ఆంధ్ర గ్రంథాలయం/సంపుటం 2/సంచికలు 1, 2/స్వవిషయం
స్వవిషయం
'ఆంధ్రగ్రంధాలయం' మొదటి సంపుటము ప్రకటన పూర్తియై చాల కాలమైనను రెండవ సంపుటమును ప్రారంభించుట కింతవరకు మా కవకాశము లభించ దయ్యె. యుద్ధ ఫలితముగ పెరిగిన కాగితపు విలువయు, వలసినప్పుడు తగిన కాగితము లభింపమియు, మా ఆర్థికపుటిబ్బందికి తోడు వ్యాసములు వగైరా అనుకున్న వేళకు అందకపోవుటయు దీనికి కారణములు. మొదటి సంపుటమునకు అచ్చుఖర్చులకైన బాకీ తీర్చకనే రెండవసంపుటమును ప్రారంభించవలసి వచ్చుట చే కూడ ముందు లాలోచించుచు కొంతకాలము గడచినది.
తోడి పత్రికలు
ఆంగ్ల పత్రికలమాట యటుంచి తెలుగు పత్రికలైనను తమసోదరిని కొంత ఆద రించియున్న మాకిప్పటికన్న నెక్కుడు ప్రోత్సాహము లభించియుండెడిది. జన సామాన్యముయొక్క బాగుకొరకు ప్రయత్నించు సకలోద్యమములలో మిన్న యగు గ్రంధాలయోద్యమ విషయమై మాకు సాయపడవలసిన పత్రికలవారు మూకీ భావము వహించుటవలన మేమెంతయు నిరుత్సాహపడితిమి. తెలుగుదేశములోని ప్రముఖములగు పత్రికలన్నింటికిని విమర్శ నార్థము మా పత్రికను మొదట పంపి యుంటిమి. ఇందు 'గృహలక్ష్మి', 'విజ్ఞానం', 'ఆర్హపత్రిక' తప్ప తక్కిన యేపత్రిక గాని దీనిని గూర్చి నాలుగుమాటలైన వ్రాసినది లేదు. ఎవరుగాని వ్రాసియున్నను మాకు వానిప్రతుల బంపినది లేదు. కొన్ని పత్రికలలో విమర్శనార్థము చేరిన గ్రంధ ముల పట్టీలో నైనను మా పత్రిక పేరు చేర్చబడలేదు. ఎడతెగని ప్రచారముతప్ప ఆధారము లేని మా ప్రయత్నమున కీకనుండి యైన తోడి పత్రికలు తోడుపడగలవని ఆశించుచున్నాము.
గ్రంథాలయ పత్రికావసరము
ఏ ఉద్యమానికి గాని స్వంత పత్రిక ఒకటి ఉండడం అవసరం. దారి తెన్ను గానక తంటాలుపడు పరిస్థితిలో ఏ ప్రయత్నముగాని ఎక్కువ కాలము సాగుటకు వీలు లేదు. అనేక తావులలో వేఱు వేఱు పరిస్థితులలో ఎన్నో చిక్కుల నెదుర్కొని పని చేయవలసిన పరిస్థితి గ్రంథాలయ సేవకులది. అగుటవలన ఆయా సందర్భముల కనువగు రీతిని తమ కార్యములు నడపుటకు తోడుపడు విధానముల గూర్చి వారు తెలిసికొన వలసిన అవసర మెంతేని గలదు. నేటి గ్రంథాలయ సేవ కులలో పలువురు తమ పనిని క్రమముగ నిర్వహించుటకు తగినంతగ చదువు కొన్న వారు కారు. చదువున్న వారిలో సహితము గ్రంథాలయ నిర్వహణమునకు సంబంధించిన జ్ఞానమంతగ లేదు. అనుభవపరులిందులో కొందరుండ వచ్చును. కాని వారి అనుభవము సహితము తప్పులు చేయుచు దిద్దుకొనుచుండుటతో సరి పోవును. గ్రంథాలయ నిర్వాహకులకు సశాస్త్రీయముగ శిక్షణనిచ్చు నిమి త్తము ఆంధ్రదేశ గ్రంధాలయ సంఘమువారిటీవలనే ఏర్పాటు చేసి యున్నారు. అయినను ఎక్కువమంది గ్రంథాలయ సేవకు లీయవకాశమును వినియోగించుకొన జాలకున్నారు. ఇట్టిపరిస్థితులలో అనుభవపూర్వకమగు వ్యాసముల ద్వారా గ్రం థాలయ సేవకులకు సశాస్త్రీయమగు గ్రంథాలయ విజ్ఞానము నందుబాటులో నుంచుటకును, వేరు వేరు స్థలములు సాగుచున్న గ్రంథాలయ సేవాకార్యములు వెల్ల డించుటద్వారా వారిలో నుత్సాహమును రేకెత్తించి పనులు చురుకుగ జరుగు నట్లు చేయుటకును అవకాశముండును. ఈ పనికై ఇతరులమీద ఆధారపడుటకు వీలు లేదు. కనుక ఎన్నిశ్రమల కోర్చియైనను 'ఆంధ్రగ్రంధాలయం'ను నిర్వహిం చుట గ్రంధాలయోద్యమ సేవకుల విధిగ పరిగణించుచున్నాము.
గ్రంథాలయ సేవకుల తోడ్పాటు
ఈ పత్రిక క్రమముగ వెలువడుటకు గ్రంథాలయ సేవకులందరు తోడ్పడవలెను. ఒక్కరుగ నెవ్వరు గాని ఈ కార్యమును నెరవేర్చుట దుస్తరము. కాన గ్రంథాలయ ముల నిర్వాహకులును, ఉద్యమాభిమానులును దీని ప్రచారమునకై పూనుకొన వలెను. ఎవ్వరెవ్వరి శక్తిసామర్థ్యముల ననుసరించి వారీపత్రికకు చందాలను విరాళములను రాబట్టుటకు ప్రయత్నించుట మొదట చేయవలసినపని. గ్రంధా లయ సేవకులు తమ కార్యక్రమసమాచారములను ఎప్పటికప్పుడు తెలియజేయుచు గ్రంథాలయ శిక్షితులును, గంథాలయశాస్త్రమును చదివినవారును, గ్రంథాలయ నిర్వహణమునకు సంబంధించిన వివిధ విషయములనుగూర్చి మనదేశ పరిస్థితుల కను కూలపడు విధమున వ్యాసములను వ్రాసిపంపుచు- ఇట్లు ఎవరికి చేతనైన సాయ మును వారు చేయుచునున్న మాపత్రిక సకాలమున వెలువడుచు ఉద్యమాభివృద్ధికి చాలగ తోడ్పడగలదు.
వయోజనవిద్య
ఇటీవల వయోజన విద్యావిషయ మొక ప్రత్యేక ఉద్యమముగ బయలు దేరినది. రాష్ట్రీయ ప్రభుత్వములు జాతీయవాదులు చేజిక్కుటతో దీనికి గొప్పబలము చేకూరి నది. జాతీయవాదుల చేతినుండి ప్రభుత్వములు జారిపోయిన తదుపరికూడ దేశ శ్రేయోభిలాషులగు యువకు లెక్కువగ నీ కార్యక్రమమునకుబూనిరి. వయోజన విద్యాప్రచారము గ్రంథాలయములు ప్రధానకర్తవ్యముగ చాలకాలము క్రితమే గుర్తింపబడినది. గ్రంథాలయములు లేకుండ వయోజనవిద్యావ్యాప్తి జరుగు టసం భవమని తెలిసియే బీహారు మున్నగురాష్ట్రములలోని ప్రభుత్వములు తమ వయో జన విద్యాప్రచార కార్యక్రమమున గ్రంథాలయముల నిర్మాణమునకు బాగుగ తావొసగినవి. వయోజనవిద్యకు గ్రంథాలయములకు గల అవినాభావసంబంధ మునుబట్టియే మొదటినుండియు మాపత్రికలో గ్రంథాలయ విషయములతోపాటు వయోజన విద్యకు సంబంధించిన సంగతులనుకూడ చేర్చి ప్రకటించుచున్నాము. ఈ విషయమై కృషి చేయు వారెవ్వరైనను వ్యాసములనుగాని, వార్తలనుగాని మాకు పంపుచో సంతోషముగ స్వీకరింతుము. వీనిని మాపత్రికలో ప్రకటించుటకు బ్రయత్నింతుము. ప్రస్తుత మీ యుద్యమమున కండగ నుండు పత్రిక ప్రత్యేకముగ లేని కొరతను దీర్చు సంకల్పము మాకు గలదు. కాన వయోజన విద్యావ్యా ప్తిని వాంఛించు వారెల్లరు ఈపత్రిక నాదరింతురని యెంచెదము.
గ్రంథ సమీక్షలు
గ్రంధాలయముల నిర్వాహకులు తమతమ గ్రంథాలయములకు పుస్తకముల కొనవలసి వచ్చినపుడు ఏగ్రంధములు కొనదగనిలో ఏవికొనదగినవో తెలియక ఇబ్బంది పడుటయు, ఆలోచనలేక సంపాదించిన గ్రంధములవలన గ్రంధాలయా దర్శము సరిగ నెర వేరకపోవుటయు పరిపాటిగా నున్నది. ఈ యిబ్బందులు కలుగ కుండ నుండుటకై వేరు వేరు విషయములనుగూర్చి పరిశోధన చేసిగాని, మఱొక విధముగగాని దెలిసికొన్న వారిచే ఆయా విషయములకు సంబంధించిన గ్రంధపట్టీల తయారు చేయించ వలసిన విధి ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘముపై గలదు. దీనికి నిపుణుల సాహాయ్యమవసరము. ఇవిగాక తెలుగునను ఆంగ్లమునను నిత్యము వెలువడు సద్గ్రంధములపై విమర్శనములుకూడ ఎప్పటికప్పుడు వెలువడుచో గ్రంధ భాండాగారులు వీనిని చదువుకొని తమకుపయు కముగ నుండు గ్రంథముల వీని ఆధారముపై నెన్ను కొనుటకు వీలుకలుగును. కనుక గ్రంధకర్తలును, గ్రంధ ప్రకాశకులును తమనూతన ప్రచురములు నెప్పటికప్పుడు మాకు బంపుచో వానికి సమర్థులైనవారిచే సమీక్షలు వ్రాయించి మా పత్రికలో బ్రచురపఱతుము.
కృతజ్ఞత
ఇంతదనుక నీపత్రికానిర్వహణ విషయములో మాకు సాయపడిన సంపాదకు లకు, వ్యాసకర్తలకు, విమర్శకులకు, ముద్రాపకులకు, చందాదారులకు మే మెంతయు కృతజ్ఞులము. మాపత్రిక నాశీర్వదించుచు తమ అభిప్రాయముల కోరి నంతనే వ్రాసి పంపిన పెద్దలకు మా వందనములు. వీరందఱి తోడ్పాటును మాకు లభింపజేసిన సర్వేశ్వరునికి మా ప్రణామములు అభిమానుల సహాయము, పెద్దల ఆశీర్వచనములు ముందు కాలములో కూడ మాకు కొల్లలుగ లభింపజేసి మా పత్రిక చిరకాలము నిర్విఘ్నముగ కొనసాగున ట్లను గ్రహించుటకై పరమాత్ముని మఱి యొకసారి ప్రార్థింతుము.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse