ఆంధ్రుల సాంఘిక చరిత్ర/P78

వికీసోర్స్ నుండి

రెడ్లు శైవులయినను పరమతస్థుల నే మాత్రమైనను బాధించినట్లు కానరాదు కాకతీయులు చేసిన పొరపాటును వీరు చేయలేదనవచ్చును. రెడ్డిరాజ్యము తుదికాలములో, వైష్ణవమతము దక్షిణ తమిళమునుండి తెనుగుదేశములోని కెగుమతి కాజొచ్చెను. అయ్యంగార్లు ప్రవేశమై తిరుదీక్ష నియ్య మొదలుపెట్టిరి. ముమ్మడి నాయకుడను రెడ్డిరాజు 1340 నుండి 1370 వరకు కోరుకొండలో రాజ్యము చేసెను. "అతని కాలమున శ్రీరంగమునుండి పరాశరభట్టను వైష్ణవ బ్రాహ్మణ గురువు కోరుకొండకు విచ్చేసి ముమ్మడ నాయకుని శిష్యునిగా జేసికొని వైష్ణవ మతమును గోదావరి మండలమున వ్యాపింపజేసెను."[1] తుది రెడ్డి రాజు లగు కుమార గిర్యాదులు వైష్ణవు లయిరి. ఈ విధముగా మతము మార్చుకొన్నను ఈ రాజులు ఇతర మతముల కొత్తిడి కలుగజేసినవారు కారు.
శైవశక్తి పేరుతో ప్రజ లనేకదేవతలను కొలిచిరి. "కోమలార్ధేందు ధరుకొమ్మ గోగులమ్మ"; "మహిత గుణములతల్లి శ్రీమండతల్లి"; 'నూకాంబ'; 'ఘట్టాంబిక'; 'మానికాదేవి'[2] అను శక్తులు ద్రాక్షారామములో వెలసియుండెను. "కలౌ మైలారు భైరవా"[3] అని మైలారుదేవుడు గీర్వాణసూక్తి కెక్కి యెక్కువగా వ్యాప్తుడయ్యెను. ఏకవీరాదేవిని గూడా జనులు మఱువలేదు. శూద్రజాతులవారు పలు దేవతాశక్తులను గొలిచిరి.

"కామాక్షికిని, మహాకాళికి, చండికి,
నక్కజియ్యకు, కాళి, కంబికకును,
వింధ్యవాసిని, కేకవీరకు, మున్నుగా
నెల్ల వేల్పులకు బిందించి మ్రొక్కి
త్రావుచు నెడనెడ తాల్పుగా వండిన
నంజుటి పొరకలు నంజుకొనుచు
  .... .... ....

  1. చిలుకూరి వీరభద్రరావుగారి ఆంధ్రుల చరిత్రము, 7 భా. పు 124.
  2. భీమేశ్వర పురాణము, ఆ 1, పు 99-102.
  3. సింహాసనద్వాత్రింసిక, 1 భా, పు 85.