ఆంధ్ర గ్రంథాలయం/సంపుటం 2/సంచికలు 1, 2/బాలవాఙ్మయం
బాలవాఙ్మయం
[శ్రీ చింతా దీక్షితులుగారి రేడియో ప్రసంగము]
విద్యావిధానాన్ని బాగు చెయ్యాలెననీ, అందరినీ అక్షరాస్యులను చెయ్యాలెననీ, దేశమందంతట ఉత్సాహము చెలరేగుతోంది. దొరతనములు అందుకై నడుములు బిగించినవి. ఈ సందర్భములో బాలుర కుచితమైన వాఙ్మయము మనకు కద్దా అని విచారిస్తే లేదనిచెప్పాలి. ఇట్టి లోపములు తీరిన నేతప్ప విద్యాబోధ సరి యైన పునాదులమీదపడే అవకాశంలేదు. ఈలోపము తీరడానికి (1) ప్రాచీన వాఙ్మయాన్ని ఉద్ధరించవలసియున్నది.(2) నవ్యకవులు నూతనసృష్టి చేయవలసి యున్నది. మన ముద్ధరించవలసిన ప్రాచీన బాలవాఙ్మయస్వరూప మెట్టిదో కొద్దిగా చూదాము. శిశువు జన్మించినది మొదలు బాల్యదశ వీడేవరకూకూడా వాని మనస్సుకు రంజకంగా ఉండే వాఙ్మయము వానికి అందుబాటులో ఉండాలి. తెలుగు తల్లులు తమబిడ్డలకు ఉగ్గుపాలతోపాటు కావ్యరసమున్నూ పోశారనడానికి జోల పాటలూ, లాలిపాటలూ, నిదర్శనము.
జోలపాటలు
రామలాలీ మేఘశ్యామలాలీ
తామరసనయ నా దశరథతనయలాలీ
అద్దాలతొట్టెలో నీవు అమరిఉండగా
ముద్దుపాపడంచు నిన్ను మురిసిచూచారు||రామలాలీ||
ఇందు ఒకేదేవుణ్ణి ఉద్దేశించి పాడడముండవచ్చు. లేదా పసిపాపల చిన్న బుద్ధు లకుకూడా అర్థమయ్యే విషయములతో కూడి ఉండవచ్చు.
ఉదాహరణము
(1) హాయివారమ్మాయి నీళ్ల కెళ్లింది
పాలైన యివ్వవే ఓకుక్క పిల్లా.
(2) అల్లవారింటికీ చల్ల కెడితేను
అల్లవారికుక్క బొంయిమున్నాది
నా కాళ్ల గజ్జల్లు ఘల్లుమన్నాయి.
నాచంకలోబిడ్డ కేరుమన్నాడు
(3) పిల్లెమ్మ వెళ్లింది పల్లెల్లుదాటి.
అబ్బాయివెళ్లేడు రచ్చలుదాటి
కుక్కపిల్లలూ, పిల్లిపిల్లలూ, ధ్వన్యనుకరణములూ, బాలురను ఆకర్షించేవేకదా. పిల్లలను ఆడించేటప్పుడు పాడే చందమామ పాటలు, గుమ్మడిపాటలూ, దాదం దక్కచ్చి మొదలయినవికూడా వారిని ఆకర్షించేవే.
కొందరు పిల్లలు చేరి ఆడుకొనేటప్పుడు పాడేపాటలు వారి చిత్తవృత్తుల కనుగుణమైవుంటవి.
- (1) కాళ్ల గజ్జి కంకాళమ్మ మొదలైనవి.
- (2) గుడుగుడు గుంచం గుండారావం పాములపట్టం మొదలైనవి.
- (3) ఒక్కావో చెలియా, రెండూలోగిళ్లూ మొదలైనవి.
ఇవి ముఖ్యముగా అర్థములేని అను ప్రాసప్రధాన మయిన పాటలుగా ఉంటవి.
కిండరుగార్డె౯ పద్ధతి పాటలు
కిండరుగార్టెన్ మార్చస్ అనుగుణమయిన పాటలుకూడా ఉన్నవి.
| (1) | చినచిన దొంతుల్ చిటారిదొంతుల్ | |
| (2) | బుజబుజ రేకుల పిల్లుందా | |
కట్టు కథలు
ఇక కధావాఙ్మయము ఎట్టిదంటే ప్రధమమున తల్లులుగాని, ముసలమ్మలుగాని చెప్పే చిన్ని కట్టుకధలు. మొట్టమొదట మనయిళ్లలో శిశువులు వినే చిన్న కధ చీమ కధ. అట్టివే నల్లి, పేను, వగయిరా జంతు కధలు. ఇవిగాక యంత్రాలకు సంబంధించిన మజిలీ కధలూ, పంచతంత్ర కథలూ, యదార్థకధలూ, క్రమక్రమంగా పిల్లలు నేర్చుకుంటున్నారు. ఈ పాటలలోనూ, ఈకథలలోనూ అద్భుతరసము ప్రధానముగా ఉంటుది. బాలుర నాకర్షించే రసముకూడా అద్భుతరసమే కాకుండా బాలుర చిన్న బుద్ధులు గ్రహించగలిగే హాస్యరసముకూడా వాటిలో కద్దు. వచ్చు చూపుతాను.
| (1) | వదినా వదినా వల్లంకిపిట్టా | |
| (2) | బావా బావా పన్నీరు | |
| (3) | బుర్రుపెట్ట బుర్రుపెట్ట తుర్రుమన్నది | |
కొన్నిపసిడితునకలు
ఇంతేకాకుండా ఈ బాలవాఙ్మయంలో ఏదేశపు సారస్వతానికైనా వన్నె దెచ్చే దివ్యకవిత్వపు పసిడితునకలు దొరుకుతవి. మచ్చుకు-
| (1) | ఆటమాణిక్యమే పాటమాణిక్యం | |
| (2) | ఆడుకొని అబ్బాయి వచ్చెకాబోలు | |
| (3) | అందరీమామల్లు మేనమామల్లు | |
| (4) | ఏడవకు ఏడవకు వెర్రినాగన్నా | |
మాతృప్రేమ నంతనూ కొద్దిమాటల్లో యిమడ్చడమే యీపాటలలోని ప్రతిభకు లక్షణం. ఇంకా ఈ పాటల్లో పరిశోధకులకు పనికివచ్చేటట్టులు అనేకం వున్నవి. ఈ పాటలూ కధలూ కొన్ని నన్నయ్యకుకూడా పూర్వమందు పుట్టి నేటివరకూ నిలిచి ఉన్నవి.
(1) కధలలో ఈగ కధ మిక్కిలి ప్రాచీనమైనది. ఈగకు "ఈ" అనేపేరు ఎప్పుడు వాడుకలోఉండేదో అప్పటినుంచీ ఈకధ తెలుగుదేశంలో వ్యాప్తిజెందిఉన్నది. ఈ క్రింది గేయభాగములు పరిశోధనార్హములేమో నిర్ణయించాలి.
(2) అగడం, పగడం, కవిలికిదంతం, గిరగిరచక్రం, గింజప్ప, ఆహ్, ఊహ్, కళింగ పాపడు కడ్డీ కడ్డీ కడ్డీ____ ఎవరీ కళింగ పాపడు?
(3) బోడిగుండు, బొప్పాసిగుండు
తిమ్మరాజుగారి దివిటీ గుండు
___ఎవరీ తిమ్మరాజు ? దివిటీ గుండంటే ఏమిటి ?
(4) ఏడవకు ఏడవకు వెర్రినాగన్నా
ఏడిస్తే నీకళ్లు నీలాలుగారు
(5) పిల్లిపల్లి పిల్లి పిల్లల్ల మర్రీ
మర్రిక్రిందావాడు తొర్రినాగన్నా !
___ఎవరీనాగన్న ? ఆంధ్రులకు పూర్వకాలంలో నాగన్న అనేపేరు సాధారణంగా ఉండేదికాబోలు.
(6) కొండామీాద వెండిగిన్నె
కొక్కిరాజు కాలువిరిగె
-ఎవరీ కొక్కిరాజు ? సారంగధరుడని కొందరనేమాట వాస్తవమేనా?
(7) చందామామ యిల్లూకట్టి
జాజిపూల తోటలోను
అమ్మా నేను చిన్నా దాన్ని
అల్లుడువస్తే అంపాబోకు
ఢిల్లీకోట చల్లాగుంటె
దినానికి టంకం నేదెస్తా.
ఆంధ్రులకూ ఢిల్లీ సామ్రాజ్యానికి సంబంధమున్నూ దినానికి టంకం సంపాదించే ముగ్ధలసామర్ధ్యమున్నూ యిందు గ్రహించవలెను.
కట్టుకధలలో ఒక విశిష్టగుణమున్నది. అది బాలుర జ్ఞాపకశక్తిని వృద్ధి చేయడానికి ఏర్పాటైనది. శబ్దసంబంధంవల్లనూ అర్ధసంబధంవల్లనూ గ్రహణధారణశక్తులు పెద్దవి కాగలవని సైకాలజి చెప్పుతోంది. ఇట్టిశబ్దార్థసంబంధా లీకధలలో గోచ రిస్తవి. ఉదాహరణమునకు ఈగ కధ.
ఒక ఈగ ఇల్లలుకుతూ తనపేరు మరచిపోయిందట. సర్వదేశాలలోను సర్వ చిక్కులూ విడగొట్టే పేదరాలిపెద్దమ్మ దగ్గరికి వెళుతుంది. తనకు తెలియదు కొడు కును అడగమంటుంది. ఈవిధంగా ఒకరినిబట్టి ఒకరిని అడుగుతూ పోయింది. చిట్టచివరికి ఈగ గుర్రంకడుపులో పిల్లదగ్గిరికి వెళ్ళి అడుగుతుంది. ఏమనీ_పేదరాసి పెద్దమ్మా, పెద్దమ్మ కొడకా, కొడుకు చేతిలో గొడ్డలీ, గొడ్డలికొట్టేమానా, మాను మీదుండే పక్షుల్లారా, పక్షులుతాగే నీళ్ళల్లారా, నీళ్ల లో వుండే చేపల్లారా, పట్టే పల్లెవాడా, వండే వంటలక్కా, తినేరాజా, రాజెక్కే గుర్రమా, గుర్రంకడుపులో పిల్లా, నాపేరేమిటీఅని. గుర్రం పిల్ల నవ్వుతుంది. __ ఈ ఈ ఈ అని. అప్పుడు ఈగకు తన పేరు జ్ఞాపకం వస్తుంది. ఈగకు ప్రాచీన రూపం "ఈ" అని పరిశోధకులు చెప్పుతారు. ఒకమారు పిల్లవాడు ఇట్టికధ వింటే ఇక మరచిపోడు.
బాలవాఙ్మయం కర్త తల్లి హృదయం
బాలవాఙ్మయంలో చాలా పాటలకూ కధలకూ తల్లిహృదయమే కర్తృత్వం వహిస్తుంది. ఒక్కొక్క పట్టున బాలుర ఊహాశక్తి లయ జ్ఞానముకూడా కారణమై ఉండవచ్చు. మరిన్నీ బాల్యముకోల్పోని కవుల కల్పనాశక్తికూడా యిందుకు కారణమై ఉండవచ్చును.
ఇట్టి ప్రాచీనవాఙ్మయాన్ని పునరుద్ధరించి పాఠశాలలో ప్రవేశపెట్టవలసియున్నది. ఇంతేకాకుండా దీని ననుసరించి నూతన వాఙ్మయసృష్టికూడా జరగవలసియున్నది. బాలవాఙ్మయానికి తగిన వస్తువు దొరకదేమోనని మనము భయపడనక్కర లేదు. పురాణపురుషులు పెక్కురు బాలురు మనకున్నారు. వారి బాల్యచరిత్రలు కధా వస్తువుగా మనము గ్రహింపవచ్చును.
అధిష్ఠానదేవత బాలకృష్ణుడు
బాలవాఙ్మయానికి అధిష్ఠానదేవత బాలకృష్ణుడు. తెలుగుదేశంలో బాలవాఙ్మయం కొంతవరకు బాలకృష్ణ క్రీడలపై ఆధారపడిఉన్నది. జోలలూ, మేలుకొలుపులూ, ఆటలూ, పాటలూ, కొంటెపనులు వర్ణించే కధలూ, గేయాలూ, బాలకృష్ణుణ్ణి ఉద్దేశించినవి పెక్కులున్నవి.
మిగిలిన బాల వీరులు-ధ్రువుడు, ప్రహ్లాదుడు, చిరకారి, మార్కండేయుడు. రాముడు, బలరాముడు, పరశురాముడు, వామనుడు మొదలయినవాళ్లు ఉన్నారు. ఉచితమైన బాల భాషలో వీరి చరిత్రలు వ్రాస్తే బాలవాఙ్మయం కొంత ఏర్పడుతుంది.
సూరి, నీతి, వెంకీ కథ
మరిన్నీ, ఇతర దేశపు బాలవాఙ్మయాలతో మనము ఈ కాలంలో పరిచయము సులభముగా సంపాదించవచ్చు. స్టీవెన్ సన్, హాధారన్, గ్రిమ్, ఆండర్ సన్ మున్నగువారు వ్రాసిన కధలూ, స్టెడ్ పుస్తకములు మనము ఆదర్శప్రాయంగా వుంచుకొని మనవాఙ్మయాన్ని వృద్ధిచేసికోవచ్చు. నేను ముగ్గురు తెలుగు పిల్లల బాల్యజీవనమును "సూరీ - సీతీ - వెంకీ " అనే పేరుతో కొన్నికధలుగా వ్రాశాను. ఒక కధాభాగం వినిపిస్తున్నాను.
“ముగ్గురూవెళ్ళి నడవలో కూర్చున్నారు. సూరి రెండోతరగతి వాచకము, సీతి ఒకటోతరగతి వాచకమూ, వెంకి పలకా పలకపుల్లా పట్టుకున్నారు.”
సూరి పుస్తకం జాగ్రత్తగా అట్ట వేసుకుంది. కొత్తబట్టలవిూది బొమ్మలు అట్టల విూద అంటించుకొంది. పుస్తకంలో ఒక నెమలికన్ను దానిదగ్గరే పువ్వారమూ పెట్టింది. "సీతోయి చూడవే చూడవే, ఈ నెమిలికన్నే ఎంతపువ్వారం తినే సిందో. ఒక పిల్లనైనా పెట్టదు - పాడు” అంది సూరి. సీతి తనపు స్తకంలో నెమిలి కన్నున్న పేజీతీసి “నాపువ్వారం కొంచెంతింది నా నెమిలికన్ను చూడే, అక్కా చూడే. ఎంత చిన్న పిల్లని పెట్టిందో! చూడే ఒసే" అంటూ సీతి ఒక చిన్న నెమిలి వెంట్రుక సూరికి చూపింది.
- “అది పిల్లా ఏమిటమ్మా" అంది సూరి.
- "కాదా ఏమిటమ్మా" అందిసీతి.
“నాకదియ్యవూ" అంది వెంకి. వెంకిని మభ్య పెట్టి సీతి కన్ను దాచేసుకుంది. సీతి పుస్తకము అంతా నలిగి చిరిగిఉంది.
- “అక్కయ్యా ఈ పాఠం చెప్పవుటేనాకు” అంది సీతి.
- “ఏం పాఠం" అని సూరి అడిగింది.
- “కుక్క పాఠం” అంది సీతి.
- “కుక్కపాఠ మేమిటి అసయ్యం. ఇంకా పాఠాల్లేవూ” అంది సూరి.
- “పిల్లి పాఠం, ఏనుగ పాఠం, సోమరిపిల్లవాడి పాఠం ఉన్నాయి” అంది సీతి.
- "అవేంపాఠాలే పాడుపాఠాలు. కధలు లేవూ” అని సూరి అడిగింది.
- “నృగునికధ, హరిశ్చంద్రునికథ, ఎడ్వర్డుకధ, ఫ్రాంక్లినుకథ, ఈకధలున్నాయి” అంది సీతి.
- "అ వేంకధలే, ఎంచక్కటి కథలేమీ లేవూ మనం చెప్పుకునీలాంటివి” అంది సూరి.
- “ఏమోనమ్మా నాకు తెలియదు” అంది సీతి.
- “పోనీ పద్యం చదువు” అంది సూరి.
- “చివరున్నాయే పద్యాలు చదవనా ___
- "క్షేత్రంబు పురుషకారము
- ధాత్రీశ్వర బీజమరయ దైవమురెండున్
- సూత్రపడ గూడెనేనియు ___"
- “ఏమోనమ్మా ఆపద్యాలు నాకు తెలియవు. అవేంపద్యాలోగాని” అంది సూరి.
- “సూరోయి, ఇదేం నాలుగోవాచకం" అంది సీతి.
- “ఆసిదొంగా ఇంకా నీపు స్తకం అనుకుంటున్నాను” అంది సూరి.
- “పోనీ నీపుస్తకంలో కథలు చదవవే" అంది సీతి.
- "నాపుస్తకమూ అలాగేఉందమ్మా పాడు" అంది సూరి.
- “ఒకటిచదవ్వే పోనీ” అంది సీతి.
- “అయితే చదువుతా విను” అని సూరి ఇలా చదివింది.
- “పూర్వ కాలంబున నుజ్జయిని నా బట్టణం బొండుకలదు .....”
- "బొండు బొండు బొందేమిటే సూరీ” అంది సీతి.
- “విన వే మరి” అని సూరిచదవడం సాగించినది.
- “అందు వీరసేనుండను భూతలేంద్రుండు రాజ్యము సేయుచుండెను. అతనికి జంద్రకళయను పేరం బరగు కళత్రంబు సకలగుణోపేత...”
- “పేత పేత మేతేమిటి పీత" అంది సీతి.
- “పోనీ అమ్మా నేచదవను” అని సూరి పుస్తకము మూసేసింది.
నేను వ్రాసిన లక్కపిడతలలోంచి ఒక గేయం.
బాజాలురా నాన్న బాజాలు
బాజాలు వచ్చేయి బాజాలు
బాజాలతో వచ్చె పల్లకీ అదుగో
పల్లకీలో ఉంది పార్వతీదేవి
పార్వతీదేవికీ జేజేలు పెట్టు
బాజాలురా నాన్న బాజాలు
బాజాలు వచ్చేయి బాజాలు.
ఇంకా బాలవాఙ్మయాన్ని సృజించిన, సృజస్తున్న గ్రంధకర్తలు మనలో ఉన్నారు. గురజాడ అప్పారావుగారి ఆడపిల్లల పాట చిత్తగించండి:-
“ఆటల పాటల పేటికలారా
కమ్మనిమాటల కొమ్మల్లారా
కలువలకన్నెల కన్నెల్లారా
పిల్లలగన్న తల్లుల్లారా
"కొండల నడుమను కోనొకటుంది
కోనకి నడుమ కొలనొకటుంది
కొలని గట్టున కోవెలలోపల
వెలసెను బంగరు దుర్గమ్మ.
ఏయే ఋతువుల పూచే పువ్వుల
ఆయాఋతువులు అందించి
బంగరు దుర్గను బక్తితో కొలిచెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ."
పసితనమందు పిల్లలకు యిట్టి సారసత్వముతో పరిచయము కలిగినప్పుడే వారిజీవితవృక్షానికి సరియైన దోహద మేర్పడుతుంది.
“ఫక్కున సూర్యుడు నవ్వేడంటే
పట్ట పగలు ఈలోకముకు
ఫక్కున చంద్రుడు నవ్వేడంటే
చల్లని వెన్నెల జగములకు
ఫక్కున పాపాయి నవ్వేడంటే
పరమానందం నీకూ నాకూ
అవునా కాదా అలివేణి.”
(19-9-38 ఆంధ్ర వార పత్రిక నుండి)
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse