Jump to content

ఆంధ్ర గ్రంథాలయం/సంపుటం 2/సంచికలు 1, 2/గ్రంథాలయనిర్వహణము

వికీసోర్స్ నుండి

గ్రంథాలయ నిర్వహణము*[1]

శ్రీ సీతాంబరం వేంకటకృష్ణ మాచార్యులు
శారదా గ్రంధాలయ భాండాగారి, అనకాపల్లి

"విద్యాసేవ విజానాతి విద్వజ్జనపరిశ్రమమ్” అను న్యాయానుసారము జ్ఞానాభ్యుదయకారణమగు గ్రంథాలయ నిర్వహణమందలి శ్రమ గ్రంథాలయ నిర్వాహకులకే గోచరము.

గ్రంధాలయనిర్వహణము వెన్నమీగడ లారగించి పువ్వులపాన్పున పరుండుట కాదు. గ్రంథాలయనిర్వహణము ఆదర్శముగ నుండవలెనన్నచో పాలకవర్గము వారు ఆదర్శప్రాయులుగ నుండవలెను. అంతియేకాక వారిచే గ్రంథాలయ నిర్వహణ నిమిత్తము ప్రత్యేకముగ నేర్పాటుచేయబడిన గ్రంధభాండాగారి సమర్ధుడుగను, ఆదర్శపురుషుడుగను నుండవలెను. పాలకవర్గమువారు గ్రంధ భాండాగారిని జీతమిచ్చి పోషించునౌకరుగ చూడరాదు. అతడు పాలకవర్గమందు చేర్చబడక పోయినప్పటికిని గ్రంధపాలనా కార్యక్రమమున నీతనికి సంపూర్ణ స్వాతంత్య్రముండునుగాన పాలకవర్గమువా రీతని సలహాల ననుసరించియే నిబంధనలు చేయవలసియుండును.

గ్రంథ భాండాగారి

గృహమునకు గృహిణి, నౌకకు సరంగు, దేవాలయమునకు అర్చకుడు, సంస్థానమునకు ప్రధాని, పశువులకు కాపరి, భూమికి రైతు ఎట్టివారో గ్రంధాలయమునకు గ్రంథభాండాగారీ అట్టివాడు. రమణీయములగు భవనములనిర్మించి అందు పట్టీల ప్రకారము పుస్తకములు సర్దవచ్చును గాని సరియగు గ్రంథభాండాగారులు లేనిదే అవి గ్రంధాలయములనబడవు. గ్రంథభాండాగారి పుస్తకములను సర్దుబాటు చేయువాడుగ నుండినంతమాత్రముచే చాలదు. అతడు పలుకుబడిగలవాడుగ కూడ నుండవలెను. అనేక సద్గ్రంధముల పఠించినందువలన కలుగు జ్ఞానము గ్రంధభాండాగారి సహవాసమువలన కలుగవలెను. గ్రంధాలయము సజీవమైనదని చెప్పుటకు గ్రంధభాండాగారి ప్రాణవాయువువంటివాడు కావలెను.

గ్రంథాలయ పరిసరములయొక్కయు, పాఠకుల యొక్కయు, పాలకుల యొక్కయు, గ్రామము యొక్కయు పరిస్థితులు గ్రహించి ఆదర్శమునకు భంగము కలుగనంతవరకు గ్రంథాలయాభివృద్ధికి అనువగు మార్గముల అమలు పరచుటకు తగువ్యవహారజ్ఞానము గ్రంధభాండాగారి కలిగి యుండవలెను. భిన్నభిన్న ప్రవృత్తులుగల వ్యక్తులు అనేకమంది గ్రంథాలయమునకు వచ్చుచుందురుగాన వారిలో తన ప్రవృత్తికి విరుద్ధముగ నున్న వారిని నిర్లక్ష్యము చేయక ఆదరించి వారు కోరుగ్రంథముల నిచ్చుచు వారితో పరిచయము కలిగించుకొని వారిని సత్ప్రవర్తకులుగా దిద్దుబాటు చేయవలెను. అట్లని వారితో కాలము గడుపుచు తనవిధ్యుక్తధర్మమును మరువరాదు.

గ్రంథాలయమునకు వచ్చువారిని ఆకర్షించి జ్ఞానవంతులుగ చేయునట్టి చిత్రముల తోను సూక్తులతోను గ్రంథాలయమును అలంకరించవలెను. హెచ్చుమంది గ్రంధాలయమునకు వచ్చునటుల చేయుటయే గ్రంథ భాండాగారియొక్క ముఖ్యవిధి. గ్రంథా లయమునకు వచ్చినవారందరూ అచ్చట ఉన్నంతసేపు నిర్విచారముగ నుండునటుల చేయుటకు వారినాకర్షించు మంచి వార - మాస పత్రికలు తెప్పించుచుండవలెను. దేశపురోభివృద్ధికి ముఖ్యులగు పిల్లలను ఆకర్షించి బుద్ధిమంతులుగ చేయుకొరకు అందమగు పటములతోకూడిన చారిత్రక పుస్తకములను, కధల పుస్తకములను తెప్పించవలెను. గ్రంథాలయమందు ఇతర పుస్తకముకంటే విమర్శక గ్రంథములు హెచ్చుగా నుండవలెను. విమర్శనాదృష్టితో గ్రంధములు చదివినవారు చేయు సూచనలను రికార్డు చేయవలెను. గ్రంథ భాండాగారి తెలుసుకొన్న విషయములను గ్రంధాలయమునకు వచ్చువారికి తెలుపుచుండవలెను. ప్రతిమాసమందును గ్రంథాలయమందు చేర్చబడిన పుస్తకముల పట్టికను ప్రచురణ చేయుచుండవలెను. దీనిని నోటీసుబోర్డుకు అంటించవలెను. పుస్తకముల పేర్లనుబట్టియు, గ్రంధముల తరగతులనుబట్టియు విభజన చేసి వరుసగ వ్రాసి చదువరుల కొసంగు చుండవలెను. పత్రికలయందలి ముఖ్య విషయములను (సారాంశములను) నల్లబల్లపై వ్రాసి గ్రంధాలయముసకువచ్చువారికి కనబడునట్లు ఉంచవలెను. పారకులు గ్రంధములను భద్రముగ చదువునటుల ప్రోత్సహింపవలెను. ఉపయోగమున కనుకూలముగనుండు పద్ధతిని పుస్తకములు నేర్పాటు చేసి నెల కొకసారి పుస్తకముల నన్నిటిని పరిశీలించి క్రమ సంఖ్యప్రకారము సరిగావుంచుచు చెదలు మొదలగు పురుగుల వల్ల చెడకుండుటకు కర్పూరమాత్రలు మొదలగు రక్షణ ద్రవ్యములను గ్రంధపేటికలయందు జల్లుచుండలెను. తనతోడి సేవకులను హింసించక ఉత్సాహపరచి గ్రంధాలయాభివృద్ధికి పాటు పడునటుల చేసి వారితో తానుకూడ పనిచేయవలెను. | పాలక వర్గము వారికిని తనకును అభిప్రాయభేదములు కలిగినప్పటికిని స్పర్ధ వహించి గ్రంథాలయ పురోభివృద్ధికి భంగము కలిగించరాదు. భావికాలప్రవర్తన కుపయుక్తమగు గ్రంధములను, ఎంతధనము వెచ్చించినను దొరకని పుస్తకము లను, తాళపత్రగ్రంధములను కడుభద్రముగ జాగ్రత్తపరచి గ్రంథభాండాగారి వాటిని అర్హులగువారికేయిచ్చి పుచ్చుకొనుచుండవలెను. చిన్నవారలకొర కుపయోగింపబడు పుస్తకములను తప్పకకొనవలెను. వారే గ్రంధాలయమున కర్హులైన శిష్యులు. వారివల్ల గృహములభివృద్ధిపొంది దేశక్షేమము కలుగును. ఒక్కొక్క గ్రంథాలయములో నొక్కొకవిధమగు జ్ఞానమునిచ్చెడు పుస్తకములు చాల యుండవలెను.

పూర్వగ్రంధములను ఆధునిక గ్రంధములను చదివి వాటి మూలాధారముల తెలిసికొనుట గ్రంథాలయ సమితి సభ్యులకంటే గ్రంథభాండాగారి ముఖ్యవిధి. సంఘముయొక్క గుణములను బట్టియు, విద్యావిషయమును బట్టియు, నివాసుల వృత్తులబట్టియు గ్రంథాలయము యొక్క పలుకుబడి యుండును. గ్రంథాలయమును ఆదర్శముగ నడుపుటకును, చదువరుల కుపయోగపడు వంశములు తలపునకు వచ్చినపుడు చెప్పుటకును గ్రంధభాండాగారి సందేహపడకూడదు. గ్రంధవిమర్శ చేయుచు చదువరులకు కావలసిన విషయములు తెలియచేయవలెను. గ్రంథాలయములోని కార్యమునంతయు శ్రద్ధతో నిర్వహించవలెను.

పాలకవర్గము

గ్రంథాలయ పాలకులు అహంభావమును, మనస్పర్ధలను విడనాడి గ్రంథాలయముద్వారా విజ్ఞానము వెదజల్లు సదుద్దేశముతో శ్రద్ధగా పనిచేసిన యెడల త్వరలో గ్రంధాలయము అభివృద్ధిలోనికివచ్చి ఆదర్శముగ వెలయగలదు. 'నువ్వు దగ్గు, నేను పక్క లెగుర వేయుదును' అను న్యాయానుసారము పనిఅంతయు ఒకనిసేత్తినిరుద్ది వీరు తాత్కాలికముగ హోదాలు చెలాయించుటకు వచ్చుచుండిన ఫలితముకూడ అటులేయుండును.

అనుకూలమగుదినములను నిర్ణయించి నెలకు 4 దినములు గ్రంథాలయమునకు సెలవులుయిచ్చి ఆ సెలవుదినములలో వరుసగా తొలిదినమున గ్రంథాలయము పరిశీలించుటయు, మలిదినమున కొత్తచందాదార్లను చేర్చుటకు గ్రామమందు సంచారము చేయుటయు, మూడవదినమున బకాయి చందాదార్లను కలిసికొని సొమ్ము వసూలు చేయుటయు, నాల్గవదినమున కాలాతిక్రమణముపొందిన పుస్తకములు వసూలు చేయుటయు జరిగించవలెను.

పురాణపఠనముద్వారాను, ఉపన్యాసములు మూలమునను, ఆదర్శ పురుషులు జయంత్యుత్సవములు జరుపుటవలనను, పోటీపరీక్షలు జరిపించుట వలనను, మ్యాజిక్ లాంతరు ప్రదర్శనమువలనను, రాత్రి పాఠశాలలు నెలకొల్పుటవలనను వయోజనులను, బాలురను విజ్ఞానవంతులుగ చేయవలెను. గృహపరిశ్రమలకు సంబంధించిన ప్రదర్శనముల జరిపించి స్త్రీలోకమునకు విజ్ఞానమును వెదచల్లవలెను. నవరాత్రములందు సంగీతకచేరీలు మున్నగువాని నేర్పరచి ప్రజల నాకర్షించవలెను. గ్రంథాలయ యాత్రలు సాగించి గ్రంథాలయ ఉద్యమవ్యాప్తికి తోడ్పడవలెను. మరియు యాత్రలందు సమీపమునగల పురాతన చారిత్రక ప్రదేశములు దర్శించి అందలివి శేషముల రికార్డు చేయుటయు, తాళపత్రగ్రంధముల సేకరించుటయు, వానిని కేంద్ర గ్రంథాలయ భవనములందు భద్రపరచుటయు జరుగవలెను. యాత్రావిశేషములను పత్రికలయందు ప్రచురణ చేయించు చుండవలెను.

ప్రతి గ్రంధాలయమువారును ఆంధ్రదేశ గ్రంధాలయ సంఘమందు సభ్యత్వమునుపొంది ఆదర్శప్రాయమగు కట్టుబాట్లతో గ్రంధాలయోద్యమమును కొనసాగించవలెను. దీపావళి సంక్రాంతి భిక్షులకు బయలుదేరి గ్రంథాలయమునకు మూల ధనమును చేకూర్చి తద్వారా ప్రతి గ్రంథాలయమునకు స్వంతభవనమును నిర్మించవలెను. గ్రంధాలయముగల గ్రామముయొక్క వివరమును వ్రాయించి వచ్చు వారికి కనబడునటులు గ్రంధాలయ భవనమున ప్రదర్శించవలెను. గ్రామప్రజలకు దేశభాషాజ్ఞానమును, పిమ్మట ఇతర భాషా పరిచయమును, జీవితానంద సంధాయకములగు కళలందును, స్వతంత్ర జీవనాధారంబులగు పరిశ్రమలయందును అభిరుచిని కలిగించవలెను.

ప్రజలు

గ్రంథాలయనిర్వహణమున ప్రజలు కూడ భాగస్వాములే. వారికి అవకాశము కలిగినపుడు కాలమును వృధాపుచ్చక గ్రంధాలయమునకు వచ్చి పత్రికాపఠనమును, సద్గ్రంధపఠనమును చేయుచుండవలెను. గ్రంథాలయమందు జరుగు ప్రతి సభకు హాజరగుచుండవలెను. వారివారి గ్రామములయందలి ఉన్నత భవనములకు మిన్నయగు ఆలయమును శ్రీశారదాదేవికి నిర్మించవలెను. అందరు చందాదారు లుగా చేరియు, విరాళములు సమృద్ధిగ నొసగియు, గ్రంథాలయ సేవజేసియు జీవితముల సార్ధకము చేసికొనవలెను.

గ్రంథాలయ సేవకులు

మన తెలుగు దేశమందలి గ్రంధాలయ సేవకులందరూ సంవత్సరమున కొకసారి అయినను ఉద్యమవ్యాప్తికి అర్హమగు వేరు వేరు ప్రదేశములందు సమావేశమై వారి వారి అనుభవములను ఒకరికొకరు “బోధయ స్తః పరస్పరమ్" అను న్యాయానుసారము తెలుపుకుంటూ మనదేశమందలి అన్ని గ్రంథాలయములయందు ఒకే మోస్తరు రిజిస్టర్లు ఉంచి ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘమందు ప్రతి గ్రంథాలయమును చేర్చి సక్రమమార్గమున ఉద్యమవ్యాప్తిగావించి తద్వారా ప్రజలలో విజ్ఞానమును వెదజల్లి తమవిధులను నిర్వర్తించుచుందురుగాక యని ప్రార్ధించుచు ముగించుచున్నాడను.

గ్రంథాలయోద్యమవ్యాప్తిమూలమున ధర్మయుగస్థాపనకు భగవాను డనుకూలించుగాక !


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2025, prior to January 1, 1965). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse

  1. రాజమహేంద్రవరమున గౌతమీ గ్రంథాలయభవనమున కూడిన 22వ ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభలో చదివిన ఉపన్యాస భాగము