Jump to content

ఆంధ్ర గ్రంథాలయం/సంపుటం 2/సంచికలు 3, 4/వివిధదేశాల్లో వయోజన విద్యాప్రచారము

వికీసోర్స్ నుండి

వివిధదేశాల్లో వయోజన విద్యా ప్రచారము

శ్రీ మందలపర్తి ఉపేంద్రశర్మ, ఎం.ఏ.

గుంటూరు హిందూ కాలేజి ఆంధ్రోపన్యాసకులు

ఏదేశమయినను నాగరిక దేశమనిపించుకోనవలెనన్న ఆ దేశమందలి జనులందరును చదువుకొనిన వారు కావలెను. అట్లు చదువుకొన్న వారి సంఖ్య ఇతర దేశములలో నూటికి నూరు కొన్ని చోట్ల, నూటికి 97, 98, 99 కొన్ని చోట్ల ఉన్నది. దీనికి అనగా వయోజన విద్యావ్యాప్తికి సాధనములు ముఖ్యముగా వయోజన పాఠశాలలు, గ్రంథాలయములు. చదువుకొన్న వాళ్లు చదువు నభివృద్ధి చేయుటకు గ్రంథాలయము లెక్కువగ ఉపయోగించును. అసలు చదువురానివారికి కూడ ఈ గ్రంధాలయములె చదువు చెప్పించి వారిని విద్యనేర్చిన వారుగ చేయవచ్చును. గ్రంథాలయ సంస్థ చేయజాలని సత్కార్యము లేదు. జీతమిచ్చిన గ్రంథభాండారి ఉన్న ఈపని మరింత సుముఖముగ జరుగును. అట్టివారు లేనినాడు గ్రంధాలయ కార్యములు సక్రమముగ జరుగుననుట అనుమానాస్పదము.

ఈ వయోజనవిద్య అనేదాన్ని నిర్వచించే ముందు వయోజనులంటే ఎవరనే ప్రశ్నకు సమాధానము చెప్పాలి. వయోజనులంటే బాల్యదశ అనగా 18 సంవత్సరములు దాటినవారు (నల భైయేళ్ల పయిబడనివారని స్థూలంగా అనుకోవచ్చును). చిన్నప్పుడు విద్యనేర్వక ప్రపంచజ్ఞానము తెలియనివారు (వృద్ధాప్యం రానివారు) వ్రాత చదువు తెలియనివారు ఇటువంటివాళ్లు మన దేశంలో ఎక్కువ ఉండడంచేత నే మన దేశమిట్టి దీనస్థితిలో ఉంది. ఇట్టి వయోజనులకు చదువను వ్రాయను చెప్పేవారికీ లోక జ్ఞానం అలవాడే పద్దతిని బోధించి, వారికి మనస్సు కెక్కేటట్లు చేసి వారి నిరక్షరాస్యతను నిర్ములించడమే వయోజన విద్య. (ఈ విద్యను గాంధిగా రిట్లు నిర్వచించి దాని ఆవశ్యకతను నిరూపించి చెప్పినారు. సి. రాజగోపాలాచారి, అయ్యదేవర కాళేశ్వరరావు ప్రభృతులు వారికి చక్కని పాఠ్య పుస్తకాలను రచించారు.) ముఖ్యమైన పద్ధతి ఏమిటంటే వయోజనులకు వ్రాయడం చదవడం నేర్పితే సులువుగా వారు లోకజ్ఞానాన్ని సంపాదించుకోటానికి వీలయిన పత్రికలు మున్నగునవి వాళ్ళే చదువుకుంటారు. కావలసిన ఉపన్యాసాలిస్తూ ఉండవచ్చును. ఏతావాతా తేలిందేమిటంటే వాళ్లకు ముఖ్యం చదవడం వ్రాయడం నేర్పాలన్నమాట.

ప్రజాప్రతినిధి పరిషత్తు అని అంటున్నారే మనకు గమ్యస్థానము అట్టి ప్రతినిధులను ఎన్నుకొనే జనులకు వాటి విలువ తెలియవలెగదా! అట్టి విషయమును తెలిసికొనుటకే జనుడు చదువను వ్రాయను సమర్థుడుగ నుఁడవ లెనుగదా! అప్పుడుగదా సరియైన ప్రతినిధి నెన్నుకొనగలడు. అట్టి ప్రజాప్రతినిధి పరిషత్తుగదా మనకు స్వరాజ్యాన్ని నిర్వచించగలదు.

పాశ్చాత్య సీమలు

వయోజనవిద్యను అభివృద్ధిచేసే దేశములు పాశ్చాత్య దేశములు. అందును ముఖ్యములు డెన్మార్కు, జర్మనీ, ఇంగ్లండు, స్కాట్లండు, నార్వే, స్వీడను, ఫ్రాన్సు, కనడా, రష్యా మొదలైన దేశాలలో ఈ ఉద్యమం అభివృద్ధి చెందడానికి కారణములు అచ్చటి 'Continuation Schools' స్థాపన. ఆ స్కూళ్ళలో వర్తకంచేసుకునేపద్ధతి, వృత్తులు చేసుకొనే విధానము నేర్పుతారు. చదవడంతోపాటు ఇవన్నీ ఉచితంగా బోధిస్తారు. చుట్టుపట్లనున్న గ్రామాల్లోని స్త్రీపురుషులు యావన్మంది 18 ఏళ్ళు పయిబడినవారు చదివితీరాలని నిర్బంధంకూడా ఉంది. దీన్నే Compulsory Adult Education అంటారు. వయోజనవిద్యను వ్యాపింపచేయడానికి 'మొట్టమొదటగా కృషి చేసిన దేశము డెన్మార్కు. అక్కడ గ్రంధాలయోద్యమమేమిటి, ఇతరవిద్యాసంస్థ ఏమిటి అభివృద్ధికి రావడం అతిసులభం. అందుకనే 100 కి 99 మంది చదువుకున్న వాళ్లున్నారు ఆ దేశంలో. పాడిపంటల మహలక్ష్మితో పాటు సరస్వతికి కూడ స్థానం ఉందక్కడ - 1844 సంవత్సరములో వ్యవసాయదారుల పిల్లలకోసము మొదటి 'ఫోక్ హాక్ షూలె' (Folk hock Scbule) ను స్థాపించినారు. మొదట్లో ఈబడి మతసంస్థగా ఉండేది. జర్మనీ మొ|| ఇతర పాశ్చాత్యదేశాల్లో వలె జనబాహుళ్యమీ సంస్థను ఆదరించుటచే అధిక సంఖ్యాకము లైన సంస్థల ఉత్పత్తికి ఆధారమేర్పడెను. ప్రజాదరణ ఎంతో ప్రభుత్వపోషణ అంత ఈ సంస్థలకు దొరక మొదలిడెను. 1918 సం॥రముస డెన్మాక్కులో 6,640 విద్యార్థులతో 63 బడులుండెడివి. ఇందులో శీత కాలములో మగ వారికి అయిదు నెలలున్ను, స్త్రీలకు వేసవిలో నాలుగు నెలలున్ను చదువు చెప్పేవారు. వ్యవసాయానికి సంబంధించిన విద్యాబోధ ఎక్కువ- తెలివి తేటలతో చదువుకొని కృషిలోకి పనికి వచ్చే వాళ్ళని పైచదువులకు వ్యవసాయ కళాశాలకు పంపే ఏర్పాట్లు కలవు. అల్లాగే కార్మిక విద్యమేలని వాటినిగురించి చదివేవాళ్ళకికూడ ప్రోత్సాహమివ్వడం, ఆయా వృత్తివిద్యలలో రగడదేరడానికి కావలసినంత సామాన్య (General) విద్య వాళ్ళకిస్తుండేవారు. చిన్నప్పుడు చదువుకోనివాళ్లు యావజ్జీవము విద్యావిహీనులుగా నుండనక్కరగాలేకుండా మంచిపౌరులనుగా విద్యనేర్పిన వారినిగా తయారుచేయడమే వీని పరమాశయము. ఈవి ద్యాలయాలు సంవత్సరానికి అయిదు నెలలు మొగవాళ్లకి, నాలుగు నెలలు ఆడవాళ్ళకి స్థాపించడంలో ఉద్దేశములు వారివారి కులవృత్తులకు వ్యవసాయాదికృషులకు అడ్డులేకుండా ఉండేటందుకే - అట్లే భారతదేశములో కూడ 6 నెలలు వ్యవసాయ సమయం వదిలి తతిమా ఆరు నెలలూ అన్ని గ్రామాల్లోను ఈ బడులు పెట్టవచ్చును. డెన్మార్కులో ఎవరవృత్తి వాళ్లకు నేర్పేఏర్పాటుకూడా ఉంది. ఈబళ్ళల్లో (Folk hock Schule) ఫోక్ హాక్ షూలె వయోజనులకు పాఠశాలల నేర్పాటు చేసే పద్దతి మొదట డెన్మార్కులో, తరువాతనే జర్మనీలో గాని, ఇంగ్లండులో గాని ఇతర పాశ్చాత్యదేశాల్లోగాని ఆరంభమయింది.

1879 సంవత్సరమున ఇటువంటి పాఠశాలలకు ప్రారంభోత్సవంచేశారు. జర్మనులు. తదాది ఈ బడుల సంఖ్య దినదినాభివృద్ధి చెందింది. ఇటువంటి పాఠశాలలు లేని గ్రామాలు లేవు. డెన్మార్కులోవలె వ్యవసాయవిద్య ఎక్కువగా చెప్పుతారు ఇక్కడకూడ. డెన్మార్కు మొ॥ దేశాల్లోని continuation Schools లేక Folk Schools లో వలె ఇక్కడకూడ నిర్బంధముగ 14 సంవత్సరము లకు 17 సంవత్సరములకు మధ్యనున్న వారి బడులకు పోయి తీరవలెను - తక్కినవారికి నిర్బంధము లేదు. వారికి ఐచ్ఛికము.

పట్టణములలోని బడులు వివిధములు. కొన్ని క్లబ్బులుగా అనేకములయిన సౌకర్యములు కలిగి ఉంటవి. చాలమట్టుకు ప్రయివేటు పాఠశాలలుగా ఉంటవి. క్లబ్బులుగా ఉండేపాఠశాలలకు గె౦డే షెమ్ (yugendsheim) అనగా “యౌవనులగృహములు" అని పేరు. ఫ్యాక్టరీలలో పనిచేసే యౌవనుల కీపాఠశాలాధికారులు వివాహాలు చేసి పయి వసతిగృహములలో వసతులిచ్చి సాయంత్రము ఉపన్యాసాలిస్తారు. మంచి మంచి బోధలు చేసి సన్మార్గులుగా చేస్తారు. వారు విద్యాభివృద్ధి చేసికొని చక్కని గేస్తులవుతారు. బెర్లినుపట్టణములో ఇల్లాంటి ప్రయివేటు సంఘములు ఆరున్కొక్కటి ఉన్నవి. ఆపట్టణము ప్రజల సంఖ్య 20 లక్షల పయిబడిఉంది. ఈ పాఠశాల పరిపాలనా నిర్మాణ మిట్టిది. సంఘమునకు సంవత్సరమునకు 2 పిల్లింగులు చెల్లించేవారు సభ్యులు వారిచే ఎన్నుకొనబడిన పరిపాలక వర్ణసంఘము యాజమాన్యము వహిస్తుంది. చిన్న, పెద్ద సంఘములు సాలుకు 15 షిల్లింగులు 20 షిల్లింగులు చెల్లించుకొని సభ్యులవవచ్చును. ఈ సంఘమునకు బెర్లినుమ్యునిసిపాలిటీవారు మొత్తము ఖర్చులో 100 కి నాలుగు చొప్పున విరాళములిచ్చి పోషిస్తారు. ఖర్చులో నూటికి రెండువంతులు రెండువంతులు చందాలు వసూలవుతాయి నూటికి 94 వంతుల ఖర్చు సభ్యులచందాలవల్లను, విద్యార్ధుల జీతములవల్లను వసూలవుతుంది. బెర్లిను పురపాలక సంఘమువారు తమ పాఠశాలాగృహములను, దీపముల ఖర్చు, సిబ్బంది ఖర్చు ఉచితముగా ఇస్తారు. ఈపాఠశాలలు మ్యునిసిపలు పాఠశాల ప్రధానోపాధ్యాయుల తణిఖీలో ఉంటాయి. ఆహెడ్మాష్టరులే ప్రొద్దస్తమును తమపిలలకు పాఠాలు చెప్పుకొని సాయంకాల సమయాల్లో ఇక్కడ ఉపన్యాసాలిస్తారు. ఈ సంఘమునడి పే బడులలో 20,545 విద్యార్థులు చదువుకొంటున్నారు. యుద్ధసమయములలో కూడ ఈబడులకు పోయేవాళ్ళసంఖ్య ఎక్కువగానే ఉండెడిది. ఈ సంఘమువారు సమర్థులైనవారిని విశ్వవిద్యాలయాధ్యాపక వర్గమునుంచి, ఉన్నత పాఠశాలోపాధ్యాయుల నుండి ఎన్ని వారి పాఠశాలలలో ఉపాధ్యాయులుగా నియమించేవారు. వ్యవసాయవిద్య, వాణిజ్యవిద్య, కార్మికవిద్యకు తగిన కృషికులు వర్తకులు, ఇంజనీయర్లు ఉపాధ్యాయులుగ ఉండేవారు.

ఈ పాఠశాలలకీ క్రిందివయస్సులవారు ఆయా వృత్తులవారు విద్యార్థులుగా ఉన్నారు.

20 ఏళ్ళ లోపువారు 100కి 13 గురుదుకాణాలమీద ఫ్యాక్టరీలమీద పనిచేసేవారు 51.8%
21 నుండి 30 ఏళ్ళవారు 100కి 41మంది ప్రభుత్యోద్యోగులు 14.4%
31 నుండి 40 ఏళ్ళవారు 100కి 23మంది కూలివాళ్ళు 11.6% ఇంజనీరు 6% ఉపాధ్యాయులు 10.2% సామాన్యవృత్తులవారు 6%

ఈ పాఠశాలలలో పరీక్షలుచేసి కావలసినవారికి సర్టిఫికేట్లు ఇస్తారు. ఉన్నతపాఠశాలా పరీక్షకు పోదలచినవారికి ప్రయివేటుగా చదువు చెప్పుతారు ఇక్కడి ఉపాధ్యాయులు. విద్యాశాఖమంత్రి ప్రత్యేకముగ “ తెలివి తేటలపరీక్ష" అనేదానిని ఏర్పాటుచేస్తాడు. ఈపరీక్ష అక్కడి "ఆబిట్యూరి యెంటెన్ పరీక్షకు సమానము. ఈ ప్రయివేటువిద్యార్థులకు ప్రతి శనివారముకూడ పరీక్షలు జరుగుతూ ఉంటాయి. అబిట్యూరియెంటెన్ పరీక్ష ప్యాసయిన వారు వాణిజ్యకళాశాల ప్రవేశార్హులు.

ఇంగ్లండులో ఈఉద్యమము University Extension Lectures గా ఆరంభించారు. విశ్వవిద్యాలయాలలోని పండితులు తమ పరిశోధనా ఫలితాలను పాండిత్యమును పామరులకుకూడ పంచి యిచ్చుటకు ఈ పద్దతి ఏర్పడినది. ఈపద్దతిని 1871 సంవత్సరమున కేంబ్రిడ్జిలో ఆరంభించినారు. దానిని ఇతర విశ్వవిద్యాలయాలవారు అనుకరించ మొదలెట్టారు. క్రమాభివృద్ధి జరిగి అన్ని చోట్ల ఈ పద్ధతి అమలులో ఉంది. ఎక్కువగా కార్మికులు ర్షకులు ఉండే పట్టణాలలో ఈప్రచారము బాగా జరుగుతోంది. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య నెక్కువ చేర్చుకోవడము వల్ల విద్యలో అభివృద్ధి కనబడదనిన్నీ అక్కడి ప్రొఫెసర్లు తమ అభిమాన విషయాలను ప్రజలలో ప్రబోధించిననాడే వాని ప్రయోజన మధికమగుననిన్నీ హాట్టెనుగారి అభిప్రాయము - ఆవిధంగానే విశ్వవిద్యాలయముల వారు జరుపుతున్నారు. అట్లే భారతదేశములో కూడ విశ్వవిద్యాలయాలవల్ల ఈ పని జరుగునని పలువురు ఆశయాలుకాని ఎక్కువ ఆశాజనకముగ అదిలేదు. ఇప్పుడు సి.ఆర్.రెడ్డిగారి అభిప్రాయమిట్లే 'వయోజనవిద్య వ్యాప్తి చేయవచ్చునని. స్వీడ౯, నార్వే మొదలగు దేశాలవారుకూడ ప్రస్తుతము స్కూళ్ళ అభివృద్ధికి పాటుపడుతూన్నారు. ప్రభుత్వములు వీటిని పోషిస్తూఉన్నాయి.

హిందూదేశం

మన దేశములో విద్యాభివృద్ధికి కారణభూతాలయిన వయోజన విద్యావ్యాప్తి పాఠశాలలుగాని, గ్రంధాలయోద్యమముగాని అంతగా అభివృద్ధి చెందలేదు. వేదకాలమునుండి విదేశప్రభుత్వము వచ్చేవరకు గ్రంథాలయోద్యమము ఆదరింపబడేటటే వేదాధికారము లేనివారికి మన పండితులు తమ సాండిత్యాన్ని పురాణాలవల్ల, భాగవతులు నాటకాలవల్ల, పాటగాళ్లు తమపాటలవల్ల, తత్వాలవల్ల, పగటి వేషాలవల్ల బోధచేస్తూ విజ్ఞానవంతులను చేసేవారు. పాశ్చాత్య పరిపాలనలో పైవానికి ఆదరణలేక పోవడంవల్ల విద్యావ్యాప్తి అరికట్టింది. మెకాలే కాలంలో 100 కి 5 గురు చదువుకొసేవాళ్లుంటే ఇప్పటికి 9.4% చదువుకొనే వాళ్ల సంఖ్య పెంచామని ప్రగల్భాలు చెప్పుతారు. ప్రభుత్వం, ఇతర దేశాలలో చదువుకొన్న వారి సంఖ్యచూస్తే ఎంత అడుగున ఉన్నామొ తెలుస్తుంది. గ్రంథాలయాలకు గ్రాంటులు లేవు. వయోజనవిద్య సంస్థలకు విరాళాలు లేవు. ఎల్లా అభివృద్ధి అవుతుంది విద్య నేర్చిన వారిసంఖ్య? మెకాలె పైగా విద్యాధికులను సంస్కృతపద్దతివిద్య నడుగంటించి కొద్దిగా తయారు చేస్తే వాళ్లవల్ల పాశ్చాత్యవిద్య వ్యాప్తి అవుతుందన్నాడు. (Filtration theory) వడపోత పద్దతి అంటారు దీన్నే. కాని గోపాలకృష్ణ గోఖలే వంటివాళ్లుమాత్రము ఈ సమస్యలనుగూర్చి శ్రమ తీసుకోక పోలేదు. Besant Home Rule League రోజుల్లో గ్రంధాలయాలకి కాస్తఆదరణ ఎల్లాకలిగిందో అల్లాగే గోఖలే కాలంలో వయోజన విద్యా సమస్య, నిర్బంధ ప్రాథమిక విద్యా సమస్య లేవదీయబడ్డాయి, ఆ మహానుభావుడు అస్సెంబ్లీలో ఇటువంటి తీర్మానాలను ప్యాసు చేయించాడు. కాని ఆచరణలో పెట్టి ఉద్యమాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వము ప్రజలుకూడ తోడ్పడాలి.

ఈవిధంగా ప్రభుత్వమువారు తోడ్పడిన సంస్థలు ఇండియాలోకల్లా బరోడా సంస్థానమె మొదటిది. గ్రంధాలయోద్యమానికీ వయోజవిద్యకు ఆ మహారాజు ఖర్చుపెట్టినంత ఎవరును ఖర్చు పెట్టలేదు. అమెరికానుండి ప్రవీణులను తెప్పించి గ్రంధాలయోద్యమాభివృద్ధికి తోడ్పడి సంచార గ్రంధాలయములను స్థాపించి, జిల్లా, తాలూకా గ్రంధాలయములను పెట్టి ఇతరప్రోత్సాహకరములయిన పనులను చేసి అనేకులను విద్య నేర్చునట్లు చేసినాడు. అట్లే వయోజన విద్యావ్యాప్తికి తోడ్పడెను. నిర్బంధ ప్రాథమికవిద్య జయప్రదంగా సాగించుచున్నాడు. అతడే విద్వత్ప్రభువనదగును. సాండూరు (Sandor) ప్రభువుకూడ తన సంస్థానంలో వయోజనవిద్యను నిర్బంధము చేస్తున్నానని మొన్న ఆమధ్య ప్రచురము చేశాడు. ఇతర సంస్థానాలో అంతకంతే.

వివిధ రాష్ట్రాలు

ఇక మనరాష్ట్రములలో ఈ పని ఎంతవరకు జరుగుతున్నదీ విచారిద్దాం. అన్ని మత సాంఘిక రాజకీయ ఉద్యమాలతోపాటు విద్యా వ్యాపనవిషయంలో కూడ బెంగాలు రాష్ట్రానిదే మొదటి ప్రయత్నము. అక్కడగల గ్రామ సబురిజిస్ట్రారులను వాళ్లకుగల తీరిక కాలములలో వయోజన విద్యావ్యాప్తికి నియమించారు. వయోజనులకు నిత్యజీవనంలో కావలసిన విజ్ఞానాన్ని బోధిస్తారు. కర్షకులకు కార్మికులకు కావలసిన విషయములను ఉపన్యసిస్తారు. ఆరోగ్యము, వృత్తులకు కావలసిన చదువు, సహకార మును గూర్చి, లోకజ్ఞానము, పశుపాలన, వాణిజ్యాదులను గూర్చిన విషయము లెక్కువగ ఉంటాయి. దీనపత్రికలను చదివి లోకవార్తలను తెల్పుడుచేస్తారు. ఏ శాఖలో ఉండే ఉద్యోగులు ఆయాశాఖల ఉపయోగమును ప్రజలేవిధముగ గ్రహించవలెనో, తమనుండి ఎట్లు పనిగొనవలెనో తెల్పుచు వానిని గూర్చి ఉపన్యసిస్తారు. మాజిక్ లాంతర్ల సహాయంతో ఉచితంగా 1939 అక్టోబరులో అమృతబజారు పత్రికా సంపాదకులు గ్రామాలకు వెళ్ళి వయోజన విద్యావ్యాప్తికి పూనుకున్న వంద వంగ యువకుల నుద్బోధించి పంపారు. అక్కడనున్న Calcutta University Institute of Adult Education Committee వారిచే ఈ పైసభ ఘోషుగారి అధ్యక్షతను ఏర్పాటు చేయబడెను. ఇట్లే యువకులనెన్ని పంపి, ప్రబోధము చేయించి, తరగతుల నేర్పాటుచేయించి ప్రొఫెసర్ల సాయమున దీన్నినిర్విఘ్నముగా కొనసాగిస్తోందీ కలకత్తా విశ్వవిద్యాలయమందలి ఈ ఉపసంఘము.

పంజాబు విద్యామంత్రిగారగు మియాన్ అబ్దుల్ హై గారు ఈ సమస్య పట్ల శ్రద్ధవహించి ముల్తాన్ జిల్లా మీకుంలషీద్ మున్నగుచోట్ల ప్రబోధములు చేసి ముల్తాన్ జైళ్ళలో వారియందలి నిరక్షరాస్యతను 'నిర్మూలించుటకు కృషి చేయుచున్నారు సంయుక్త రాష్ట్రంలోని స్కీము ఉత్తమమైనది. రాష్ట్రంలోని స్థానికసంస్థల పోషణలోనున్న లక్షమంది ఉపాధ్యాయులను వారి వారి గ్రామములలో వయోజన విద్యావ్యాప్తి చేయవలసినదిగా ఆయా స్థానిక సంస్థలద్వారా తాఖీదులు పంపి, ప్రతిఫలము మట్టచెప్పడం వారు చూపే శ్రద్ధమీద, తయారుచేసే అక్షరాస్యుల సంఖ్యమీద ఆధారపడి ఉంటుందని, స్పర్ధతో పనిచేసేందుకు పాఠశాలోపాధ్యాయుల ప్రోత్సాహపెట్టారు. ఇతరులు గౌరవోద్యోగులుగా దీనిలో పనిచేసి, 1 ఆక్షరాస్యుని తయారుచేస్తే రు1 ఇస్తామన్నారు. 1939 సంవత్సరపు బడ్జెటులో 2 1/2 లక్షలు వయోజనవిద్యకోఱకు ప్రత్యేకించారు. ఈ ఉద్యమాన్ని నడి పేటందుకు య౯.య౯. చతుర్వేదిఅనే ఆయన ప్రత్యేకోద్యోగిగా నియమింపబడ్డాడు. గ్రామాల్లో 750 సంచార గ్రంథాలయాలు 3600 పఠన మందిరాలు ప్రారంభించి అందులో 1 హిందీ 1 ఉర్దూ వారపత్రికలు, మరికొన్ని సంచికలు పఠనాలయానికిగా 2000 పుస్తకాలు గ్రంథాలయానికి ఇవ్వడానికి ఏర్పాటు - జనసామాన్యంలో 'పుస్తకాలు విరివిగా చదవండి' అని ఉన్న కరపత్రాలు పంచుతున్నారు. పోష్టరుకమిటీ పెట్టి ఉత్తమ జీవితపద్ధతి, విద్యాప్రచారము గావించే పోస్టర్లు తయారు చేయిస్తున్నారు. సులభమయిన ప్రజాభాషలో 'పుస్తకాలు వ్రాయించి బహుమానాలు ఇస్తూన్నారు. 1000 రామాయణ ప్రతులను పదిఏళ్ళవరకు ఇవ్వడానికి ఛటారినవాబు వాగ్దానం చేశాడు. ఉర్దూశతకాలు పంచిపెట్టారు. ఈ విధంగా ప్రభుత్వము, విద్యాధికులు, నవాబులు ఈ ఉద్యమానికి ప్రోత్సాహమిస్తున్నారు.

సింధులో 1500 వయోజన పాఠశాలలు పెట్టగా 1000 ఉపాధ్యాయులు స్వచ్ఛంద సేవకోద్యోగులుగా చేరారు. రాత్రిపాఠశాలకు 10000 పలకలు 20000 పుస్తకాలు 20 వేల లాంతర్లు సప్లయి చేశారు. గవర్న మెంటు ఆఫీసులలో నిరక్షరాస్యులందరు 6 నెలలలో అక్షరాస్యులవాలని, జైళ్ళ డైరక్టరులకు, పోలీసు సూపరెండెంటులకు వారివద్దనున్న నిరక్షరాస్యులను అక్షరాస్యులనుగా 6 నెలలో చేయాలని కోరబడ్డారు. స్థానిక సంస్థలు సాయంచేశాయి.

మధ్యరాష్ట్ర బీరారు రాష్ట్రాల ప్రభుత్వమువారు స్థానిక సంస్థల తోడ్పాటుతో వయోజనపాఠశాలల "నేర్పాటుచేశారు. నేసవి వర్షాకాలములలో ఒక 5 నెలలు ఈ పాఠశాలలు పనిచేయవు, డిప్యూటీ ఇ౯ స్పెక్టరు సిఫార్సుపై ప్రభుత్వవిరాళాలు ఆధారపడి ఉన్నాయి.

ఒరిస్సా ప్రభుత్వము, విద్యాశాఖమంత్రి అధ్వర్యముని రాష్ట్రీయ విద్యాకమిటీ ఏర్పాటయి అక్షరాస్యతా ప్రచారమును గూర్చి చర్చించి కేంద్రములను స్థాపించి పుస్తకాలకు, పలకలకు, లైట్లకు,పత్రికలకు విరాళముల ప్రభుత్వము ఇచ్చారు. ప్రత్యేక ఉద్యోగి కలదు. లేబ్రరీల పెట్టే అలోచన ఉంది. 1939 అక్టోబరు 5వ తేదీన అఖిల ఉత్కళ నిరక్షరాస్య దినమును జరిపి ప్రదర్శనములు గావించి సభలు జేసి ప్రచారములు చేశారు.

అస్సాంలో కాంగ్రేసుకోయలిషాను పార్టీ ఉపసంఘము కొన్ని సూచనలలో ప్రతి సబ్ డివిజన్ లోను కేంద్రములు పెట్టి వయోజన విద్యాప్రచారమునకు తీర్మానించిరి. అస్సాం ప్రభుత్వము దానిని 1940 లో ఆచరణలో పెట్టారు.

బోంబాయిరాష్ట్రములో వయోజన విద్యావ్యాపనకు త్రైవార్షిక ప్రణాళిక కావాలని ప్రభుత్వము వారు స్థానిక రాష్ట్ర సంఘములను కోరినారు. విద్యార్థులు గుజరాతులోకూడి ఇందుకై శ్రద్ధచేయాలని తీర్మానాలను చేశారు. ప్రభుత్వము బోంబాయి నగరమునకు అక్షరాస్యత ఉద్యమతణిఖీ దారు నేర్పాటుచేశారు. 16 రోజులలో 10 వేలమందికి సులభశైలి పుస్తకాలు పెట్టించారు. (నిరక్షరాస్యత అసలు పుట్టకుండ చేయవచ్చునని రాష్ట్రీయసంఘము కార్యదర్శి పట్టుదల) వీరిలో మధ్యవయస్సువారు,ముసలివారు ఉన్నారు. భయ్యాకులస్థు లెక్కువ. ప్రభుత్వము గ్రంథాలయోద్యమాభివృద్ధికి 50 వేల రూపాయల వాగ్దానము చేసింది, సర్.సి.వి. మెహతాగారు గుజరాతు గ్రంధాలయోద్యమానికి పది వేలరూపాయల విరాళమిచ్చారు. బొంబాయి ప్రభుత్వము, బీహారు ప్రభుత్వము సుమారు మూడు సంవత్సరములుగా ఈ యోజనవిద్యావ్యాప్తికి అమోఘంగా చేస్తున్నపనిచూస్తే ఆశ్చర్యచకితులయి యితరరాష్ట్రాల వారంతా వారిని అనుకరించవలసినదే.

బీహారు విద్యాశాఖమంత్రి మహమ్మద్ సయ్యద్ సాహేబుగారిదే అగ్రస్థానము. ఈ ఉద్యమములో, వారి నిరంతర సేవాపరాయణత్వమువల్ల ఆ రాష్ట్రములో విద్యలేనివారు అరుదు. బి.జి.భేరుగారు (బొంబాయి మంత్రి) కూడ మహమ్మద్ గారి సైదోడే - బీహారు విద్యాశాఖమంత్రి ప్రోత్సాహముతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇందుకు నడుము కట్టారు. 1938 ఏప్రియల్ 28 ప్రారంభించి ఎన్నో కేంద్రాలుపెట్టి పుస్తకాలు, ఛార్టులు, ధర్మంగా సప్లయి చేశారు. స్థానికసంస్థలు ఆగంతుక వ్యయాలను, ప్రభుత్వం 80 వేల రూపాయలు, పౌరసంఘాలు తమ పరిశ్రమను ఇందుకు సమర్పించాయి. ప్రత్యేకఉద్యోగికి సాయము చేయుటకు విద్యాశాఖోద్యోగులు నియమింపబడ్డారు. 5 నెలలలో 3 లక్షలు అక్షరాస్యులయినారు. హరిజనులలో 100 కి 30 మంది, మహమ్మదీయులు 100 కి 20 మంది, స్త్రీలు అక్షరాస్యులయేటట్టు చేస్తే మాసానికి రు 10000 లు ఇస్తామన్నారు. జైళ్ళలో ఈఉద్యమం అభివృద్ధి చెందుతున్నది. గ్రంధాలయాలు, పఠనాలయాలు పెట్టి ప్రతివ్యక్తి నుండి చందాలున్ను ప్రభుత్వం 2 లక్షలు గ్రాంటుయిచ్చారని దీని ఫలితంగా 6 లక్షలకు అక్షరజ్ఞానం కలిగినట్లు తెలుస్తోంది.

మద్రాసులో గ్రంధాలయోద్యమానికి వయోజనవిద్యావ్యాప్తికి చక్కనికృషి జరిగినరోజులు కొన్ని ఉన్నాయి. అప్పట్లో గ్రంధాలయోద్యమానికి సాలుకు 50 వేల విరాళము లిచ్చారు. 20, 17, 10, 5 వేలలోకి కృశించి ఇప్పుడది పూజ్యమయినది. ఆరోజులు 1920 ప్రాంతమువి. 1928 ప్రాంతములో మద్రాసు విశ్వవిద్యాలయమువారు వయోజన విద్యావ్యాప్తికి కొన్ని Extension lectures ఏర్పాటుచేశారు. కేంబ్రిడ్జి మొ| చోట్ల ఇట్టి పద్ధతే ఉన్నది. కేంబ్రిడ్జి విద్యార్థి కట్టమంచివారి పాలనలో కూడ ఆంధ్రవిశ్వవిద్యాలయ మీపనికి పూనినది. ఈ ఉపన్యాసాలు కొన్ని కొన్ని పట్టణాల్లోను పెద్ద గ్రామాల్లోను ఏర్పాటులు అవుతవి. ఈ ఉపన్యాసాలవల్ల ఉపయోగము బహుతక్కువని చెప్పవచ్చును. కాలేజి లెక్చరర్లను పిల్లలను తీసికొని సెలవులలో గ్రామాలకుపోయి అక్కడ ఉపన్యాసాలిచ్చిన కొంతమంది పని జరపవచ్చును కాని ఆమాత్రపువారు మేస్టర్లలో లేదు. విద్యార్ధుల లోను మృగ్యమే. కాని విద్యార్థిసంఘాలు ప్రస్తుతము పనికి పూనుకొనుట ముదావహము.

మన రాష్ట్రీయప్రభుత్వ మీ విషయములలో చేసిన ఉపకారము సున్న. సి. రాజగోపాలాచారి, ఎ.కాళేశ్వరరావుగారలు వయోజనవిద్య కుపకరించే గ్రంధాలు వ్రాశారు కాని స్థానిక సంస్థలే ఎక్కువ సాయముచేయగలవనే సమాధానాలతో కాలక్షేపంచేశారు. ప్రభుత్వం మాత్రము కొన్ని ట్రెయినింగు పాఠశాలలలో రాత్రిళ్ళు ఈ పాఠశాలలు పెట్టించి పనిచేయుచున్నది. కొందరు దేశోపకారపారీణులు సొంతముగ పెట్టిన్నీ కొన్ని సంస్థల యాజమాన్యమున వీనినిజరిపిన్నీ కొన్ని గ్రంధాలయములు దీనినినడిపిన్నీ పుణ్యము కట్టుకుంటున్నాయి. ఆంధ్రదేశములో ఈ ఉద్యమప్రచారము విషయములో ఎక్కువగా పనిజరిగింది. శ్రీ భోగరాజు పట్టాభిని తారామయ్య గారి అధ్యక్షతను చాగల్లులో ఆంధ్రదేశ వయోజన విద్యాసభ సమావేశమై సంఘ మేర్పరచబడింది. తాడేపల్లిగూడెంలో గ్రామపునర్నిర్మాణ పాఠశాలలు,నిడుబ్రోలు వగైరాచోట్ల వసంతవిద్యాలయాలు ప్రారంభింపబడి పనిచేసినవి. ప్రత్యేకవ్యక్తులు తమ సరళమైన రచనలచేత, సుబోధకములయిన ఉపన్యాసముల చేత సేవచేయుచు విద్యావ్యాప్తి చేస్తున్నారు. మద్రాసు వై.యం.సి.ఎ., మద్రాసు, ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘములు - రెండవదాని శాఖలు మ్యాజికులాంతర్లతో నైతిక, సాంఘిక, చారిత్రక, రాజకీయ, ఆర్థిక, ఆరోగ్య, మతవిషయాదులపై సుబోధములు చేస్తున్నారు. మద్రాసులో అమ్ము స్వామినాధన్ సతివంటివాళ్ళు అక్కడ సభలు పెట్టించారు.

తెలిసికోదగ్గ కొన్ని సంగతులు

1938 సంవత్సరములో మన దేశంలో వయోజన విద్యాసంఘము స్థాపన జరిగినది. ఈ హిందూదేశ వయోజన విద్యాసంఘము (Indian Adult Education Association) కొన్ని దేశాభ్యుదయకరములైన కార్యములకు పూనుకొన్నది. ధనముకొరకు ప్రయత్నములు జరుగుతున్నాయి. దేశస్టులకు చదువను, వ్రాయను నేర్పటానికిన్నీ, వ్యవసాయాది విషయముల బోధించుటకున్ను జరుగుతున్న కృషిలో ముఖ్యమైనది రేడియో ద్వారా వ్యవసాయ ప్రసంగములు నేర్పాటుచేయుట. ఇప్పుడు మద్రాసు రేడియోలో అనుదినము అర్ధగంట వ్యవసాయపద్ధతులపై ప్రసంగం జరుగుతుంది. ఇటువంటి ఉపయోగకరములైన ప్రసంగములు ప్రతి రేడియో స్టేషను నుండి పంపబడుటకు యత్నిస్తున్నారు.

జర్మనీ దేశంలోని సంవత్సరంలో అయిదు నెలలు, నాలుగు నెలలు ఈ పాఠశాలలు పనిచేస్తాయి. అల్లాగే మనదేశంలో ఊడ్పులు, కోతలు, కుప్పనూర్పులు మొదలగువాటికి 6 నెలలు మినహాయించి తతిమ్మ అర్ధసంవత్సరములో ఈపాఠశాలలు ముమ్మరంగా పని చేసేటట్లు ప్రజలు ప్రభుత్వం తలుచుకోవాలి. విరాళాలు ఇచ్చి వృద్ధిచేయవలసినది ప్రభుత్వము. దాని ఉపయోగాన్ని గుర్తించి బద్ధకించకుండా చదువు నేర్చుకొని యధాశక్తిగ చందాలిచ్చి ఆదరించవలసినది ప్రజాసంఘము.

వేరేపాఠశాలలు స్థాపించబడనక్కరలేదు. గ్రంథాలయములను, గ్రామపాఠశాలలను దీనికుపయోగించి వేతనమిచ్చిన గ్రంథభాండారులను, ప్రాథమిక పాఠశాలోపాధ్యాయులను, ఈ పాఠశాలలలో పనికూడ చూడమనవచ్చును. జర్మనీలో ఇట్లే పాలింపబడుచున్నవి. పరిస్థితులనుబట్టి స్వల్పవేతనముల నిచ్చుట మేలు.

జర్మనీ, డెన్మార్కు మున్నగు దేశములలో అవలంబింపబడుతూన్న పద్దతి మనకును అవశ్యాచరణీయము. వారు సామాన్యవిద్య నేర్పి ఏదో ఒక వృత్తి విద్య పారిశ్రామిక విద్య నేర్పుతారు. అల్లాగే మనము ప్రణాళికలను ఏర్పాటు చేసికోవచ్చును. ఈ ప్రణాళిక గాంధీగారి వాగ్దావిధానానికి సన్నిహితసంబంధి అవుతుంది కూడ. ముఖ్యంగా వయోజనులకు మనస్తత్వమును గ్రహించి బోధించే ఉపాధ్యాయులు కావలెను. వారికి సులువుగా బోధించే పాఠ్యపుస్తకములు, పరికరములు, ప్రదర్శన సామానులు కావాలి. వయోజనులకు ఏమియు నొప్పికల్గించు మాటల ననకూడదు. విషయమును అనేక పర్యాయములు చెప్పరాదు. ఇట్టిపద్దతులను పాటించి నడపిన మనదేశమున ఈ ఉద్యమము దిగ్విజయము కాకమానదు.

ఈమధ్య ఆంధ్రదేశగ్రంథాలయ సంఘమువారు 22న ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభలో ఏర్పాటుచేసిన వయోజన మహాసభవల్లను, 1941 అగష్టు 24 వ తేదీని ప్రత్యేకముగా శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమరావుగారి అధ్యక్షతను మాజీ మద్రాసు మంత్రి డాక్టరు పి.సుబ్బరాయను గారిచే ప్రారంభింపబడిన ఆంధ్రదేశ వయోజనవిద్యా మహాసభవల్లను ఈ ఉద్యమమునందు ఆంధ్రులు ఎంత ఉత్సాహము శ్రద్ధాభక్తులు చూపుచున్నది విదితమగును. ఇంకను శ్రీ గోపరాజు రామచంద్రరావు, పాతూరి నాగభూషణం గార్ల వంటి కొందఱు సంఘసేవా పరాయణులు వయోజనవిద్యాలయముల నేర్పాటుచేయించి, వయోజన విద్యామహాసభలను జరిపించి చేయుచున్న సేవ ప్రశంసనీయము. విద్యార్థిసంఘములీ విషయమై చూపుచున్న పూనిక చిరస్థాయియై ఉద్యమమునకు మేలు కలుగగలదనియు, ఈ విజ్ఞానవ్యాప్తి ప్రయత్నమునకు గొప్ప భవిష్యత్తు కలుగగలదనియు భావింపవచ్చును.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse