అళియ రామరాయలు/P222

వికీసోర్స్ నుండి

టాద్రి విజాపురసుల్తానుసైన్యములలో స్వతంత్రముగాఁ బోరాడుచున్నను రామునకులక్ష్మణునకువలె రామరాయలకుఁ గూడఁ జాల తోడ్పడుచుండెను. ఇతఁడు మహాయోధుఁడనియు విక్రమార్జునుఁడనియు నెల్లవా రెఱుంగుదురు. ఇతఁడే ప్రప్రధమమున తురుష్క సైన్యముల నెదిరించినవాఁడు. వేంకటాద్రి యిరువదివేలు హయదళమును, రెండులక్షల కాల్బలముతోడను, ఏనూరుగజదళముతోడను శత్రుసైన్యమును దాకి విశేషనష్టమును గలిగించెను. విజాపురసుల్తానగు ఆలీఆదిల్ షా వేంకటాద్రి తాకున కోర్వఁజాలక తనకేర్పఱిచిన స్థానమును విడిచిపెట్టెనని 'బురహాన్-ఈ-మాసీర్' అను గ్రంథముకూడ నొప్పుకొనుచున్నది. ఇదే విధముగా తిరుమలరాయలును, వాని పెద్దకుమారుఁడగు రఘునాధరాయలును గోల్కొండ, బీదరుసుల్తానుల సైన్యముల నొదుర్కొని జయప్రదముగాఁ బోరాడుటచేత సుల్తానుల సైన్యములు పలాయనము లయ్యెనని పైగ్రంథమె స్పష్టముగా వక్కాణించుచున్నది. ఈరఘునాధరాయ లిదివఱకొకమాఱు యుద్ధములో నహమ్మదునగరసుల్తాను సైన్యములను కృష్ణకావలియొడ్డునకు దఱిమియుండెనని వసుచరిత్రమున వక్కాణింపఁ బడినదిగాని యియ్యది యీయుద్ధసంబంధమైనదిగాఁ గనుపట్టదు. వేలకొలది సుల్తానుసైనికులు రణభూమికి బలి కాఁబడిరి. గోల్కొండ, బీడరుసైన్యములు వెనుకకు మరలుటచేత తిరుమలరాయల సైన్యములు హుస్సేనునిజాముషా సైన్యములను