Jump to content

ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/వెన్నెలకంటి సూరన్న

వికీసోర్స్ నుండి

వెన్నెలకంటి-సూరన్న


ఈ కవి విష్ణుపురాణమును తెనిఁగించెను. ఇతఁడించుమించుగా పదునేనవ శతాబ్దాంతము నందుండినట్టు తోఁచుచున్నది. విక్రమార్క చరిత్రమును కృతినందిన పెద్దన్న మంత్రికి పెద్దతండ్రి యయిన వెన్నెలకంటి సూరయ్య యనుకవి యొకఁడు వేమారెడ్డికాలములో నున్నట్లు విక్రమార్క చరిత్రము లోని యీ క్రిందిపద్యమువలనఁ దెలియవచ్చుచున్నది.

        ఉ. వెన్నెలకంటి సూర్యుఁడు వివేకగుణాడ్యుఁడు వేదశాస్త్రసం
            పన్నుఁడు రెడ్డి వేమనరపాలకుచేత మహాగ్రహారముల్
            గొన్న కవీంద్రకుంజరుఁ డకుంఠిత తేజుఁడు పెద్దతండ్రిగా
            సన్నుతిఁగన్న సిద్దనకు సంతత దానకళా వినోదికిన్.

ఇందుఁ జెప్పఁబడిన రెడ్డవేముఁడు, ప్రోలయ వేముఁడు, విష్ణుపురాణమునందు కవిచే నీ కవిని గూర్చియే యీ క్రింది పద్యమునందు వ్రాయఁబడి యున్నది.

        ఉ. ఈ నిఖిలంబు మేచ్చ నమరేశ్వర దేవుడు చూడఁ గృష్ణవే
           ణీనది సాక్షిగా ననికి నిల్చిన రావుతుఁ గేసభూవిభుం
           గాసకుఁ దోలి వెన్నడిచి కాచిన వేమయయన్న పోతభూ
           జానికి సత్ప్రబంధము లొసంగిన వెన్నెలగంటివారిలోన్.

ఈ రెండు పద్యములలోను వర్ణింపఁబడిన వెన్నెలగంటి యతఁడొక్కఁడే యనుటకు సందేహము లేదు. మొదటి పద్యములో "వేమనరపాలకుచేత మహాగ్రహారముల్ గొన్న కవీంద్రకుంజరుఁ" డనియు, రెండవపద్యములో “వేమయ యన్న పోతభూజానికి సత్ప్రబంధము లొసంగిన వెన్నెలగంటివా" రనియుఁ జెప్పఁబడి యున్నను, వేమారెడ్డియు, నాతని పుత్రుడైన యనపోతరెడ్డియు నేకకాలమునందే యుండినందున వెన్నెలకంటి సూరయ్య

దండ్రీకొడుకుల కిద్దఱికిని ప్రబంధము లంకితముచేసి బహుమానములొంది యుండవచ్చును. అంతేకాక యనపోత రెడ్డి దండనాధుఁడుగా నుండి తండ్రి జీవితకాలములోనే ప్రసిద్ది చెందియుండెనని యెఱ్ఱా ప్రెగడ హరివంశము నందు స్పష్టముగాఁ జెప్పఁబడి యున్నది. వేమారెడ్డి హూణశకము 1320-వ సంవత్సరము మొదలుకొని 1349 వ సంవత్సరము వఱకును, అతని పుత్రుఁడైన వేమయయనపోతారెడ్డి 1350 వ సంవత్సరము మొదలుకొని 1361 వ సంవత్సరమువఱకును, రాజ్యము చేసినందున వారి యాస్థానము నందుండిన కవి వెన్నెలకంటి సూరన్న యా కాలమునందే నిస్సంశయముగా నుండినవాడు. ఈ కవి రచియించి యనపోతరెడ్డి కంకితముచేసిన ప్రబంధములేవో తెలిసినవి కావు. మనలో సాధారణముగా తాత పేరు మనుమనికి పెట్టుచుండుట యాచారమయినందున, విష్ణుపురాణమును రచించిన యీ సూరన్న పయి సూరన్నకు మనుమఁడో, మనుమని మనుమఁడో యయి యుండవలెను. ఈ కవి తాను అనపోత రెడ్డికి ప్రబంధము లొసంగిన వెన్నెలకంటివారి వంశజుఁడ ననియు; వెన్నెలకంటి సూర్యుని మనుమఁడ ననియు, వేఱువేఱుగాఁ జెప్పుకొనుటచేత నీతఁడు వేమారెడ్డి కాలములో నున్న సూరన్నకు మనుమని మనుమఁడగుట స్పష్టము. కవి మొదటిసూరన్న కయిదవతరము వాఁడగుటచే నిరువురకును నూఱు సంవత్స రములకంటె నెక్కువ వ్యత్యాసముండి యుండవలెను. కాబట్టి యీ కవి 1460-వ సంవత్సరమునకు 1480 వ సంవత్సరమునకును నడిమికాలములో నుండినట్లు నిశ్చయింపవలసియున్నది.

[ఇయ్యెడ 'ఆంధ్రకవితరంగిణి' లో (సం, 8 పుట 213,214) నిట్లున్నది- 'పంతులుగారు వ్రాసిన యంశము లన్నియు నూహాజనితములేకాని, యొక యాధారముననుసరించి వ్రాసినవికావు, పంతులుగారి యూహ సత్యమైనను కావచ్చును. అట్లుకాక వారిరువురును వేఱువేఱు వ్యక్తులైనను కావచ్చునని, విష్ణు పురాణకర్త అనపోతారెడ్డికి సత్ప్రబంధము లొసంగిన వెన్నెలకంటివారని మాత్రమే చెప్పెను. కౌని వేమారెడ్డియొద్ద నగ్రహారములను గైకొనిన సంగతినిగూర్చి

యేమియుఁ జెప్పలేదు. వారొక్కరేయైనను, నిర్వురైనను విష్ణుపురాణకర్తయైన సూరనార్యునికి తాత గాని. యాతని తాతగాని పై పద్యములలోని సూర్యులలో నెవఁడును గాఁడు. వీరు వారికంటే భిన్నులు; .... .... ఒకప్పుడీ సూరన యాతని వంశ పరంపరలోనివాఁడు కాక వెన్నెలకంటి వారని గృహనామము గల మఱియొక వంశీయుఁడైనఁగావచ్చును. ......... (పుటలు 216,217) వేమారెడ్డి, అనపోతారెడ్డి ప్రభువుల కాలములో నున్న వెన్నెలకంటి సూర్యునిఁబట్టి కాలనిర్ణయముచేయుచు, గురుజాడ శ్రీరామమూర్తి పంతులుగారు కవికాలము క్రీ. శ. 1378-1428 అనియును, వీరేశలింగము పంతులుగారు 1460-1480 అనియును నిర్ణయించియున్నారు. కాని, ఆ నిర్ణయము సరియైనదికాదు. .... .... (పుట 224). ఈ సూరనార్యుఁడు పదునారవ శతాబ్దియందున్న వాడని స్పష్టము.]

ఈ కవి విష్ణు పురాణమునందు తన్నుఁగూర్చి చెప్పుకొన్న పద్యము నిందుదాహరించుచున్నాను.

        సీ. భవ్యచరిత్రు నాపస్తంభమునిసూత్రు
                          శుద్ధసారస్వతస్తోత్రపాత్రు
            హరిత గోత్రపవిత్రు నాంధ్రభాషాకావ్య
                          రచనాభినయవిశారదుఁ బ్రబంధ
            కర్తను వెన్నెలకంటి సూర్యునిమను
                          మనిఁ జెఱుకూరి యమరయమంత్రి
            సత్పుత్రు నాశువిస్తారవిచిత్రమా
                          ధురకవిత్వచాతుర్యశీలు

            నిజకులాచారమార్గైకనివుణుఁ బరమ
            సాత్వికోదయహృదయ వైష్ణవపురాణ
            వేది సారస్యవిద్యాప్రవీణు సుకవి
            మాననీయుని సూరనామాత్యవరుని.

ఈ విష్ణుపురాణ మలసాని పెద్దన్న ప్రబంధరచనకు దారితీయుటకుఁ గొంత కాలము ముందుగా పదునైదవ శతాబ్దాంతమునఁ జేయబడినదిగా నున్నది. ఈ కవి శ్రీనాథాదులను దన పుస్తకమునందుఁ బూర్వకవులను గా స్తుతింపక,

          ఉ. మున్నిటికాళిదాసకవిముఖ్యులకుం బ్రిణమిల్లి వారిలో
              నెన్నికగాఁ బ్రబంధపరమేశ్వరుఁ దిక్కనసోమయాజినిన్
              నన్నయభట్టు భాస్కరుని నాచనసోముని రంగనాధునిన్
              వెన్నెలగంటిసూర్యుఁ బదివేలవిధంబుల గొల్చి భక్తితోన్

అని వెన్నెలగంటి సూర్యునికాలమువఱకు నున్నకవులను మాత్రమే స్తుతించినను, ఇతఁడు శ్రీనాథాదుల కాలమునకుఁ దరువాతివాఁడయినట్టు విష్ణుపురాణకృతిపతియైవ రావూరి రాఘవరెడ్డి కృతు లందిన తన పూర్వులను గూర్చి చెప్పిన యీ క్రింది పద్యమువలన తేటపడుచున్నది.
  
          క. ఆనవేమమండలేశ్వరుఁ
             డును వళ్ళయవీరభద్రుఁడును మొదలుగఁ గ
             ల్గినతొంటిరెడ్డిరాజులు
             ఘనకీర్తులు గనిరి కృతిముఖంబున ననుచున్.

శ్రీనాథునిచేఁ గాశీఖండము కృతినంది 1435 వ సంవత్సరప్రాంతములం దుండిన వీరభద్రరెడ్డిని తన పూర్వులలో నొకనిగా కృతిపతియైన రాఘవరెడ్డి చెప్పుటచేత విష్ణుపురాణము రచియింపఁబడినకాల మటు తరువాత నేఁబది యఱువది సంవత్సరములయిన నయి యుండవచ్చును. కృతిపతియైన రాఘవరెడ్డి యనవేమారెడ్డి వంశజుఁడని చెప్ప నుద్దేశించిన పద్యములీ విష్ణువురాణములోఁ గొన్ని కలవు.
  
         ఆ. అట్టి పంటకులమునందు నేడవ చక్ర
             వర్తి యన్న వేమవసుమతీశు
             డుద్బవించి కీర్తియును సత్ప్రతాపంబు
             నెసఁగ భూమి యేల్ల నేలుచుండె.

            క. తన బ్రతుకు భూమిసురులకుఁ
               దన బిరుదులు పంటవంశధరణీశులకున్
               దన నయము భూమి ప్రజలకు
               ననవేమన యిచ్చెఁ గీర్తి నధికుం డగుచున్.

ఈ పద్యములతరువాత సంబంధ మేమియుఁ దెలుపకయే లింగారెడ్డి తేఁబడి తదాదిగా కృతిపతియైన రాఘవ రెడ్డివఱకును వంశము చెప్పఁబడినది. కృతిపతిని సంబోధించెడి చతుర్థాశ్వాసాంతమునందలి యీ క్రింది పద్యమునందు బసవయరాఘవరెడ్డి సరిగా ననవేమభూపాలుని వంశమువాఁడనియే చెప్పఁబడినది.

           మ. అనవేమక్షితిపాన్వయోత్తమ! సముద్యద్వైభవోపేంద్ర ! కాం
               చనభూమీధరధైర్య ! శాశ్వతయశస్సంపన్న ! దైతేయశా
               సనపూజాపరతంత్ర ! నామితరిపుక్ష్మాపాలకోటీర ! శాం
               తనవప్రాభవ ! సత్కవీంద్రకవితాతాత్పర్య ! శౌర్యోన్నతా!

కృతిపతియైస రాఘవరెడ్డిపైని జెప్పఁబడినట్లన వేమక్షితిపాన్వయుఁడే యయిన పక్షమున, అనవేముఁడు పురుషసంతానము లేనివాఁ డగుటచేత నాతనిపుత్రసంతతివాఁడు గాక దుహితృసంతతివాఁడయి యుండవలెను. లేదా యనవేముని పినతండ్రి సంతతిలోనివాఁడయి జ్ఞాతివర్గమునఁ జేరిన వాఁడయి యుండును. కృతిపతిజనకుఁడైన తమ్మయబసవరెడ్డియుఁ దరువాత నీరాఘవ రెడ్డియు ప్రౌఢదేవరాజాదులగు కర్ణాటకచక్రవర్తులచేత నుదయగిరి రాజ్యపరిపాలకులుగా నియమింపఁబడి చిన్న సంస్థానమునకు ప్రభువులయి యుండినట్టు కనుపట్టుచున్నది.

            క. వారలలోపల బసవ
               క్ష్మారమణుడు పేరుపెంపుగల మన్నీఁడై
               భూరిప్రతాపజయల
               క్ష్మీరతుఁడై వెలసె నుదయగిరిరాజ్యమునన్

      సీ. కటకాధిపతియైన గజపతిరాజుచేఁ
                    బ్రతిలేనిపల్లకిపదవి నొందె
          మహిమచేఁ గర్ణాటమండలాధివుచేత
                    గడలేని రాజ్యభోగములు గాంచెఁ
          బ్రౌఢపౌరుషమున రాజిల్లి మెఱయఁగా
                    మలకవజీర్ల కుమ్మలికఁ జేసెఁ
          దెలుగాణభూములఁగల మన్నె వారిచే
                    బలవంతమునను గప్పములు గొనియెఁ

          జాటుధాటీనిరాఘాట ఘోటకావ
          శీఖరోద్ధూతనిబిడధూళీవిలిప్త
          మండితాశాంగనాకుచమండలుండు
           బాహుబలశాలి తమ్మయబసవవిభుఁడు.

రాఘవరెడ్డి విష్ణు పురాణషష్ఠాశ్వాసాంతపద్యములలో నొకదానిలో నిట్లు సంబోధింపఁబడెను.

     ఉ. చాటుతరప్రబంధకవిసన్నుత ! సంగరపార్థ ! ధీరతా
         హాటక శైల ! నిత్యవినయప్రతిభావిభవాఢ్య ! భూమిభృ
         త్కూటగుహావహిత్థ నృపకుంజర ! సంగడిరక్ష ! క
         కర్ణాటనరేంద్రదత్త సముదంచిత శాశ్వతరాజ్యవైభవా !

ఈ రావూరి రాఘవ రెడ్డికి గుడ్లూరు రాజధానిగా నుండినట్లీ క్రింది పద్యము లోఁ జెప్పఁబడినది.

     సీ. గౌరీసమేతుఁడై గరీమతో నే వీట
                నేపాఱు నీలకంఠేశ్వరుండు
        వారాశికన్యతో వర్తించు నే వీట
                గిరిభేదిసుతుఁడైన కేశవుండు
        యోగినీసహితయై యొప్పారు నే వీటఁ

               బసిడిపోలేరమ్మ భవునికొమ్మ
      పాపవినాశియై ప్రవహించు నే వీట
               మన్నేఱు మిన్నేటిమార టగుచుఁ

      గుంజరములు వేయి కొలువంగ నేవీటఁ
      గొడగుచక్రవర్తి పుడమి యేలె
      నట్టి రాజధానియై యొప్పు గుడ్లూరి
      నొనర నేలుచుండి యొక్కనాఁడు.

  సీ. వేదాంతవిదులైన విద్వాంసు లొకవంక
                నుభయభాషాకవు లొక్కవంక
      సకలాప్త బాంధవ సంబంధు లొకవంక
                నుద్దటుమన్నె కొమారు లొక్కవంక
      నీతికోవిదులై న నెఱమంత్రు లొకవంక
                నుద్దండరణశూరు లొక్కవంక
      సంగీతసాహిత్యసర్వజ్ఞు లొకవంక
                జొక్కంపుభరతజ్ఞు లొక్కవంక

      రాజురాజులు పంచిన రాయబారు
      లొక్కవంక విలాసిమ లొక్కవంక
      బలసికొలువంగ నతులవైభవముతోడ
      రమణఁ గొలువుండి బసవయరాఘవుండు.

ఈ పద్యములపయి గద్యమునందు రాఘవరెడ్డి "రావూరిపురాధీశ్వరుఁ" డని చెప్పఁబడినది. రావూరు గుంటూరునకును, కొండవీటికిని మధ్యను గుంటూరుమండలమునందున్నది. గుడ్లూరు నెల్లూరుమండలములో పాకనాటిసీమలోని కందుకూరుతాలూకాలో నున్నది.
కృతికర్తయైన వెన్నెలగంటి సూరన్న కవి ఇంచుమించుగా 1480-90 వ సంవత్సర ప్రాంతములయందు విష్ణుపురాణమును జేసెనని చెప్పవచ్చును.

ఈ కవికాలమును నిర్ణయించుటకు విష్ణుపురాణమునందింకొక చిన్నయాధారముకూడఁ గానఁబడుచున్నది కృతిపతియైన రాఘవరెడ్డికి తిరుమల తాతా చార్యులమనుమఁడైన సింగరాచార్యుఁడు గురు వయినట్లే క్రింది పద్యము నందుఁ జెప్పఁబడియున్నది.

        సీ. వేదాంతవిద్యావివేకి షడ్దర్శన
                     పారంగతుఁడు పరాపరరహస్య
            వేది బహ్మాండాదివివిధపురాణజ్ఞుఁ
                     డసమాన ధర్మశాస్త్రాభినేత
            కుశలుండు పరమార్థకోవిదు డఖిలాధ్వ
                     రక్రియానిపుణుఁ డవక్రకావ్య
            నాటకాలంకారనానాకళాభిజ్ఞుఁ
                     డుభయభాషాకవిత్వోజ్జ్వలుండు

            పరమవైష్ణవమార్గతత్పరుఁడు కీర్తి
            ధనుఁడు తిరుమలతాతయ్యమనుమడైన
            సింగరాచార్యు గురువుగా సేవచేసి
            రమణఁ జెలువొందె బసవయరాఘవుండు.

ఈ పద్యములో రాఘవరెడ్డి తిరుమలతాతాచార్యుని మనుమఁడైన సింగరాచార్యునికి శిష్యుఁడని చెప్పబడినను షష్ఠ్యంతపద్యములలో నొక్కటియైనయీ పద్యమునందు సరిగా తిరుమలతాతాచార్యుని శిష్యుఁడేయని చెప్పఁ బడెను.

          క. తిరుమలతాతయదేశిక
             వరశిష్యున కనుపమేయమై దుష్యునకున్
             బరభూపాల తమస్సం
             హరణాదిత్యునకుఁ బల్లవాదిత్యునకున్
రాఘవరెడ్డి బాల్యమున వృద్ధుఁడైన తిరుమల తాతాచార్యునకును తదనంతరమునఁ దత్పౌత్రుడైన సింగరాచార్యునకును గూడ శిష్యుఁ డయి యుండ

వచ్చును. ఇది యిట్లుండఁగా గళాపూర్ణోదయమునందు నంద్యాల కృష్ణరాజునుగూర్చి చెప్పఁబడిన షష్ఠ్యంతపద్యములలో

       క. విశ్రుతతిరుమలతాతా
          ర్య శ్రేష్ఠాన్వయసుదర్శనాచార్యతనూ
          జశ్రీనివాసగురుచర
          ణాశ్రయణసమాగ్జితాఖిలాభ్యుదయునకున్

అనీ పింగళసూరన్న 1560 వ సంవత్సర ప్రాంతములయందుండిన కృష్ణ రాజునకు తిరుమల తాతాచార్యవంశజుఁడయిస సుదర్శనౌచార్య పుత్రుఁడగు శ్రీనివాసాచార్యుఁడు గురువయినట్లు చెప్పుటచేత సరిగా తిరుమల తాతాచార్యునకును, నాతని మనుమఁడై న సింగరాచార్యునకును శిష్యుఁడైన రాఘవరెడి యంతకుఁ బూర్వము డెబ్బది యేనుఁబది సంవత్సరములు పూర్వుఁడయి యుండవలెను. పయిని జెప్పఁబడిన రెండు మూఁడు హేతువులను మొ త్తముమీఁద విమర్శించి చూడఁగా విష్ణుపురాణకర్తయగు వెన్నెలకంటి సూరన్న హూణశకము 1480 - 90 సంవత్సర ప్రాంతము లందున్నవాడని నిరాక్షేపముగా నిరూపింప వచ్చును.

వెన్నెలకంటి సూరన్న నియోగి బ్రాహ్మణుఁడు; అమరమంత్రి కుమారుఁడు. ఈతని కవిత్వము మృదుమధురపదభూయిష్టమయి ద్రాక్షాపాకమయి యనర్గళధార కలిగి ప్రవహించుచున్నది. ఇతనిది సలక్షణమయిన మంచి కవిత్వము. ఈతనికవనధోరణిఁ జూఁపుటకయి కొన్ని పద్యములవిష్ణుపురాణ ములోనివాని నీం దుదాహరించుచున్నాను.

       ఉ. ఆపద లేల్ల మాన్చి సుఖమైన పదంబులఁ బూన్చి యాత్మసం
           తాపము లెల్లఁ బుచ్చి విదితంబగు సంపద లిచ్చి భక్తులం
           దేవయుఁడోలె దుఃఖజలధిం బడకుండఁగఁ దేల్చిప్రోవ ల
           క్ష్మీపతి యున్నవాఁడు మదిఁ జింత దొఱంగుము పాకశాసనా, ఆ.1

         ఉ. అందని పంటికేమిటికి నఱ్ఱు నిగిడ్చెదు ? విష్ణుఁడున్న యా
             కందువ చందమా మగుటకల్ వినుమి పని కట్టి పెట్టి నా
             డెందములోని యుమ్మలిక డిందుపడం జనుదెమ్ము పోద మిం
             పొంద సమ స్తభోముగలఁ బొందెడు తండ్రికి వేడ్కచేయఁగన్ ఆ.2.

         చ. ఎనిమిది మాసముల్ రవి మహీవలయంబునఁ గల్గుతోయమున్
             తన కిరణంబులందుఁ గొని తక్కిన మాసచతుష్టయంబునన్
             ఘనతరవృష్టిరూపములుగా జలముల్గురియింప లోక మె
             ల్లను బరితృప్తిఁ బొందును జలంబును సన్నముఁ గల్గి పెంపుతోన్.

         మ. పరకాంత న్మదిలోన నైనఁ దలఁపం బాపంబు దుఖంబునున్
             బరివాదంబును నొంది ఘోరనరకప్రాప్తవ్యథల్ పెక్కు వ
             త్సరముల్ చెందుదు, రట్టి యన్యవనితా సంభోగదోషంబు దా
             నరనాధో త్తమ ! యింత యంత యని యెన్నన్వచ్చునే యేరికిన్;

         ఉ. కారుమెఱుంగులో మెలపు గైకొన నేర్చిన పైఁడిబొమ్మలో
             మారునిదీపములో కలికిమాటలచంద్రికలో చెలంగుశృం
             గారరసాధిదేవతలో కమ్మని క్రొవ్విరితీగెలో యనన్
             వారిజపత్రలోచనలు వచ్చిరి మోహవిలాసమూర్తులై . ఆ.5.

         ఉ. కాయజుచేత గాసిపడి గౌతముభార్యకుఁ బోయి కొక్కోరో
             కో యని కోడికూఁత లొగిఁ గూసి మునీంద్రు చేత శప్తుఁడై,
             పోయిన వజ్రి మేటిదొరపోలె బృహస్పతిపత్ని కై ననున్
             రోయఁగ నాడ నేల తన రోఁతలు లోకమువారు నవ్వఁగన్ ఆ.6.

         ఉ. ఈ యవివేకవుంబనుల కెట్లు తొడంగితి వొప్ప దింత య
             న్యాయము గాలిపోయెడు దురాగతముల్ విని పాపబుద్ధి న
             య్యో ! యిటువంటి ముద్దులసహోదరి ముందల పట్టి యీడ్చి కో
             కో యని కూయఁగాఁ గుతిక కోసిన లోకమువారు తిట్టరే? ఆ. 7

         మ. మదిరాపానముచేత నొక్కసతి తా మత్తిల్లి వేరొక్కతెన్
             హృదయేశుండని కౌగిలించె; నది దానం ద్రాణనాథు డటం
             చొదవన్ గమ్మని మోవి యిచ్చె, నటు లన్యోన్య ప్రవృత్తక్రియల్
             ముదిత ల్కొందఱు చూచి నవ్వి సరసంబు ల్పల్కి రత్యంతమున్