అళియ రామరాయలు/P55

వికీసోర్స్ నుండి

రెండవ ప్రకరణము

కృష్ణరాయలు రామరాయలు

శ్రీకృష్ణదేవరాయలవారు సకలసామ్రాజ్యభోగముల ననుభవించుచు ద్రావిడాంధ్ర కర్ణాటసామ్రాజ్యమును మహావైభవముతో నిరంకుశముగా నేలుచున్నకాలమున నాతనికి లోపడిన సామంతమండలేశ్వరులలో నొక్కడగు మహామండలేశ్వర రామరాజ పెదశ్రీరంగదేవమహారాజు కందనోలుమండలమునకు నధిపతిగా నుండి పరిపాలనము చేయుచుండె నని కంనోలుపురమునందలి యొకశాసనమునుబట్టి దెలిసికొనుచున్నారము.[1] ఇతఁడే అళియరామరాయల తండ్రి. అళియరామరాయల బాల్యచరిత్ర మెంతమాత్రమును దెలియ రాదు. మహమ్మదుకూలీకుతుబ్షా రాజ్యమునకు సరిహద్దున నున్న మండలము కందనోలుమండలమె. ఈ మండలమును అళియరామరాయల తండ్రి మాత్రమె గాదు; తాతయగు బుక్కయరామరాజు గూడఁ బాలించె నని పూర్వ ప్రకరణమునఁ దెలిపియున్నాను. బుక్కయరామరాజు విజాపురసుల్తా నగుఆదిల్షాహ డెబ్బదివేలయాశ్వికసైన్యముతో దండెత్తివచ్చి కందనోలు ముట్టడించినపుడు వానినోడించి తఱిమినట్లుగా పద్యబాలభాగవతమునందును నరపతివిజయమందును వర్ణింపఁబడినవిధమును గూర్చి పూర్వ

  1. 156 of 1905, E. R.