ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/తిక్కన సోమయాజి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తిక్కన సోమయాజి

తిక్కనసోమయాజి యనియెడి యీ కవి యించుమించుగా నన్నయ భట్టారకునికి రెండువందల సంవత్సరముల తరువాత నున్నట్టు కనఁబడు చున్నాడు. తిక్కనసోమయాజి నన్నయభట్టుతోడి సమకాలికుఁ డని జనులు వాడుకొనుచు, ఆ విషయమయి పెక్కుకధలు చెప్పుకొనుచున్నారు. *కాని యవి యవిచారమూలకము లగుటచేత మనము విశ్వసింపఁ దగినవి కావు. ఈ కవి తన నిర్వచనోత్తరరామాయణము నంకితము చేసిన మనుమభూపాలుఁడు పదమూఁడవ శతాబ్దమధ్యమున నున్నట్లు కొన్ని శిలా శాసనములవలనఁ దెలియవచ్చుచున్నది. ఈ మనుమరాజు తాతయును సిద్దిరాజని సామాన్యముగాఁ బిలువఁబడువాఁడును నయిన మనుమసిద్ధి పండ్రెండవ శతాబ్దమునందుండుట నిశ్చయము. అది గాక కృష్ణా మండలములో నందిగామ సీమలోని అనమంచిపల్లె గ్రామమునందలి శివాలయము యొక్క గర్భాలయము ముందఱి రాతి పలకమీఁది నాలింటిలో నొక శిలాశాసనమునందు శాలివాహనశకము 1182 వ సంవత్సరమందఁనగా క్రీస్తుశకము 1260 వ సంవత్సరమునందు "మన్మభూపతి" యున్నట్టు వ్రాయఁ బడియున్నది. మఱియును కృష్ణా మండలములోని నూజివీడు సంస్థానములోని కొండనాయనివర గ్రామములోని చెఱువుగట్టు మీఁద నున్నదేవాలయ సమీపమునందలి యొక రాతిమీఁద చెక్కcబడిన దానశాసనములో శాలివాహనశకము 1179 వ సంవత్సరమునం దనఁగా క్రీస్తుశకము 1256 వ సంవత్సరమునందు 'మనుమరాజు" భూదానము చేసినట్టు చెప్పఁబడి యున్నది. పైవి గాక మనుమసిద్దిరాజుయొక్క శాసనములు కందుకూరిసీమలోని పెంట్రాలగ్రామములో 1257 వ సంవత్సరము మొదలుకొని 1260 వ సంవత్సరమువఱకును నున్నవి కానిపించుచున్నవి. 1257 వ సంవత్సరములోని నందలూరు శాసనములో మనుమ _________________________________________________________________________ [*చూ. శ్రీ గురజాడ శ్రీరామమూర్తి గారి 'కవి జీవితములు'] సిద్ధి కోడూరుగ్రామము నొక బ్రాహ్మణునకు దానము చేసినట్టును, కాకతీయ గణపతిదేవునిక రుణను కాంక్షించుచుండినట్టును చెప్పఁబడి యున్నది. వీనినిబట్టి చూడఁగా గణపతిదేవుఁడు 1253 వ సంవత్సరమువఱకును మనుమసిద్ధికి సాయము చూపినట్టు కానఁబడదు. చూపినచో 1254 వ సంవత్సరమునకును 1260 వ సంవత్సరమునకును నడుము చూపి యుండ వలెను. 1262 వ సంవత్సరమునకుఁ బయిని మనుమసిద్ధి శాసనము లెందును గానరావు. అందుచేత నాతఁ డా తరువాత నల్పకాలములోనే కాల ధర్మము నొcదియుండును. అంతేకాక కృష్ణామండలచరిత్రసంగ్రహము నందు *యఱ్ఱగడ్డ రాజయిన కాటమరాజును పల్నాడుప్రభువైన పద్మనాయకుఁడును గలిసి పశువుల మేఁతబీళ్ళవిషయమయి పదుమూఁడవ శతాబ్దమునందు నెల్లూరి ప్రభువైన సిద్ధిరాజుతో యుద్ధము చేసినట్లును, సిద్దిరాజుసేనలు కవితిక్కన తమ్మునికుమారుఁడై న తిక్కనమంత్రిచే నడుపఁ బడినట్టును, చెప్పఁబడి యున్నది. కవి తిక్కనతమ్ముఁడనుటకుఁ దమ్ముని కుమారుఁడని పొరపాటునఁ బడి యుండవచ్చును. ఈ రణతిక్కన్న మన తిక్కన్నకు సాక్షాత్సహోదరుఁడు కాక పెదతండ్రికొడుకయి యున్నాcడు. ఇవి యన్నియు నిటుండఁగా తిక్కనసోమయాజి శిష్యుడయిన మారన తాను తెనిఁగించిన మార్కండేయపురాణమును ప్రతాపరుద్ర దేవుని మంత్రులలో నొకఁ డయిన నాగయగన్నమంత్రి కంకితము చేసినట్లా పురాణములోని యీ క్రింది పద్యమువలనఁ దేటపడుచున్నది.-

           సీ. తన సమజ్జ్వలమూర్తి జనలోచనాంభోజ
                     ములకు మార్తాండుని మూర్తిగాఁగ
               తన నయోపార్జితధనమున కర్థి దో
                     స్థ్సలులు విక్షేపణస్థలులుగాఁగ
               తనభూరితర తేజ మనుపమనిజవంశ
                     భవనంబునకుఁ బ్రదీపంబుగాఁగ
               తన వినిర్మలయశంబునకు దిశాతటం
                     బులు దృఢ శాసనశిలలుగాఁగ

__________________________________________________________________________ [*ఇది యెఱ్ఱగడ్డపాడు"గాని యఱ్ఱగడ్డకాదు.]

          ప్రకటగణగణసంపదఁ బరఁగుచున్న
           ధన్యుఁ డథిగత వృషుఁడు ప్రతాపరుద్ర
           దేవసామ్రాజ్యవర్ధనస్థిరవినీతి
           కరణకుశలుండు నాగయగన్నవిభుఁడు.'

మార్కండేయపురాణ గద్యమునందు మారన 'శ్రీమధుభయకవిమిత్ర తిక్కనసోమయాజి ప్రసాదలబ్ధసరస్వతీపాత్ర తిక్కనామాత్యపుత్ర' యని వ్రాసికొని యుండుటచేత నతఁడు తిక్కనసోమయాజిశిష్యుఁ డగుటకు సందేహము లేదు. మారన తండ్రి యైన తిక్క-నామాత్యుఁడు కవి తిక్కన్న గాక వేఱొక్క తిక్కన్న యయి యున్నాఁడు.

ప్రతాపరుద్ర దేవుఁడు 1295 వ సంవత్సరము మొదలుకొని 1323 వ సంవత్సరమువఱకును రాజ్యము చేయుటయు, ఈ కడపటి సంవత్సరమునం దతఁడు ఢిల్లీచక్రవర్తియైన జిల్లాలుద్దీను మేనల్లుఁడును అయోధ్యనబాబు నయిన అల్లా-ఉద్దీన్ చేత పట్టుకోఁబడి ఢిల్లీ నగరమునకుఁ దీసికొని పోఁబడుటయు సుప్రసిద్దములు. ఈ పయి నిదర్శనముల నన్నిఁటిని పరిశీలించి చూడఁగా తిక్కనసోమయాజి పదుమూడవ శతాబ్ద మధ్యమున నుండె ననియు ఈ కవికిని నన్నయభట్టారకునికి మధ్య రెండు వందల సంవత్సరము లెడమున్నదనియు, నిశ్చయింపవలసి యున్నది. కాబట్టి తిక్కనసోమయాజి యిప్పటి కాఱువందలయేఁబది సంవత్సరముల క్రిందట నుండి యున్నాఁడు.

తిక్కనసోమయాజి నన్నయభట్టు కాలములోనివాఁడు కానట్టును, హూణ శకము పదమూడవ శతాబ్దమునందే యుండినట్టును స్థాపించుటకయి మరి కొన్ని నిదర్శనములు కూడఁ గనఁబడుచున్నవి. మెకాంజి దొరగారు సంపాదించి చెన్నపురి రాజకీయప్రాచ్యలిఖితపుస్తక నిలయమునం దుంచిన వ్రాఁతప్రతులలో నొకదానియందుఁ దిక్కనసోమయాజి శాలివాహనశకము 1120 వ సంవత్సరమునం దనఁగా హూణశకము 1198 వ సంవత్స రమునందు మృతినొందెనని చూపెడి యీ క్రింది పద్య మొకటి కానఁబడు చున్నది.

          క. అంబర రవి శశిశాకా
             బ్దంబులు చనఁ గాళయుక్తి భాద్రపదపుమా
             సంబున నంబరమణిబిం
             బం బనఁదగు తిక్కయజ్వ బ్రహ్మముఁ జేరెన్.*

ఈ కవి కాకతీయగణపతిదేవుని కాలములో నుండినట్లు ప్రబల నిదర్శనము లున్నందునను, గణపతిదేవుఁడు పదుమూడవ శతాబ్ద మధ్యమువఱకు రాజ్యము చేసినందునను, ఈ పద్య మంతగా విశ్వాసార్హ మయినది కాదు. ఈ పద్యముయొక్క- సత్యమెట్టి దయినను, మన్మరాజును, దిక్కనసోమయాజియుఁ గాకతీయ ప్రభువైన గణపతిదేవుని కాలమునందుండుట నిశ్చయము. గణపతిదేవుఁడు 1260 వ సంవత్సరమువఱకును రాజ్యము చేసినట్టును, ఆ సంవత్సరము మొదలుకొని యాతని కొమారితయగు రుద్రమదేవి పరిపాలనము చేసినట్లును, చరిత్రమును, శిలాశాసనాదులును తెలుపుడు చేయుచున్నవి. అక్కన, బయ్యన లనువారు మన్మరాజును రాజ్యవిహీనునిగాఁ జేయఁగాఁ దన ప్రభువుపక్షమునఁ దిక్కనసోమయాజి గణపతిదేవుని సభకుఁ బోయినట్టు సిద్దేశ్వచరిత్ర మను నామాంతరము గల ప్రతాపచరిత్రమను శైవ గ్రంధమునందు వ్రాయఁబడి యున్నది ** ఈ యంశమే యిటీవల నిప్పటికి నూటయేఁబది సంవత్సరములకు లోపలఁ

_________________________________________________________________________ *విల్సను దొర వారు తమపుస్తక వివరణ పట్టికలో నీపద్యమునే యుదాహరించి "అంకా నాం వామతో గతిః "** అనియున్న న్యాయమునుబట్టి పండ్రెండని యర్థమిచ్చెడు రవిశబ్దము తెలిపెడి 12 అంకెలను కుడి నుండి యెడమకడ 21 గా బెట్టి 1210 శాలివాహనశకమును గాఁ జేసిరి. అప్పుడది క్రీ శ 1288 అయి యించు మించుగా తిక్కన మరణ కాలము సరిపోవచ్చును గాని కాళయుక్తి సంవత్సరము కాదు.

[కొండఱు 'రవిశశి' అసు దానిని 'శశికవి' గాఁ జదువ వలెననిరి. ఆప్పడును 1210 యే యగును. అది సరికాదు.]

    • దీని రచయిత కాసె సర్వప్ప. ఇతడు...... ప్రాంతము వాఁడని 'ఆంధ్ర కవి తరంగిణి'.

గూచిమంచి జగ్గకవి రచియించిన సోమదేవరాజీయమునందును జెప్పబడి యున్నది. ఏత దంకముసు దేటపఱిచెడి యా గ్రంధభాగముల నిం దుదాహరించు చున్నాను

 (సిద్దేశ్వరచరిత్ర, ద్విపద కావ్యము.)
                  
                  సారెసారెకుఁ గేరి సన్నుతుల్ చేయ
                  సారపారావారసరసగంభీర
                  సారుఁడై కీర్తి విస్తారుఁడై యలరు
                  నా రీతి గణపతి నటు చూచు వేడ్కఁ
                  దిక్కనసోమయా జక్కడ కొకట
                   
                         * * *
                  దిక్కుదిక్కులనుండి తెరలి విద్యార్థు
                  లక్కడక్కడను గావ్యముల శ్లోకార్థ
                  మొక్కొక్కవిధమున నొగి వినిపింపఁ
                  జక్క_న వినుచును నొక్క యందలము
                  నెక్కి తిక్కనసోముఁ డక్క డేతెంచె
                  నా రీతిగా సోమయాజుల రాక
                  వారక చని ఫణిహారులు దెల్ప
                         * * *

                  అట్టి మహాత్ముని నా సోమయాజి
                  నేట్లైన నేదురేగి నేర్పుతో రాజు
                  తెచ్చి అర్హాసనస్థితునిఁగా జేసి
                  మెచ్చి తాంబూలాదు లెచ్చుగా నిచ్చి

                         * * *
                   అగు భారతాఖ్యాన మావీరవరులు
                   తగఁ జేసినట్టి యుద్ధ ప్రతారములు
                   వినియు సంతోషించెఁ గనినట్లు చెప్ప
                         * * *

          అంతఁ దిక్కనసోమయాజికి మెచ్చి
            వింతవస్త్రంబులు వివిధభూషణము
            లత్యంతభక్తి తో నప్పుడిచ్చుడును
            సత్యసంధుడును సభ్యవర్తనుఁడు
            నగు సోమయాజి తా నా రాజు కనియెఁ
            దగుమాట విను మొక్కధర్మకార్యంబు
            సూర్యవంశంబున సొబగొందునట్టి
            యార్యపూజిత వర్యుఁ డా మన్మసిద్ది
            రాజు దా నెల్లూరు రమణతో నేల
              * * * *
            అక్కన బయ్యన లధికబలిష్టు
            లక్కట • సిద్ధిరాయనిఁ బాఱఁదోలి
            దక్కిన రాజ్యంబు దామె యేలుచును
            నొక్క కా సై నను జక్కcగ వీరు
            వారల దండించి వారినెల్లూరు
            వార కిప్పింపు మవారణఁ బ్రీతి
            ననిన గణపతిరా జట్ల కా కనుచు

              * * * *

            వెడలి గణపతియు విజయంబునకును
            గుడియెడమల సేన కొలిచి యేతేర
            వెలనాడు చేరియు వీ డెల్లఁ గాల్చి
            వెలనాటిరాజును వెస గెల్చి వాని
            యప్పనంబులు గొని యటఁ జని రాజు
            గుప్పన నెల్లారు కూడ నేతెంచి
            యక్కన బయ్యన నచట సాధించి

              * * * *

            నెల్లూరి ప్రజలకు నేర్పు వాటిల్లఁ
             జెల్లించె మన్మనసిద్ధిధాజునకు
             నెల్లూరుపట్టంబు నేర్పుతోఁ గట్టి
             సల్లలితాదృతి సమదుర్గములను
             నఱువదెనిమిదియు నగు పట్టణముల
             నరుదొంద సాధించి యా మన్మసిద్ధి
             రాజు కిచ్చియుఁ దన తేజంబు దిశలఁ
             బూజ కెక్కఁగ ఘనరాజితయశుఁడు
             ఘన తటాకంబుఁ దాఁ గట్టించె నచటఁ
             గొనకొని నెల్లూరఁ గొన్నెల లుండి
             మనుమసిద్దికి రాజ్యమహిమలు దెల్పె'

ఈ గ్రంధము కొంత పురాతనమైనను దీనియందు లక్షణదోషము లనేకములు కానవచ్చుచున్నవి. సంగతులు సత్యములే యైనను, ఇందుఁ జెప్పిన సంవత్సరములు మాత్రము చాలవఱకు సరియైనవికావు. ఈ పుస్తకము గణపతిదేవునికాలములోఁ గాక నూఱు నూటయేబcదిసంవత్సరములకుఁ దరువాత విన్న కధలను బట్టి వ్రాయcబడిన దగుటచేత నిందుఁ జెప్పఁబడిన విషయములు సహితమని కొన్ని వ్యత్యస్తములుగా నున్నవి. తిక్కన్న గణపతిదేవునియొద్దకుఁ బోవునప్పటికి యజ్ఞముచేసి యుండలేదు. భారతమును రచియించి యుండలేదు. ఈ పుస్తకము చేయునప్పటికి తిక్కన సోమయాజి యజ్ఞము చేసి భారతము రచియించి యుండుట కవి విని యొఱిఁగినవాడగుటచేత కాల భేదమును నిర్ణయింపలేనివాఁ డయి వెనుక జరిగినదానిని ముందు జరిగినట్టు వ్రాసి యుండును. సోమదేవరాజీయము నందుఁ జెప్పిన సంవత్సరములును దీని ననుసరించియే వ్రాయబడినవి.

                         (సోమదేవరాజీయము)
           గీ|| చేయఁ దక్కువయైన దేవాయతనము
               లపుడు పూర్తిగఁ గట్టించి యలరుచున్న
               చోట నొకనాcడు తిక్కనసోమయాజి
               వచ్చె నెల్లూరినుండి భూవరునికడకు.

       సీ|| వచ్చిన యయ్యార్యవర్యు నెదుర్కొని
                        వినయాసంభ్రమభక్తు లినుమడింప
                  నతిథిపూజ లొనర్చి యతనిచే భారతా
                        ర్ధమును ద్వైతాద్వైత తత్త్వములును
                  విస్మృతచిదచిద్వివేకలక్షణములుఁ
                        బ్రకటధర్మాధర్మపద్దతులును
                  రాజనీతి ప్రకారంబును భారత
                        వీరుల మహిమంబు వినుచునుండి

                  యనుమకొండనివాసు లైనట్టి బౌద్ద
                  జనుల రావించి వారిఁ దిక్కనమనీషి
                  తోడ వాదింపఁజేసినఁ దొడరి వారిఁ
                  జులకఁగా సోమయాజులు గెలుచుటయును.

                వ. అప్పుడు బౌద్ధదేవాలయంబులు గూలం ద్రోయించి గణపతి దేవరాజు సోమయాజుల పటువాక్యశక్తికి మెచ్చి యతనిన్ బహు ప్రకారంబుల బూజించి యెనిమిది గ్రామంబు లొసంగి యతఁడు వచ్చిన కార్యం బడిగిన నా భూవరునకుఁ గవివరుం డిట్లనియె.

             గీ. ఇనకులోద్భవుఁడైనట్టి మనుమసిద్ది
                 రాజు నెల్లూరు పాలించుచోఁ జెలంగి
                 యతనిదాయాదు లతని నుక్కఱఁగఁ బట్టి
                 యునిచి రాజ్యంబుఁ దమ రేలుచున్నవారు

             క. కావున మీ రిపు డచటికి
                 వేవేగం దరలి వచ్చి విడకుండఁగ నా
                 భూవరుల బునరభిషిక్తునిఁ
                 గావింపఁగవలయు ననిన గణపతివిభుఁడున్.
 
             గీ. "అట్ల కాక" యనుచు నా పని కొడఁబడి
                  యత్యుదారగుణసమగ్రుఁడగుచుఁ

                దవిలి యప్పు డొక్క నవలక్ష ధనమును
                యజ్ఞకుండలములు నతని కిచ్చె.

            క. పనుచునెడఁ దిక్కమఖి
                యా జనవరుసింహాసనమున సచివా గ్రణియై
                తనరెడు శివదేవయ్యన్
                గనుఁగొని యా రాజు తోడఁ గడఁకం బలికెన్.

            గీ. 'వసుమతీనాధ ! యీతఁ డీశ్వరుఁడు గాని
                మనుజమాత్రుండు గాఁడు పల్మాఱు నితని
                యనుమతంబున నీవు రాజ్యంబు నెమ్మి
                నేలు'మని చెప్పి యా ఘనుఁ డేగుటయును.

            సీ. గణపతిదేవుఁ డా ఘనుననుమతిఁ గాంచి
                         యతిసత్వరమునఁ బ్రయాణభేరి
               వేయించి చతురంగపృతనాసమేతుఁడై
                         తరలి ము న్వెల నాటిధరణిపతుల
               గెలిచి వారలచేత లలి నప్పనముఁగొని
                         వారి నందఱఁ దనవశము చేసి
               కొని చని నెల్లూరు గొబ్బునఁ జొచ్చి
                         య క్కనయు బయ్యనయు నన్ ఖలులఁ దఱిమి

               మనుమసిద్దిరాజుc బునరభిషిక్తుఁగా
               వించి మించి రెండువేలు నైదు
               నూఱు గ్రామములు మనోవృత్తి కతనికి
               నిచ్చి కడమc దాను బుచ్చుకొనియె.

ఈ పుస్తకమునందుఁ గణపతిదేవుఁడు రెండువేలయేనూఱు గ్రామములు మనుమసిద్ధి కిచ్చినట్లు గొప్పగాఁ జెప్పినను, ప్రతాపచరిత్రమునుబట్టి యఱువదెనిమిది గ్రామములను మాత్రమే యాతని కుంచినట్లు స్పష్టమగుచున్నది. దీవినిబట్టి చూడఁగా మన్మసిద్ధి యొక్కయు దిక్కన యొక్కయు

కాటమరాజును గూడఁ బ్రాణములు గోలుపోయినట్లు కాటమరాజకధ వలనఁ దెలియ వచ్చు చున్నది. [కాటమరాజునకును, మనుమసిద్దిరాజునకును జరగిన యుద్దమును గూర్చి యీ క్రింది విషయమును చెప్పుట గలదు.

కనిగిరిసీమలోని ఎఱ్ఱగడ్డపాటి ప్రభువు కాటమరాజు కఱవుల కారణమున తమ పశువులబీడులు ఎండిపోఁగా, మనుమసిద్దిరాజు పాలనలోనున్న బీడులలో తమ పశువులను మేతకు విడిచి, కొంతపుల్లరిని చెల్లించుట కంగీకరించెను కాని కాటమరాజు మనుమసిద్ధికి పుల్లరినీయక ఎదిరింపఁగా యుద్దము సంభవించెను. కాటమరాజు పల్నాటి ప్రభువుకాcడు.

కాటమరాజు పుల్లరి నీయకుండుటకుఁ గారణమును కొందఱిిట్లు చెప్పదురు.'మనుమసిద్ధి యుంపుడుకత్తె పెంచుచున్న చిలుక యొకటి పంజరమునుండి తప్పించుకొనిపోయి కాటమరాజు పశువులు మేయుచున్న యడవికేఁగి మనుష్యులవలె మాటలాడుచుండఁగా పశువులు బెదరి చెదరి మేఁతను మానినవcట! పశువులకాపరులు చిలుకను చంపివేయఁగా, సిద్ధిరాజు మనుష్యులా పసులకాపరులను చీకాకుపఱచిరcట! ఆ కారణముననే కాటమరాజు పుల్లరినీయక యుద్ధమునకు సిద్ధపడెనఁట!

యుద్దములో పల్నాటి ప్రభువైన పద్మనాయకుడు మున్నగువారు కాటమరాజునకు సాయపడిరcట!] ఈ యుద్ధములోఁ దిక్కనసోమయాజికి (పెద తండ్రి సిద్ధనకుమారుఁడు) సహోదరుఁడైన ఖడ్గతిక్కన సేనానియై యుండి సేనలను నడిపినట్లును, ఆ యుద్ధములో నతఁడు ప్రాణములు కోలుపోయి నట్టును ఖడ్లతిక్కన చరిత్రమువలన విదిత మగుచున్నది. మొదట నీ రణతిక్కన శత్రువుల కోడి పాఱివచ్చినట్లును, అప్పుడా తనితల్లి, యాతనిని జూచి కోపపడి కోడలితో 'నీవును నీ భర్తయు నేనును మనయింట ముగ్గు రాఁడువార మయితి' ముని హేళనముగా బలికినట్లును, నందుపయి నాతనికి రోషము పెచ్చి మరల యుద్ధమునకుఁ బోయి వీరమరణము నొందినట్లును, పయి చరిత్రమునందే చెప్పఁబడి యున్నది. ఆ పుస్తకమునందలి కొన్ని పద్యములు నిం దుదాహరించుచున్నాను --

       సీ. వీరనికాయంబు వేదనినాదంబుఁ
                బాయక యేప్రొద్దు మ్రోయుచుండు
          భూసుర ప్రకరంబు సేనలు చల్లంగఁ
                బాయ కెన్నియొ కుటుంబములు బ్రదుకు
          బ్రాహ్మణావళికి ధారలు పోసిన జలంబు
                సతతంబు ముంగిట జాలువాఱు
          రిపుల కొసఁగిన పత్రికల పుత్రికలను
                బాయక కరణముల్ వ్రాయుచుంద్రు

          మానఘనుఁడైన తిక్కనమంత్రియింట
          మదనసముఁడైన తిక్కనమంత్రియింట
          మహీతయశుఁడైన తిక్కనమంత్రియింట
          మంత్రిమణి యైన తిక్కనమంత్రియింట.
           * * * *
      క. పగఱకు వెన్నిచ్చినచో
         నగరే నిను మగతనంపు నాయకులందున్
         ముగు రాఁడువార మైతిమి
         వగ పేటికి జలక మాడ వచ్చినచోటన్.*

__________________________________________________________________________

*రణతిక్కన స్నానమునకు వచ్చినప్పడు భార్య స్త్రీలకు పెట్టినట్లుగా రహస్యస్థలమున నీళ్ళబిందె యుంచి దానికి నులకమంచము చాటుపెట్టి దానిమీఁద పసుపుముద్ద కుంచె ననియు, అది చూచి యతఁడు వ్యసనపడుచుండగా భార్య యీమాటలనియె ననియు చెప్పుదురు.

     క. అసదృశముగ నరివీరుఁడు
        మసి పోవఁగ విఱిగి వచ్చె మగవంద క్రియన్
        గసవన్ మేయఁగ బోయిన
        పసుల న్వెలిఁ ద్రొబ్బి తిక్కపాలుఁడు దిరుగన్. *

    చ. పదటున వాజి రాహుతులపై దుమికింపుచుఁ దిక్కఁ డార్చినన్
        బెదరి పరిభ్రమించి కడుఁ బిమ్మట వీరులు భీతచిత్తులై
        యదె యిదె డాలు వాల్మెఱుఁగు లల్లదె యల్లదె యాతఁ డంచనన్
        గొదుకక యాజిఁజేసె రిపుకోటుల కందఱ కన్నిరూపులై.

    ఉ. చిక్కక మన్మసిద్దివిభుచే మును గొన్న ఋణంబుఁ దీర్చి మా
        తిక్కనమంత్రి సోమశిల దేవర సాక్షిగఁ లెన్న సాక్షిగా
        నెక్కిన వాజి సాక్షిగ మహిన్నుతి కెక్కిన కీర్తి సాక్షిగా
        స్రుక్కక మాఱుకొన్న రణశూరులు సాక్షిగఁ గొండ సాక్షిగన్

    సీ. దైర్యంబు నీ మేనఁ దగిలి యుండుటఁజేసి
               చలియించి మందరాచలము తిరిగె
        గాంభీర్య మెల్ల నీకడన యుండుటఁజేసి
               కాకుస్థ్సుచే వార్థి కట్టువడియె
        జయలక్ష్మి నీయురస్థలినె యుండుటఁజేసి
               హరి పోయి బలి దాన మడుగుకొనియె
        నాకార మెల్ల నీయందె యుండుటఁజేసి
               మరుఁడు చిచ్చునఁ బడి మడిసి చనియెఁ

__________________________________________________________________________

*

 క. అసదృశముగ నరవీరులఁ| బసమీఱఁగ గెలువలేక పందక్రియ న్నీ
      వసి వైచి విఱిగివచ్చినఁ | బసులు న్విఱి... తిక్కపాలున్ న్విఱిగెన్

-- అని పాఠాంతరము అన్నములోఁ బోయునప్పుడు పాలు విఱిగిపోఁగా తల్లి యతనితో పరిహాసముగా నీ వాక్యమన్నదందురు.

         దిక్కదండనాధ దేవేంద్రపురికి నీ
         వరుగు టెఱిగి నగము ........
         ..........................
         మరుఁడు మరలఁ గలుగు మగలరాజ !

    సీ. నందిని బుత్తెంచు నిందు శేఖరుఁడు నీ
               వన్న! యేతెమ్ము తారాద్రికడకు
          గరుడుని బుత్తెంచె నరహరి రావయ్య
               వడి సిద్ధతిక్క ! కైవల్యమునకు
          హంసను బుత్తెంచె నజుఁడు నీకడకు ను
              నుభయకులమిత్ర రా బ్రహ్మసభకు
          నైరావతముఁ బంపె నమరేంద్రుఁ డిప్పుడు
              దివమున కేతెమ్ము తిక్కయోధ

          యనుచు వేఱువేఱ నర్థితోఁ బిలువఁగ
          వారు వీరుఁ గూడ వచ్చి వచ్చి
          దివ్యయోగి యైన తిక్కనామాత్యుండు
          సూర్యమండలంబుఁ జొచ్చి పోయె

బ్రహ్మశ్రీ గురుజాడ శ్రీరామమూర్తిపంతులుగారు తిక్కన సోమయాజి కాలనిర్ణయమును గూర్చి యీ పైని నేను వ్రాసినది స్థిరమార్గము కాదని నిర్ణయించి తిక్కన నన్నయభట్టు తోడి సమకాలికుఁ డని సిద్దాంతము చేయుటకయి యేమేమో వ్రాసి యున్నారు. అందలి ముఖ్యాంశముల నిందించుక చర్చింతము. తిక్కన తన నిర్వచనోత్తర రామాయణము నంకితముచేసిన మనుమసిద్దిరాజు క్రీస్తుశకము 1256 వ సంవత్సరమున భూదానము చేసినట్టున్న శిలాశాసనమునుగూర్చియు, 1260 వ సంవత్సరమునందు రాజ్యము చేయుచుండినట్లున్న శిలాశాసనమునుగూర్చియు, స్యూయల్ దొరవారి ప్రాచీన శాసనపట్టిక నుండి నే నుదాహరించిన చరిత్రాంశముల మాట తలపెట్టక వానినుపాయముగా జాఱవిడిచి, వారటు తరువాత "కృష్ణామండల చరిత్ర సంగ్రహమునం దెఱ్ఱగడ్డరాజయిన కాటమరాజును పల్నాడు ప్రభువైన పద్మనాయకుఁడును గలిసి పశువుల మేఁతబీళ్ళవిషయ మయి పదుమూడవ శతాబ్దమున నెల్లూరు రాజులయిన సిద్ధిరాజుతో యుద్ధము చేసినట్లును, సిద్దిరాజు సేనలు కవితిక్కన తమ్ముని కుమారుఁడై న తిక్కన మంత్రిచే నడుపబడినట్లును, చెప్పఁబడి యున్నది." అని నేను వ్రాసిన వాక్యము నింతవఱకు మాత్రమే గహించి, 'కవితిక్కనతమ్ముఁ డనుటకుఁ దమ్మునికొమారుఁ డని పొరపాటునఁబడి యుండవచ్చు' నన్న తరువాతి వాక్యమును బుద్ధిపూర్వకముగా నుపేక్ష చేసి, రణతిక్కన తిక్కన సోమయాజికి పితృష్వపు త్రుఁడయిన తమ్ముఁ డని యేఱిఁగి యుండియు తమ్మునికొడుకని సిద్ధాంతముచేసి, బదుమూడవ శతాబ్దము 1200 లు మొదలుకొని 1300 సంవత్సరమువఱకు నుండవచ్చును. గాన రణ తిక్కన 1201 వ సంవత్సరమున యుద్ధములోఁ జచ్చి 1130 లోనో 1150 లోనో తన తండ్రి కఱువదవ పడిలోనో పుట్టి యుండపచ్చు ననియు ఆ ముసలితండ్రి కంటె నలువదియేండ్ల పెద్ద వాఁడయిన సవతియన్న యైనచోఁ దిక్కన తన తమ్ముని కుమారునికంటె నూఱేండ్లు పెద్దవాఁడు కావచ్చు ననియు, అందుచేతఁ దిక్కన 11౩౦ వ సంవత్సరప్రాంతమున నన్నయభట్టు కాలములో నుండవచ్చు ననియు, ఊహలమీది యూహలతో బయలఁ బందిరి వేసిరి. రణతిక్కన కవితిక్కన తమ్మునికుమారుఁడు కాకపోవుటచే నిది యంతయు నేల విడిచి సాము చేయుట గానీ వేఱుకాదు

      *ఉ. ఏమి తపంబు చేసిస్ పరమేశ్వరు నేమిటఁ బూజ చేసిరో
           రామునితల్లియు బరశురామునితల్లియు భీముతల్లియున్
           గామునికన్నతల్లియును గంజదళాక్షుననుంగుదల్లియున్
           శ్రీమహిత ప్రతాపుఁ డగు సిద్దనతిక్కనఁ గన్నతల్లియున్ !

అనెడి (ఖడ్గతిక్కన యనఁబడు) రణతిక్కనచరిత్రములోని యీ పద్యమును బట్టి రణతిక్కన సోమయాజి కి (కేవలసహోదరుఁడుగాక) మూడవ పెద్ద


మఱి యిరువదిపంక్తులతరువాత నే రణతిక్కన .....తండ్రిసిద్ధయ. ఈ సిద్ధయ సోమయాజికి మూడవ పెత్తండ్రి" అని వ్రాసియున్నారు. * తండ్రియైన సిద్దనకొడు కయినట్టు స్పష్ట మగుచున్నది. కవితిక్కనకును రణతిక్కనకును గల బంధుత్వమే కాటమరాజ చరిత్రమునందును జెప్పఁబడి యున్నది.

తిక్కనసోమయాజికి శిష్యుడైన మారన్న క్రీస్తుశకము 1295 వ సంవత్సరము మొదలుకొని 1323 సంవత్సరము వఱకును రాజ్యము చేసిన ప్రతాపరుద్రుని దండనాధుఁడయిన నాగయగన్నమంత్రికిఁ దన మార్కండేయపురాణము నంకితము చేసినందునఁ దిక్కన సోమయాజి పదమూడవ శతాబ్దమధ్యమునందున్న వాఁ డని నేను వ్రాసినదానికి ప్రతాప రుద్రులనేకు లున్నందున వారిలో నెవ్వరి మంత్రియైన నాగయగన్నయకుఁ గవి కృతి యిచ్చెనో యని శంక తెచ్చుకొని దానినిబట్టి తిక్కన కాల నిర్ణయము చేయవలనుపడ దనిరి. మార్కండేయపురాణమునందుఁ బేర్కొనఁబడిన ప్రతాపరుద్రుఁడు కాకతీయ గణపతిదేవునకు దౌహిత్రుఁడయిన రెండవ ప్రతాపరుద్రుఁడు, మొదటి కాకతీయ ప్రతాపరుద్రుఁడు తిక్కన కాలమునం దుండిన గణపతిదేవునితండ్రి మార్కండేయపురాణములోఁ గృతిపతియొక్క వంశానువర్ణనము చేయుచో --

           క. కుల రత్నాకరచంద్రుం
               డలఘుఁడు నాగాంకుఁ డన్వయస్థితికొఱకున్
               గులశీలరూపగుణములు
               గలకన్నియఁ బెండ్లియాడఁగా దలఁచి మదిన్.

           సీ. ఏరాజు రాజుల నెల్ల జయించి ము
                     న్వెట్టియ గొనియె దోర్విక్రమమున
               నే రాజు సేతు నీహారాద్రి మధ్యోర్వి
                     నేక పట్టణముగ నేల వాసి
               నే రాజు నిజకీర్తి యెన్మిది దిశల ను
                     ల్లాసంబు నొంద నలంకరించె
               నే రాజునవతేజ మీజగంబునకు
                   నఖండకదీపంబు గా నొనర్చె

         నట్టి శ్రీరుద్రగణపతిక్ష్మాధినాథు
         ననుఁగుదలవరి ధర్మాత్కుc డధికపుణ్యుఁ
         డయిన మేచకనాయక ప్రియా తనూజ
         నతులశుభలక్షణస్ఫురితామలాంగి


    చ. శివుఁ డగజాత, రాఘవుఁడు సీత, గిరీటి సుభద్రఁ బెంపు సొం
         పు వెలయఁ బ్రీతిఁ బెండ్లి యగుపోలిక నాగచమూవిభుండు భూ
         రివిభవ ముల్లసిల్లఁగ వరించె సమంచితరూపకాంతిభా
         గ్యవిభవగౌరవాదిసుగుణానుకృతాంబిక మల్లమాంబికన్.

    శా. ఆ మల్లాంబరు నాగశౌరికి విశిష్టాచారు లుద్యద్గుణ
          స్తోమాకల్పు లనల్పకీ ర్తిపరు ల స్తోక స్థిర శ్రీయుతుల్
          ధీమంతు ల్సుతుద్బవించి రొగిఁ గౌంతేయప్రతాపోన్నతుల్
          రామప్రఖ్యులు వహ్నితేజులు జగత్ప్రఖ్యాతశౌర్యోజ్జ్వలుల్.

     వ. అం దగ్రజుండు.

     సీ. తన సుందరాకృతిఁ గని మది వెఱగంది
                   వనిత లంగజునొప్ప వక్రపఱుపఁ
         దన కళావిశదత్వమున కద్భుతము నొంది
                   బుధులు భోజుని నేర్పు పొల్లుసేయc
         దన నయాభిజ్ఞత వినిన ప్రాజ్ఞలు దివి
                   జేశువితద్ జ్ఞత యేపు డింపఁ
         దన యాశ్రయంబున మనుబంధుమిత్రవ
                  ర్గము కల్పతరువనాశ్రమము దెగడ

         నెగడె నెంతయు జగమునఁ బొగడు వడసి
         కాకతిక్ష్మాతలాధీశుకటకపాలుఁ
         డతులసితకీ ర్తిధనలోలుఁ డన్వయాబ్జ
         షండదినవల్లభుఁడు గంగసై న్యవిభుఁడు.

      చ. ఎలమిఁ బ్రతాపరుద్రమనుజేంద్రునిచేఁ బడసెం బ్రవీణుడై_
          కొలిచియు శార్యశీల రిపుకోటి రణావని గీటడంచియున్
          బలరిపుతుల్యవిక్రముఁడు నాగయగన్నవిభుండు తేజమున్
          విలసితరాజచిహ్నములు విశ్రుతలక్ష్మియు నాయకత్వమున్.

అను పద్యములయందుఁ గవి కృతిపతియొక్క మాతామహుఁడై న మేచ నాయకుఁడు కాకతీయ గణపతియొక్క తలవరి యైనట్టును, కృతిపతి యగు గన్నదండనాధుఁడు కాకతీయ ప్రతాపరుద్రుని దళవాయి యయినట్టును, స్పష్టముగాఁ జెప్పి యున్నాడు. తిక్కనసోమయాజి శిష్యుఁ డయిన మారనవలన మార్కండేయపురాణమును గృతి నందిన గన్నమంత్రియొక్కప్రభువగు ప్రతాపరుద్రుఁడీతఁ డనియు, ఆ ప్రతాపరుద్రునికాల మిది యనియు, స్పష్టపడినప్పుడు తిక్కన కాలమును నిశ్చయముగా తెలిసినట్టే! గణపతిదేవుని కూఁతురయిన రుద్రమదేవి యనంతరమునందు రాజ్యమునకు వచ్చిన యా యోరుగంటి ప్రతాపరుద్రుఁడు 1295 వ సంవత్సరము మొదలుకొని * 1323-వ సంవత్సరమువఱకును రాజ్యపాలనము చేయుటయు, 1309 -వ సంవత్సరమునందు మహమ్మదీయు లేకశిలానగర మనఁబడెడి యోరుగంటిమీఁదికి దండెత్తి వచ్చి మొట్టమొదటఁ బ్రతాప రుద్రునిచే నోడఁగొట్టఁబడి, పలాయితులయ్యును, రెండవ యుద్ధమునం దాతనిని జయించి ఢిల్లీ పాదుషాకుఁ గప్పము గట్టునట్లు చేయుటయు, తరువాత నతఁడు దేవగిరిరాజును దనకు సహాయునిగాఁ జేకొని మహమ్మదీయులకుఁ గప్పము కట్టుట మానివేయఁగా నప్పటి టోగ్లాకు చక్రవరి ప్రతాపరుద్రుని శిక్షించుటకయి 1321-వ సంవత్సరమునందుఁ దన కొడుకగు ఉలగ్ ఖానును సేనలతోఁ బంపినప్పు డతcడువచ్చి కోటను ముట్టడించి కడపటఁ బరాజితుఁడయి చెల్లాచెద రయిన తన సేనలతోఁ బాఱిపోవుటయు, ఈ యవమానమును దీర్చుకొనుటకయి మహమ్మదీయులు 1323-వ సంవత్సరమునందు మరల దండెత్తి వచ్చి ప్రతాపరుద్రుని నోడించి __________________________________________________________________________ *[ 1326 వ సంవత్సరమువఱకును రాజ్యపాలనము చేసినట్లు 'ఆంధ్రకవి తరంగిణి'లోఁగలదు, (ద్వితీయ సంపుటము 47 పుట)] కారాబద్దునిగా జేసి ఢిల్లీ నగరముకుఁ గొనిపోవుటయు, సుప్రసిద్దములైన చరిత్రాంశములు ప్రతాపరుద్రునికి బూర్వమునం దాతనితల్లి తల్లియైన రుద్రమదేవి తన తండ్రి మరిణానంతరము. క్రీస్తుశకఁము 1260-వ సంవత్సరము మొదలుకొని 1295 వ సంవత్సరము వఱకును ముప్పది యైదు సంవత్సరములు రాజ్యపాలనము చేసినట్లు దానశాసనములవలనను, చరిత్రకారులు వ్రాసినదానివలనను స్పష్టముగాఁ దెలియవచ్చుచున్నది. సోమదేవరాజీయమునందును రుద్రమదేవి ముప్పదియెనిమిది సంవత్సరములు రాజ్యపాలనము చేసినట్లీ క్రింది పద్యమునఁ జెప్పఁబడినది -

       సీ. 'తదనంతరమునఁ బ్రతాపరుద్రతక్షమా
                        జాని సింహాసనాసీనుఁ జేయఁ
           దలఁచి రుద్రమదేవి తా శివ దేవయ్య
                        గారిని రావించి కడఁక .....
           పాదంబులకు నా నృపాలుచే మ్రొక్కించి
                   యా యయ్యచే భూతి నతని నొసలఁ
           బెట్టించి ధరణికిఁ బట్టాభిషిక్తునిఁ
                   గావించి యా రుద్ర దేవనృపుని

           నాయనకు నప్పగించి యయ్యమ్మ యట్లు
           బుధజనంబులుఁ బ్రజలను బొగడ నవని
           ముప్పదియునెన్మిదేఁడులు మోద మొదవ
           నేలి కైలాసశిఖరికి నేఁగుటయును'

కాబట్టి యీమె తండ్రి యైన గణపతి దేవుఁడు 1260 వఱకును రాజ్య భారము వహించి యుండవలెను. "గణపతిదేవమహారాజచంద్రుం డేఁబది యెనిమిది హాయనంబులు మహామహిమతోడ రాజ్యంబు పాలించె" నని సోమదేవరాజీయము ద్వితీయాశ్వాసమునఁ జెప్పఁబడియుండుటచేత గణపతి దేవుఁడు పదుమూఁడవ శతాబ్దారంభము నుండియు భూపరిపాలనము చేసి యుండవలెను. ఇప్పడు దొరకినంతవఱ కాతని దానశాసనము లన్నియు 1201-వ సంవత్సరమునకు 1260-వ సంవత్సరమునకును నడిమివిగా నున్నవి. తిక్కనసోమయాజి తన ప్రభుని కార్యమునిమిత్తమై గణపతిదేవుని యాస్థానమునకుఁ బోయియుండుట నిర్వివాదాంశ మగుటచేత నాతఁడు 1200 లకును 1260 కును మధ్య నెప్పుడో యోరుగంటికిఁ బోయి యుండవలెను. 1253,1260 సంవత్సరములకు మధ్యపోయినట్లు కనఁబడుచున్నది. ఈ కాలమునం దుండిన తిక్కనసోమయాజి యింతకుఁ బూర్వమునం దిన్నూఱు సంవత్సరముల క్రిందట నుండిన నన్నయభట్టారకునితో సమకాలికుఁడని సాధించుట యే తర్కముచేతను సాధ్యము కానేరదు. దాన శాసనాదులవలె నంత విశ్వాసార్ధములైనవి కాకపోయినను, కాకతీయ వంశమునుగూర్చి యిటీవలివారు వ్రాసిన గ్రంథములను బట్టి చూచినను దిక్కనసోమయాజి నన్నయభట్టు కాలమునం దున్నట్టు చూపుట యసాధ్యమే! సర్వప్పచేత రచియింపఁబడిన ద్విపద సిద్దేశ్వరచరిత్రములోను, మల్లపరాజ పుత్రుఁడైన వీరనార్యునిచే రచియింపఁబడిన ప్రతాపచరిత్రములోను, జగ్గకవికృతమైన సోమదేవరాజీయములోను, కాకతిప్రళయుఁ డోరుగంటి కోటను గట్టి రాజధానిని ఆనమకొండనుండి యోరుగంటికి శాలివాహన శకము 990 కి సరియైన క్రీస్తుశకము 1068-వ సంవత్సరమునందు మార్చుకొన్న ట్లైకకంఠ్యముతోఁ జెప్పCబడి యున్నది. ఈ విషయమునుగూర్చిన సోమదేవరాజీయములోని పద్యము నిందుదాహరించుచున్నాను.-

         సీ. "అవనిపై శాలివాహనశకాబ్దంబులు
                      తొమ్మిదినూఱుల తొంబదియగు
              వరశుభకృన్నామవత్సరంబునను గా
                      ర్తికశుక్లపంచమితిథిని దివిజ
              గురువాసరంబునఁ గర మొప్పురోహిణీ
                      నక్షత్రమున నా ఘనప్రభుండు
              మానుగా నేకశిలానగరంబుఁ గ
                      ట్టించె నెంతేనియు ఠీవి మెఱయ

గమనిక : పుట 154 మళ్ళీ పుట 156 గా కూడా పునరావృతమైంది

కారాబద్దునిగా జేసి ఢిల్లీ నగరముకుఁ గొనిపోవుటయు, సుప్రసిద్దములైన చరిత్రాంశములు ప్రతాపరుద్రునికి బూర్వమునం దాతనితల్లి తల్లియైన రుద్రమదేవి తన తండ్రి మరణానంతరము. క్రీస్తుశకఁము 1260-వ సంవత్సరము మొదలుకొని 1295 వ సంవత్సరము వఱకును ముప్పది యైదు సంవత్సరములు రాజ్యపాలనము చేసినట్లు దానశాసనములవలనను, చరిత్రకారులు వ్రాసినదానివలనను స్పష్టముగాఁ దెలియవచ్చుచున్నది. సోమదేవరాజీయమునందును రుద్రమదేవి ముప్పదియెనిమిది సంవత్సరములు రాజ్యపాలనము చేసినట్లీ క్రింది పద్యమునఁ జెప్పఁబడినది -

       సీ. 'తదనంతరమునఁ బ్రతాపరుద్రతక్షమా
                        జాని సింహాసనాసీనుఁ జేయఁ
           దలఁచి రుద్రమదేవి తా శివ దేవయ్య
                        గారిని రావించి కడఁక .....
           పాదంబులకు నా నృపాలుచే మ్రొక్కించి
                   యా యయ్యచే భూతి నతని నొసలఁ
           బెట్టించి ధరణికిఁ బట్టాభిషిక్తునిఁ
                   గావించి యా రుద్ర దేవనృపుని

           నాయనకు నప్పగించి యయ్యమ్మ యట్లు
           బుధజనంబులుఁ బ్రజలను బొగడ నవని
           ముప్పదియునెన్మిదేఁడులు మోద మొదవ
           నేలి కైలాసశిఖరికి నేఁగుటయును'

కాబట్టి యీమె తండ్రి యైన గణపతి దేవుఁడు 1260 వఱకును రాజ్య భారము వహించి యుండవలెను. "గణపతిదేవమహారాజచంద్రుం డేఁబది యెనిమిది హాయనంబులు మహామహిమతోడ రాజ్యంబు పాలించె" నని సోమదేవరాజీయము ద్వితీయాశ్వాసమునఁ జెప్పఁబడియుండుటచేత గణపతి దేవుఁడు పదుమూఁడవ శతాబ్దారంభము నుండియు భూపరిపాలనము చేసి యుండవలెను. ఇప్పడు దొరకినంతవఱకాతని దానశాసనము లన్నియు

      సీ. 'అంతటఁ పాండ్యదేశాధీశ్వరునిమీఁద
                    దండెత్తి వానిమస్తకము దునిమి
            ........నందముగఁ బట్టము గట్టి
                    వానిచేఁ గోటిసువర్ణ నిష్క
            ములు పన్ను గొని రయంబున సేతుబంధరా
                    మేశ్వరంబున కేగి యెలమితో ధ
            నుష్కోటిలోనఁ బొందుగc దీర్థమాడి యె
                   న్మిదితులాపురుషము ల్గొదుక కచటఁ

            దూఁగి క్రమ్మఱ నిజపురి కేగి ఠీవి
            వఱల నెమ్మది నఱువదివత్సరములు
            రాజు లెన్నఁగ నమ్మహారాజమౌళి
            లీల మెఱయంగ ధాత్రి బాలించె నంత '

పయి పద్యము ప్రకారము కాకతిప్రళయునిపుత్రుఁ డయిన యీ మొదటి ప్రతాపరుద్రురాజ్యకాలము శాలివాహనశకవత్సరములు 1062 మొదలు 1122 వఱకును అగును. ప్రతాపరుద్రుని యనంతరమునందే యాతని పుత్రుఁడయిన గణపతిదేవుఁడు రాజ్యమునకు వచ్చినందున, ఈతని రాజ్యారంభకాలము శాలివాహనశకము 1122 వ సంవత్సర మనఁగా క్రీస్తు శకము 1199-వ సంవత్సరమగును. పయిని చెప్పినట్లితఁ డేఁబది యెనిమిది సవత్సరములు రాజ్యము చేసినందున, సోమదేవరాజీయమును బట్టి సహితము గణపతిదేవుఁడు 1199-వ సంవత్సరము మొదలుకొని 1253 సంవత్సరమువఱకును రాజ్యము చేసినట్లే యేర్పడుచున్నది ఈ కాలము శాసనములవలనఁ దెలియవచ్చెడు కాలముతో నించుమించుగా సరిపోవుచున్నది గణపతిదేవుని రాజ్యకాలములోఁ దిక్క_నసోమయాజి తన ప్రభువగు సిద్ధిరాజు పనిమీఁద నా తనియాస్థానమునకుఁ బోయి యుండినందునఁ దిక్కన తప్పక 1200-1253 సంవత్సరముల మధ్యమున జీవించి యుండవలెను. సత్యమిట్లుండఁగా శ్రీరామమూర్తిపంతులుగారు రామాయణకర్త యగు భాస్కరుని కాలనిర్ణయము చేయుటలో సోమదేవ రాజీయమునుబట్టి కాకతిరాజు శా. శ. 919 వ సంవత్సరములో రాజ్యమునకు వచ్చినట్టు వ్రాసి యున్నారు. నాయొద్ద నున్న సౌమ దేవరాజీవము వ్రాఁతప్రతిలోను, శ్రీరామమూర్తి గారి యాజ్ఞానుసారముగా ముద్రించcబడిన యచ్చు ప్రతిలోనుగూడ తొమ్మిదివందలతొంబది యని యున్నదిగాని వారు వ్రాసినట్లు తొమ్మిదివందలతొమ్మిది యని లేదు. తమవద్దనున్న పుస్తకానుసారముగా ముద్రింపఁబడిన తరువాత, 909 ఉన్న ప్రత్యంతరము వారి కెక్కడ లభించినదో.

తిక్కన నన్నయభట్టుకాలములోనివాఁడు కాఁడని నేను జూపిన గ్రంథ నిదర్శనముల నీ ప్రకారముగా ఖండించి పంతులువారు తిక్కన సోమయాజి నన్నయ భట్టారకుని కాలములోనివాడే యని కొన్ని యద్భుతమార్గములచేత సిద్ధాంతము చేసి యున్నారు.అందు మొదటి మార్గము వాసిష్ఠ రామాయణ గ్రంథకర్త యగు సింగనకవి తన తండ్రి తిక్కన సోమయాజుల మనుమరాలి కొడుకనియు, అతఁడు (తనతండ్రి) శా. శ. 1222 మొదలు 1250 వఱకును రాజ్యము చేసిన తొయ్యేటి యనపోతభూపాలునిమంత్రి యనియు, వ్రాసినందున తల్లి పితామహుఁడగు తిక్కనసోమయాజి యతని కంటె సూటయేఁబది సంవత్సరములు పూర్వము నందుండవలెనని. ఒకఁడు డెబ్బదిసంవత్సరములు బ్రతికినట్టయిన దనకాలములోనే మనుమరాలిబిడ్డలను జూడవచ్చును. హిందువులలో నొకయువతి బిడ్డను గనునప్పటి కామెతాత నూటయేఁబది సంవత్సరముల క్రిందట మృతుఁడగుట యెప్పుడును సంభవింపదు. శ్రీరామమూర్తి గారు చెప్పిన ప్రకారముగానే తొయ్యేటి యనపోత రెడ్డి రాజ్యకాలము క్రీస్తు శకము 1266 మొదలు 1328 వఱకు నగు చున్నది. ఆతని మంత్రియు నాకాలములోనివాఁడే కదా? ఆ యయ్యలమంత్రి యొక్క మాతామహుని తండ్రి యగు తిక్కనసోమయాజి యయ్యలమంత్రి కంటె నూఱేండ్ల ముందే పరమపదము నొందె ననుకొన్నను, తిక్కన సోమయాజి 1228 వ సంవత్సరమువఱకైన జీవించి యుండవలెను. పంతులవారు చూపిన యీ మార్గమువలన నే నేర్పఱిచినకాలమే సిద్ధాంత మగుచున్నది కాని తిక్కనసోమయాజిని మఱి యిన్నూఱు సంవత్సరములు వెనుకకు నన్నయభట్టుకాలమునకుఁ దీసికొని పోనెంచినవారి కోరిక సఫలము కాకున్నది.

వారు చూపిన రెండవమార్గము దాక్షారామ దేవాలయముమీఁది యొక శిలా శాసనములో గణపతిదేవుని యల్లుడు 1175 వ సంవత్సరములో దానము చేసినట్లున్నందున గణపతిదేవుఁ డా కాలమునకు ముప్పది సంవత్సరములు పూర్వమున నుండి యుండవలె ననియు, దిక్కనసోమయాజియు నా కాలము లోనివాఁడే యనియు, ఈ యూహలలెక్క-ప్రకారమయినను దిక్కనసోమయాజి కంటె నన్నయభట్టు నూఱు సంవత్సరములు పూర్వపువాఁడే యగును గాని వారియభిష్ట మందువలనను సిద్ధింపలేదు. పయి శాసనముయొక్క కాలము సరియైనది కాదు. ఈ శాసనమును శ్రీరామమూర్తి పంతులుగారు స్యూయల్ దొరగారి పూర్వ శాసనముల పట్టిక రెండవ సంపుటము 115 వ పుటనుండి గహించినారు. ఈ శాసనములపయిని స్యూయల్ దొరగారు తాము వానిలోని కాలమును శోధింపలే దనియు, అందుచేత 'చరిత్ర కార్యములకయి యీ క్రింది సంవత్సరముల నాధారపఱుచుకొనఁగూడదు' అనియు శీర్షికగా వ్రాసియున్నారు మఱియు నా క్రిందనే 1201 వ సంవత్సరము మొదలుకొని 1258 -వ సంవత్సరమువఱకును గల గణపతిదేవునికాలము లోని శాసనము లనేకము లుదాహరింపఁబడి యున్నవి. ఇట్లు ప్రత్యేకముగా గణపతిదేవునికాలమును తెలుపు శాసనము లనేకము లుండఁగా వానిని గై కొనక వాని కన్నిఁటికిని విరుద్ధముగా నున్న మఱియొకరినిగూర్చిన యీ తప్పుశాసనము నొక్కదానిని మాత్రము సత్యమునుగా స్వీకరించి దాని పైని వింతయూహల నేల యల్లవలయునో తెలియరాకున్నది.

పంతులవారు చూపిన మూడవ మార్గము కాకతీయగణపతిరాజు మంత్రులలో నొకఁడగు గన్నమంత్రి వసిష్ఠరామాయణకృతికర్త యగు సింగనకవివలనఁ బద్కపురాణోోత్తర ఖండమును గృతినందిన కందనమంత్రి కాఱవ పురుషుఁడయినందున, గణపతిదేవునికాలములో నుండిన తిక్కనసోమయాజి మిక్కిలి పూర్వుఁడని, కందనమంత్రికిని గన్నమంత్రికిని నడుమను ముగ్గురు పురుషులే యున్నారు; కాని వారన్నట్లాఱుగురు లేరు, కందనమంత్రి 1350 -వ సంవత్సర ప్రాంతములయందుండినవాఁ డయినందున, అతనితాతతాత యగు గన్నమంత్రి యతనికంటె నూఱు సంవత్సరములు ముందనఁగా 1250 -వ సంవత్సర ప్రాంతములయం దుండి యుండవలెను. గన్నమంత్రి గణపతి దేవులమంత్రులలో నొకం డయినందున నిది యాతనికాలముతో సరిపోపు చున్నది. దీనినిబట్టి విచారించినను గణపతిదేవునికాలములో నున్న తిక్కన సోమయాజి 1250 సంవత్సర ప్రాంతములయందే యున్నట్టు స్థిరపడు చున్నది. తిక్కనసోమయాజుల ప్రార్ధనమీఁద గణపతిదేవుఁడు సేనలతో దండయాత్ర బై లుదేఱి వెలనాఁటిరాజులను జయించి నెల్లూరు పోయి మనుమసిద్ధికి మరల రాజ్యమిచ్చినట్లు సోమదేవరాజీయమునందుఁ జెప్పఁబడి యున్నదిగదా ? కృష్ణామండలములోని యినమళ్ళ గ్రామమునందలి శాసనము వలన 1254 -వ సంవత్సరమున గణపతిదేవుఁడు చోళులను జయించిసట్టు తెలియవచ్చుచున్నది. అప్పడు జయింపఁబడిన చోళులక్కన బయ్యన లేమో! అయినపక్షమున సోమయాజులు 1253 -వ సంవత్సరమున నోరుగంటికి గణపతిదేవుని దర్శిం పcబోయినట్టు కనబడుచున్నది. కాని యతఁడు గణపతిదేవుని దర్శింపఁబోయిన కాలము 1258 -వ సంవత్సరమునకుఁ దరువాత.

వారు చూపిన కడపటిదగు నాల్గవ మార్గము నే నుదహరించిన "అంబర రవిశశిశాకాబ్దంబు" లన్న పద్యమునుబట్టి తిక్కనకాలమును నిర్ణయించుట.ఈ పద్యమునుబట్టి తిక్కన మరణకాలము శాలివాహనశకము 1120 వ సంవత్సరము కాఁగా, తిక్కన నూఱేండ్లు బ్రతికెననుకొన్నచో నాతని జన్మ కాలము శాలివాహనశకము 1020 అనఁగా క్రీస్తుశకము 1097-వ సంవత్సర మగునఁట! నిజముగా నట్లయినను దిక్కనసోమయాజి నన్నయ భట్టు కాలములోనివాఁ డను వారివాదమున కిది సపరిపడక నన్నయ మరణానంతరమున నేఁబది సంవత్సరములకుఁగాని తిక్కన పుట్టనే లేదని చూపుచున్నది. ఈ పద్యము విశ్వాసార్హమయినది కాదని యీవఱకే చెప్పి యున్నాను. మెకంజిదొరవారి లిఖిత పుస్తకములపట్టికయం దీ పద్యమునే యుదాహరించి విల్సన్ దొరగారు దీనినిబట్టి శాలివాహనశకము 1210 వ సంపత్సరమునం దనఁగా హూణశకము 1288 వ సంవత్సరమున దిక్కన సోమయాజి మృతుఁడయినట్టు వ్రాసి యున్నారు. మరణముగూర్చిన యీ పద్యమును వలెనే యొకానొకరు జన్మమునుగూర్చి కూడఁ జెప్పి సోమయాజిగారు శాలివాహనశకము 1042 -వ శార్వరీసంవత్సర ఫాల్గున బహుళదశమీ కుజవాసరంబున జనన మొంది రని వ్రాసి యున్నారు. మరణమునుగూర్చిన యా పద్య మెంత నిజమో జననమునుగూర్చిన యీ పద్యము నంతే నిజమయి యుండును.

ఇవి గాక నిర్వచనోత్తరరామాయణమునుబట్టి కూడఁ దిక్కన కాల నిర్ణయమును జేయవచ్చును.

మ. 'కమలాప్తప్రతిమానమూర్తి యగునా కర్ణాటసోమేశు దు
     ర్దమదోర్గర్వము యేపుమాపి నిజ దర్పంబుం బ్రతిష్టించి లీ
     లమెయిం జోళుని భూమిపై నిలిపి చోళస్థాపనాచార్యనా
     మము దక్కం గొని తిక్కనభూవిభుఁడు సామర్ధ్యంబు చెల్లింపఁడే'


అను పద్యముబట్టి మనుమరాజుయొక్క తండ్రి యైన తిక్కనృపాలుఁడు కర్ణాటసోమేశుని జయించినట్టు కనఁబడుచున్నది. ఈ జయింపఁబడిన సోమేశుఁడు పశ్చిమ చాళుక్యుఁ డయిన నాలవ సోమేశపఁ డయి యుండును. [ ఇయ్యెడ "ఆంధ్రకవి తరంగిణి" కర్తలు క్రింది విధమున వ్రాసి యున్నారు --

"ఈ జయింపఁబడిన సోమేశుఁడు పశ్చిమ చాళుక్యుఁడై న నాలవ సోమేశుఁడయి యుండును" అని శ్రీ వీరేశలింగము పంతులుగారాంధ్రకవుల చరిత్రలో వ్రాసి యున్నారు. కాని యది సరియైనట్లు కన్పట్టదు. ఈ పశ్చిమ చాళుక్యుఁడగు నాలన సోమేశుఁడు శా. శ. 1114 - 1111 వఱకు రాజ్యము చేసిన వాఁడు. ఈ కాలములో తిక్కరాజు లేఁడు ఉన్నను, పదేండ్ల లోపు వయసు కలవాఁడై యుండును. ఏమనిన వెలనాటి పృధ్వీశ్వరుని ఈ తిక్కరాజు తన శైశవముననే చంపియుండెననియు, నది శా. శ. 1218 తరువాత నై యుండుననియుఁ బైన వ్రాసియుంటిని. ..........ఇంతేకాదు చాళుక్య నాల్గవ సోమేశ్వరుని కాలములో చోళరాజ్యమును బరిపాలించుచున్నవాఁడు మూఁడవ కులోత్తుంగచోడుఁడు. ఇతఁడు మిగుల పరాక్రమశాలి చోళ దేశమే కాకుండ, ఆంధ్రదేశము కూడ నీతని యేలుబడిక్రింద నుండెను. అట్టివాని నీ నాల్గవ సోమేశుఁడు చోళ సింహాసనమునుండి తఱిమివేయుట తటస్థింపదు . . . . . ఇందు (పద్యమునందు) చూపఁబడిన సోమేశ్వరుఁడు (హొయ్యలవంశీయుఁడు) కర్ణాట దేశమును శా.శ. 1156 మొదలు 1178 వఱకును పాలించినట్లు శాసనాధారములు కన్పించుచున్నవి . ........ఈకాలములో చోళ రాజ్యమ ను బరిపాలించుచున్నవాఁడు మూఁడవ రాజేంద్రచోళుఁడు. ఇతఁడు బలహీనుఁడై రాజ్యసంరక్షణమునందసమర్ధుఁడై యుండెననియు, నీ సమయమున నీ వీరసోమేశ్వరుఁడు బలవంతుఁడై యాతనిని జయించి చోళసింహాసనము నాక్రమింపఁగా, మన తిక్కరాజు వీరసోమేశ్వరు నెదుర్కొని పోరాడి, చోళసింహాసనమున మూఁడవరాజేంద్రుని నిలిపె ననియుఁ జరిత్రకారులు తలంచుచున్నారు. ఇది సత్యమనుటకు సంశయింప నక్కరలేదు. ఈ మూడవ రాజేంద్రచోళుఁడు, శా.శ.1167 మొదలు 1186 వఱకును చోళ సింహాసనమునం దున్నవాఁడు కావున తిక్కరాజు శా. శ.1167 సంవత్సరమునకుఁ బిమ్మట ననఁగా శా. శ.1170 ప్రాంతమున సోమేశ్వరుని జయించి యుండవచ్చునని తలంపవలసియున్నది. ఈ సోమేశ్వరునిచే జయింపఁబడినవాఁడు మూఁడవ రాజేంద్రచోళుఁడు గాక మూఁడవ రాజరాజని తలంచితిమేని, యాతని పరిపాలనా కాలము శా. శ. 1138 మొదలు 1170 వఱకునునై యున్నది. కావున తిక్కన సోమేశ్వరుని జయించినది శా. శ 1160 ప్రాంతమైయుండును. ఇదియే సత్యమని నాఅభిప్రాయము. (చూ రెండవసంపుటము పుటలు 203-205 )"]

అయియుండినపక్షమున ఈ యుద్ధము 1186 -వ సంవత్సరప్రాంతముల యందు జరిగి యుండవలెను. దీనినిబట్టి తిక్కనృపాలుఁడు 1200 -వ సంవత్సరప్రాంతము వఱకయినను రాజ్యము చేసి యుండును. దీనినిబట్టి యీ తిక్కనృపాలునిపుత్రుఁడును నిర్వచనోత్తరరామాయణకృతిపతియు నగు మనుమరాజు గా 1250-వ సcవత్సరప్రాంతములయందు రాజ్యము కోలుపోవుటలో వింత యేమియు లేదు. మనుమరాజు కాలములోనివాడయిన తిక్క-న 13 -వ శతాబ్దారంభముననుండి యుండి యుండవలెను. ఈ సందర్భమున శ్రీ చిలుకూరి వీరభద్రరావుగారు తమ యాంధ్రులచరిత్రము ద్వితీయభాగమున నిట్లు వ్రాసియున్నారు.

"ఈపై పద్యములలో నితఁడు. . . . చోడునిసింహానముపై నుంచి చోడస్థాపనాచార్యబిరుదమును గై కొనియె ననియుఁ జెప్పఁబడి యున్నది. ఈ పద్యములలోఁ జెప్పఁబడిన విషయము లన్నియు సత్యము లనుటకు సందియము లేదు. మూcడవ కులోత్తుంగచోడ చక్రవ ర్తి వెనుక రాజ్యపదవిని వహించిన మూడవ రాజరాజచోడుఁడు సమర్ధుఁడు గాక మిక్కిలి బలహీనుఁ డగుటవలనను, గృహకలహములవలనను. మధ్యఁ గొంత కాలము రాజ్యమును పోఁగొట్టుకొనవలసినవాఁడయ్యెను. ఇతని కాలమున మారవర్మ సుందరపాండ్యమహారాజువలనను, కర్నాటక వీర సోమేశ్వరునివలనను, పల్లవుండై న కొప్పరింజింగదేవుఁ డను మహామండలేశ్వరునివలనను, రాజ్యమున కుపద్రవము సంభవించెను. మహామండలేశ్వరుఁడైన యీ తిక్కభూపాలుఁడు పాండ్యులను, కర్ణాటక వీర సోమేశ్వరుని జయించి, రాజరాజచోడుని సింహాసనమున నిలిపి చోళ స్థాపనాచార్యుc డను బిరుదమును వహించెను. గాంగవాండిదేశమును బరిపాలించుచుండిన హోసలరా జయిన వీరసోమేశ్వరుని శాసనములు క్రీ. శ. 1234 మొదలుకొని 1253 వఱకును గానంబడుచుండుటచేతను, అతనితోఁ దిక్కభూపతి సమకాలికుం డని చెప్పఁబడి యుండుటచేతను, తిక్కరాజకాలము మనకు స్పష్టముగాఁ దెలియుచున్నది. వీరసోమేశ్వరుఁడు గూడ చోళుని సింహాసనమునఁ గూర్చుండఁబెట్టె ననియు, అతcడును తిక్కభూపాలుఁడు నొండొరులతోఁ బోరాడుచుండి రనియును, దెలియుచుండుటచేత, నిరువురును చోళసింహాసనమునకై పోరాడువారిలోఁ జెఱి యొకప్రక్కను జేరి యుద్ధము చేసిరని యూహింపనగు." నేను మొదట చెప్పినది గాక 1234 నకు తరువాత నని పైనిఁ జెప్పఁ బడినకాలమే యెక్కువ సరియైనదని నమ్ముచున్నాను. ఏలయన 1234-వ సంవత్సరము నం దీ తిక్కభూపాలుని పేర కాంచీనగరమునందలి యొక దేవాలయములో దానశాసన మొకటి కలదు. తిక్కన నిర్వచనోత్తర రామాయణములోనే యీ తిక్కనరపాలుఁడు తనశై_శవమునందే పృథ్వీశరాజుతల చెండాడె నని యిూక్రింది పద్యమునఁ జెప్పబడినది.

" ఉ. కేశవసన్నిభుండు పరిగీతయశోనిధి చోళ తిక్కధా
        త్రీశుడు కేవలుండె ? నృపు లెవ్వరి కా చరితంబు కల్గునే ?
        శై_శవలీలనాఁడె పటుశౌర్యధురంధరబాహుఁఁడైన పృ
        ధ్వీశ నరేంద్రుమస్తకము నేడ్తెఱఁ గందుకకేళి సల్పడే "

ఈ పృధ్వీశ రాజు పండ్రెండవ శతాబ్దాంతమునం దుండిన వెలనాటి చోడ సామంతరాజు. ఈతని శాసనములు 1180 వఱకును గానఁబడుచున్నవి. ఇతcడు తరువాతఁ గూడ బహు సంవత్సరములు జీవించియుండినట్టు నిదర్శనములు కనఁబడుచున్నవి. అందుచేత నీ తిక్కనృపతి తన యౌవనారంభ దశలో 1190 సంవత్సరప్రాంతముల రణరంగమునందు పృథ్వీశరాజుతలఁ దునిమి యుండును. * ఇవి యన్నియుఁ దిక్కన సోమయాజి 1250 సంవత్సరప్రాంతమునం దుండెనని స్థాపించుచున్నవి.

తిక్కనసోమయాజికాలము నింకను బహువిధములచేత నిర్ణయింపవచ్చును. భోజరాజీయాదికావ్యరత్నములను రచించిన యనంతకవి తన ప్రపితామహుఁ __________________________________________________________________________ [*ఆంధ్రకవి తరంగిణి" లో నిచ్చట క్రింది రీతిని గలదు -- 'ఈ పృథ్విశ్వరుఁడు వెలనాటి చోడుడు, మూఁడవ గొంకరాజుజనకును, జయాంబికకును కుమారుడు............. పృథ్వీశ్వరుని శాసనములు శా. శ. 1108 మొదలు 1128 వఱకును కన్నట్టుచున్నవి. ........ 1128 తరువాత నీతని శాసనములు గన్పట్టుట లేదు. తిక్కరాజు తన శైశవమునందే యీతనిని జంపెనని పై పద్యమునందుఁ జెప్పియుండుటచే 1128-వ యేట నీతఁడు పృథ్వీశ్వరుని సంహరించెననియు, దానినిబట్టి తిక్కరాజా యొక్క జననము 1111 ప్రాంతమై యుండుననియు నిశ్చయింపవచ్చును.' (రెండవ సంపుటము పుట 2O1)] డైన బయ్యనమంత్రినిగూర్చి వ్రాయుచు నతఁడు తిక్కనసోమయాజిచేత భవ్యభారతి యని పేరు గాంచినట్లు *భోజరాజీయములో నీ క్రింది పద్యమునఁ జెప్పియున్నాడు.

     "చ. క్షితిఁ గ్రతుకర్తనా వినుతి చేకొని పంచమవేదమైన భా
          రతముఁ దెనుంగుబాస నభిరామముగా రచియించినట్టి యు
          న్నతచరితుండు తిక్కకవినాయకుఁ డాదట మెచ్చి భవ్యభా
          రతి యనఁ బేరుగన్నకవిరత్నము బయ్యనమంత్రి యల్పుడే."

ఈ బయ్యన్న మంత్రికొడుకు ముమ్మఁడన్న. ముమ్మఁడన్న కొడుకు తిక్కన: తిక్కనకొడుకు భోజరాజీయాది గంధకర్త యైన యనంతకవి. ఈ యనంతకవి తన రసాభరణమునందు తా నా గ్రంధమును రచించిన కాలము శాలివాహన శకము గా 1356 -వ సంవత్సరమనఁగా క్రీస్తుశకము 1434 వ సంవత్సర మైన ట్లీ క్రింది పద్యమునఁ జెప్పి యున్నాఁడు.

      "శా. జానొందన్ శకవర్షముల్ ఋతుశరజ్వాలేందులై యొప్ప న
           య్యానందాబ్దమునందు మాఘమునఁ గృష్ణైకాదశీ భౌమయు
           క్తానామామృతవేళ నీ కృతి యనంతాఖ్యుండు సమ్యగ్రస
           శ్రీ నిండం ధ్రువపట్టణాధిపున కిచ్చెన్ భక్తి పూర్వంబుగన్."

ఈ కవికిని, తిక్కనసోమయాజి కిని నడుమ ముగ్గురు పురుషులు మాత్రమే యున్నారు. ఒక్కొక్క పురుషాంతరమునకు నలువదియైదేసి సంవత్సరములు చూచినను సోమయాజులు 1300 సంవత్సరప్రాంతము వఱకును జీవించి యుండెనని తేలుచున్నది. తిక్కనసోమయాజులు 78సంవత్సదములు జీవించెనని ప్రసిద్ధి గలదు. అదియే నిజమైనవశమున నతఁడు 1220-వ సంవత్సర ప్రాంతమున జనన మొంది 1300 సంవత్సరప్రాంతము వఱకును జీవించి యుండవలెను. అప్పుడతఁడు ముప్పది నలువది యేండ్ల ప్రాయమున మనుమసిద్ధిజీవితకాలములో నిర్వచనో త్తరరామాయణమును రచించి నట్లును, భారతమును మనుమరాజు మరణానంతరముననే రచియించినట్లును, ఏర్పడుచున్నది. తిక్కనసోమయాజి తన నిర్వచనోత్తరరామాయణము నందు కృతిపతి యైన మనుమసిద్ధి యొక్క పరాక్రమమును వర్ణించుచు మహారాష్ట్రసారంగునిఁ దోలి తురంగమును గొనినట్లీ క్రిందిపద్యమునఁ జెప్పి యున్నాఁడు.---

           "శా. శృంగారంబు నలంగ దేమియును బ్రస్వేదాంకురశ్రేణి లే
                దంగంబుల్ మెఱుఁగేద వించుకయు మాహారాష్ట్ర సామంతుసా
                రంగం దోలి తురంగమం గొనిన సంగ్రామంబునం దృప్త స
                ప్తాంగస్ఫారయశుండు మన్మవిధువంపై చన్న సైన్యంబునన్."

ఇందు బేర్కొనcబడిన మహారాష్ట్రసారంగుఁ డద్దంకిసీమకుఁ బాలకుఁడుగా నుండి కాకతీయ గణపతిదేవునికి లోఁబడి యుండిన సామంతరాజు. పయి పద్యమునందు మనుమసిద్ధి మహారాష్ట్ర సామంతుఁడైన సారంగని దోలి తురంగముం గొనినప్పడు శృంగారంబు చెడలేదనియు దేహమునఁ జెమ్మట పట్టలేదనియు నంగములు మెఱుఁగు విడువలేదనియుఁ జెప్పెనేకాని సారంగుని గెలిచి రాజ్యమును గైకొన్నట్టుగాని, యాతనిని పట్టుకొన్నట్లు గాని చెప్పలేదు. ఈపోరాటమునందు సంపూర్ణ విజయము నొందకయే యాతనితోడ సంధి చేసికొన్న గణపతిదేవుని యనుగ్రహామునకు పాత్రుఁ డయ్యెనని తోఁచుచున్నది. * ఈ మనుమసిద్ధి మొదటినుండియు స్వతంత్ర రాజు గాక మొదట కాంచీపురచోడ చక్రవర్తులకును, కడపట కాకతీయ గణపతికిని లోఁబడిన సామంతరాజుగా నుండెను. మహారాష్ట్ర సామంతుని తోడి యీ యుద్దము 1257-వ సంవత్సరప్రాంతమునందలి దయి యుండును. ఈ మనుమరాజు పలుమాఱు శత్రువుల కోటువడి రాజ్యమును పోఁగొట్టుకొనుచు వచ్చెను. కడపట దాయాదులచేత రాజ్యపదభ్రష్టు డయినప్పడు 1260 -వ సంవత్సరము లోపలనే తిక్కనప్రార్ధనపైని గణపతిదేవుఁ డీతనికి తోడుపడి శత్రువుల నడఁచి రాజ్యమునందు మరల నిలిపి యుండును. 1257-వ సంవత్సరము వఱకును జరిగిన వృత్తాంతములుత్తరరామాయణమునందు పేర్కొనఁబడి యుండుటచేత నా పుస్తక మా __________________________________________________________________________ [*సారంగుఁడు మనుమసిద్ధి చే యుద్ధమున నోడింపఁబడినట్లు శ్రీ చిలుకూ పీరభద్రరావుగా 'రాంధ్రుల చరిత్రము'న వ్రాసియున్నారు.] కాలమునందే రచియింపఁబడి యుండును. పసుల మేఁతబీళ్ళపుల్లరివిషయమున జరిగిన జగడములో కాటమరాజు వలెనే మనుమసిద్ధియు 1263 -వ సంవత్సరప్రాంతమున రణ నిహతుఁ డయ్యెను. అంతటితో నీతనిరాజ్య మంతరించెను. అప్పటికి భారతము రచింపబడలేదు. అందుచేత సోమదేవరాజీయాదుల యందుఁ జెప్పఁబడిన భారత శ్రవణకధ కవికల్పిత మనుటకు సందేహము లేదు. [సోమదేవరాజీయాదులయందలి వాక్యములనుబట్టి భారతరచన యంతకుమున్నే జరిగిన ట్లూహీంపవీలులేదు. తిక్కన సంస్కృత భారతమును జదివి వినిపించి గణపతిదేవుని మెప్పించి యుండును. కావున పయిగ్రంధములోని వాక్యములు విరుద్ధములని యనుకొననక్కఱలేదు.]

కవియొక్క కాలనిర్ణయమునుగూర్చి యింకొక చిన్న యాధారమును మాత్రము చూపి యీ విషయము నింతటితో విడిచిపెట్టెదను. పద్మపురాణోత్తరఖండము మొదలై న బహుకావ్యములను రచియించిన మడికి సింగన్న తన పితామహుడై న యల్లాడమంత్రికి తిక్కనసోమయాజితోఁ గల బంధుత్వమును తన వాసిష్టరామాయణములో క్రింది పద్యమునఁ దెలిపి యున్నాఁడు.

    " సీ. అతఁడు తిక్కనసోమయాజులపుత్రుడై
                   కొమరారు గుంటూరికొమ్మవిభుని
        పుత్రిచిట్టాంబిక బుధలోకకల్పక
                   వల్లి వివాహమై వైభవమున
        భూసారమగు కోట భూమిఁ గృష్ణానది
                   దక్షిణతటమున ధన్యలీల
        నలరు రావెల యను నగ్రహారము తన
                   కేకభోగంబు గా నేలుచుండి

        యందుఁ గోవెల గట్టి గోవిందునన్న
        గోపినాధుఁ బ్రతిష్ఠయుఁ గోరి చేసి
        యఖిలభువనంబులందును నతిశయిల్లె
        మనుజమందారుఁ డల్లాడమంత్రివిభుఁడు."

ఈ యల్లాడమంత్రి తిక్కనసోమయాజి మనుమరాలిభర్త; కవి సింగన్న యల్లాడమంత్రి మనుమడు. తిక్కనసోమయాజిపుత్రుఁడు కొమ్మన: కొమ్మనకూఁతురు చిట్టాంబ కల్లాడమంత్రివలనఁ గలిగిన పుత్రుఁ డయ్యల మంత్రి; అయ్యలమంత్రి పుత్రుడు గ్రంథకర్త యైన సింగన్న. ఈ కవి తాను పద్మోత్తరఖండమును రచించిన కాలము శకవర్షము 1344 అయినట్లా పురాణమునం దీక్రిందిపద్యమునఁ జెప్పియున్నాడు.

                       మంగళమహాశ్రీ వృత్తము
        "ఆకరయుగానలమృగాంకశకవత్సరములై పరఁగు శార్వరిని బుణ్య
         ప్రాకటితమార్గశిరపంచమిని బొల్చు నుడుపాలసుతవాసరమునందున్
         శ్రీకరముగా మడికి సింగన దెనుంగున రచించెఁ దగఁ బద్మపురాణం
         బాకమలమిత్రశిశిరాంశువుగఁ గందసచివాగ్రణికి మంగళమహాశ్రీ."

ఈ పుస్తకము శాలివాహనశకము 1344 శార్వరి సంవత్సర మార్గశిర పంచమీ బుధవారమునం దనఁగా క్రీస్తుశకము 1422 నందు ముగింపఁబడెను. ఈ కవికిని తిక్కనసోమయాజికిని నడుమను మూఁడు తరములు మాత్రము చెల్లినవి. ఒక్కొక్క తరమున కంతరము నలుబదేసి సంవత్సరములచొప్పునఁ జూచినను తిక్కనసోమయాజి 1300 సంవత్సరప్రాంతమున నుండి యుండవలెను. పయి పద్యములలో మొదటి దానియందు "తిక్కనసోమయాజులపౌత్రుఁడై కొమరారు గుంటూరికొమ్మ విభుని" అను పాఠము కొన్ని ప్రతులలోఁగానఁబడు చున్నది. అది ప్రమాదజనితమైన యపపాఠము. కొమ్మన్న సోమయాజుల పుత్రుఁడు గాని పౌత్రుఁడు గాడు. సోమయాజులవంశజులలో నిప్పుడు జీవించియున్న పాటూరి శరభరాజుగారిచే నీయఁబడిన వంశానుక్రమణిక యీ విధముగా నున్నది.

         సీ. 'భారతపర్వము ల్పదియేను వరుసగాఁ
                    దెనిఁగించె గుంటూరితిక్కయజ్వ
              యా మహాత్ముని పుత్రుఁడౌ కొమ్మనఘనుండు
                   కల్పించెఁ బాటురికరిణికంబు

            నా కొమ్మనకుఁ కల్గె హరిహరామాత్యుండు
                        నెమ్మిలో నతనికిఁ గొమ్మఘనుఁడు
            రహిమీఱ నతనికి రామన తిప్పన
                        యా రామనకు సోమయాహ్వయుండు

            ఆ ఘనునకు వీరనామాత్యుఁ డతనికి
            సోమలింగమంత్రి యా మహాత్ము
            నకును సోమరాజనాముఁడుఁ జిటివీర
            ఘనుఁ డనంగ సుతులు గలిగి రందు.

      సీ. సోమ మంత్రికిఁ గల్గె సుతుఁడు పాపనమంత్రి
                        యతనికి వీరన యా ఘనునకుఁ
            గూరిమితనయులు గోపాలభద్రార్య
                        నరసింహమంత్రు లనంగ ముగురు
            వారిలో నరసింహవరునకు శరభార్యుఁ
                        డును భాస్కరామాత్యుఁడు నరసింహ
            ఘనుఁ డనఁ బుత్రులు కలిగిరి మువ్వురు
                        వారిలో శరభార్యవర్యునకును

            వీరఘనుఁడు గలిగె వేడ్క_నా మంత్రికి
            శరభమంత్రి వరుఁడు జనన మొంది
            ప్రబలి యున్నవాఁడు పాటూరిలోఁ దన
            కులము వర్థిలంగc గొమరుమీఱి

ఈ పద్యములు రెంటిలో మొదటిది పూర్వరచిత మని చెప్పి శరభరాజు గారిచ్చినది; రెండవది శరభారాజుగారిచ్చిన వంశానుక్రమణికను బట్టి బ్రహ్మశ్రీ శతఘంటము వేంకటరంగ శాస్త్రిగారిచే రచియింపఁబడినది. ఇప్పడున్న శరభరాజుగారికిని తిక్కనసోమయాజిగారికిని నడుమ 13 తరములు చెల్లినవి. ఆద్యంతములయం దున్న వీరి నుభయులనుగూడఁ గలుపుకొని తరమొకటికి నలువదేసి సంవత్సరములచొప్పన పదునేనుతర ముల కాఱునూఱు సంవత్సరములు లెక్క వేసినను తిక్కనసోమయాజి కాలము 1300 ల సంవత్సరముకంటె వెనుకకు పోదు. ("ఆంధ్రకవి తరంగిణి" కారులు తిక్కనసోమయాజి చరిత్రములో కవి కాలమును గురించి విపులముగాఁ జర్చించి, యీ 'ఆంధ్రకవుల చరిత్రము" నందలి విషయము లను గూర్చి తమ యభిప్రాయమును తెల్పుచు తమ సిద్ధాంతమును వివరించిరి. దాని సారము మాత్ర మిచట తెలుపఁబడుచున్నది.

'బ్ర. శ్రీ వీరేశలింగము పంతులుగా రాంధ్రకవుల చరిత్రమునఁ దిక్కన కాలమును సరిగానే నిర్ణయించిరి కాని, వారు గైకొనిన యాధారములు సంశయాస్పదములుగా నున్నవి. వారాధారముగాఁ గైకొనిన పెంట్రాల శాసనములు మన మనుమసిద్దివి గావనియు, ముక్కంటికాడు సెట్టి వంశీయుఁడైన భుజ బల వీర మనుమసిద్ధివనియుఁ దోఁచుచున్నది. మనుమసిద్ది నామధారులు పెక్కురున్నారు. (రెండవ సంపుటము పుట 196)

'బ్ర. శ్రీ వీరేశలింగము పంతులుగారీ (పాటూరి శరభరాజుగా రిచ్చిన) వంశావళినిబట్టి తిక్కనకాలమును నిర్ణయించ యత్నించిరి. ఇప్పడు శాసన సాహాయ్యమున నీ మహాకవి కాలము స్పష్టముగాఁ దెలియుచున్నది. కావున నందుల కీ వంశావళితోఁ బనిలేదు' (రెండవ సంపుటము పుట 155)

తిక్కన నిర్వచనో త్తర రామాయణమును కీ. శ. 1253–1258 నడుమ రచించి యుండుననియు ఇతఁడును, కృతిపతియగు మనుమసిద్దియు నించుమించుగ సమవయస్కులనియు, అప్పటికి తిక్కన వయస్సు నలువది సంవత్సరము లుండుననియు, నందుచే నీతని జననము క్రీ శ.1220 ప్రాంతమున నుండుననియు మనుమసిద్ధి నిర్యాణానంతరము భారతరచన ప్రారంభింపఁబడి యుండుననియు, ఆ రచన క్రీ శ. 1270-1280 ల నడుమ జరిగియుండుననియు నందు వివరింపఁబడియున్నది. తిక్క-న నిర్యాణమును గూర్చిన 'అంబర రవి శశి .... అను పద్యము ప్రమాణము కానందున, దానింబట్టి తిక్కన నిర్యాణకాలమును నిర్ణయించటం సరికాదని అందఱు నంగీకరింతురు. తిక్కన 78 ఏండ్లు జీవించియుండెనని వాడుక యున్నందున అతనికాలము క్రీ.శ. 1220 మొదలు 1300 వరకు నుండవచ్చునని యూహింపవచ్చును.) కవితిక్కన నియోగిబ్రాహ్మణుఁడు. ఈతనిపూర్వుల నివాసస్థలము మొట్టమొదట కృష్ణామండలములోని వెల్లటూరు గ్రామమనియు, ఉద్యోగధర్మము చేత వా రీతనితాత కాలమున గుంటూరునకు వచ్చిరనియు, తరువాత నెల్లూరిరాజగు మనుమసిద్ది యీతనికుటుంబము నాదరించి నెల్లూరికిఁ దీసికొనివచ్చి పూర్వము హరిహరదేవాలయ ముండిన యిప్పటి రంగనాయకస్వామి యాలయసమీపమున గృహము కట్టించి యిచ్చి తిక్కనసోమయాజుల నం దుంచె ననియూ, మనుమసిద్ది మరణముతో నా రాజవంశ మంతరింపఁగా సోమయాజుల కొడుకు కొమ్మన్న పాటూరి కరిణికము సంపాదించి నెల్లూరు విడిచి యందు వసించెననియు చెప్పచున్నారు. ఈ పాటూరి గ్రామము నెల్లూరికి పడమట రెండు మూఁడు క్రోసుల దూరమున నుత్తరపినాకినీతీరమునం దున్నది. ఈ కవియొక్క- పితృపితామహులది గుంటూరగుటచేత నీతనియింటిపేరు గుంటూరివా రని చెప్పదురు. నా కిటీవల లభించిన కేతనకృత మైన దశకుమారచరిత్రమునుబట్టి చూడఁగా దిక్కనసోమయాజి యింటిపేరు కొట్టరువువారయినట్టు తెలియవచ్చినది. తిక్కనసోమయాజి కంకితముచేయcబడిన యీ గ్రంధమునం దీతని వంశావళి సమగ్రముగా వర్ణింపఁబడినది. దశకుమారచరిత్రమునందు సోమయాజి తాత యైన మంత్రిభాస్కరుఁ డిట్లు వర్ణింపcబడెను.

   శా. 'శాపానుగ్రహశక్తియుక్తుఁ డమలాచారుండు సాహిత్యవి
        ద్యాపారీణుఁడు ధర్మమార్గపధికసం డర్ధార్ధిలోకావన
        వ్యాపారవ్రతుఁ డంచుఁ జెప్ప సుజనవ్రాతంబు గౌరీపతి
        శ్రీపాదప్రవణాంతరంగు విబుధ శ్రేయస్కరున్ భాస్కరున్.'

కృతికర్త యీ భాస్కరమంత్రి గ్రంథరచన చేసినట్టు చెప్పకపోయినను "శాపానుగ్రహశక్తియు క్తుఁడు" అనియు, "సాహిత్యవిద్యాపారీణుఁడు" అనియు చెప్పటచేతనే యాతఁడు కవియైన ట్టూహ చేయవచ్చును. కవి యటుతరువాత భాస్కరునికి నలుగురు పుత్రులయినట్లీ క్రింది పద్యములలోఁ జెప్పెను.

   ఉ. ధీనిధి భాస్కరార్యునకు ధీరగుణాన్విత కొమ్మమాంబకునున్
        మానవకోటిలోపల సమస్తగుణమ్ముల వాఁడు పెద్దనా
        వానికి వాఁడు పెద్ద యన వానికి వానికి వాడు పెద్దగా
        వానికి వార లందఱకు వాఁ డధికం డసఁ బుట్టి రాత్మజుల్.

   సీ. వివిధవిద్యాకేళి భవనధావంబున
                 జలజజుముఖచతుష్టయముఁబోలి
        విబుధవిప్రతిపత్తివిదళనక్రీడమై
                 జలశాయిభుజచతుష్టయముఁబోలి
        ధర్మమార్గక్రియాదర్శకత్వంబున
                 సన్ను తాగమచతుష్టయముఁబోలి
        పృధుతరప్రథిత గాంభీర్యగుణంబున
                 శంబరాకరచతుష్టయముఁబోలి

        సుతచతుష్టయంబు నుతి కెక్కె గుణనిధి
        కేతనయును బారిజాత నిభుఁడు
        మల్ల నయును మంత్రిమణి సిద్ధనయు రూప
        కుసుమమార్గణండు కొమ్మనయును

తిక్కనసోమయాజియొక్క పెదతండ్రులలో మొదటివాఁడును, రెండవ వాఁడును నయిన కేతనను మల్లనను వారి తనయులను వర్ణించినతరువాత, సోమయాజికి మూడవ పెదతండ్రియు, మన్మభూపాలుని తండ్రియైన తిక్కరాజమంత్రియు నైన సిద్ధనామాత్యునిని, ఆతని యగ్రపుత్రుఁ డయిన రణతిక్కనను ఇట్లు వర్ణించెను.

   ఉ. స్థాపితసూర్యవంశవసుధాపతినాఁ బరతత్వధూతవా
       ణీపతినా నుదాత్తనృపనీతిబృహస్పతినా గృహస్థగౌ
       రీపతినాఁ గృపారససరిత్పతినాఁ బొగడొందె సిద్ధిసే
       నాపతిప్రోఢ తిక్కజననాధశిఖామణి కాప్తమంత్రియై.

     క. సామాద్యుపాయపారగుఁ
        డాముష్యాయణుఁడు సిద్ధనామాత్యునకున్
        గామితవవిసుశ్రాణన
        భూమిజనితకల్పవల్లి ప్రోలాంబికకున్.

     సీ. విపులనిర్మలయశో విసరగర్భీకృత
                   దిక్కుండు నాఁ దగు తిక్కనయును
        దర్పితిక్రూర శాత్రవసముత్కరతమో
                   భాస్కరుం డనఁదగు భాస్కరుండు
        నప్రతిమానరూపాధరీకృతమీన
                   కేతనుం డనఁదగు కేతనయును
        నిజభుజాబలగర్వనిర్జితొగ్రప్రతి
                   మల్లుండు నాఁదగు మల్లనయును

        శ్రీయుతుండు చొహత్తనారాయణుండు
        మల్లనయు నీతివిక్రమమండనుండు
        పిన్నభాస్కరుండును బుధ ప్రీతికరుఁడు
        పెమ్మనయు నుదయించిరి పెంపు వెలయ.

    వ. అం దగ్రసంభవుండు.

    సీ. వేఁడిన నర్ధార్థి వృధపుచ్చనేరని
                 దానంబు తనకు బాంధవుడు గాఁగ
        నెదిరిన జమునై న బ్రదికి పోవఁగనీని
                 శౌర్యంబు తన కిష్టసఖుఁడు గాఁగ
        శరణు జొచ్చిన శత్రువరునైన రక్షించు
                 కరుణయె తనకు సంగాతి గాఁగఁ
        బలికినఁ బాండవ ప్రభునైన మెచ్చని
                 సత్యంబు తనకు రక్షకుడు గాఁగ

       జగతి నుతికెక్కె రాయవేశ్యాభుజంగ
       రాజ్యరత్నాకరస్ఫూర్తి రాజమూర్తి
       గంధవారణబిరుదవిఖ్యాతకీర్తి
       దినపతేజండు సిద్ధయ తిక్కశారి."

అటుపిమ్మట గృతిక_ర్త యయిన యభినవదండి సోమయాజుల తల్లిదండ్రుల నిట్ల వర్ణించెను--


   సీ. స్వారాజ్యపూజ్యుండొ ! కౌరవాధీశుండొ
                నాఁగ భోగమున మానమున నెగడె
       రతినాఁధుడో దినరాజతనూజుఁడో
                నాఁగ రూపమున దానమున నెగడె
       ధరణీధరేంద్రుఁడో ధర్మసంజాతుడో
                యనఁగ ధైర్యమున సత్యమున నెగడె
       గంగాత్మజన్ముఁడో గాండీవధన్వుఁడో
                యనఁగ శౌచమున శౌర్యమున నెగడె

       సూర్యవంశకభూపాలసుచిరరాజ్య
       వనవసంతుండు బుధలోకవత్సలుండు
       గౌతమాన్వయాంభోనిధి శీతకరుఁడు
       కులవిధానంబు కొట్టరుకొమ్మశౌరి.

   క. అతఁడు రతిఁ జిత్తసంభవు
       గతి రోహిణి జంద్రుమాడ్కిఁ,గమలావాసన్
       శతదళలోచనుక్రియ, న
       ప్రతిమాకృతి నన్నమాంబఁ బరిణయ మయ్యెన్.

   సీ. పతిభక్తి నలయరుంధతి పోలేనేనియు
                సౌభాగ్యమహిమ నీ పతికి నెనయె ?
        సౌభాగ్యమున రతి సరియయ్యెనేని భా
                గ్యంబున వీ యంబు జాక్షి కెనయె ?

       భాగ్యంబునందు శ్రీపతి యయ్యెనేనియు
                 దాలిమి నీ లతాతన్వి కెనయె ?
       తాలిమి భూదేవి తగుపాటి యగునేని
                 నేర్పున నీ పద్మనేత్ర కెనయె ?

       యని యనేకవిధంబుల నఖిలజనులు
       పొగడ నెగడెఁ గృపాపరిపూరితాంత
       రంగ కొమ్మనామాత్యునర్థాంగలక్ష్మి
       యఖిల గుణగణాలంకృత యన్నమాంబ '

ఇట్లు వంశాభివర్ణనము చేసినతరువాతఁ గేతనకవి తిక్కనజన్మాదికమును జెప్పి యాతని నిట్లు వర్తించెను ---

వ. ............. ఆతండు జాతకర్మ ప్రముఖసంస్కారానంతరంబున వేదాదిసమ స్తవిద్యాభ్యాసియగుచు ననుదిన ప్రవర్థనంబు జెంది తుహినభానుండునుcబోలె బహుకళాసంపన్నుండును, గార్తికేయుండు నుంబోలె నసాధారణశక్తియుక్తుండును, నధరీకృతమయూరుండునునై , పరమేశ్వరుండునుంబోలె లీలావినిర్జితకుసుమ సాయకుండును నకలంక విభూత్యలంకృతుండునునై , నారాయణుండునుం బోలె ననంతభోగసంశ్లేషశోభితగాత్రుండును, శ్రీమత్పురుషోత్తమత్వ ప్రసిద్ధుండును లక్ష్మీసమా లింగితవక్షుండునై వెలనె, నా తిక్కనామాత్యుగుణవిశేషంబు లెట్టి వనిన.

   
   సీ. సుకవీంద్రబృందరక్షకు డెవ్వఁ డనిన వీఁ
               డను నాలుకకుఁ దొడ వై నవాఁడు
       చిత్తనిత్యస్థితశివుఁ డెవ్వఁ డనిన వీఁ
               డను శబ్దమున కర్థమైనవాఁడు
       దశదిశా విశ్రాంతయశుఁ డెవ్వఁ డనిన వీc
               డని చెప్పుటకుఁ బాత్ర మైనవాఁడు
       సకలవిద్యాకళాచణుఁ డెవ్వఁ డనిన వీc
               డని చూపుటకు గుఱి యైనవాఁడు

      మనుమసిద్ది మహీశ సమస్త రాజ్య
      ధారాధౌరేయుఁ డభిరూపభావభవుఁడు
      కొట్టరువుకొమ్మనామాత్ముకూర్మిసుతుఁడు
      దీనజనతానిధానంబు తిక్కశౌరి.

   క. ఆగు నన గొమ్మయతిక్కcడు
      జగతినపూర్వార్ణ శబ్దచారకవితమై
      నెగడిన 'బాణోచ్చిష్టం
      జగత్రయం' బనిన పలురు సఫలం బయ్యెన్.

   క. కృతులు రచియుంప సుకవుల
      కృతు లొప్పఁ గొనంగ నొరునికిం దీరునె వా
      కృతినిభుఁడు వివరణ శ్రీ
      యుతుఁడన్న మునుతుడు తిక్కఁ డొకనికిఁదక్కన్.

   క. అభినుతుఁడు మనుమభూవిభు
      సభఁ దెనుగున సంస్కృతమునఁ జతురుండై తా
      నుభయ కవిమిత్రనామము
      త్రిభువనముల నెగడ మంత్రితిక్కఁడు దాల్చెన్.

   సీ. సరస కవీంద్రుల సత్ప్రబంధము లొప్పఁ
                   గొను నను టధిక కీర్తనకుఁ దెరువు
       లలితనానాకావ్యములు చెప్ప నుభయభా
                   షలయందు ననుట ప్రశంసత్రోవ
       యర్థిమైఁ బెక్కూళ్ళ నగ్రహారంబుల
                   గా నిచ్చు ననుట పొగడ్త పొలము
       మహితదక్షిణ లైన బహువిధయాగంబు
                   లొనరించు ననుట వర్ణనముదారి

      పరుని కొక్కని కిన్నియుఁ బ్రకటవృత్తి
      నిజములై పెంపు సొంపారి నెగడునట్టి
      కొమ్మనామాత్యుతిక్కనకొలఁది సచివు
      లింక నొక్కరుఁ దెన్నఁగ నెందుఁ గలఁడు ?

ఈ పద్యములలో స్పష్టముగాఁ జెప్పకపోయినను దిక్కన రామాయణాది గ్రంథములను జేసినట్టును, క్రతువులు చేసినట్టును గవి సూచించియున్నాఁడు. దశకుమారచరిత్రమును కృతి నందునప్పటికి తిక్కన భారతరచన మారంభించి యుండడు; కేతన యెక్కడను తిక్కన్నను సోమయాజి యని చెప్పి యుండకపోవుటచేత నతఁ డప్పటికి యజ్ఞము సహితము చేసియుండఁడు. ఆధానమును జేసి యుండునేమో ! తిక్కన్నే మనుమసిద్ధిమంత్రిగా నుండి సంపదలతోఁ దులదూగుచున్న కాలముననే కేతన యాతనికి దశకుమార చరిత్రము నంకితము చేసెను. మఱియు నీతని వంశాభివర్ణనమునుబట్టి ముగ్గురు తిక్కనలు లే రనియుఁ గవితిక్కనయే మంత్రితిక్కన యనియు రణతిక్కన యనియు ఖడ్గతిక్కన యనియుఁ జెప్పఁబడునతఁడు కవితిక్కనకుఁ బితృవ్యపుత్రుఁడనియు స్పష్టపడినది.

కొమ్మన్ననుండి యాతని సంతతివారు పాటూరివా రయినారు.ఈ తిక్కన కవి గౌతమగోత్రుఁడు.ఈతని తండ్రి కొమ్మన; తల్లి అన్నమ్మ,కేతన,మల్లన,సిద్దన అనువా రీతని పెదతండ్రులు.*ఈ కవిగ్రామణి యొక్క __________________________________________________________________________

  * సీ. మజ్జనకుండు సన్మాన్య గౌతమగోత్ర
               మహితుండు భాస్కరమంత్రితనయుఁ
        డన్నమాంబాపతి యనఘులు కేతన
               మల్లన సిద్ధ నామాత్యవరుల
        కూరిమితమ్ముండు గుంటూరివిభుఁడు కొ
               మ్మనదండనాధుఁడు మధురకీర్తి
        విస్తరస్ఫారుఁడాస్తంభసూత్రప
               విత్రశీలుఁడు సాంగవేద వేది

        యర్థిఁ గల వచ్చి వాత్సల్య మతిశయిల్ల
        నస్మదీయ ప్రణామంబు లాదరించి
        తుష్టి దీవించి కరుణార్ద్రదృష్టిఁ జూచి
        యెలమి నిట్లని యానతి యిచ్చె నాకు --విరాటపర్వము.

    మ. అమలోదా త్తమనీష నే నుభయకావ్యప్రౌఢిఁ బాటించుశి
        ల్పమునం బారగుఁడం గళావిదుఁడ నాప స్తంభనూత్రుండ గౌ
        తమగోత్రుండ మహేశ్వరాంఘ్రికమలధ్యానైకశీలుండ న
        న్నమకుం గొమ్మనమంత్రికిన్ సుతుఁడఁ దిక్కాంకుండ సన్మాన్యుఁడన్
                                         --నిర్వచనోత్తర రామాయణము.

తండ్రితాతలు రాజాస్థానములయందు గొప్పకొలువలు చేసి ప్రభుసమ్మా నము బొంది మిక్కిలి ప్రసిద్ధి కెక్కినవారు. కవితండ్రి యైన కొమ్మన మంత్రి కృష్ణా మండలములోని గుంటూరునకు దండనాధుడయి యుండెను. తాతయైన భాస్కరుఁడు గుంటూరి కధిపతిగా సుండి విద్యలయం దసమానుఁడయి మంత్రిభాస్కరుండని విఖ్యాతి కెక్కెను. మొట్టమొదటి రామాయణమును పద్యకావ్యమునుగా తెనిఁగించిన మహాకవి యితఁడే యని చెప్పుదురు. ఆ గ్రంధ మీయనపేరనే భాస్కరరామాయణమని నేఁటివఱకును ప్రసిద్ధి చెందుచున్నదనియుఁ జెప్పుదురు ఇప్పడున్న భాస్క_రరామాయణమున కాపేరు హుళక్కి భాస్కరునివలననే కలిగినదిగాని మంతిభాస్కరునివలనఁ గలిగినదిగా కనఁబడదు *

రామాయణ మంతకు ముందు రచియింపఁబడి యుండుటచేతనే తిక్కన సోమయాజి రామాయణముయెుక్క యుత్తరకాండమును తెనిఁగింప నారంభించె ననియు పోతరాజకృతభాగవతములోని కొన్ని భాగము లాతని యనంతర మన నుత్పన్నము లయి పోఁగా పోయిన భాగములను వెలిగండల నారాయణాదులు పూరించినట్లే, భాస్కరవిరచితరామాయణముసహిత మొక్కయారణ్యకాండము తక్క తక్కినభాగములు కొంతకాలమున కుత్స్ననములు కాఁగా మిగిలినకాండములను హుళక్కి భాస్కరాదులు పూరించిరనియు కొందఱందురు. కాని యీ యంశమును స్థాపించుటకు నిర్పాధకము లైన యాధారము లేవియుఁ గానరావు. ఈ మంత్రిభాస్కరుఁడు రామాయణమును రచియించి యుండినయెడల, తిక్కన తన నిర్వచనోత్తరరామాయణమునం దా మాట నేల చెప్పియుండఁడు ? ఇది ఇంకను విమర్శనీయ మయిన వివాదాంశము. ** __________________________________________________________________________ [ * మంత్రిభాస్కరుఁడు" అను శీర్షిక క్రింద నీవిషయము చర్చింపcబడినది. మంత్రిభాస్కరునిఁబట్టియు 'భాస్క_ర రామాయణ' మను పేరు కలఁగవచ్చును.] [ ** ఇందలి 'మంత్రిభాస్కరుఁడు , హుళక్కి, భాస్కరుడు’ అను శీర్షికలలోని విషయములను గమనించునది.] తిక్కన తాను రచియించిన నిర్వచనోత్తర రామాయణమునందు:

      గీ. "సారకవితాభిరాము గుంటూరివిధుని
           మంత్రిభాస్కరు మత్పితామహునిఁ దలంచి
           యైన మన్నన మెయి లోక మాదరించు
           వేఱ నా కృతిగుణములు వేయునేల ?

అని తన కావ్యము స్వగుణముచేతఁ గాకపోయినను తన తాత యైన మంత్రి భాస్కరునిసారకవిత్వమహిమచేత నయినను లోకాదరణమునకు పాత్ర మగునవి చెప్పియున్నాఁడు. మంత్రిభాస్కరుని వితరణాదులను గుఱిించి కవులు పెక్కండ్రు పెక్కు- పద్యములను జెప్పి యున్నారు. వితరణమును గూర్చి ప్రసిద్దు డయిన మంత్రిభాస్కరుఁడు రాయనభాస్కరుఁడు. ఈ క్రింది చాటువు రామయామాత్యభాస్కరుని ప్రఖ్యాతిని జెప్పు నదియె యైనను మనోహరముగా నుండుటచే నిందుc జేర్పఁబడినది

    మ. 'సరి బేసై రిపు డేల భాస్కరులు ! భాషానాధపుత్రా ! వసుం
         ధరయం దొక్క-cడు మంత్రియయ్యె వినుకొండన్, రామయామాత్యభా
         స్కరుండో, యౌ, నయినన్ సహస్రకర శాఖల్లే, వవే యున్నవే
         తిరమై దానము చేయుచో రిపుల హేతిన్వ్రేయుచో వ్రాయచోన్.'

                                                   రావిపాటి తిప్పరాజు

ఈ కవిపూర్వులు లౌకికాధికారధూర్వహులగుటయే కాక యీతనిది పండిత వంశ మనియు నిందువల్ల తేటపడుచున్నది. ఈయన తండ్రి యయిన కొమ్మన్న శివలీలావిలాస మను గ్రంధమును రచించినట్టు చెప్పుచున్నారు. శివలీలావిలాసమును రచియించిన కొమ్మన్న తిక్కనసోమయాజుల తండ్రి శ్రీనాధునికాలములో రాజమహేంద్రవరమును పాలించుచుండిన వీరభద్రారెడ్డియెుక్క తమ్ముఁడైన దొడ్డభూపతికిఁ దన పుస్తకము నంకిత మొనర్చిన నిశ్శంక కొమ్మనామాత్యుఁడని యిటీవల లభించిన యా పుస్తకమునుబట్టి తెలియుచున్నది. నెల్లూరికి రాజయిన మనుమనృపాలుని యాస్థానకవీశ్వరుఁడుగా నుండిన యీతఁడు కవితిక్కన యనియు, ఆ రాజు కడ మంత్రిగా నుండిన యీతని పెదతండ్రి పెద్దకుమారుఁడు కార్యతిక్కన యనియు, సేనా నాయకుఁడుగా నుండిన యాతని తమ్ముఁడు ఖడ్గతిక్కన యనియు, ప్రసిద్ధి చెందినట్టు చెప్పదురుగాని పూర్వోదాహృతపద్యములను బట్టి తిక్కన లిరువురే యైనట్టు స్పష్టపడుచున్నది. తిక్కనసోమయాజికొమారుఁడు కొమ్మన్న. తిక్కనసోమయాజి సూర్య వంశపుపరాజై నెల్లూరిమండలమున కధినాఁధుడు గా నుండిన మనుమసిద్దికడ నాస్థానకవిగా నుండినను, ఆ రాజునకాశ్రితునివలె నుండక యాతనిచే సమానుఁడుగాఁ జూడఁబడి గౌరవింపఁబడుచుండెను. రాజునకును, కవికిని మామ వరుస ఈ కవీంద్రుఁడు రచియించిన నిర్వచనోత్తరరామాయణము కృతి నందిన మనుమభూపాలుడు

     క. "ఏ నిన్ను మామ యనియెడు
         దీనికిఁ దగ నిమ్ము భారతీకన్యక నా
         కీ నర్హుఁడ వగు దనినను
         భూనాయకుపలుకు చిత్తమున కిం పగుడున్ "

"నిన్ను మామా ! యని పిలుచుచున్నందునకై భారతీకన్యను నాకిమ్మని యడిగినట్లు చెప్పఁబడి యున్నది. తిక్కన నిర్వచనోత్తరరామాయణము నందు నన్నపార్యుని పూర్వకవిని గా వర్ణింపలేదు. అనంతరమున రచియించిన భారతమునందైనను,

    ఉ. ఆదరణీయసారవివిధార్థగతి స్ఫురణంబు గల్గి య
         ష్టాదశపర్వనిర్వహణసంభృతమై పెనుపొంది యుండు నం
         దాది దొడంగి మూఁడు కృతు లాంధ్రకవిత్వవిశారదుండు వి
         ద్యాదయితుం డొనర్చె మహితాత్ముఁడు నన్నయభట్టు దక్షతన్.

ఆంధ్రకవితావిశారదుండైన నన్నయభట్టు మొదటి మూఁడు పర్వములను తెనిఁగించెనని చెప్పెనేకాని యాతని నాదికవినిగాఁ జెప్పి స్తుతింపలేదు. ఆందుచేతఁ దిక్కన నన్నయభట్టారకుని నూత్నకవినిగాఁ బరిగణించినట్టు స్పష్టమగుచున్నది. ఇది యిట్లుండఁగా నిర్వచనోత్తరరామాయణమునందు

     చ.'హరిహరపద్మగర్భులను నాదికవీంద్రుల నూత్న సత్కవీ
         శ్వరులను భక్తిఁ గొల్చి మఱి వారి కృపన్ గవితావిలాసవి
         స్తరమహనీయుఁడైన నను సర్వగుణోత్తరమూర్తి మన్మభూ
         వరుఁడు తగంగ రాcబనిచి వారని మన్నన నాదరించుచున్.'

అని యాదికవీంద్రులను, నూత్నకవీంద్రులను స్తుతించుటచేత నన్నయాదు లకు బూర్వమునందుఁ గూడ నాంధ్రకవీంద్రు అనేకులున్నట్టు స్పష్టపడుచున్నది.*

తిక్కన రచియించిన తెనుఁగుకావ్యములు రెండు, అందు మొదటిది నిర్వచనో త్తరరామాయణము. ఈ గ్రంధము రచించునప్పటి కీతఁడు యజ్ఞము చేయలేదు. తక్కిన తెనుఁగు పుస్తకములవలెఁ గాక రఘువంశాది సంస్కృత కావ్యములవలె దీని నీ కవి నడుమ నడుమ వచనము లుంచక సర్వమును పద్యములుగానే రచించెను. ఈతcడు రచించిన భారతమువలె నీ యుత్తర రామాయణ మంత రసవంతముగాను, బ్రౌఢముగాను లేకపోయినను, పద వాక్య సౌష్టవము కలిగి మొత్తముమీఁద సరసముగానే యున్నది. ఇది బాల్యమునందు రచియింపఁబడిన దగుటచే నిట్లుండి యుండును. ఈ గ్రంధమునందు పదకాఠిన్య మంతగా లేకపోయినను, బహుస్థలములయం దన్వయ కాఠిన్యము గలదు. ఇందలి కధ సంస్కృతములో నున్నంత లేక మిక్కిలి సంగ్రహపఱుపఁబడినది. శైలి పలుచోట్ల నారికేళపాకమనియే చెప్పవచ్చును. అందుచేతనే యీ గ్రంధము భారతమువలె సర్వత్ర వ్యాపింపకున్నది. ఇతఁడు పది యాశ్వాసములగ్రంధమును వ్రాసినను పుస్తకమునుమాత్రము ముగింపలేదు. రామనిర్యాణ కధను చెప్పట కిష్టము లేక గ్రంధపూర్తి చేయలేదని పెద్దలు చెప్పదురు. రామనిర్యాణకధను జెప్పుటకు భీతిల్లి దానిని వదలిపెట్టినయెడల, తిక్కన భారతమునందు స్త్రీపర్వకధయు, కృష్ణనిర్యాణమును జెప్పుట కేల భయపడలేదని యొకరు ప్రశ్న వేయుచున్నారు. ప్రతిమరణకధకును భయపడి దానిని విడుచుచు __________________________________________________________________________ * ఈకవులు తెలుఁగు కవులని నిశ్చయింప నాధారములులేవు. సంస్కృత కవులైన గావచ్చును. సంస్కృతకవులనుగూడ నాంధ్రకవులు స్తుతించుట పరిపాటి. వచ్చినచో భారతమును రచింపకయే యుండి యుండవలెను. మరణమును జెప్పట కిష్టము లేకుండుటయు భయపడుటయు కొందఱి విషయముననే యుండును. ఏదియు లేకపోయినయెడల భారతమును రచించునంతటి దీర్ఘ కాలము జీవించియుండియు తిక్క_న డాని నేల ముగించి యుండఁడు ? తిక్కన సంపూర్ణముగానే రచించెననియు, తరువాత నా భాగముత్సన్న మయ్యెననియు నొకరు చెప్పుచున్నారు. ఈ యత్సన్నకధ మనవారికి ప్రతివిషయమునందును చక్కఁగా తోడుపడుచున్నది. తరువాతఁ గొంత కాలమునకు మిగిలిన భాగము నేకాశ్వాసముగా రచియించిన జయంతి రామభట్టు తిక్కన సోమయాజి మనుమరాజున కిచ్చినట్టుగా నరాంకితము చేయక తాను జేసిన కడపటి యాశ్వాసమును శ్రీ భద్రాద్రిరామున కంకితము చేసెను. తాను రచించిన యేకాదశాశ్వాసమున రామభట్టీక్రింది పద్యమును జెప్పి యన్నాడు.

     ఉ. "తిక్కనసోమయాజి మును తెల్గున నుత్తరకాండ చెప్పి యం
          దొక్కటి చెప్పఁ డయ్యెఁ గడు నొద్దిక నే రచియింప వేడ్కచే
          నిక్కము సంస్కృతంబు విని నెమ్మది భక్తిని నే రచించితిన్
          జక్కని దేవళంబు తుద స్వర్ణ ఘటం బిడుపోల్కి దోఁపఁగన్."

నిర్వచనోత్తరరామాయణముయొక్క శైలిని గనఁబఱుచుట కయి రెండు పద్యము లిందు క్రిందఁ బొందుపఱచుచున్నాను :

      శా. మాలిం జంపిన మాల్యవంతుఁ డుదితామర్ష ప్రకర్షంబునం
          గాలాగ్ని ప్రతి మానుఁడై నిజభుజాగర్వంబు మై లీల ను
          న్మీలజ్ఞ్వాలకరాళశక్తిఁ గొని మే మే దాఁకి వక్షస్థలిన్
          గీలించెన్ జలదంబుపై మెఱుఁగుమాడ్కిన్ శారికింజెన్నుగాన్.
                                                     ఆ.3

      చ. ఎఱుఁగవుగాక భోగముల కెల్లను నెచ్చెలి జవ్వనంబ యి
          త్తఱి నుడి వోవకుండ నుచితంబుగ జక్కవదోయిఁబోని క్రి
          క్కిఱిసిన చిన్ని చన్నుఁగవ యిం పెసలారఁగ నాదువక్ష మ
          న్వఱలు సరోవరంబున నవారణఁ గేళి యొకర్పు కోమలీ !
                                                 ఆశ్వాసము 5

ఈ కవి రచించిన రెండవ గ్రంథము భారత శేషము ఆరణ్య పర్వమువఱకును నన్నయభట్టు తెనిఁగించి మృతి నొందఁగా తరువాత నీ మహాకవి యారణ్య పర్వశేషమును మాత్రము విడిచిపెట్టి విరాటపర్వము మొదలుకొని తక్కిన పదియేను పర్వములను తెనిఁగించెను. ఆరణ్యపర్వము నాంధ్రీకరించుట చేతనే నన్నయభట్టు మతిభ్రమణము కలిగి మృతి నొందె నని తలచుకొని తాను దానిని తెలిఁగించినచో తన గతియు నట్లే యగు నన్న భీతిచేత నితఁడు దానిని తెనిఁగింపఁడయ్యెను. అందుచేత తెనుఁగు భారతము కొంత కాలము పూర్ణముగా లేక కొఱఁతపడి యుండెను. ఆ కాలమునందు వ్రాయఁ బడిన తాళపత్ర గ్రంధములు కొన్ని యిప్పటికిని వనపర్వశేషము లేకయే కానఁబడుచున్నవి. తిక్కన భయపడి యరణ్యపర్వశేషమును తెనిఁగింపక విడిచి పెట్టలేదనియు, ఆతనికాలమునాటికి నన్నయభట్టుచేత రచియింపఁ బడి యారణ్యపర్వము పూర్ణముగా నుండుటచేతనే యతఁడు విరాటపర్వ మారంభించి చేసెననియు, తరువాత నారణ్యపర్వశేషము శంభుదాసుని కాలమునాఁటి కుత్సన్నము కాఁగా దాని నతఁడు పూరించె ననియు బుద్ధి మంతు లొకరు వ్రాయుచున్నారు. ఈ యుత్సన్న సిద్ధాంత కధ యిప్పడు ప్రతిపూర్వగ్రంథ విషయములోను మనవారిచేతిలో నమూల్యసాధన మయినిలిచి తోడుపడుచున్నది. శcభుదాసుఁడు తిక్కనసోమయాజికి తరువాత నేఁబది సంవత్సరముల లోపలనే యుండినవాఁడు. నన్నయభట్టే నిజముగా నారణ్యపర్వమును పూర్ణముగాc దెలిఁగించి యుండినచో నిన్నూఱు సంవత్సరములు తిక్కనకాలమువఱకు చెడక యుండి నిలిచిన యా భాగము తరువాత నేఁబది సంవత్సరములకు శంభుదాసునికాలమునకు దేశములోని యన్ని ప్రతులలో నొక్కసారిగా నశించుట సంభవించి యుండదు. నన్నయ దానిని చేయనే లేదనుటయే యుక్తియుక్తమయి విశ్వాసార్హమయిన పక్షము. తిక్కన తానెంతటి పండితుఁడయినను తన కాలపువిశ్వాసములను భయములను లేనివాఁడగుట సాధారణముగా సంభవింపనేరదు. ఈ కవిని బట్టిన భీతియే తరువాత నారణ్యపర్వశేషమును జేసిన యెఱ్ఱాప్రెగడకును పట్టి తన పేరిట గ్రంధరచన చేయక రాజనరేంద్రున కంకితముగా నన్నయభట్టు పేరు పెట్టియే దానిని రచించెను. ఆంతేకాక భారతమును చదువువారు సహితము నేఁటి వఱకును ఆరణ్యపర్వములోని కొంతభాగము వదలియే మఱిగ్రంధ పఠనము చేయుచున్నారు.

నన్నయభట్ట పోవునప్పటికిని పోయిన తరువాత రాజరాజనరేంద్రుడున్నప్పుడును తిక్కనసోమయాజి యున్నాఁ డని చెప్పెడు కధలు నమ్మఁదగినవి కాకపోయినను వినుటకు మాత్రము సొంపుగా నుండును. గనుక వానిలో నొక కధ నిందుఁ జెప్పచున్నాను

తన కంకితముగా నాంధ్రీకరింప నారంభించిన భారతమును పరిసమాప్తి నొందింపకయే నన్నయభట్టు మృతి నొందినందుకు చింతాక్రాంతుఁడయి రాజనరేంద్రుఁడు దానిని తా నెట్లయిన సాంతము చేయింపవలెనని బహు ప్రయత్నములు చేసి బహుపండితులను రావించి చూపఁగా వారెవ్వరును తన్మహాకార్యమునకు సమర్థులు కారైరఁట ! నిర్వచనో త్తరరామాయణమును జేసి ప్రసిద్ధి నొందిన యొక యాంధ్రకవీంద్రుఁడు నెల్లూరియం దుండె ననియు, అతనివలన గ్రంథపరిసమాప్తికాఁగలదనియు, విని పండితుల యనుమతిమీఁద సభాపర్వములోని

        మ. "మదమాతంగతురంగకాంచనలసన్మాణిక్యగాణిక్యసం
             పద లోలిం గొని తెచ్చి యిచ్చి ముద మొప్పం గాంచి సేవించి ర
             య్యుదయాస్తాచలసేతుసీతనగ మధ్యోర్వీపతు ల్పాంతతా
             భ్యుదయున్ ధర్మజుc దత్సభాసితు జగత్పూర్ణప్రతాపోదయున్."

అను పద్యమును తాటాకులమీఁద ప్రతులు వ్రాసి దానితో సమానమయిన పద్యమును వ్రాయుఁడని తక్కిన రాజాస్థానములయందలి పండితులకును, సిద్దిరాజసభయందున్న తిక్కనకునుగూడఁ బంపినట్టును, మిగిలినవారందఱును తమ తమకు తోఁచిన పద్యములను వ్రాసి పంపగాఁ తిక్కన మాత్ర మట్లు చేయక తానా పద్యమునే మరల మఱియొక తాటాకుమీఁద వ్రాసి దానికి వర్ణమువేసి పంపినట్టును, రాజరాజనరేంద్రుఁడు మిగిలిన కవుల పద్యముల నన్నిఁటిని జదివి వానిలో నేదియు నన్నయపద్యముతో సరి రాకపోయినందున వానిని నిరాకరించి తాను రచింపఁబోయెడు గ్రంథము నన్నయభట్టారకునికవిత్వమువలెనే యుండినను తన దంతకంటె మెఱుఁగుగా నుండునని సూచించుట కయి తిక్కన యట్లు చేసెనని గ్రహించి యాతనిని పిలిపించినట్లును, గ్రంథరచనకుఁ బూర్వమునం దాతనిచేత గౌతమీతీరమున యజ్ఞము చేయించి భారతము సంపూర్ణము చేయించినట్లును చెప్పుదురు. మఱికొందఱట్లు పంపిన పద్య మాదిపర్వములోని

      ఉ. "నిండుమనంబు నవ్యనవనీతసమానము, పల్కు దారుణా
           ఖండల శస్త్రతుల్యము, జగన్నుత ! విప్రులయందు; నిక్క మీ
           రెండును రాజులందు విపరీతము, గావున విప్రుఁ డోపు, నో
           పండతి శాంతుఁడయ్యు నరపాలుఁడు శాపముఁ గ్రమ్మఱింపఁగన్"

అనునది యనియు, రాజనరేంద్రుఁడు తిక్కనయభిప్రాయమును దెలిసి కొన్న మీఁదట తనవద్ద కా కవీంద్రునిఁ బంపుమని సిద్దిరాజునకు విజ్ఞాపన పత్రమును పంపగాఁ నతఁ డా ప్రకారము చేసెదనని వాగ్దానము చేసెననియు, పిమ్మట దిక్కనను రప్పించి రాజనరేంద్రునికిఁ దాను జేసిన వాగ్దానమును జెప్పి నెల్లూరినుండి రాజమహేంద్రవరమునకుఁ బోవఁ బ్రార్థించె ననియు, ఆ రాజెన్ని విధముల జెప్పినను వినక తిక్కన రాజమహేంద్రవరము పోనని మూర్జపుపట్టుపట్టగా తనమాటకు భంగము వచ్చునని కోపించి రాజాతనితో నీవు నా యాజ్ఞప్రకారము పోని పక్షమున నీ మీసములు గొఱిగించి వాద్యములతో నగరివీధులవెంబడిని ద్రిప్పి యూరిబయల వేసిన తాటాకులపాకలోబెట్టి నీచేత మాంసము తినిపించెద నని బెదిరించెననియు, ఆగ్రహావేశముచేత బలికిన యా రాజుతర్జనభర్జనములకు భయపడక తిక్కన తనపట్టును వదలక స్టైర్యముతో నుండఁగా రాజనరేంద్రుఁడా సంగతి తెలిసికొని యెట్లయిన భారతమును తెనిఁగించినఁ జాలునని నెల్లూరిరాజయిన మనుమసిద్దికి వర్తమానము పంపెననియు, తరువాత సిద్దిరాజు తిక్కనను బతిమాలుకొని తాఁ జేసిన ప్రతిజ్ఞ బొంకు గాకుండునట్టుగా, యజ్ఞదీక్షకు ముందు విధివిహిత మయిన క్షురకర్మ చేయించి తిక్కనను వాద్యములతో నూరేగించి యూరి వెలుపట వేయించిన యజ్ఞశాలయందు ప్రవేశపెట్టి యాతనిచేతను యజ్ఞముచేయించి పురోడాశము తినిపించె ననియు, అట్లు చేసినను రాజుమీద కోపము పూర్ణముగా తీఱక తిక్కన తన భారతము నా రాజునకుఁ గృతియియ్యక నెల్లూరియందున్న హరిహరనాథ దేవుని కంకితము చేసెననియు చెప్పదురు. హరిహరనాధుని గుడి నెల్లూరియందిప్పుడు శిథిలమయిపోయినదcట! పయి కథ యెట్టి దయినను, తిక్కన నిర్వచనోత్తరరామాయణము చేయునప్పటికి యజ్ఞము చేయుకుండుటయు, భారతమును రచించునప్పటికి యజ్ఞముచేసి యుండుటయు మాత్రము సత్యము. దీని సత్యమును 'బుధారాధన విధేయ తిక్కననామధేయప్రణితంబై న' యను నిర్వచనోత్తరరామాయణమునందలి గద్యమును బట్టియు 'బుధారాధనవిరాజి తిక్కనసోమయాజి ప్రణీతం బయిన" యను భారతమునందలి గద్యమునుబట్టియు స్థాపింపవచ్చును. మిగిలిన యీ కథాంశమునం దేమాత్రము సత్యమున్నను తిక్కనసోమయాజి విరాటపర్వము యొక్క పీఠికయందే వ్రాసియుండుసు. ఆ పీఠికయందు రాజనరేంద్రుని పేరైన నె త్తఁబడి యుండక పోవుటయే తిక్కన రాజనరేంద్రుని కాలము వాడు కాఁడనుటను సిద్ధాంతీకరించుచున్నది.

తిక్కనసోమయాజి యూ భారతమును జెప్పునప్పడు దీనిని ప్రాయుటకయి నిర్ణయింపఁబడినవాఁడు * కుమ్మరగురునాధుఁడని చెప్పదురు. ఆతనికి చెప్పిన ___________________________________________________ *కుమ్మర గురునాథుఁడు తిక్కన సోమయాజితండ్రియైన కొమ్మనామాత్యునకే పుట్టెననియు, కొమ్మనామాత్యుఁడు గర్భాధానార్థము మంచిముహూర్తము పెట్టుకొని తన యత్తవారింటికి బోవచుండఁగా నాకస్మికముగా పెన్న పొంగి నది దాటుటకు శక్యము గాక తడుగుపాడను గ్రామసమీపమున నిలచిపోవలసి వచ్చెననియు, అప్పుడా గ్రామమునందున్న కుంభకారు డొకడాతని ప్రార్ధించి తనయింటికి గొనిపోయి యాదరించి యా సుముహూర్తమునందు సంపూర్ణయౌవనవతియు ఋతుస్నాతయు నయి యున్న తన కుమార్తెకు పుత్రదానము చేయవలెనని వేడుకొనె ననియు, అతఁడు వాని ప్రార్థన ను త్రోచి చేయలేక యంగీకరించి యా రాత్రి యా కులాలయువతితో సంభోగింపఁ గా గురునాథుఁడను పుత్రుడు కలిగెననియు ఒక కథ చెప్పదురు. అది యెంతవఱకు నమ్మఁదగియుండునో దీనిని జదివెడువారే నిశ్చయించుకోవలెను. దానిని మరల నడుగక వ్రాయఁగల శక్తి యున్నదట. దీనినిబట్టి చూడఁగాఁ బూర్వకాలమునందు బ్రాహ్మణేతరులలో సహితము చక్కఁగా చదువుకొన్నవా రండియున్నట్టు విదిత మగుచున్నది. ఈ భారతమును రచియించునప్పడు తిక్కనసోమయాజి తడవుకొనకుండ కవిత్వమును జెప్పెదమనియు, తా నొక్కసారి చెప్పిన దానిని మరలఁ జెప్పననియు చెప్పినదాని నెప్పుడును మరల మార్చుకొనననియు ప్రతిజ్ఞ చేసినట్లును, చెప్పిన మాటను మరల నడుగక గురునాధుఁడు వ్రాయుచుండఁగా శల్య పర్వములో ప్రథమాశ్వాసము కడపట సహదేవుఁడు శకునిని చంపిన తరువాత దుర్యోధనుఁడు తోలఁగి పోయెనని ధృతరాష్ట్రునితో చెప్పు భాగమున

        క.'పలపలని మూఁకలోఁ గా
           ల్నిలువక గుఱ్ఱంబు డిగ్గి నీ కొడుకు గదా
           కలితభుజుఁడగుచు నొక్క.ఁడుఁ
           దొలఁగి చనియె.'

అన్నంతవఱకు పద్యమును చెప్పి తరువాత నేమియు తోఁచక తిక్కన
"యేమిచెప్పుదు న్గురునాథా" యని కుమ్మర గురునాధు నడిగినట్లును, అతఁ
డది తన్నడిగిన పళ్నగా భావింపక పద్యముతోఁ జేర్చి

"తొలఁగి చనియె నేమిచెప్పుదు న్గురునాథా"!'

యని వ్రాసినట్లును, అప్పడు తిక్కనసోమయాజి తన ప్రతిజ్ఞకు భంగము వచ్చెనని చింతించుచుండఁగా 'నేమి చెప్పదు న్గురునాథా" యని కవి లేఖకునిగూర్చి యుద్దేశించినది ' కురునాథా ' యని ధృతరాష్ట్రున కన్వయించి యా ప్రశ్నయే పద్యపూరణమున కనుకూలించెనని గురునాధుఁ డాతని నూరార్చినట్లను, ఒక కథను జెప్పదురు. శ్రీమహాభారతము నాంధ్రీకరించిన యీమహాకవి కీ చిఱు పద్యములోని యల్పభాగము తోఁచకపోయె నని సాధించుట కీ కథ పనికిరాదు గాని తిక్కనకవి యాశధారగా కవిత్వము చెప్పఁగలవాఁడని స్థాపించుటకయి కల్పింపఁబడెనని మాత్ర మూహింపఁదగియున్నది. ఈ తెలుఁగుభారతము కష్టపడి సావకాశముగా నాలోచించి చక్కఁగాఁజేయబడిన గ్రంధమే కాని జనులనుకొనునట్టు మూలగ్రంథమును ముట్టక తెరలో గూర్చుండి నోరికి వచ్చినట్లెల్లను చేయఁఁబడినది కాదు. తిక్కన సోమయాజి పూర్వోత్తర సందర్భములు చెడకుండుటకై తాను వెనుక రచియించినదానిని మరల మరలఁ జూచుకొనుచు, సమాస వర్ణనలు గలిగిన భాగములను రచియింప వలసినచో పూర్వము వ్రాసినదానిని జూచి తదనుగుణముగాను కొన్నిచోట్ల పూర్వము రచించిన పద్యములనే కొంత మార్చియు, మార్పకయు మరల వేసికొనుచు వచ్చెను. ఈ ప్రకారముగా జూచుకొనుచు వచ్చినది భారతములోని యుత్తరపర్వములను రచించునప్పుడు పూర్వపర్వములను మాత్రమే కాక భారతమును రచించునప్పడు తత్పూర్వరచితమైన నిర్వచనోత్తర రామాయణమును గూడఁ జూచుచు వచ్చెను. ఇట్లు చేసినందున కిందుఁ గొన్నియుదాహరణము లిచ్చెదను.

1. శ్రీకృష్ణుని కౌరవులయొద్దకుఁ బంపునప్పుడు భీముఁడు చెప్పిన యుద్యోగ పర్వములోని

          గీ. "అన్నదమ్ములమై యుండి యకిట మనకు
              నొరులు తలయెత్తి చూడ నొండొరులతొడఁ
              బెనఁగ నేటికి ? ఎనెల పెద్దవారి
              బుద్ధి విని పంచి కుడుచుట పోల దొక్కొ"

 అను పద్యమే పుత్రమరణ దుఃఖార్తయైన గాంధారికి కోపశాంతి గలుగునట్లుగా భీముడు చెప్పినట్లు స్త్రీపర్వమున వేయబడినది.

2. విరాటుఁడు తన కూఁతురైన యుత్తరను నాట్యవిద్యాభ్యాసార్థము బృహన్నల కప్పగించుటకు రప్పించునప్పు డామెను వర్ణించిన విరాటపర్వములోని

   సీ. అల్లఁదనంబున ననువు మైకొనఁ జూచు
               నడపుకాంతికి వింత తొడపు గాగ
         వెడవెడ నూగారి వింతయై యేర్పడ
               దారని వళులలో నారు నిగుడ
         నిట్టలు ద్రోచుచు నెలవులు కలమేర
               లెల్లను జిగియెక్కి యేర్పడంగఁ
         దెలుపును గప్పును వెలయంగ మెఱుఁగెక్కు
               తారకంబులఁ గల్కితనము తొడరఁ

         జరణములును నడుముఁ జన్నులుఁ గన్నులు
         జవ్వనంబు చెన్ను నివ్వటిల్లు
         "చునికిఁ దెలుపుచుండ నుత్తర చనుదెంచె
         నలరు మరునిపుప్వుటమ్ముఁ బోలె."

అను పద్యమే సృంజయరాజపుత్రిని నారదుఁడు మోహించిన కథా సందర్చమున గీతపద్యమునందలి మూడు నాల్గు చరణములు మాత్రము "ఉనికిఁ దెల్ప శాంతిపర్వమున వేయఁబడినది.
సృంజయునిపుత్రి మెలఁగు విధంబు నారదునకుఁ దగులొనర్చె" నని మార్పఁబడి

3. దేవదానవయుద్ధసంబంధమున నుత్తరరామాయణములో నున్న

   మ. పటు వేగంబున శాతభల్లదయసంపాతంబున న్మింట మి
       క్కుటమై పర్వ ధగద్ధగీయ మగుచుం గోపంబు రూపంబులై
       చటుల క్రీడఁ జరించునట్లిరువురున్ శౌర్యోన్నతిం బోరి రు
       త్కటదర్పోద్ధతులై పరస్పర జయాకాంక్షా ప్రచండంబుగన్."

అను పద్యమే "పర్వ ధగద్ధగీయమగుచున్" అని యున్న పదములు "మంట ధగద్ధగద్ధగ యనన" అనియు, 'పరస్పరజయాకాంక్షం బ్రచండంబుగన్' అనుపదము 'పరస్పరజయా కాంక్షం బ్రచండంబుగన్' అనియు మార్చబడి వేయఁబడి యున్నది.

4. నిర్వచనోత్తరరామాయణములో రావణకుబేరయుద్ధవర్ణనమునందున్న

     " శా. శ్రావ్యంబై చెలఁగన్ గభీరమధురజ్యానాద ముద్దామవీ
            రవ్యాపారనిరూఢతం బ్రతిశరారంభంబు మర్దించుచున్
            సవ్యప్రౌఢి దృఢాపసవ్యతిగ నాశ్చర్యంబుగా నేయుచున్
            దివ్యాస్త్రంబులఁ బోరి రిద్దఱును సాదృశ్యం బదృశ్యంబుగన్."

అను పద్యము మార్పేమియు లేకయే విరాటపర్వమున నుత్తరగోగ్రహణమునందు ద్రోణాచార్యయుద్ధవర్ణనములో చేయఁబడెను.

తిక్కన మొదట రచించిన పర్వములను జూచి వానియందు విశేషవృత్తములు లేకపోఁగా పండితు లాతఁడు సామాన్యవృత్తములతో కాలము గడుపుచున్నాడే కాని యపూర్వవృత్తరచనాకుశలుఁడు కాడని యాక్షేపించినమీఁదట నతఁడు, స్త్రీపర్వమునందు బహధ వృత్తములను రచియించె నన్న వాడుక కూడ తిక్కనసోమయాజులు తాను రచియించుచు వచ్చిన గ్రంధమును పండితులకుఁ జూపుచు వచ్చెననుటను స్థాపించుచున్నది. తిక్కనసోమయాజి రచియించిన పదునేను పర్వములలోను నలువది యాఱాశ్వాసములకంటె నెక్కువగ్రంధము లేదు. ఒక్కొక్క యాశ్వాసమునకు నాలుగువందల యేఁబదేసి పద్యముల చొప్పున లెక్క చూచినను శ్రీమహాభారతములో తిక్కనసోమయాజి రచియించిన భాగమంతలోను నించుమించుగా నిరువదివేల పద్యములకంటె నధిక ముండవు. దినమునకు పది పద్యముల చొప్పున రచియించినను, ఇంత గ్రంధము నయిదాఱు సంవత్సరములలో రచియింపవచ్చును. కాcబట్టి యిట్టి గ్రంధరచన యొక యసాధ్యములోనిది కాదు. కాని తిక్కనసోమయాజి శైలితో సమానముగా వ్రాయుట మాత్ర మెవ్వరికిని సాధ్యము కాదు. తెలుఁగుభాషయందెన్నో గ్రంథము లున్నను, తిక్కనసోమయాజికవిత్వముతో సమానముగాఁగాని దానిని మించునట్లుగాఁగాని కవిత్వము చెప్పిఁగలిగిన వారు నేఁటివఱ కొక్కరును కనఁబడలేదు; తిక్కనకవిత్వము ద్రాక్షాపాకమయి మిక్కిలి రసవంతముగా నుండును; ఈతని కవిత్వమునందు పాదపూరణమునకయి తెచ్చిపెట్టుకొనెడు వ్యర్ధపదము లంతగా నుండవు; పదములకూర్పుమాత్రమేకాక యర్ధసందర్భమును మిక్కిలి పొందికగా నుండును. ఏ విషయము చెప్పినను యుక్తియుక్తముగాను, ప్రౌఢముగాను నుండును; ఎక్కడ నే విశేషణము లుంచి యే రీతి నే పదములు ప్రయోగించి రసము పుట్టింపవలయునో యీకవికి దెలిసినట్లు మఱి యొకరికి తెలియదు. ఈయన కవిత్వము లోకోక్తులతోఁ గూడి జాతీయముగా నుండును; ఈయన పదలాలిత్యమును, యుక్తిబాహు ళ్యమును, అర్ధగౌరవమును, రచనాచమత్కృతియు, శయ్యావిశేషమును, సందర్భశుద్దియు, కల్పనాకౌశలమును, అన్యులకు రావు. ఈ కవిశిఖామణి యొక్క కవిత్వమునం దొకవంతు సంస్కృతపదములును. రెండువంతులు తెలుఁగు పదములు సుండును. ఇటీవలి యాంధ్రకపులు కొందఱు తాము రచియించెడివి తెలుఁగు పుస్తకములన్నమాట మఱచియో తమ పాండిత్యమును కనబఱుపవలెననియో తమ గ్రంధములను సాంస్కృతికదీర్ఘ సమా సములతోను, కఠినములయిన సంస్కృతపదములతోను నింపివేసిరి. నన్నయభట్టువలెనే యీ కవియుఁ దన గ్రంధమును మూలమునకు సరిగాఁ దెనిఁగింపలేదు. విరాటపర్వమునందు మాత్రము కధ తగ్గింపక కొంత పెంచినను, తక్కిన పర్వములయందు కధను మిక్కిలి సంగ్రహపఱిచెను. ఉద్యోగపర్వము నందలి సనత్కుమారోపదేశమును మూలములో పది పండ్రెండు పత్రములున్నదానిని తెనుఁగున రెండు మూడు పద్యములతో సరి పెట్టెను; భగవద్గీతలు, ఉత్తరగీతలు, మొదలయిన వానిని తెలిఁగింపనే లేదు. భగవద్గీతలు తెలిఁగింపలేదనుట సరిగాదనియు, కొన్ని పద్యములలో దానిని సంగ్రహపఱిచెననియు, విమర్శకు లొకరు వ్రాయుచున్నారు. పదునెనిమిదధ్యాయముల మహాగ్రంధములో

శ్లో|| "ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః
      మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ "

అను ప్రధమ శ్లోకమును

     క. "మానుగ ధర్మక్షేతం
         కురుక్షేత్రమున మహాహావమునకున్
         బూని మనబలముఁ బాండవ
         సేనయు నిటు పన్ని యేమి చేసెం జెపుమా?"
అనియు,

     శ్లో. "యత్రయోగేశ్వరః కృష్ణో యత్ర పార్థోధనుర్ధరః |
         తత్రశ్రీర్విజయో భూతి ర్ధృ వా నీతి ర్మతిర్మమ ||

 అను నంత్యశ్లోకమును

     గీ. "అధిప యోగేశ్వరేశ్వరుఁడై న కృష్ణుఁ
         డును ధనుర్ధరవర్యుఁ డర్జునుఁడు నెచట
         నిలిచి రచ్చట విజయంబు నీతి సిరియు
         భూతి నిత్యంబు లగు నిది నాతలంపు "

అనియు, తెలిఁగించి నడుమ నాలుగయిదు పద్యములు వేయుట గ్రంథమును భాషాంతరీకరించుట కానేరదు. ఇది గుహ్యమైన యోగశాస్త్ర మనియో యుద్దమధ్యమున శత్రువు లెదుటనుcడఁగా పదునెనిమిది యధ్యాయములు గల మహా గ్రంధమును గృష్ణు డర్జునునకుఁ జెప్పెననుట విశ్వాసయోగ్యముగా నుండదని భావించియో, తిక్కన భగవద్గీతలను దెలిఁగింపఁడయ్యెను.

ఈయన సంస్కృతమును తెలిఁగించిన రీతిని దెలుపుటకయి మూలగ్రంథము లోని కొన్ని శ్లోకములను వానియర్ధమును దెలుపు పద్యములను కొన్నిటిని క్రింద వివరించుచున్నాను--

విరాటపర్వము శ్లోకము

      శ్లో. ఆలోకయసి కి వృక్షం సూద దారుకృతేన వై
         యది తే దారుభిః కృత్యం బహిగ్వక్షాన్ని గృహ్యతామ్.

                              పద్యము

      మ. వలలుం డెక్కడఁ జూచె? నొండెడ ససేవ్యక్ష్మాజముల్ పుట్టవే?
          ఫలితంబై వరశాఖ లొప్పఁగ ననల్ప ప్రీతి సంధించుచున్
          విలసచ్ఛాాయ నుపాశ్రితప్రతతికి న్విశ్రాంతిఁ గావింపఁగాఁ
          గల యీ భూజము వంటకట్టియలకై ఖండింపఁగా నేటికిన్ ?

                             శ్లోకములు

      శ్లో. సా సభా ద్వార మాసాద్య రుదితీ మత్స్య మబ్రవీన్,
          అపేక్షమాణా సుశ్రోణి పతీం స్తాన్ దీనచేతస8,
          ఆకార మభిరక్షంతీ ప్రతిజ్ఞాం ధర్మసంహితాం
          దహ్యమానేన రౌద్రేణ చక్షుషా ద్రుపదాత్మజా

      సీ. ఏలఁదీగఁ గప్పిన లలితపరాగంబు
                  క్రియ మేన మేదినీ రేణు వొప్ప
          చంపకంబున నవసౌరభం బెసcగెడు
                   కరణి నాసిక వేఁడిగాడ్పు నిగుడ
          తోయజదళములతుది నుంచు దొరిఁగెడు
                   గతిఁ గన్నుఁగవ నశ్రుకణము లురుల
          నిందుబింబముమీఁది కదుచందంబునఁ
                   గురులు నెమ్మొగమున నెరసియుండ

          సర్వజనవంద్య యైన పాంచాలి సింహ
          బిలునిచే నివ్విధంబున భంగపాటు
          తనకు వచ్చిస నెంతయు దైన్య మొంది
          యవ్విరాటుని సభc జేగ సరిగి నిలిచి.

      ఉ. పంబిన కోపము న్సమయభంగభయంబును నగ్గలించి యు
          ల్లంబు పెనంగొనంగఁ బతులం దగు సభ్యులఁ జూచు మాడ్కి రూ
          క్షంబగు చూడ్కి. నాద్రుపదుకన్నియ చూచి సభా జనప్రతా
          నంబును మత్స్యనాధుఁడు వినంగ నెలుంగు చలింప నిట్లనున్."

ఈ శ్లోకములను పద్యములను జూచువారి కెల్లను సీసపద్యముయెుక్క. దీర్ఘపాదములయందలి వర్ణనఁ గ్రొత్తగా గుప్పించుటయే తక్కిన భాగమును గూడ యెట్లు పెంచునో విశదమగును.


శ్లోకము            శ్లో. తాం వేళాం రర్తనాగారం పాంచాలీసంగమాశయా,
                  మన్యమాన స్ససంకేత మగారం ప్రవిశత్తత8.


పద్యము


       శా. సింగం బున్న గుహానికేతనమునకున్ శీఘ్రంబునన్ వచ్చు మా
            తంగంబుం బురుడించుచున్ బవనపుత్ర స్వీకృతంబైన యా
            రంగాగారము చేర వచ్చి మదిలో రాగంబు ఘూర్ణిల్ల నిం
            తిం గాముండిటఁ దేఁడె యింత కని యుద్వృత్తాంగజోన్మాదుఁడై

ఇఁక నీ కవి యొక్క-కవిత్వశైలిని గనపఱిచెడి యైదారు పద్యములు మాత్రము వ్రాసి 'కవిబ్రహ్మ' యని మహాకవులచేఁ గొనియాడబడిన యీతని చరిత్రము నింతటితో ముగించెదను --

         ఉ. 'అక్క_ట మోసపోయి యడియాసలఁ జావకయున్నదాన ము
              న్నొక్కెడనే దురంతదురితోత్కటబాధలఁబెట్టి యున్న నా
              కెక్కడి దుఃఖశాంతి ? గరమేదుట యెెమ్మెయిఁ గల్గ నేర్చు మీ
              ముక్కున నూర్పు గల్గ నొక మూర్ఖునిచేఁ బడితి న్సభాస్థలిన్.
                                                    విరాట. ఆ.2

          
         శా. సింగం బాఁకటితోలో గుహాంతరమునం జేట్పాటుమైనుండి మా
             తంగ స్ఫూర్జితయూధదర్శనసముద్యత్క్రోధమై వచ్చు నో
             జం గాంతారనివాస ఖిన్నమతి నస్మత్సేనపై వీఁడె వ
             చ్చెం గుంతీసుతమధ్యముండు సమర స్థేమాభిరామాకృతిన్.
                                                    విరాట ఆ.4

         క. కాలుఁడు ప్రేరేcపఁగ నిటు
            ప్రేలిన యంతటనె నిన్నుఁ బెద్దఁగఁ దలఁపన్

               బోలునె మాకును? నుడుగుము
               చాలుదు నీ వెల్ల ను సాధింపంగన్, ఉ -2

           శా. ఏమీ! పార్జుఁడు నీవు దండిమగలై యీ వచ్చుకౌరవ్య సం
               గ్రామక్షోభము బాహుదర్పమునఁ దీర్పం బెద్ద మిఱ్ఱెక్కి మి
               మ్మే మెల్ల న్వెఱగంది చూచెదముగా కీ సారికిం:బోయిరా
               భీముం డిత్తఱి రిత్తమాటలకుఁ గోపింపండుసూ పెంపఱన్.
                                                        ఉద్యో ఆ. 3

           ఉ. ఏమిర కర్ణ : భీమ నటు లేటికిఁ దిట్టి తతండు దోల సి
               గ్గేమియులేక పాఱునెడ నెవ్వరు తిట్టిరి నిన్ను గెల్పు సం
               గ్రామములోనఁ దప్పిదము గల్గినయంతనె యింత గర్వ మే
               లా ? మును నిన్నెఱుంగమె ? చలంబున సాత్యకి యిప్టు గెల్వఁడే ?
                                                        ద్రోణ. 5

            గీ. అంధులకు నూఁతకోలగా నకట ! యెుకని
               నైన నిలుపక నూర్వర నదయవృత్తి
               మ్రింగి తందెవ్వఁడేనియు మీకు నెగ్గు
               లాచరింపనివాఁడు లేఁడయ్యె నయ్య ?
                                                     స్త్రీప. ఆ. 1

ఈ పయిని జెప్పిన రెండు కావ్యములనుగాక యూకవి కవివాగ్బంధన మనెడి లక్షణ గంధము నొకదానిని గూడ రచియించెను. గాని దానియందు విశేషాంశము లేవియు లేవు. అందలి కడపటి పద్యము నిం దుదాహరించుచున్నాను
 
            కం. "తనరం గవివాగ్పంధన
                 మను ఛందం బవని వెలయ హర్షముతోఁ ది
                 క్కన సోమయాజి చెప్పెను
                 జను లెల్ల నుతింప బుధుల సమ్మతిగాఁగన్" -కవివాగ్బంధనము.

[1] ఇతఁడు కృష్ణశతక మొకటి చెప్పెనని వేంకటరంగకవి యీ పద్యము నుదాహరించుచున్నాడు.

   మ. అరయన్ శంతనపుత్రుపై విదురుపై నక్రూరుపైఁ గుబ్జపై
         నరుపై ద్రౌపదిపైఁ గుచేలునిపయిన్ నందవ్రజ శ్రేణిపైఁ
         బరఁగంగల్గుభవత్కృపారసము నాపైఁగొంత రానిమ్ము నీ
         చరణాబ్జంబులు నమ్మినాను జగదీశా కృష్ణ భ_క్తప్రియా! [2]

తిక్కనసోమయాజి 'విజయ సేన" మను - గ్రంధమును గూడ రచించెనని కొందఱు వ్రాయుచున్నారు. నే నా గ్రంథమును జూడకపోవుటచేత తిక్కనయే దానిని రచించెనో, తిక్కనయే గ్రంధకర్త యైనచో నతఁ డే తిక్కనయో, నే నిప్పడు చెప్పఁజాలను. "విజయ సేన" మను పూర్వ గ్రంధ మొకటి యున్నది. దానినుండి యప్పకవి యీ క్రింది పద్యము నుదాహరించియున్నాcడు.

       ఉ.'వల్లభుcడేగు దుర్లభుఁడు వాని దెెసం దగులూది యిమ్మెయిన్
           దల్లడమందె దేల యుచితిస్థితికి న్ననుఁదావఁజూచినన్
           దల్లియు బంధులోకమును దండ్రియు నేమనువా రెఱెం గిరే
           నుల్లమ! ఇట్లు నీకుఁదగునో తగదో పరికించి చూడుమా!'

చిలుకూరి వీరభద్రరావుగా రాంధ్రుల చరిత్రము నందీ క్రింది పద్యముల నుదాహరిం చియున్నారు.

       సీ. 'ఘనసార కస్తూరికాగంధముల నవ్య
                     గంధబంధంబులు గఱపి కఱపి

       కుసుమితమవల్లికాలసితవీధులఁ జొచ్చి
              గని సరోగృహముల మునిఁగి మునిఁగి
        సమధికాహార్యాంగ సంగీతములతోడ
              కన్నె తీగల కాట కఱపి కఱపి
        కుముద కుట్మలకుటీ కోరకంబులు దూఱి
             యలిదంపతుల నిద్రఁ దెలిపి దెలిపి

        యనుదినమ్ము నప్పురాంతికమ్మున గట్టు
        వాలు వోలె విప్రవరుఁడువోలె
        నట్టువోలెఁ దాను నచ్చినచెలి వోలె
        మలయుచుండు మందమారుతంబు'

    సీ. మదనవశీకారమంత్ర దేవత దృష్టి
              గోచరమూర్తి గై కొనియె నొక్కొ
        సితకరబింబనిస్రుతసుధాధార ని
             తంబినీరూపంబు దాల్చెనొక్కొ
        విధికామినీ శ్రేష్టవిజ్ఞానపరసీమ
            విధి గండరింపంగ వెలసెనొక్కొ
        శృంగారనవరస శ్రీవిలాసోన్నతి
             సుందరకారంబు నొందెనొక్కొ

        కాక యెుక వధూటికడుపునఁ బుట్టిన
        భామ కేల నిట్టిరామణీయ
        కంబు గలుగు ననుచుఁ గన్నియవై మహీ
        పాలసుతుఁడు దృష్టి పఱపె నర్థి.

    ఉ. పల్లవపుష్పసంపదలఁ బంచి వసంతుఁడు కాపురాకకై
        యెల్లవనంబు సంకటము లేదఁగఁ దా రొడికంబు మీఱ న
        ట్లల్లన క్రోలి క్రోలి మలయానిలుఁ డందుఁ బురాణపత్రముల్
        డుల్లఁగఁజేసె సత్క్రియఁ బటుత్వము కాముఁడు పిచ్చలింపఁగన్ '

పయివావిలో 'మదనవశీకారమంత్ర దేవత" యను సీసపద్యమును కుమార సంభవటిప్పణములో విజయసేనము ద్వితీయశ్వాసములోనిదని మానవిల్లి రామకృష్ణకవిగా రుదాహరించి యున్నారు [3]

నన్నయభట్టారకుఁడును తిక్కనసోమయాజియు నాంధ్రకవులలోఁ బ్రామాణికాగ్రగణ్యులే యయినను మనము వారి పుస్తకములోని సామాన్యప్రయోగములను మాత్రమే యను పరింపవలయును గాని యతులకొఱకును ప్రాసములకొఅకును వారు వేసికొనవలసివచ్చిన యసామాన్య ప్రయోగములను మన మనుసరించుట యుచితము కాదని నేను దలఁచుచున్నాను. ఎట్లన నన్నయభట్టు సామాన్యముగా నందఱనియే ప్రయోగించుచు వచ్చినను నొకటి రెండు స్థలములయందు యతి స్థలమున

     గీ. గురులలోనఁ బరమగురువు తల్లియ యట్టి
        తల్లివచనమును విధాతకృతియు
        నన్యధాకరింప నలవియే యనిని నం
        దొఱకు నిట్టు లనియె ద్రుపదవిభుఁడు.

అందొ ఱని వాడి యున్నాఁడు. ఈ ప్రకారముగానే తిక్కనసోమయాజి సామాన్యముగా నొక్కఁడనియే ప్రయోగించుచును వచ్చిన యతి సానమునందొకచోట

      క. పాండవులవలనఁ గీడొ
           క్కొండను లే దధిప నీదు కొడుకులు ధరణీ
           మండల మంతయు మ్రింగిరి
           పాండునృపతిభాగమునకుఁ బాపిరి వారిన్

ఒక్కొఁ డని వాడియున్నాఁడు. నన్నయ తిక్కనాదుల ప్రయోగములను మనము శిరసావహించి గ్రహింపవలసినదే యయినను మన గ్రంధముల యందు "అందొఱు" "ఒక్కొఁడు" మొదలయిన విశేష రూపములను వాడక 'అందఱు' 'ఒక్కఁడు' మొదలయిన సామాన్యరూపములనువాడుటయే మంచిదని నేననుకొనియెదను.

తిక్కనసోమయాజులు మనుమసిద్దిరాజ్య మంతరించిన తరువాత చిరకాలము జీవించి యున్న వాఁడయి సర్వజనులచే గౌరవింపఁబడుచు నుండినవాఁడే యయినను మరణకాలమునకు విశేషవిత్తవంతుఁడుగా నుండినట్టు కనఁబడఁడు. అందుచేతనే యాతని కుమారుఁడు కొమ్మన్న పాటూరికరణికమును సంపాదింపవలసినవాఁ డయ్యెను.

రక్కస గంగరనదేవమహారాజు రాజ్యమేలుచుండఁగా 1169 శాలివాహన శకము ఫ్లవంగసంవత్సర జ్యేష్ట శుద్ద త్రయోదశీ శనివార మనఁగా క్రీస్తు శకము 1247-వ సంవత్సరములో చెంటిరామనాయకుఁడు కడప మండలము లోని సిద్ధవటముతాలూకా జోతిగ్రామమునందలి జ్యోతినాధ దేవాలయము నకు గోపురము కట్టించినట్లు దాని యావరణములో ఱాతిమీద (No.568) శాసన మొకటి చెక్కcబడియున్నది. నిర్వచనోత్తరరామాయణములో "రంగదుదారకీర్తి యగు రక్కెస గంగని" యన్న పద్యముండుటచేత, ఈ శిలా శాసనమునుబట్టి 1247-వ సంవత్సరము నకు పెక్కేండ్లు తర్వాతనే నిర్వచనోత్తరరామాయణము రచియింపఁబడినట్టు స్పష్ట మగుచున్నది. [రక్కెస గంగనయు, గంగయసాహిణియు నభిన్నవ్యక్తులని శ్రీ చిలుకూరి వీరభద్రరావుగా రభిప్రాయపడినారు. నిర్వచనోత్తరరామాయణములోని "రంగదుదారకీర్తి —"అను పద్యమునుబట్టి వారిర్వురును విభిన్నవ్యక్తు లనియు, పరస్పరవిరోధులనియుఁ దెలియుచున్నది. “ఆంధ్రకవితరంగిణి" కారులును, ‘తాళ్ళప్రొద్దుటూరుశాసనవ్యాసమున (భారతి సం.15 భా.1 పుట 143) శ్రీ నేలటూరి వెంకటరమణయ్యగారును వీరు వేర్వేఱు వ్యక్తులనియే తెల్పియున్నారు]గణపనారాధ్యుఁడు

['ఆంధ్రకవితరంగిణి'లో "ఎఱ్ఱాప్రెగడ" చరిత్రమునకుముందు "స్వరశాస్త్ర" మను మంజరీద్విపదకర్తయగు 'గణపనారాధ్యు"ని చరిత్ర మీయcబడినది. ఈకవి క్రీ.శ.1324-1345 నడుమ నుండినవాడట ! ఈ కవినిగూర్చి శ్రీ నేలటూరి వేంకటరమణయ్యగారు 'భారతి' (సంపు. 12 సంచి.1) లో ప్రకటించిన వ్యాసము ననుసరించి, యీ విషయము గ్రహింపబడివదని తత్కర్త తెలిపియున్నారు]

  1. [ * కవివాగ్బంధనమునకు 'కవిసార్వభౌమఛందస్సు' అను నామాంతరము కలదఁట ! ఇది తిక్కన కృతి కాదని విమర్శకుల యాశయము. ఇం దిరువదియేడు యతులు చెప్పcబడినందున, ఇది నవీనకృతి కావలెను. కవిసార్వభౌముని *పేరిటc పరcగుటయు నియ్యది కవిబ్రహ్మచే రచింపబడలేదనుటను వ్యక్తము చేయుచున్నది.
  2. [కృష్ణ ! భక్తప్రియా !!అను మకుటముతో శతకమున్నట్లు కానరాదని ' ఆంధ్రకవి తరంగిణి'(ద్వితీయ సంపుటము పుట 185 లోఁ గలదు. కృష్ణా ! దేవకీనందనా ! అను మకుటముతో మాత్రము వెన్నలకంటి జన్నయ కృతమగు శతకము కానవచ్చుచున్నది. అది దేవకీనందన శతకముగా ప్రసిద్ధము
  3. [పెదపాటి జగ్గకవి తాను సమకూర్చిన 'ప్రబంధ రత్నాకరము'లో 'విజయసేనము' లోని పద్యముల నుదాహరించి యున్నాఁడు. 'విజయసేనము' లభ్యముకాలేదు. ఇయ్యది తిక్కనకవి కృతమనుటలో ఆధారములు లేవు. అప్పకవి, కస్తూరి రంగ కవి 'విజయసేనము' లోని దని యుదాహరించిన పద్యమును కూచిమంచి తిమ్మకవి చిమ్మపూడి అమరేశ్వరుని 'విక్రమసేనము' లోనిదిగా నుదాహరించెను. దీనింబట్టి విక్రమ సేన, విజయసేనములను జెప్పటలో తార్మాఱు జరుగుచున్నట్లు తెలియుచున్నది. 'విజయసేనము' లోనివని యుదాహరింపఁబడిన పద్యములు వైశ్యవర్ణనము,గణపతి స్తోత్రము, పరిఖావర్ణనము మున్నగు విషయములు కలవి కలవు. వీని కర్తృత్వమును గూర్చి విమర్శకులు సందేహించు చున్నారు]