Jump to content

ఆంధ్ర గ్రంథాలయం/సంపుటం 2/సంచికలు 3, 4/వయోజన విద్యాప్రణాళిక

వికీసోర్స్ నుండి

వయోజన విద్యా ప్రణాళిక[1]

శ్రీ గోపరాజు రామచంద్రరావు, ఎం.ఏ.

నిరక్షరాస్యతలో మునిగివున్న భారతదేశంలో వయోజనవిద్యావ్యా ప్తియొక్క ఆవశ్యకతను గూర్చి వేరే చెప్పనక్కరలేదు. కీర్తిశేషులైన గోపాలకృష్ణ గోఖలే కాలంనుంచీకూడా విద్యావ్యాప్తి సంఘ సమస్యగా వస్తూవున్నది. వ్యక్తులు, చిన్న చిన్న సంఘాలు, ఈవిషయమై కృషి సల్పుతూనే వున్నాయి. ఆంధ్రదేశంలో 1929 నుంచి వయోజనవిద్యాప్రచారం మొలకలెత్తుతున్నట్లు తెలుస్తుంది. ప్రజాప్రతినిధుల ప్రభుత్వవిధానాలు భారతదేశంలో ప్రవేశించుతున్నకొద్దీ దేశాభివృద్ధికి అక్షరాస్యత అవుసరమని స్పష్టపడుతోంది. అంచేత దేశాభిమానులందరు తమతమ శక్తికొలది వయోజనవిద్యా ప్రచారం చేస్తూనేఉన్నారు. క్రిందటి సంవత్సరం యీ ప్రచారం విరివిగా సాగింది. ఈ ఉద్యమంలో పాల్గొన్న సంఘాల యొక్క, వ్యక్తులయొక్క పని శ్లాఘనీయం. ఇట్లు అక్కడక్కడ సల్పిన కృషిని కేంద్రీకరించి వారిలో వారికి సహకారం నెలకొల్పుటవల్ల, అందరు కలిసి సంస్థగా ఏర్పడి, సంఘబలంవల్ల వారిఆశయాన్ని త్వరగా నెరవేర్చుకోగలరు. ఈరోజున ఆంధ్రదేశగ్రంథాలయ సంఘ యాజమాన్యాన జరుగుచున్న ఈసమావేశం యీవిధంగా వయోజనవిద్యావ్యాప్తికి విస్తారంగా తోడ్పడుతోంది.

ఇంతవరకు వేరు వేరు స్థలాల్లో ఒక్కొక్కప్పుడు వేర్వేరు విధానాలతో మన మందరం వయోజనవిద్య కొరకు పనిచేసివున్నాం. మనకు యీ విషయమై వేరు వేరు అనుభవాలుకూడా వున్నాయి ఇకమీదట మనమందరం ఒకేసంస్థకు చెంది ఒకే ఆశయం కొరకు పాటుపడాలి. కనుక ఒక విధానం అవలంబించాలి. మనమాలోచించి దానిని నిర్ణయించుకునేముందు ఆధారంగా యీప్రణాళికను మీముందు బెట్టుచున్నాను. "మొదటి మన ఆశయం ఏదో నిశ్చయం చేసుకొని, దానికి తగు విధానం నిర్ణయించుకోవాలి.

ఆశయం

తన సమస్యలను గురించి తాను స్వతంత్రంగా ఆలోచించుకోనేటట్లు వయోజనులను తయారు చేయడమే యీ విద్యాప్రచారం యొక్క ఆశయమని అనవచ్చు. కాని యిట్టి నిర్వచనం స్పష్టంగా వుండదు. దానిని మరింత స్పష్టంగా చేయాలంటే దానిని రెండుభాగాలుగా తీసుకోవచ్చు. (1) వార్తాపత్రికలను చదివి అర్థం చేసుకోగలుగుట.(2) శాసనసభలకు అక్ష రాస్యత ఓటు హక్కును కలిగియుండుట. ఏ రెండి౦టి వల్లా అతడు ఒక వైపు స్వతంత్ర ఆలోచన పెంపొందించుకొంటూ యింకొకవైపు దేశాభివృద్ధియందు తనకుగల బాధ్యతను నిర్వహించుకొనుచుండును. ఈ రెండింటి ఇట్టి ఆశయాన్ని నెర వేర్చుకొనుటకు అక్షరాస్యత అవుసరమగును. అక్షరాస్యతను ప్రభుత్వ శాసనం ద్వారా కలిగించవల- సిందేగాని యితర సంస్థలవల్ల విశేషంగా కలుగలేదని, వినికిడివల్లనే ప్రజల్లో జ్ఞానోదయం విరివిగా కలిగించవచ్చునని కొందరి అభిప్రాయం. నిజమే. ప్రభుత్వ శాసనసహాయం లేనిదే అక్షరాస్యత కలిగించుట సులభ సాధ్యం కాదు. వినికిడివల్ల విరివిగా విషయజ్ఞానం కలుగును. మన దేశంలో ప్రబలుతూవున్న జాతీయోగ్యమం యొక్క భావప్రచారం యీవిధంగానే జరుగుతోంది. కాని అట్టిభావాలకు స్థిరత్వమేర్పడాలంటే, అక్షరాస్యత తప్పనిసరియగుచున్నది. కనుక తగుశాసనంకొరకు ఒకవైపు ఆందోళసజరుపుచూ, ఆశాసనంకొరకు వేచియుండి కాలయాపన చేయక, యింకొకవైపు ఏస్వల్పంగానైనా అక్షరాస్యతకొరకు పాటుపడాలి.

విధానం

పై ఆశయాన్ని నెరవేర్చుకొనుటకుగాను వయోజనవిద్య రెండువిధాలుగా వుండాలి. (1) అక్ష రాస్యత (2) ఉపన్యాసాలవల్ల విషయజ్ఞానం నెలకొల్పుట. దీని కొరకై మనం ఆరువిషయాలపై ఆలోచించాలి.

(1) అక్షరాస్యత కల్పించగల్గు పుస్తకాలు (2) ఉపన్యాసవిషయాలు. (8) పాఠశాలలు పెట్టుటకుస్థలం, కాలనిర్ణయం (4) పాఠశాలకు కావలసిన పరికరాలు (5) ఉపాధ్యాయులు—వారిశిక్షణ (6) వైవిధానాన్ని అమలుపర్చుటకు కార్యనిర్వాహక సంఘం.

(1) అక్షరాస్యత కల్పించగలపుస్తకాలు:- బాల బాలికలకంటే వయోజనులకు ఎక్కువ విషయజ్ఞానం, గ్రహణశక్తి వుండుట చేత, వీరిలో అక్షరాస్యత నెలకొల్పుటకు వేరురకాలపు స్తకాలు కావలసివున్నాయి. ఈ వుద్దేశ్యాలతో శ్రీ గాడిచర్ల శ్రీ) హరిసర్వోత్తమరావుగారు, శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావుగారు, శ్రీ సుందరంగారు యింకాకొందరు వేరు వేరు పుస్తకాలు వ్రాశారు. అక్షరాలు నేర్పుటకు వారు వేరు వేరు విధానాలుకూడా అవలంబించారు.(౦) సున్నా, (ఁ) అరసున్నాలతో అక్ష రాల్ని ఏర్పర్చుట, సులభమైన అక్షరాలు మొదట నేర్పుట, బొమ్మల బట్టి అక్షరాలు నేర్పుట, అక్షరాలు క్రమంగానే నేర్పుట, యిట్టి విధానాలు అవలంబింప బడ్డాయి. అనుభవాన్ని బట్టి చూడగా ఒక్కొక్కచోట ఒక్కొక్క విధానం బాగాపని చేస్తోంది. ఇదివరకు లేబరు డిపార్టుమెంటు పాఠశాలలున్న స్థలాల్లో, అక్షరాలు వ్రాయగలుగుట కష్టంగా లేదు. అక్షరాల పోలికే తెలియని కొన్ని కొన్ని సంఘాల్లో సున్నా పద్ధతి బాగావుపయోగ పడుతోంది. అంచేత యీ రెండు విధానాలు ఉపాధ్యాయుడు నేర్చుకోవాలి. అక్షరాస్యత పుస్తకాల్లో వుండు పాఠాలు, మాటలు, పత్రికావిషయ జ్ఞానానికి చెందినవైతే బాగుండునని తోస్తోంది.

(2) ఉపన్యాసవిషయాలు:- వయోజన విద్యాప్రచారం, ఉపన్యాసాలయొక్క వుపయోగం చాలా విస్తారంగావుంది. అంచేత కనీసం 40 ఉపన్యాసాల కైనా విషయాలు నిర్ణయించాలి. ఇందుకుగాను శ్రీ శనివారపు సుబ్బారావుగారు వ్రాసిన 'వయోజనవిద్య' అను పుస్తకం సహాయంగా వుండును. ఇందులో వారిచ్చిన విషయాలు విస్తారంగా ఆర్థిక, రాజకీయ, సాంఘిక విషయాలకే చెందివున్నాయి. వాటికి భూగోళశాస్త్రం, ప్రపంచ చరిత్ర, భౌతిక విజ్ఞ నాలకు చెందిన విషయాలు కూడా చేర్చాలి. ఒక్కొక్క తరగతికాలం 4 నెలలు వుంచుటమంచిది. దానికి తగినట్లు వుపన్యాసాలుకూడా 50 కి మించకుండా వుంటం మంచిది.

(3) పాఠశాలలు పెట్టుటకు స్థలం, కాలనిర్ణయం:- మాగానిఊళ్లలో ఆగష్టు మొదలు నవంబరువరకు వయోజనులకు తీరిక సమయం. పారిశ్రామిక ప్రదేశాల్లో రాత్రులు 7 గంటలు అయినతరువాత తీరిక వుండును. మెరక పంటలున్న ప్రాంతాల్లో కూడా రాత్రుళ్లు తీరిక వుండును. అంచేత ఆయాప్రాంతాలకు తగినట్లుగా పగలుగాని రాత్రిగాని పాఠశాలలు జరపవచ్చు. ప్రతిరోజు 1 1/2 గంట లేక 2 గంటలు విద్య గరపవచ్చును. స్థలం, రాత్రుళ్లయితే ఒరుపురోజుల్లో బహిరంగంగా పాఠశాల జరపవచ్చును. సాధ్యమైనంతమట్టుకు అందుబాటులో స్థలం వుంచుట మంచిది. గ్రామపుస్తక భాండాగార భవనాల్లోగాని, బోర్డు ప్రాధమిక పాఠశాలా భవనాల్లోగాని, గ్రామ చావిళ్లలోగాని వారివారి అనుమతిపొంది నడుపవచ్చును.

(4) పాఠశాల పరికరాలు:- అక్షరాస్యతకు బ్లాకుబోర్డు, పలకలు, పుస్తకాలు, దీపాలు ముఖ్యంగా కావాలి. ఉపన్యాసాలకు మ్యాపులు, గ్లోబు, మాగ్నెటు,ఉష్ణమానిని మొదలగు కొన్ని పరికరాలు అవుసరం. వీటికి కావలసిన ధనాన్ని ముందు గ్రామప్రజలనుండి విరాళాలుగా సంపాదించాలి. ఉత్సాహం పెంపొందిన కొద్దీ విద్యార్థులే తమ తమ పుస్తకాలు, పలకలు జతపర్చుకుంటారు. అంతకంతకూ పంచాయతీబోర్డు, సహకార సంఘాలు, జిల్లాబోర్డునుంచి విరాళాలు పొంద వచ్చును. గవర్నమెంటు గ్రాంటుకూడ పొందుటకు అవకాశాలు కలవు.

(5) ఉపాధ్యాయులు:- ఏ విద్యావిధానంలోనైనా, ఉపాధ్యాయుడు చాలా ముఖ్యం. విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించుటకన్న, ఉత్సాహం కల్పించుటే యితని ముఖ్యమైన పని. ఉపాధ్యాయునికి రెండు యోగ్యతలు అవుసరం.

(1) ఉత్సాహం పుట్టించగల్గుట. దీనికని అతనిలో కార్యదీక్ష కావలసియుండుటే గాక, విద్యార్థులతో కలసి మెలసి వుండుటకు ఏ విధమైన సంకోచం వుండకూడదు. అనగా అతడు కులతత్వ భేదాలను పాటించరాదు. మరియు నాస్తిక దృక్పధం ఇందుకు తోడు కాగలదు.
(2) ప్రస్తుతం సామాన్య పాఠశాలల్లోవున్న విద్య విజ్ఞానాన్ని యిచ్చుట లేదు. అంచేత వయోజన విద్యాప్రచారానికై ఉపాధ్యాయులుగా నుండగోరువారు కొంత ప్రత్యేక శిక్షణ పొందుట అవుసరంగా తోస్తోంది. దానిలో అక్షరాస్యత గరపు విధానాలు, ప్రత్యేక వుపన్యాసాలు యిచ్చుటకు విషయాలు నేర్పాలి.

(6) కార్యనిర్వాహక సంఘం:- పై విధానాన్నంతటిని జరిగించుటకు ఒక కార్య నిర్వాహక సంఘం ఏర్పడాలి. ఆ సంఘంలో క్రింద నుదహరింపబడిన బాధ్యతలతో 5 గురు సభ్యులుండాలి:—

(1) అక్షరాస్యతకొరకు.
(2) ఉపన్యాసాల కొరకు.
(3) స్కూళ్ల నిర్మాణాల కొరకు,
(4) ఆఫీసుకార్యదర్శి.
(5) ఆకర్షణ విధానాలను నెలకొల్పుట.

(పై ఉపన్యాసములు, పాటలు, ప్రదర్శనాలు, విహారాలు జరిగించుటకు) హిస్టరీ, సైన్సు, జాగ్రఫీ మొదలైన విషయాలగురించి పాటలు వ్రాయించి ప్రచారంలోనికి తీసుకురావాలి. అక్షరాస్యతకు, ఉపన్యాసాలకు, ఉపాధ్యాయుల శిక్షణకు తగు పుస్తకాలను పాఠశాలలను నిర్ణయించుట, ఉపన్యాసాలకు కావలసిన పరికరాల్ని సేకరించుట యీ సంఘంయొక్క పని. మరియు తరగతిఅనంతరం శాసనసభ ఓటర్లుగా విద్యార్థులను చేర్చవలెను. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నింటికన్నా ముందు యీసంఘం ఉపసంఘాల్ని నియమించి ప్రభుత్వనిషేధాన్ని తొలగించుకొనుట మిక్కిలి అవుసరం.

వయోజన విద్యాప్రచారానికి గ్రంథాలయాలు అండగావుండును గనుక వారు గ్రంథాలయాల్లో వయోజన విద్యాపాఠశాలలు పెట్టుటకు అవకాశాలు యివ్వవలె ననియు, వారు భౌతిక శాస్త్రపరికరాలు, మ్యాపులు, విజ్ఞానవిషయిక పుస్తకాలు పుస్తక భాండాగారాల్లో వుంచవలయుననియు కోరుచున్నాను.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse

  1. 24-8-41 వ తేది తెనాలిలో జరిగిన ఆంధ్రదేశ వయోజనవిద్యా మహాసభలో చదివిన వ్యాసము