ఆంధ్ర గ్రంథాలయం/సంపుటం 2/సంచికలు 3, 4/ పెద్దల చదువు
పెద్దల చదువు
శ్రీ వడ్లమూడి వేంకటరత్నము, ఉభయభాషాప్రవీణ
పెద్దల, చదువువిషయమై యిపుడు మన దేశమున ఆందోళనము జరుగుచుండుట ప్రశంసార్హము. నూటికి తొంబదిమంది విద్యాగంధం మెరుగని దేశ మభివృద్ధి చెందుట కలలోనివార్త ఇప్పుడు పాఠశాలలలో చదువుచున్న విద్యార్థుల శాతమును తక్కువగా నుండుటకు పెద్దలచదువు లేమియే ప్రధాన కారణము. కనుక నేటి బాలబాలికలు విద్యావంతులగు పౌరులు కాగల్గుటకు గానీ, ప్రస్తుతము దేశము తన లోటుపాట్లను దిద్దుకొని, అభివృద్ధిమార్గమున పయనించి ఉన్నతశిఖరము నధిగమించి కలకలలాడుచు విరాజిల్లుటకు గానీ పెద్దలు-తరణము-విద్యావంతులగుట అత్యావశ్యకము.
ఈ విద్యను మనము రెండు భాగములుగ విభజింపవచ్చును. చదువు వ్రాతలతో కూడిన మార్గ మొకటి. చదువు వ్రాతలకు సంబంధము లేని వినికిడిమార్గ మొకటి. మనకీ రెండుమార్గములును ప్రస్తుతి మనుసరణీయములే యగుచున్నవి. మనము ఎంత ప్రయత్నము చేసినను చదువు వ్రాతల కలవఱంపలేని సామాన్యజనులు - ప్రస్తుత స్థితిగతులనుబట్టి - పెక్కురుందురని యూహించుట సాహసము కాదు. మరి వారిని ఊరక విడిచి పెట్టి వేయవలసినదేనా? వారి విషయమై విద్యావంతులు, దేశసేవకులు నిర్వహింపవలసిన ధర్మము లేదా? ఉన్నది; లేకేమి? ఎంతయో యున్నది. వారికి చదువు వ్రాతలు తెలియకున్నను కొంత జ్ఞానమున్నది. ఉండక తప్పదు. పుస్తకములు చదువకున్నను, విశేషములగు భావములు లేకున్నను ప్రపంచమున నింతకాలము గడియించిన అనుభవపూర్వకమగు జ్ఞానము వారిని తమ భవిష్యత్కార్యనిర్వహణమునకు కొంతవరకర్హులుగా జేయుచున్నది. కాని, అది చాల మితముగా నుండుటచే సర్వమానవసంఘమును తన సోదరులుగ, భారతదేశమును తన గృహసీమగ, విశాల ప్రపంచమును తన గ్రామముగ భావింపవలసిన నేటి కాలమున నది మిక్కిలి కొఱత యగుచున్నది. కనుక వారిని ఆధునాతన కాలమున కర్తులుగ జేయుటకు విద్యావంతులు చేయదగిన పని యనంతముగ నున్నది. వారికున్న ఆ స్వల్పజ్ఞానము, ధర్మమను పేరితో-ఆచార రూపముగ పాదుకొనియున్న సాంఘిక దోషములనుదిద్దుకొని సంఘమును పుష్టిమంతముగ జేసికొని సుఖించుటకు చాలదు. తనకు సంబంధము లేదని తప్పించుకొని పోవుచున్న రాజకీయలోపములను సవరించుకొని తనకున్న యధార్థమగు అధికారమును చక్కగా నెలపుటకు కొఱతయగును. తన కర్మమని భావించుచు దేవునిమీదనో, పూర్వజన్మము మీదనో భారము వైచి తానష్టకష్టములు గుడుచుచుండు దారిద్యమును తొలగించుటకు తానుచేపట్టవలసిన కర్తవ్యమును నిర్ణయించుకొనుటకు, దానిని లెస్సగ నిర్వహించుటకు పనికిరాదు. మతములను పేరితో తన్ను గట్టిగ కట్టివైచుచున్న పాశములను తెంచుకొని స్వతంత్రముగ ఒక్కసారి ఉచ్ఛ్వాసనిశ్శ్వాసములు జరుపుకొనుటకు తక్కువయగును. ఇంతయేల! తాను మనసార ప్రేమించు ప్రియకామిని, తనరక్తమును జీవిత సర్వస్వమును ఒడ్డి తన ప్రాణములకు ప్రాణములుగా చూచుకొనుచుండు ముద్దుబిడ్డలు, ఆరోగ్యముగ చిరకాలము జీవింపవలయునని యెంత వాంఛించుచున్నను ఆ మార్గమునైన బాగుగ నెఱుంగుటకు చాల వెనుక పడును. ఇట్లే ఆతడనుభవింపవలసిన సుఖములకుగానీ, ఆతడాచరింపవలసిన ధర్మములకు గానీ ఆస్వల్పజ్ఞానము సహాయము చేయలేదు. కనుక అట్టివారి నెల్లరను విజ్ఞానవంతులుగా జేయుటకు విజ్ఞానులు ప్రయత్నింపవలసియున్నది. ప్రతి వాడును తనశక్తి కొలది చేయూత నీయవలసి యున్నది. ఇదియంతయు చదువులోనిదేగాని దానికి భిన్నముగాదు. ఇందులకు ఏయే విషయములను బోధింపవలయును అనుట ఈ వ్యాసప్రధానోద్దశం గాదు; కానీ యీ విషయముల నొక కొంత తెలిసికొనుటకు శ్రీయుతులు శనివారపు సుబ్బారావు గారు వ్రాసిన 'వయోజనవిద్య' అను చిన్ని పుస్తకములు కొంతవఱకు తోడ్పడగలవని చెప్పుట అప్రస్తుతము గాదు. వాని సహాయమున మన శక్తి సామర్ధ్యముల ననుసరించి, పరిస్థితుల ననుసరించి మనమొక పాఠ్యక్రమము నేర్పఱచుకోనవచ్చును. దాని నవలంబింపవచ్చును. దీనికి తోడుగ చిరకాలమునుండి మన కాచారమ్ము వచ్చుచున్న పురాణ పఠనము, హరికధా కాలక్షేపము, వీధినాటకములు, బొమ్మలాటలు, వీరగాధలు మొదలగు జాతీయ పద్దతులను స్వీకరించుట ప్రశస్తము. జానమునకు జ్ఞానము, సంతోషమునకు 'సంతోషము అందువలన గలుగుచుండును. వినికిడి విద్యకు ఇవి ప్రధాన సాధనములు. ఉపన్యాసములు, పత్రికా పఠనము, లాంతరుపన్యాసములు మున్నగునవి అవశ్య మనుసరణీయములు. ఇందువలన చదువు వ్రాతలు లేకున్నను పౌరులను విద్యావంతులుగ జేయవచ్చును. మంచి చెడ్డలను విమర్శించుకొను సామర్ధ్యమును కలిగింపవలయును; వివిధములగు భావములను వారికి బోధింపవలయును. వానిని సమన్వయము చేసికొనుట కవకాశము గల్లింపవలయును. త్రోవను ఆలోచించుకొనుటకు తోడుపడవలయును. వారు తమ విశ్వాసము ననుసరించి ధైర్యముగ నడచుటకు సాయము చేయవలయును. ఇదియే వారికి కావలసిన విద్య. ఇంతకంటె మఱిలేడు.
ఇక రెండవమార్గము చదువు వ్రాతలతో కూడినది:-
ఎంత నేర్పుగల యుపాధ్యాయుడైనను, ఎంత సేవాతత్పరుడయ్యును, ఎల్లకాలము - అన్ని విషయములను ఎల్లవారికి బోధించుచుండుట అసంభవము. ఎవ్వరు గానీ సర్వకాలము ఇతరులమీదనే యాధారపడియుండుట వివేకము కాజాలదు. ఉద్దరేదాత్మ నాత్మానం' అనునట్లు తనమీద తా నాధారపడి యుండవలయును. ఎంత పెద్దవాడైనను లేటి చెట్టు నెక్కు వానికి కొంత యెత్తునకు మాత్రమే తోడ్పడ గలడు. తనకాళ్ల మీద తాను నిలువబూసని వానిని ఇతరు లెంతకాలము నిలుపగలరు? కనుకనే తనంతట తాను విద్యాభివృద్ధి కల్గించుకొనుటకు ప్రతిమనుష్యునకు శక్తి యలవడవలయును. పాఠశాలలలోని విద్యాలక్ష్యమిదియే. వయోజన విద్యావ్యాప్తిలోగల యుద్దేశము నిడియే. ఈ యుద్దేశ సాఫల్యమును బట్టియే పాఠశాలల ప్రయోజన ప్రమాణము నిర్ణీతమగుచుండును. ఈ యెఱపిడి జాతితో పరీక్షించినచో మన ప్రస్తుత పాఠశాలలు తమ ప్రయోజనమును చక్కగ నిర్వహించుచున్నవని గానీ, నేడు బడులలో చదువుచున్న బాలు రందరు విద్యావంతు లగుచున్నారని గానీ విశ్వసింపజాలము. ఉన్నతపాఠశాలలలో జదివిన పెక్కురు బాలురు అభిరుచిలేక చదివిన చదువురకు నీళ్లు వదలుటయు,నాలుగైదు తరగతులవరకు చదివిన పెక్కురు బాలురను నాలుగైదేండ్లలో వయోజన పాఠశాలలో చేర్చుకొనవలసివచ్చుటయు మనము సామాన్యముగ జూచుచునే యున్నాము. దీనికంతటికిని విద్యావిధానలోపమే ప్రధానలోపము. దీనిని చక్క పెట్టనిచో వయోజనపాఠశాలల క౦తమనునది యు౦డదు. పెద్ద లావిషయము నాలోచింతురు గాత!
ఎదుటివారి యుద్దేశముల గెఱుగుటకుగానీ, తన యుద్దేశములను తెలుపుటకుగానీ మాటలెంత యవసరములో కాలదూరమువలన, ప్రదేశదూరమువలన, భాషాభేదమువలన వేరయిన మనుష్యుల భావముల నెఱుగుటకును, అట్టివారికి తన యుద్దేశములను తెలుపుటకును చదువు వ్రాతలంత యుపయోగకరములనుట నిర్ధారితమే. ఇట్టి చదువుపైన మన మనుకొన్న చదువుతోచేరి మన గ్రామసీమలందు వ్యాపింపవలసియున్నది. దీనినే నిరక్షరాస్యతే నిర్మూలమనుచున్నాము. దీని యవసరములనుగానీ ప్రయోజనములనుగానీ వివరించుట చర్వితచర్వణము. కాని దీనివ్యాప్తికి అనుకరింపవలసిన పద్ధతులను మార్గములను కొంతవఱ కాలోచింపవలసియున్నది.
మన తెలుగుభాష సహజముగా ఎంత సరలము, మధురము అయినను సంస్కృతము మున్నగు భాషల యోగమువలన కొంత జటిలమగుచున్నది. ధ్వనులు, వానిని సూచించు అక్షరములు పెరిగి పోయినవి. ఆ యక్షరములన్నియు ధ్వనిసాదృశ్యము ననుసరించి, వాని యుత్పత్తిస్థానముల ననుసరించి వ్యాకరణశాస్త్రప్రకారము కూర్పబడియున్నవి. అక్షరములు నేర్చుకొనువారికి - అందునను సులభముగ-నేర్చుకొనుట కనువుగ కూర్పబడియుండలేదు. శీఘ్రకాలములో సామాన్య వ్యవహారమున కవసరమయి నంతవిద్య నేర్పదలచువారి కవి సోపానక్రమముగ ఏర్పఱుపబడలేదు. కనుక మనము పెద్దలకుత్సాహకరముగ ఆశాజనకముగ ఆవలంబింపవలయు ఈయక్షర బోధనాక్రమము తలచి చూడవలసియున్నది. ఈ విషయమును గమనించియే యిందులకనుకూల మార్గమని తాముతలచిన పద్దతులతో కొందఱు విద్యావంతులు పుస్తకములను ప్రకటించుచున్నారు. విద్యాబోధకులేగాక ప్రయోజనవిద్యయందున్న తమయభిమానమును చాటుటకు రాజకీయ నాయకులు గూడ పుస్తకములను ప్రకటించుట సమ్మోదావహము. ఈపుస్తకములను, ఈమార్గములను ఒకింత మనము పరిశీలింతము.
1. వయోజనవిద్య—మొదటి తరగతి: సుప్రసిద్ధ ఆంధ్రనాయకులగు అయ్యదేవర కాళేశ్వరరావుగారు దీనికికర్త. విశాఖపట్నం జిల్లా కాంగ్రెసు సంఘము వారు దీనిని ప్రచురించినారు. ఇందు అకారమును, హల్లులను నేర్చుకొనుటకు పాఠములును, మిగిలిన అచ్చులకు 2 పాఠములును, అచ్చుల తోడి గుణితములకు 4. పాఠములును, సంయుక్తాక్షరములకు పాఠములును ఈయబడినవి. చివర ఉపయుక్తములగు కొన్ని పాఠములీయబడినవి. కాని యివికూడ మొదటిపాఠములవలె పెద్ద అక్షరములతో ముద్రించి, మొదటనుండియు అభ్యాసపదము లెక్కువగా నిచ్చినచో ఎక్కువ యుపయోగకరముగ నుండెడిది. గుణితములు, ఒత్తులు, అచ్చుహల్లుల క్రమమునే యనుసరించుటకంటె ఎక్కువ వాడుకలోనున్న మాటలను గమనించి, సౌలభ్యమునను గురించి కూర్చుట ఉత్సాహకరముగా నుండును. ఇందు కొన్ని పాఠములలో రెండక్షరములు, కొన్ని పాఠములలో 8, 9 అక్షరములు క్రొత్తవి నేర్చుకొనవలసి యు౦డును
2. వయోజనవిద్య–మెదటిభాగము : శ్రీయుత గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు దీనికి కర్త. ఆంధ్రదేశ గ్రంధాలయ సంఘ ప్రచురణము.
ఇందు మొదట బోధకులకు కొన్ని చక్కని సూచన లీయబడినవి. తెలుగు అక్షరము లన్నియు ప్రస్తుతము వలయాకారముననే యుండుటచే సున్నలోనుండి అక్షర మెట్లేర్పడియున్నది. శిక్షకులకు త్రోవ చూపుచు, అవసరములగు అక్షరములు ముందు చెప్పి ఖ, ఘ మొదలగు ఒత్తక్షరములు తరువాత చెప్పబడి చక్కగా కూర్పబడి యున్నది. మొదటి పాఠమున సున్న, అన్ని వైపులకు. ఆరసున్నలు, గీతలు నేర్పి రెండవపాఠమున 7 అక్షరములు నేర్పినారు. ఇది సులభమా? మొదటి పాఠములకు ఇంకను అభ్యాసపదములను చేర్చుట మేలు. అభ్యాసముల కిచ్చిన చివరి పాఠములలోకొన్ని పద్యములును, దాని ప్రతిపదార్థ తాత్పర్యములును ఉన్నవి. ఇవియును పదములు చదువుటకే ప్రధానముగ నుద్దేశింపబడి యున్నట్లు కనబడుచున్నది. లేనిచో 'ఇట్లు బెగడొందదగునా? పగవారు ప్రమోదింపరా?' మొదలగు తాత్పర్యములును, 'కపికుల నాధుల్ = కపివంశమందు ప్రముఖులైన వారు' మొదలగు అర్థములను ఉండుట కవకాశము లేదు.
3. మాపాఠాలు–1, 2 భాగములు: కర్త శ్రీయుత గోపరాజు రామచంద్రరావుగారు, ఎం. ఏ. కృష్ణాజిల్లా యువజనసంఘు ప్రచురణములు.
ఇందు అక్షరములు నేర్పుటకు ప్రత్యేక పద్దతి యేదియు గైకొనబడలేదు. ఒత్తక్షరములను మాత్రము చివరకిచ్చి మిగిలిన అక్షరములను వర్ణమాలలోని క్రమమునే గ్రహించినారు. ఋ ౠ మొదలగు అక్షరములను మొదటనే నేర్పవలసిన అవసరమేమిగలదు? అభ్యాసపదములు తక్కువ. ఉన్న పదములును 'మొదటినుండియు చిన్న అక్షరములతో ముద్రింపబడినవి. విద్యార్థులు పెద్దవారైనను మొదటి నుండియు చిన్న అక్షరములను గుర్తించుట క్లేశకారణము. విశేషవిషయములను బోధింపవలసిన కొన్ని పదములు మాత్రము అక్కడక్కడ పెద్ద టైపులో నున్నవి. ఆ విషయములను బోధించువిధానము మొదటి పీఠికలో సూచించినారు. వారు ద్దేశించిన విషయములను బోధించుటకుముందు ఉపాధ్యాయులు కొంత కృషిచేయవలసియుందురు. ఈ కృషి మంచిదే; మొదటినుండియు ఉపాధ్యాయుడు చెప్పుటకంటె వానినిగూర్చి చిన్న చిన్న పాఠముల వేయిచ్చి తమంత తాము చదువుకొను అలవాటును గల్గిం చుట ప్రశస్తము. ఆ యభిరుచిని గల్గించుట కిది కొంత తోడుపడవచ్చును. ఆ విషయములలో, నేర్చుకొను "రైతులు, కూలీలు మొదలగువారికి చేరువలో నుండువానిని, ప్రాధాన్యమునుబట్టి యిచ్చుట మేలు.
4. ఆంధ్రవయోజన విద్యావాచకము: గుంటూరు ఏ. సి. కాలేజి రి సెర్చి అండ్ ఎక్స్టెన్షన్ డిపార్లుమెంటువారిచే ప్రకటింపబడినది. ఇందు 48 మూలపదములున్నవి. రోజునకు ఒకగంట చొప్పున 75 రోజులలో ఈవాచకము ముగింపవచ్చునని కర్తల భావము. అప్పటికి తెనుగుభాషను బాగుగా చదువవచ్చును, వ్రాయవచ్చును. ఇంతకంటే తక్కువకాలములో నేర్పుట కనువగునట్లు కూర్పవచ్చునేమో రిసెర్చి చేయుటకు కర్తలు ప్రయత్నింపవలయును. ఇంతయయ్యును క, న, మ, త, ఒత్తులు ఒక్క పాఠమున కీయవలసియుండునా? పుస్తకము సైజు కొంచెము పెద్దదిగాని పదములన్నియు చివరిదాక *పెద్దయక్షరములతో ముద్రింపబడినవి. అభ్యాసపదములును చాలినన్ని యున్నవి.
5. పెద్దలవాచకము – 1 మొదటిదశ; 2 రెండవదశః కర్త శ్రీయుత కె. జె. జి. సుందరంగారు దోర్నకల్ ట్రయినింగు స్కూలు హెడ్మాస్టరు). క్రిస్టియన్ లిటరేచర్ సొసైటీవారిచే ప్రకటింప బడినది.
ఇందు మొదటిదశలో నున్న 9 మాటలు నేర్పినచో సామాన్యముగా వాడుకలోనున్న మాటలు, కొన్ని చిన్న కథలు చదువవచ్చునను ప్రణాళికతో కూర్పబడినది. మొదటి నాటినుండియు అచ్చులగుణితము, ద్విత్వాక్షరములు, సంయుక్తాక్షరములు కూడ ప్రత్యేకతలేకుండనే కూర్పబడినవి. దీనిని నేరుగా బోధించుట మేలు. 14వ పుటలో వల అనుమాటను నేర్పినారు. కాని 9వ పుటలోనే దేవుడు మొదలగు మాటలను అభ్యాసములోనిచ్చుట ప్రమాదమగును. పుస్తకము "పెద్ద సైజులో చివర దాక పెద్ద అక్షరము లతో ముద్రింపబడినది.
రెండవదశలో భ, ధ, క్ష, శ, ణ, అక్షరములు నేర్పుచు, అభ్యాసముల నిచ్చినారు. మొదటిదశలో నుపయోగించిన సంయుక్తాక్షరములకంటే భ, థ, మొ॥ వానిని వెనుకగా నేర్పవలసిన యవసరమేమి? చివర క్రీస్తునకు సంబంధించిన కొన్ని కథలు పఠనకీయబడినవి.
6. నంద్యాల మొదటివాచకము; నంద్యాల రెండవవాచకము : శ్రీయుత బి. ఇ. దేవరాజు ఎం ఏ., ఎల్. టీ. గారు (ఎస్. పి. జి. ట్రయినింగున్కూలు హెడ్మాస్టరు) కర్త.
ఇవియు క్రిస్టియన్ లిటరేచరు సొనైటీవారి ప్రచురణములే. ఇందు మొదటి వాచకములో తేలిక అక్షరములు, రెండవదానిలో ఖ మొదలగు ఒత్తక్షరములు నేర్పబడినవి. కాని మొదటి వాచకము “మొదటి పాఠములోనే ద్విత్వాక్షరములు ప్రారంభింపబడినవి. ఇది నేర్చుకొనుటకు తేలికయా? సంయుక్తాక్షరముల నేర్చుటకు ప్రత్యేక శ్రద్ధకు అనుగుణముగా లేదు. కాని అభ్యాస వాక్యములలో సంయుక్తాక్షరములు ప్రయోగింపబడినవి. పెద్ద సైజులో 'పెద్ద అక్షరములతో పుస్తకములు ముద్రింపబడినవి.
7. హైదరాబాదు పెద్దలవాచకపుస్తకము-1, 2, 3 భాగములు : ఇనియు క్రిస్టియన్ లిటరేచర్ సొసైటీవారి ప్రచురణములు.
ఇందలి మొదటి భాగము మొదటి పాఠములోనే పెక్కరములును, చాలవరకు అచ్చులతోడి గుణితములును, ద్విత్వాక్షరములును ఈయబడినవి. బొమ్మల సహాయముతో ఈమాటలు నేర్పుటకు మొదటిపుటలో ఆ మాటలకు సంబంధించిన బొమ్మలున్నవి. మాటలమూలమున అక్షరములు నేర్పుపద్దతి యిందనుకరింపబడినది. సామాన్యముగ ఇప్పుడు పల్లెలయందు పెద్దలకు విద్యనేర్పబూను యువకులీ పద్ధతి సనుకరింపగల్గుట కష్టము. పుస్తకములు పెద్దక్షరములతో పెద్ద సైజున ముద్రింపబడినవి.
8. నూతన అక్షరాభ్యాసము: కర్త:- శ్రీయుత కె.జి. బాబురావు గారు (డిస్ట్రిక్టుమున్సిఫ్, ఏలూరు).
విద్యవలని ప్రయోజనములు, పూర్వభారత దేశౌన్నత్యము మొదలగు విషయములను గూర్చిన ఉద్రేకపూరితమగు పెద్ద పీఠిక ఆంగ్లమున వ్రాయబడినది. ఇది బాలురకుపయోగించు పుస్తకమనుటకంటె ఉపాధ్యాయులకు పద్ధతి నేర్పు పుస్తకమనుట లెస్స.
గ్రంధాభిప్రాయములు స్వతంత్రములు, కేవల మితరుల ననుసరించినవి కావు. అక్షరములను గుర్తుపట్టుటకంటె వ్రాయుట కష్టము. కనుక పెద్దలకు మొదటినుండియు వ్రాయుట నేర్పి వారిని విసిగించుటకంటె చదువుటముందు నేర్పినచో అక్షరములను చూచుట, పోల్చుట, చదువుటవలన వ్రాత సులభముగా వచ్చుననుట యిందలి విశేషము. ఇది మేలుగానే కనబడుచున్నది. బోధకులు ఈ పద్దతిని గూడ ఆచరణలో పెట్టిచూచి దీని ఫలితములు దేశమునకు తెలుపుట అవసరము. సత్ఫలితముల నిచ్చినచో నీ పద్దతి చక్కగనే యుండును. చదువ నేర్చుకొను అక్షరముల కొక క్రమమిందు గమనింపబడినది. ఒక యక్షరమునుండి మఱియొక యక్షరమును నేర్చుట కుపాధ్యాయులకు సూచన లీయబడినవి. ఆ యక్షరముల స్వరూపమును గుర్తుంచుకొనుటకు కొన్ని విచిత్రములగు గుర్తులు, సామెతలు ఈయబడుట గమనార్హము.
ఉదా!!ఎక్కడో తలకట్టు పారవేసుకొన్నది - 'ఎ'
- పలకవిరిగినట్లు రెండుముక్క అయినది - 'ప'
- వంకాయతోడిమవలె కరుచుకొనియుండునది- 'వ'
- యేనుగుతలవలె పెదదిగా సున్న ఉండిన - 'య'
- మనిషితలవలె చిన్నదిగా నుండిన - 'మ'
ఇట్టి ఉపమాన వాక్యములు చదువు నేర్చుకొనవారి కుత్సావ జనకముగా నుండుటయే గాక త్వరగా అక్షరములను పోల్చుకొనుటకు మిక్కిలి తోడ్పడుననుటలో సందియములేదు. ఉపాధ్యాయులకిట్టి సూచనలిచ్చుచు, బాలురకుపయోగకరముగ పాఠములు, అభ్యాసములునిచ్చిన ఈ పద్ధతియెక్కువ యుపయోగకరముగ నుండగలదు.
అందరకు, అన్ని విష యములందును సంతృ పీకపరచు పుస్తకములు లభించుట కలలోని వార్తయే యగును. బోధకులు ఇందలి యేపుస్తకమును గాని గైకొని తమపరిస్థితుల ననుసరించి కొంతకొంతమార్పుచేసికొనుచున్నచో వారు తమక ర్తవ్యమును సులభముగ నేరవేర్చుకొనగలరనుట నిస్సంశయము. ఉపాధ్యాయులు కేవలము బాలశితులమీదనే యాధారపడుటకంటే తమ కృషిమీద నాధారపడుట ము. పుస్తకములు మార్గమును మాత్రమే చూపగలవు గాని చదువు నంతటిని సమర్పింప జాలవు. ఆందేశగ్రంథాలయ సంఘము వారు అనుభవముగల కొందరు పెద్దలను జేర్చి వారి సూచన లచే నొక పుస్తకమును వ్రాయించినను వ్రాయించవచ్చును. అది యిప్పుడున్న వానికంటె కొంత మెఱుగుగా నుండవచ్చును.
పెద్దల చదువు కేవలము అక్షరములు నేర్చుకొనుటతోనే సరిపోవుటలేదు. అది విద్యాభ్యాసమున కొక సాధనము మాత్రమే. కావున ఈ 'మొదటి వాచకముచేత సాధింపదగిన దేది ? అనువిషయముల మనము చూడవలెను. మొదటి పుస్తకము చదివినవారు తరువాత తమవిద్య నభివృద్ధి కొనుటకు అవకాశము లేమియున్నవి? ఆ ప్రారంభకులు చదువుకొనుట కుపయోగించు పుస్తకములు మన భాష యందు గలవా? లేవు. ఇతర భాషలలో నిట్టి వాఙ్మయము - అనుకూలముగ - వ్యాపించి యున్నది. పెద్దలు కుక్క పిల్లి పాఠములతో పడియుండవలసినవారుగారు, పైన చదువుటకు పుస్త కములు లేనిచో నీ ప్రారంభమువలన ప్రయోజనమేమి? మఱచిపోవుటయే దాని గతియగును. అందువలన పెద్దల యభిరుచిని తీర్పగల విషయములను తీసికొని, వారి కర్దమగు భాషలో, స్పష్టములగు అక్షరములతో, ముచ్చటైన పుస్తకములను సోపానక్రమము ననుసరించి ప్రకటింపవలయును. ఎల్లరును బాలశిక్షలనే వ్రాసినందువలన ప్రయోజనములేదు. ఇంతమాత్రముచేత నిపుడున్న ప్రారంభ పుస్తకము లాంధ్రదేశమునందలి యన్ని ప్రాంతములవారిని సంతృప్తి పరచుటకు చాలునని కాదు; ఇంకను ప్రారంభపుస్తకములకు అవకాశము లేకపోలేదు. కాని తరువాతి పుస్తకముల విషయము గూడ నాలోచించవలసిన సమయమురాకపోలేదు. ఆంధ్రగ్రంథాలయ సంఘాము ఈ విషయము నాలోచించి యొక పదకము నేర్పఱచి ఆమార్గమున త్రోవ చూపి తన ధర్మమును నెరవేర్చుకొనుగాక!
క్రిస్టియన్ లిటరేచరు సొసైటీవారు 'హెల్తుఅండు వెల్ఫేర్ సీరీసు'లో ఆరోగ్యవిషయములను వివరించుచు కొన్ని పుస్తకములను ప్రకటించియుండుట ముదావహము. కాని యవిచాలవు. వీరులచరిత్రమాలిక, జ్ఞానమాలిక మొదలగు మాలికలయందును కొన్ని యుపయుక్తములగు చిన్న చిన్న పుస్తకములున్నవి. కాని వారు ఈ గ్రంథమాలికలను తమ మతమును ప్రచారము చేసికొనుటకు ప్రధానముగనుద్దేశించినట్లు కన్పట్టుచున్నది. ఇప్పటి పెద్దలవిద్య నేర్పుటలోని భావము మతమును మార్చుటయు తమ మతమును పెంచుకొనుటయు గాదు. కనుక విజ్ఞాన విషయములు సాంఘిక దురాచార విషయములు మొదలగువానిని తీసికొనుట మేలు, ఆ విషయములను వివరించుట కిది యదను గాదు. మరియొకమారు విపులముగ విచారింతము.
ఉపాథ్యాయులు బోధించు పద్ధతులను గూర్చి వ్రాయబడిన పుస్తకములుగూడ మనకు కొన్నియున్నవి. ఆయన్ని పుస్తకముల జాబితాయు ఆంధ్రగ్రంధాలయ సంఘమువారు ప్రచురించినచో శిక్షకులు తమ కనుకూలమయిన పద్దతులను ఒక్కొక్క దాని నుండి యేరుకోనగలరు. రెంటిమూటిని మాత్రము నేనిందు సూచింతును.
- 1. పెద్దలవిద్య (ఉపాధ్యాయబోధిని): కర్త:- శ్రీ. కె. జె. జి. సుందరం గారు
- 2. గ్రామసీమ, విద్యావ్యాప్తి: కర్త:-- శ్రీ మండ వేముల వేంకటశాస్త్రి గారు
- 3. వయోజనవిద్య, 3 పుస్తకములు: కర్త: శ్రీ శనివారపు సుబ్బారావుగారు
- 4. అంతర్జాతీయ వయోజనవిజ్ఞానము: కర్త:- శ్రీ జటావల్లభుల పురుషోత్తముగారు
పుస్తకములను సూచించుటయేగాక పెద్దల చదువు నేర్పు పద్ధతులను నేర్పుటకై అచ్చటచ్చట కొన్ని కొన్ని తరగతులు నేర్పఱచి అనుభవజ్ఞులగు 'పెద్దలచే కొన్ని మాదిరి పాఠములు నిప్పించుచు బోధకులను తయారుచేయుట మేలు. ఈకార్యము విషయమై ఆంధ్రగ్రంధాలయ సంఘమాలోచించి కర్తవ్యమునకు బూనుకొనునుగాక!
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse