ఆంధ్ర గ్రంథాలయం/సంపుటం 2/సంచికలు 3, 4/ వయోజనవిద్య : వ్యాప్తిమార్గ వివరణ
వయోజన విద్య: వ్యాప్తిమార్గ వివరణ[1]
డాక్టరు బి.వి. నారాయణస్వామినాయుడు
అన్నామలై విశ్వవిద్యాలయ ఆర్థికశాస్త్రాచార్యులు
చదువుకోవడంవల్ల ఆలోచనశక్తిన్నీ మనోవికాసమున్ను కలుగుతాయి. అందువల్ల సంపూర్ణమైన వ్యక్తిత్వం కలుగుతుంది. మనలోపల అడగివున్న శక్తులు బహిర్గతము లవుతాయి. మనలో వివేకం అధికమవుతుంది. మన భావాలకు క్రమపద్ధతిన్నీ సామరస్యమున్నూ కలుగుతుంది. విశ్వమానవ సేవ నిమిత్తం మనశక్తులను పూర్తిగా వుపయోగించవలెనన్న దృఢసంకల్పం మనకు కలుగుతుంది. ప్రజాపరిపాలనంలో ఉత్తములైన పౌరులను ప్రపంచ పౌరులను కలిగించడమే విద్యయొక్క ముఖ్యప్రయోజనం. విద్యవల్ల యువజనులలో దేశభక్తి మతాభిమానం మొదలైనవికూడా కలుగుతాయి. వీటిని విద్య వుపయోగించుకొని యువజనులలో అనేక రకాలనుకూడా కలిగిస్తుంది గాని యిది విద్యయొక్క ముఖ్యప్రయోజనం కాదు. ప్రజలధీశరక్తిని వృద్ధినొందించి దానిని వారు సరిగా వుపయోగించుకొనేలాగు చేయడము జీవయాత్రలో కష్టసుఖాలు కలిగినప్పుడు కృంగిపోకుండాను పొంగిపోకుండాను సమత్వమును కలిగివుండేలాగు ప్రజల మనస్సులను దిద్దుబాటు చేయడము, ప్రేమసౌఖ్యములపట్ల వారి సామర్థ్యమును తెలుసుకోవడము, పరిస్థితులకు అతీతులుగా వుండేలాగు చేయడము, ఇవే విద్యయొక్క ప్రయోజనాలు. సమగ్ర జీవితము సనుభవించడానికి కావలసిన అభ్యాసం విద్యవల్ల కలుగుతుంది.
మధ్యవయస్కుల విద్యలో అన్నీ చేరివున్నాయి. బాల్యంలో ప్రారంభించిన విద్యను మధ్యవయసులోకూడా కొనసాగించుట, ఏదో ఒక పనిని చేసే పద్ధతిని సాంఘికంగా నేర్పుట, పల్లెటూరి బడులు, ప్రజల కళాశాలలు, ఇవన్నీ దీనిలో చేరివున్నాయి. మధ్యవయస్కులలో చదువురానివారిలో కనబడని మానసిక వికాసమును వారిలో కలుగజేయడమే మధ్యవయస్కుల విద్యయొక్క ఉద్దేశం. మన దేశంలో ఇదివరకు విద్యావిధానం సార్వజనిక ప్రయోజనంమీదనే ఆధారపడి వుందిగాని వ్యక్తిగత ప్రయోజనం మీద ఆధారపడి వుండలేదు. కానీ యిప్పుడు కలిగిన పరిస్థితులలో ఈ ఆశయము పూర్తిగా మరుగుపడిపోయింది. చదువు చెప్పడంలో దానివల్ల చివరకు కలిగే నిజమైన లాభాలకే యెక్కువ ప్రాధాన్యం యియ్యబడెనుగాని ప్రజలకు అక్షరజ్ఞానం కలిగించడానికి ప్రాముఖ్యం యియ్యబడ లేదు.
