ఆండ్రూ కార్నెగీ (జీవితచరిత్ర)/హోమ్‌స్టెడ్ - స్కిబో

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

హోమ్‌స్టెడ్ - స్కిబో

11


ఇనుము, ఉక్కు వాటిని ఉత్పత్తి చేయటానికి కావలసిన బొగ్గు, కోల్, ఇనుప ఖనిజాలు అన్న వాటికి తప్ప కార్నెగీ కార్పొరేషను ధనాన్ని ఇతరమైన వేటిమీదా పెట్టకూడదు అని పూర్వం తాను నిర్ణయించుకున్న పధకానికి ఆండ్రూ కార్నెగీ మరీ మరీ కట్టుబడి పోతున్నాడు. హెన్రీ ఫీప్స్‌తో కలిసి ఒకనాటి ఉదయం అతడు బండిలో పిట్స్‌బర్గ్ కు వెళ్లు తున్నాడు. అప్పుడు అతడు ఒక ట్రష్ట్ కంపెనీవారి వ్యాపార ప్రదేశంలో నుంచి ప్రయాణం చెయ్యటం జరిగింది. ఆ కంపెనీ పేరు అతని మనసులోని తంతువులను కదలించడం మొదలు పెట్టింది. "పెట్టుబడిదారులు వ్యక్తిగతంగా బాధ్యులు" అన్న వాక్యం లీలగా అతని స్మృతికి తగిలింది.

"ఈ వ్యాపార సంస్థకు సంబంధించిన ఇరవైషేర్లు మన ఎస్టేటు ఆస్థిగా వున్నట్లు మన పుస్తకాలల్లో వుండటం నేను చూశాను కదూ" అని ఫిప్స్‌ను అతడడిగాడు.

"ఔనని ఫిప్స్ సమాధాన మిచ్చాడు."

"ఈ సాయంత్రం నీవు కార్యాలయానికి వెళ్ళగానే వాటిని అమ్మివేసేయి." ఫిప్స్ దానిని అంతశ్రద్ధగా కాకుండా ఎదోగా 'సరే' అన్నాడు. "అయితే అంత తొందర లేదు. ఎప్పుడయినా చెయ్యవచ్చు" నన్నాడు.

"అలాకాదు హారి. వెంటనే జరగాలి! నా మాటను మన్నించు" అన్నాడు యజమాని. ఆ బ్యాంకు కొద్ది నెలలు కాగానే పెద్దమొత్తం లొంగుడు పడి దివాలా తీసింది. అప్పుడు అతడు షేర్లను అమ్మివేయటం మంచిదైందని సంతోషించాడు. 1888 లో మిల్లులు, కొరములు రోజు ఒకటికి రెండువేల టన్నుల ఉక్కు, ఇనుమును ఉత్పత్తి చేస్తున్నవి. 'కొన్నిలిస్ విల్లీ'లోని నలభై రెండు వేల ఎకరాల అందమైన కోహింక్ కోల్ గనుల ప్రాంతానికి మీద ఫ్రిక్ కోక్ కంపెనీ యాజమాన్యం వహిస్తున్నది. తన బాల్యం నాటి మిత్రుడయిన హారీ ఆలివర్ ద్వారా మిన్నె సోటాలో కొత్తగా కనుక్కోబడ్డ మిస్సబీ ఇనుప ఖనిజపుభూమిని ఎన్నో ఎకరాలు కార్నెగీ గుత్తకు తీసుకొన్నాడు. వందలకొద్ది చిన్న ఉక్కు వస్తువులను తయారుచేసే మరొక కర్మాగారాన్ని స్థాపించటం జరిగింది. దాని ద్వారా వారి ఆజాతి వ్యాపారం కూడా వృద్ధిపొందింది. ఇదైనా 'ఎ. సి.' కి తమ మార్గానికి కొంత దూరమైందిగానే కనిపించింది.

కార్నెగీకి కార్మికులవల్ల ఎన్నడూ ఎటువంటి తీవ్రమైన ఇబ్బందీ కలుగ లేదు. బహుసంఘ్యాకులైన కార్మికులతో అతడు సూటిగా సంబంధం పెట్టుకొనేవాడు. వాళ్ళ నాయకులందరినీ సాన్నిహిత్యసూచకంగా వాళ్ళ మొదటి పేర్లతో పిలుస్తుండేవాడు. వాళ్లు వినిపించవచ్చిన కష్టాల నన్నింటినీ జాగ్రత్తగా ఓపికతో వినేవాడు. ఎక్కడయినా కలతలు, అన్యాయాలు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దేవాడు. అయితే కార్నెగీ సంస్థలు విపరీతంగా పెరిగిపోయినప్పుడు కొత్తవ్యక్తులు, కొత్త ప్రభావాలు పరిపాలక వర్గాలల్లోను శ్రామికుల్లోనూ ప్రవేశించాయి. కార్నెగీ దీర్ఘ కాలం స్కాట్లండులో ఉండి పోతుండడం వల్ల కలత లారంభమై పెరగటం ప్రారంభిస్తున్నవి. ఇప్పుడు విలేక దాక్షిణ్యాలను జోడించి తన ప్రభావాన్ని పాలకవర్గ శ్రామికవర్గాల రెంటిమీద నెరపశక్తిగల టామ్ కార్నెగీ, బిల్ జోస్స్‌లు ఇరువురూ లేకపోవటం బాగా అనుభవానికి వస్తున్నది. బోర్డు ఆఫ్ మేనేజర్లకు అధ్యక్షుడయిన ఫ్రిక్ కఠినుడు. కరుణారహితుడు అని రూఢిగా నిరూపితమైంది. హెన్రీ ఫిప్స్‌కు వయసు పెరుగుతున్న కొద్దీ అతడు ఫ్రిక్ అభిప్రాయాల వంకకు మొగ్గుచూపటం ఆరంభించాడు.

హోమ్‌స్టెడ్ కర్మాగారంలోని హిటర్లు, రోలర్లుఅన్న చిన్న శ్రామికవర్గం వారు ప్రస్తుతం ఇబ్బంది కల్పిస్తున్నారు. ఉన్నత వర్గంనుంచి వచ్చిన క్రొత్త సూపరింటెండెంటు అసంతృప్తితో అల్లరిచేస్తున్న వీళ్ళతో వ్యవహరించే విషయంలో ఎక్కువ వివేకాన్ని ప్రదర్శింపలేకపోయాడు. ఈతని చెడ్డభావాలే ఇతరులలో కూడా ప్రవేశించి వ్యాప్తిపొందటం ప్రారంభించాయి. బ్రాడ్డాక్ వర్క్స్‌ను సక్రమంగా పాలించటం వల్ల సంస్థలో చాలా ఉన్నత స్థాయికి చేరుకొన్న ఛార్లెస్ స్క్వాబ్ హోమ్‌స్టెడ్‌లో ఆచిన్ని శ్రామికవర్గంలో దౌత్యాలు నడిపించే స్థితిలో లేడు. అందువల్ల అల్పసంఖ్య అయిన మూడువేలమంది కార్మికులకు సంబంధించిందే అయినప్పటికీ, 1892 వేసగిలో హోమ్ స్టెడ్ కర్మాగారంలో సమ్మె వచ్చింది. కార్నెగీ స్కాట్లండులో ఉన్నాడు. ఈ అవకాశంవల్ల చేకూరిన ఉత్సాహంతో సమ్మెను బ్రద్దలు కొట్టేవాళ్ళకు ఉద్యోగాలిచ్చి ప్రోత్సాహించటానికి ఫ్రిక్, సూపరింటెండెంటు ఇద్దరూ నిర్ణయించారు. ఇది వాళ్ళ అధ్యక్షుడయిన ఆండ్రూ కార్నెగీకి హృదయ ప్రియాలయిన సిద్ధాంతాలల్లో ఒకదానికి పూర్తిగా వ్యతిక్రమము. ఈ విషయం అతడు పూర్వమే లిఖితరూపంగా వెల్లడిచేశాడు. "ఎవరయినా పనిచేసేవాళ్లు పనిమానివేస్తే మాననివ్వటమే కంపెనీ కృతనిశ్చయమని వారికి తెలియజేయాలని నాఊహ. అట్టివారితో స్వేచ్ఛనిచ్చి సంప్రదింపులు సాగించాలి. వాళ్లు తిరిగి పనిలోకి వెళ్లుదామని నిశ్చయించుకొనేదాకా ఓపిక పట్టి ఆగాలి కానీ కొత్త వాళ్ళను పెట్టుకోటం ఎన్నడూ పనికిరాదు, పనికిరాదు."

ఫ్రిక్స్ ఉద్దేశాన్ని గురించిన కిం వదంతులు విని సమ్మెచేసిన శ్రామికులు సాయుధులై కర్మాగారానికి ప్రక్కవీథుల్లో పికెటింగ్ చేశారు. సమ్మెను బ్రద్దలు కొట్టేవారు కర్మాగారంలో ప్రవేశించేటప్పుడు వారికి రక్షణను ఇచ్చేటందుకు కౌంటీషరీఫ్ ఒక పెద్ద డిటెక్టివ్ ఏజన్సీని ఏర్పాటు చేశాడు. సమ్మె చేసినవాళ్ళు వీధులను అడ్డివేయటం వల్ల జూలై 1 న రక్షణ యిచ్చి క్రొత్తపనివాళ్ళను పడవలమీద తీసుకవచ్చి మిల్లులోపలికి మోనోంగ్ హెలా నదిమీదుగా వెనకభాగంనుంచి ప్రవేశపెట్టటం జరిగింది. అప్పుడు కలిగిన కలహంలో ఉభయపక్షాలల్లో చాలామంది వ్యక్తులు గాయపడ్డారు, కొందరు మరణించారు. చివరకు క్రొత్తగా ఎత్తి వచ్చినవాళ్ళను దెబ్బకొట్టి తరిమివేయటం జరిగింది.

ఉభయవర్గాలవారు తాము చేసిన దానికి తల్లడ పడ్డారు. సంధిచేసుకోటం సముచిత మనిపించింది. ఈ విషయము రెండు రోజులు గడచిన తరువాత గాని స్కాట్లండులో వున్న కార్నెగీకి తెలియ లేదు. అప్పుడు అతడు తనకు లభ్యమయిన మొదటి నౌకమీద బయలు దేరి వస్తున్నానని నిస్తంత్రీ వార్త (కేబిల్) పంపించాడు. ఫ్రిక్, ఫిప్స్‌లు ఇద్దరూ కంపెనీ క్షేమం కోసం ఈ తడవ అక్కడే అమెరికాకు దూరంగా ఉండవలసిందనికోరుతూ సమాధానం పంపించారు. ఇందుకు కారణమేమిటో ఊహింపలేక పోయినప్పటికీ కార్నెగీ వారి అభ్యర్థనను మన్నించి అక్కడే వుండిపోయినాడు. "మమ్మల్ని ఏమి చెయ్యమని మీరు కోరుతారో తెలియ జెయ్యండి. మీకోసం మే మా పనిని చేసి తీరుతాం" అని కలహం అయిపోయిన తరువాత కార్మికుల యూనియన్ ఉద్యోగులు యిచ్చిన నిస్తంత్రీ వార్తవల్ల విషయం తెలుసుకొని కార్నెగీ ఎంతో చలించిపోయాడు. ఏం ప్రయోజనం. కాలం గడిచిపోయింది. నష్టం జరిగిపోయింది. తరువాత పన్నెడు సంవత్సరాలకు తాను కార్నెగీని అక్కడ ఉండిపొమ్మని అడగటానికి కారణం "వారు కోరేవి యెంత అనుచితంగా వున్నా ఆయన ఎల్లప్పుడూ శ్రామికుల కోర్కెలనే అభిమానించి తీర్చే మన:ప్రవృత్తితో వుంటాడు గనుక, వాళ్లు వాళ్ళ యిష్ట ప్రకారంగా వ్యవహా రాన్ని సాధించదలచుకొన్నారు గనుక" అని న్యూయార్క్ న్యూస్ పేపర్ విలేకరులతో ఒప్పుకున్నాడు.

కొన్ని సంవత్సరాలయిన తరువాత కార్నెగీ ఈ విషయాన్ని గురించి తన ఆత్మకథలో ఇలా వ్రాసుకొన్నాడు: "నాజీవితంలో ఇంతకు పూర్వంగాని, తరువాతగాని ఎన్నడూ ఇటువంటి సమస్యను ఎదుర్కొనవలసి రాలేదు. ఏదీ యింత తీవ్రంగా నన్ను వ్యథ పెట్టనూ లేదు. ఈ హోమ్‌స్టెడ్ వ్యవహారంలో తప్ప నా వ్యాపారిత జీవితంలో నే పొందిన మరొక గాయమేదీ లేదు."

ఆకురాలే కాలం రాగానే అతడు అమెరికాకు వచ్చినప్పుడు కర్మాగారానికి వెళ్ళి ఆ కొట్లాటలో పాల్గొనని కొందరు వృద్ధులతో మాట్లాడాడు. "మీరు ఇక్కడ ఉన్నట్లయితే సమ్మె వచ్చేదేకా"దని వా రతనికి సమాధానం చెప్పారు. కర్మాగారం యిచ్చిన 'నజరు' చాలా సముచితంగా వుందిగదా!" అని అతడన్నప్పుడు ఆ వృద్దుల్లో ఒకడు "మిష్టర్ కార్నెగీ! ఇది డాలర్లకు సంబంధించినది కాదు. ఆ పిల్లలను నీవు తన్నినా ఒప్పుకుంటారు, కానీ ఇంకొకడు జుత్తుమీద చెయ్యి వేసి తట్టినా ఊరుకోరు"

ఏమైనా అమెరికాలో అనేకమంది ఈ ప్రమాదాన్ని గురించి విన్న వెంటనే అతడు తిరిగి రాకపోవటం పిరికితనాన్ని ప్రదర్శించటమని అనుకొన్నారు. అతణ్ణి విమర్శించే స్వభావం గలవాళ్లు తరువాత చాలకాలం వరకూ ఇలాగే అతనికి వ్యతిరేకంగా అంటూ వచ్చారు. తనకు ప్రియమైన షర తులమీద సమర్థులని తోచిన యువకులను భాగస్తులనుగా తీసుకోవటం యింకా అతడు కొనసాగిస్తూనే వస్తున్నాడు. ఇంతవరకూ అటువంటివాళ్ళు ముప్పదిమంది దాకా ఐనారు. వీళ్ళలో ప్రతి ఒక్కరికీ అనంతసంఖ్యలో 'స్టాప్‌' ఉంది. ఇలాంటి వాళ్ళల్లో ఒకడయిన ఒక స్కాబ్ యువకుణ్ణి భాగస్వామిగా గ్రహింపబోయేముందు తన ఉద్దేశాన్ని తెలియజేస్తూ అతడు "పీ కాక్, నిన్నొక మిలియనీరును చేస్తే నా కే మిస్తావు" అన్నాడు కార్నెగీ. ఆ డబ్బుకు తగ్గట్లు ధారాళమైన డిస్కౌంటు ఇస్తానని వెంటనే ఆ యువకుడు చమత్కారంగా సమాధానం చెప్పాడు. అది ఆ ప్రముఖ వ్యాపారిని విశేషంగా గిలిగింత పెట్టింది.

మార్చి 30, 1897 నాడు కార్నెగీకి ఒక కుమార్తె కలిగింది. ఈ బిడ్డ చాలా అందమైంది. ఈ మె తరువాత అతనికి మరెవ్వరూ బిడ్డలు కలుగ లేదు. తన ఏకైక సంతానమైన ఈ బిడ్డను అతడు తొలిసారిగా చూచినప్పుడు భార్య అతనితో అన్నది. "ఈ బిడ్డ పేరు మార్గరెట్. మీ తల్లిగారి పేరు ఆమె జ్ఞాపకార్ధం ఈ పేరు పెట్టుకుందాము. నాదో చిన్న అభ్యర్ధన."

"లౌ. ఏమిటది?" అని అడిగా డతడు.

"మనకు పరమేశ్వరు డిచ్చాడు. గనుక మన కొక వేసగి గృహమంటూ ఉండాలి. ప్రతిసారి మరొకరి ఇల్లును అద్దెకు పుచ్చుకొంటూ, ఒక తేదీనాటి కందులో ప్రవేశించటం, మరొక తేదీనాటికి ఖాళీ చెయ్యటం మనం చెయ్యలేము. అది ఇక మన ఇల్లే ఐ ఉండాలి." అతడు వెంటనే అంగీకరించాడు.

"ఈ విషయంలో నా దొక నియమ ముంది" అన్నది ఆమె.

"యేమిటది?"

"అది స్కాట్లండు పర్వత ప్రాంతంలోనే ఉండాలి.

ఆమె అతనికి అంతకంటే సంతోషాన్ని కలిగించే మరొకదాన్ని దేన్నీ సూచించలేదు. ఎలా వున్నప్పటికీ వారు ఇక క్లనీ కాజిల్ ను వేసవి గృహంగా పొందలేరు. మాక్పర్ సన్ వివాహం చేసుకుంటున్నాడు. ఇక ఆ గృహం అతని ఉపయోగంకోసం అతని కే అవసరం పది వేసగి సమయాలు కార్నెగీలు అక్కడ నివసించటం వల్ల వారితో అతనికి సన్నిహిత మైత్రి ఏర్పడింది. బిడ్డ కలిగిన వెంటనే వారు అతనికి కేబిల్చి తెలియజేశారు. అతడు ఆ సంతోష వార్తవిని అతడు తన మెక్ఫర్ సన్ ప్రాంతంలో గొప్ప ఉత్సవం చేయించాడు. తొమ్మిది కొండలమీద మంటలు వేయడం, విందులు జరపటం, కార్నెగీల ఆరోగ్యంకోసం మథుపానాలు చెయ్యటం ఆ ఉత్సవంలోని విశేషాలు.

అందువల్ల నూతన పిత అద్దెకుగాను క్రొత్త మిరాసీని (Manor) వెదకకుండా స్వంత ఆస్తినే కొనటానికి యత్నిస్తున్నాడు. డ్యూక్ ఆఫ్ సథర్ లాండ్‌కు స్కివో అనే పేరుతో ఉత్తరస్కాచ్ పర్వతప్రదేశంలో ఒక ఎస్టేటు ఉన్నదనీ, అతడు దాన్ని అమ్మదలుచుకున్నాడనీ అతడు తెలుసుకున్నాడు. అడవులు, సుందరమైన నిమ్లోన్నతాలు ప్రీతికరమైన వాహ్యాళిస్థలాలు, ఆరోహణాలు, మంచి మత్స్య సంపద గల సరస్సులు, విశ్వసించదగిన సమస్థితి గల వాతావరణం. జనవరిలో వికసించే పుష్పకుంజాలు అన్నీ దానికి వున్నట్లు అతడు తెలుసుకున్నాడు. ఆ ఆస్తికి వున్న వాటన్నిటిలో అత్యుత్తమమైంది ఉన్న శిలా ప్రదేశం పై నిల్చి నదీ సాగరసంగమం వంకకు తిలకిస్తూ ఉన్న గొప్ప ప్రాచీన శిలాసౌధం చూచిన వెంటనే కార్నెగీకి ప్రీతి కలిగింది. అతడు దాన్ని కొన్నాడు. కొన్ని మార్పులు కూర్పులు చేసి క్రొత్తరూప మిచ్చాడు. ఎలివేటర్‌ను ఏర్పాటు చేయించాడు. విద్యుద్దీపాలను పెట్టించాడు. ఆధునికమైన 'ప్లంబింగ్‌'ను పెట్టించాడు. టర్కిష్ స్నాన శాలలను నిర్మించాడు. అందులో మేలుజాతి పశువులు గల 'సానిటరీ డైరీ'ని నెలకొల్పాడు. అందలి పూద్రోటలు అమిత ఖ్యాతి వహించాయి.

అ సౌధం కార్నెగీల ఇంటికి ఎందరు అతిథులు వచ్చినా ఒక్కమాటుగానే ఆతిథ్య మివ్వటానికి తగినంత విశాలంగా వుంది. అతిథుల అసంఖ్యాకంగా వస్తుండేవారు. వయోవృద్ధులైన మిత్రులు గ్లాడ్‌ష్టన్, మేథ్యూ అర్నాల్డుల వంటివారు వెళ్ళిపోయినారు. తరువాత తరంవా రైన రుడ్డి యర్డు కిప్లింగ్, పాడెరివిస్కీ, సర్ ఎడ్వర్డు గ్రే, స్కాబ్ ఉక్కు నిర్మాత సర్ ఛార్లెస్ టెన్నెంట్, ఇలిహూరూట్, ఉన్నత వర్గం వారైన ఇంకా ఇతరులు అతిథులుగా వస్తుండేవారు. వారి పూర్వ మిత్రులు లార్డు, లేడీ మోర్లేలు ఋతువుకు రెండు మార్లో మూడు మార్లో వచ్చి వెళ్లుతుండేవారు. స్కిబోకు పదిమైళ్ళ దూరాన వున్న రైలు స్టేషను దగ్గిర విక్టోరియా యుగపు తొలిరోజులనాటి నాలుగు గుర్రాల బండి ఒకటి క్రొత్త వార్నీసు మెరపుతో నీటుగా నిలచి అతిథులకు స్వాగత మిస్తుండేది. ఎర్రకోటు వేసుకొన్నబోదకు డొకడు దాన్ని నడుపుతుండేవాడు. ఇతని లాగానే ఎర్రకోటు తొడిగి బండి వెనక ఎత్తయిన ఆసనంమీద కూర్చొని 'కాలరొ' (Footman) ఒకడు 'శృంగా'న్ని (HORN) ఊదుతుండేవాడు.

స్కిబోయిలర్డ్ అనిపించుకున్న కార్నెగీ వంశవృక్షాన్ని వంశ లాంఛనాలను అసహ్యించుకున్నాడు. కాని స్కాబ్ దేశీయులు ధరించే దుస్తులకు కొద్ది మార్పులు జేసి 'కార్నెగీ ప్లయిడ్‌' అన్న ఉడుపును రూపొందించుకొన్నాడు. చిన్ని మార్గరెట్ ఇంట్లో తిరుగుతున్నప్పుడు, తండ్రి చేయి పట్టుకొని నడుస్తున్నప్పుడు, కొండ లెక్కుతున్నప్పుడు స్కాట్లండు లోని పర్వత ప్రాంతీయులు ధరించే రంగురంగుల తార్తాను ధరిస్తుండేది. కార్నెగీ స్కిబో వుండేటప్పుడు ఈ కుచ్చిళ్ళ దుస్తును తానే ధరిస్తుండేవాడు. ఆ ఎస్టేటులో పనిచేస్తున్న సేవకులు, శ్రామికులుకూడా దీన్నే ధరిస్తుండేవారు. స్కిబో పరిసరాలల్లో ఈ గుడ్డను కుటీరాలల్లోని మగ్గాలమీద చేత్తో నేస్తుండేవారు. అక్కడ అక్కడ స్కాబ్ తనానకి విశేష ప్రాముఖ్య మివ్వబడింది. స్కాచ్ గృహపాలకుడు, స్కాచ్ ఉగ్రాణోద్యోగి (Butler), ఒకరో ఇద్దరో స్కాబ్ ఉప సేవకులు. పైపరుకూడా వీరివలె స్కాబ్. ఇతడు ఉదయవేళ మేల్కొల్పుతూ, భోజన సమయాలల్లో తన జంత్రంమీద పార్వ తేయ గీతాలను అటూ ఇటూ తిరుగుతూ వినిపిస్తుండే వాడు. ఇతడు అ ప్రదేశంలోని ప్రముఖ వ్యక్తులలో ఒకడు. వీళ్ళందరూ చలికాలాలకు ఆ కుటుంబంతో బాటు అమెరికా వెళ్ళేవాళ్ళు. ఆ ఎస్టేటులోని శ్రామికుల ఉద్యోగాల లాగానే వీరిని కూడా జీవితపర్యంతో ద్యోగాలు.

జూలై నాల్గవ తేదీన అ సౌధంమీద బ్రిటిష్ అమెరికన్ జెండాలు రెండూ ఎగురుతున్నవి. ఈ రీతిగా రెండు జెండాలు మరొక కొత్త జెండాను ఎగుర వేసేటంతవరకు ఎగిరాయి. ఈ క్రొత్త జెండా తొలుత తొలుతగా వచ్చిన అతిధులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. వారు దానివంక జాగ్రత్తగా పరిశీలించి చూచినమీదట తమ 'అతిథేయి' గ్రేట్ బ్రిటన్ అమెరికాల జెండాలను రెంటినీ కలిపి విశిష్టంగా రూపొదించుకున్న సమ్మెళిత పతాకమని వారర్ధం చేసుకున్నారు. ఆ పతాక బహుశ: ఉద్దేశించినది కాక పోయినా, ఒక నాటికి గ్రేట్ బ్రిటన్, అమెరికాలు రెండూ కలిసి ఒక గణతంత్ర రాజ్యం లాగా సమ్మేళనాన్ని పొందబోతున్న వన్న ఉద్దేశాన్ని వ్యక్తీకరిస్తున్నట్లుండేది.

కార్నెగీ వనజంతువులను చంపటం సహించలేడు. జింకలు, కుందేళ్లు, అడవి కోళ్లు అతని ఎస్టేటులో అసంఖ్యాకంగా వున్నవి. అయితే అతడు వాటిని ఎన్నడూ వేటాడ లేదు. అతడు అతని అతిధులు చేతలను పట్టడానికి వెళ్లుతుండేవాళ్లు "వెళ్ళండి, మీకు ప్రియమైనదైతే వేటకు వెళ్ళండి. కానీ చంపవలసి వస్తే తప్ప చంపవద్దు దాన్ని గురించి నాకు ఏమీ తెలియనివ్వవద్దు" అని అతిథులతో అనేవాడు. అటువంటి పరిస్థితిలో ఏ కొద్దిమందోతప్ప వేటాడటానికి పూనుకుండేవాళ్లు కారు. మానవులది గాని, జంతువులది గానీ రక్తపాతమంటే కార్నెగీ అసహ్యించుకొనేవాడు.

ఈ మధ్య కాలంలో అతడు నెంపాదిగా చిన్న కళాశాలకు, చర్చిలకు సినొగాగ్‌లకు, ఆర్గనులను కొనుక్కోటానికి, జంతువాద్య సమ్మేళనాలను పెంపొందించుకొనటానికి, గ్రంథాలయాలను నిర్మించుకోటానికి డబ్బు ఇస్తుండే వాడు. స్కిబోకు పదిమైళ్ళ మేరలో వున్న ప్రతి చిన్న గ్రామంలోను, కొన్ని సందర్భాలల్లో ఇంకా చిన్న గ్రామాలల్లోను కార్నెగీ గ్రంథాలయం ఏర్పడింది. అతడు న్యూయార్క్‌లోని కూపర్ ఇన్ట్సిటూట్‌కూ, మర్చంట్స్ అండ్ ట్రేడ్ మన్ ఇన్ట్సిటూషన్‌కు ఒక్కొక్క దానికి 7,50,000 డాలర్లు ఇచ్చాడు. పాత మిత్రత్వాలను అంటిపెట్టు కార్నెగీ 1859 మొదలు 1863 వరకూ పెన్సిల్వేనియా రైల్ రోడ్డు పిట్స్‌బర్గు డివిజనులో తన క్రిందపని చేసిన వారందరికీ పింఛను (Pension) లిచ్చాడు. వారిలో కొందరు సహాయానికి దరఖాస్తులు పెట్టుకొన్నారు. చివరకు అందరినీ వెతికి వారికి, వారి వితంతువులను కూడా కలిపి పింఛనుల పట్టికను తయారు చేయమని తన మిత్రుడయిన టామ్ మిల్లర్‌ను నియమించాడు. "వీరి మధ్యలోకి వెళ్ళినప్పుడు నేను చిన్న కుర్రవాడను. వీరంతా నా యెడ ఎంతో దయాళువులై ప్రవర్తించారు. వీరు నా ప్రియమిత్రులు" అని వీరిని గురించి వివరించాడు. మిల్లరు ప్రతివ్యక్తిని గురించి రిపోర్టు పంపినప్పుడు చాలా వాటిమీద "జాన్ నా కెంతో బాగా గుర్తు న్నాడు "బిల్ మా మంచి ట్రాల్ మన్ లలో ఒకడు" "హెన్రీకి నాశుభాకాంక్షలను అంద జెయ్యి" - ఈరీతిగా లఘటీకలు వ్రాశాడు.

అంతర్యుద్ధ కాలంనాటి సైన్యములోని టెలిగ్రాఫర్లంటే కార్నెగీకి ప్రీతి విశేషం. అతనికి వారితో కొంత లీలగా సంబంధ మున్నది. వారు నిర్మించుకొన్నదీ చారిత్రక ఖ్యాతిగన్నదీ. ఆయన సమాజంలో కార్నెగీ ఒకప్పుడు సభ్యుడు. కొన్ని మాట్లు వారి వార్షిక సమావేశాలకు హాజరై నాడు. వార్తాహారి బాలుడుగా వున్న తన తొలినాటి అనుభవాలను గురించి అతడు ఆ సభల్లో ప్రసంగించాడు. సైన్యానికి వీరిసేవ అత్యంత ప్రధానమైంది కనుక వీరికికూడా పింఛనులు ఇవ్వాలని ఎంత చెప్పినా ప్రభుత్వం పట్టించుకో లేదు గనుక అతడికి కోపం కలిగింది. సైనికుల లాగానే వీళ్ళల్లో చాలామంది యుద్ధభూమిలో ప్రాణాలను కోల్పోయినారు. వికలాంగులయినారు. గాయాలు తగిలి, వాతావరణం పడక ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నారు. శత్రువుల కారాగారాలల్లో బంధితులయినారు. వారిదేశ ప్రభుత్వం దగ్గర నుంచి వారు పుచ్చుకో వలసినంత మొత్తాలు వారికి చెల్లించటానికి వీలు కలిగేటట్లు అతడు 'కార్నెగీ నిధి'ని ఏర్పాటు చేశాడు.

చిత్రమైన చిక్కుల్లో పడ్డ వ్యక్తులమీద కార్నెగీ తప్పనిసరిగా చూపించే దయకు క్రింది దొక ఉదాహరణం మాత్రమే.

మిష్టర్ గ్లాడ్‌స్టన్ ఒకమారు అతనితో అన్నాడు. "మన మిత్రుడు లార్డు అక్టన్ ఆర్థిక సముద్రంలో మునిగి పేయే స్థితిలో వున్నాడు. అది నన్ను బాధ పెడుతున్నది. అతడికి ఎంతమంచి గ్రంథాలయముందో నీకు తెలుసు. చూశావు కూడాను. అయితే, దాని విలువ అంతా అతనికి తిరిగి రాకపోయినప్పటికీ దాన్ని విడిచిపెట్టటమంటే దరిదాపుగా అతని గుండె బ్రద్దలయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ, విక్రయిద్దామనుకుంటున్నాడు.

కార్నెగీ "దాన్ని నేను కొంటాను. అయితే...

గ్లాడ్‌స్టన్ మధ్యలో ఆపి "నన్నొక సూచన చెయ్యనీ, అతని జీవితం పర్యంతం దాన్ని అతనిదగ్గరే ఉండనీ. అతని తదనంతరం దాన్ని నీవు నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యనీయ వచ్చు.

ఆ రాజనీతిజ్ఞుడుతొ కరచాలనం చేస్తూ "తప్పక చేస్తాను. మీ సూచనకు నా మనస్సులు."

అక్టన్ చెప్పిన ఖరీదుకు అతడు అతని గ్రంథాలయాన్ని కొన్నాడు. అయితే గ్లాడ్‌స్టన్ చెప్పినటు ఆ ఉదాత్తుడయిన లార్ బహుకాలం జీవించ లేదు. 1902 లోని ఆతని మృతికి పిమ్మట అనతికాలానికే కార్నెగీ మోర్లేలు కలుసుకొన్నారు. కార్నెగీ మిత్రునితొ "మీ కో విషయం చెప్పాలి. కొద్ది సంవత్సరాలకు పూర్వం లార్డు ఆక్టన్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అతని గ్రంథాలయాన్ని అమ్ముతానని సూచన చేస్తే...

మోర్లేమొగాన ఉదయించిన చిరునవ్వు ఆ వాక్యాన్ని మధ్యలో ఆపింది. "ఈ విషయం మీరు కొన్న రోజునుంచి నే నెరుగుదును" అన్నా డతడు. "మీకు తెలుసునా!"

"అవును. గ్లాడ్ స్టన్ ఈ రహస్యాన్ని నిలుపుకో లేక పోయినాడు. దానిని అతడు లార్డు ఆక్టన్‌కు జీవిత పర్యంతం దక్కించగలిగినందుకు మహానందపడ్డాడు."

"బాగుంది. దాన్ని నే నిప్పుడు మీ పరం చెయ్యబోతున్నాను."

"నా పరమా! ఆశ్చర్యపడటం ఇప్పుడు మోర్లే వంతుకు వచ్చింది."

"ఔను. దానివల్ల సక్రమమైన ప్రయోజనాన్ని పొందటం మీకు బాగా తెలుసు. మీ రు తరువాత దానిని విచ్ఛిన్నం కాకుండా చూసి, కావాలని మోహపడే ఒక సంస్థకు ఇచ్చి వేస్తారని నమ్ముతున్నాను."