Jump to content

ఆంధ్ర గ్రంథాలయం/సంపుటం 2/సంచికలు 3, 4/ వయోజనవిద్య: గ్రంధాలయములు

వికీసోర్స్ నుండి

వయోజన విద్య: గ్రంథాలయములు[1]

జనసామాన్యములో విజ్ఞానవ్యాప్తిని గావించు సాధనములలో గ్రంధాలయములు ప్రధానస్థానము నాక్రమించుచున్నవి.

గ్రంధాలయములు రెండురకములు. తరతరాలుగా రాజాస్థానములయు, మఠాధిపతులయు గర్వమునకు కారణభూతమైనవి మొదటి తరగతికి చెందినవి. వీని యాశయము పుస్తకములు సేకరించి భద్రపఱచుట. విజ్ఞాన ప్రచారమునకు పూను కొన్నవి రెండవ తెగకు చెందినవి. పాశ్చాత్య నాగరకతాఫలితము లనదగు నేటి గ్రంథాలయములు అల్ఫారంభములు గలవయ్యు దినదినాభివృద్ధి నందుచు సాంఘికజీవితమున కెంతయు నుపయోగపడుచున్నవి. వీనికి వయోజనవిద్యతో మిగుల సన్నిహిత సంబంధము గలదు.

కాలగతి ననుసరించిన మార్పులలో శ్రామిక జనముయొక్క విద్యాభిలాషయొకటి. ఇంగ్లాండు మొదలగు దేశములలో పారిశ్రామిక విప్లవ ఫలితముగ వ్యక్తిగత ఆర్థిక స్వాతంత్య్రసూత్రము బలపడి దీనితో శ్రమజీవులకు విద్యయొక్క ఆవశ్యకత గుర్తింపబడెను. ఈవిద్యను వారి కందుబాటులో నుంచుట కేర్పడినవే అచ్చటి సంచార గ్రంధాలయములు, చందాలపై నడుపబడిన పుస్తకాలయములు, కర్మకరుల సమితులు మున్నగునవి. ఈవిధముగ ప్రజాసామాన్యముయొక్క విద్యాభిలాపా ఫలితముగ గ్రంధాలయము లేర్పడుటయేగాక వీని యభివృద్ధియు వారి అభిలాషయొక్క పెంపుమీదనే ఆధారపడియుండుటను ఆయాదేశముల చరిత్రలు చాటుచున్నవి.

కాన వయోజనవిద్యయొక్క మొదటిఫలితములలో గ్రంథాలయము లెట్లు ప్రధానమైనవో దీనినిబట్టి మనము గ్రహించగలము.ఇట్లు వయోజన విద్యాప్రచార సాధనముగా మొదట నేర్పడిన గ్రంధాలయములు క్రమముగ తమ యాశయమును విస్తరించుకొనినవి. అచ్చులోనున్న అన్ని రకముల ప్రచురణములను సేకరించి సంఘములోని ప్రతియొక్కరి అవసరములను తీర్చుట కివి పూనినవి. నాగరక సంఘములో నేటి గ్రంధాలయములు బహుళముగను, విస్తారముగనుఉపకరించు చున్నవి. ఇవి సమస్త భౌతిక విద్యలకు,కళలకు సంబంధించిన ప్రాధమిక విజ్ఞానమును ప్రసాదించుటనుండి, మానవులకుండు అన్ని రకముల మనోరోగముల మాన్పు సమర్ధతను కలిగియున్నవి. పాఠశాలలు, వయోజన విద్యాప్రచారసాధనములలో గ్రంధాలయములు ప్రధానస్థాన మాక్రమించుచున్నను, ఈ సాధనముల సంఖ్యయు క్రమముగ పెరిగినది. పాఠశాలలు,కళాశాలలు, విశ్వవిద్యాలయములు పౌరవిద్యకు కొంత ప్రోత్సాహమును కలిగించు చున్నవి. ప్రజలలో వినోదము, విద్యావ్యాసంగము కలిగించునిమిత్త మేర్పడిన సినీమాలు, పత్రికలు, రేడియోలు, తమ తమ విధులను గూర్చిన పునర్విచారణకు పూనుకొన్నవి. వస్తుప్రదర్శనశాలలు విద్యాసాధనములుగ తమ ధర్మము నెక్కువశ్రద్ధతో పరిపాలించుచున్నవి. అమెరికాలోని 'పబ్లిక్ ఫోరము'లవంటి నూతన సాధనములును కొన్ని బయలుదేరినవి. గ్రంధాలయాశయములో కలిగినమార్పు, వయోజనవిద్యాప్రచారసాధనాల పెంపు గ్రంథాలయములకు వయోజన విద్యకు గల సంబంధములో క్రొత్తమార్పుకు కారణమైనవి. అమెరికాలో గ్రంధాలయోద్యమము,వయోజన విద్యాప్రచారకార్యక్రమము - రెండును అమిత ధనవ్యయముతో పె౦పొందినవి. క్రిందివిషయములు అమెరికనులు వయోజనవిద్యాప్రచారమునకై తమ గ్రంధాలయముల నెట్లుపయోగించిరో తెలుపగలవు.

వయోజన విద్య యన నేమి? దీని యుద్దేశము లేవి ? వీనిని గ్రంథాలయము లెట్లునెరవేర్చగలవు? అను విషయముల గూర్చి ముందు విచారింతము. వయసుమీరినవారికి కావలసిన విద్య వయోజనవిద్య. వీరికి పాఠశాలలలో పిల్లలకు చెప్పుబడు చదువుకూడ ఒక్కొక్కప్పుడవసరమగును. దీని అవసరము మనదేశమున మిక్కుటముగ నున్నను నాగరక సంఘములోని మానవమాత్రులు తెలిసికోవలసిన సంగతులను గూర్చి మనము ముందు చర్చింతము. అప్పుడు వయోజనవిద్య యొక్క ఆదర్శము మనకు బోధపడగలదు. మనుజులు తమ సామాజిక జీవనమును శక్తివంతముగ గడుపగలిగిన సమర్థత గలిగియుండు టవసరము. దీనికి మించిన జ్ఞానము, వారి వృత్తికిగాని, అభిమాన విషయమునకు గాని సంబంధించిన దగును. ఇంతమాత్రము కూడ వారు తెలిసికొనకుండుట దురదృష్టమని చెప్పక తప్పదు.

సంఘజీవనమును సమర్ధతతో గడుపుట కనువైన విద్యను గూర్చియు దీనిని ప్రసాదించుటలో గ్రంధాలయములకు గల స్థానమును గూర్చియు విచారింతము.

1. వ్రాత, చదువు, సామాన్యగణితము సమాజములోని ప్రతి మానవుడు మొదట నేర్వవలెను. వీనికి దూరుడగువాడు ఆధునిక నాగరకతా ఫలితములను వేనినిగాని పొందజాలడు. ఈ వ్రాత చదువులు పసితనమున పాఠశాలలలో నేర్వవలసియుండును. ఈ అవకాశము నప్పుడు పొందియుండని పెద్దవారలకు ముందు వీనిని నేర్పుటవసరము. నిజమున కిది గ్రంథాలయ కార్యక్రమములోని భాగముగా నెంచబడకున్నను 100 కి 90 మందికి పైగా నిరక్షరాస్యులుగల మన దేశములో ఈ పనిని రాత్రి పాఠశాలలద్వారాను, వయోజన పాఠశాలల మూలమునను సాగించక వీలు లేదు. చాల కాలముగ ఆంధ్రదేశములోని గ్రంధాలయములు కొన్ని ఈ పనిని నెరవేర్చుచునే యున్నవి. ఈవిషయమై యింతటితో నూరకున్నచో ప్రయోజనము లేదు. పిన్నలుగాని పెద్దలు గాని నేర్చిన వ్రాతచదువులు వాడుకలో లేనియెడల కొంత కాలమునకు మరల వారు పూర్వస్థితికివచ్చుట సంభవము. కాన వారు సాధించిన అక్షరాస్యతను నిలబెట్టుకొనుటకు నిరంతర గ్రంథపఠనము మిగుల నవసరము. దీనికి కావలసిన గ్రంధములను చౌకగను సులభముగను వారికందజేయుటకు గ్రంధాలయములు కావలెను. ఎవ్వరుగాని విడివిడిగా ప్రతి క్రొత్తపుస్తకమును కొనుటసాధ్యము కాదుగదా! ప్రాతపు స్తకములే మరల మరల తిరుగ వేయుటయు పొసగదు, నిరంతర పఠనము లేకున్న కొంతకాలమునకు అక్షరాస్యులు సహితము నిరక్షరాస్యులగుదురు. కాన ఈచిక్కులను తొలగించుటకు ప్రతియొక్కరికి గ్రంధాలయ మందుబాటులో నుండవలయును. లయములు కావలెను.

2. తాను నివసించుభూమిని గూర్చిన జ్ఞానము - అనగా దేశభూగోళమును ప్రతి మనుజుడు నేర్వవలెను. పాఠశాలలలో బోధింపబడుటయేగాక, మన నిత్యజీవితములోను దేశ భూగోళవిషయములు తఱచుగ మనకు తెలియుచుండును. అయినను కాలానుసరణముగ కలుగు మార్పులతో పై విషయములలోను కొన్ని మార్పు లప్పుడప్పుడు కలుగుచుండును. వీనిని పత్రికలు మున్నగువానిద్వారా మనము తెలిసికొనగలము. నేటి సంఘములోని వయోజనులలో చాలభాగము ప్రస్తుత ప్రణాళిక ననుసరించి పాఠశాలలలో చదివినవారు కానందునను, క్రొత్తగ అక్షరాస్యులగువారికిని ఈ భూగోళవిషయమవసరము గనుకను, వీరి కిందునిమిత్తము కావలసిన పుస్తకములు మున్నగు పరికరముల నందజేయుచు గ్రంథాలయములు చాలగ తోడ్పడగలవు.

3. స్వజనమును గూర్చిన జ్ఞానముకూడ విద్యయొక్క ప్రధానాశయములలో నొకటి. దీనిని మూడు భాగములుగ విడదీయవచ్చును.

(అ) దేశచరిత్ర:- దీనిని తెలిసికొనుటమూలమున మనుజులు సంకుచితమగు స్వార్థదృష్టినుండి విడివడి విశాలాశయములగు ఐకమత్యము, దేశభక్తి మున్నగుగుణముల నలవఱచుకొనగలరు.

(ఆ) సాంఘిక జీవితమునకు పునాదులనదగిన వివిధ సంస్థలను గూర్చిన విజ్ఞానము:- వీనిలో ప్రభుత్వమునకు సంబంధించిన విషయము ప్రధానమైనది. పౌర విద్యయు వయోజనులు నేర్వదగిన అంశమే. దీనికి వారివయస్సు చాలా అనుకూలమైనది.

(ఇ) ఆర్థిక సంబంధములు:- సంఘముయొక్క- ఆర్థిక నిర్మాణము, ఇచ్చి పుచ్చుకొనుటలు మున్నుగాగల జీవితసమస్యలు పసివారలకర్థముగావు. ఇవి పెద్దవారి కవసరము. వీనిని వారు సులభముగ గ్రహించగలరు. దేశ చరిత్ర, రాజకీయార్థికములను గూర్చి తెలియగోరువారలకు గ్రంధాలయము లెక్కువగ నుపకరించును. వీనికి సంబంధించిన వివిధ సమస్యలను గూర్చి తెలియగోరువారి కనుకూలమగు గ్రంథములను గ్రంథ భాండాగారి సూచించును. ఇట్టి విజ్ఞానసముపార్జనమునకై పూనిన ముఠాలవారికి వివిధవిషయములకు సంబంధించిన పుస్తకముల జాబితాల ఆయావర్గములు కనుకూలముగ నీతడు సిద్ధపఱచును.

4. ప్రతిమానవునకు తన ఆరోగ్యమును, శక్తిని వృద్ధి చేసికొనుట కనుకూలమగు జ్ఞానము ముఖ్యముగ కావలెను. శరీరశాస్త్రము, ఆరోగ్యవిషయములతో పాటు వివాహము, శిశు శిక్షణకు సంబంధించిన విషయములు కూడ పెద్దవారలకు తెలిసియుండవలెను. ఇందు మొదటి రెండంశములను గూర్చిన ప్రాధమిక జ్ఞానము పాఠశాలలలో బోధింపబడుచున్నను కడపటి రెండువిషయములను గూర్చి తెలియగోరువారికి స్వయంపఠనమే శరణ్యము. ఇక ఈ స్వయంపఠన విధానమున గ్రంధాలయ ప్రాముఖ్యమును తిరిగితిరిగి చెప్పనక్కర లేదుగదా!

