అశ్వలక్షణసారము/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

భాషాభిమానులారా!

ఈగ్రంథరాజమును బహువ్యయప్రయాసలకోర్చి గౌతమీ పుస్తకభాండాగారము నందలి తాటియాకు పుస్తకమునుండి యెత్తి వ్రాసితిని. అద్దానిని భైరవాచార్య పుత్రుడగు మనుమంచిభట్టను నాతఁడు రచించియుండెను. ఈతడు గ్రంథములో నొకచోట దాను శాలిహోత్రుడుచే మున్ను రచింపబడినదాని నాంధ్రీకరించినట్లు జెప్పియున్నాడు. (చూ. ప్రథమాంకురము 2 పద్యము) ఈత డీగ్రంథమును సాళువకంపభూపాలునకు అంకిత మొసంగెను. వీరికాలమును నిర్ణయించుటకు తగిన యాధారములు లభించుట లేదు. నాయల్పబుద్ధికి దోచినట్లుగ వివరణమును వ్రాసి స్ఫురింపలేదు. కొన్నిపద్యములు తప్పుబడి యుండునని దోచుచున్నది.

పాఠకులు నాప్రమాద జనితదోషముల మన్నించి పూర్వకవి శేఖరుడగు మనుమంచిభట్టుపై నాదరముంచి యభిమానింతురు గాక.

కాకినాడ,

ఇట్లు,

6.8.17.

మద్దూరి శ్రీరామమూర్తి

మనుమంచిభట్టు - హయలక్షణవిలాసము

టేకుమళ్ళ అచ్యుతరావుగారు, ఎం.ఏ., రాజమహేంద్రవరము

మనుమంచిభట్టారకుఁడు రచించిన హయలక్షణవిలాసము- ఓబలరాయనికొడు కగుకంపరాయనికి నంకితము చేయఁబడినది. ఏతద్గ్రంథములోఁ గంపరాయని గుఱించి చేసినవర్ణనములలో సాళువవంశబిరుదము లన్ని యుఁ గూర్పఁబడియుండుటచే నీతఁడును సాళువవంశస్థు డని యూహింపఁబడుచున్నది. మీసరగండ, బర్బరబాహా, రాయచౌహత్తమల్ల, ధరణీవరాహ, మోహనమురారి, కఠారిరాయ, కఠారిసాళువ - ఇత్యాదిబిరుదము - లన్నియు సాళువనృసింహరాయలును నాతనిదండనాయకుఁ డగు తుళువనరసరాయలును ధరించినట్లుగా వారియాస్థానకవు లగుపినవీరభద్రుఁడును, నంది మల్లయ్య ఘంటసింగయ్య కవిద్వయమువల్లను మనకుఁ దెలిసియున్నది. కావున నీబిరుదములను ధరించిన కంపరాయఁడు సాళువవంశములోనివాఁ డని యూహింపవచ్చును. అతను దండనాయకుఁ డని తెలియుచున్నది, గాని, యెవరియొద్ద దండనాయకుఁడుగా నుండెనో చెప్పుటకు వీలు లేదు. ఓబలకంపా యని పిలువఁబడుటచే నాతను, ఓబలరాయనికొడుకని స్పష్టము. ఆయోబలరాయఁ డెవరికొడుకో, యేకాలపువాఁడో స్పష్టముగాఁ దెలియదు. సాళువవంశములోని సాళువమంగునకు ఓబలుఁ డని యొక యన్న యుండెను. కంపరాయఁ డాయోబలుని పుత్రుఁడేమో యని సందేహము కలుగుచున్నది.

పొదిలిపట్టణపు దండకవిలెంబట్టి సాళువనృసింహరాయలును తెలుఁగురాయలును నొకకుటుంబములోనివారలే యని తోఁచెడిని. ఆకుటుంబములోఁ గూడ నిద్దఱు కంపరాయలు కాన్పించుచున్నారు. వీరి కెవ్వరికిని ఓబలరాయఁడు తండ్రిగా నుండలేదు.

కందుకూరి వీరేశలింగము పంతులుగారు తమయాంధ్రకవులచరిత్రలో మనుమంచిభట్టుకాలము నిర్ణయము చేయలేక ఓబలకంపరాయ డెవఁడో గుర్తింపలేక యట్టే విడిచిపెట్టిరి.

ఇట్లుండ నీకంపరాయని గుఱించి మఱికొన్ని చరిత్రాంశము లీగ్రంథమున నాదృష్టికి గోచరించినవి. వానియథార్థసందర్భములు విచారణీయము లు. ఈ గ్రంథమందు కొన్నిచోట్ల- పైఁబేర్కొనిన బిరుదములు గాక మఱికొన్ని బిరుదములు కాన్పించుచున్నవి. చాళుకీతిలక, సాళువకంప, చాళుక్యచూడామణీ, రాయగండరగౌళీ - యను సంబోధనము లచ్చ టచ్చట నున్నవి. కావున సాళువబిరుదములు వహించిన యీకంపనృపాలుఁడు చాళుక్యవంశములోనివాఁ డని చెప్పవచ్చును. సాళువనృసింహరాయలవంశస్థులు చాళుక్యవంశజు లని చెప్పికొనినట్లు కాన్పింపదు.

రాయగండరగౌళీ యనుబిరుదము సాళువవంశస్థు లెవ్వరును వహించినట్లు కనుపట్టదు. ఈ బిరుదమును గుఱించి మ. రా.రా. నేలటూరి వెంకటరమణయ్య M. A. P. H. D గారు 1929 సం॥ జూన్ నెల భారతిసంచికలో వ్రాసిన ఆరవీటివంశచరిత్రమం దిట్లు వ్రాసిరి. "కొటికంటి రాఘవుడు (ఆరవీటితాత పిన్నమరాజు కొడుకు) కంపిలిరాజు సైన్యముల జయించి యాతని రాజ్యసప్తాంగముల హరించి 'గండరగూళి' యను బిరుదంబు గొనియె నట. ఆరవీటి వంశరాజులందు గొంద ఱీబిరుదమును ధరించినవారు గలరు. సంగరాంగణచర్య కంపిలిరాయసప్తాంగ గండరగూళి సద్బిరుదాదిసంగ్రహణోజ్వలా' యన్న పద్యభాగము వల్ల దెలియుచున్నది."

ఇంతియే గాక మఱియొక చక్కని చరిత్రాంశము నాసూక్ష్మపరిశీలనకుఁ గాన్పించినది. ఈ గ్రంథమందలి మూఁడవ యాశ్వాసము మొదటి పద్యమున నిట్లున్నది.

క. శ్రీకరకటాక్ష విజయ, శ్రీకాంతా, కృష్ణరాయ సిద్ధకృపాణా
               స్వీకృతఫలసత్వర పర, భీకరభటయూథ కంపపృథ్వీనాథా.

అనఁగా "మంగళప్రదమైన కటాక్షము గలవాఁడా, విజయలక్ష్మి వరించినవాఁడా, కృష్ణరాయనికి సిద్ధమైన ఖడ్గము ధరించినవాఁడా............" యని యర్థ మిచ్చుచున్నది. ఇందు, కృష్ణరాయనికి సిద్ధముగా ఖడ్గమును ధరించినవాఁడా యనుటచే నీకంపరాయఁడు శ్రీకృష్ణదేవరాయల కాలములో నుండి యాచక్రవర్తిక్రింద సన్నిహితదండనాయకుఁడుగా నుండిన ట్లూహింపవచ్చును. నే నెఱిఁగినంతవఱకు, కృష్ణదేవరాయని సైన్యాధిపతులలో నీయోబలకంపరాయని పేరు కాన్పింప లేదు. చరిత్రాన్వేషణపరాయణు లగుపండితోత్తము లీవిషయమును నిర్ణయింతురుగాక!

మనుమంచిభట్టారకుఁడు బ్రాహ్మణుఁడు, భైరవాచార్యునిపుత్రుఁడు, ఏదే శస్థుఁడో చెప్పుట కాధారములు లేవు. పేరునుబట్టి బహుశః కర్నూలు గుంటూరుసీమలవాఁ డని యూహింపవచ్చును. కవితాచాతురీధురీణుఁ డనియు, నిఖిలభాషాప్రవీణుఁ డనియు, తాను జెప్పికొనెను. ఈకవి రచించిన హయలక్షణవిలాసము, అయిదాఱాశ్వాసముల గ్రంథ మైనను ప్రస్తుతము మొదటి మూఁ డాశ్వాసములును, నాల్గవయాశ్వాసమునఁ గొంతభాగమువఱకే లభ్యమైనది. కొన్ని వ్రాతప్రతులలో, ఆశ్వాసములకు బదులుగా అధికారము లనుపేరు కాన్పించుచున్నది.

ఏతద్గ్రంథమందు, అశ్వప్రశంసయు, ఆవర్తలక్షణంబును, దశక్షేత్ర విభాగంబును, గంథలక్షణంబును, పుండ్రలక్షణంబును, నిదానలక్షణంబును, చికిత్సయును, లవణవిధియును, ఉదకవిధియును, ఘాసఖాణప్రకారంబులును, గ్రమంబునం చెప్పంబడినవి.

మనుమంచిభట్టారకుఁడు రచించిన గ్రంథభాగ మేగ్రంథమున కనువాదమో చెప్పుటకు వీలు లేదు. ఈ గ్రంథమును శాలిహోత్రాది సంసృతకవుల యశ్వశాస్త్రములతో సరిచూచి భాషాంతరీకరణవిషయమును నిర్ణయించుటకు నాకాగ్రంథము లెవ్వియుఁ జిక్కుట లేదు. ఈగ్రంథముయొక్క మాతృకను కనిపెట్టి దానికిని దీనికిని గల పోలికలను నిర్ణయించుట యే విమర్శకులైనను జేయఁబూనినయెడల నేతద్గ్రంధవిమర్శనము సమగ్రము కాఁగలదు.[1]

మనుమంచిభట్టారకుని శైలి చాల రసవంతముగా నుండి కడుహృద్యమైనది. సామాన్యజనులకు రుచిగలుగని పశుశాస్త్రవిషయ మైనను, ఈకవి తనశైలీమాధుర్యముచే మనోరంజకముగాఁ జేయఁగలిగెను. అచ్చ టచ్చట చక్కని యుపమాద్యలంకారములు వాడుకచేసియు, ద్రాక్షాఫలగుళుచ్ఛములవలె మనోజ్ఞ మగు పదజాలము నుపయోగించియు, మృదులకవితాపాకమును మంజుల నిక్వాణగతిని మేళవించియు, హృదయానురంజకముగాఁ జేయఁగలిగెను. నన్నయాదికవులయందువలె సంస్కృతశబ్దజాల మెక్కువగా నున్నను, అన్వ యక్లిష్టత గాని, శబ్దకాఠిన్యము కాని కానంబడవు. కావ్య మంతయు, నింపు సొంపులతోఁ గులుకుచున్నది. ఈ క్రింది పద్యముల మురువంపుహరువుం దిలకింపుఁడు.

శా. వేణుక్రౌంచమృదంగదుందుభిలసద్వేవేద్రనాగోల్లస
    ద్వీణావారిద మంజునాదములకున్ వియ్యంబులై యొప్పుని
    క్వాణంబుల్ గలవాజి యిచ్చు పతికిం గల్యాణముల్ కంపనా
    క్షోణీపాలక సుప్రతాప శుభముల్ స్తోత్రైకపాత్రంబులున్.
 
ఉ. సారపు నీలమేఘములఛాయలు ఛాయలఁబోవనాడి యం
     భోరుహకోమలద్యుతికి బొమ్మల బెట్టి ప్రసన్నమై యంకూ
     రరుచిప్రభావములఁ బోర జయించి మనోహరాకృతిన్
     వారణ నొప్పుమీఱునది వాజుల కెల్ల గుమారమన్మథా.

ఆశ్వికసైన్యబల మధికముగా నుండుటచే నశ్వపతులని పేరొందిన తురుష్కప్రభువులతోఁ బోరాడుటకు విజయనగరరాజులును, అశ్వదళములను గొని విదేశములనుండి తెప్పించుచు వచ్చిరి. అశ్వముల నెక్కుడుగా నుంచుకొనుటచే అశ్వపరీక్ష యవసర మయ్యెను. కావున సంస్కృతములో నున్న శాలిహోత్రుఁడు మున్నగువారు రచించిన అశ్వశాస్త్రగ్రంథములను దేశభాషలలో భాషాంతరీకరింప నవసర మయ్యెను. కన్నడభాషలో అభినవచంద్రుఁడను బ్రాహ్మణకవి క్రీ॥ వె॥ 1400 సం॥రంలో అశ్వవైద్య మను గ్రంథమును రచించెను. తెనుఁగున మనుమంచనభ ట్టీయశ్వశాస్త్రమును సులభమైన శైలిని రచించి యాంధ్రదేశీయుల కపార మగు మేలొనరించెను.

చ. అరయఁగ సర్వలక్షణ సమంచిత మైన తురంగరత్న మే
    నరునిగృహంబునం దొకదినంబున నుం దగురీతి నుండు నా
    పరమపవిత్రగేహమునఁ బాయక నిల్చు రమావధూటి శ్రీ
    ధరునియురఃస్థలింబలె ముదం బెసలారఁ బ్రసన్నచిత్త యై.


____________
  1. ఈగ్రంథముతోపాటు మఱియొక గ్రంథభాగము గూడ కలసి యచ్చుపడియున్నది. ఆభాగమును అశ్వశాస్త్రసంబంధ మైనదియే. అది కొంకణపతియగు కన్నరాజున కంకితము చేయఁబడినది. ఆకన్నరాజు మల్లయామాత్యునకును భీమాంబకును పుత్రుఁడు. అతనికి రాయచౌహత్తమల్ల యను బిరుదముగలదు. కవియెవరో తెలియదు.