్పైను దీవులు చీనాదేశమున కాగ్నేయపు దిక్కున దక్షిణ చీనా సముద్రమధ్యమున నున్నవి. ఈదీపులందలి జనాభా మొత్తము 1 కోటి 21 లక్షకు పైన ​గలదు. 1923 వ సం॥ నవంబరులో స్థాపింపబడిన ఫిలిప్పైను గ్రంథాలయసంఘము 1929వ సం లో అంతర్జాతీయ గ్రంథాలయసంఘ సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్స్) యందు సభ్యత్వమును సంపాదించెను. 1931 సం॥ మే మాసమున అప్పటికి నూతనముగ నిర్మింపబడిన ఫిలిప్పైను యూనివర్శిటీ గ్రంథాలయ భవనమున ఫిలిప్పైను గ్రంధాలయసంఘ యాజమాన్యమున గ్రంథాలయ మహాసభయొకటి యేర్పాటు చేయబడెను.

ఈ కేంద్రసంఘమునకు తోడుగ నీదీవులలో స్థానిక సంఘములు కొన్ని వెలసినవి. వీనిలో ముఖ్యమైనది 'ఫిలిప్పైను యూనివర్శిటీ లైబ్రరీ క్లబ్'. 1926 వ సం॥ స్థాపింపబడిన ఈ సమాజము తన సభ్యులతోపాటు తక్కిన దేశీయులును గ్రంథాలయముల ఆవశ్యకతను గుర్తించునట్లు చేయగలిగెను. 'లైబ్రరీ మిర్రర్' అను చిన్నపత్రికను సహిత మీసంఘము ప్రకటించెను. ఈపత్రిక 1895-96 సం॥ లలో 17 నెలలుమాత్రము నడచి అంతరించెను. 1912 వ సం॥ సెప్టెంబరు మాసమునుండి 1916 వ సం ఆగష్టువరకు ‘ఫిలిప్పైను లైబ్రరీ బులెటి౯' అను మరియొక మాసపత్రికయు నీదేశమున ప్రకటిత మయ్యెను. గ్రంథాలయములకును, గ్రంథనిర్మాణశాస్త్రమునకును సంబంధించిన విషయముల బ్రకటించు పత్రిక యొకటి సంఘపక్షమున 1935వ సం౹౹నకు తర్వాత ప్రారంభింప బడినట్లు తెలియుచున్నది.

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse