Jump to content

ఆంధ్ర గ్రంథాలయం/సంపుటం 2/సంచికలు 3, 4/ఆంధ్రదేశ వయోజన విద్యామహాసభ - తెనాలి స్వాగతోపన్యాసము

వికీసోర్స్ నుండి

రచించిన వారు - రావి సత్యనారాయణ, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు

ఆంధ్ర దేశ వయోజన విద్యామహాసభ, తెనాలి

స్వాగతోపన్యాసము

స్వాగతము, కాగితముతో కబురంపినంతమాత్రముననే దూరమనక భారమసక యిచటికి దయచేసిన తమ కెల్లరకును సుస్వాగతము.

వయోజనవిద్యా ప్రచారమునకు కలిగిన బాలారిష్ట దోషములనుతొలగించి, ప్రచారమున కనువగు సాధన సామగ్రులను సంతరించి, కార్యకలాపమునకు దగిన ప్రణాళికల నేర్పఱచి దేశోద్ధరణకు ఆయత్తులయి మా పిలుపు విన్నంతనే కష్ట నష్టములకోర్చి యిచ్చటికి దయచేసి మా కతిధిసేవాభాగ్యము సబ్బజేసిన మహామహుల కెల్లరకు శుభ స్వాగతము.

మా తెనాలి పూర్వము రామకృష్ణాది కవివరులను కడుపారగాంచి ఆంధ్రమున కమూల్యమగు సేవ చేయుటయే గాక నేడును దేశాభివృద్ధికరములగు నవీనోద్యమములలో యధాశక్తిని పాటుపడుచు ఆంధ్రదేశమున పేరెన్నికగన్నది. ఇంతకంటె ఈ ప్రదేశమును గూర్చి నే నిప్పుడు చెప్పదలచుకొన లేదు.

వయోజనవిద్యావశ్యకత

విద్య మానవునకు ముఖ్యావసర మనుటలో సంకోచించు వాడుండడు. దేశాభివృద్ధి సాధనములలో జ్ఞానము ప్రధానమనుటకును వెనుకాడు వా డుండబోడు. మానవుడు సాంఘిక జీవి. కాన అతడు సంఘములో తా నెట్లు మెలగ వలయునో తెలిసికొనియుండ వలయును. సంఘ మెట్లుండవలయునో, ఇప్పుడున్న మంచి చెడ్డ లేమియో చర్చించి నిశ్చయించుకొనవలయును.

అతనికి పరిపాలనతో సంబంధమున్నది గావున ప్రభుత్వము నెడల తనకుగల బాధ్యతలను, తనయెడల ప్రభుత్వమునకుగల బాధ్యతలను బాగుగ దెలిసికొనవలయును.

ఇటులనే మానవునికి ఆరోగ్యము, ఆర్ధికము, కృషి, పరిశ్రమలు, వర్తకము మొదలగు పెక్కు విషయములు ఎఱుగవలసియున్నది. ఇవి పాఠశాలలలో చిన్నతనములో కొంతకొంత నేర్చుకొన్నవారు ఈజ్ఞానమును పెంచుకొనవలయును. అటులనే చిన్నతనమున విద్య నేర్వనివారు తమ కెక్కువ యవసరమున్న విషయములను నేర్చుకొనవలసి యున్నారు. ఇందులకే వయోజనవిద్యా ప్రచార మావశ్యకమైనది. ఈ ప్రచారము ఆంధ్రదేశమున రాత్రి పాఠశాలల మూలమునను, పురాణములు ఉపన్యాసముల మూలమునను చాలకాలము నుండియు జరుగుచునే యున్నదిగాని యిది ఒక కార్యక్రమము ననుసరించిగాని ఒక ప్రణాళిక ననుసరించి గాని 'కాక చెల్లాచెదరుగ వెదజల్లినట్లుండుటచే దీని నొక త్రాటికి గ్రుచ్చుటకు నేటి సంస్కర్త లుద్దేశించినారు. కాంగ్రెసు ప్రభుత్వము చేయుచున్నపుడు ఈ విషయమును తఱచినది. మన దేశములో కొన్ని ప్రాంతములు ఒక్కొక్క కార్యక్రమము ననుసరించుచున్నవి.

ఈ జ్ఞానప్రచారము సక్రమముగ నుండి పెంపొందించుకొనుట కవకాశములు గలుగవలయునన్నను, తమ పౌరసత్వపు హక్కును (Vote) సంపాదించుకొన వలయునన్నను, నిరక్షరాస్యతను తొలగింపవలయు ననుట నిర్వివాదము. ఇందుకొఱకై ఆంధ్రదేశమున పెక్కు సంస్థలు సంఘములు తల పెట్టినవి.

ప్రభుత్వవిధానము

మన గవర్నమెంటువారు ఈ కార్యభారమును తాము పూని దేశమును జ్ఞానవంతముగా చేయవలసియుండియు అట్లు చేయకుండుటయేగాక చేయదలపెట్టిన యితర సంఘముల నెత్తిపై పిడుగువైచుట విచారకరము. ఈ ప్రచారమును కమ్యూనిష్టులు చేయుచున్నారనియు, కమ్యూనిజమును బోధించుటకే యీ ప్రచారము చేయుచున్నారనియు గవర్నమెంటువారు నిశ్చయించుట ప్రమాదము.

కుక్కను కొట్టదలచుకొన్నపుడు పిచ్చిదని చెప్పి కొట్టుకున్నట్లుగా ఈ వయోజన విద్యాప్రచారము పడగగొట్టుటకు కమ్యూనిజముతో ముడివైచినట్లుగా కన్పట్టు చున్నది. కమ్యూనిజము వ్యాపింపకుండ చేయుటకు గవర్నమెంటువారికి చాల ఆయుధములు - శాసనముల పేరుతో — ఇదివరకే యున్నవి. ఉన్నవి యుండగా విద్యాప్రచారమునే చితుక గొట్టబూనుట కిప్పుడు పూనుకొని యున్నారు. తమ తప్పును సవరించుకొనుటకు ససేమిరా యనుచున్నారు. ప్రజాందోళనమును పెడచెవిని బెట్టుతున్నారు.

మన రాజధాని విద్యాశాఖ డైరెక్టరుగారు ఈ మధ్య గుంటూరులో మాటలాడుచు నిరక్షరాస్యతా నివారణ ప్రచారమువలన లాభము లేదనియు, చిన్నతనమున నేర్చుకొన్న ప్రారంభవిద్యవలననే ప్రయోజనమున్నదనియు పలికినారు. మఱి ఈ విద్యాశాఖ నూటికి 89 మందికి ఏల చదువు చెప్పింపలేదో! దేహమునాకు కావలసిన పటుత్వము చిన్నతనముననే సంపాదించుకొనవలయునుగాని పెద్దవారయిన పిమ్మట యువకులు సంపాదించుకొనరాదనుచు శాసనము చేయు ఈ ప్రభు త్వము ఎంత ఆలోచనగలదో మన మూహించుకొనవచ్చును. ప్రభుత్వము యొక్కయిట్టి పెడచూపును మనము ప్రజాందోళనముచే మార్పవలసియున్నాము.

అమెరికాలో బానిసజాతులు స్వతంత్రము పొందినపుడు తమ జీవిత కాలములో తమ మత గ్రంధము నొక్కసారి తాము స్వయముగా చదువుకొని ధన్యులు కావలయునను అభినివేశముతో అరువదియేండ్లవారుకూడ చదువుకొన ప్రారంభించినట్లు మన దేశమునందును యువకులు, జ్ఞానమునకు మొగమువాచియున్న ప్రజలు పెక్కురు ప్రస్తుత దేశపరిస్థితులను, ప్రపంచ పరిస్థితులను పత్రికలలో తాము స్వయముగ చదువుకొనవలయునని ఉవ్విళ్లూరుచున్నారు. వారి యా యభిలాషమును మనము తీర్పరాదా? అందులకు మూడు సంవత్సరములు శిక్షయు, జరిమానా యునా ప్రభుత్వమువారిచ్చు సత్కారము! ఇది దేశద్రోహమా ! దీనికి ఇండియా రక్షణ శాసనమా!

ప్రభుత్వము వారి యీ నిర్ణయమును మార్పించుటయే గాక మన మిప్పుడు మఱియొక కార్యమును నిర్ణయింపవలసియున్నది.

నిరక్షరాస్యతానిర్మూలమును, విద్యాప్రచారమును ఫలవంతముగ జేయుటకు మనము చక్కని పద్ధతుల నాలోచింపవలసియున్నది. వాని నాచరించుటకు తగిన యుపాయములు వెదకవలసియున్నది. ఈ కార్యములను చక్కగ నిర్వహించుటకు సమర్ధులయిన పెద్దలందఱు ఇచ్చట చేరియున్నారు. విజ్ఞానవేత్తలగు మీరందఱు ఈవిషయములను సమగ్రముగ నాలోచించి ఆంధ్రదేశమునకు కర్తవ్యమార్గమును జూపి మీ ధర్మమును నెఱ వేర్చుకొందురని విశ్వసించుచు మీరు ఇచ్చటగలిగినసౌకర్యలోపములకు మమ్ము క్షమియింతురని మీ యుదారాశయమును వేడుచు ఇంతటితో నేను ముగించుచున్నాను.

రావి సత్యనారాయణ, బి.ఏ.

ఆహ్వాన సంఘాధ్యక్షుడు

దేశ వయోజన విద్యామహాసభ
తెనాలి

ఆహ్వాన సంఘాధ్యక్షులు

ప్రారంభకులు

ఆంధ్ర దేశ వయోజన విద్యా మహాసభ

తెనాలి

అధ్యక్షులు

శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు, ఎం. ఏ.

అధ్యక్షోపన్యాసము

డాక్టరు సుబ్బరాయన్ గారు, ఆహ్వాన సంఘాధ్యక్షా! సోదరీమణులారా, సోదరులారా ! ఈనాటి మహాసభకు మీరు నన్ను అధ్యక్షత వహింపవలసినదని కోరి గౌరవించినందుల కెంతయు కృతజ్ఞుడను,

విద్యయే శక్తి

మన దేశములో మహాయోగులు విద్యను సర్వసాధనముగా నుపయోగించినారు. విద్యవలన మృత్యువును తరించినారు. ఇహలోక పరలోకములకు రెంటికి విద్య తారకముగా నిర్వచించినారు. జ్ఞానమంటే మనవారిది వట్టి పరలోక జ్ఞానమే యనుకొనువారు చాల పొరబడుచున్నారు. నాల్గువిధములయిన జ్ఞానములు మన పెద్దలు నిర్వచించినారు.

(1) సంజ్ఞానము-చక్క నైనట్టి ఎరుక
(2) అజ్ఞానము. శాసనవిధానశక్తి
(3) విజ్ఞానము - శాస్త్రవిషయగ్రహణము
(4) ప్రజ్ఞానము- సర్వము నెరుగుట

ఇందులో గర్భితమయిన అర్థము అందరికి నా వివరణ లేకయే తెలియగలదు. శాసనవిధానశక్తి, శాస్త్రవిషయగ్రహణమును, సంజ్ఞానమును, సాంఘికార్థికముల ప్రజ్ఞానము జ్ఞానసంపూర్ణత్వము. గీతలను కృష్ణుని ముఖమునుండి విన్న యర్జునుడు నాట్యవిద్యలో, శస్త్రవిద్యలోవలె ప్రవీణుడు. లీలావతి గణితశాస్త్రమున ప్రవీణ. కృష్ణ దేవరాయలు సంగీత, సాహిత్య, క్షత్రియ, రాజకీయ ఇట్టివిద్యలయం దేన్నిటియందో ప్రవీణుడు. భారతపురుషులలో నొక్కొక్కడొక్కొక్క శాస్త్రము కూలంకషముగా పెరిగినవాడు. ధర్మజుడు ధర్మశాస్త్రవేత్త. భీముడు పాకశాస్త్ర, మల్లశాస్త్రముల ప్రవీణుడు. అర్జునిని మాటచెప్పితిని. నకుల సహదేవులు గో అశ్వశాస్త్రముల పేరెన్నికగన్నవారు. ద్రౌపది భారతశక్తికి పూర్ణరూపమని చెప్పదగినది. పువ్వులుగ్రుచ్చుటలో పూర్ణప్రజ్ఞగలది.

మన పూర్వులు చతుష్షష్టికళలని పేరు పెట్టి 64 విద్యల నభివృద్ధి చేసిరి. కాని అందరును ముక్కుమూసుకొని కూర్చొని ఇతరులు కీ లోకమును వదలి వైకుంఠమునకు బొమ్మనలేదు. అందే జీవితశక్తి కలుగవలెనన్నా, ముక్తి ప్రొపించవలెనన్నా విద్య, జ్ఞానము ప్రథమాధారములనిరి.

ఐతరేయోపనిషత్తునందలి ఉత్తరశాంతి పాఠమున బ్రహ్మచారి ఏమనుచున్నాడో చూడుడు.

అధ్యయనమునందు దృఢబుద్ధి యలరుగాక!
అధ్యయనము నన్విడువనిదగును గాక!
పఠన మొనరింపబడు వేదభాగములను
రేయిబవళులు నేను దర్శింతుగాక!

తన్ను అధ్యయనము విడువరాదట! రేయిబవళులు వేదభాగములను తాను దర్శించుచుండవలెనట!

నా మతమున పూర్వము మనదేశమున దాస్యములోకి త్రోయబడిన ఏ కొందరో తప్ప నాటి రాజకీయసంఘ మంతయు బ్రహ్మ క్షత్రియ వైశ్యులే. వీరి యందరకును బ్రహ్మచర్యాధి కారము, అధ్యయనాధికారము కలదు. అందుచేత వీరెల్లరును తమ్ము విడువని అధ్యయనము నారాధించిరి. ఆ నాడు వయోజనవిద్యయని, ఇందులో అక్షరజ్ఞత ప్రధానమా? విజ్ఞాన వికాసములు ప్రధానములా? అనునట్టి ప్రశంసలే రాకుండెను. జ్ఞానమన్నది శక్తి. శక్తి సాధింపదగినది. అది యారాధింపదగినది. వాయువును పీల్చినట్లు, ఆహారమును భుజించినట్లు విద్యను సంపాదించిరి. రాజ్యము లేలుకొనిరి. లోకమునకు జ్ఞానభిక్ష పెట్టిరి.

పాశ్చాత్యదేశములు - విద్యాప్రచారము

నేడు పాశ్చాత్య సీనులలోనూ 'మోక్షసంపాదనకు కావలసిన శక్తిమాట యెట్లున్నా జీవయాత్ర గడుపుటకు కావలసిన శక్తి సంపాదించుటకయి జ్ఞానమును సంపాదించుచున్నారు. ఉపాసించు చున్నారు! 'నాలెడ్జ్ ఈజ్ పవర్' అన్నారు. అనగా జ్ఞానమే దాని శక్తియగుట వారి మతము కూడాను. అట్టి జ్ఞానము, పూర్వము మనలోవలెనే అందరు ఆరాధింపవలసినదని, సాధింప వలసినదని వారు పూనుకొని మనవారు బ్రహ్మచర్య కాలముగా ఎంచిన విద్యాభ్యాస కాలమును విద్యార్థిదశలోని విద్యగా నెంచుచు జీవితాంతము వరకును అనేక రూపముల నందరును సాధింపదగిన తక్కుగల విద్యను వయోజనవిద్య యన్నారు.

విద్యను సాధించుటకు పూర్వము మన దేశములో శ్రవణముఅంటే వినికిడి ఎక్కువగా నుపయోగించినా అక్షరములు లేవనిగాని గ్రంథములు లేవనిగాని యనుకొనరాదు. అశోకుని నాటి శిలాశాసనాదులు మన తక్షశిలాది ప్రాచీన విద్యాలయములు మన యక్షరజ్ఞానపు ప్రాచీనత్వమును స్పష్టముగా సూచించును. అచ్చుకూర్చుట ఏర్పడి లక్షలకొలది ప్రతులు విజ్ఞానసంపుటములగు గ్రంధాలకు తయారు కావడము విద్య సంపాదించుటకు కావలసిన సాధనము అంతరజ్ఞత యయిపోయినది. చారిత్రక పరిణామము పరపరిపాలనచే తెగిపోకయున్న రాష్ట్రాలలో ఈ క్రొత్తమార్పు మామూలు జీవితప్రవాహము లోనే కలిగి ప్రత్యేకము అక్షరజ్ఞత ప్రయత్నాలు చేసుకొనవలసినపని ఆధునిక ష్ట్రాలకు కలుగ లేదు. ఇంగ్లండు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు ప్రముఖముగా ఈ పరిణామానికి ఉదాహరణములు. అక్షరజ్ఞత ప్రచాగము వేరేగా చేయకుండానే ఇంగ్లండులో నూటికి 99.66 ను, అమెరికాలో 26.1 ను అక్షరజ్ఞులయినారు. అదే కొద్దిగా వెనుకబడి కొంతకాలము చీకటిలోనుండిపోయిన జపాను రుష్యాలలో ప్రజారాజ్యము లేర్పడుటతో జ్ఞానము లేక శక్తి నిలువదని గ్రహించి ఆయా దేశములు ప్రయత్నము చేసి నూటికి నూర్గురను, నూటికి 90.2 రను అశురజ్ఞులను చేసికొన్నవి. తుర్కీలో కెమల్ పాషా ప్రాతలిపినికూడా మార్చి వృద్ధులనుగూడ బళ్ళకు లాగితేచ్చి ఆక్షరజ్ఞులను విద్యావంతులను చేయనుపక్రమించినాడు. అక్షరజ్జమయి శక్తి సంపాదించిన జపాను బ్రిటనుతో జపాను బ్రిటనుతో తులతూగుచుండ స్వాతంత్య్రము 1911 లోనే సంపాదించియు చీనా పూర్ణవికాసము పొందలేక ఎంత ప్రజ, ఎంత సంపద యున్నను జపానుకు భోగ్యమయి, కొంత రష్యా శిక్షణ యుండడము చేత నైదేండ్లుగా జపానుతో హోరాహోరీగా పోరవలసివచ్చినది.

ఈ ఉదాహరణము లన్నీ కంటియెదుట నుండడముచేతను, నేటిదినము కమ్మరము, వడ్రంగము, వ్యవసాయము వ్యాపారము వగైరా ఏపని చేసినా విజ్ఞానము లేకుండా చేయటము ప్రయోజనకారి కాక తిండికే అల్లాడవలసి రావడముచేతను, ప్రపంచానికి ప్రజాపరిపాలన ఏరాజకీయ మోక్షముగా ఏర్పడి ప్రతివ్యక్తీ వోటు చేయడానికి కొంత విజ్ఞానముండితీరవలసి రావడముచేతను విజ్ఞానమే సాధింపదగిన ఫలమయినా, దానికి ఇతర సాధనాలు ఎన్నో ఉన్నా, పత్రికలు పుస్తకాలు చదవడము ప్రధానసాధనము కొనడముచేతను ప్రపంచమును సంస్కరింపనెంచే విజ్ఞులందరును అక్షరజ్ఞతను, అదీ లేనిప్రాంతములో ప్రచారము చేయడము దీక్షగా పెట్టుకొనవలసివచ్చినది.

ప్రపంచమంతటను జరిగే యత్నము మన దేశములోను జరుగుట సహజముగానే సంభవింపవలసినది. కాని మన చారిత్రక పరిస్థితులు బహు చిత్రమయినవి. సాధారణముగా పరుల పరిపాలన చేతనే యీ చిత్ర పరిస్థితియంతయు సమకూడినదనుకొనడము మన యలవాటు. ఆ విధముగా మన మనుకొనుచు పోదుమేని ప్రభుత్వము మారువరకు ప్రయత్నము సాధ్యము కాదు. అని మసమిట్టి సమస్యలన్నిటి విషయమునను నిద్దురబోతులగుట జరుగుచున్నది.

మన లోపము

పరతంత్యము చేత మనకు శృంఖలాలేర్పడియుండడము నిజమే యయినా మనకు మనమే యేర్పరచుకొనే శృంఖలాలు గూడ చాల కలవు. మనదేశములో ప్రాకృతములు విశృంఖలముగా విహారము చేసినన్ని దినములు మనదేశము విజ్ఞానవంతముగా నున్నది. కాని సామాన్య మానవులు వ్యవహారములో నుపయోగించు భాష బూతు క్రింద లెక్క పడి తెనుగుభాషబోటి భాషలు నన్నయాదులనాటి నుండికూడ సంస్కృత సూత్రాల కనుగుణంగా నడువవలసిరావడంతో విద్యాప్రచారము సంక్షేపమయి పోయింది. అక్షరజ్ఞులుగా ఉన్నవారికి ఉత్తమ విజ్ఞానమందుబాటులో లేకపోయింది. వారికవసరమైన మార్గాలలో వాఙ్మయము నడవకపోయినది. రాజులకు, ప్రభువులకు, పండితులకు తృప్తిగోలిపే వ్రాతలే బయల్పడినవి. బ్రిటిషు ప్రభుత్వ మేర్పడిన తరువాత ఇంగ్లీషువారికి భారతదేశభాషల సారస్యము కాక భారత వ్యాపారమే ముఖ్యమైనందున ఈ పండిత భాషయు శుష్కించినది.

నేటికి 30 ఏండ్ల క్రిందటి మన తెలుగుభాషా విషయమాలోచింపుడు. దీనిని చదివేవారు సాధారణముగా బళ్లలో చదివే ఏనూటి కార్గరో! ఇది ఇంగ్లీషుయుగంలో బళ్లతెలుగు. దానివర్ణననే చేయనక్కరలేదు. తెలుగుతరగతికే పోవలసినది లేదని, పోయినా పంతుల వారు చెప్పేది యేమీలేదనీ ఏదైన కొద్దిగావున్నా అది రాకపోయినా పరీక్షలలో నష్టంలేదని అనుకోనేరోజులని, స్కూళ్ళబయట చూతామా తూచాలు తప్పుపట్టుకొనే పండిత వాఙ్మయము.

ఇటీవలి ప్రయత్నాలు

ఇరువదవ శతాబ్దమారంభమయి 'కర్ణమ' దయచేత వందేమాతరం ఉద్యమము ప్రబలినతరువాత మన వాఙ్మయము సృష్టించుటలో ప్రత్యేకము ప్రజాసమూహముయొక్క అవసరాలమీదికి దృష్టిసారించడము జరిగినది. విజ్ఞానచంద్రిక, ఆంధ్రభాషాభివర్ధనీ, విజ్ఞానసర్వస్వము, కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక యిత్యాది ప్రయత్నములు పుట్టి పెరిగినవి. వందేమాతరం వందేమాతరం ఉద్యమంమీద గట్టిదెబ్బవేయడంతో మన ఆంధ్రదేశముమట్టుకు మన ఆంధ్రదేశములో విజ్ఞాన ప్రచారోద్యమము బలపడింది. అందులో అంశలే గ్రంధాలయోద్యమము, ఆంధ్రరాష్ట్రాద్యమము. ఇంత జరిగినా భావశృంఖలాలు పూర్తిగా తెగడానికి మహాజనానికి తగిన భాష, వాఙ్మయము పొందడానికి 1914-18 సంగ్రామము, రుష్యావిప్లవము, మనదేశములో హోమురూలు ఆందోళన, గాంధీయవతరణము ఇన్నియు దూరకారణములు కావలసివచ్చినవి.

మన గ్రంథాలయోద్యమము అక్షరజ్ఞతను కడచిన 8-10 ఏండ్లుగా నొక్కుతున్నా గాంధీజీబోటి వాడు కూడ దీనిని నిర్మాణ కార్యక్రమములో చేర్చడాని కిష్టుడై ఇప్పుడే యుపక్రమించినాడు. దేశమంతటను దీని యౌజ్వల్యము ప్రబలినది. కాంగ్రేసువారు ప్రాంతాలలో రాజ్యాధి కారము నందుండిన దినములలో మద్రాసుకోస్తాలో ఎక్కువ ప్రయత్నము జరుగలేదు గాని సంయుక్త- పరగణాలలో (యు.పి.యందు) మంత్రి సంపూర్ణానందు 1939 జనవరి 15వ తేదీని అక్షరజ్ఞత ఉత్సవదినంగా ఏర్పరచి అత్యుత్సాహప్రయత్నము చేసినాడు. బీహారులో మంత్రి సయ్యదుమహమ్మదు అరజ్ఞతకు 3 మాసములు తరువాత విజ్ఞానారంభమునకు 3 మాసములు నియోగించి అనేక కేంద్రాలలో పనిని ప్రారంభించినారు. పుస్తకాలు, పక్షపత్రికలు ఈ కేంద్రాలకు సరఫరాచేయ నేర్పరచినారు. అధికారానధికారులందరను ఈ కార్యానికి వినియోగించుకొనినారు. ఆసాములోను ఉత్సాహముతోడనే యుపక్రమించినారు. బొంబాయిలో డాక్టరు భేరు వయోజన విద్యకు ప్రత్యేకమొక బోర్డునే నియమించి బొంబాయి నగరమును రెండేండ్లలో 100 కి 100 గురు అక్షరజ్ఞులు కలదిగా చేయవలెనని ప్రయ త్నించినారు. కాంగ్రెసు ప్రభుత్వాలు కాని సింధు పంజాబులలోనూ విద్యామంత్రు లీవిషయమయి పరిశ్రమ చేసినారు.

కాని మన మద్రాసు కోస్తాలోనో కాంగ్రేసు మంత్రులు రాజ్యమేలుచున్నపుడుకూడ వయోజన విద్య విషయమయి ఎక్కువ జోక్యము ప్రభుత్వమువారు పుచ్చుకొనలేదు. శ్రీ రాజగోపాలాచారి గారు తాను మంత్రి కాకపోతే వయోజన విద్యాబోధకు సేవకుడుగా సమరుదునని వాగ్విజృంభణము చేసి 'త౦బీ వా' అనే పుస్తకాన్నొకదానిని మరిదాని తరువాత దాసి చెల్లెండ్రను అరవదేశముమీదికి విసరిరి. దక్షిణఇండియా వయోజవిద్యా సమావేశములు ఇప్పటికి మొదటిది మద్రాసులో, రెండవది మధురలో, మూడవది కోయంబత్తూరులో జరిగి కొంత యాందోళన సాగినది. నాల్గవది మన యీ గుంటూరుజిల్లాలోనే త్వరలో సమావేశము కావలసియున్నది. దక్షిణపు చివరన తూత్తుక్కుడిలో ఛేర్మిన్ రోష్ విక్టోరియా క్రింద మునిసిపాలిటీ ఆరు కేంద్రములలో వయోజన విద్యాబోధ జరుగుచున్నది. మధురజిల్లాలో మిసన్ వైల్డరన్ మిషనరీ సతి రోమను అక్షరాలను ప్రాతిపదిక చేసి వయోజనాక్షురాస్యత సాధించు ప్రయత్నాలు చేయుచున్నది. మద్రాసునగరములో అటనట కొందరు ఈ పరిశ్రమ చేయుచున్నారు. కార్పొరేషను వారితో శ్రీ వెంకటస్వామినాయుడుగారు మేయరుగా నున్నప్పుడాలోచించిన యాలోచన ఫలంగా మన పుల్లారెడ్డి గారి కమీషనరు గిరిలో నాల్గు వయోజన కేంద్రాలలో చక్కని పని సాగుచున్నది. వయోజనుల కిచట తేనీరుగూడ సరఫరా చేయుచున్నారు. 1941-42 సంవత్సరపు బడ్జెటులో అక్షరజ్ఞత కేంద్రాలకు రు 10,000 మంజూరు చేసుకొన్నారు. మద్రాసు నగరము వివిధ భాగములలో 23 గ్రంథాలయ పఠనాలయాలు మునిసిపల్ కార్పొరేషనువారి యాదరణమున జరుగుచున్నవి. 45 ఇతర పఠనాలయములకు వీరు సహాయపడు చున్నారు. ఏవం విధ కృషికి శ్రీ పుల్లారెడ్డిగారికి మనము ధన్యవాదములు చెప్పవలసి యున్నది. మైసూరు విశ్వవిద్యాలయకృషి ప్రశంసింపదగినది.

ఆంధ్రదేశమున వయోజన విద్యా ప్రచారము

తెలుగు దేశమున జరిగిన పనియు తక్కువ యయినది గాదు. మా గ్రంధాలయ సంఘమువారే కడచిన మే మాసమునందు గ్రంథ భాండారులకు శిక్షణ నిచ్చుటలో అరఙ్ఞత ప్రచారమునకు గావలసిన శిక్షణనంతయు అచటి శిక్షణాక్రమములో చేర్చిరి. ఈ గ్రంథాలయ సంఘమువారే నేను రచించిన 'వయోజనవిద్య - మొదటి పుస్తకము' ను ప్రకటించిరి. కొన్ని ఏండ్ల క్రిందటనే ఆంధ్రరాష్ట్ర వయోజన విద్యాసంభ మేర్పడెను. కీ.శే. శ్రీ శనివారపు సుబ్బారావుగారు దాని విషయమయి యెక్కువ కృషిచేసిరి.

గుంటూరుజిల్లాలో జిల్లా విద్యార్ధి సంఘమువారు గత వేసవిలో కొల్లూరులో వయోజనవిద్యా ప్రచారకులు నిమిత్తము శిక్షణాలయము నొకదానిని నడపిరి. ఇందు తయారైన విద్యార్థులు జిల్లాలో చాల తవుల పెద్దల బడులు సాగించిరి. రేపల్లె, తెనాలి తాలూకా గ్రంథాలయ సంఘముల వారును కొన్నిచోట్ల వయోజనవిద్యా వ్యాప్తికై రాత్రి పాఠశాలల నిర్వహించిరి.

కృష్ణాజిల్లాలో శ్రీ గోపరాజు రామచంద్రరావు గారు, కాట్రగడ్డ రాజగోపాలరావుగారు వగైరాల కృషిచే గ్రామములు అక్షరజ్ఞతకయి యుత్సాహముతో పనిచేయుచున్నవి. శ్రీ రామచంద్రరావుగారు వ్రాసిన వయోజనవిద్య వాచకములు అచ్చయి విరివిగా ప్రచారమునందున్నవి. మరి ఇతర ప్రాంతాలలో వలె తెలుగు దేశములోను మిషనరీలు అక్షరజ్ఞత వ్యాపింపజేసే ప్రయత్నాలు బాగా చేయుచున్నారు. ఇదివరలో ఉన్న అక్షర జ్ఞానపు పుస్తకములు రమారమి వారివే. సుందరంగారు, దేవరాజు, హైదరాబాదు రీడరులు గ్రంథ ప్రచురణమున పేర్కొనదగిన ప్రయత్నములు, ఇతరులనేకు లిట్టి ప్రయత్నము లాంధ్ర దేశమున చేయుచున్నారు. వారి నందరను పేర్కొన పోవుటకులేక నా యజ్ఞాన లోపముగాని వారి ప్రసిద్ధి లోపము గాదు, ఆంధ్రదేశమున జరుగనిండు, మరి యెచ్చట జరుగనిండు, అన్ని దేశోపకార కార్యములందు వలెనే ఇందులోనూ యువకవర్గమే యెక్కువ యుత్సాహముతోను పట్టుదలతోను పనిచేయునట్టివారు. యువకుల యుత్సాహ మొక్కప్పుడు పొంగి యుద్రేకముగా పరిణమించుట సహజమే. ఈ గుణమే యువక హృదయములకు లేకపోయినట్లయిన ఆంగ్లభూమి సంరక్షణకు, రుష్యా సంరక్షణకు నేటిదినము సిద్దపడి ప్రాణమర్పించుచుండు లక్షలకొలది సైన్యముల కూర్చుటయే సాధ్యపడియుండదు. అందుచేత యువకుల యుత్సాహములను తీవ్రముగా నణచివేయు ప్రయత్నము అధికారులుగాని, నాయకులుగాని చేయదగినది కాదు. దానిని క్రమపరచి ఉచితరీతిని అది యుపయోగ పడునట్లు తీర్చుట నీతి.

ప్రభుత్వనిరోధము

ఇటీవలి మద్రాసు ప్రభుత్వమువారి నిరోధము ఈ దృష్టిపథమునుండి మిక్కిలి యాక్షేపణీయముగా దోచును. ఈ రాష్ట్రమునందు యువకులు చేయునట్టి వయోజన విద్యాప్రయత్నమునందు, ఇప్పటి మద్రాసు ప్రభుత్వమువారికి కమ్యూనిస్టు పార్టీవారి సర్వాంతర్యామిత్వము తప్పితే మరి యేదియు గోచరించలేదు. అందుచేత వారు కడచిన జూన్ నెల 11 వ తేదీని జీ.ఓ.నంబరు 1229 (ఎస్-84) పబ్లిక్ (జనరల్) జారీచేసిరి. దానికి గాను గవర్నరుగారు డిఫెన్సు ఆఫ్ ఇండియాశాసనము క్రింద సంక్రమించిన అతినిరంకుశ అధికారమును వినియోగింపవలసివచ్చినది. అందులో చేసిన ఉత్తరువును అంత నిరంకుశముగాను ఉన్నది. మద్రాసు నగరములో పోలీసు కమీషనర్ అనుమతిలేకను, జిల్లాలో జిల్లా మేజిస్ట్రేటు ఉత్తరువులేకను వయోజన విద్యాశిక్షణ తరగతులుగాని, వయోజన విద్యా తరగతులు గాని జరుపరాదు. ఇందుకొక మినహాయింపు కల్పించినారు. గవర్నమెంటువారి విద్యాశాఖ వారిచేత గాని వారు కారణంగా గాని ఏర్పడే శిక్షణలకుగాని తరగతులకుగాని ఈయుత్తరు వన్వయించదు. ఈ యుత్తర్వుమీద వ్యాఖ్యగా గవర్నమెంటువారు జూన్ 14వ తేదీ నొక ప్రకటన గావించిరి. అందులో నే నిదివరలో సూచించిన కారణమును సూచించిరి. ఈ యుత్తరువు నుల్లంఘించి నడుచుకొసేవారు మూడు సంవత్సరముల పరిమితివరకు శిక్షకును జరిమానాకును పాత్రులుగావలసియుందురని తెలియబేసిరి. గవర్నమెంటువారి విద్యాశాఖవారు ఆధికారక్రమమున (అఫిషియల్) నడిపే ౪ ఫ్రెషర్ కోర్సులు వగైరాల కియుత్తరు వన్వయించదనిరి.

నిర్బంధము నెరపుటలో ఈ వివరణ అసలు ఉత్తరువు కంటే తీక్షుతరమయినదనుటకు సందేహము లేదు. మునిసిపాలిటీలు, లోకలుబోర్డులు, కో-ఆపరేటివు సంస్థలు వగైరాలు ఏ విద్యాధికారితోనో సంప్రదించి పనిచేసుకొంటే బాధ తప్పునేమో యని అసలు ఉత్తరువు చదివినవారు భ్రమపడుదురనియేమో ఈ వివరణ సర్కారువారు ప్రచురించిరి. ఆ విషయము వారి ముఖతానే వినవలసియుండును.

ఇక ఉత్తరువు సొరమాలోచింతము. విద్యార్థులందరును కమ్యూనిష్టు పార్టీ ఉత్తరువులను నడుపువారేనా? అట్లైన 150 ఏండ్లుగా బ్రిటిషు ప్రభుత్వములో నేర్చిన చదువు లన్నియును దుష్ఫలములను ప్రసాదించినవని యంగీకరింపవలసినదేనా?

విద్యలునేర్పే గురువులకు పరీక్షలు జరిపి పట్టములిచ్చు విశ్వవిద్యాలయాధికారులు వీరిపరిపాలన సౌభాగ్యము సన్నగిలిపోయినందుననా గవర్నమెంటువారు జిల్లా మేజిస్ట్రేటుకు పోలీసు కమీషనరుకూ ఈవిషయమున విద్యార్థులను, వారితోగూడ కమ్యూనిస్టుపార్టీతో సంబంధంలేని సాదా వయోజనవిద్యాప్రచారకులను వశము చేయవలసివచ్చినది. మద్రాసు ప్రభుత్వము వారు మనసున లేనిపోని కలవగ మీ విషయమున పొందినారని నా యభిప్రాయము. ఇట్టి కలవరము పొందడము చాల పొరపాటు. మహాజనమున వివిధపార్టీలకు చెందిన ప్రజలున్నట్లే విద్యార్థులలోను ఉన్నారు.

అదిగాక వయోజనవిద్య ఒకపార్టీవా రెక్కువకోరుట మరియొక పార్టీవారు తక్కువ కోరుట యను మాటేలేదు. కమ్యూనిస్ట్ పార్టీ వారి కెంత దీనియందభిలాషో, అంతా కాంగ్రెసు వారికి జస్టీసుపార్టీ వారికి, హిందూపొర్టీ వారికి, ముస్లిం పార్టీవారికి, తుదకు వ్యవసాయశాఖ డైరెక్టరుకు, కో-ఆపరేటివు రిజిస్ట్రారుకు, ఆరోగ్యశాఖాధికారులకు దీనియం దభిలాష. అనుదినము నాబోటివారు ఘంటాపథముగా చెప్పురీతిగా వయోజనవిద్య పార్టీవిద్య గాదు. దీనికి పార్టీకి ముడిపెట్టరాదు. అన్ని సాధనాలనూ దుర్వినియోగం చేసేవారున్నట్లే, తుదకు టీపార్టీలను దుర్వినియోగము చేసేవారున్నట్లే దీనిని దుర్వినియోగం చేసేవారుందురు. అట్లు దుర్వినియోగము చేసేవారిని శిక్షించవచ్చును. దండించవచ్చును గాని టీ అంగళ్ళన్నీ టీపార్టీలన్నీ మా ఉత్తరువు లేకుండా పెట్టరాదని గవర్న మెంటువారనవచ్చునా? ఇదీ అంతే.

ఈ యుత్తరువుమీద వ్యతిరేకాభిప్రాయమన్నివిధాల రాజకీయాభిప్రాయాలవారూ వ్యక్తపరచి నారు. గవర్నమెంటువారు ఇంతవరకు దీనిని ఉపసంహరించకపోవడము నాకు ఆశ్చర్యంగానే వుంది. ఇకనైనా ఆలస్యము చేయకుండా ఈ ఉత్తర్వును రద్దుచేయుదురు గాక యని నామనవి. న్యాయంగా పనిచేసే వారయితే పోలీసుకమిషనరు కేల వ్రాసుకోరాదు? జిల్లా మేజిస్ట్రీటుల కేల వ్రాసుకో రాదు? అనే ప్రశ్నలు అసందర్భమయిన ప్రశ్నలు. ఆవిధమయిన నిరోధము సాధారణముగా చేయదగినది గాదు. భరింపదగినదీ గాదు అనడము ఈ ఉత్తరువును గవర్నరుగారు తమ ప్రత్యేకాధికారాలు వినియోగించి చేయడము చేతనే స్పష్టమవుతుంది. వారి సడిగినా ఇది విధిలేక చేసినపని యందురుగాక! తమ కధికార ముండవలెనని అపేక్షచే చేసినపనియని యెన్నడుననరు. కాబట్టి యిట్టి యుత్తరువు లెంత త్వరగా ఉపసంహారము చేసుకొంటే అంత ప్రతిష్ఠ ప్రభుత్వాలకు కలుగుతుంది. ఆ నిని మద్రాసు ప్రభుత్వమువారు త్వరలో చేయుదురుగాక యని యెదురు చూచుచున్నాను.

పయోజనవిద్యకు అక్షరజ్ఞత ప్రథమ ధారమే యయినా అదే వయోజన విద్య కాదనడము ఇదివరలోనే స్పష్టపరచినాను. స్కూళ్ళు విశ్వవిద్యాలయాలకు మించిన వయసున జాతిలోని ప్రతి పురుషుడును, స్త్రీ యుసు పూర్ణ జీవితమును గడుపుట కెగురగవలసిన సర్వ విజ్ఞానమును వారి కందజేయడము వయోజనవిద్య కార్యక్రమము.

ఇతర దేశాలలో వయోజన విద్యాప్రచారము ఎట్లు జరిగేది మొదలగు సంగతులు మిత్రులనేకులు తమ యుపన్యాసములలో చెప్పగలరు. మన దేశమునందు ప్రయోజనకారులు అగుచుండు నట్టియు, కాగలయట్టియు విధానమును సూచించి నేటి నవ్యపరిస్థితులలో నుపయోగింపనగు నొకటి రెండు సాధనాలను వివరించి నా యుపన్యాసము ముగింప దలచినాను.

వయోజన విద్యాప్రచార సాధనాలు

మన కుటుంబముల దినసరి కార్యక్రమములోనే వయోజన విద్యాప్రచారమున కవకాశములున్నవి. పాటలు, పండుగలు, పేరంటములు, కొలువులు, వివాహాది శుభముహూర్తములు అన్నిటిని మనతో జేరు నలుగురకు యెక్కువ విషయగ్రహణము కలుగు నవకాశాలుగా తీర్చవచ్చును. స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయములలో వారి విద్యాప్రణాళికకు మించి జరుగు సంఘోద్దీపక వ్యవహారముల మాట నేను చెప్పనే యక్కరలేదు. భజనలు, బొబ్బిలికథలు, వీధినాటకములు, హరికథలు, యాత్రలు వయోజన విద్యాప్రచారకులకు నుంచి యవకాశములు. యాత్రల కిపుడు క్రొత్త తేజస్సు కలిగినది. ఆంధ్రదేశములో గ్రంధాలయ సంఘమువారు గ్రంథాలయ యాత్రలు చేయుచున్నారు. ఆ యాత్రలలో బొమ్మల లాంతరు సహాయమున నైతేనేమి, ఇతరత్రా నైతేనేమి విజ్ఞాన విషయముల సేకములు బోధించుచున్నారు. ఈ సందర్భములోనే గ్రంథాలయ పఠనాలయములు మాట కొంత చెప్పుకొననిండు.

నేటి దినము దేశభాషలలో పఠనాలయములను విరివిగా ప్రోత్సహించుట అత్యవసరము. నూతనయుగ విజ్ఞాన ప్రబోధకములగు గ్రంథములు నేడు వెలువడుట మన భాషలలో తక్కువ. కారణా లన్నిటిని నే నిచట ఏకరువు పెట్టనక్కరలేదు. మీరంద రెరిగినవే. పత్రికలు దినదినము, వారవారములోక విజ్ఞానాన్నంతా వెదజల్లక విధిలేదు. కాబట్టి అందులోనుండి వివిధ విషయములకును సంబంధించిన వ్రాత లప్పటికప్పుడు కత్తిరించి వేరేవేరే ఫైళ్ళుగా అతికించి పెట్టితే చదువరులకు మంచి విజ్ఞానము పంచి పెట్టడానికి వీలున్నది.

పఠనాలయాల యావశ్యకత ఇంత ఉందంటే గ్రంథాలయాల యావశ్యకత లేదనికాదు. మంచి గ్రంథాలు చేర్చిపెట్టడము చాలకాలముగా అనుభవములో నున్నపని. ఉండగలదు.

ఇప్పటి మద్రాసు ప్రభుత్వమువారు గ్రంధాలయముల గ్రాంటులు పునరుజ్జీవింపజేసినందులకు మనము కృతజ్ఞత చూపదగును. కాని యాగ్రాంటులు జిల్లాబోర్డులు, మునిసిపాలిటీలు, పంచాయితీల వశము చేయడము మాత్రము స్వతంత్రగ్రంధాలయములకు నిరుత్సాహజనకము. తెలుగు దేశములో స్వతంత్ర గ్రంధాలయాలు చక్కగా పనిచేసేవి చాలకలవు. జిల్లాబోర్డులు, మునిసిపాలిటీలు, పంచాయతులు తమతమ ప్రాంతాల స్వతంత్రగ్రంధాలయాలకు తమకువచ్చు గ్రాంటుల నుండి విరాళాలు ఇయ్యగలవని, ఇయ్యవచ్చునని ఇదివరలో ఉండేది. ఇప్పుడు వీరునడిపే గ్రంధాలయముల కీత్తురట! దీనిని గవర్నమెంటువారు దిద్ది తగినయుత్తరువుల పాలింతురుగాక యని కోరుతున్నాను.[1] మరియొకమాట. పత్రికలకు చందాలు పంపుకొనుటకుకూడ పంచాయతులకు హక్కు లేక పోవడము విషాదకరము. లోకల్బోర్డు ఇనస్పెక్టరువారి ముందు ఉత్తరువు ఉండవలెననుట నేటినిబంధన. దీనిని రద్దు చేయవలెనని చాల దీర్ఘముగా ఆందోళన జరిగియు ఫలము కలుగలేదు. ఈ నిర్బంధమును ప్రభుత్వమువారు తొలగింతురు గాక యని నాకోరిక. పైన చెప్పిన సాధనాలే కాక వయోజన విద్యకు బొమ్మల ప్రదర్శనాలు, వస్తు ప్రదర్శనాలు,శిల్పాలు, ఉపన్యాసాలు, సినీమాలు ఇట్టి పెన్నియో కలవు. నేడు అన్నిటికంటే ఎక్కువ విస్తారంగా వస్తుండేది రేడియో.

రేడియోకు సంబంధించిన అన్ని వివరాలను నేనిక్కడ విమర్శింపదలచుకొనలేదు. ఇటీవల పడమటి దేశాలలో ప్రచారములోనికి వచ్చిన 'గ్రూప్ లిసనింగు' అను విధానము చాల ఉపయోగకరమని నా యభిప్రాయము. దానికి తగిన సుశిక్షిత సేవకబృందమును మనము సిద్ధము చేసికొని ఈ దేశమునందును మన మా విధానము ననుసరించడము లాభప్రదమని నా మనవి.

'గ్రూప్' అనగా ఒక ముఠా. రేడియోలో చెప్పేవిషయాలు విని అవగాహన చేసుకొనే ఉద్దేశ్యముతో కొందరు కొందరటనట ముఠాలుగా యేర్పదుదురు. లంకా షైరులో నలుగురు వ్యవసాయదారులు, ఒక బేల్ దారు, ముగ్గురు కూలీలు, ఇద్దరు బడి ఉపాధ్యాయినులు, ఇద్దరు లక్ష్ములు , ఒక పీనుగల మోతరి, ఒక మతాచార్యుడు ఒక ముఠాగా చేరిరి. గం 8-30 లకు రేడియోలోవినుట కేర్పడియుండ గ.8-15 లకు. వీరు సమావేశమైరి. ఈ ముఠానాయకుడు రేడియోలో రాబోయే విషయమును ప్రస్తావించెను. ఈ ముఠా ఎదుట నొక పటము పరచి 'మెడిటరేనియన్' 'ఫసిఫిక్' సముద్రాలను చూపి కొన్ని వివరాలను చెప్పెను. అది ముగిసిన పిదప ఈ ముఠావారు కొంత విశ్రాంతి పొందిరి. తరువాత 30 నిముషములు రేడియో చెప్పిన కొన్ని వాక్యాలలో సంక్షేపించి అనువదించి విమర్శయీ సంగతులమీద జరుగవచ్చునని సూచించెను. ముఠావారు వీటిని విమర్శించడమేకాక తాముగ క్రొత్తవిమర్శన లారంభించిరి. ఒక యరగంట చర్చజరిగిన పిదప నాయకుడు దానినంతయు సమన్వయపరచి యుపన్యసించెను. అందరును ఏదో కొంత క్రొత్తవిషయమును నేర్చుకొంటిమని సంతోషించి యిండ్లకు పోయిరి.

ఈ ఏర్పాటు చాల మంచిది. వయోజనవిద్య ఏరూపంగా చెప్పదలచుకొన్న ఇందులోని మార్గమవలంబనీయమేయగును. కాని నాయకత్వము వహింపవలసినవాడు సమర్ధుడు కావలెను. ప్రపంచ విజ్ఞానము భాగా కలవాడుగా నుండవలెను. తనతో చేరే నలుగురిలో ఉత్సాహము జనింపజేసేవాడు కావలెను. వారి యాత్మగౌరవము నిలిపి తన యాత్మగౌరవము నిలుపుకొన గలవాడు కావలెను. నారడుగు ప్రశ్నలకు ప్రత్యుత్తరము చెప్పగల శాంతుడు గావలెను. ఈ సామర్థ్యము, ఈగుణములు పుట్టుకతోరావు, శిక్షణతో రావలెను. కావున వయోజన విద్యాప్రచారము కోరేవారు సుశిక్షితమగు మానవబలమేర్పరుచు కొనుటకు తగిన సంఘవిధానమంతయు నాలోచింపవలెను.

మిత్రులారా! ఇంకను మిమ్ము అలసట చెందింపవలెనని నాయిష్టముగాదు. ఈసభ యెదుటికి రాగల విషయాలు తామాలోచింపగలరు. సభ జయప్రదముగా జరుగుటకు మీయందరి సహకారమే యాధారము. మీసహకారము పూర్ణముగా ప్రసాదింతురని నావిశ్వాసము. సావధానముగా నా పల్కుల నాదరించి వినిన మీ కెల్లరకును కృతజ్ఞుడను.

గాడిచర్ల హరిసర్వోత్తమరావు,ఎం.ఏ.,

అధ్యక్షుడు

తీర్మానములు

౧. భారత విజ్ఞానమునకు మార్గదర్శకులును, ప్రపంచ విఖ్యాత కవిచంద్రులును అగు రవీంద్రకవీంద్రుని మరణమునకు ఈ సభవారు తమ సంతాపమును వెలిబుచ్చుచు, వారి కుటుంబమునకు సానుభూతిని తెలియబఱచుచున్నారు.

౨. భారతజాతీయ కాంగ్రెసుకు ఒకప్పుడు అధ్యక్షులుగ నుండి నిరంతరము జాతీయసేవకే తమ జీవితమును వినియోగించిన శ్రీమాన్ యస్.శ్రీనివాసయ్యంగారు, భారతదేశ మితవాద నాయకులు, ఆంధ్రపుత్రులు నగు సి.వై.చింతామణిగార్ల మరణములకు ఈ సభవారు తమ సంతాపమును తెలియజేయుచు వారి కుటుంబములకు సానుభూతిని తెల్పుచున్నారు.

౩. ఆంధ్రదేశములో గ్రంధాలయోద్యమములో చాల కాలము పనిచేసి ఆంధ్రసారస్వత సేవ చేసిన శ్రీ బుర్రా శేషగిరిరావు, పురాణం సూరి శాస్త్రి గార్ల మరణములకును - వయోజన విద్యాప్రచారమునకు కాకినాడలో చాల కాలము పనిచేసిన శ్రీ పర్వతనేని వేంకటేశ్వరరావుగారి అకాల మరణమునకును ఈ సభవారు సంతాపమును వెలిబుచ్చుచు వారి కుటుంబములకు సానుభూతిని తెలియజేయుచున్నారు.

౪. ఆంధ్రరాష్ట్రమందు వివిధ సంఘాల ఆధిపత్యాన నడుపబడుచున్న వయోజన విద్యాలయాలమీద ప్రభుత్వమువారు జూన్ 11 వ తేదీ అమలు జరిపిన నిషేధాజ్ఞ సామాన్య పౌరసత్వ హక్కులనే భంగపరచుచున్నది. ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నామనే బ్రిటిష్ గవర్నమెంటు యీమాత్రపు ప్రజాహక్కులనుగూడ తొలగించుట అన్యాయము; అక్రమము; కానీ ఆ నిషేధౌజ్లను వెంటనే ఉపసంహరించుకోవలసినదిగ ఈ సభవారు మద్రాసు ప్రభుత్వము వారిని హెచ్చరించుచున్నారు.

౫. వయోజన విద్యా ప్రచారంపై నిషేధం తొలగించవలసినదిగా ప్రభుత్వాన్ని కోరుచు అన్ని గ్రామాలలోను, తాలూకాలలోను, జిల్లాలలోను ప్రజాశ్రేయస్సు కోరే అన్ని సంస్థలనుండి ఎన్నుకోబడ్డ ప్రతినిధులతోను విద్యాన్యాపక విషయములో కృషి చేయు బాధ్యతగల వ్యక్తులతోను కలసియున్న సంయుక్త రాయబారవర్గాల నేర్పఱచి ప్రభుత్వమువద్దకు రాయబారాలు నడపుతూ నిరంతరము ప్రభుత్వం నిషేధాజ్ఞను తొలగించేవఱకు ప్రజాందోళన సభలద్వారా, అసమ్మతి ప్రదర్శనాలద్వారా - సాగించుచుండవలయును.

ప్రత్యేకంగా రాష్ట్రంతరఫున పై చెప్పిన విధముగానే ప్రజాసంస్థలనుండి - అనగా యువజన విద్యార్థి, గ్రంథాలయ, రైతు, కార్మిక, మహిళా సంఘములనుండి ప్రతినిధులతో కూడిన రాయబారవర్గమును ఏర్పఱచి ప్రభుత్వమువద్దకు పంపవలయునని ఈ సభవారు తీర్మానించు చున్నారు.

రాయబారవర్గ సభ్యులు:

1. గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు, కన్వీనరు
2, గోపరాజు రామచంద్రరావుగారు, ముదునూరు, కృష్ణాజిల్లా,
3. చెరుకూరి చలపతిరావు గారు.
4. కాట్రగడ్డ రాజగోపాలరావు గారు.
5. రావి సత్యనారాయణగారు, మునిసిపల్ ఛెయిర్ మన్, తెనాలి.
6. గోగినేని భారతీ దేవి గారు, నిడుబ్రోలు, గుంటూరు జిల్లా.
7. బచ్చు జగన్నాధదాసుగారు, హైకోర్టువకీలు, మదరాసు.
8. మద్రాసు విద్యార్థి సంఘ సభ్యులొకరు

౬. వయోజన విద్యాప్రచారాన్ని జయప్రదంగా కొనసాగించుట కవసరమైన కార్యకలాపాన్ని నెరవేర్చుటకు ఒక స్థాయిసంఘ మవసరమని అభిప్రాయపడుచూ, క్రిందివారిని స్థాయిసంఘ ముగా ఏర్పాటుచేయుటకు ఈ సభవారు తీర్మానించుచున్నారు.

స్థాయిసంఘసభ్యులు :

1. గా. హరిసర్వోత్తమరావుగారు - అధ్యక్షులు
2. గో. రామచంద్రరావుగారు - ఉపాధ్యక్షులు
3. చె. చలపతిరావుగారు - కార్యదర్శి
4. జి. యస్. బాలాజిదాస్ గారు
5. సి. వీరరాఘవస్వామిగారు
6. వై. ప్రభాకరరావుగారు
7. సి. వేంక టేశ్వర్లుగారు
8. కె. రాజగోపాల రావుగారు
9. జి. వి. సుబ్బారావు గారు
10.మానికొండ సూర్యావతి గారు
11.మారేపల్లి రామచంద్రశాస్త్రి గారు

౭. వయోజనవిద్యాప్రచారకులైన చాలామంది విద్యార్థులను మన రాష్ట్రములో ప్రభుత్వము ఎట్టి విచారణగాని లేకుండా నిర్బంధములో ఉంచడాన్ని ఈ సభవారు ఖండించుచున్నారు. నిర్బంధములోనున్న వయోజనవిద్యాప్రచారకులను ఎట్టి పరతులు లేకుండా వెంటనే విడుదలచేయవలెనని ఈ సభవారు ప్రభుత్వమువారిని కోరుచున్నారు.

౮. ప్రపంచమందున్న అన్ని దేశాలలోను వయోజన విద్యకై ఎంతయోధనము వెచ్చిస్తూవున్న ఈ రోజుల్లో “నిజము నాలోచించినయెడల బడికిపోయెడు వయసును దాటి పెద్దవారైనవారికి విద్యనుగరపుటకై ధనమును ఖర్చుచేయుట నిరర్థకమేమోననియు, మంచిది కాదనియు తోచుచున్నది” అని బాధ్యతాయుతుడయ్యును మన రాష్ట్రవిద్యాశాఖాధికారి గుంటూరులో మాట్లాడుట చాల సంకుచితదృష్టితో నున్నదని ఈ సభవారు గర్హించుచు వారికముందు సరియైన దృష్టితో వయోజనవిద్యకు తగిన ప్రోత్సాహ మివ్వగలరని నమ్ముచున్నారు.

౯. క్రిందటి సంవత్సరు కృష్ణాజిల్లాలో ముదునూరు గ్రామంలో జరిగిన వయోజనవిద్యాపాఠశాల ఈ సంవత్సరం రాష్ట్రీయ పాఠశాలగా మార్చబడి మార్గసౌకర్యములుగల ఇంకో గ్రామంలో- బెజవాడ తాలూకాలో జరుపుటకు ప్రయత్నాలు జరుగుచున్నవి. ఆ పాఠశాల వయోజనులకు విజ్ఞానం కలిగించుటకు చాలా ఉపయోగకరంగా ఉన్నది గనుక, ఆ పాఠశాల ఈ సంవత్సరం స్థాపింపబడగానే దానిలో చేరి విద్యాశిక్షణ పొందమని వయోజనులకు ఈ సభవారు హెచ్చరించుచున్నారు.

౧౦.వయోజన విద్యావ్యాప్తికిని, విజ్ఞానాభివృద్ధికిని గ్రంధాలయముల స్థాపించి ప్రచారము చేయుచున్న ప్రతి పట్టణ, గ్రామ గ్రంథాలయ సంఘముల వారున్నూ, నిరక్షరాస్యతా నిర్మూలనము చేయుటకు వయోజన రాత్రి పాఠశాలలు స్థాపించి నడుపవలసినదిగ ఈ సభవారు కోరుచున్నారు.

౧౧. ఆంధ్రరాష్ట్రములోని జిల్లాబోర్డులు, పురపాలక సంఘములు, పంచాయతీ బోర్డులు, ఇతర ప్రజాసంస్థలవారును వయోజనవిద్యా ప్రచారమును నిరోధించు మద్రాసు గవర్న మెంటువారి చర్యను గర్హించుచూ, వారి ఉత్తర్వును రద్దు పరచవలసినది. తాము తీర్మానించి ప్రభుత్వము వారికి పంపవలయునని ఈ సభవారు కోరుచున్నారు.

౧౨. ప్రపంచములో నూటికి నూరుమందిని విద్యావంతులుగ చేయగలిగి, వయోజనవిద్యాప్రచారాన్ని చక్కగా నడిపి, ఎంతమందినో విజ్ఞానవంతులుగ చేసి 20 ఏండ్లలో ప్రపంచములో ఏ దేశము పొందని విద్యా విజ్ఞానాభివృద్ధుల పొందగలిగిన సోవియట్ రష్యా యీనాడు జర్మనీతో యుద్ధమునకు దిగుటచే అచటి విజ్ఞానము నాశమగుచున్నది. ఇట్టి దేశమును బలవంతముగ యుద్ధములో దింపిన ఫాసిస్టు రాజ్యాల చర్యను ఖండించుచు, వానితో పోరాడుచు గొప్ప ప్రతిఘటన చూపుచున్న రష్యాను ఈ సభవారభినందించుచున్నారు.

౧౩. ఆంధ్రదేశములో అన్ని జిల్లాలలోను, జిల్లా వయోజన విద్యామహాసభలను జరుపవలయువని ఈ సభవారేకగ్రీవముగ తీర్మానించుచున్నారు.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse

  1. పై గ్రాంటులకు సంబంధించిన పూర్తి ప్రకటనలో 1860 వ సం|| 21 వ ఆక్టు క్రింద రిజిష్టరైన గ్రంథాలయములకు కూడ గ్రాంటు లిచ్చునట్లుదహరింపబడినది.

    ఆం.గ్రం.సం.