ఆంధ్రుల సాంఘిక చరిత్ర/5 వ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

5 వ ప్రకరణము

విజయనగర సామ్రాజ్య కాలము

క్రీ.శ.1530 నుండి 1630 వరకు.

శ్రీకృష్ణదేవరాయ నిర్యాణానంతరము విజయనగర సామ్రాజ్యము 1565 వరకు మహోజ్జ్వలముగా సాగి, తళ్ళికోట యుద్ధములో దానికి మొదటి పెద్దదెబ్బ తగిలెను. దక్కన్ సుల్తాను లేకమై రామరాజును చంపి ఆతని సైన్యమును చెదరగొట్టి విజయనగరాన్ని ఆక్రమించుకొని ఆరునెలలు అదేపనిగా విధ్వంసనకర్మలో నుండిరి. కాని విజయనగర బలము క్షీణించలేదు. తిరుమల దేవరాయలు పెనుగొండను రాజధానిగా చేసుకొని రాజ్యముచేసెను. అతని యనంతరము శ్రీరంగరాయలు చాలా దుర్బలుడగు రాజగుటచేత తిరుపతివద్ద నుండు చంద్రగిరికి రాజధానిని మార్చుకొనెను. మొత్తానికి క్రీ.శ. 1630 తర్వాత విజయనగర సామ్రాజ్యము అంతరించెను. దానిశాఖ యొకటి మాత్రము తంజావూరులో రెండుతరాలు దేదీప్యమానముగా వెలిగెను.

ఓరుగంటిరాజ్య పతనానంతరము మహమ్మదీయులనుండి హిందువులను విజయనగర సామ్రాజ్యము ఇంచుమించు 230 ఏండ్లు రక్షించెను. క్రీ.శ. 1600 తర్వాత ముసల్మాను సుల్తానుల పాలనములోనికి ఆంధ్రదేశమంతయు చేరినదయ్యెను. అంతలోనే ఫ్రెంచివారు, ఇంగ్లీషువారు దక్షిణాపథరంగముపై ప్రత్యక్షమైరి. వారుకూడా దేశమును దోచుకొని పోదలిచినవారే కాని రక్షింప దలచినవారు కారు. అందుచేత క్రీ>స. 1600 నుండి 1800 వరకు ఆంధ్రదేశములో అరాచకము పూర్తిగా తాండవించెను. అదొక అందకార యుగము. 1800 నుండియైనను ఉత్తరసర్కారులు రాయలసీమ ఒక విధమగు స్థితికి వచ్చెను. కాని తెలంగాణా మాత్రము ఆధునిక కాలమువరకు దుర్బరస్థితిని యెటులో భరిస్తూ వచ్చినది.

మతము

కృష్ణరాయల కాలములోని పరిస్థితులలో మార్పు లంతగా రాలేదు. కాని తర్వాతి వాఙ్మయములోని కొన్ని విశేషముల నిందు తెలుపుట యవసరము. హిందువులను వారిమతమును, వారిసృష్టిని, (Culture) నిరంతరము ముసల్మానులు ద్వేషించినను హిందూరాజులు సుల్తానులతో రాజకీయముగా భిన్నించిరే కాని వారి మతాన్ని ద్వేషించినవారు కారు. ప్రజలుకూడ ఇస్లాముమతమును ద్వేషించినవారు కారు. పల్నాటిసీమలో పల్నాటి వీరాలయములలో ఒక ముస్లిం గోరీ కూడా దేవాలయావరణమందే కలదు. నేటికిని ముసల్మానులుకూడా కార్తీకమాసమందు జరుగు పల్నాటి వీర పూజలలో పాల్గొందురు. గుల్బర్గాలోని ప్రసిద్ధమగు వలీదర్గాపై భవనమును సేర్ నారాయణ మహారాజ్ అనునతడు కట్టించెనని ప్రతీతి కలదు.

పెనుగొండలోని బాబయ్య అను తురక వలీదర్గాకు సాళువ నరసింగరాయలు కొన్ని గ్రామాలు దానముచేసెను. దానికే తర్వాతి రాజులును దానాలిచ్చిరి. జటిలవర్మ కులశేఖర పాండ్యరాజు శా. శ. 1477లో ఒక మసీదుకు గ్రామము దానము చేసెను. ముసల్మానుల మసీదులు ఓరుగంటిలో నుండెను. "ఇదె కర్తారుడుండు తుర్కలమసీదు" అని క్రీడాభిరామములో స్థలనిర్దేశము కూడా చేయబడినది. ఈ కర్తారుడు (కర్తార్) అన యే ముస్లిందేవతయో తెలియదు.

         "కర్తారుం డనుచుం దురుష్కులు మొదల్గా గొల్వ బ్రత్యక్షమై
          మార్తాండుం డుదయించె నబ్ధితటసీమ ప్రాశితౌర్వాకృతిన్"[1]

అని క్రీ.శ. 1585లో నుండిన మల్లనకవి వర్ణించెను. దీనినిబట్టి సూర్యుని తురకలు కర్తారు డనిరని తలపవచ్చును. కాని ఇస్లాము మతములోను, దానికి సంబంధించిన భాషలలోను కర్తారుపద ముండినట్లు కానరాదు. ముసల్మానుల రంజానును రోజాను ఒక కవి యిట్లు వర్ణించెను.

         "చనుపకముల తావిగొనక రోజాలుండి తేటిమలక మల్లెతెల్ల విరుల
          చందు చూచి విరహ జయకాంక్షమైదుగానా యొనర్చె నుత్తరాయణమున."[2]

(చనుపకము=చంపకము మలిక్ శబ్దమును మలక చేసినారు. చందు=చంద్రుడు. దుగానా=రెండు నమాజులు.)

శైవ వైష్ణవులలో పరస్పరాసహనము పూర్వమువలెనే యుండెను. విప్రనారాయణునిపై దొంగతనమును మోపి ధర్మాసనసభయందు విచారణచేసిన కాలమందు "వైష్ణవులకుం దలవంపులుచేసె" నని వైష్ణవులిట్లు ఖేదపడిరి.

          "అభియాతుల్ మొద లీమతంబునకు మాయావాదు లాత్మీయ దు
          ర్వ్యభిచారం బది మేరువంతయిన మాయన్ మిథ్య లేంద్రుడు పె
          ల్లభియోగింపదు రన్యదుష్కృతము గోరంతైన గొండంతగా
          ప్రభువుల్ హాస్యరసప్రియుల్ మనల నీపాటైన మన్నింతురే?"

మొదలే మామతానికి శత్రువులున్నారు. వారు తమవారి తప్పులను కప్పిపుత్తురు. మన తప్పులైతే కొంచెమున్నను కొండంతచేసి రచ్చకెక్కింతురు. అనుటచే ఈ సూచనయంతయు అద్వైతుల దిక్కే యనుట స్పష్టము. "బ్రహ్మ సత్యం జగ న్మిథ్యా" అను మా యామిథ్యావాదమును అద్వైతులు చేసిరి. ఇతరులు "ఈతన్ని చోరు డనరాదు; జారు డనరాదు; అనాదారు డనరాదు." "పోరన మీర లీతనికి బూనుడు బ్రహ్మరథంబు వైష్ణవుల్" అని సోల్లుంఠనము లాడిరి.[3] ఇతరులనగా అద్వైతులును, శైవులును కావచ్చును.

హిందూసంఘమునకు విశేషముగా కష్టము కలిగించినది సాంప్రదాయి కతయే. వివిధసంప్రదాయకములలోని జనులలో అనేకకుటుంబములవారు కేవలము సంప్రదాయము పేరుపైననే బ్రదుకుటకు మొదలు పెట్టిరి. శైవలమని మఠాల నాశ్రయించినవారు, వైష్ణవులమని దేవాలయముల నాశ్రయించినవారు, మతము పేరుతో బిచ్చమెత్తుకొను వారును ఈ కాలములో బహుళమైరి. నంబులు పలువురు "దాసరిబుట్ట" లతో బయలుదేరి బిచ్చమెత్తిరి. విప్రనారాయణుడు "తిరు వరంగం బెరయకోవె" లనుచు బికిర మెత్తె""[4] శ్రీరంగమే పెద్దకోవెల అని పై అరవమున కర్థమని భాషాతత్త్వ శాస్త్రానుసరణి నూహింతును. పై చరణముతో ప్రారంభమగు ఒక ప్రసిద్ధమగు తమిళపాటగా అది కానవస్తున్నది. మాడభూషిమఠం వేంకటాచార్యులగారు తమ పాశురపరిమళములు అను పుస్తకములో నిట్లు వ్రాసిరి.

తిరువరంగము అను శబ్దము ద్రావిడమున శ్రీరంగము తిరువ రంగం తిరుమాల అనునది ద్రావిడ దివ్యప్రబంధములోని మొదటి వేయిగానములలోనిది. దీనిని బాడినవారు ఆంధ్రలోక విదితులైన విప్రనారాయణులవారు. వారి చరిత్రమును-వైజయంతీ విలాసమును చదువని యాంధ్రుడుండడు. వారు పన్నిద్దరాళ్వారులలో నొకరు. వారి తిరువరంగం తిరుమల శ్రీవైష్ణవాలయంబులలో గానము చేయబడును." అందలి యొకగానమును మాడభూషివారు తెనుగులో నిట్లువ్రాసినారు.

         "ధనువొకటన్ మహాజలధి దర్పమణంచి జగంబు పొంగ భం
          డనమున రావణాసురు నడంచిన యామనసేవకుండు నె
          క్కొనివసియించు నీ పేరియకోవెలరంగని దామమంచు బే
          ర్కొనకయె కాలముం గడవ ద్రోతురె తత్కరుణావిదూరులై"

ఇత్యాది స్తోత్రములలో "తిరువరంగం పెరియకోవెల" అను భావము లిమిడి యున్నవి.

"బలియ, బికిరంబు, జోగు, గోపాళ మనుచు[5] మరికొదరు బయలుదేరిరి. జోగు అనునది ఎక్కలి దేవిని కొలుచు జక్కులవారు యాచించు బిచ్చము. వారు "ఎక్కలేజోగు" అని నేటికిని యాచింతురు. గోపాళము=సందెగోపాళ మనునదే. గతప్రకరణములో తెలిపినట్టిదే

శ్రీరంగములో "రామానుజకూటము లుండెను"[6] కాని తెనుగు దేశములో నుండెనోలేదో చెప్పజాలము. తంబళ్ళనుగురించి యిదివరలో కొంత తెలిపినాము. వారికి ప్రధానముగా శివాలయములందు పూజారితన ముండెను. తంబళిపదమున కేమర్థమో తెలియరాలేదు. వారు దేవాలయములకు విస్తళ్లు ప్రతిదినము తెచ్చి యిచ్చువారు. "తిరుమల దేవరాయల కాలములోని ఒకశాసనమునుబట్టి వాటికి ఆదెప్పనాయనింగారి కార్యకర్త అయిన సూరపరాజు గోరంట్లలోని సోమేశ్వరదేవాలయమునకు విస్తళ్లు తంబళివా రిచ్చుకొనుటను ప్రార్థనపై విలుపుదలచేసి అందుకుమారుగా దేవాలయమును బాగుచేయునట్లు శాసించినవి తెలియ వస్తున్నది[7]."

వైష్ణవాలయములు కట్టించునప్పుడు "విష్ణుప్రతిమోత్సవము" చేసెడివారు. (శివాలయములకును అట్లే చేసిరి.) శ్రీవైష్ణవులు ద్వాదశ పుండ్రకదారులై శ్రీచూర్ణరేఖలు దిద్ది "తిరుమణి వడముల" తో "తిరుపగూడల"తో "చెర్వముల"తో ఆ యుత్సవానికి వేంచేసిరి. తిరుమణి వడము=తామరపూసలదండ. తిరుపగూడ=నామాల సాధనములు కల తాటాకు బుట్ట. చెర్వము=చరువ=పాత్ర[8] వైష్ణవమత ప్రచారమును వైష్ణవకవులుకూడా చేసిరి. సాంబోపాఖ్యానము వ్రాసిన రామరాజు రంగప్ప ఇట్లు వ్రాసెను. "సిద్ధాంతదర్పణుండను గురుడు హస్తినాపురికి పోయి భీష్మద్రోణ విదురాదులను పంచసంస్కార సంస్కృతులను గావించి శరణాగత ధర్మంబుల భాగవతవాత్సల్యంబును తెలిపి, హరికథా శ్రవణము కావించి, అష్టవిధ భక్తి ప్రకారంబును, నవవిధభక్తి యుక్తులను తిరువారాధనా మర్యాదలను ఆదిగాగల పరమవైష్ణవ సిద్దాంతంబు బుద్ధి గోచరంబున జేయుచుండె." [9]

వైష్ణవాలయములలో పూజారులు "తాతలతరంబు నాటినుంటి యాశ్రయించి జీవిస్తూవుండిరి. నైవేద్యములను వారే అనుభవించెడివారు. భక్తులిచ్చిన దీపారాధనపు నూనెను వీలుకొలది తీసుకొనెడివారు. భక్తులిచ్చు దక్షిణలవల్ల మంచి లాభము పొందిరి.

"విను మేము ప్రాలుమాలిన దీవె సుడిగాక, కినిసిన రెండు గుగ్గిళ్లుగాక తక్కిన నింత గ్రంథప్రసాదముగాక, మనపైన నొక వడతునక గాక యట మటించిన కుంచెడంత సాదముగాక, కాదేని యొక గుల్ల కాసుగాక దాచికొన్నను బలితంపుజింపుడు గాక, సిక్కిన నొక పోకవక్కగాక...."[10]

అవి పూజారులనుటచే వారు గుడిపై జీవించువిధానము కానరాగలదు. "ధర్మసత్రపు బ్రాహ్మణులు" పలువురుండిరి.[11]

లక్ష్మీదేవిపండుగను జనులు చేసెడివారు. దీనిని శరత్కాలమున చేసిరి. ఆ పండుగనాడు విటులు బోగమువారికి "పండుగదండుగలు" సమర్పించుకొనిరి.

         "మింఠజనదత్త మేషి కంఠసముద్బూత రవము కడు నెమ్మది, ను
          త్కంఠ సలిపె వేశ్యాకలకంఠుల కత్తరి గృహోపకంఠములందున్."

ఈ విధముగా రూకలు, కోకలు, ఆకులు, పోకలు, మేకలు ఇవన్నీ సానులకు కానుకలుగా విటు లంపిరి.[12] ఈ వర్ణననుబట్టి యీ పండుగ దీపావళి పండుగయని తోచును. నేటికిని దీపావళినాడు బోగపుసానులు ధనికులయిండ్లకు వేకువన వెళ్ళి, మంగళహారతు లిచ్చి అనుగ్రహీత లగుదురు.

సంతానము లేకుండిన పున్నామనరకములో పడుదురని శాస్త్రాలలో పూర్వకాలపువారు వ్రాసి పోయినందున, హిందువులలో నేటివరకును పడరానిపాట్లు పడుతున్నారు. ఆ కాలములో సంతు లేనివారి యవస్థలు మరీ యెక్కువగా నుండెను.

         "ఉపవాసంబులు, సత్య ధర్మ మహితోద్యోగాది కృత్యంబులున్
          జపముల్, విప్రకుటుంబభోజనములున్, శాంతుల్ పయస్పత్రముల్,
          తపముల్ దైవతపూజనక్రియలు, తీర్థస్నానముల్, దానముల్,
          విపరీతప్రతిబంధమోక్షణవిధుల్, వేమారు గావించుచున్."

ఇంతేకాక బహువిధ దేవతాస్తోత్రాలు పఠించుట, పొర్లుదండాలు పెట్టుట, చూసిన వల్పుల కంతా మొక్కుకొనుట, చెప్పిన దానాలు చేయుట పరిపాటియై యుండెను.[13] శ్రీమద్రామానుజులవారి కాలములో శ్రీపతి పండితుల యభిప్రాయ ప్రకారము, తిరుపతి వీరభద్రుడు వెంగళయ్యకాగా అతని ప్రభావము తెనుగు దేశముపై బహుశీఘ్రముగా వ్యాపించుకొనిపోయెను. ఈనాటివలెనే క్రీ.శ. 1500 లో కూడా తిరుపతి మాహాత్మ్యము దక్షిణాపథమం దంతటను నిండుకొనిపోయెను. వేంకట శబ్దమునకు (వేం: కటపతి. వేం అంటే పాపాలట! ఎక్కడిధాతువో యేమో?) ఒక కొత్త అర్థమును ఇటీవలి పండితులు కల్పించినారు. ఇది సంస్కృతశబ్దము కాదు. ఇది వెంగడము అను అరవపదము. తెలుపుగల బొల్లిగట్లు అగుటచేత తెల్లనిగట్లు అనుటకు అరవములో వెంగడము అన్నారు. వెంగళ దాని పర్యాయపదము. తిరుపతికి వెళ్ళు భక్తులు పడినపాట్లు నాకాలపుకవి యిట్లు వర్ణించెను.

           "అవశనవ్రతముచే సతులు కార్శ్యంబున
              గనుపట్టు నోరి బీగములవారు
            మ్రొక్కు దీర్చుటకునై మూకమూకలు గూడి
              యేతెంచు తలమోపుటిండ్లవారు
            ప్రాణముల్ పిడికిట బట్టుక యిట్టట్టు
              దెమలని శిరసుకోడములవారు
            దైహికాయాసంబు దలపక దొర్లుచు
              నడతెంచు పొరలుదండములవారు
            నామటామట మ్రొక్కు వా రడుగునడుగు
              దండములవారు మిగుల సందడి యొనర్ప
            నడరి పన్నగ సార్వభౌమాచలేంద్రు గొలువ
              కోటానుకోట్లు పెంగూట" మరిగె.

దిగువతిరుపతిలో ఆళ్వారుతీర్థసేవ, గోవిందస్వామిసేవ చేస్తుండిరి. నానావిధకులు దారిలో నగపడుతుండిరి.

"త్రోవగూర్చుండి బొంతలు మ్రోలబరచి ముదురుటెండల కోరగా ముసుగు జేర్చి పట్టెదండలు మొరయించి పాడుకొనుచు నలరుదాసళ్ళు....."

బహుళముగా నుండిరి. తర్వాత భక్తులు "మందలుగూడి" శేషశైలము నెక్కి, అచ్చట పాపనాశనిని, పుష్కరిణిని, వెంకన్నను, వామన తీర్థమును సేవించెడివారు[14]

ఇంచుమించు క్రీ.శ. 1300 ప్రాంతమువాడగు మంచన, తన కేయూర బాహుచరిత్రలో రథోత్సవమును, జాతరను సూచించినాడు. ముఖ్యస్థలాలలో ప్రతి సంవత్సర మొక నిర్ణయ మయిన దినమున రథోత్సవము చేస్తుండిరి. అదియే తీర్థయాత్రగా నుండెను. ఆ యాత్రయే జాతర యయ్యెను. రథోత్సవకాలమందు పల్లెజను లెట్లాచరించుకొనిరో కదిరిపతి మహాకవి యిట్లు వర్ణించినాడు.

"ఉత్సవాలోకనాయాతనానాజనవ్రాతంబులో తమ తమ జనంబుల గానక కాందిశీకులైన వారల మీవారిం జూపెదమని తోడుకొనిపోయి విజనస్థలంబుల నొడబడకుండిన (యువతులను) పుడమిం బడవైచి యీలువు గొని విడిచినం గ్రమ్మరి తమ్మన్వేషించు నత్తమామల గలిసికొని తేలుగుట్టిన దొంగలం బోలె మెలంగు ముగ్ధాంగనలును... మరియు కటిఘటతార్ద్ర వసనఖండంబులతో బొర్లుదండంబు లిడువారలకు గడితంపు పచ్చడంబు లుల్లెడల వడువుసం బట్టువారును, నిట్టసిగల భాగవతులకు వ్యజన వీజనంబుల వీచువారును, ఆగంతులకు శీతలోదకంబులుం బానకంబులును నీరు మజ్జిగయుదెచ్చి గైకొనుడని ప్రార్థించి యిచ్చువారును" అందుండిరి.[15] (ఉల్లెడ పదము శబ్దరత్నాకరములో లేదు. వివాహాలలో గండదీపము మోయునపుడు ఒక దుప్పటిని తీసుకొని నలుగురు నాలగంచులు పట్టి మధ్యన నొక కర్రతో ఎత్తి డేరాలవలె పైన పట్టిన దానిని రాయల సీమలో ఉల్లెడ యందురు.)

సంక్రాంతి పండుగ తెనుగువారి ముఖ్యమగు పండుగలలో నొకటి. రాయల సీమలో దానిని పనుల పొంగలి యనిరి.

           "ఇంక నాల్గావంబు లిడనైతిగా యంచు
              గుమ్మరి నెమ్మది గుందికొనక

           కుడుము రూకల కెల్ల గొననైతిగాయంచు
              బేర తేరని యూరివేర మొంద
           గొరియమందల నించుకొననైతిగా యంచు
              గొల్లవా డూరక కుళ్ళుకొనగ
           పెనుపసుపుపే విత్తుకొననైతిగా యంచు
              కాపు నిద్దురలేక కళవళింప
           మొనసి వెలచూపి చూపకమునుపె
              వారిసరకు లమ్ముడువోయె నేజాతివారి
           కేని పాటింపవలసి పేరెక్కినట్టి యా
              దినంబున నంబురుహాయతాక్షి"[16]

ఆనాడు పొంగలి చేసుకొనెడివారు. ఆ పండుగనాడు కొత్తకుండలు కొనుట, గొర్రెలనుకోసి వాటిమాంసము తినుట, మున్నగునవి చేయుదురని కవి తెలిపినాడు. కుడుము తప్పుపాఠ మనుకొందును. 'గుడము^' అంటే సరిపోవును. ఆ పండుగ కాలములో చింతకాయతొక్కుకై పసుపు వాడుదురు.

కాపువారికి ఏరువాకవలెనే 'వింతటిపండుగ' యనునది ముఖ్యమైనది. వింతటి అనుపదము నిఘంటువులలో లేదు. జొన్నలు విత్తునాడు చేయు పండుగ అని దానియర్థము. నేటికిని జొన్న విత్తనమునకు ముహూర్తముపెట్టి యీ పండుగ చేయుదురు. జొన్నవిత్తనము వేయునప్పుడు చేని వద్దనుండు రెడ్డిని, చేనివద్ద విత్తనముగింజల బిచ్చమును పొందు నిమిత్తమై గ్రామపురోహితుడు పోయెను.

          "వచ్చిన పెద్దరెడ్డి సుగవాసివి, మే లిపుడైన నీడకున్
           వచ్చితె యంచు బావయను వానిని ద్రస్తరలాడి, దాపడా:
           యిచ్చట జల్లు విత్తు ఫలియించునె వేళ గుణం బెరంగి నా
           యిచ్చకు మెచ్చుగా వదరు మిప్పు డనన్ విని యాత డుబ్బునన్"[17]

అతనికి ప్రీతియగు ముచ్చట్లుచెప్పి-యపుడు చేజేత దీసికొనియె పుట్టెడు విత్తులు" (పుట్టెడు=పుటికెడు=గంపెడు.) ఈ కాలములో మరికొన్ని గ్రామ దేవతలు పుట్టుకొని వచ్చెను. 'నయన పోలయ్య' అనున దొకదేవత. 'నయన పోలయ్యకు నంజలిఘటించి' అని యొక కవి తెలిపినాడు.[18] ఇట్టి దేవర్లకు అర్థముండదు. ఎవరయినా హాఠాన్మరణ మొందిన లేక అద్భుత మరణమందిన వారిని జనులు దేవర్లనుగా జేసి కొలుచువారు.

గ్రామగంగ మరొక దేవత. ఆ దేవతకు కాపు పడుచులు పొంగళ్ళుపెట్టి పాలుపోసిరి. దొరలు పొట్టేళ్ళ నరికించిరి. మాంత్రికులు కోళ్ళ నర్పించిరి.[19] తెనాలి రామకృష్ణుడును గ్రామగంగలను గాలిగంగ లనుపేర వర్ణించినాడు. గ్రామాధికారి గంగమ్మజాతర చేయుదినము నిర్ణయించి చాటించెను. జాతర దినము 'పామరజనుల' స్త్రీలు గోరెచ్చ చమురంటుకొని శిరస్స్నాన మాడిరి. కొత్తబట్టలు కట్టి కంట కాటుక బెట్టి, సిందూర తిలకము పెట్టి, కొప్పులో పూలు పెట్టుకొని, వేపాకు దండలు వేసుకొని, తాంబూలము వేసుకొని బయలుదేరిరి.

          "ఎడ్డెతనపు గయిసేతల రడ్డులు నడిచిరి పురస్పరద్బార్యంగా
           గుడ్డంబు చక్కి గట్టం బడ్డ మహాశక్తి దివ్యభవనంబునకున్."

ఆ యుత్సవమున మేకపోతుల బలి ముఖ్యమైనది. జనులు కల్లు బాగా త్రాగి చిందులాడిరి. ఆ జాతరలో పామరస్త్రీలు చేసిన వేడుకలను కవి యిట్లు వర్ణించినాడు.

          "సిడి వ్రేలె తెరవయోర్తు. నిప్పుటేట జరించె నెలతయోర్తు,
           చొచ్చె నిప్పుల పందిరిగుండ మింతియోర్తు. అనటాకు నర్తించె
           నతివ యోర్తు." అంతేకాదు:-

                 "కాంత యొకర్తు మూపునగండ లిచ్చె
                  మారుగా లిచ్చె నొక సుదామధురవాణి
                  లలన యొక్కర్తు నోరితాళంబు లిచ్చె
                  శక్తి జాతర సద్బక్తి శక్తు లెసగ"[20]

"ఎక్కలిదేవికి గ్రామగంగకున్ చప్పిడిదించి మ్రొక్కుకొనుట"యు యాచారమై యుండెను[21] సిడిని గురించి యిదివరలో తెలిపినాము. భక్తి పారవశ్యమున శైవులు నిప్పుల గుండాలపై సుఖముగా నడిచెడిదియు తెలిపినాము. అరటాకు చినుగకుండ దానిపై నాట్యమాడుట యింకొక విశేషము. స్త్రీలు మూపును కోసి కండ లిచ్చుట భయంకరాచారమే. మారుగాలిచ్చుట యనవేమో ! నోరి తాళము లిచ్చుట యన నోటికి బంధనాలు వేసుకుని లేక దబ్బనాలు కుచ్చుకొని మ్రొక్కులు చెల్లించుట యని యర్థము. దేవరకు మ్రొక్కు కొనుటను తీనె లేక తిన్నె పెట్టుట యనిరి. తిన్నె, తీనె అన అరుగని శబ్దరత్నాకరమందు వ్రాసినారు. ఇక్కడ అది సరిపోదు. ఇంట్లో ఒక చిన్నకట్టపై దేవరను బెట్టి నిలుపుకొని మ్రొక్కులు చెల్లించుటకు తీనెబెట్టుట యని యందురు. ఒక రెడ్డి భార్య చనిపోయి పురోహితుని కలలో వచ్చి,

          "........ బాపడ: రెడ్డికి దెల్పరాదె, న
           న్నెన్నడు తిన్నెవెట్టి నుతి
           యించుచు గొల్వరటంచు బల్కె..."[22]

దేవర్లకింకా కొదువ లేకుండెను. పుట్టలమ్మ సందివీరులు, ఎక్కలమ్మ, పోతురాజు, ధర్మరాజు, కంబమయ్య, దేవాదులు, కాటిరేడు అనువారును వెలిసిరి.[23] చెంగలమ్మ అని మరొక దేవత యుండెను[24]. నెల్లూరిలో పూర్వము చెంగలమ్మ అనునామె సహగమనము చేసెను. ఆమె దేవత యయ్యెను. ఆ సీమలో నేటికిని చెంగలయ్య, చెంగలమ్మ పేర్లు బహుళము. దేవర్లకు మ్రొక్కుకొని 'సాత్కాలు కోరించుట' మరొక యాచారమై యుండెను[25]. సాత్కాలు అననేమో నిఘంటువులలోలేదు. నాకు తెలియదు.

రోగాలువస్తే భూతబలిగా స్త్రీలు దివదీసి నాలుగుబాటలు కలియు చోట బల్యన్నము పోసి పోయెడివారు. "శృంగాటకంబుల కాపు గరితలు అగ్గలంబుగా భగ్గునం దరికొన బలియర్చించు పొంగళ్ళవలనం గొంతకొంత సంతసింతు." అని యొకదయ్య మనెను[26]. సివసత్తులకును, తలారులకును, బవనీలకు, ఆటపాటలవారికి తిరిపెపు కల్లు దొరికెడిది[27]. సివసత్తు లను పదము నిఘంటువులలో లేదు ఆది శివశక్తి తద్బవము. కొందరు స్త్రీలు సాధారణముగా బసివిరాండ్రు శివమెత్తి (పైనిండి-అని తెలంగాణము మాట. అనగా మైనిండి) ఊగుతూ దేవరను నిల్పుటకై ఆర్బాటము చేయుదురు. వారిని సివసత్తులు అని నేటికిని రాయలసీమలోను, తెలంగాణ మందలి బహుప్రాంతాలలోను అందురు.

తెలతెలవారువేళ పూర్వము దేవాలయములందు నగారా మ్రోయించెడి వారు. రాజుల భవనాలముందు మేలుకొలుపుల మంగళవాద్యము లెట్లో అట్లే దేవాలయములందును దేవునికి మేలుకొలుపులుగా నుండెను. "దేవనిలయ ప్రాంచన్మహామర్దల ధ్వనిచే వేగు టెరింగి"[28] జనులు వర్తించుకొంటూ వుండిరి.

         .....రంగశాయి గేహమ్మున బోరున న్మొరసె
         నప్పు డహర్ముఖసూచకంబులై యిమ్ముల శంఖదుందుభి సమా
         హిత మంజుల వాద్యఘోషముల్"
         అని విప్రనారాయణచరిత్ర (4-98.) లోను వ్రాసినారు.

పూర్వము వైష్ణవాచార్యులకు గ్రామాలపై కొన్ని హక్కులను అప్పటి రాజు లిచ్చియుండిరి. పెమ్మాసాని తిమ్మానయడు అను కమ్మదొర శా.శ. 1566 (క్రి.శ. 1644)లో ఒక శాసనము ఇట్లు వ్రాయించి యిచ్చెను.

"తాతాచార్యుల ప్రపౌత్రులయిన తిరుమల బుక్కపట్నం కుమార తాతాచార్యులవారికి ముసళ్ళ గోత్ర పెమ్మసాని తిమ్మనాయనింగారు వ్రాయించి యిచ్చిన దేశసమాచారపత్రిక-పూర్వంమీ తిరుమాళిఘెకు కృష్ణదేవరాయలనాటి నుంచి నడిచే దేశసమాచారం దేశం మ్లేచ్చాక్రాంతమై పోయినందున మా తిరుమాళిఘెకు నడిచే గ్రామాదులు వర్షాశనములు మాకు నడిపించమని ఆజ్ఞనేమిస్తిరి. గనుక తమ సన్నిధిలో మేము పంచ సంస్కారములు అయ్యే సమయమందు మా గోలుకొండ పాదుషావారు మనసబు యిచ్చిన గండికోటతాలూకా 4 లక్షల 50 వేల సీమకు హరిసేవ, గురుసేవ ముద్రకానికె గుడికట్నం బసివిముద్ర తప్పువొప్పు దండనఖండన పదుపావాడం మొదలయిన దేశసమాచారసహా తమకు సమర్పిస్తిమి" (పెమ్మసాని తిమ్మానాయడు-గండికోట ముట్టడి యను లఘుపుస్తకమునుండి).

క్రీ.శ. 1652 లో గోలకొండ మంత్రియగు మీర్ జుమ్లా గండికోటను మోసము చేసి పోర్చుగీసుల సహాయముతో ఆక్రమించుకొని కోటలోని విగ్రహాలను తెప్పించి 20 ఫిరంగీలు చేయుమని మైలే అను బుడతకీచు వానికి చెప్పినాడు. వాడు 48 పౌనులవి 10 ఫిరంగీలు, 24 పౌనులవి 10 ఫిరంగీలు కావలెనన్నాడు. రాగి విగ్రహాలను కరిగించినారు. అన్నీ కరిగినవి మూసలో. మాధవస్వామి మూర్తులు మిగిలియుండెను. వాటిని మూసలోవేసి ఎంత ప్రయత్నించినా కరగలేదు. ఇందులో బ్రాహ్మణులమంత్ర ముందని అర్చకులను బాధించిరి. లాభము లేకపోయెను. ఫిరంగి యొక్కటికూడా సిద్ధము కాలేదు. టావర్నియర్ అనువాడు తానీ సంఘటనను స్వయముగా చూచి తన (Travels in India) గ్రంథములో నిట్లు వ్రాసెను.

"The Nawab (Mir Jumla) collected a quantity of idols from the Pagodas" Amonaga these, there were Six of Copper, there ofa which were 10 ft. high. It was impossible for Maille to melt these six, no matter how much the Nawab expended. In short, Maille never accomplished making a single Cannon."

(గండికోటముట్టడి అను లఘు పుస్తకములనుండి ఉద్ధృతము. కర్తపే రందులేదు. "ఈ వ్యాసము సమదర్శిని అంగీరస సంచిక కోసము ఉద్దేశింపబడింది" అవి అందు కలదు.)

జనుల వేషాలు

జనులకట్టులో, బొట్టులో, అలంకరణములలో వైవిధ్యముండెను. నన్నూరు ఏండ్లక్రిందట మనయాంద్రులలో వివిధవృత్తులవారు, కులములవారు ఎట్లుండిరో ఇంచుమించు చిత్తరువుపటాలవలె మనకు తనవర్ణనలతో చూపిన ప్రతిభాశాలి పాలవేకరి కదిరీపతి. ఒక్కొక్కజాతి మనిషిని, స్త్రీని, చక్కగా వర్ణించి మనయెదుట నిలబెట్టినాడు. అట్టిపద్యములన్నియు నుదహరింప యోగ్యమైనవి. కాని అటులచేసిన గ్రంథము పెరుగును. కావున ముఖ్యమైనవి కొన్ని యుదహరించి తక్కిన వానిని సూచింతును. ఎరుకపాళెగాడు:-

అంపపొదికి నెమిలిపురిచుట్టి, సెలసు అను కట్టెతోచేసిన విల్లును బూని, మొలకు పులితోలుచుట్టి, నడుముదట్టీతో కురుచవిడెము దోపి, పికిలపూలదండలు వేసుకొని, కుడిచేతిసందిపై గొరిగింజల దండ చుట్టి "జుంజురు సికమీద జుట్టిన తలముళ్ళు దట్టిలోపల నఱ పెట్టుచుట్టు" కోర మీసలు, మిడిగ్రుడ్లు, వలుద ఓరచ్చులు కలిగి, నట్టివాడు.[29] (తలముళ్ళు అన చోర సాధనము, వేటసాధనము అన్నారు. నిఘంటుకారులు. ఇదివరలో ఈ పదము రెండుమారులు వచ్చెను. అఱ పెట్టుచుట్టు అంటే ఏమిటో నిఘంటువులలో లేదు. ఓరచ్చులనగా అట్టల చెప్పులు.

వేట వేషం:-

రాజులు వేటకు వెళ్ళినప్పుడు ధరించు విధాన మిట్లుండెను. "పట్టుచల్లడము దరించి, దట్టి గట్టి, "సరిగెక్రొంబని కందుసాలెయంగియ బూని". చలువ చెంగావి పచ్చడముకప్పి, పచ్చల పోగులు వహించి, కస్తూరీతిలకము తీర్చి, కుడివంక బాకు నుంచుకొని, మెడలో కెంపుల హారము వేసుకొని డాలుపట్టి, తళుకువన్నెకుళాయి నెత్తినబెట్టి బయలుదేరుతూ వుండిరి.[30] కందుసాలె అననేమో ? వేపుడు పనిచేయుశాల అని సూ.రా. నిఘంటువులో వ్రాసినారు' ఇక్కడ ఆ యర్థము సరిపోదు. ఒక విధమగు సాలెజాతివారు నేసిన జలతారు అంచుగల అంగీయని యర్థము చెప్పవలసి యుండును.

కోమటిసెట్టి వేషం:-

          "గందపుబొట్టు, వీడియము, కచ్చల పాగయు, కావిదుప్పటిన్,
           సందులపూసలున్, చెవుల చాటున నీలపుదంటపోగులున్,
           కండినయట్టి వెండిమొల కట్టును, నీలపుటుంగరంబులున్,
           బొందవు కిర్రుచెప్పులును, బొల్పెసగన్ దనవత్తు డెంతయున్."[31]

(కచ్చలపాగ=చుంగులరుమాల. దంట=జంట..

వృద్ధవేశ్య:-

అమ్మగారిపుట్టము కట్టి. అక్కలదేవి తోలుపాదాల చిహ్నములుకల హారము ధరించి, చిట్టికుంకుమబొట్టు పెట్టి, ముత్తెపుకంటె ధరించియుండెడివారు.[32]

భటుల పెద్ద:-

          "కొనముక్కుపైనుండి కనుబొమ్మలకు వెళ్ళ
                               నాభినామమును సన్నముగ దీర్చి
           చెవిచెంత కొరగవేసిన కోరసిగసందు తెల్లచెంగులబట్ట వెళ్ళ జుట్టి
           చెరుగు దిక్కున తోకచెరగు దూలగ నీలి
                               కాసెచే హనుమంతు కాసె వేసి"

తలసరి మంటపమున (Police Station) దండనాయకుడు (Sub Inspector) అమీన్ ఉండెను.[33] వారి దర్జా కూడా ఇప్పటి అమీన్లకు తక్కువది కాదు.

           చలదయ:పత్రికోజ్జ్వల దండకాండముల్
               ఘల్లు ఘల్లనుచు ముంగల చెలంగ
           నునుపారి చికిలిచేసిన విచ్చుకత్తులు
               తపనదీప్తుల తళ త్తళ యనంగ
           హనుమదాకృతులు వ్రాసిన కంచు
               టరిగలు జాళించు రవళిచే డాలు మించ
           ఆదరు క్రోవుల మ్రోత కదరి నల్దిక్కుల
               నార్తరావముల వాయసము లరుగ
           ముందటను కంచుకొమ్ము మిన్నంది మొరయ
               జార చోరుల గుండియల్ ఝల్లనంగ
           వెడలి కోలాహలంబుగా వేశ్యవాటి జేరి
               యప్పట్టణము తలవారి గాంచె"[34]

తలార్లు కట్టెకు చిన్నచిన్న ఉక్కు ఇనుము బిళ్ళల గుత్తులను కట్టి చేతబట్టెడివారు. ఆరిగె లనిన కేడము అన్నారు నిఘంటుకారులు. డాలులను తోలుతోను, ఇత్తడితోను, కంచుతోను, ఇనుముతోను చేయించెడివారు. ఇచ్చట తెలిపినది కంచుడాలు. దానికి మూడుకాని, నాలుగుకాని గుడుపులుండును. ఆ గుడుపులలో సన్నని ఇనుప గోలీలు వేసెడివారు. అవియే 'రవళి' చేసినవి. ఉక్కుపై విగ్రహాలు వేయించెడివారు. పలువురు సింహాలను, పులులను వేయించెడివారు. ఇచ్చట హనుమంతుని వేయించినారు. ఒకబోగముది శివుని గొలిచి దేవాలయమునుండి వెళ్ళుచు,

        క. గుడివెడలి వైష్ణవులు గనుపడకుం
           డగ జెలుల సరిగ పట్టుమటంచున్
           పడతి తనయింటికడకున్ వడి జని
           నిజజనని బిలిచి నగుమొగ మలరన్.[35]

అని మరొక కవి వర్ణించుటచే కేవలము డాలే యని యర్థము చెప్పుటకు వీలులేదు. ఛత్రివంటి సాధన మనవలెను.

దాసరిసాని:- కావి కుప్పసము తొడిగి, కొప్పు బయలుపడకుండ ఖండశాటి (చీరబట్ట) బిగించి, జమిలి పూసలకంటె పెట్టుకొని హరిహరీ యనుచు నడిచెను.[36]

కరణము:-

          "ముదుక తలపాగయును బాహుమూలమందు
           కవిలెచర్మపు టొరలోని కత్తిగంట
           మలతి నీర్కావిదోవతు లమర గ్రామ
           కరణ మేతెంచి రెడ్డిచెంగట వసించె.[37]

మాదిగెజోగురాలు:- పసుపుబొట్టి, మెడలో (దేవి) తోలు పాదాలు, నిడుద గవ్వలదండ, దర్శనపుదండ, "ఎడమచే బళ్ళిక నిడిన జంఱారన్యపాణి బట్టిన నాగపడిగకోల" కాసెకట్టిగా కట్టిన చెంగావిచీర, నీలిరవిక, కాళ్ళకు గజ్జెలు కట్టి పరశురామునిపాట పాడుకొనుచు ఎక్కలోజోగు అని బిచ్చమెత్తునట్టిది[38] (దర్శనపు దండ నిఘంటువులలో లేదు. గవ్వల దండయని యర్థము.)

తురక జవాను:-

           మెలిపెట్టి చుట్టిన తెలిపరంగిముడాసుపై
                లపేటాడబ్బు పనుల జెలగు
           బంగారువ్రాతల పట్టుహిజారు కంబరు
                చీనినిమతాని పాడు నొసలు
           తనుకాంతి గనుపింప దనరు నంగీజోడు
                వలిపెంపు శాలువ వల్లెవాటు
           వడుదలలోస డాబాకత్తి వదలు పాపో
                సులు గోరంట బొలుచుగోళ్ళు

           నడుము సీలున్న తోలుడాల్ బెడగుసూప
           అభయముగ వెంట నరుదెంచు నభరువాడు

           అమరు ముస్తెదు తేజితో నరుగుదెంచె
                దారుణాకారుడైన యుద్దారుడొకడు.
           వచ్చియయ్యూరి వెలుపల రచ్చ రావి
                క్రేవ దుర్వారుడై "తలారికి బులావు
           ధగిడికే" యను మాటకు తలకి రెడ్డి
                తోడివారలతో చేనిత్రోవ బట్టె" [39]

(పై పద్యములో కొన్ని పదాలకు నిఘంటువులలో అర్థాలులేవు. చుంగు పాగాను మెలికలు వడచుట్టినాడు. తెలి ఫరంగి ముడాసు అనగా ఫరంగీ (ఫ్రెంచి) వారివద్ద కొన్న తెల్ల టోపి. ఫరంగీవా రమ్మిన తెల్లని నెత్తి టోపీ (ముడాసు) పై లపేటా (షమ్లా, చుంగుపాగా) చుట్టినాడు. జరీ అంచులుకల పట్టీలాగు (హిజారు) తొడగినాడు. చీనీ దేశపు నీంతాన్ బట్టను నెత్తిమీదుగా కట్టినాడు. (కంబరు అంటే యేమో?) శరీరము కనబడునట్టి సన్నని నూలు అంగీ తొడిగినాడు. సెల్లాను చంకల క్రిందుగా త్రిప్పి బుజముపై వేసినాడు. చంకలో (పడుదల) జందెమువలె తోలుపట్టీ వేసుకొని దానికొక డాబాకత్తిని తగిలించినాడు. పాపోసులు (ముచ్చెలు) తొడిగినాడు. వెంట గుర్రపుసైసు మాదిగ (నభరువాడు) వచ్చినాడు. సీలు అంటే తెలియదు. పాపోసు పార్సీపదము. పాయెపోష్ (పాదమును రక్షించునది) అనుదాని నుండి యేర్పడినది. అచ్చులో నభరువాడు అని ముద్రించినారు. అది అర్థములేనిమాట. నభరు అని యుండవలెను. ఇది నిఘంటువులలో లేదు. తెలంగాణా పల్లెలలోని రెడ్లు సైసువాన్ని "నఫర్వాడు" అని యందురు. అదే యీ నభరు పదము. ముస్తయీద్ అను అరబీ పదమే ముస్తైదు (Ready) సిద్దముగా తయారుగా నుండునట్టి అని యర్థము. అట్టి 'తురక' బంటు గ్రామ మధ్యనుండు రావిచెట్టుకల రచ్చకట్టువద్ద నిలిచి "తలారికీ బులావ్ ధగిడీకే" అని అరచినాడు. ఈ వేషము, ఈ తిట్టు నేటికిని తెలంగాణాలో ప్రత్యక్షానుభవమే! చిన్నబంటు వేషము వాని గుర్రము, వాని సైసు, వాని దర్జా, వాని తిట్లు చూచి విని రెడ్డి, కరణాలే పారిపోయిరి! గోలకొండ సుల్తానులు కొత్తగా ఆంధ్రదేశాన్ని ఆక్రమించుకొని తమ తురక భటుల కిచ్చిన దర్జాను తెలుపుతున్న దీపద్యము. అనగా ఇంచుమించు క్రీ.శ. 1630-50 ప్రాంతము.

రెడ్డి:-

          "మొలకు సగంబును తలకు సగంబుగా
               గట్టిన యయగారి కరలచీర
           పై నల్లకమ్ముల పచ్చడంబును తోలు
               పావలు చేతిలో బట్టుకర్ర
           కత్తెర గడ్డంబు, కరకు జుంజురమీ
               సములు రోమశంబైన పలకరొమ్ము
           మొలయుంగరము వ్రేల వలముగా దీర్చిన
               నాభినామము బీదవరము లమరు
           గడుసుపిక్కలు గలిగిన మడిమ లమర
               వెంట నిరువంక పెంపుడు వేపు లరుగ

          కెలనదగు నెడ్లకొట్ట మీక్షించుకొనుచు
               నింటివెలుపలి తిన్నియ కేగుదెంచె"[40]

(అయగారి పదము నిఘంటువులలో లేదు) రెడ్ల సంసారములను, జీవనములను చాలా చక్కగా విరివిగా వేంకటనాథకవియు వర్ణించెను. (4-416, 455) ఇతడు రెడిసాని అని ప్రయోగించెను.

పురోహితుడు:-

బుజముపై మూడు తరాలనుండి భ ద్రముగా వస్తూ వచ్చిన దావళి (మడి పంచె) మరియు అసిమి సంచి, ముతక నీర్కావి ధోవతి, తల చుట్టుకొన్న చిలపుల బైరవాసము (వస్త్రము), చెమటచే గరగెడు సేనబొట్టు, మారేడు బుర్రలో మంత్రాక్షతలును, ఒక చేత పంచాంగము, పొడుపువ్రేల (చూపుడు వ్రేల) వెండి యుంగరము, మెడలో మురికి జందెములు కలిగి, హరే కృష్ణ ! హరే రామ ! అంటూ వెళ్ళినాడు. పొడుపువ్రేలు పదాలు నిఘంటువులలో లేవు. తెల్లని (ధవళ) ఉన్నితో నేసిన మడిపంచెను దావళి యందురు. ఇది మహారాష్ట్రులలో నుండు ఆచారము. సూ.రా. నిఘంటువులో ధావళి యన వస్త్ర విశేషమని వ్రాసి వేసినారు.

ఎరుకలి:-

నవరనిపని వన్నెరవిక తొడిగి, ముంజేతులపై ముఖముపై పచ్చబొట్టులు కలిగి, కురుమాపు పైటలో చిన్ని బుడుతని కట్టుకొని, తరతరాలనాటి పుత్తడి పైడిబుట్టి నెత్తిన బెట్టి, కనుబొమలసందున నామము, నొసట భూతిపూత కనులకు కాటుక, కలిగినట్టిది.[41] (పుత్తడి, పైడి రెండును బంగారు కర్థము. ఇచ్చట అది సరిపోదు. ఎరుకలి బుట్టి కర్థము కావలెను. వెదురుబుట్టీ అని యర్థముండును.) అది దారికట్టు, మొనకట్టు, స్త్రీవశ్యము కలిగించు బదనిక లమ్ము కొనెడిది. "దీనిని మా సింగడు కొండనుండి తెచ్చినాడు" అన్నది. దానిని కొరవంజీ ! అని సంబోధించిరి. సింగడు అను పదము నరసింగడు అనుదాని నుండి యేర్పడినది. చెంచులకు నరసింగడు ముఖ్యదేవత. కొరవంజి, సింగి, సింగడు యక్షగానాలలోని నటీ సూత్రధారులు దీన్నిబట్టి యక్షగానాలు చాలా ప్రాచీనమయిన నృత్యగానాలనియు, అవి చెంచువారినుండి స్వీకరించి సంస్కరించినవనియు నూహింపవచ్చును.

రాజులు:-

సిగలో తాయెతులు, నెత్తిపై కుళ్ళాయి, చెవులలో యొంటులు (పోగులు), మెడలో ముత్యాల హారాలు, బంగరు గట్టికమ్ముల వలిపె దుప్పటి వలెవాటు ధరించెడివారు.[42] పనరు పట్టు హిజారు (లాగు), అంగీ, పచ్చరాళ్ళ పోగులు, జీవదంతపు పాపలుకూడా ధరించెడివారు.

భటుడు (జెట్టి):-

గీరునామము, చిన్న కోరమీసలు, వెనుకకట్టు రుమాలు, కమ్మిపంచె, కమ్మి దుప్పటి వల్లెవాటు, కెంగేలిలో వంకవంకి, అపరంజి పరజుతో దగు కత్తి, (పరజు నిఘంటువులలో లేదు.) బచ్చెన (రంగువేసిన) పావుకోళ్ళు, చౌకట్లు (నాలుగు ముత్యాలపోగులు) ఇవి అతుధోపజీవుల వేషములు.[43]

బ్రాహ్మణ స్త్రీ:-

ఒక పంచాంగమయ్య రెడ్డికోడలిని మోహించి తన భార్య అంద చందాలు మెచ్చక యిట్లు పోరుపెట్టెను.

          కీలుగంటిది యేల పోలగా నునుగొప్పు
             గీల్కొల్పు కొమ్మంచు గీజుపోరు
          పసుపుబొట్టిదియేల నొసట విభూతిరేఖ
             యమర్చి కొమ్మంచు కంటగించు
          కాసెకట్టిదియేల కవురుగా మైజారు
             చీర దాల్చు మటంచు చిమ్మరేగు
          లత్కాకు లివియేల చొక్కంపుటంచు
             కమ్మలు ధరించుమటంచు నలుకగాంచు
          భార్యతో నా యమయు వెర్రిపట్టెనేమొ
             యనుచు నాలాగె కావింప నతడు హలిక

           లికుచ కుచవేషమేకాన యకట:
              దాని యొరపులేదని యాత్మలో పరితపించు"[44]

రెడ్డి స్త్రీ:-

పై పద్యములో కొంత తెలియవచ్చినది, మరికొన్ని విశేషములు గమనింపదగినవి:-

          "గొంటుపూసలు రెండుగుండ్ల ముంగరలు,
               మైజారుచీరలు పెన సన్నగొలుసు
           పెద్దమట్టెలు మట్టిపిల్లాండ్లు, బొబ్బిల
               కాయలొత్తులతోడి కడియములును
           కప్పు పల్వరుస లుంగరములు తూలెడు
               కొంగులు బలు చెంప కొప్పులంచు
           కమ్మగవల్ సన్న కాటుక రేఖలు నాభినామంబులు నానుచుట్లు
           పసుపుపూతలు......బిగువు రవికెలు........"[45]

కలిగియుండిరి. పై పద్యములో బొబ్బిలికాయలు నిఘంటువులలో లేదు. కాలి మూడవ వ్రేలి మట్టెలను బొబ్బిలికాయ లందురు.

జంగమురాలు:-

మర్రిపాలుపూసిన జడలదిండు. చింతాకంత విభూతిరేఖ, సందిట రుద్రాక్షపూసలు, నాగబెత్తము, తామ్రపు నందిముద్ర యుంగరము, జన్నిదపు వాటు, యోగపట్టె కలది.[46]

ముత్తైదువులు:-

ఆ కాలపు ముత్తైదువలు పసుపు పూసుకొనిరి. కాటుక పెట్టిరి. పత్తి బొట్టు పెట్టిరి.[47] బోగముసాని:-

"హిజారు (లాగు) మీద తొట్రిలువడి నొంటికట్టున ఘటించిన చీర సగంబు మూపుపై నలవడ బోటిదట్టి" గట్టెడివారు. వారికి "తిరుమంజనము" (దేవునిస్నానము) వేళలందు దేవాలయములందు సేవలో నుండుటకై ఏర్పాటుండెను. మరియు దేవునికి కొడుమెత్తునప్పుడు (నిండు కుండను తీసుకొని పోవునప్పుడు) కూడా వెంట నుండవలెను.

          "కొడుమెత్తుకొరకు గుడికిన్ నడచున్
           వెలపడుచు, నాభినామమునుం, గ్రొ
           మ్మడి సౌరున్ మడిచారున్ వడి
           జారుం బైట వింతవగ గన్పింపన్.[48]

మాస్టీడు (శూరభటుడు):-

"తలపాగ పొరమీద జెలగెడు నాయుధార్చన సల్పినట్టి దాసనపుపూవు." ఎడమకేల గొలుసును, కుడికేల పెద్దపత్తి, దట్టితో చెక్కునిద్దావంకి (కత్తి) దుప్పటివల్లెవాటు, ముందరి బిరుదడవిణ కలవాడు.[49]

ప్రజా జీవనము

బ్రాహ్మణుల యిండ్లు, వారి జీవన మెట్లుండెనో కొంత తెలియ వస్తున్నది.

          "అలికి మ్రుగ్గులు పెట్టినట్టి తిన్నెలు,
              కంచు బోరుతల్పులు, పాలుపోసి చాల
           యూర్చవచ్చుననంగ నొసర చావడి-
              తాళువారంబు, చిన్నగవాక్ష మలరు
           వంటకొట్టము, చిలువాన మించిన మిద్దె,
              పట్టెమంచముతోడి పడుకటిల్లు
           పడసార ముంగిలి నందిరి, పసిగాడి,
              కాయధాన్యములున్న కణజములును,

           పెరటిలో నారికేళి జంబీరముఖ్య
              నిఖిలఫలవృక్షములు మంచినీళ్ళబావి,
           నమరనయ్యింట నిత్యకల్యాణములును
              పచ్చతోరణములు మించబరగునతడు"[50]

(బోరుతల్పులు=పెద్దగవని తలుపులు, కణజుములు పాతరలు, తాళు వారము శ.ర. నిఘంటువులో లేదు. వాచస్పత్యములో స్తంభముల మీదికి దించిన పోఫా అని వ్రాసినారు, చిలువానము శ. ర. లో లేదు. ఆంధ్రవాచస్పత్యములో ధనము అన్నారు, సూ. రా. నిఘంటువులో ఇంటిఖర్చు, చిల్లరఖర్చు అని వ్రాసినారు. ఆ యర్థము లిచ్చట సరిపోవు. బ్రాహ్మణులు కొందరు గొప్ప భూస్వాములై యుండిరి. వారియెడ "బాపల సేద్యం బాలవైద్యం' అనుసామెత చెల్లకుండెను. వారి సేద్యము వారి తోటలు, పంటలు, గరిసెలు యిట్లుండెను.

          గాదెలగొలుచు ముక్కారు బండెడు మళ్ళు
             అత్తోపు, నడబావు, లండదొడ్డి
          ఆకుతోటలగుంపు, పోకమ్రాకులు, గుత్త
             చేలు, గొర్రెలకదు పాలమంద
          చెఱకుగానుగ మొదల్జెడక వర్ధిలునేర్పు,
             బానిసల్ పడవాళ్లు, బంటు, పైద
          పారిగోడలు, గొప్పపడసాల మేల్మచ్చు
             గారముంగిలి, వింతగాని పొరుగు
          రాగినగలు, పదాచార రతియ, దేవ
             పూజ, నిత్యాన్నదానంబు, పూసబొట్టు
          చిదురు జల్లిన తులసెమ్మ చిన్నితిన్నె
             కలిగి కనుపట్టు నాతని కాపురంబు."[51]

(పైద అన పిల్లకాయ అని శ.ర.లో కలదు. అది తప్పు. వాచస్పత్యము పయద రూపము అన్నారు. అదియు తప్పు. శ.ర.లో పేద అనుదానికి భటుడు అని వ్రాసినారు. అది సరి. అదే అర్థము పైదకును కలదు ప్యాదా అను ఫార్సీ పదము పాదచారి అను నర్థము కలదానినుండి పేద, పైద యేర్పడి నవి. అందుచేతనే కవులు బంటు పేద, బంటుపైద అని జంటగా వాడిరి. అత్తోపు, ఆ తోపు అని యర్థమేమో ? పారిగోడ అన మట్టిగోడ కాదు. ప్రహరిగోడ అనియే యర్థము చేయవలెను. అయ్యలరాజు నారాయణ కవి "గొప్ప ప్రహరిగోడ" అని శుకసప్తతికారున "గొప్ప పారిగోడ" అన్నదానికి మారుగా వ్రాసెను. గార అన గచ్చు.)

బీదబ్రాహ్మణులు కొందరిట్లు జీవించిరి:-

సంతలో పత్తి బిచ్చము తెచ్చి జందెములు వడికి, మర్రియాకులు తెచ్చి, విస్తళ్ళు కుట్టి, కూరగాయలు పండించి, అంగళ్ళముందు జారిన మిరియా లేరి, నీటి నన్నింటిని విక్రయించి దనము సంపాదించెడివారు.[52] అట్టి లుబ్ధుల కుమారులు సాధారణముగా దుష్టు లగుదురు. ఆ లుబ్ధుని కుమారుడు, జోగి జంగాలని చూస్తే మండిపడి లంజమందుల కుదారముగా నిచ్చి "తముకువేసిన వెన్క దా జరించిన బట్టి యునుపకుండ దలార్లకొసగి యొసగి", "దర్పకాకార దాతలరాయ యని వెంటబడు బట్టువారికి పారవైచి" పీటమర్ద విట చేత విదూషకులకే పసదనము లిచ్చి, "లొల్లగాడయ్యె నవ్వి ప్రవల్లభుండు"[53], పూర్వము గ్రామాలలో చీకటి వడగానే తప్పెట వేసి ఊరివాకిండ్లు మూసి అచ్చట తలార్లు కావలి యుండెడివారు. తప్పెట వేసిన తరువాత బయట సంచరించువారు చోరులో, జారులో యగుదురు. కాన వారిని పట్టి ఠాణాలలో తెల్లవారువర కుంచి తలార్ల పెద్దవద్ద విచారింపజేసి శిక్షించెడివారు.

రెడ్డి సంసారము:-

          "కొలుచు సమగ్రభంగి నొనగూడ దివాణపువారి చేతి కా
           కలు హుసి వోవగా కరవు కాల మెరుంగక, పూసబొట్టులం
           బలి కలినీళ్ళు చందనపు మానికె గొల్చిన మాళ్ళు గల్గి శో
           భిలుదురు రెడ్డిబిడ్డలు కుబేరుని పిల్ల లనంగ నచ్చటన్.[54]

(దివాణమువారు=రాజు కొలువుకూటమువారు, హుసిపోవుట=అధిక మగుట. ఈ పదము నిఘంటువులలో లేదు.) ప్రభుత్వానికి వ్యవసాయకులు ధాన్యరూపముగా వన్నిచ్చిరని యిందు సూచింతము. చందనపుమానికె చంద నపు కట్టెతోచేసిన కట్టెసోల, కడపజిల్లాలో శ్రీచందనము అను నొక సాధారణ వృక్షము విశేషము. దానితో నేటికిని కట్టెసోలలు, జడిగములు చేయుదురు. మాళ్లు నిఘంటువులలో లేదు. పెసరవంటి కాయధాన్యమని యర్థము.)

రెడ్ల యిండ్లిట్లుండెను:-

          "అచ్చమై వాకిట రచ్చరాయిమెరుంగు
              పంచతిన్నెలు, గొప్ప పారిగోడ
           కంప తెట్టులును, రాకట్టు ముంగిలి
              మల్లె సాలె, దేవర యిరచవికె యొకటి
           కోళ్ళగూండ్లను'గొర్రు, గురుగాడి,
              యేడికోలలు కాడి పలుపులు గలుగు నటుక
           దూడలు, పెనుమూవకోడెలు కురుగాడి
              గిత్తలీనిన మెటి గిడ్లదొడ్డి
           ఇరుకు మ్రాను, పెరంటిలో నెక్కుబావి,
           మునుగలును, చొప్ప, పెనువామి, జనుముదుబ్బు,
           రోలు పిడికెలకుచ్చెల, దాలిగుంత దనర
           వగతంబు వెలయు నాతని గృహంబు.1

'మల్లె సాలె ' అన భోజనశాల అని నిఘంటు కారులన్నారు. అది సరికాదు. ఉదాహరణ మిది.

         పరదేశులకును | గుళ్ళుం బంచలును, రచ్చకొట్టంబులు, నం
         గాక తలంపగ : చల్లని సున్నంపు మల్లసాలలు గలవే ?
                                   హరిశ్చ. 4, 5. 194.

మల్లశాలకు చల్లని సున్నముండుట అరుదు. తెలంగాణమందు మల్ భవంతి (Drawing Room) అను నర్థము కొన్ని తావుల వాడుచుండుట సరిపోవును.

అప్పుడు జొన్నచేలకు మంచె వేసి కావలి కాసెడి వారు. ఇప్పపూవు లేరి సారాయి చేసుకొనెడి వారు. ఆనాడు లైసెన్సు లేకుండెను. మధ్యాహ్నము రాటము త్రిప్పెడివారు. వారు నొక్కు పూసల వేరు, కుందనపుకమ్మలు, నాను, కడియములు, చుట్టుమెట్టెలజోడు, కెంపురవలయుంగరము, వెండికుప్పెసౌరము ధరించి, కురుమాపు కూనలమ్మ చీర కట్టి, కుడిపైటలోపల సిస్తురవిక తొడిగెడివారు.[55]. (కూనలమ్మ చీర=ఈ పదము నిఘంటువులలో లేదు. పిల్లలులేని గొడ్రాండ్రు కూనలమ్మ (కూనలిచ్చు దేవతకు) ఎర్రంచుకల తెల్లనిచీరను నైవేద్య మిచ్చి కొలిచి ఆ చీరను కట్టుకొనెడివారు. ఆ చీరను కూనలమ్మచీర యందురు. ఇది రాయలసీమలోని యాచారమై యుండెను. వైజయంతీవిలాసములో "కూనలమ్మ పటంబు" అని వర్ణించుటచే తెలంగాణమందు కూడా యీ ఆచార ముండె ననవలెను. (వైజ. 3-100.)

"కుడిపైటలోపలి సిస్తురవిక" అనుటలో చాలా యర్థమున్నది. రెడ్లలో మోటాటిస్త్రీలు కుడిబుజముమీదికి కొంగు వేసుకొందురు. పాకనాటివారు ఎడమ బుజము మీద వేసుకొందురు. ఇప్పుడు మోటాటి వారుకూడా ఎడమపైట వేసుకొందురు. పూర్వము కుడియెడమపైటల పట్టింపు చాలా యుండెను. చాలా యేండ్లక్రిందట కుడి యెడమపైటల వారికి పోట్లాటలు జరిగి, మద్రాసు హైకోర్టులో తీర్పు చేయించుకొనిరి. శుకసప్తతిలోని రెడ్డిస్త్రీ మోటాటిదని అర్థమగును.

రాటమును బ్రాహ్మణులు తప్ప తక్కిన వారంద రా కాలములో వడికినవారే. అందు రెడ్లు ప్రత్తిపండించేవారుకాన ప్రధానముగా ఇంటింట తప్పక మధ్యాహ్నములందు వడికేవారు. స్త్రీలు మాత్రమే వడికిరి. (గాంధీయుగమందే పురుషులున్నూ వడికిరి.) పదారింటి తరము (16 Count) దారము వడికిరి.

          "వడి దారము చెవులుం, ద్రొక్కుడుపలకయు,
           దిండు, కుదురు, గుంజలునుం, ద్రొ
           క్కుడుబొమ్మయును, ద్రిప్పుడు పుడుకయునుం
           గలుగు రాట్నములు గైకొనుచున్.
           ఎడమదెస దొడ్డుగా వైచి యేకు లెల్ల
           గెలిన పలువగ వేపుడుగింజ లునిచి
           చేవపీటలమీద నాసీనలైన వారలై
           వావి వరుసలు వదిరికొనుచు."

          "ప్రాయంపుపడుచులా పని గొంటివే దూది
           యనెడు పాటల దేనె చినుకులీన"

          "పొసగ చరణాభ ద్రొక్కెడు బొమ్మమీద
           బచ్చెన ఘటింప వడికి రప్పద్మముఖులు"

          "ఎన్నికలు పట్టి పుంజంబు లేర్పరించి
           పంటకర్రలు మరి తోడువడగ లూచ"

          "కండె లొనరించి చాలించి కాపుటింతు
           లున్న యవ్వేళ నద్బుతం బుట్టిపడగ" [56]

ఈనాటి ఖాదీప్రాముఖ్యమునుబట్టి యీ వివరములు తెలుపనైనవి. రాటము యొక్క అంగములపేర్లు చాలావర కిప్పుడు తెలియనివైనవి.

1. కదురు. 2. చెవులు-కదురుపెట్టు తావు. 3. త్రోక్కుడు పలక. 4. దిండు-కదురకు చక్రానికి దారము తగిలింతురు. కదురనకు దారము తగిలించుతావును దిండు అందురు. 5. చక్రము తిరుగుటకై రెండు గుంజ లుండును. వాటిపై చక్రము ఇరుసు తిరుగును. 6. రాటము చక్రమును వ్రేలుపెట్టి త్రిప్పుదురు. దానిని త్రిప్పుడుపుడ కందురు.

త్రొక్కుడుబొమ్మ, చరణాభ, బచ్చెన అంటే యిచ్చట ఏమర్థమో తెలియరాలేదు. చేవపీట.... మూరెడెత్తుది; నాలుగుకాళ్ళు కలది దానికి నులుక అల్లుదురు. అట్టిపీటకు ఆనుకొనుటకు కుర్చీవలె వీపుపలక అతికి యుండును. దానిని చేవపీట యందురు. ఒరుగుపీట యనియు నందురు.

వంటకూలియిండ్లను స్త్రీలే, అందును వితంతువులే, వారును బ్రాహ్మణ వితంతువులే, ఎక్కువగా నడిపించెడువారు. అచటికి నానాప్రాంతాల కవి, గాయక, పండితులు, ఉద్యోగులు, పథికులు వెళ్ళి "మినుకులు" ఇచ్చి అన్నము భుజించెడివారు. ఆ పూటకూళ్ళు కాకతీయులకాలము నుండియు బంధకీ జారులకు రాయబారాలు జరిపే స్థానాలు.[57]

కోమట్లు:-

కోమట్లకు 'గౌర' యను పేరుకూడ నుండెనని మూడవప్రకరణములో తెలుపనైనది. శుకసప్తతిలో కొన్ని తావుల నీపదమును ప్రయోగించిరి. 'వసుమంతు డను గౌర చెలుపుమీర,'-'ఆ గౌర మనుచున్న' తన్న గరీరత్నము', 'సరి బేరులైన గౌరలు', 'అని గౌర పలు తెరంగుల' అని మొదటి కథలోనే యిన్ని మారులు వాడినారు. కోమట్లలో గౌరయ్య, గౌరమ్మ అను పేరు లెక్కువ, కోమటి కొమ్మలు మణులకమ్మలు, సూల చేకట్లు (కంకణాలు) "సిరాజిగను పులగళ్ళ చేకటులు, (పర్షియాలోని షిరాజ్ పట్టణము నుండి వచ్చిన కంకణములు) పొప్పళికుచ్చెలచీర ధరించెడివారు. కోమట్లకు వ్యాపారము ప్రధానవృత్తిగా నుండెను. వారు సాధారణముగా ధనికులు, అయితే వారు బహుళముగా లోభులై యుండిరని కవులు వర్ణించిరి. వేములవాడ భీమకవి యిట్లు కోమట్ల తిట్టెను.

         "గొనకొని మర్త్యలోకమున కోమటి పుట్టగ పుట్టె దోస, బొం
          కును కపటంబు, లాలనయు, కుత్సితబుద్ధియు, రిత్తభక్తియున్,
          ననువరిమాటలున్, బరధనంబును గ్రక్కున మెక్కజూచుటల్,
          కొనుటలు నమ్ముటల్ మిగులగొంటుదనంబును మూర్ఖవాదమున్."

         "కోమటి కొక్కటిచ్చి పదిగొన్నను దోసము లేదు; యింటికిన్
          సేమ మెరింగి చిచ్చిడిన పాపము లేదు........"

అన్న భీమకవియే యీ విషయములో ఉదారుడట. ఇంకొకకవి భీమ కవిపై యౌదార్యమును చాలా యాక్షేపించెను.

          "వేములవాడ భీమ! భళిరే! కవి శేఖర సార్వభౌమ! నీ
           వేమని యానతిచ్చితివి యిమ్ముల గోమటి పక్షపాతివై
           కోమటి కొక్కటిచ్చి పది గొన్నను దోషము లేదటంటివా?
           కోమటి కొక్కటీక పది గొన్నను ధర్మము ధర్మ పద్ధతిన్."[58]
   
           మల్హణకవి ఒక కోమటినోటనే యీమాటలు చెప్పించెను.

          "దైవాలకును రిత్తదండాలు గిండాలు గాని యెన్నడు నొకకాసు నీయ,
           కవి గాయకులు వచ్చి గణుతించి వేడిన వదలిపోవుటెగాని పైకమియ్య
           చుట్టాలకును వట్టిసుద్దులు దుద్దులు గాని యెన్నడును డగ్గరగ నీయ
           బైత్రోవ వచ్చిన పరదేసి యొరదేసి మోసపుచ్చుటె గాని గాసమీయ
           పట్టుకొని బందికాంద్రను బాధపెట్ట బెంచులే చూప నొక బలువీసమైన
           బ్రహ్మరాక్షసి శాకిని ప్రతిదినంబు కూతలే కాని ముద్దెడుకూడు వెట్ట."

మరియు "బాపలకు గోదాన మియ్యను, వడ్డికాసులవల్ల బ్రదుకుదు. ఈగకు, పాముకు బలిపెట్టను. ఎంగిలిచేత కాకి నేయను" అని అన్నాడు.[59] ఈ భావములన్నియు పక్షపాత యుక్తములే. అవచి తిప్పయ వంటి వారెందరో యుండలేదా ?

కట్టె లమ్మకము:-

ఆ కాలములో అడవి సుంకాలుండెను. కట్టెల నెత్తిమోపు కింత యని తీసుకొనెడివారు. మొదలే సుంకము చెల్లించి అడవిలోనికి పోవలసియుండెను. ఒక బీదవాడు కట్టెలకై పోయిన విధానమిట్టిది:-

          "వలనగు పుట్టగోచి బిగు వాళ్ళును సుంకపు కాసులున్ విభా
           సిలు కరసాన గొడ్డలియు, చిక్కమునన్ సొరకాయ బుర్రలో
           చలిదియు నుంచి.......నరిగెన్ గహనంబునకై రయంబునన్.[60]

బిగువాళ్ళు అనునది నిఘంటువులలో లేదు. బిగువగు వార్లుకల చెప్పులని యర్థము. భోగస్త్రీలు:-

భోగముయువతులు బుధ శనివారములందు శిరస్స్నానము చేసెడివారు. మినుపపిండి నలుగుగా వాడెడివారు. "తల నిమ్మపండ్ల జొబ్బిలపిండి, సీకాయ బులిమి, తైలపు జిడ్డువోవ దువ్వి" తర్వాత మడుగు వల్వలు ధరించి అలంకరించుకొనెడివారు. [61] బీదవారు నూనెపోవుటకు "అటకలి" రుద్దుకొనెడివారు. (శుక. 2-378.) జొన్నపిండిలో కలిబోసి ఉడుకబెట్టిన దానిని అటకలి యందురు. భోగము పడుచులు తొలిసారి దేవతా సన్నిధిలో నాట్యము చేసి తర్వాత నాట్యమును వృత్తిగా సాగించెడివారు.

           "తొలువినికి నభవుముందట నలికుం
            తల పుష్పగంధి యాడెడు ననుచున్
            కలయంగ పురములోపలపొల
            తుక చాటించె దిశలు భోరున గంగన్.[62]

(తొలువినికి పదము నిఘంటువులలో లేదు. మొదటిసారి సంగీతమును సభలో వినిపించి నాట్యమాడుటకు తొలువినికి యందురు.)

బోగంవారి పడుకటిండ్లు చాలా ఆకర్షణీయములు. బంగారు కాళంజి (తమ్మపడిగె), పూలపాన్పు, సకినెల పట్టెమంచము, కుంకుమ తలగడ, సురటి, నిలువు టద్దము, దంతపు వావలు మున్నగున వందుండెను.[63] తాపితా (పట్టు) పరుపు, పట్టుతలాడము (తలగడ), పడిగము, కంచు దీపపు కంబము, పట్టె మంచము ఇవి 'రతిధామము' లో నుండెడివి. [64]

ఎండకాలమందు బాటసారులు పడిన పాట్లు:-

          "చక్కెర చింతపం డొడిని, సందిట నేలకి చద్ది, మౌళిపై
           జెక్కిన కానుగాకు, వలచే జలకుండిక, వీజనంబు వే

          రొక్క కరంబువందు, పద యుగ్మమునం బిగివాళ్ళు గల్గి న
          ల్దిక్కుల నధ్వగుల్బడలి త్రిమ్మరి రట్టి కడిందియెండలన్."

(బిగువాళ్ళు అన బిగువగు వారులుకల చెప్పలని యిప్పుడే వ్రాసినాను కదా! ఇచ్చట "పదయుగ్మమునన్ బిగివాళ్ళు అనుటచే అదు సుస్పష్టమైనది, చక్కెర చింతపండు నోరెండకుండుటకు ఏలకి చద్దియన ఏలకి, మిరియాలు, అల్లము, సొంటి, ఉప్పు, తిరుగవాతకల దధ్యన్నమని యర్థము. నెత్తిన కానుగాకు చలువకై ఎండవడ (Sun-Stroke) తాకకుండుటకై పెట్టుకొందురు. కానుగాకు చాలా చలువ యిచ్చునది. క్షయ, తాపము కలవా రా చెట్టుక్రింద కూర్చునిన తాపము పోవును. తెలంగాణమందు ఎండకాలమందు కూలిపని చేయువారు తమ గుండు రుమాళ్ళలో తెంగెడాకు దట్టముగా పెట్టుకొని రుమాలను నెత్తిన అదిమి ఎంత యెండలోనైనను పని చేయుదురు. తంగేడాకు సులభముగా సర్వత్ర లభ్యమగును. కానుగాకు అరుదు. కానుగాకు తర్వాత తంగెడాకు పనికి వచ్చును. ఈ పద్యము కవియొక్క చక్కని లోకానుభవమును వ్యక్తీకరించినది.) పుణ్యము కోరువారు బాటలందు చలివేంద్రలు పెట్టి స్త్రీలను నీరుపోయుటకుంచిరి. కవులు స్త్రీలనే ప్రపాపాలికలనుగా జేసి సరసాలాడిరి. మన్మథుడను వేటకాడు నీటిపల్లములను కుండలనుంచి, అందు ప్రపాపాలికలను దీమములుంచి, వారి కటాక్షాలను వలలుంచి, పాంథమృగాలను బోయవలె వేటాడెనని కవి వర్ణించుటయు అతని అనుభవమునకు తార్కాణ.[65] వర్షాకాలమందు బాటసారులు బురదలో దిగబడి బాటతప్పి పొలమర్ల (జాడలు తెలిసినవారి) పిలిచి, నల్లరేగడిలో జారిపడి, ఎదురువానకు తలయెత్తక, ముందర కానక, జల్లుకు చెట్లక్రింద చేరి, వాన వెలసినతర్వాత వంగుళ్ళ (ఆకులనుండి జారు తటుకుల) వల్ల తడిసి జమ్ము గూడలపైన వేసుకొని చేతులలో చెప్పులను పట్టుకొని నానావస్థలు పడిరి.[66] ఇది జమ్ము సమృద్ధిగా పెరుగు కృష్ణాజిల్లాను సూచించును.

"శిఖినిండ తాయెతు చేరుచుట్టి"[67] అని కవులు పలుమారు వర్ణించినారు. శుకసప్తతిలోను ఇట్లే కలదు. తాయెతులు చేతికి మొలత్రాటికి మెడకు కట్టు కొందురు. జుట్లకు దండగా పలుతాయెతులు చేర్చి కట్టుకొనుట యనుటచే అదొక యాభరణ విశేష మయ్యెనో యేమో స్పష్టము కాదు. రాజుల వేటసాధనాలు పెక్కు.

          "వలలు సురుల్ సిడుల్ పిసులు వంకరదుడ్డులు పదిపోట్లు దీ
           ములు గొరకల్ తెరల్ జిగురు మోకులు బోనులు కాలియుర్లు బొం
           గులు మిడివిండ్లు బండగులు కొమ్ములు పాదులు వల్లెత్రాళ్ళు చి
           వ్వలతడికెల్ ధరించి యిరువంకలు జేరిరి కొంద రుద్దతిన్."

జింకలకు కొమ్ముటురులు పెట్టి తీసుకొని పోయిరి డేగలను తీసుకొని పోయిరి. పుట్టదెందు, చింబోతులు, తుపాకి, తుటారి, లకోరి మున్నగు పేరులు గల వేటకుక్కల వెంట నుంచిరి. వేటవేషాలతో ఆయుధాలతో రాజు, పరివారము బయలుదేరెను.[68](సాంబోపాఖ్యాన మందును ఇట్టి వర్ణనలు కలవు. చూడుడు ఆశ్వాసము 2, పద్యము 3 నుండి 25 వరకు.) శుకసప్తతిలో (రెండవ కథలో ) వేటను చాలా విపులముగా వర్ణించిరి. అభిలాషులు చూచుకొన గలరు.

         "మ్రోసెన్ గడియారమున మహాసంకులరవముగాగ యామద్వయ సం
          ఖ్యాసూచక ఘంటాధ్వని వాసర మదకేసరి ప్రవరగర్జితమై." [69]

అనుటచే గడియారాల ఆచారము విరివిగా నుండెనని తెలియవచ్చును. వైష్ణవాచారులకు అరవ పదవాసన, తిరుపదపూర్వకత, యొక విశిష్టత నాటికిని నేటికిని కలదు. భోజనము చేసినప్పుడు అన్న మనక సాదము అని, పరమాన్న మనక తిరుకణామధు అని, భక్ష్యాలు అనక తిరుపణార్యము అని ఈ విధముగా అన్నియు అరవముతోనే అడుగవలెను. లేకున్న వైష్ణవుడు మైలపడి పోవును. ఇది వైష్ణవము తెచ్చి పెట్టిన అరవ దాన్యము!

         "తిరుకట్టె సేవ జేసెద తిరుమాళిహ నలికి పూసి తీర్చెద ముగ్గుల్
          తిరువంజనంబు దీర్చెద తిరుపుట్టము లుతికి వేగ దెచ్చెద దినమున్."

తిరుకట్టె సేవజేయుట అనగా ఊడ్చుట. తిరుమాళిహ (తిరుమాలె) దేవాలయము కాని, వైష్ణవభక్తుల యిండ్లుకాని యని యర్థము. తిరువంజనము (తిరుమజ్జనము=స్నానము.) తిరువళకు (తిరువెలుగు=దీపము) అని వారందరు.

          "కూరలు నన్నము, తిరుపణ్యారము పచ్చళ్ళు తిరుకణామధు మధురా
           హారములు నవ్వధూటికి సౌరుచి ముప్పూట లునుప సాపడ బెట్టున్"

          "స్నామి యల కంచినుండిట మీ తిరువడిఘళాశ్రయించుట విని"[70]

అనుటలో తిరువడిఘళ్ అన పాదములు అని యర్థము. విప్రనారాయణ చరిత్రలోను తిరువీసము, తిరుపావులు, తిరువందేరములు (భక్ష్యములు) గండవడములు (తెరలు) మున్నగు అరవపదాలు వాడినారు (5-8, 12) శ్రీవైష్ణవులకు గండవడములు, తిరుమణిపెట్టె, విరులగడి (బుట్ట), కావి వేష్టువ (థోవతి), జింకతోలు, ఊర్ధ్వచూర్ణకరండము, తులసి వేరు "అధ్వ ఖేదాపహంబైన దవిత్రము," కుశాస్తరణము ముఖ్యసాధనములు. (దవిత్రము తప్పు; ధవిత్రము అనవలెను. అనగా జింక చర్మముతో చేసిన విసనకర్ర అనియర్థము.)

దాసరిసాని వేషములో చీనిపడవ దానిమీద "ముసుగువడ జుట్టిన పైలకముద్ర[71] యొక విశేషము, పైలకముద్ర పదము నిఘంటువులలో లేదు. ఈపదము తర్వాత ఇదే వేషమును వర్ణించి కవి యిట్లు వ్రాసినాడు.

          "అడచి క్రొమ్ముడి బయల్పడకుండగా ఖండ
           శాటి యౌదలను మించగ బిగించి"

అనుటచే చిన్నబట్టతో నెత్తి కొప్పును ఎత్తి బిగించుట అని యర్థమగును. అందుచేత ఇదే పైలక ముద్రయై యుండును.

తాంబూలము వేసుకొనువారు పాన్ దానుల నుంచుకొనిరి. వాటిపై సన్నని తీగెలపని చేసియుండెడివారు. అందుచే వాటిని జాలవల్లిక లనిరి. "జాలివల్లికతోడ బాగాలు తెల్లనాకులు కైరవళ్ళు నెదుట బెట్టెను"[72] (కైర వడి=కాచులో పాలు, మొగలిపూల రసము వేసుకొని గోలీలుగా చేయుదానికి పేరు) (కప్పురపు వీడియంబును కైరవళ్లు నొసగె"[73] అనియు వర్ణించినారు. సంపన్నులు సంపెంగ నూనెతో తలంటుకొని మాష చూర్ణము (మినుప పిండి)తో రుద్దుకొని స్నానము చేసెడివారు.[74] గార చెక్కను దంచి బావులలో చెరువులలో కలిపిన చేపలు వాటిని తిని చచ్చితేలును.[75]

రాజులు భోగమువారికి (సంగీత నృత్యములను మెచ్చుకొని.) అటులే కవులకు, కళావిదులకు 116 లేక 1116 లు, మరియు ఇతర బహుమతులిచ్చి యాదరించిరి.

         "అపు డాచోళవసుంధరాధిపతియున్ నానార్ఘ్య భూషాంబరా
          ది పదార్థప్రకరంబు త్యాగమహిగా దీనారము ల్వేయూనూ
          ట పదార్లుం గృపచేసె.........."[76]

          నూటపదార్ల సంఖ్య ఇంచుమించు ప్రాచీనమగు తెనుగు ఆచారమే!

విందులలోని భక్ష్య భోజ్యాల వివరాలు పూర్వ ప్రకరణాలలో తెలుపనైనది. ఈ కాలమందును అట్టివే యుండెను. బావమరుదులవరుస వారు భోజన సమయాలలో వ్యంగ్యంగా ద్వ్యర్థిగా హాస్యాలాడుకొనిరని జుగుప్సాకరముగా సాంబోపాఖ్యాన మందు వ్రాసినారు. (అ. 5-289) అది కవితకు న్యూనత. విందులలో మొదట నేయిగలిపి తియ్యగూరలతో అన్నము తినిరి. తర్వాత మధుర వ్యంజనములు తర్వాత ఆమ్లసారశాకములతో అన్నము తినిరి. తర్యాత రసవరిపాకముల భుక్తితో, శిఖరిణితో, అటుపై పెరుగన్నముతో ముగించెడి వారు. ఇంతేకాదు, చాపట్లు, మాంసము కూరలు, బ్రాహ్మణేతరులలో పలల సారము (మాంసము పులుసు), మండెగలు, కుడుములు, మామిడిపండ్లు లేక ఆ ఋతువున దొరకు పండ్లు ఆరగించెడివారు.[77] శిఖరిణి అన సిగరి అనియు, నది "కొన్ని సంబారువులు చేర్చి పక్వముచేసిన మజ్జిగ యనియు" శబ్దరత్నా కరములో వ్రాసినారు. ఇది తప్పు. విక్రమోర్వశీయములో (తృతీయాంకములో)" అహమపి యదా శిఖరిణీ రసాలంచ న లభేతదైతత్ ప్రార్థయమాన: సంకీర్త యన్నాశ్వసిమి" (నాకు శిఖరిణియు తియ్యమామిడియు దొరక నప్పుడు వాటిని మెచ్చి కోరిక వెలిబుచ్చి ఆనందింతును.) అని తిండిపోతు విదూషకు డంటాడు. దానిపై రంగనాథుడను పండితు డిట్లు వ్యాఖ్యానించెను. "ఏలాలవంగ కర్పూరాది సురభిద్రవ్య మిశ్రితం దుగ్దేన సహ గాలితం సితాసంగతం దధిశిఖరిణీ త్యుచ్యతే దధ్యతిరిక్త పూర్వోక్త ద్రవ్య మిశ్రిత: పక్వకదళీ ఫలాంతస్పారోపి తత్పదవాచ్య:" అనగా ఏలకిపొడి లవంగముపొడి పచ్చకర్పూరము మున్నగు సుగంధ ద్రవ్యములు పాలలో కలిపి వస్త్రగాలితంచేసి తెల్లని చక్కెర కలిపిన పెరుగు కలిపితే అది శిఖరిణి యనబడును. లేక పెరుగుకు మారుగా అరటిపండ్ల ముక్కలు కలిపితే శిఖరిణి యగును. భారత దేశమందు వివిధ ప్రాంతములందు వివిధాచారము లీ శిఖరిణిలో కానవస్తున్నవి. మహారాష్ట్రులు పెరుగును బట్టలోకట్టి నీరేమియు లేకుండా ఒత్తి ఒక పాత్రకు బట్టకట్టి దానిపై ఏలకి, లవంగము, జాజికాయ, జాపత్రి పొడియు, కుంకుమపువ్వును వడియగట్టిన పెరుగును చక్కెరను వేసి కలిపి రుద్దుదురు. ఆ విధముగా వస్త్రగాలితమగు దాన్ని శిఖారిణి యందురు. రాయలసీమ ప్రాంతాలలో ఏలకి లవంగ జాజిపొడిని చక్కెరను మామిడిపండ్ల రసములో కలిపిన దానిని శిఖరిణి యందురు. వాల్మీకి రామాయణములో (అయోద్య 91-73) 'రసాలస్యదధ్న:' అని భరద్వాజుడు రాముని కిచ్చిన విందుపట్టికలో చేర్చినారు. దానిపై వ్యాఖ్యాతలు "శుంఠి పిప్పలి మిరియాలు ఏలకులు లవంగాలు తక్కోలము శర్కర అల్లము జీలకర్ర వేసి తాళింపుచేసిన పెరుగు" అని వ్రాసినారు. అదియు శిఖరిణియై యుండునా? పాండురంగ మాహాత్మ్యములో ఒలుపు పప్పులు కజాయములు ద్రబ్బెడలు ఒర్రచేపలు సగరులు మున్నగునవి కలవు. అంబళ్ళు అని విందుల పట్టికలో ఆముక్తమాల్యదలో, సాంబోపాఖ్యానములో, పాండురంగ మాహాత్మ్యములో ఇచ్చినారు తైదంబలి, జొన్నంబలి కాదు. పరమాన్నమువంటి చోప్యములని యర్థము.

వైష్ణవాదిస్వాములు చందనపు పావలు ధరించిరి. (విప్రనారాయణ చరిత్ర) రాజులు "పలుచని దంతపుందళుకు పాదుకలు" ధరించిరి. [78] కోమట్లలో ఓలియిచ్చు యాచారముండెడిది. ఒక కోమటి తన భార్యకై 100 మాడల ఓలి నిచ్చితి ననెను[79] శూద్రులలో సాధారణముగా 10 మాడల ఓలి యుండెను. (శుక. 3-137)

అంగమర్దనము చేసి జీవించెడివారు కొందరుండిరి:-

          కూలికి నూనెలంటి కల గూరలకై పొలమెల్ల జుట్టి పా
          ల్మాలక యాత్మ బంధుజనులం దరియం జని ప్రాతబట్టకై
          కూళతనంబునన్ ప్రభులకుం దనుమర్దన మాచరించుచున్
          వ్రాలుడు ప్రొద్దుతోడ గృహ వాటికి జేరు నతండు నిత్యమున్."[80]

ధనికులు తివాసీలపై కూర్చొనెడివారు. (శుక. 1-262) బురునీసు దుప్పటులు కప్పుకొనెడివారు, (శుక. 2-265) (బురునీసు పదము నిఘంటువులలో లేదు. మెత్తని మేలైన ఉన్ని కంబడిని బురునీసు అందురు. తెలంగాణాలోని కొన్ని తావులలో ఈ పదము వాడుదురు.)

వ్యభిచారము, చిన్నజాతులతో భుజించుట, బాందవ్యము చేయుట, దొంగతనము మున్నగు తప్పులకు కులంతప్పు పెట్టెడివారు.[81] యుద్ధము చాలించుటకు, సంధిచేసుకొనుటకు ఓడినవారు 'ధర్మధార' పట్టెడివారు. అనగా కొమ్మూదువారు. అంత ఉభయవర్గాలు యుద్ధము చాలించెడివి. క్రీడాభిరామములో వలెనే శుకసప్తతిలో 'విరహిజన మథనంబు మనసిజుండు పట్టించు ధర్మధారోదయంబును బోలికుక్కుటారవంబున అరుణోదయం బగుట యెరింగి'[82] అని వర్ణించినారు.

అప్పులవారని పొగడదండలతో శిక్షించిరి. (శుక. 2-16). దీనిని గురించి యిదివరలో చర్చింపనైనది. మరియు అప్పుల పోతుల నిలబెట్టి చుట్టూ గీతగీసి అప్పు చెల్లించువరకు ఆ గీటును దాటరాదని అప్పిచ్చినవారు శాసించెడి వారు.

          'ఆన మాయప్పు లీకపోతేని యనుచు
           ధరణి పంపున తొలుకారు తరువుకాడు
           నింగి గుడివ్రాసియాగిన భంగినపుడు
           చండకరుడుండె పరివేష మండలమున!'[83]

దొంగలను పట్టి "బొండకొయ్య" నుంచెడివారు.[84] రెండు పలకల తొలచి అందు రెండు కాళ్ళను పెట్టించి ప్రక్కలలో కట్టెకొయ్యను దిగగొట్టుదురు. అటులే చేతులకును తగిలింతురు. వాటిని బొండకొయ్య లందురు.

ముత్తైదువగా చనిపోవుటను "కడియంపు చేమీదుగాగ దివముసేరుట" యనిరి.[85] అనగా ముత్తైదువగా చనిపోయెనని యర్థము. నేటికిని రెండవభార్యను చేసుకొన్నప్పుడు ఆమెకు "సవతికడెము" అని యొక సన్నని కడెమునకు రెండు చుక్కలు పెట్టి ఆమె కుడిచేతికి పెట్టుదురు.

నంబులు గుడిపూజారులై జీవించిరి. గుళ్ళలో గన్నేరు పూవులు సమృద్ధిగా పెంచి వాటిని సంపన్నుల యిండ్ల స్త్రీలకిచ్చి ప్రతిఫల మందెడివారు. "ఊరినంబికి మోహ మూరించి తెప్పించి పూను మాపటి వేళ పూవుటెత్తులు",[86] "నరసిన సిగలోన నంబివాడిచ్చిన గన్నేరు పూవులు కొన్ని తురిమి" [87] అనుటచే నంబులవృత్తి కొంత తెలియ వస్తున్నది.

యతుల జీవనము లిట్లుండెను:-

           'త్రిషవణస్నానములు నిష్టదేవపూజ
            గ్రంథపారాయణము పరబ్రహ్మచింత
            భైక్షభుక్తి హరీతకీ భక్షణంబు
            ఆజిన శయనంబు గల్గి యయ్యతి వొసంగు.'[88]

"దశమాతా హరీతకీ" అని వైద్యశాస్త్రము. అది చాలా యుపయోగకారి. చక్కెర పాకులో మురబ్బాగా ఊరవేసిన కరక్కాయ దినమొకటి వంతున ఆరు నెలలు తింటే నరసిన వెంట్రుకలు నల్లనగునందురు. కాని పురుషులకు పుంసత్వమును క్షీణింప జేయుననియు నందురు. ఇచ్చట యతి దాన్ని సేవించుట పుంస్త్వమును తగ్గించుకొనుటకే:

బ్రాహ్మణుల యిండ్లలో 'ద్వారావతిగలంతి' చెంబులు (టూటీదార్ లోటా) లుండెడివి.[89] ఇప్పుడు మట్టిపాత్రలను బ్రాహ్మణు లెక్కువగా వాడరు. వేదకాలమం దవే హెచ్చు. 'మృణ్మయం దేవపాత్రం' అన్నారు. నేటికిని శుభా శుభ కార్యాలకు విధిగా మట్టిపాత్రలే వాడవలెను. తెనాలి రామకృష్ణుని కాలములో బ్రాహ్మణుల యిండ్లలో వంటలు మట్టిపాత్రలందే యెక్కువగా చేసిరి. ఒక బాపనమ్మ 'వార్ధా రాధౌతము కుండయూడ్చి యొసగెన్ రంభాపలాశంబునన్‌' అతిథి ఆ కుందెడు మాయంచేసి 'చూడు మీసారి భాండమో శోభనాంగి' అని కొసరెను. అపుడా యిల్లాలు 'నాథుడు పల్లియకేగి భుజింపకున్కి భరితంబయి అట్టుక నట్టుకట్టి యొప్పు నోదనం బొసగె తదాజ్ఞను శ్రావమూకుటన్‌' అటుకలోని యన్నమును మట్టి మూకుటి (చిప్ప)లో తెచ్చి వడ్డించెను.[90]

నిగమశర్మ ఆంధ్రుడుగానే నిరూపితుడు. ఆతని సోదరి పక్కా ఆంధ్రి. వీరితండ్రి 'కళింగదేశాభరణంబగు పీఠికాపురం బధిష్ఠించి సకల మహీసుసర్వ శ్రేష్ఠుండై వెలిసె'. నిగమశర్మ వ్యభిచారియై ఆస్తినంతయు పోగొట్టుకొన్న విధ మెట్టిదనగా:-

          'దినవెచ్చమునకై తన మేనగల సొమ్ము
               కొదుకక బచ్చింట కుదువవైచు
           ఇందు గీసిన రీతి నించుకించుక చేరి
               గిలుబాడు తల్లిపైగల పసిండి
           తండ్రికి నిడ్డపత్రములు దొంగలిపోయి
               పోయి నంతకునిచ్చి పొరయు గొంత
           మిండ వడ్డికి నోర్చి మృత్యురూపములైన
               సాహులచే ఋణగ్రాహియగుచు

         గుడ్డవృత్తులు.. కొలుచు, గుత్త చేలు,
             గ్రామాంసములు నాధినేల లెల్ల
         చనువరుల కమ్మజూపు నిచ్ఛావిహారవర్తి
             వాడేమి గానున్నవాడొ మీద'

ఆ కాలమందు పలువురి బ్రాహ్మణుల యిండ్లలో గ్రంథాలయము లుండెడివి. హర్షుడు తన వైషధమందు 'మూర్ఖాంధకూప పతనాదివ పుస్తకానాం' అని యుండెను. నిగమశర్మ అక్క 'పుస్తక భాండాగారంబు నిజభర్తృ హస్తాంతరంబున ఆశుశుక్షణి శిథిల బంధన యాచక ప్రముఖోపద్రంబులవలనం బాచి ప్రోచుచు' రక్షించెను. తాటియాకుల కట్టలకు ఆగ్ని శైథిల్యము, పురుగులు, యాచకులు, ముఖ్యశత్రువులు. నిగమశర్మ ఒకనాడు 'చలిది వంటకంబు గుడుపం జనుదెంచినప్పుడు' అతని యక్క 'నిజనందనుం జిరుతవాని మేనల్లుని నిందమని చంకకిచ్చి' ఎచటి కేగెదవు మీ బావ బంతి నారగింతువుగాక అని చెప్పి వడ్డించి పిమ్మట,

         "ఇంతలు నంతలు నగు తన
          సంతానము చంటవెంట సందడి సేయన్
          ప్రాంతమున నిలిచి తమ్ముని
          కుంతల బంధంబు విడిచి కుశలాశయయై"

          ఎలయు సీత్కారములతోడ నీళ్ళుగుక్కి
          యంటు సంటులు పరికించి యంట్లబొడిచె
          గోరు ముక్కుల దిగదువ్వి తూరుపెత్తి
          నెరుల గలిగిన పేల నన్నింటి దిగిచె

         "మెడమన్ను నలచి యలకలు
          ముడిగొని నిజ పాణిపద్మములు గరగరగా
          గడుగుగొని తనకు మరదలు
          విడె మొసగుచు పసిమి పసిడి వీవన వీవన్."

         "చేటికానీత పీఠీకాసన యగుచు
          పద్మకర్ణిక కొలువున్న పద్మవోలె

          కుడివలన నింత యోరగా కొమరు మెరసి
          బిడ్డ చనుద్రావ నిట్లను బిసరుహాక్షి"

       ప్రారంభించిన వేదపాఠములకున్ ప్రత్యూహ మౌనంచునో
       యేరా! తమ్ముడ1 నన్ను జూడ జనుదే వెన్నాళ్ళవో యుండి, చ
       క్షూరాజీవయుగంబు వాచె, నిను కన్గోకున్కి, మీబావయున్
       నీ రాకల్ మదిగోరు చంద్రుపొడుపున్ నీరకరంబుం బలెన్.'

అని తదీయ దురాచరణ స్మరణ సంతప్తస్వాంతయైస్వాంతయై ఇట్లనియె:-

       పడబడ బారుచున్ వడకు పట్టిన తల్లిని దండ్రి, నేలలో
       వెడలని తమ్ము గుర్రల, నవీన కులాంగన, నోరులేని యీ
       తొడుకుల, బంటుపైద; విడద్రోవక ప్రోవగ నెందు, నీక పా
       ల్పడినది కర్ణు నౌదలనె భారత సంహిత నిల్చుచాడ్పునన్.

అని యింకను కరుణాభరితముగా చక్కని యుపదేశ మిచ్చెను. ఇదంతయు అతి సుందరముగా బ్రాహ్మణ కుటుంబ జీవనమును వర్ణించిన ఘట్టము. ఈ నిగమశర్మోపాఖ్యానము ఉత్తమ రసపూరితమగు గాథ. మన చరిత్రకు చాలా పనికివచ్చునట్టిది[91] పాము కరచిన విష చికిత్సలను నానావిధములుగా చేయుచుండిరి. 'పాము కాటువేసిన తావున కత్తితో కాటుపెట్టి రక్తము స్రవింప జేయుట. ఘట పూర్ణ మంత్ర పుష్కరధార లెత్తించుట, పసరు నడినెత్తిన రుద్దించి బెత్తముతో నిట్టటు మోదుట, బిగించుకొనిపోయిన దౌడలలో కర్రుజొనిపి మందులుపోసి మంత్రాలు చదివించుట యనెడివి కొన్ని యవస్థలై యుండెను. (వేంకటనాథుని పంచతంత్రము 1-119,120.)

సంస్కృత పంచతంత్రములో లేనివై వేంకటనాథునిచే క్రొత్తగా చేర్చబడిన విషయాలను మాత్రమే చర్చకు తీసుకొందును. బహు విషయములను బహువర్ణనలను మూలములో లేనివి వేంకటనాథుడు తెనుగులో నెక్కువగా వ్రాసినాడు.

చలికాలములో జనులెట్లు జీవించెడివారో వేంకటనాథుడు చాలా చక్కగా నిరూపించినాడు. తాంబూలము, సొంటి, అగరు ధూపము, గొంగళ్ళు, దొడ్డు బట్టలు జనులకు ప్రియమయ్యెను. ఆరికకూడు, పుచ్చవరుగు, ఆవుల వెన్నతిని మజ్జిగ సద్దులతో రెడ్లు దున్నుటకు బోయిరి. (పంచతంత్రము 1-686 నుండి 688.)

వైదిక బ్రాహ్మణుని లక్షణాలను వేంకటనాథు డిట్లు తెలిపినాడు. నీర్కావి ధోవతి పింజపోసి, ధౌతోత్తరీయము వేసికొని గోపి చందనముతో ఫాలము నలంకరించుకొని బిళ్ళ సిగలో పూలు పెట్టి యుండెను. (పంచ. 5-244.)

గొల్లల జీవనమును వెంకటనాథుడు చాలా విపులముగా వర్ణించెను, 'ఒక గొల్లకు గొర్లమంద, ఆవులు, దుక్కిటెడ్లు, దొడ్డి, గరిసెలు ఉండెను. ఆ గొల్ల పెద్దకు కులబిరుదు 'బోయడు' అని యుండెను. అతడు అట్టలెత్తిన పాతచెప్పులు దొడిగి, అంబటికుండ మోసికొని, గోచిపెట్టి ములుగత్తి నడుమున కట్టి కొడిది పూసల మొలత్రాడు కలిగి, ఒడిసెల, పాలకావడి పట్టి బుజముపై గొంగడి వేసుకొని, పిల్లనగ్రోవి బట్టి యింటికి వెళ్ళెను. (పంచ. 1-598.)

ఆ కాలమందు లెక్కలు వ్రాయుటకు తాటాకులేకాక కాగిదాలమీద 'కోవలువడ' వ్రాసిరి. (కోవలు నిఘంటువులలో పిల్లలగొంతు జబ్బు అని వ్రాసినారు. ఇక్క డది సరిపోదు. కట్టలు కట్టలుగా వ్రాయుట అని యర్థము. పూర్వము కాగిదాలను ఒకదానికొకటి యతికించి వ్రాసి చుట్టగా చుట్టి యుంచెడి వారు. ఆ చుట్ట పదివారల వరకు కూడా పెరిగిపోయెడిది. మరొక విధము 'కడితము'లో వ్రాయుట. కడితము అన మసిపూసి గట్టన చేసిన చదరపు గోనెపట్టతో జేసిన లెక్క పుస్తకము. అని పాండురంగ విజయ టీకాకారులు వ్రాసినారు. గత ప్రకరణములో ఇట్టి విషయము చర్చించి ఇంచుమించు 40 ఏండ్ల క్రిందట పాలమూరు జిల్లాలో వ్యాపారులు కోపు బలపాలతో నల్లని పూతగల అట్టలపై వ్రాసి తుడిచి మరల వ్రాసుకొనుచుండిరని తెలిపినాము. అదే యీ కడితము; లేక కశితము, కడితము జేనెడు పొడవును ఆరే డంగుళముల వెడల్పును కల 5-6 అట్టలు కలిగి అవన్నియు మడుచుకొను నట్లతికించి చేసినట్టి వ్రాతకు సాధన మగునట్టి పలకము. ఇంచుమించు క్రీ.శ. 1920 వరకు ఇవి హైద్రాబాదు రాష్ట్రములో కోమట్లవద్ద వాడుకలో నుండెను. వృద్ధుల వలన నేను విచారించి తెలుసుకొన్నంత వరకు వాటి నీ క్రింది విధముగా సిద్ధము చేయుచుండిరి. ఒక బట్టపై లావు కాగిదములను రెండు ప్రక్కల అతికింతురు. లేదా లావు అట్టలను తీసుకొందురు. వాటిపై కట్టెబొగ్గును రాయుదురు. దానిపై కుంట గల్జర (భృంగరాజము) ఆకు రసమును పిండి ఆకుతో రాయుదురు. కొందరు ఆ పసరుతో గోందును కలిపి రాయుదురు. కుంటగల్జర లభించని పక్షమున బీర ఆకు రసము, అదియు లభింపని పక్షాన అముడుక అను పొలాలలో సమృద్ధిగా దొరకు అలమును దానిపై రుద్దుదురు. బొగ్గు, బంక, పసరు మూడును అట్టపై కలిసి నల్లని గట్టి పూత (paste)గా ఏర్పడును. అది బాగా ఆరిన తర్వాత దానిపై కోపు బలపము అను మెత్తని తెల్లగా వ్రాయు రాతి బలపముతో వ్రాసికొని తుడుచుచు వ్రాయుచుందురు. ఇప్పుడు నష్టకారులగు రాతిపలకలు, బలపాలు వచ్చినవి. పూర్వము కట్టె పలకపై వ్రాసుకొనుచుండిరి. విద్యార్థులు తమ కట్టెపలకలపైన పై గోందు, బొగ్గు, కుంట గల్జెర పసరును రుద్దుచుండిరి. ఇప్పుడు అట్టతో చేసిన కడితాలుకాని, కట్టె పలకలు కాని మోటై పూర్తిగా మాయమైనవి. పాండురంగ విజయములో కోవ, కడితము, కళితము, కవిలె అను పదాలు కలవు.[92]

అచ్చనగండ్ల యాటలు ఆడువారి యాటగానే యుండెను. నేటికిని అంతే (సాంబో. 2-121). కొన్ని వేశ్యవాటికలలో వందెములతో కూడిన ఆటలు పండుగల వేళ సాగెడివి.

          "కచ్చించి సొగటాలు గణకలతో కుక్కు
               టాండముల్ పణముగా నాడువారు
           ద్రవిణముపై పన్నిదము లొడ్డి మాత్సర్య
               గతి కోడి పందెముల్ కట్టువారు.
           నైచిత్రిగాగోల గాచి పన్నిదమాడి
               చెరుకుమోపులు లీల నరుకువాడు
           గురిచూసి యట కేగ పరతెంచునందాక
               నొసగిన భక్ష్యముల్ మొసగువారు
           ఆడ్యులై గోత్రశాలల నధివసించి వి
               టుల వేశ్యాజనముల చక్కటుల దీర్చు

          వారలును గల్గి శంబరివైరి సంతపేట
              యన నొప్పు నవ్వేశ్యలాటమునను"[93]

          (నైచిత్రికి వైచిత్రి యని యుండవలెనేమో?)

గొల్లపడుచులు పెరుగు, పాలు, వెన్న అమ్ముకొని జీవించెడివారు. అందు కొందరు 'దది తక్ర విక్రయంబు లుపదేశమాత్రంబులుగా జారాన్వేషణంబులు ప్రధాన కార్యంబులుగా సమీప జనపదంబుల నుంచి వచ్చియున్న యాభీర భీరువులై యుండిరి.' (శుక. 3-540)

వ్యవసాయము - వ్యాపారము

రాజులే కాక మంత్రులు, వారి భార్యలును చెరువులు కట్టించుచుండిరి' గుంటూరు మండలములో వంకాయలపాడు అను గ్రామములో గోపీనాథ సముద్ర మను చెరువును రామయభాస్కరమంత్రి సోదరియగు చిన్నాంబ కట్టించి, శా.శ. 1462లో శాసనము వ్రాయించెను.[94] అదే విధముగా కడప జిల్లాలోని సిద్ధవటము చెరువును శా.శ. 1527లో మట్ల అనంత భూపాలుడు కట్టించి శాసనము వ్రాయించెను. [95]

ఆ కాలపు వ్యవసాయ వ్యవస్థ ఆయగాండ్ల పద్ధతి, మిరాసీలు, మున్నగు వివరాలు తెలుపునట్టి తామ్రశాసన మొకటి కర్నూలు జిల్లా పెద బెళగళ్ళు గ్రామకరణం దర్మన్నవద్ద నుండు దానిని శ్రీ మానవల్లి రామకృష్ణ కవిగా రించుమించు 40 ఏండ్ల క్రిందట వనపర్తిలో ప్రకటించెను. అందలి ముఖ్య విషయాలను అందున్నట్లుగానే యిచ్చట నుదాహరింతును.

"శా.శ. 1414 లో శ్రీకృష్ణదేవరాయలు నాయకసమూహాన వచ్చిన ముమ్మడి రెడ్డినాయక మొదలైనవారికి మిరాశి, రెడ్డి మొరాశీలు యిచ్చిన వివరం:- గొల్లలు పాలెగాళ్ళు అయి, దుర్గాలు సగనీయక చాలా వుపద్రవం చేస్తూవుండగా వారిని మీరు గెల్చినారు కనుక మీకు చెరువు బెళగళ్ళు ఆదిగాను చామల గూడూరు కంభంపాడు తిమ్మనదొడ్డి మొదలైన షోడశస్థలాలకు అయినారు గనుక ఈ స్థలాలు సురక్షితంగా నడిపించి శ్రీ విరూపాక్షేశ్వరుని రాజ్యం ప్రసిద్ధి చేసేది. గ్రామాలకు పొలిమేరలు యేర్పాటుచేసి రాయసం వీరమరసును అంపించి శిలాశాసనాలు యేర్పరచిన వివరం.... యీ ప్రకారం పొలిమేరకు శాసనాలు యేర్పరచిన వివరం. బాగా బలవంతులు యెవరంటే.

         శ్లోకం. కరణం, ముచ్చి, కంసాలి, కుమ్మర, కమ్మర, గణక,
              శ్శిల్పక స్వర్ణ మృదయస్కార తక్షకా: | కసారకశ్చ
              భకార శ్చండాలవ్వితలం | తథా నికృష్ణ కార్తి
              కాంచిష్ఠో రజకశ్చ యథాక్రమం, ఏతే
              ద్వాదశజాతీనాం గ్రామభారస్య వాహకా:॥

కర్నూలుసీమలో అడవు లెక్కువగా నుండినందున విజయనగర చక్రవర్తులు మీరాశీ లిచ్చి కొన్ని సంవత్సరాలపన్ను తీసుకొనక ప్రజలను ఆకర్షించి అనేక గ్రామాలను నెలకొల్పిరి. కర్నూలు జిల్లాలోని అస్వరి గ్రామ కరణంవద్దనుండు తామ్రశాసనమందలి విశేషా లేమనగా:-

"శా.శ. 1412 లో సాళువ శ్రీ నరసింగరాయల అయ్యగారు ద్రోణాచలంభూమి, అశ్వంపురిభూమి అరణ్యమై యుండగాను ఇందుకు గ్రామాదులు ఆకారం అయ్యేటందుకు.........యేయే స్థలాలనుంచి యెవరెవరు వచ్చినా ఆ గ్రామాదులు ఆకారం చేస్తున్నారో వారిది కాణియాచ్చి మిరాసులని రాసులు చెల్లించగలవారమని కవులు వ్రాయించి యిచ్చి పంపిస్తేను మలకసీమలోను, గోరంటసీమలోను బిల్ల కల్లుబాణాల అమరువాలు శాతనకోట ధ్యావనకొండ...మొదలైన గ్రామాలనుంచి వచ్చిన అష్టాదశవర్గాలవారు ప్రజలున్నూ బారాబళ వంతులున్నూ, పౌరోహిత మఠపతి జంగాలు తమ్మిళ వారున్నూ, మేటి గొల్లలున్నూ, బోయవారున్నూ, నేశెగమళ్ళు (నేసేగౌండ్లు=సాలెవారు అని యర్థము) మొదలైన ప్రజలున్నూ.... వచ్చి చెరువు బెళగల్లు చేరి స్థాయిచేశి శ్రీరాయలయ్యగారి సముఖానకు వచ్చిన రాయలవారు అనిన వివరం......ఆగ్రామం యెవరు ఆకృతి చేస్తున్నారో వారివే మిరాసులు........యా వచ్చిన ప్రజల్కు గ్రామం చూపించి అష్టదిక్కుల భూమి పొలం యేర్పాటుచేసి, పొలిమేర యేర్పాటు చేసిన నిర్ణయం.........

మిరాసిదార్లను యేర్పరచిన వివరం రెడ్ల నిర్ణయం పాకనాటివారు జనులు భాగాలు 2, మోటాటివారిభాగం 1, నరవాటివారిభాగం 1 అంత 4 భాగాలు...... కరణాలు......కమ్మర, చాకల, మంగళ, కుమ్మర, అగసాల, తలార్లు, దేవళ్ళ పెద్ద దెవినడు, చిన్న దెవినడు (వింత పర్లు గమనించాడు.) మాదిగె, నాగపాగా తీమ్మపాగా (ఈ పేర్లునూ గమనించుదు), బేగారి, వీరు బారా బలవంతులు.

మాన్యాల నిర్ణయం:- బాలవిశ్వేశ్వరుడు అనాదీయుములైన విగ్రహములు గనుక తళిగె దీపారాధనకు మాన్యం యిచ్చినది నల్తుము బైరవేశ్వరునికి తూమెడు నిరస.

శివాలయ లింగానకు తూమెడు నిరస హనుమంతరాయనికి అయిదు తూములు, పోతరాజునకు తూమెడు యిరస దేవమాన్యంలు సరి, రెడ్డి మాన్యం-కరణాలు, తలార్లు, కమ్మర, వడ్ల, చాకల, మంగల, కుమ్మర, జంగం, తమ్మళ, దాసరి, మెరగౌళ్లు (ఇదేమి జాతియో)? నేశెగవుళ్ళు ఒక్కొక్కరి కింత అని నిర్ణయం చేసినారు) యీ ప్రకారం మాన్యాలు కాపులకు 5 యేళ్లు కవులు చెల్లిన తర్వాతను తూము 1కి అయిదు వరహాలు యేర్పాటు చేసినారము.'

రాయల కాలమునుండి నేటివరకు పన్నిద్ద రాయగాండ్లు స్థిరపడి క్రీ.శ. 1600 నుండి ఈ క్రింది వారుపన్నిద్ద రాయగాండ్లుగా లెక్కింపబడిరి. (1) కరణము, (2) రెడ్డి, (3) తలారి, (4) చాకలి, (5) మాదిగ (తనము చేయువాడు), (6) మంగలి, (7) వడ్ల, (8) కమసలి, (9) పురోహితుడు, (10) నేరడి, (చెరువులుండు గ్రామాలలో) (11) కుమ్మరి, (12) కమ్మరి, ఈ లెక్కలో తర్వాత మరికొంత మార్పు కలిగెను. ఇప్పుడు కమసలి, పురోహితుడు ఆయగాండ్లలో చేరరు. రెడ్డి కరణాలకు తలార్లకు జీతాలు, స్కేళ్లు ఏర్పడినవి. కాన వారును ఈ పట్టికనుండి తొలగినారు. ఇప్పుడు నికరముగా మిగిలినవారు చాకలి, మంగలి, వడ్ల, కమ్మరి, చెరువు లుండుచోట నేరడి, మాదిగ, కొన్ని తావులలో కుమ్మరి. పూర్వము నుండియు కరణము లెక్కలు వ్రాసేవాడు.

              "గంటము ఖడ్గము తోడుత
               నంటున పగ దీర్పవలయు నవసరమైనన్."

అన్న వరుస వారు కరణాలు. కత్తులకు గంటములనే వారెదురొడ్డి పలుమారు గెలిచినవారు. 'రెడ్డధికారియైన గ్రామరైతుల జెరచున్‌' అన్న సూక్తిని స్థిరపరచినవారు రెడ్లు. ఆ కాలమందు గ్రామాలకు పంచాయతి సభ లుండెను. ఆ పెద్దలే పన్ను వసూలు చేసెడివారు. గ్రామ తలార్లే పోలీసువారు. న్యాయ స్థానాలు పంచాయతీ సభలే:

వ్యవసాయకులు పశుల తలుగులకుగాను మర్రియూడలను గూడ తెచ్చి త్రాళ్ళు వేసెడివారు.

         'ఈ రీతి నుండి యొకనా డారెడ్డన పసికి దలుగు లమరించుటకై
          నారలు గావలెనని పొరుగూరికినై పోయె మర్రియూడలు దేవన్‌'[96]

వ్యవసాయకులలో ముఖ్యులు రెడ్లు. సాధారణపు రెడ్లు స్వయముగా 'చేని పాటుపడి' పండించేవారు. మధ్యాహ్నము వరకు శ్రమించి 'యింటి కేగుదెంచిన తరి దాలి తోకపయి చేర్చిన కాగుల నీటి'తో స్నానం చేసి 'బొడ్డు గిన్నెలో రాగిసంకటి' తినేవారు,[97] వ్యవసాయకుకు పాడియు బాగా ఉండెడిది. అమావాస్యలందు సేద్యములు చేయకుండిరి. (రుక్మాంగద 2-43). నేటికిని అనేక ప్రాంతాలలో ఈ ఆచారమున్నది.

వ్యాపారాన్ని ప్రధానముగా కోమట్లే సాగించెడివారు. ఇంతకు పూర్వము అరబ్బులు, ఈరానీలు, చీనావారు, బర్మా, మలయా, పెగూ, కాంబోడియా, ఇండోనీషియా, సింహళము వారు మన దేశముతో వ్యాపారం చేసిరి. కృష్ణరాయల కాలములో పోర్చుగీసువారు దిగిరి. ఈ సమీక్షా కాలములో ఫ్రెంచి (పరాసులు, పరంగీలు), ఇంగిలీషులు కూడా దిగిరి. వారితో మన బేరులు బేరాలు చేసిరి. 'ఇంగిలీషుల ముఖాములు' (వ్యాపారస్థానాలు), 'విచిత్ర వేష భాషాభిరాములగు పరంగుల' ముఖాములును సముద్ర తీరాలలో నుండెనని కదిరీపతి మొదటి కథ తెలిపినాడు. ఏయే దేశాలనుండి యేయే వస్తువులు దిగుమతి యగుచుండెనో మనకు చాలావరకు తెలియవచ్చినవి. తెలిదీవి(?) నుండి పద్మరాగములు, ఈళా దేశమునుండి నీలములు, మక్కానుండి తివాసులు, షీరాజ్ (ఈరాను భాగం) నుండి వచ్చిన సిరాజులు (కత్తులు), 'అల్లనేరేడు వాగు జలముల నైన యవి యపరంజి లప్పలు (జంబూ ద్వీపము అనగా కాశ్మీరములోని జమ్మానుండి వచ్చిన బంగారు), కట్టాణి పూసలు (కట్టాణి శ.ర.నిఘంటువులో లేదు. ఆంధ్ర వాచస్పత్యములో ఒక విదమగు బంగారు అని వ్రాసినారు. కట్టాణి అను అయిదు బంగారుగుండ్ల అయిదు వరుసలుకల కంఠాభరణమును ఇప్పటికిని వాడుదురు. అదే విధముగా కంఠహారముగా వాడు ముత్యాలను కట్టాణి ముత్యాలందురు) కాశ్మీరపు కుంకుమపూవు, మలయగిరినుండి శ్రీగంధము, ఓడలపై వచ్చిన పోకలు (అనగా జవా, సుమిత్రాదీవులనుండి వచ్చినవి). గోవ (రేవులో దిగిన) తేజీలు, దిగుమతి యగుచుండెను.

ఇవిగాక రత్నాలు, ముత్యాలు, ఏనుగులు, కస్తూరి, సపరపువెంట్రుకలు, జవ్వాది, గాజుబుడ్లలో పన్నీరు, పంచలోహాలతో చేసిన ఫిరంగులు, వెండి, పట్టుబట్టతో చేసిన విసనకర్రలు, కొల్లారుబండ్లు, పింగాణి విండ్లు, రాతిపిడుల బాకులు, చలువరాతి గిన్నెలు, బానిసలుగా కొన్న యువతులు మున్నగునవికూడా దిగుమతి యయ్యెను.[98] (స్త్రీలను విదేశాల నుండి కొని తెచ్చుటనుగూర్చి ఇతర కవులును తెలిపినారు.) పాదరసము, జాజికాయ, యింగువ, లవంగాలు, పంచలవణాలు, గంధకము, కొచ్చి వేపులు (కుక్కలు) కూడా దిగుమతియయ్యెను.[99] వ్యాపారులు బేరాలకు వెళ్ళినప్పుడు బెత్తపు బుట్టలు, ఇతర పరికరాలు, గూడారాలు తీసుకొని వెళ్ళిరి.[100]. 'ఈళయు, నిళిందము, బంగాళ యు మొదలైన పేర్లు గల దీవుల' నుండియు సరకులు దిగుతుండెను. (శుక. 1-176) ఈళయు, విళింగయు అనియు నొకపాఠము కలదు. శుకసప్తతిలో మరొకచోట 'ఈళయు, ముమ్మెంగియు, బంగాళము, పైగోవ మొదలుగా బొదలెడు ద్వీపావళి' (3-7) అని వ్రాసినారు. ఈ రెండు పద్యాలలోని పాఠము తప్పుగా కానవస్తున్నది. శుకసప్తతికారుని తర్వాత 200 ఏండ్లకు అయ్యలరాజు నారాయణామాత్యుడను కవి హంసవింశతిని రచించెను. అందతడు అమాంతముగా శుకసప్తతిలోని పంక్తులు, పద్యాలు, భావాలు, విధానాలు అన్నీ స్వీకరిస్తూ వచ్చినారు. కావున పై పద్యాలకు సమానమగు పద్యము హంసవింశతిలో దొరకిన మనము సరియగు పాఠమును నిర్ణయించుకోవచ్చును. హంసవింశతి ప్రథమాశ్వాసములో 112 వ పద్యమిట్లున్నది:

         "ఈడము, వళంద బందర, యింగిలీషు కళము, మొదలైన పేటల
          గౌరలెల్ల సౌరభ ద్రవ్యములు బేరసారమాడ బిలువనంపిరి తమతమ
          పేటలకును"

ఈ పద్యములో మొదటిపంక్తినిబట్టి శుకసప్తతిలోని మొదటి పద్యపాఠ మిట్లు దిద్దుకోవలెను. (కళము అన కొల్లం (Kollam) మలబారు తీరముది) ఈళము, వళందయును, బంగారము మొదలైన పేరుగల దీవులలో" - 'ళ' 'డ'కు భేదములేదు. ఇచ్చట 'ల'కు ప్రాస కుదురవలెను. కాన ఈడెమునకు మారు ఈళము అని వ్రాసినాడు. కవిత్వము కాన ఈళమును ఈళ కూడా చేసినాడు. అయితే ఈ సవరణలోని విశేషమేమి ? మనకు వాటిజాడ కొంతవరకు తెలియవస్తున్నది. ఈడము అనగా ఏడన్ (Aden) అను అరేబియా రేవు అచ్చటినుండి బహు ప్రాచీనమునుండి దక్షిణాపథ తీరాలలో వ్యాపారము సాగుతుండెను. వళండ అనగా హాలెండు దేశము. ఆ దేశమువారిని డచ్చివారందురు. వారు ఇంగ్లీషువారికంటె ఫ్రెంచివారికంటె ముందు మన తీరాలను తగులుతూ విశేషముగా ఇండొనీషియా దీవులలో వ్యాపారము చేసిరి. అచ్చటి అంబాయినాలో ఇంగ్లీషు వర్తకులను వధింపగా, ఇంగ్లీషుపీడ మనదేశానికి వచ్చెను. డచ్చివారిని మనవారు వళందులన్నందున వారిదేశము వళంద దేశమని కదిరీపతి అన్నాడు. కదిరీపతికి ఈడము, వళంద అంటే తెలిసియుండును. అతన్ని అనుకరించిన నారాయణ కవికి తెలియకపోవచ్చును. కాని అతనిపాఠము మనకు చాలా సహాయపడినది. శుకసప్తతి తప్పుపాఠాలను సరిచూచువారు హంసవింశతిని బాగా చదివి దృష్టిలో నుంచుకోవలెను. శుకసప్తతి రెండవ పంక్తి అట్లే యుంచవలెను. అందలి పైగోవ అనగా పెగూ దేశము.

కోమట్లే కాక 'గుత్తగొల్లలు' కూడా కొంత వ్యాపారము చేసిరి. (శుక. 1-175) పటలాంశుకములు (శుక. 3-7) దిగుమతి యయ్యెను. పటల శబ్దానికి నిఘంటువులలో ఇంటికప్పు, నేత్రరోగము, పరివారము, బొట్టు అని యర్థాలిచ్చినారు. ఇవి సరిపోవు. అంశుకమన వస్త్రములుకాన పటలాంశుకములన ఒకవిధమగు వస్త్రమను నర్థము కావలెను. శబ్దకల్పద్రుమములో పటలమునకు పరిచ్చదము (కప్పుకొను వస్త్రము) అని యర్థము వ్రాసినారు. అదిచ్చట సరిపోవును. తెనుగు నిఘంటుకారులు దానిని ఇంటికప్పునకు మాత్రమే అన్వయించినారు. పన్నీరునకు పర్షియా దేశమే ముఖ్య స్థానము. ఆ దేశమే గులాబీ పూలకు అదిజన్మస్థానము. అచ్చట యివి కొల్లలు పచ్చకర్పూరము, హారతి కర్పూరము తూర్పుదీవులనుండి వచ్చెడివి. పారువాతిన్నెలు కూడ అమ్మిరట : (శుత. 3-7) అంటే యేమో నిఘంటులలో లేదు.

బండ్లకు బాటలు యోగ్యముగా లేనందున వ్యాపారము గాడిదలపై, గిత్తలపై, గుర్రాలపై సాగుచుండెను. గుర్రాలపై సరకులతో నిండిన పెరికలెత్తి పంతసంతలకు తిరునాళ్ళకును త్రిప్పుచుండిరి. ఒక గుర్ర మిట్లు వాపోయెను.

          "పెరికయే చాలు నానడ్డి విరుగ జేయ
           దానిపై దాను నెక్కు........"[101]

        "బరువులెత్తిన యెద్దుపై" కూడా వ్యాపారము చేసిరి. (శుక. 2-549)

ఆ కాలములో వ్యవహారములు పలువిధములగు నాణెములలో జరుగు చుండెను. అందు మాడలకే యెక్కువ ప్రాముఖ్య ముండెను. ఓలికి మాడలే ముఖ్యము. మాళ్ళబిందెలను జనులు పూడ్చి దాచుకొనెడివారు. (శుక. 1-495) రూకలు (శుక. 2-25) కూడా విరివిగా వాడుకలో నుండెను. ఒక రూక విలువను దాన్ని పోగొట్టుకొన్న గొల్లది యిట్లు తెలిపినది.:-

        "వెలుపల వడ్డి కిచ్చినను వీసము వచ్చును, వట్టు లాయెనో
         బలుల వేగ వచ్చునల బాపని కిచ్చినయట్టు లాయెనో
         అలయక నాల్గుచట్ల పెరు గమ్మిన రాని.......రూక, నా
         వలె నల సంతలోన బడవైచినవారల గాన నెచ్చటన్.
                                                శుక. 2-58.

మరియు పుట్టికనిండుగా ఒకరూకకు బియ్యము లభించెడిది. (శుక. 2-566) కల్లుద్రావు స్త్రీలు "తమ మునిచెరుగులందు కాసుదుడ్డును బంగారు పూస వెండితునక మొదలింటి చిఱువాడు గొనినదెల్ల గొనుచు" గుట్టుగా వెళ్లెడివారు. (శుక. 3-117.) (చిఱువాడుపదము నిఘంటువులలో లేదు.) మినుకులు, టంకాలు, దీనారాలుకూడా వాడుకలోనుండెను. పైకమును జాలెలలో నుంచుకొనిరి. (శుక. 2-216). వాటినే వల్లము, వల్లువము అనిరి. (శుక. 2-365). మాసములలో 'చిట్టి' యొకటి "చిట్టెడు నూనె" నెత్తియంటు కొనుటకు సరిపోయెడిది. (శుక. 2-381) చిట్టిపావును, చటాకులో నర్థమును చిట్టెడందురు. మానికలు, తూములు, ఇరుసలు, ఖండి (పుట్టి) అనునవియు వాడుకలో నుండెను. "ఇనుపకట్ల మానియింతలు" ధాన్యంకొలతలకు వాడిరి. (శుక. 2-360)

శుకసప్తతిలో ఆడిదము, ఖండా, కత్తి, దునేదారి, బాకు, జముదాడి, రాబా, అను ఖడ్గబేదములను తెలిపినారు. దునేదారికటారి (శుక. 2-364) అన రెండు దిక్కుల ధారకల (ద్విధారా) ఖడ్గమై యుండును.

పంచాయతి సభలు

తమిళదేశమందు క్రీ.శ. 800 నుండి పంచాయతి సభలు గ్రామగ్రామమందు స్థిరపడి యుండెను కులంవివాదాలు, సంఘసంస్కారపు కట్టుబాట్లు, నేరముల విచారణ, పన్నుల వసూళ్ళు గ్రామముఖ్యులే చేయుచుండిరి. ఏడాది కొకమారు గ్రామస్థు లందరును చేరి పెద్దల నెన్నుకొనుచుండిరి. వారే అన్ని తీర్పులకును ఆధారభూతులు. అ పద్ధతులే తెనుగుసీమలోనూ క్రమక్రమముగా బలపడెను. తెనుగు సీమలో ఎన్నికలు మాత్రమున్నట్లు కానరాదు. తలార్లు అపరాదులను పట్టెడివారు. రాత్రి వారు గ్రామమందు కోలదివిటీలతో సంచారము (గస్తు) చేసెడివారు. రాత్రి తప్పెట (తముకు) వేసిన తరువాత జనులు తిరుగాడ కూడదు. అనుమాన మున్నవారిని రాత్రియంతయు తమ ఠానాలో బండకొయ్య తగిలించి కూర్చోబెట్టి తెల్లవారినతర్వాత వాడు "అచ్చో, ముచ్చో" తేల్చుకొని అపరాధి కాకున్న వదలివేసెడివారు. (శుక. 3-204) వెండి బంగారు దొంగతనమైతే మొట్టమొదట తలార్లు కమసాలివారిని పట్టి విచారించి వారికి దొంగసొత్తులు వచ్చిన తెల్పుడని యొప్పించెడివారు.

         'కందును రాగియు వెండియు
          గాంచనమును మౌక్తికాదికములగు మణులున్
          పంచాణము వారిండ్లకు
          గొంచక కొనవత్తు రమ్ముకొనుటకు చోరుల్.'[102]

అందరికంటే ధనికుడు తీర్థస్థలాలలో నుండు దేవుడు. అతని సొత్తులు పలుమారు దొంగతనమయ్యెడివి అప్పుడు:

         "బడిపనులవారి గొల్లల గుడినంబుల జంగవరుస గొని చేకొలదిన్
          బడిమారు త్రిదండమున నెడమ కుడిన్ నారసింహ మెత్తినరీతిన్.
          ఇట్లు కోలాహలంబుగా పెట్లబెట్టి వీక నందర నచట వొయ్యాకచేసి"[103]

బాధించెడివారు. (బడిపనులవారు, జంగవరుస, బడిమారు అను పదాలకు నిఘంటువులలో అర్థాలు లేవు. బయ్యాకనో, నొయ్యాకనో దీనికిని అర్థము లేదు.

దొంగ దొరికిన తర్వాత సాక్షులతోసహా తలార్లు, వారి అధికారులు దొంగను 'సభ'లో విచారణకు తీసుకొనిపోదురు. సభాసదులు గ్రామముఖ్యులే! వారు సాధారణముగా ధర్మశాస్త్రాలు, వేదాలు తెలిసిన బ్రాహ్మణులుగా నుండవలెను. వారు తమ పంచాయతీ సభను ఊరుమధ్యనో, ఊరిముందో, దేవాలయముముందో ఉండు రచ్చకట్టపై చేయుదురు. గ్రామ జనులున్నూ వచ్చి ప్రక్కను కూర్చుని విచారణను వినెడివారు. పంచాయతి విచారణ యెట్లుజరిగెనో విప్రనారాయణుని విచారణ నుదాహరణముగా తీసికొనిన తెలియరాగలదు. రంగనాథుని గుడిలో బంగారుగిన్నె దొంగతనమయ్యెను. ఒక కంసాలి అది బోగముదానియింట కలదని జాడ తెలిపెను. కత్తులు కట్టెలు పట్టుకొని తలార్లు దానియింటి కేగి 'పరివారజననివహంబునం దద్గృహంబు శోధీంపందగు, వారిబనిచినం జని వారును' ఇల్లంతయు వెదుకగా ఒకచోట చందనపు పెట్టెలో గుందనపు గిన్నెను తీసి తలవరియెదుట బెట్టగా వారు గిన్నెను, బోగముదానిని తీసుకొనిపోయిరి. అప్పుడు బోగముదానితల్లి 'అయ్యా! మాకు దీనిని విటు డొక డిచ్చెను. వాడు మా యింట నున్నా'డని యనెను. అన విని యత్తలవరి యతనిం దోడితెండని నిజభృత్యులం బనిచినం జని వారలు విప్రనారాయణునిం గనుంగొని,

          దండము దండ మి దెవ్వరు తొందరిదిప్పొడులు గిన్నె దొంగైనారో!
          రండిట!! వేంచేయుం డిదె దండ మిడన్ వచ్చినాడు తలవరి మీకున్,
          అని బహువిధముల సోల్లుంఠనముల నాడుచును దొంగనాసామీ! గొ
          బ్బున వేంచేయుం డనుచును జని యతనిం జియ్యగారి సమ్ముఖమునకున్.

"తోడ్కొని చని యత్తలవరి వారల నక్కనకపాత్రంబుతో జియ్యల కొప్పించిన నతండు వేశ్యం గనుంగొని యగ్గిన్నియ మీకు నేక్రియం జేరె, నెరి

గింపు మనిన నవ్విప్రనారాయణునం జూపి ఈ దాసరయ్య తా నేడాదినుండి మా దేవదేవికి విటుడై వసించెను." ఆతనివలన లాభములేక వెడలింపగా ఒక చిన్న బమ్మచారిచేత గిన్నెను బుత్తెంచెననిన విప్రనారాయణుడు 'సభావితతి' కిట్లనెను. "నాకు శిష్యుడు లేడు. నేనేకాకిని. కాన ఇది అబద్ధము". వేశ్య ఇట్లనెను. ఆ వటుడు తనపేరు రంగడని చెప్పెను. ఆత డితని వలెనే యుండెను. మే మాడువారము. ఈ యరవ యింతపని చేస్తాడని అనుకోలేదు. ఆ యుభయుల మాటలు విని 'విద్వజ్జనముల నా జియ్య ధర్మసభ కూర్పించెన్.' ఇట్లు కూడిన విద్వత్సభా జనులు విప్రనారాయణుని నిందించిరి. అచ్చట విచారణ వినుటకు గూడిన ప్రజలు తమలో నానావిధములుగా ముచ్చటించుకొనిరి. అప్పుడు జియ్యరు వేశ్యాంబ పలుకులను విప్రనారాయణు వాక్యంబులును సభాంతరంబున సవిస్తారముగా వారలకుం దెలిపి, ధర్మంబు లెట్లుండు ననిన వారలు తమలోన యిట్లు తర్కించుకొనిరి. 'వేశ్యలు బంగారుగిన్నె పొంది యితన్ని విడిపించినారు. ఇతడు కోవెలకు సదా వెళ్ళును. కావున యితడే దొంగ' అని నిశ్చయించి యవ్విప్రనారాయణునందు చోరత్వం బాపాదించి, సభాసదు లందరు నేకత్వంబున నత్తెఱంగు జియ్య కెరిగించిన విని యతండు దీనికిం దగిన శాస్తి యెట్లుండు ననిన వార లిట్లనిరి:

ధనముగొనుట యొండె తలగొరుగుట యొండె నాలయంబు వెడలనడుచు టొండె
గాని చంపదగిన కార్యంబు జేసిన జంపదగదు విప్రజాతిబతికి.

అని విజ్ఞానేశ్వరుని వచన మన్నది గాన నట్టిశాస్తి యొకటి యీయన కొనరింపందగు నయ్యనువున జేయించి పంపనగు నొండెడకున్. ధనము నెరయలేదు, తల మున్నె గొరిగించు కొన్నవాడు, గాన నున్న తలపులుడిగి సీమ వెడల నడుచుటె శాస్త్రోక్త శిక్ష యితనికట్ల సేయుడనుచు||

సభవారేకోక్తిగా నాడిరి.

అటుపై శ్రీరంగనాథుడు సభలో ప్రత్యక్షమై విప్రనారాయణుడు నిర్దోషియని చెప్పగా, 'బ్రహ్మసభయెల్ల నప్పరమ వైష్ణవోత్తమునికి బ్రహ్మరథము పట్టిరి' బ్రహ్మసభ యనుటచే పంచాయితీ సభ్యులందరు బ్రాహ్మణులని తేలినది[104]. ఈ విప్రనారాయణుని కేసు విచారణను బట్టి ఆనాటి పంచాయితీ విధా
_________________________________________________

నము స్పష్టముగా వెల్లడి యైనది. పంచాయతి విదానమును వేంకటనాథు డను మరొక కవి తన పంచతంత్రములో నొక కథయందు చక్కగా వర్ణించిన దిచ్చట సంగ్రహముగా తెలుపుట అవసరము.

"ఒక పుఠములో ధర్మబుద్ధి, దుష్టబుద్ధి యను అన్వర్థనాములగు కోమటి నేస్తగాండ్లుండిరి. ఒకనాడు ధర్మబుద్ధికి నొకచో 1000 దీనారములు భూస్థాపితమైనవి దొరికెను. ఆ సంగతి మిత్రుడగు దుష్టబుద్ధికి తెలుప, వాడు దాని నొక పొగడచెట్టువద్ద పొలిమేరలో దాచిపెట్టించెను. అదేరాత్రి ఒంటిగా దాచినచోటికి దుష్టబుద్ధి వెళ్ళి, బలికూడు చల్లి, ధనమును తీసుకొని కొన్నిదినాల తర్వాత మన నిక్షేపమును చూచివత్తమని ధర్మబుద్ధిని గొంపోయి అందు నిక్షేపమును గానక యిద్దరును వాదులాడి రచ్చకీడ్చుకొని చని 'నగరంబడి ధర్మంబునకొప్పి పిన్న పెద్దల గూడబెట్టిన ధర్మవేదు లుభయవాదుల నాలోకించి తమకింపక, రంతుసేయక, అడ్డంబు సొరక, ఇరువురు గలసిపలుకక, ఒక రొకరి పూర్వోత్తరంబులు తెలియునట్లుగా, మీమీ సుద్దు లుగ్గడింపుడనుటయు నందు ధర్మబుద్ధి కృతాంజలియై సభవారి కిట్లనియె. (ఇప్పటికోర్టుల నియమములు కూడ ఇట్టివే!) 'అయ్యా, నేను ఇతడును ప్రయాణించుతరి నేను ఒక నిష్కభాండమును కనుగొంటిని. స్నేహితుడని యితనికి తెలుపగా నొక చెట్టువద్ద సంకేత మేర్పరచి భూస్థాపితము చేయించెను. ఇతడే కొన్ని దినాలతర్వాత నిక్షేపక్షేమమును చూచి వత్తమని పిలుచుకొనిపోయి చూడగా నది లేకుండెను. నేను దొంగనని నాపై తప్పుపెట్టి యీ సభకు తెచ్చినాడు. ఇంతియయని ధర్మబుద్ధి యూరకుండె, నప్పుడు దుష్టబుద్ధి ధర్మాసనస్థులకు ప్రణామంబు లాచరించి యిట్లనియె. "చెట్టుసాక్షిగా ఆ ధనమును వీడే తీసుకొన్నాడు.

        'నా విని దర్మాధికృతుల్ వా వాదంబేల యేనువారము లెడ మీ
         రే వివరమునారవనా డావిష్కృత బుద్ధి దెలుపు డడుగును మగుడన్‌'

అని పేషీ వేసిరి. కాని దుష్టబుద్ధి అంతదూర మెందుకండీ; నేనిప్పుడే సాక్ష్యమిప్పింతుననెను. ఎవ్వరయ్యా నీ సాక్షియన ఏ చెట్టువద్ద ధనము దాచితిమో ఆ చెట్టే నాకు సాక్ష్యమిచ్చునని దుష్టబుద్ధి పలికెను. దానికి పెద్ద లాశ్చర్యపడి మరునాటికి కాలము నిశ్చయించిరి. దుష్టబుద్ధి రాత్రి తన తండ్రివద్ద చేరి చెట్టుతొఱ్ఱలో రాత్రియే దాగి మరునాడు పరిషత్తు పెద్ద లచ్చటికి వచ్చినప్పుడు తన పక్షముగా చెట్టు పలికినట్లు చెప్పుమని నిర్బంధించెను. ముదుసలి కుమారు నికి అన్యాయము కూడదని నిదర్శనముగా నొక కథను వినిపించెను. కుమారునికి కథలపై మనసుపోలేదు. కల్లలపైననే మనసు నిలిచి యుండెను. పోగాలము వచ్చినందున ముదుసలి కొడుకు నిర్బంధముపై రాత్రియే వెళ్ళి చెట్టు తొర్రలో దాగియుండెను. అంత ప్రొద్దుననే 'పిన్న పెద్ద లుభయవాదుల రావించి వృక్ష సమీపంబునకు వచ్చి యర్పించి అయ్యిరువురిలోన వంచకు డెవ్వడు చెప్పుమనిప్రాంజలులై నిలిచిన, ముదుసలి దర్మబుద్ధియె వంచకుడని తొర్రనుండి పలికెను. అందరును ఆ మాటకు వెరగందిరి. దుష్టబుద్ధి యానందించెను. విన్నవారందరు కరతాళములతో మెచ్చుకొనిరి. చెట్టేమి పలుకుటేమి; ఇందేదో కుత్సిత మున్నదని ధర్మబుద్ధి చెట్టు తొరటవద్ద మంట పెట్టించెను. దానితో ముదుసలి చచ్చి బయట పడెను. అప్పుడు రాజపురుషు లాదుష్టబుద్ధిని వీక్షించి "సెల్లు సెల్లముల కీక్షింప నిచ్చిన సొమ్ము మగుడ నీలేని కోమటి గులాను చేసేత విశ్వసించిన వారి వెచ్చపచ్చముల గీడ్పరచు వై జాతి తొండ!.......చెడగరపు డొక్క! యోరోరి సెట్టికుక్క!!" అని తిట్టి సొమ్ము ధర్మబుద్ధి కిప్పించి దుష్టబుద్ధిని కొరత బెట్టిరి.' (పంచ తంత్రము. 1-701) నుండి 764 వరకు.)

పంచాయతీ విధానమును సమగ్రముగా తెలుపు నీ కథ చాలా విలువకలది

కళలు

ముత్యాలవలె ముద్దుగా సుందరముగా వ్రాయుట యొక కళగా, ఒక ఘనతగా పరిగణించిరి. ఒక మంత్రియొక్క వివిధలిపి సౌష్ఠవమును శ్రీనాథుడు వర్ణించి యుండెను. "వేంకటోర్వీశు వ్రాయసములు వ్రాయు చాతుర్యమును" చంద్రభాను చరిత్రమందు పొగడినారు[105] గాజుకుప్పెలు, దంతపు బరణులు, శిల్పులు సిద్ధము చేయుచుండిరి. [106] వైష్ణవులు దశావతారాలు వ్రాసిన బిల్వకరండలలో తిరుచూర్ణ ముంచుకొనెడివారు. (విప్ర. 2-28) ఆట పాటలకు బోగంవారే ప్రధానధారములు. వారి సమ్మేళనమునకు మేళ మనిరి. [107] నేడును "బోగం మేళం" అందురు. వృద్ధవేశ్య, పాటపాడు యువతులు, నాట్యమాడు సుందరులు" మద్దెలవాడు, తాళము వేయువాడు, శ్రుతి మేళవించువాడు, వెనుక తోడందుకొని రాగమును సాగదీయువాడు వీరి సమ్మేళనము మేళ మగును. పాతర కత్తెలన నాటకాలలో నాట్యమాడు స్త్రీలు.

           "అధికతరమైన తెరతీసినంతలోన
            బిత్తరము చూపు పాతరకత్తెవోలె"[108]

       అనుటలో నాటక సూచన కలదు.

నృత్యములలో దేశిమార్గ పద్ధతు లుండెను. ఒక వేశ్య నేర్చిన నృత్యము లిట్టివి:-

       'మొగవరి' కట్టడ మొనవుకోలాటంబు చొక్కంపు మురుపులుచిక్కిణీలు
        బరపు బారడు బేసి బహుళరూపుల దగ బంధురగీత ప్రబంధవితతి
        వరుస పద్యము దేశి బంగాళ గీతంబు కొరుతికట్టడ బిందుకొచియకాడు
        పరశురాముడు వీరభద్రుడు కళ్యాణి చౌకట్ల మెకతాళిశబ్దమాది

           దేశిశుద్దాంగములయందు తీగెబోడి
           పటుతరంబుగ నిజపాద కటకయుగళి
           కఖిలపాత్రమ్ములును బొమ్మలగుచు
           వ్రేలపూన్కి వహియింపబొగదౌంచె పుష్పగంది'

పై పద్యములో చాలా పదాలు తెలియవు. కొన్ని అచ్చు తప్పులేమో? తర్వాతి పద్యములో జక్కిణియని యున్నది. చిక్కిణిలకు మారుగా జిక్కిణీలై యుండునేమో?[109] (మొగవర్రి=మొగ్గవాలుట యని యర్థమేమో? తక్కినవాటిలో చాలా పదాల కర్థము తెలియదు.)

          'చారణ బాగడ చర్చరీ బహురూప
              దండసాలాదిక ణాండికములు
           కందుక కోలాటకా సాట్యతాసఖ
              ప్రేరణ కుండలి ప్రేక్షణములు

           సూతముల్ పుహుడక శుద్ధపద్దతి
                చిత్ర పద్దతి ఘనదేశ పద్ధతులును
           కై లాట లంబక కరణైక తాళికో
                లాసాది గీత హల్లీసకములు
           నాదిగాగల్గునృత్యనృత్యైక్య ముఖ్య
               నాట్యవిధములుసూచించి నయ మెలర్ప
           జనులకెల్లను లోచనోత్సవముగాగ
               నాదెనాయిందముఖకొనియాడె జగము[110]

           (ఇందును కొన్ని పదాలు తెలియవు)

తాళాలలో జంపె ధ్రువాద్యాట తాళాలు విశేష ప్రచారమందుండెను. (జంపె, ధ్రువ, ఆది, అట తాళాలు)[111] గానము, హస్తాభినయనములలో అర్థాబినయము, వివిధ వీక్షణ విలాస విచిత్ర నటనలలో భావము, చరణ నూపురనాదములో తాళమానము చూపుచు లాస్యమాడెడివారు.[112]

          "నట్టువకాని యందము గాక వింతగా
           కోపులు కల్పించుకొనుచు నాడు" (శుక. 3-14)

       అనియు వర్ణించినాడు. (గాక అనక గాగ అనవలెనేమో!)

యక్షగానాలను గురించి కందుకూరి రుద్రయ్య వ్రాసినసుగ్రీవ విజయమను యక్షగానానికి శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు ఉత్తమ పీఠిక వ్రాసినారు. ఈ క్రింది దానినుండి కొంత యుదాహరింతును.

"తొలుత ద్రావిడభాషలో వెలసిన దృశ్యరచనలు కురవంజు లనబడినవి. కురవజాతివారి అంజె (అడుగు) కురవంజె అనబడును. చిందుగొండ్లి, అంజె ఇత్యాదులు నృత్య విశేషములు. పూర్వము మంగళాద్రి సింహాద్రి మొదలగు పర్వతాలమీద జాతరకాలాలలో అక్కడి యాటవికులు నృత్యములు చేయుచుండువారు. చెంచిక మున్నగునవి కురవంజులుగా వెలసెను. అవి తొలుత అత్యల్పముగా గేయభాగములును, విశేషముగా నృత్యమును, కలవై యుండెను. అవి సింగి, సింగడు అను పాత్రములు కలవై యుండెను. వీరిద్దరే కథాపాత్రములగుచుందురు. మూడవవాడు కోణంగి విదూషక స్థానీయుడు. సంస్కృత ధ్రువాగానమే కురువంజులలో దురు వనబడెను. నృత్యదృశ్యములు తర్వాత జక్కులవారు నగరములందు ప్రయోగింప జొచ్చిరి. సింగి సింగడు మారి రామనల సీతాది పాత్రలు వచ్చినవి. కాని వీనిలో ఆటవికరచనా సంస్కార సూచకముగా "ఎరుకతసాని" పాత్రము వెలసినది. జాతరలలో యక్ష గంధర్వాది వేషముల ధరించి వేశ్యలు ప్రదర్శించినవి కావునను నృత్య ధర్మము లధికముగా గలవి కావునను నివి యక్షగానము లనబడెను. కళావంతులలో నొక తెగకు నేడు జక్కులవారను పేరు కలదు. అప్పకవి యక్షగాన లక్షణాలు తెలిపినాడు. దానినిబట్టి చూడగా యక్షగానమందలి ప్రధాన గేయరచనములు రగడలో కొంత మార్పు జరిపి త్రిపుట జంపె ఏక అట అను తాళముల కనుగుణముగా కల్పింపబడినవి. ఏలలు జోలలు సువ్వాలలు ధవళములు వెన్నెల పదములు విరాళి తుమ్మెద గొబ్బి కోవెలపదములు ద్విపద త్రిపద చౌపద షట్పద మంబరులు మొదలగునవి యక్షగానాలలో చేరినవి. విజయనగర మధుర తంజావూరు రాజ్యాలలో యక్షగానములు మిక్కిలి ప్రబలెను. కృష్ణాతీరమందలి కూచిపూడి గ్రామమున సిద్ధేంద్రుడను యోగి యొకడు భాగవత కథలను, పారిజాతము, గొల్లకలాపము, మొదలగు పేళ్ళతో యక్షగానములుగా రచించి, శాస్త్రీయముగా ఆయూరి బ్రాహ్మణుల చేతనే ప్రదర్శనము చేయింప నేర్పాటు చేసెను. ఇంచుమించుగా తెనుగున 500 దాక లెక్కింపదగిన యక్షగానములలో సుగ్రీవవిజయ మొక ప్రశస్త కృతి రుద్రకవి క్రీ.శ. 1568 ప్రాంతమువాడు."

సుగ్రీవ విజయములో త్రిపుట, అర్థచంద్రికలు, ద్విపద, జంపె, కురుచ జంపె, ఆటతాళము, ధవళములు, ఏలలు అనునవి వాడినారు. నాలుగు తేట గీతలు, రెండు సీసములు, ఒక ఉత్పలమాల, ఒక కందము ఇందలి పద్యాలు. ఇదే ప్రకరణములో శుకసప్తతిలో ఎరుకలదానిని కొరవంజియని రనియు, అది తన మగడు "సింగడు" అని చెప్పుటయు సూచించినాను. యక్ష గధర్వ శబ్దాలు గానప్రాధాన్యమునకు వాడుదురు. యక్షగానము గంధర్వగానము అనునవి ప్రసిద్ధమైనవి. ఇప్పుడిప్పుడు పరదాలు సంస్కృతాంగ్ల నాటకపద్దతులు వచ్చినవిగాని 40 ఏండ్లకు పూర్వమువరకు యక్షగానాలకే ప్రాధాన్యముండెను. నేటికిని తెలుగుదేశపు పల్లెలలో చెంచులక్ష్మీ నాటకము బెడుదూరి హరిశ్చంద్ర నాట కము పారిజాతాపహరణము మున్నగు యక్షగానాలను ప్రదర్శింతురు. సాధారణముగా సవతి పోరుల కథలు యక్షగాన రచయితల కిష్టము. ఈ నాటకాలకు పర్దాలు లేవు. గజమెత్తుగా స్థలమునుచేసి దానిపై పలకలు వేసి వాటిపైదుముకుచు ఆడుచు పాడుచు ప్రేక్షకుల కానందము కలిగించేవారు. రెండు దివటీలు ఆ రంగమునందు వెలుగుచుండును. కొంతదూరమందలి యొక ఇంటిలో వేషాలు తీర్చేవారు. వేషాలు రాగానే రేలంపొడి దివిటీలపై భగ్గున మండించేవారు. పాత్రదారులు అర్దళము, నీలి మున్నగు రంగులను బాగాపూసుకొని కిరీటాలు భుజకీర్తులు పెట్టుకొని సిద్ధమయ్యేవారు. ప్రతివేషాన్ని తప్పెటతో తీసుకొనివచ్చి రంగమెక్కింతురు. ఆద్వనితో నిద్రించినవారు మేల్కొందురు. ఎవరయ్యా, స్వామీ, మీరు అని సూత్రధారు డడుగును. ఓరీ నేను ఫలానా, నీవెరుగవా అని పెద్ద పెద్ద బిరుదులతో తన ప్రశస్తిని తానే చెప్పుకొనును. మధ్య మధ్య ఒక హాస్యగాడు ఎంత గంభీర పాత్రమునైనను అల్పహాస్యముతో కొంచెపరచి ప్రేక్షకుల నవ్వించును. పలుమారు ఆ హాస్యములో బూతులుండును. సంగీతము నాగరికులను ఆకర్షించదు. నృత్యము కూడా పలుకలు విరుగు గంతుల సాముగానే యుండును. అయినా ఇవి పూర్తిగా మాయం కాకముందే నాటకాలాడించి పటాలు తీసి వివరరాలతో ప్రకటించుట మంచిది. జవాద్వీపములోని జాతీయనృత్యములను పలుమారు ఇంగ్లీషు పత్రికలలో కిరీటాలతో భుజకీర్తులతో నుండు వేషాలను ప్రకటింతురు. వాటిని జూచిన అవి మన యక్షగానాల వేషాల వలెనే ఉండును. జవాలో రామాయణ భారతకథలను నాటకములుగా ప్రదర్శింతురు. ఆ దేశానికి మనవారే యీ నాటకాలు తీసుకొనిపోయినారో లేక అక్కడే యక్షు లనే వారుండిరో వారినుండియే మనవారు గ్రహించిరో ఆ దేశ నృత్య చరిత్రను బాగాపరిశోదించిన తెలియగలదు. ఎరుకలు మనదేశమువారే కాని వారి భాష నేటికిని చెడిన అరవము. వారు అరవ దేశమునుండి వచ్చినారు. కొరవంజి అనువారు ఎరుకలసమానులైన కురువలో చెంచువంటి అటవికులోయైయుందురు. శుకసప్తతిలోని కురువంజి బదనికలు తన సింగడు అడవినుండి తెచ్చినవాటిని అమ్మెను. అనగా దానికి చెంచులకును సంబంధము కానవస్తున్నది. మొత్తానికి యక్షగానాలు అటవికులనుండి నాగరికులకు లభించిన గాన సమాయుక్త నృత్యప్రాధాన్య నాటకాలు. సంస్కృతములో ఉత్తమస్థాయి నొందిన నాటక విధానమును మనకాలమువర కొక్కరును అవలంబించికపోవుటజూడ యక్షగానాలముద్రయే గట్టిగా మనవారిపైబడి దానియందే వారి కభిమాన ముండె ననవచ్చును.

యక్షగానాలలోని పాటలకు అప్పకవి లక్షణాలు వ్రాసెను. ఆ పాట లేవనగా:- పెండ్లిపాట. లాలిపాట (రెండు లక్షణాలొకటే) శ్రీధవళము, సువ్వాలే, సువ్వి, అర్ధచంద్రికలు, ద్విపద భేదాలు, రగడలు, మున్నగునవి (ఉదాహరణాలకు అప్పకవీయము చతుర్థాశ్వాసము చూడవలెను.) ఈ పాటలలో పెండ్లిపాట, లాలి, ధవళాలు, సువ్వాలు, మంగళహారతులు, నేటికిని పెండ్లిండ్లలో పాడుదురు.

       'ఆ లలనామణికా గయ్యాళి యొకానొక్క వేళ నక్కరతో, సు
        వ్వాలున్ శోభనములు, ధవళాలున్ మొదలైనపాట లందగ నేర్పున్‌'[113]

అనుటచే ఆనాడు పల్లెలలో స్త్రీ లీ పాటలం దాసక్తి కలవారై యుండిరని యూహింపవచ్చును. శోభనములే శోబాన పాటలు (శుక. 3-349) గొబ్బిళ్ళపాటలు కూడా వ్యాప్తిలో నుండెను. గొబ్బి యనునది గర్బతద్బవమైయుండును. స్త్రీలు వలయాకారముగా చప్పట్లు చరచుచు పాడు పాటల గొబ్బిళ్ళు అందురు. (శుక. 2-434) శిశువుల నిద్రపుచ్చుటకు జోలపాటలు పాడిడివారు. (శుక. 3-450) బాపనమ్మల పాటలకు విశిష్టత యుండెనేమో!

        'మన్న పురుషు చెడనాడు మగువ మీద
         బోయిపులుగాసి పురువయి పుట్టుననుచు
         బాపనమ్మలు చెప్పినపాటమేలె యనుచు
         నేమందునిను దూరుకొనగ వెరచి'[114]

అని యొక చాకలిది తన మగనితో ననెను. ఏలపదాలను స్త్రీపురుషులును పాడుకొనిరి. ఇవెక్కువగా బ్రాహ్మణేతరుల పాటలే! (శుకసప్తతి. 2-172) ఏలపదవిధానమును సుగ్రీవవిజయమం దిట్లున్నది.

 
       1 భానువంశమునబుట్టి దానవకామినిగొట్టి
       పూనిసుఖము నిర్వహింపవా - ఓరామచంద్ర మౌనివరులు సన్నుతింపగాన్.

         2. రాతినాతిజేసి పురారాతి చేతి విల్లువిరచి
            భూతలేంద్రులెల్ల మెచ్చగా-ఓరామచంద్ర సీతను వివాహమాడవా.

లిపులను గురించి యొకమాట. నన్నయనాటి లిపిని ఈనాడు పట్టుమని పదిమందే చదువగల్గినవారు. కాకతీయకాలమునుండి శ్రీనాథుని కాలమువరకు మనలిపెవలె కొద్దిగా కళవచ్చినను తెనుగులిపి పరిణామావస్థలోనే యుండెను. పొక్కిలి శ్రీనాథుని కాలమువరకు కని పెట్టబడలేదు. క్రీ.శ.1500 తర్వాతనే అది ఏర్పడినది. అప్పకవి కాలమువరకుకూడ తెనుగులిపి మారుచుండెను. అప్పకవీయము ద్వితీయాశ్వాసములో 'దరశార్జ్గపిప్పల' సూత్రమున్నూ దాని తర్వాతి సూత్రమున్నూ హల్లుల స్పర్శరూపాలను స్వరగుణితమును తెలుపునవి. అవేటివో అర్థమగుటలేదు. పూర్వమువారికిని అర్థమైనట్లు తోచదు. అందుచేతనే వావిళ్ళవారి ముద్రిత ప్రతిలో 'ఈ ప్రాతలిపులు ప్రతిపుస్తకమున వేరువేరుగా నుండుటంజేసి వీరి కుదిరిక చక్కగా తెలియబడదయ్యె' అని వ్రాసినారు. నన్నయకు పూర్వము 200 ఏండ్లకు ముందునుండి శాసనాలు దొరకుతున్నవి. కావున ఇంచుమించు (క్రీ.శ. 800 నుండి నూరేండ్ల క్రిందటినుండి ముద్రణ ప్రారంభమగువరకు అక్షరాలెట్లు మారుతూ వచ్చెనో వాటి సమగ్ర చరిత్రను నిపుణులు వ్రాయుట చాలా అవసరము. అప్పకవి వ్రాతప్రతులు వీలైనన్ని సేకరించి అతని భావమేమో కనుగొని సరిగా ప్రకటింపవలెను. తెనుగులిపి సంస్కృత లిపినుండి యేర్పడినది. కావున ఆరూప పరిణామ మెట్లయ్యెనో తెలుపవలెను. తమిళమునుండి 'ఱ' యొక్క పూర్వరూపమును తీసుకొని దానిని డ, ళ, ఱ, ధ్వనులనుగా మార్చుకొన్నాము. ఎ, ఒ, చ, జ, లు ప్రాకృతమున కలవు. మహారాష్ట్రమున వాడుకలో నున్నవి. ఈ విషయాలన్నియు సమగ్రముగా చర్చించవలెను. అనగా ఒక ప్రత్యేకోద్గ్రంథ మవసరము.

ఈ ప్రకరణములు ముగించుటకు పూర్వము శుకసప్తతిలోని కొన్నిపదాలను గూర్చి మాసరకై తెలుపుదును కొన్ని యీ ప్రకరణములో నిదివరకే తెలిపినాను. శుకసప్తతిలో కొల్లలుగా నిఘంటువులలో లేని పదాలు కలవు. సీతారామాచార్యులుంగారు దానిని వద్ద నుంచుకొని తమకు తెలిసినవి మాత్ర ముదాహరించి తక్కిన శతాధిక పదాల నుదాహరింపకయే వదలి వేసినారు. వాచస్యత్యమందును అంతే! సూర్యరాయాంధ్ర నిఘంటులో సహితము చాలా

పదాలు లేవు. ఉన్నచోట క్రీడా విశేషము, పక్షివిశేషము అని కలదు. నిఘంటువులలో లేనిపదాలు కొన్ని యిచ్చట సంగ్రహముగా చర్చింతును.

పసులగోడలు:- ఫార్సీలో ఫసీల్ ఆన కోటగోడ. కావున పెద్దగోడలను పసులగోడ యని యందురు(శుక.౧౩౯)

పైఠాణి=రవిక. (శుక.౧-౨౨౬) పైఠన్ పట్టణమందు సిద్ధమైనవి.

బండికండ్లు:- 'సెట్టితొత్తుల కేమో బాసలట బండికండ్లట చేసన్నట, విన్నవారు చెప్పిరి నాతో' (శుక.౨-౧౧౩) బాసలు చేయుట. సంకేతము చెప్పుట అని యర్థముండవలెను. ఆముక్త మాల్యదలో నీ పదమొకచో వ్రాసినారు. అక్కడను వేదంవారిచ్చిన అర్థము సరిపోలేదు.

బందారాకు:- 'గొంగడిముసుగుతో గొల్లులు చట్రాతిపైన బందారాకు కొసగ' (శుక.౨-౩౪౨) 'బందారు=ఒకానొక చెట్టు' అని శబ్దరత్నాకరము. అది చెట్టుకాదు; ఆలము; తీగె. తెలంగాణాలో బందాల ఆలము అందురు. అది పచ్చగా జడలుగా వానకాలమందు చేలలో ప్రబలి యుండును. నలిపినకొద్దీ సువాసన నిచ్చును. ఆ తీగెలను కూలిపడుచులు తమ కొప్పులలో నుంచుకుందురు నేటికిని ఆ యలము కల తావులలో వానాకాలమందు గొల్లలు దానిని పరచుకొని గొంగడి ముసుగుతన్ని వర్షము ఆగువరకు పండుకొందరు.

గాజుగడపినట్లు:-'గాజు గడపినట్లు దినము గడుపుచు నుండెన్' (శుక.౩-౨౪౩.) కష్టము గడిపినాడని సందర్భమునుబట్టి అర్థమగును. కాని యీ నుడికారమెట్టిదో తెలియదు.

గుడిముద్ర:- 'ఆడుదైనను గుడిముద్ర వైచికొనన్' (శుక.౨-౫౦౭) పూర్వము దేవాలయపు ఆవులకు కోడెలకు ముద్రలు వేసి విడిచెడివారు. ఆ ముద్రలను చూచి అవి కేవలం దేవునివే అని వాటి జోలికి పోకుండిరి.

ఈలకత్తి:-'వంటలక్క చిలుకం దరుగం..... ఈలకత్తి నలుగడ నెమకన్' (శుక. ౩-౫౭). ఇది నిఘంటువులలో లేదు. ఉత్తర సర్కారులలో, 'కత్తిపీట' అందురు. రాయలసీమలో, తెలంగాణములో వంటయింటి కూరగాయలు కోయుదానిని ఈలకత్తి అని సర్వ సాధారణముగా నందురు.

చింతాకు ముడుగుతరి :- (శుక. 1-533) మునిమాపు అని సందర్బార్థము. చింతాకు ముడుగుట అను ప్రయోగము కవి లోకానుభవమును, విశిష్టతను తెలుపును.

బడాపగలజూచి :- (శుక. 1-516) అదేపనిగా చూచి అని యర్థమిచ్చును. బహుశా ఇది బిగాబిగలయై యుండును.

సబ్బిణి :- (తెలియలేని సబ్బిణుల్ మీరు-శుక. 4-42) ఏమి తెలియని తిక్కవారు అని యర్థము.

ఏనుగుదిన్న వెలగ :- (నిరంకుశోపాఖ్యానం పుట 35) సుమతిశతకమందును ఇదే యుపమానము కలదు. ఇది సరిగా తోచదు. 'గజభుక్త కపిత్థవత్‌' అని 'గజమంటే ఒక క్రిమిజాతి' అని ఆ శ్లోకాన్ని ఉదాహరించినవారు వ్యాఖ్యానించినారు. ఇచ్చట అదే అర్థము తీసుకొనవలెను.

బొమ్మకట్టుట :- శత్రువులను అవమానించుటను బొమ్మకట్టుట లేక బొమ్మ పెట్టుట యందురు. ఈ యాచారము తెనుగు దేశములో ఎట్లు సృష్టియయ్యెనో చెప్ప జాలము. భారత కవిత్రయమువా రీపదమును ప్రయోగించినట్లు కానరాద్పు తిక్కనను ఎర్రాప్రెగడకును మధ్యకాలమం దుండిన నాచన సోమన మొద లీ బొమ్మకట్టుటను తెలిపినవాడను కొందును. 'పంతముతో దొహరమున బట్టుదు; పాసిక బొమ్మకట్టుదున్‌' (ఉ.హ. వంశము. 3-117) బొమ్మకట్టు ఆచారము రెడ్డి వెలమ రాజుల కాలములో విరివియైపోయినట్లు కానవచ్చును.[115] నేటికిని ఈ యాచారము తెనుగువారిలో నిలిచియున్నది. ఈ యాచారమును శ్రీనాథుడు స్పష్టముగా కాశీఖండములో (పీఠికాపద్యాలు 45) తెలిపినాడు.

          'డాకాలిగండ పెండారంబుదాపున
           బొమ్మలై వైరి భూభుజులు వ్రేల
           నిండుకొలువుండె కన్నుల పచు
           విభవుడల్లాడ భూసతి వీరవిభుడు'

ముసల్మానులు చేసిన చేయుచుండిన బీభత్సములనునైన తలపక రెడ్డి వెలమరాజులు పరస్పరము ద్వేషించుకొని యుద్ధాలు చేయుచుండిరి. ఒకరి నొకరు చంపుకొని వారి యాకారములుకల బొమ్మలు చేయించి తమ్మ పడిగలలో పెట్టించిరి. తమ బిరుదు గండ పెండారపు పగ్గాలకు శత్రువుల బొమ్మలను చేయించి కట్టించి అవి తమ మోకాళ్లవద్ద వ్రేలాడునట్లు చేసిరి.

వెలుగోటివారి వంశావళి (నేలటూరి వేంకటరమణయ్యగారి మద్రాసు యూనివర్సిటీ ఎడిషన్) నిండుగా బొమ్మ పెట్టుట బొమ్మ కట్టుట కాననగును.

      "కొమ్మని మచ్చ యౌబళుని గూల్చి శిరంబులు ద్రుంచి గన్నయన్
       పిమ్మట ద్రుంచి, తత్సుతుల బేర్చిన బొమ్మలు వెట్టి దారులన్
       దమ్మటముల్ వెసంగొనియె దాచయసింగని పట్టి యెట్టిడో
       బొమ్మలు వెట్టునిట్టు లనపోతడు వైరము బూనువారికిన్ (ప. 63),

"అ కొమార వేదగిరి నేడే యనవేమారెడ్డి తమ్ముని మాచారెడ్డిని గొట్టి తమ్మ పడిగాన బొదిగించిన, నా యనవేమారెడ్డి పిన వేదగిరిని జంపి తమ్మపడిగాన బొదిగించెను.

"వెక్కసంబగు యుద్ధంబుజేసి యనవేమారెడ్డిని గొట్టి తామ్మపడి గాన బొదిగించి సింహతలాట బిరుదును, దనచేత శ్రీనాథు డడిగికొంచు బోయిన నందికంత పోతరాజు అను కఠారిని బుచ్చుకొనెను." (ప. 107)

          "కొమర గిర్రెడ్డికి కోరి సింగయమాదు
           తనర బెట్టిన బొమ్మ తలపవైతి. (ప. 108)

ఈ బొమ్మకట్టుట, బొమ్మ పెట్టుక అను నాచారము తెనుగు వారిలోనే విశేషముగా గానవచ్చును. అది క్రీ.శ. 1200 నుండి (నాచన సోమునకు కొంత ముందు కాలమునుండి ఏర్పడినట్లున్నది.)

రణము కుడుపు:-
తెనుగు దేశములో అతి ప్రాచీనమునుండియు వైదికవిధానమునకు భిన్నముగా ద్రావిడ దేవతల కొలుపు శక్తులుగా అంగీకృతములయిన దేవర్ల మ్రొక్కుబళ్లు స్థిరపడి పోయినవి. బ్రాహ్మణేతరులకు ఈ క్షుద్ర దేవతలపై గల భక్తి శివకేశవులపయిన లేదని చెప్పవచ్చు. నేటికిని చిన్నదేవర్లను, పెద్ద దేవరను ప్రతి తెనుగు పల్లెలో చేయుదురు. పెద్దదేవర పూజలో దున్నపోతును బలియిచ్చి 'పొలి' యన్నమును రక్తముతో కలిపి దేవరముందు 'బోనము' పెట్టి ఆన్ని ఊరి పొలిమేర చుట్టు (పొలియన్నము వేయుమేర-పొలిమేర) చల్లుచు మధ్య మధ్య మేకలను, కోళ్ళను కోసి భూతబలి యిత్తురు. భూతబలిని (పొలియన్నమును) చల్లువాన్ని 'భూతపిల్లిగాడు' అని యందురు. అది భూతబలిగాడు అను పదమే. వాడు నెత్తినుండి కాలిగోరువరకు కనుబొమ్మలతో సహా శరీరమంతటను ఒక్క వెంట్రుకకూడా వెదకినను కానరా నట్లుగా గొరిగించుకుని సంపూర్ణముగా నగ్నుడై పొలి, పొలి యని పొలికేకలు వేసి పొలియన్నమును చల్లి రాసినుండి యన్నమును కుండలో పెట్టుకొని కావలివారితో సహా ఊరి చుట్టు తిరిగి వచ్చును. పూర్వము యుద్ధమునకు పోవువారు శాకినీ ఢాకిన్యాది భూతాలకు పొలియిచ్చి పోవుచుండిరేమో. యుద్ధములో గెలిచినవారు శత్రువుల మాంసముతో, రక్తముతో ఉడికించిన యన్నమును కలిపి రణ పిశాచాలకు బలియిచ్చి వచ్చెడివారేమో. వెలమరాజు లట్లు చేసినట్లు వెలుగోటి వారి వంశావళిలో(ప.౬౦) ఇట్లు తెలిపినారు ".......కొండమల్రాజు మొదలగు రాజుల రణంబులో జంపి నూటొక్క రాజుల శిరంబులు ఖండించి, ఏబదియొక్క రాజులను కలుగానుగ లాడించి మరియు ముప్పది రాజుల బట్టి పూజించి రణబలిగా దెచ్చి, ఆ రణక్షోణి నర్పించి దిగంబరీ, కాళీ, మహాకాళీ, శాకినీ, ఢాకినీ, బాయళా, కాయినీ, భూతప్రేత పిశాచంబుల దలచి, రణదేవరా! మహారణరాజా! రణశూరా, రణవీర భేతాళ, భైరవ, వీరభద్ర, రణపోతురాజా, కలహకంటకీ, అని నిజబలంబులకు జయంబు కలిగెననుచు, కలహాధిదేవతల నారాధించి, తలంచి, పూజించి, మహాకాళికి వీరరాజుల నరబలిగా నరికించి, భట్టును తామును రణము గుడిపించి వారి రక్తంబుల తమ తండ్రికి తిలోదక పితృ తప్రణంబులు చేసిరి." దిగంబరీ దేవిని (పెద్ద దేవరను) కొలుచువాడు దిగంబరుడుగా నుండవలెనేమో! ఆర్యులీ దక్షిణమునకు రాకముందు ఈ దండకారణ్యవాసులు నగ్నులుగా తిరిగిన నాటి ఆచార శకలముగా ఇది కానవస్తున్నది. భూత

బలిగాడంటిని. మహారణరాజు రణపోతరాజు ఒకటేయై యుండును. పోతురాజుకు దున్నపోతులు చాలా ఇష్టమన్నమాట. వెలమరాజుల కాలములో విజృంభించిన యీ యాచారములు నేటికిని మన పెద్ద దేవరలో నిలిచి పోయినవి. విష్ణుమాయా నాటకము అను ప్రబంధముయొక్క పీఠికలో నిట్లు వ్రాసినారు. 'శివునికి మోహినికిని పుట్టినవాడు శాస్త అనువాడే ఫొతరాజు.' శాస్త అను దేవత నేటికిని మళయాళ దేశమందు ప్రజలచే పూజలందుచున్నాడు. మళయాళీలు, అరవలు, శస్తన్ లేక చాత్తన్ దేవతయని ఇతనిని పూజింతురు. శాస్త కథ స్కాందపురాణాని కెక్కినదట!

తాతాచారి ముద్ర :-

ఈ కాలములో శైవవైష్ణవ ద్వేషాలు విశేషమయ్యెను. అద్వైతి యైనను శైవమందే అత్యభిమానము కల అప్పయ దీక్షితులు భరతఖండ మంతటను ప్రఖ్యాతుడై 104 గ్రంథాలు రచించి శైవము నుద్దరించిన వాడని విశ్రుతుడయ్యెను. అదేకాలములో శ్రీకృష్ణదేవరాయ అశియ రామరాజ చక్రవర్తులకు దీక్షాగురువై వారికిని తన వీరవైష్ణవము కొంత యెక్కించిన తాతాచార్యులు అ సేతు వింధ్యాచలము వైష్ణవమతవ్యాప్తిని జేసి బలవంతముగాకూడ శైవులను వైష్ణవులనుగా మార్చెను. అట్టివారి నెందరినో మరల అప్పయ దీక్షితులు శైవులనుగా జేసెను. తాతాచారి బలవంతపు దీక్షను పురస్కరించుకొని తెలుగు దేశములో 'తాతాచారివారి ముద్ర యెక్కడ తప్పినా వీపున దప్పదు' అను సూక్తి యేర్పడెను. కొందరు 'మరింగంటి వారి ముద్ర' అని పైవిసూక్తిని చెప్పుదురు. మరింగంటివారు నేటికిని తెలంగాణమున నిండుగా తామర తంపరగా నున్నారు.

అప్పయను అప్పై అనియు, అప్పాదీక్షిత అనియు పేర్కొనిరి. అతడు తమిళుడు కాని తెనుగు చక్రవర్తులను నాయక రాజులను ఆశ్రయించిన వాడగుటచే తెనుగు నేర్చియుండెను. అందుచేతనే ఆత డిట్లనెను.

         "ఆంధ్రత్వ మాంధ్రభాషాచ.............
          నాల్పస్య తపస:ఫలం'

అతడు క్రీ.శ. 1520 నుండి 1593 వరకు జీవించెనని వై. మహాలింగ శాస్త్రిగారు నిర్ణయించిరి. అప్పయ దీక్షితుల జన్మస్థానము "అడైయపాళెం." అందతడు తన వార్ధక్యములో క్రీ.శ. 1582లో కాలకంఠేశ్వరాలయమును కట్టించి దానికి స్వయముగా పూజ చేసెను. అతని తండ్రి ప్రసిద్ధుడగు రంగరాజ మఖి. అప్పయ వేలూరు (ఆర్కాటులోని Vellore) నాయక రాజగు చిన్న బొమ్మనాయకు నాశ్రయించెను. అతడు శ్రీకం భాష్యమును విస్మృతి నుండి యుద్దరించి దానిపై శివార్కమణి దీపికయను వ్యాఖ్యను రచించి ఆరెంటిని 500 మంది శిష్యులకు బోధించి వారిని దేశమందు శైవ ప్రచారార్థము విస్తరించెను. చిన్న బొమ్మడు అప్పయను 'దీనారటంకాల స్నానమాడించి' కనకాభిషేకము చేసెను.

ఇదేకాలపు మూడవ యుదంతమును గూడ పేర్కొనవలసి యున్నది. ఈ అప్పయకు తాతాచారికిని సమకాలికుడు మాధ్వమత ప్రచారకుడగు 'విజయాంధ్ర భిక్షు.' అప్పయకు కనకాభిషేక మైతే ఇతనికి రత్నాభిషేక మయ్యెను.

         "విద్వద్వరోస్మా ద్విజయీంద్రయోగీ
          విద్యా సుహృద్యాస్వతుల ప్రభావ:
          రత్నాభిషేకం కిల రామరాజాత్
          ప్రాప్యాగ్ర్యలక్ష్మీ న కృతాగ్రహారాన్"

ఈ విజయీంద్రుడు తన మతమును స్థాపించుకొనువాడై అప్పాదీక్షితుని కత్తిపై కత్తిత్రిప్పి దమ్మువచ్చువరకు సాధనచేసిన వాడే. తాతాచారికూడ తన జానకిత్రాటి తుపాకితో వాదోద్ధతుడై అప్పా దీక్షితునిపై తుప్పుతుప్పున కాల్చెను కాని గురితప్పి వాదమం దోడి క్రోదఘూర్ణితుడై అప్పయను ఈ జీవలోకమునుండి తప్పించుటకు కూడ ఒప్పందమువేసెనట.... కాని తాతాచారి మంత్ర తంత్రాలను అప్పయ లెక్క పెట్టక వేంకటపతి రాయలకాలమందు కూడ ఏడేండ్లపాటు జీవించి 73 ఏండ్ల వృద్ధుడై కాలధర్మము నొందెను.

మరొక నాల్గవ విషయ మిచ్చటనే తెలుపవలసినది కలదు. జింజీ నాయకరాజు మంత్రిగా గురువుగా పండితుడుగానుండిన రత్నఖేటదీక్షితు లీ కాలమందే యుండెను. అతడు సామాన్యుడు కాడు.

          "విపశ్చితా మపశ్చిమే, వివాదకేళి నిశ్చలే
           సపత్నజి త్యయత్న మేవ, రత్నఖేటదీక్షితే
           బృహస్పతి: క్వ జల్పతి ప్రసర్పరాట్
           అసన్ముఖశ్చ షణ్ముఖ శ్చతుర్మఖశ్చ దుర్ముఖ:"

అతడిట్టివాడు. అదేకాలమందే మరొక పండిత దిగ్గజము గోవింద దీక్షితుడను నతడు అచ్యుతరాయల కాలమందుండి క్రీ.శ. 1597 లో తంజావూరులో రఘునాథ రాయలను అభిషిక్తుని చేసెను.

ఇట్టికాలములో రామరాజు తాతాచారికి అతని యనంతరము తాతాచారి కుమారునికి అవలంబనమిచ్చి తాతాచారి వైష్ణవ దీక్షాప్రచారమునకు గాడమగు సహాయముచేసి శైవులకు కష్టములు కలిగించి వారి ద్వేషమును సంపాదించు కొనెను. ఈ కాలమందు మతత్రయము వారు తమతమ మతవ్యాప్తికై పరస్పర హింసాదూషణములతో వివాదపడి హిందూరాజ్యముల దుర్బలతకు తుదకు వినాశనమునకు బాగుగా తోడ్పడిరి. విజయనగర సామ్రాజ్య పతనమునకు తర్వాతి యరాజక స్థితికి, దేశముయొక్క అత్యంతదయనీయస్థితికి ఈ మతత్రయము వారెంత బాధ్యులో ఎంత గొప్ప బాగస్వాములో నిరూపించుటకు ప్రత్యేక గ్రంథ మవసరమగును.

ఇట్టి పదాలు మన సాంఘిక చరిత్రకు పనికివచ్చునట్టివే వందల కొలదిగా నిఘంటుకారులు చూచియు తమకు తోచక చల్లగా జారవిడిచినారు. కొన్ని తప్పుగా ప్రకాశకులు ముద్రించినారు. కొన్నింటికి నిఘంటువులలో తప్పు అర్థాలు వ్రాసినారు. అందుచేతనే మాటిమాటికి వ్యావహారిక పదాలను సేకరింపవలెననుట. పైనచూపిన మచ్చుపదపట్టికలోని పదాలు శిష్టసమ్మతమగు గ్రాంథికాలేకదా: అవేల నిఘంటువులలో లేకపోయెను. కావున గ్రాంథిక వ్యావహారిక మను భిన్నదృష్టి కలిగి యుండుట సారస్వతానికి నష్టము కలిగించుటయే.

ఈ ప్రకరణానికి ముఖ్యాధారములు

1. శుకసప్తతి :- కదిరీపతి ప్రణీతము. ఇది ఉత్తమశ్రేణిలో చేరిన కవిత. సాంఘిక చరిత్రకు పనికివచ్చు గ్రంథాలలో నిది అగ్రస్థాన మలంకరించును. దీనిని తప్పులతో రెండుమారులు ప్రకటించినారు. వావిళ్ళవారి ప్రతిలో కృత్యాది పద్యాలు కొన్ని లోపించినవి. అవి నావద్ద కలవు. ఈ పుస్తకములోని శతాధిక పదాలు నిఘంటువులలో లేవు. ఇందులో రంకులేని కథలు ఎనిమిదివరకు కలవు. రంకుకథలని ఘోరాభినయము కల శిష్టులు ఈ రంకులేని ఎనిమిదింటినయినను వేరుగా ప్రకటించ వచ్చును. ఈ కథలకు రంకను నిందయేకాని శిష్ట కావ్యాలనబడిన శృంగారనైషదము, హరవిలాసము, వైజయంతీవిలాసము, బిల్హణీయము, కూచిమంచి తిమ్మకవి కృతులు, నన్నెచోడుని కుమారసంభవము మున్నగువాటిలో సంభోగాది వర్ణన లిందులేవు. కృతిని చక్కని పీఠికతో నిఘంటువులలో లేని పదాల కర్థముతో, తప్పుల సవరణతో లేని పద్యాల పూరణతో ముద్రించుట యవసరము.

2. వైజయంతీవిలాసము:- సారంగ తమ్మయ్య, ఇదే కథను చెదలవాడ మల్లయ్య విప్రనారాయణచరిత్ర మను పేరుతో వ్రాసెను. మల్లయ కవిత తమ్మయ కవితకంటె చాలా ప్రౌడముగా నున్నది. కాని మన చరిత్ర కది పనికిరాదు. వైజయంతీవిలాసమే చాలా పనికివచ్చునది.

3. పాండురంగ మాహాత్మ్యము (లేక పాండురంగ విజయము) :- తెనాలి రామకృష్ణకవి. ఇతడు వేరే తెనాలి రామలింగడు వేరే అని తలతును. తుదకు రామలింగ డను వాడుండెనో లేదో! పాండురంగ విజయములో మారుమూల పదాలు ఉద్దేశపూర్వకముగా వాడినారు. అయినను సాంఘిక చరిత్ర కిది చాలా పనికివచ్చును. ముఖ్యముగా నిగమశర్మోపాఖ్యానము ఈ గ్రంథానికి మకుటాయమానము.

4. మల్హణచరిత్ర :- పెదపాటి యెర్రనార్యుడు. సాధారణ కవిత అయినను మనకు కొంత సహాయకారి.

5. సాంబోపాఖ్యానము :- రామరాజు రంగప్ప.

6. విప్రనారాయణ చరిత్ర :- చదలవాడ మల్లన.

7. చంద్రభాను చరిత్ర :- తరిగొప్పుల మల్లన.

8. నిరంకుశోపాఖ్యానము :- సంకుసాల రుద్రకవి. ఇది మంచి కవిత. మన చరిత్రకు పనికివచ్చునట్టిది.

9. అప్పకవీయము :- కాకనూరి అప్పకవి. ఇతడు శుద్ద సనాతనుడు. బ్రాహ్మణుడు తప్ప ఇతరులు కవిత్వము చేయ నర్హులుకారని శాసించెను. అందుచేత బ్రాహ్మణేతరుల నుదాహరింపలేదు. రామరాజభూషణుని ఒకచో ఉదాహరించినది తప్పుపట్టుటకే. ఒకచో రామభద్రునిచే నెత్తిన తన్నించినాడు. చేమకూర వేంకటపతి "లక్ష్మణామాత్యపుత్రుడని" నియోగి అని (భ్రమపడి బోగంవాడని తెలియక) ఉదాహరించెను. ఈవిధముగా ఇతడు సారస్వతాని కపచారము చేసెను.

10. గండికోట ముట్టడి:- గ్రంథకర్తపేరు తెలియదు. ఇదొక లఘుపుస్తకము. 15 ఏండ్ల క్రిందట నేమో సమదర్శిని కార్యాలయమందేమో ప్రకటించిరి.

11. వేంకటనాథుడు - పంచతంత్రము :- తన వర్ణనల నన్నింటిని ప్రజాజీవనము నుండి గ్రహించి తన లోకానుభవమును, హాస్యప్రియత్వమును, ఉభయ భాషా వైదుష్యమును, ఉత్తమ కవితను ప్రకాశింపజేసిన మహాకవి వేంకటనాథుడు. సంస్కృత మూలములో లేని కథలను, వర్ణనలను చాలా పెంచినాడు. లక్షణ విరుద్ధ ప్రయోగము లతని కవితయందు కలవని శ్రీ వీరేశలింగం పంతులుగా రన్నారు. ఈతని కవి తప్పులని తెలియక కాదు. వాటిని లెక్క పెట్టక భావమునకే ప్రాధాన్య మిచ్చిన వాడు. కవి కృష్ణా గోదావరిజిల్లాలలో నేదేని యొక జిల్లావాడై యుండును. వేము (1-115) అధాటున (3-163) అను పదాల ప్రయోగమును బట్టి అనుమానించుటకు వీలు కలుగుతుంది. రాచవారుకూడా ఆ జిల్లాల వారే. ఈతని కవిత ఉత్తమశ్రేణిలోనిది. సాంఘిక చరిత్రకు చాలా పనికివచ్చునట్టిది.

12. వెలుగోటివారి వంశావళి (మద్రాసు యూనివర్శిటీ ప్రచురము).

 1. విప్రనారాయణచరిత్ర - చదలవాడ మల్లయ 3 - 50.
 2. సాంబోపాఖ్యానము - రామరాజు రంగప్ప - 2-103 (ఇత డించుమించు క్రీ.శ. 1560 ప్రాంతములోనివాడు.)
 3. సారంగు ........
 4. వైజయంతీవిలాసము 3-92.
 5. విప్రనారాయణచరిత్ర. 3-15.
 6. విప్రనారాయణచరిత్ర. 2-6.
 7. Salatore. II
 8. సాంబోపాఖ్యానము. 4-147.
 9. సాంబోపాఖ్యానము. 4-152.
 10. విప్రనారాయణ చరిత్ర. 5-19.
 11. శుక సప్తతి అ. 2.
 12. వైజయంతీ విలాసము. 3-80
 13. మల్హణచరిత్ర. అ. 1 పుట. 13.
 14. చంద్రభాను చరిత్రము. 5-40 నుండి 85 వరకు. కవి; తరిగొప్పుల మల్లన. ఇతడు క్రీ.శ. 1600 ప్రాంతమువాడు.
 15. శుకసప్తతి. ఆ. 2. కవి: కదిరీపతి. ఈ కవి ఇంచుమించు క్రీ.శ. 1630 ప్రాంతము వాడు.
 16. శుకసప్తతి. ఆ 2.
 17. శుకసప్తతి. ఆ 2.
 18. మల్హణచరిత్ర పెదపాటి యెర్రనార్యుడు. ఆ. 2 పుట 37; ఇతడు క్రీ.శ. 17 వ శతాబ్ది వాడు.
 19. శుకసప్తతి 2-36.
 20. పాండురంగమాహాత్మ్యము. 3-75 మరియు 77 తెనాలిరామకృష్ణుడు. క్రీ.శ. 1530 ప్రాంతమువాడు.
 21. శుకసప్తతి. 2-445.
 22. శుకసప్తతి. 2-446.
 23. శుకసప్తతి. 3-50.
 24. శుకసప్తతి. 3-403.
 25. శుకసప్తతి. 2-416
 26. శుకసప్తతి. 3-583.
 27. శుకసప్తతి 3-116.
 28. శుకసప్తతి 2-356.
 29. చంద్రభాను. 2. 2. (తలముడి బహువచనం తలముళ్ళు. నల్లని నీలిబట్టను తలకు గుర్తుపడకుండా చుట్టిరని అర్థముచేసుకొనవచ్చును.)
 30. చంద్రభాను. 2-15.
 31. మల్హణ; ఆ. 2. పుట. 45.
 32. వైజయంతీవిలాసము. 3-71-72.
 33. వైజయంతీవిలాసము. 4-67.
 34. వైజయంతీవిలాసము. 4-78.
 35. శుకసప్తతి. 3-47.
 36. విప్రనారాయణచరిత్ర. 3-3.
 37. శుకసప్తతి. 2-413.
 38. శుకసప్తతి. 2-425.
 39. శుకసప్తతి. 4-27-28.
 40. శుకసప్తతి. 2-413.
 41. శుకసప్తతి. 1-97.
 42. శుకసప్తతి. 1-116; 1-249.
 43. శుకసప్తతి. 2-241.
 44. శుకసప్తతి. 2-457.
 45. శుకసప్తతి. 2-332.
 46. శుకసప్తతి. 2-32.
 47. శుకసప్తతి. 2-105.
 48. శుక. 3-17.
 49. శుక. 3 అ-58.
 50. శుక. 3-477.
 51. శుకసప్తతి. 2-145.
 52. శుకసప్తతి. 4-109.
 53. శుకసప్తతి. 4-111.
 54. శుకసప్తతి. 2-406.
 55. శుక 2-40-411.
 56. శుకసప్తతి. 2-420 4.
 57. శుకసప్తతి. 1-116;49 మరియు "క్రీడాభి".
 58. చాటుపద్యమణిమంజరి. పుటలు111-2
 59. మల్హణ అ. 2. పుట 35-36.
 60. శుకసప్తతి. 3-245.
 61. వైజయంతీవిలాసము 3-51.
 62. మల్హణ. పుట 38.
 63. మల్హణ. పుట 46.
 64. శుకసప్తతి. 4-22.
 65. చంద్రభాను. 1-161, 2.
 66. చంద్రభాను. 5-39.
 67. చంద్రభాను 3-77.
 68. చంద్రభాను(?) 2-21-24.
 69. సాంబోపాఖ్యానము. 2-48
 70. వైజయంతి 2-15. 121, 131.
 71. విప్రనారాయణ చరిత్ర 2-87.
 72. వైజయంతి 4-7.
 73. మల్హణ. పుట 45.
 74. వైజయంతి. 4-59.
 75. వైజయంతి. 2-140. (గార ద్రావినమీను)
 76. వైజయంతి. 1-132.
 77. సాంబోపాఖ్యానము. (296-303)
 78. శుక 1-3, 70.
 79. శుక. 2-91.
 80. శుక. 2-363.
 81. శుక. 2-139.
 82. శుక. 2-303.
 83. వైజయంతి. 2-243.
 84. శుకసప్తతి. 3-204.
 85. శుక. 3-337.
 86. శుక. 2-435.
 87. శుక. 2-487.
 88. శుక. 3-545.
 89. పాండురంగ మాహాత్మ్యము.
 90. పాండురంగ మాహాత్మ్యము 4-132.
 91. పాండురంగ విజయము. 3వ ఆశ్వాసము.
 92. పాండురంగ మాహాత్మ్యము. 5-74-80, 81, 82.
 93. వైజయంతి. 3-69.
 94. శాసన పద్యమంజరి. శాసనసంఖ్య 80, పుట 103.
 95. శాసన పద్యమంజరి. శాసనసంఖ్య 84, పుట 106.
 96. శుక సప్తతి. 2-338.
 97. శుక సప్తతి. 2-335.
 98. శుకసప్తతి. 1-222 (ఈ రగడలో కొన్నిపదాలు నిఘంటుకారులకు తెలియక నుదాహరించినవారు కారు.)
 99. శు. 1-192.
 100. శు. 1-389
 101. శుకసప్తతి. 3-403.
 102. వైజయంతి. 4-73.
 103. వైజయంతి. 4-65, 66.
 104. వైజయంతి. ౪-౬౨ నుండి ౧౨౮ వరకు
 105. చంద్రభాను. 1-39.
 106. విప్రనారాయణ. 3-28.
 107. వైజయంతి. 2-2.
 108. నిరంకుశ. 2-9.
 109. మల్హణ. పుట 9.
 110. మల్హణ. 40.
 111. వైజయంతి. 1. 123-24.
 112. వైజయంతి. 1-129.
 113. శుకసప్తతి. 1-523.
 114. శుకసప్తతి. 3-148.
 115. ఈ గ్రంథ ప్రథమ ముద్రణములో దీనిని పేర్కొనియుండలేదు. ముద్రితమైన తర్వాత ఒక గారడివారిగుంపును చూచితిని. వారిలో నొకడు వరిగడ్డి పగ్గమునకు కోడిరక్తమును పూసి దానిని గట్టిగాచేసి దాని కొనను కుడి కాలికి ఎంటుగా కట్టి ఆ పగ్గమును మెడపై త్రిప్పివేసుకొని యుండెను. కుడి మోకాలివద్ద ఆ పగ్గాని కొక బొమ్మను కట్టియుండెను. అదేమన అది లోభి బొమ్మ యనియు తమకు కట్టడిమాటమేరకియ్యనియరి అపకీర్తిని ప్రకటించుట కీబొమ్మను కట్టినామనిరి.