మధ్యవయస్కుల విద్యావిషయంలో యూరపు అమెరికా ఖండాలకు ఇండియాకు చాలా తేడావుంది. అ ఖండాలలో బాలురకు బాలికలకు చదువు నిర్బంధం గనుక వారికి ప్రాధమిక విద్య వచ్చేవుంటుంది. అందుచే మైనారిటీ వదలిన తరువాత కూడా వారు చదువుకోవడమే మధ్యవయస్కుల విద్య అనబడుతోంది. మధ్యవయస్కులైన స్త్రీ పురుషులు ప్రధానంగా జీవనాధారానికి పనికివచ్చే ఒక వృత్తికీ సంబంధించిన విద్యను అభ్యసిస్తారు. దానితోపాటు యితర విషయాలను కూడా అప్రధానంగా వారు తెలుసుకుంటారు. పాశ్చాత్యదేశాలలో పాఠశాల లలో చదువుకోడానికి గల అవకాశాలు ఆ దేశీయులకు యావజ్జీవముకూడా కలుగుతూనే వుంటాయి. ఇండియాలో చాలమంది తమ బిడ్డలను బడులకు పంపరు. అందువల్ల ఇండియాలో అక్షరాల పరిచయం లేనివారి సంఖ్య మిక్కిలి హెచ్చుగావుంది. అటువంటివారిలో మధ్యవయస్సులోవున్న వారికి ఓనమాలదగ్గర నుంచి 'నేర్పవలసి వుంటుంది. ఇండియాలో ప్రజల జీవితానికి సంబంధించిన ముఖ్యవిషయాలను గురించి బోధించడమే అవసరంగాని పాశ్చాత్యదేశాలలోని పద్ధతి అవసరం లేదు. మన రాజకీయ స్వాతంత్ర్యం మనకు ఉపయోగపడడమునకున్నూ మన ఆర్థికస్థితి వృద్ధినొందుటకున్నూ మనదేశంలో జనసామాన్యానికి విద్య నేర్పడం ముఖ్యావసరమే. అందువల్ల వారిమనస్సులకు వికాసం కలుగుతుంది. నిరంతరము మారిపోతూవున్న పరిస్థితుల ననుసరించి వారు ఆలోచించగలుగుతారు.
దేశమందంతట ప్రాథమిక విద్యను నిర్బంధంగా చేసినా దానివల్ల మన బిడ్డలకు అనగా భావిసంతతికి లాభిస్తుందేగాని యిప్పుడున్న మధ్యవయస్కులకు లాభించదు. మధ్యవయస్కులకు విద్య నేర్పినట్టయితే వెంటనే ప్రజలలో అత్యధిక సంఖ్యాకులకు చాలా లాభం కలగదు. మన దేశంలో 100 కి 80 మందికి యిప్పుడుకూడా వ్రాత, చదువు, లెక్కలు రావు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, పన్నుల ఆధారం గల మధ్యవయస్కుల చదువు, ఇతరులచే యేర్పరచబడిన టెక్నికలు, వాణిజ్య కరస్పాండెన్సు పాఠశాలలు, మతసంఘాలవల్లను, మిశ్రమమత సంఘాలవల్లను నడపబడే సాంఘిక సంస్థలు, మిల్లులు మొదలైనవాటిలో పని చేసేవారు. యేర్పరచిన పాఠశాలలు, కార్మికుల విద్యాసంస్థలు, రాత్రిపాఠశాలలు, ప్రత్యేక వేసవి పాఠశాలలు, రిఫ్రషరుకోర్సులు, పట్టణములలోను గ్రామములలోను సార్వజనిక సంఘాలు, గ్రంధాలయాలు, మ్యూజియములు, సినీమాలు, నాటకములు, ప్రదర్శనములు, వినోదం కోసం సంగీతం, కళలు, చేతిపనులు, రేడియోలు, వ్యక్తులచే యేర్పరుపబడిన సంస్థలు యివన్నీ విద్యాబోధకములే. ఇప్పుడు మన దేశంలో చాలా గ్రామాలలో బడులు లేవు. బడులున్న గ్రామాలలోని ఉపాధ్యాయులకు ట్రెయినింగు యిస్తే వారు మధ్యవయస్కులకు చదువు చెప్పగలుగుతారు. పట్టణాలలోవున్న హైస్కూల్సులో ఉపాధ్యాయులుగా వున్న వారికి యిష్టమూ తీరికా వుంటే వారు కూడా పట్టణాలలో మధ్యవయస్కులకు చదువు చెప్పగలుగుతారు. ఈ విషయంలో పని చేయడానికి విశ్వ విద్యాలయాలకు చాలా అవకాశాలున్నాయి. అమెరికాలో విశ్వవిద్యాలయాలు మార్గదర్శకులుగా వున్నారు. మనదేశంలో విశ్వవిద్యాలయాల వారీ విషయంలో తగినంత శ్రద్ధను చూపించడం లేదు. కొన్ని విశ్వ విద్యాలయాల వారు ప్రదర్శనాలు, ఉపన్యాసాలు, కరస్పాండెన్సు తరగతులు, ట్రెయినింగు క్లాసులు మొదలైనవాటిని యేర్పాటు చేశారుకాని వీటిని చదువురాని సామాన్యప్రజలు గ్రహించడం వారి శక్తికి మారినదిగా వుంది. కనుక విశ్వవిద్యాలయాలవారు దీనిని గుర్తించి మధ్యవయస్కులకు విద్య నేర్పడానికి తగిన యేర్పాటులను చేయడం చాలా అవసరమే.
ఇందు నిమత్తం గ్రామాలలోను పట్టణాలలోను ప్రత్యేక సంఘాలు యేర్పడవలెను, ప్రజాసేవా నిరతులైనవారు పూనుకొని వీటినేర్పాటు చెయ్యవలెను. ఇందుకు వీరికి పలుకుబడి వుండాలి. వలంటీరు సంఘాలవారు రాత్రి పాఠశాలలు మొదలైన వాటిని ఏర్పాటు చేయవలెను. మదరాసు నగరంలో వై. ఎం.సి.ఏ., రామకృష్ణమిషను మొదలైన సంఘాలవారీ విషయంలో బాగా పనిచేస్తున్నారు. సర్వెంట్సు ఆఫ్ ఇండియా సొసైటీవారు గ్రామాలలో మంచి యేర్పాటులను చేశారు.
జిల్లాబోర్డులు, మ్యునిసిపాలిటీలు మొదలైన స్థానిక సంఘాలు యిప్పటివరకు శ్రద్ధగా పనిచేయడం లేదు. ఈ విషయంలో స్థానికసంఘాలకు చాలా అవకాశాలున్నాయి. వీరిపరిపాలనక్రింద చాలా ప్రాధమిక పాఠశాలలు, ఉన్నతపాఠశాలలు కూడా వున్నాయి. ఇవి ప్రజల ప్రతినిధులతో కూడినవి. వీటికి అధికారముకూడ వుంది. ఇవి ప్రభుత్వానికి అంగములే. విద్యాశాఖాధికారుల సలహా వీరికి లభిస్తుంది. మధ్యవయస్కులవిద్యను స్థానిక సంఘాలకు వశపరచే యడల దీనికి ఒకవిధానమును సిద్ధపరచవచ్చును. వీటికి ప్రత్యేకంగా ఉపాధ్యాయులను ప్రవీణులను నియమించ వచ్చును. స్త్రీల క్లబ్బులు, తలిదండ్రుల సంఘాలు కూడా యీ విషయంలో బాగా పనిచేయగలవు.
ఈరీతిగా సామాన్య ప్రజలలో మధ్య వయస్కులలో చదువుకొన్న వారి సంఖ్య అధికమైన కొద్దిన్నీ గ్రంధాలయాల సంఖ్యకూడా చాలా గ్రామాలలోను పట్ట ణాలలోను ఏర్పాటు చేయవలెను. మ్యూజియములు, సినీమాలు చాలా ఉపయోగకరమైనవి. సినిమాలు ప్రజలను ఆకర్షించి విషయాలు వారిమనసులకు నాటుకొని యేలాగు చేస్తాయి. రేడియోలు, ప్రదర్శనాలు కూడా అవసరమే. నాయకులు ఎదుట నిలబడి ఉపన్యసిస్తూ వుంటే విషయాలు ప్రజల మనస్సులకు తాకే అంత బాగా రేడియో ఉపన్యాసాలవల్ల తాకవేమో గాని యినికూడా మంచిపని చేస్తాయి. మనిషి కనపడని లోపంతప్ప మ రేలోపం వీటిలో లేదు.
తదేక దీక్షగా పని జరిగితేగాని లాభం లేదు. మనదేశం చాలా పెద్దది. దారిద్యం మిక్కిలి హెచ్చుగా వుంది. మన ప్రజలు అనేక సంవత్సరాలనుంచి అజ్ఞానంలో మునిగివున్నారు. కనుక మధ్య వయస్కుల విద్యాసమస్య చాలా కష్టాలతో కూడినదే. ధీమంతులైనవారు పూనుకోవాలి.
(ఆంధ్రపత్రిక నుండి)
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse
- ↑ 1941వ సం. ఏప్రిల్ నెల కోయంబత్తూరులో జరిగిన దక్షిణభారత తృతీయ వయోజనవిద్యా మహాసభలో చేయబడిన అధ్యక్షపన్యాససంగ్రహము.