5. వృత్తికిసంబంధించిన జ్ఞానసముపార్జనమును విద్యయొక్క ప్రధానాశయములలో నొకటి. ఇందువిషయమైన ప్రాధమిక జ్ఞానమును నేర్పుటకు ప్రత్యేక పాఠశాలలు, కళాశాలలు - వీనియందలి గ్రంధాలయములు తోడ్పడుచున్నవి. ఒకవృత్తికి సంబంధించిన ప్రాధమిక జ్ఞానమును ప్రసాదించుటకంటె ఆయావృత్తుల వారు తమతమ పనుల నెక్కువ సమర్థతతో నిర్వహించునట్లు చేయుటలో నేటి గ్రంథాలయము లెంతయు నుపకరించును. అయితే వీనిలో ఆయావృత్తులకు సంబంధించిన గ్రంధములు పూర్తిగా నుండవలెను. నేటి ఆర్థిక విధాన కారణముగ తఱచు అనేకులకు సంభవించు నిరుద్యోగ బాధనుండి వారిని కాపాడుటయే గాక, నూతన వృత్తులలో వారిని ప్రవేశపెట్టుట కనుకూలమగు విజ్ఞానమును జనులకందించుటకై పాశ్చాత్య సీమలందలి గ్రంధాలయములు చేయు కృషి వర్ణనాతీతము.

గృహనిర్వాహకత్వము, శిశుపోషణ ప్రత్యేకము స్త్రీల విధులుగ పరిగణింపబడుచున్నవి. ఇంగ్లండు అమెరికా దేశము లందలి తల్లిదండ్రుల సంఘములు స్త్రీలకు పై విధులను గూర్చి బోధించుటకు పూనుకొన్నవి. ఇందుకీ సంఘముల వారుపయోగించు సాధనములలో గ్రంథాలయములు ప్రధాన స్థానము నాక్రమించుచున్నవి. అమెరికాలోని చాల గ్రంధాలయముల నీ సంఘములు గుర్తించి ఉపయోగించుకొనుచున్నవి.

6. నేటి నాగరకతకు ప్రధాన కారణమైన వైజ్ఞానికశాస్త్ర (సైన్సు) పరిచయము ప్రతి మనుజునకును అవసరము. ముఖ్యమగు వైజ్ఞానిక సిద్ధాంతములు, వానియుపయోగ ప్రయోగములను గూర్చి తెలుపుట వయోజనవిద్యలో నొక అంగము. వీని ప్రచారము విషయమై సినీమా రేడియోలతోపాటు పత్రికలు సహితము పని చేయుచున్నవి. సైన్సుకు సంబంధించిన చదువదగిన ప్రచురణముల నన్నిటిని సేకరించి యుంచుట గ్రంధాలయముల పని. విజ్ఞానశాస్త్ర పరిశోధనా ఫలితములను ప్రజాసామాన్యమున కందుబాటులో నుంచుపనికి సమర్థులు పూనుచో వాని ప్రచారమును గ్రంథాలయములు సాగించును.

7. ప్రపంచ భూగోళము, ప్రపంచ చరిత్రల పరిచయము నే డందఱజనుల కవసరమని వేరుగ చెప్పనక్కరలేదు. ఈ పరిచయమును కూలంకషముగ గలిగించుటకు గ్రంథాలయములు కృషి చేయవచ్చును.

పైన చెప్పిన ప్రయోజనములు పొందగోరు వ్యక్తులకు గ్రంధాలయము లెట్లు తోడ్పడునది తెలిసికొంటిమి. ఇప్పుడు వయోజనవిద్యా ప్రచారకులు కివి యెట్లుపయోగపడునో విచారింతము. దీనికిముందు నేటి గ్రంధాలయము యొక్క వ్యాప్తిని మనము గ్రహించవలెను. పెద్దపుస్తకములేగాక పత్రికలు, కరపత్రములు, చిన్న పుస్తకములు, వ్యాసములు కత్తిరింపులు, చిత్తరువులు, సినిమా ఫిలిములు, గ్రామఫోను రికార్డులు మున్నగు సాధనములనన్నిటిని ఆధునిక గ్రంథాలయములు సేకరించి వీనిని ప్రచారములోనికి తెచ్చుచున్నవి. గ్రంథాలయము లెచ్చటనున్నను వయోజనవిద్యను నేరుగ ప్రోత్సహించుటకై క్రిందివిధానము లుపకరించుచున్నవి.

1. వ్యక్తి గతసలహాలు: వివిధ విషయములను గూర్చి తెలియగోరువారికి గ్రంధాలయములలో సలహానిచ్చు యేర్పాటొకటి. ఆయా వ్యక్తుల అభిమానవిషయములకు సంబంధించిన గ్రంధాలయోపకరణముల జాబితాలు తయారుచేయుట రెండవది. ఎక్కువ ప్రయోజనకరముగ నుండునిమిత్త మీ జాబితాలలో నుదహరింపబడిన గ్రంధములు మున్నగు పరికరముల గూర్చిన వివరములుకూడ చేర్చబడును. గ్రంథాలయములలో గల పుస్తకములు మున్నగువానిని పాఠకుల యోగ్యతల కనుకూలించు క్రమమున వ్రాసియుంచుట మరొకటి.

2. వయోజన విద్యాప్రచార కార్యక్రమములో గ్రంధాలయము ప్రముఖపాత్రగ నున్నందున ఇందునిమిత్తము పనిచేయు అన్ని సంస్థల కార్యక్రమము నిది సమన్వయ పఱచగలదు. ఒక్కొక్క సమాజము లేక వర్గమునకు సంబంధించిన ఇట్టి సంస్థల సూచికను తయారుచేయుటయేగాక గ్రంథాలయములు వీని కార్యక్రమమును వెల్లడిపఱచుచు వీనికి సభ్యులను జేర్చుటకై తీవ్రమైన కృషి చేయవచ్చును.

3. గ్రంధాలయములు వయోజన విద్యాప్రచారకులతో సహకారము నెఱపుచు, వారి ఉద్యమపద్ధతుల నెఱుగుచు, తమకడనున్న వయోజన విద్యాప్రచార మునకు పనికివచ్చు పరికరములను గూర్చి వారికి తెలియజేయుచు, వీనిని బోధనాసమయమున వారుపయోగించు కొనునట్లు చెప్పుచు, తమ ప్రచారమున కనుకూలించు ఉచిత వాఙ్మయముయొక్క భోగట్టాను వారి కందజేయుచు వర్థిల్ల గలవు. మఱియు వయోజనుల నిమిత్తమేర్పడు తరగతులలో వారికి తగిన గ్రంధములనుగూర్చిన ఉపన్యాసముల ద్వారా గ్రంథ భాండాగారులు నేరుగ వయోజనవిద్యాప్రచారమున పాల్గొనవచ్చును.

4. వయోజనులలో విజ్ఞాన వ్యాపనము గావించుట కేర్పడు ఉపన్యాసములు, చర్చలు మున్నగువాని యేర్పాటుకు గ్రంథాయములు తమ భవనములలో తావు నొసంగవచ్చును. ఈ భవనములలో వయోజనవిద్యా ప్రచారక సంఘముల కార్యసానముల నుంచుటయు మేలే.

5. ఈడువచ్చిన ప్రతి యొక్కడును తన కనుకూలమగు వృత్తిని నిర్ణయించుకొని జీవయాత్ర గడపుటకు సాయపడు నిమిత్తము వివిధవృత్తులు - వానికిగల అవకాశములకు సంబంధించిన వాఙ్మయముయొక్క సూచికలను తయారు చేసి యుంచుట ఇతర దేశములందలి గ్రంధాలయములు చేయుచున్న పనియే.

మన మిప్పుడొక గొప్ప సంకటములో నున్నాము. నిరాశ, దుఃఖము మనల నావరించినవి. ఏమి చేయుటకును తోచని ఈ సమయములో సహితము నిశ్చయాత్ములు కొందఱు ఏదేని నొక కార్యమును నిర్వహింప జూచుచున్నారు. కాని పూర్వాచారములు వీరికి ప్రబలాటంకములుగు నున్నవి. నూతన విజ్ఞానము కొఱకు, ఒక వినూత్న సత్యముకొఱకు వీరు కృషి చేయుచున్నారు గాని ఇది వారి కెచ్చటను లభించుట లేదు. 'సమాధానము, సహనము, సహకారము' - ఇవి మానవకోటి కంతటికిని అవసరమని మహాపురుషుల యుపదేశము. మానవసంఘమునకు కావలసీన పై మూడు విషయముల నందరికీ బోధచేయవలసిన విధి మనపై గలదు. ఈ విధిని నెఱవేర్చుటకై జనులకు నూతన చైతన్యమును, నూతన విజ్ఞానమును ప్రసాదించుటకై గ్రంధాలయములు కృషి చేయవలసి యున్నది.



This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse

  1. * ది మోడరన్ లైబ్రేరియన్ 11 వ సంపుటము 2వ సంచికలోని సోహన్ సింగుగారి వ్యాసము ననుసరించి వ్రాయబడినది.