అమ్మ ఒడి
ప్రచురణ
జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్
ఆల్ ఇండియా పీపుల్స్ సైన్సు నెట్వర్క్ అనుబంధం
అమ్మ ఒడి
బడిలో పరీక్షలు అయిపోయాయి. రెండు నెలలు సెలవులిచ్చారు. పిల్లకాయలు ఎగిరి గంతేశారు. వాళ్ళ సంతోషం అంతా ఇంతా కాదు. గట్టు తెగిన చెరువులా ఊరి మీద పడ్డారు. ఒకటే అల్లరీ, అరుపులూ. ఊరూ వాడా ఏకం చేస్తున్నారు.
ఆ ఊళ్లో పిల్లలకి - బడికీ జైలుకీ తేడా లేదు. బళ్ళో టీచర్లు ఏమోమో చెబుతుంటారు. అదేమీ అర్థమై చావదు. టీచర్ల లోకం టీచర్లది. పిల్లల లోకం పిల్లలది. ఎంతసేపూ “చదవండ్రా, చదవండ్రా' అంటారు. చదవకపోతే చావగొడతారు. గోడ కుర్చీలు వేయిస్తారు. వేడి ఇసుకలో మోకాళ్ళ మీద నిలబెడతారు. ఎన్ని చేసినా అక్షరం ముక్క వస్తే ఒట్టు. పిల్లలకి బడి గంట మీదే లోకువ. రెండు నెలల సెలవులంటే మాటలా? ఎంత సంబరంగా వుంటుంది! ఇంతకంటె పండగ మరేముంటుంది?
పిల్లలు గోలగోల చేస్తున్నారు. కేరింతలు కొడుతూ ఊరంతా తిరుగుతున్నారు. వాళ్ళలో రంగడు కూడా ఉన్నాడు. ఆ ఊళ్ళో అల్లరి పిల్లలందరికీ వాడే నాయకుడు. బడిలో టీచర్లు వాడ్ని రోజూ చావగొడుతుంటారు. అయినా వాడికి ముప్పై కంటే ఎక్కువ మార్కులు రావు. ఎలాగో తంటాలు పడి ఒక్కో తరగతి పాసవుతున్నాడు. ఇప్పుడు ఏడులోకి వచ్చాడు. ఇక ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతాడో ఏమో!

రంగడికి చదువైతే అబ్బలేదు. కాని అల్లరిలో మాత్రం వాడికి వాడే పోటీ. రోజు కొకరైనా వాళ్లమ్మ దగ్గరికి రావల్సిందే. రంగడిమీద ఏదో ఒకటి చెప్పాల్సిందే. వాళ్ళమ్మకు వాటితో తల బొప్పి కడుతోంది.
"మీ వాడు మా అబ్బాయిని నెత్తురు కారేలా గిచ్చాడు."
"మా బిడ్డను కాలువలో ముంచేశాడు. ఏడి వాడు?"
"మా అమ్మాయి గౌనుకు పేడ పూసాడు."
"మా వాడ్ని రాయితో కొట్టాడు."
ఇలా పూటకొక గొడవ తెస్తాడు.
ఒకసారి రంగడు పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. అటుగా పోతున్న ఓ పెద్దాయన - “బుద్ధిగా చదువు కోరాదట్రా. ఇలా అడ్డగాడిదలా ఎందుకు తిరుగుతున్నావురా?” అన్నాడు. అంతే. మరునాడు గోడ చాటు నుంచి రంగడు రాయి విసిరాడు. పాపం ఆ పెద్దాయన మాడు పగిలింది.
ఈ సంగతి రంగడి అమ్మకు తెలిసింది. ఆమె వాడ్ని చితకబాదింది. చివరకు “అబ్బబ్బా! ఇక నీ ఆగడాలు నేను భరించలేనురా. సిగ్గు లేదట్రా? దీనికంటె చావరాదట్రా. చచ్చి మీ నాన్న సుఖపడ్డాడురా. నీ ఆగడాలతో వేగలేక నేను చస్తున్నా." అంటూ పెద్దగా ఏడ్చింది.
ఆమెకు కడుపు మండినప్పుడు అట్లాగే ఏడ్చేది. అప్పుడు మాత్రం రంగడు తలొంచుకొనేవాడు. పాపం వాడి నాన్న చనిపోయాడు. నాన్నను తలచుకొని అమ్మ ఏడిస్తే వాడు తట్టుకోలేక పొయ్యేవాడు. చప్పుడు చేయకుండా ఓ మూల కూచునేవాడు. ఎవ్వరితో మాట్లాడేవాడు కాదు. అయితే అది ఎంత సేపని. ఓ గంట మాత్రమే అలా ఉండేవాడు. ఈలోగా కిష్టయ్యతో తగాదా వచ్చేది.
కిష్టయ్య అంటే రంగడి తమ్ముడు. వాడు ఎప్పుడూ చదువుకొంటూనే ఉంటాడు. క్లాసులో ఎప్పుడూ వాడే ఫస్టు.
అమ్మకు కిష్టయ్యంటే మహా ఇష్టం. రంగడికి వాడంటే మంట. ‘ముచ్చుమొగం' అని తిడతాడు. బడి నుంచి కిష్టయ్య పరిగెత్తుకొని వస్తాడు. రంగడు చేసిన ఆగడాలు అమ్మకు చెపుతాడు. వాడు తిన్న దెబ్బలు కూడా అమ్మకు చెబుతాడు. ఇంకేముంది. అమ్మ వాకిటిలో నిలబడుతుంది. ఆమె చేతిలో కర్రో, చీపురుకట్టో ఉంటుంది. రంగడు బడినుంచి రాగానే చావగొడుతుంది. కిష్టయ్య ఏమీ ఎరుగని చుప్పనాతిలా చూస్తాడు. అమ్మ వెనక దాక్కుంటాడు. అందుకే వాడంటే రంగడికి కోపం.
ఇప్పుడు బడికి సెలవ లుగా! కుర్రకుంకలంతా మట్టిలో మకాం వేసేశారు. కాలవ గట్టున గోలగోలగా ఆడుకొంటున్నారు.
ఒకనాడు ఎక్కడి నుంచో ఓ పెద్దమనిషి వచ్చాడు. నడిచి నడిచీ బాగా అలసిపోయి ఉన్నాడు. "బాబూ! పులిచింత ఊరు ఇదేనా?” అని రంగడ్ని అడిగాడు.
రంగడు ఆయన వంక ఎగాదిగా చూశాడు. పిల్లల వంక తిరిగి కన్ను గీటాడు.
"ఇది కాదండీ. కాలవకు అవతల దూరంగా కనిపిస్తుంది. చూడండి. అదే పులిచింత." అన్నాడు పెద్దాయనతో. ఆయన రొప్పుకుంటూ అటు వైపు బయలుదేరాడు. నిజానికి పులిచింత రంగడి ఊరే. కావాలని అబద్ధం చెప్పాడు రంగడు. ఆ పెద్దమనిషి నమ్మాడు. ఆ దారినే పొయ్యాడు. ఆయన కొంచెం దూరం పోగానే అందరూ పగలబడి నవ్వారు. “హేహే” అని అరుస్తూ గెంతులు వేశారు.
కిష్టయ్య పరుగు పరుగున ఇంటికి పోబోయాడు. రంగడు ముందుకు దూకి వాడ్ని పట్టుకున్నాడు. "అమ్మకి చెప్పడానికేగా నువ్వు పరుగు పెడుతున్నావ్?" అని వాడి జుట్టు పట్టుకున్నాడు.
"లేదు. నేను నీళ్లు తాగేందుకు పోతున్నా." అన్నాడు కిష్టయ్య. ఆ మాటల్ని రంగడు నమ్మలేదు. “నాకు తెలుసులేరా. నువ్వెందుకు పోతున్నావో.” అంటూ వాడ్ని నేల మీదకు తోశాడు. వాడు మట్టిలో వెల్లకిలా పడ్డాడు. అందరూ నవ్వారు. వాడికి అవమానంగా అనిపించింది. బాగా కోపం వచ్చింది. "పోరా! పాలకోవా!" అన్నాడు ఉక్రోశంగా. 'పాలకోవా' అంటే రంగడికి చెడ్డ కోపం. ఎందుకో తెలుసా?
ఒకరోజు వాళ్ళ పక్కింటి కుర్రాడు పాలకోవా తింటున్నాడు. రంగడు తనకు కొంచెం పెట్టమన్నాడు. వాడు అందుకు ఒప్పుకోలేదు. అంతే. వాడి చేతినుంచి పాలకోవా లాక్కున్నాడు. గుటుక్కున మింగేశాడు. వాడు అరిచి గీపెట్టాడు. ఆరోజు రంగడు అమ్మచేతిలో బాగా దెబ్బలు తిన్నాడు. అప్పటి నుంచి కిష్టయ్య రంగడిని 'పాలకోవా' అనేవాడు. ఎగతాళి చేసేవాడు. అందుకే కిష్టయ్య “పోరా పాలకోవా” అనగానే వాడికి బాగా కోపం వచ్చింది. కిష్టయ్యను ఎడా పెడా వాయించాడు. వాడి దెబ్బలకు కిష్టయ్య తెలివి తప్పాడు. అయినా వాడి కోపం తగ్గలేదు. గట్టిగా ఓ తన్ను తన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
సాయంత్రమైంది. చీకటి పడసాగింది. అయినా రంగడు ఇంటికి పోలేదు. పోతే అమ్మ బడితె పూజ చేస్తుంది. కిష్టయ్య ఈపాటికి అన్నీ చెప్పేసి ఉంటాడు. మిగతా పిల్లలు కూడా సాక్ష్యం పలికి ఉంటారు. అమ్మ తనను చావబాదడం ఖాయం! అయినా అంత మంది పిల్లల ముందు కిష్యయ్య తనను వెక్కిరించొచ్చా? వాడు 'పాలకోవా' అన్నాడనేగా తనకు కోపం వచ్చింది. అయినాసరే అమ్మ వాడినేమీ అనదు. తననే తప్పు పడుతుంది. ముంగిలిముచ్చి వెధవ. ఏమైనాసరే ఈరోజు ఇంటికి వెళ్ళకూడదు - అనుకున్నాడు రంగడు. ఒక గుడి వరండాలో పడుకొన్నాడు.
కాని ఎంతసేపని వాడు గుడిలో పడుకోగలడు. కడుపులో ఆకలి దంచేస్తోంది. తట్టుకోలేక పోయాడు. 'ఏమైతే అది అయ్యింది' అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు. భయపడుతూనే ఇంటికి చేరాడు. పిల్లిలాగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. మాంసం కూర వాసన కమ్మగా తగిలింది. అరె! ఇదేమిటి? పండగ లేనిదే అమ్మ మాంసం కూర వండదే. ఈ రోజు ఏ పండగా లేదే! ఆశ్చర్యపోతూ అటూఇటూ చూశాడు.
అమ్మ వాడి చేతిని గట్టిగా పట్టుకుంది. మరో చేత్తో చీపురుకట్ట తీసుకొంది. "పసివాడ్ని గొడ్డును బాదినట్టు బాదుతావురా!" అని
ఆ పెద్దాయన ఎవరో కాదు. "పులిచింత ఇదేనా బాబూ?" అని అడిగినాయన!
ఆయన రంగడి మేనమామ. హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. రాకపోకలు అంతగా లేవు. అందుకే రంగడు గుర్తు పట్టలేకపోయాడు. ఆయనా రంగడిని గుర్తు పట్టలేకపోయాడు.
మేనమామ పుణ్యం. రంగడికి ఆపూట దెబ్బలు తప్పాయి. కడుపు నిండా తిని హాయిగా పడుకున్నాడు. ఉదయం లేచేసరికి అంతా హడావుడిగా ఉంది.
మామయ్య ఊరికి పోవడానికి తయారవుతున్నాడు. “తొందరగా తయారవ్వు. నువ్వు కూడా మీ మామయ్యతో వెళ్ళాలి." అంది అమ్మ. రంగడు అయోమయంగా చూశాడు. వాడికి వెళ్ళాలనీ ఉంది. వెళ్ళొద్దనీ ఉంది. ఏమీ తోచలేదు. అమ్మ చెప్పినట్టే చేశాడు. గబగబా తయారయ్యాడు.
ముందురోజు రాత్రి ఒక సంగతి జరిగింది. రంగడి అమ్మ తన అన్నయ్యతో అన్నీ చెప్పింది. రంగడి ఆగడాల గురించి చెప్పింది. చదువులో వెనకబడటం గురించి చెప్పింది. అన్నీ చెప్పి ఏడ్చింది.
"నువ్వేమి బాధ పడకమ్మా. వాడి సంగతి నాకు వదిలేసెయ్. ఇక నుంచి వాడి బరువు నేను తీసుకుంటాను. రేపు నాతో పాటు వాడ్ని కూడా తీసుకెళ్తాను. నా దగ్గరే ఉంచుకొని చదివిస్తాను.” అన్నాడు రంగడి మేనమామ. అమ్మ మనసు తేలికపడింది. "ఇంతకంటే ఏం కావాలి” అనుకుంది. రంగడు లేకుండా తాను బతగ్గలదా? అయినా తప్పలేదు. బాధ పడుతూనే వాడ్ని పంపించింది.
మామయ్యతో కలిసి రంగడు హైదరాబాద్ బయలుదేరాడు.
★ ★ ★ ★ ★ ★
హైదరాబాదులో అంతా కొత్తగా ఉంది. పొలాలు లేవు. చెరువులు లేవు. తోటలు లేవు. కాలువ గట్లు అంతకన్నా లేవు. ఎటు చూసినా ఇళ్ళే. పెద్ద పెద్ద మేడలు! ఆడుకోడానికి చోటు లేదు. ఆడుకుందామన్నా స్నేహితులు లేరు. బిక్కుబిక్కు మంటూ రంగడు ఇంట్లోనే ఉండసాగాడు.
మామయ్య స్నేహితుడు ఒకాయన టీచరుగా పని చేస్తున్నాడు. ఆయన పని చేస్తున్న స్కూల్లో రంగడ్ని చేర్చారు. ఏడవ తరగతిలో చేరాడు. బడిలో కూడా ఆడుకోడానికి చోటు లేదు.
రంగడ్ని తీసుకురావడం వాళ్ళ అత్తయ్యకి ఇష్టం లేదు. అందుకే ప్రతిదానికి వాడిని కసురుకుంటోంది. మాటిమాటికి వాడి మీద కేకలు వేస్తోంది. "ఊళ్లోనే అన్ని ఆగడాలు చేశాడు. ఇక్కడ ఇంకా ఏం చేస్తోడో!" అంది అత్తయ్య.
హైదరాబాదులో మంచినీళ్ళకి కటకటగా ఉంటుంది. వాళ్లుంటున్న వీధిలో మరీ ఎక్కువ. రెండ్రోజులకు ఒకసారి మంచినీళ్ళ లారీ వస్తుంది. కడవలు పట్టుకుని జనం లారీ వెనక పడతారు. ఒకర్నొకరు తోసుకుంటారు.
రంగడి మీద నీళ్లు తెచ్చే పని పడింది. వాడికి అది కష్టంగా ఉంది. అయినా చేయక తప్పలేదు. మెల్లమెల్లగా ఒక్కో పని వాడి మీద పడ్డాయి. ఇప్పుడు వాడు నీళ్లు మోస్తున్నాడు. బట్టలుతుకుతాడు. బజారుకు పోయి సామాన్లు మోసుకొస్తాడు. అంట్లు కడుగుతాడు. ఇన్ని చేసినా అత్తయ్యకు సంతోషం లేదు. వాడిని ప్రతిరోజూ తిడుతుంది.
రంగడికి స్కూలు ఫీజు కట్టాలి. వాడికి బట్టలు కుట్టించాలి. పుస్తకాలు కొనాలి. జ్వరమొస్తే మందూ మాకూ ఇప్పించాలి. వీటన్నిటికి అత్తయ్య తిట్టిపోస్తోంది. 'తాను దూర కంత లేదు. మెడకొక డోలు' అంటూ మామయ్యను కూడా దెప్పి పొడుస్తోంది.
రంగడికి బాధగా ఉంది. తాను ఇన్ని పనులు చేస్తున్నాడు. అయినా అత్తయ్య ఎందుకు తిడుతుంది? వాడికేమి అర్థం కాలేదు. ఈమధ్య మాటిమాటికి తలనెప్పి వస్తోంది. రాత్రి పూట నిద్ర పట్టడం లేదు. పనులన్నీ చేసి బడికి పోయేసరికి ఆలస్యమవుతోంది. బడిలో రోజూ బెంచీ మీద నిలబెడుతున్నారు. పాఠాలు బుర్ర కెక్కడం లేదు. ఇంటికి పోగానే చదువుకోవాలనుకుంటాడు. కాని అత్తయ్య పనులు చెబుతుంది. అవన్నీ అయ్యేసరికి బాగా పొద్దు పోతుంది. అప్పుడు చదువుకోడానికి ఓపికుండదు. చదవకుండానే తెల్లారి బడికి పోతున్నాడు. బడిలో అడిగింది చెప్పలేకపోతున్నాడు. రోజూ దెబ్బలు పడుతున్నాయి.
టీచరు అప్పుడప్పుడు ఇంటికి వస్తాడు. "మీ పిల్లవాడు సరిగ్గా చదవడం లేదు." అని ఫిర్యాదు చేస్తాడు. ఆ రోజు అత్తయ్య ఇంకో గంటసేపు రంగడ్ని తిడుతుంది. వాడు తల వంచుకుంటాడు. మూగవాడిలా నిలబడతాడు. లోలోపల కుమిలిపోతాడు. రాత్రిపూట రంగడు ఏడుస్తాడు. వాడికి ఊరు గుర్తొస్తుంది. అక్కడి స్నేహితులు గుర్తొస్తారు. అమ్మ, తమ్ముడు గుర్తొస్తారు. నిద్రపోతే కలలోనూ వాళ్ళే కనిపిస్తారు. వాడికి చాలా బెంగగా ఉంది. “మామయ్యా! నన్నొకసారి ఊరికి పంపించవా!” అని దీనంగా అడుగుతాడు. "సెలవులొచ్చాక వెళ్తువుగానీ." అంటాడు మామయ్య.
ఒకరోజు రంగడి లెక్కల నోటుబుక్కు పోయింది. దానికోసం వాడు వెదకని చోటు లేదు. ఎంత వెదికినా లాభం లేకపోయింది.
“నోటుబుక్కు లేకుండా బడిలోకి రావొద్దు" అని టీచరు అన్నాడు.
"నీ కోసం రోజుకో నోటుబుక్కు ఎక్కడ తేగలం. ఇక్కడేమన్నా డబ్బులు పోగేసి పెట్టామా. పో.. పోయి ఆ బుక్కు ఎక్కడ పారేశావో వెదికి తీసుకురా.” అని అత్తయ్య తెగేసి చెప్పింది.
పాపం రంగడికి దిక్కు తోచలేదు. ఏం చేయాలో తోచలేదు. ఆ రోజంతా దారిలో కూచుండి పోయాడు. సమయానికి మామయ్య కూడా ఊళ్లో లేడు.
రెండు రోజుల తర్వాత మామయ్య వచ్చాడు. వస్తూ వస్తూ పిల్లలకు మిఠాయిలు తెచ్చాడు. "రంగడు ఎక్కడ?” అని అడిగాడు. “ఎక్కడ చచ్చాడో ఏమో. రెండు రోజులుగా ఇంటికి రాలేదు.” అంది అత్తయ్య.
మామయ్య ఊరంతా వెదికాడు. చివరకు ఓ రోడ్డు పక్కన రంగడు కనిపించాడు. వాడి బట్టలు దుమ్ముకొట్టుకు పోయాయి. తెలివి తప్పి పడి ఉన్నాడు. జ్వరంతో వాడి వళ్లు కాలిపోతోంది. పుస్తకాల సంచి వాడి పక్కనే ఉంది. “అమ్మా అమ్మా" అంటూ మూలుగుతున్నాడు.
ఆటోలో పడుకోబెట్టి రంగడ్ని ఇంటికి తీసుకొచ్చారు. డాక్టర్ని పిలిచి చూపించారు. ఆయన సూదిమందు ఇచ్చాడు. ఇంకా చాలా మాత్రలు రాసి ఇచ్చాడు. మామయ్య అన్నిట్నీ కొన్నాడు. రెండు వారాలు గడిచాయి. అప్పటికిగాని వాడి జ్వరం పూర్తిగా తగ్గలేదు. మనిషి సగానికి సగమైపోయాడు. పూచిక పుల్లలా తయారయ్యాడు.
“అమ్మ కావాలి. తమ్ముడు కావాలి. ఇంటికి వెళ్తాను మామయ్యా.” అని ఏడ్చాడు.
“పోదువు లేరా. సెలవులు రానీ.” అంటూ మామయ్య ఓదార్చాడు. రంగడు రోజులు లెక్క పెడుతున్నాడు. కన్ను మూసినా తెరిచినా ఇల్లే గుర్తుకొస్తోంది.
ఇంకొన్ని నెలలు గడిచాయి. పెద్ద పరీక్షలు అయిపోయాయి. బడికి ఎండాకాలపు సెలవులిచ్చారు. ఒక్కరోజు కూడా రంగడు ఉండలేకపొయ్యాడు. ఊరికి బయలుదేరాడు.
ఊళ్ళోకి అడుగుపెట్టగానే వాడికి ప్రాణం లేచి వచ్చింది. కళ్ళల్లో జివ్వున నీళ్ళు చిమ్మాయి. ఎంత మంచి ఊరు తనది! ఇలాంటి ఊరిని వదిలిపెట్టి పోయాడా తను! వాడికెందుకో ఏడుపు కట్టలు తెంచుకొంది.
రంగడు వచ్చేశాడు. ఈ సంగతి నిమిషాల్లో ఊరంతా పాకింది. ఎక్కడెక్కడి పిల్లలూ వచ్చేసారు. ఎలాంటి రంగడు! అందర్నీ ఊరంతా తిప్పే రంగడు. కాలవగట్లు ఎగిరించే రంగడు. చెట్టెక్కించే రంగడు. కోతికొమ్మచ్చి లాడించే రంగడు. రంగడుంటే చాలు. లోకమంతా వాళ్ళదే. అల్లరంతా వాళ్ళదే. అలాంటి రంగడు. మళ్ళీ వచ్చేశాడు. మళ్ళీ ఊళ్ళో పిల్లలందరికీ పండగొచ్చేసింది. వచ్చిన రంగడు ఇంట్లోకి దూరాడు. అమ్మను వాటేసుకొన్నాడు. తమ్ముణ్ణి వాటేసుకొన్నాడు. వాడేమీ మాటాడ్డంలేదు. ఇంట్లోంచి తల కూడా బయట పెట్టడం లేదు. తమ్ముణ్ణి వదిలిపెట్టడం లేదు.
రాత్రిపూట రంగడు చిన్న బిడ్డలా అమ్మ ఒళ్ళో దూరిపోతున్నాడు. ఒక్కోసారి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అమ్మ వాడి తల నిమురుతోంది.
“నా బంగారు కన్నా. నా చిట్టి తండ్రీ! నువ్వు బాగా చదవాలిరా. మీ నాన్న పేరు నిలబెట్టాలిరా. మీ తమ్ముణ్ణి చదివించాలిరా.” అని కన్నీళ్ళతో అమ్మ చెబుతుంది.
రంగడికి మాత్రం ఓ సంగతి గుర్తుకొస్తుంది. తాను జ్వరంతో రోడ్డు మీద పడున్న సంగతి. బడిలో బెంచీ మీద నిలబెట్టే సంగతి. వాడి కళ్ళల్లో మళ్ళీ నీళ్ళు ఉబుకుతాయి. అమ్మకు ఏమేమో చెప్పాలనుకొంటాడు. చెప్పలేడు. అమ్మ ఒళ్ళో అలాగే తలపెట్టుకొంటాడు. మెల్లగా నిద్రలోకి జారుకొంటాడు.
అమ్మ ఒడి
లెవల్ - 4
ప్రచురణ నెం :
మొదటి ముద్రణ : 1992
ఆంగ్ల మూలం : రవీంద్రనాధ్ ఠాగూర్
అనుసృజన : ఎ.జి. యతిరాజులు, కె. ఆదర్శ సామ్రాట్
సీరీస్ సంపాదకుడు :
© వి. బాలసుబ్రహ్మణ్యం
ప్రచురణ :
జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్
AIPSN అనుబంధం
వెల: 10/-
ప్రతులకు :
వి. బాలసుబ్రహ్మణ్యం
27-1-1304, బాలాజీ నగర్,
నెల్లూరు - 524402.
ఫోన్ : 0861 - 2320610
అన్ని ప్రజాశక్తి బుక్ హౌస్లు
సూచనలకు, వివరాలకు :
సి.వి. కృష్ణయ్య, కన్వీనర్, జె.వి.వి. విద్యావిభాగం
15/65 డా॥ సౌందర్ రాజన్ బిల్డింగ్,
బృందావనం, నెల్లూరు - 524001.
ఫోన్ : 0861-2311558
సి. మోహన్, కన్వీనర్, జె.వి.వి. ప్రచురణల విభాగం
ఫోన్ : 0877- 2244551
ముద్రణ : విజయవాణి ప్రింటర్స్, చౌడేపల్లె - 517257 This work is released under the Creative Commons Attribution-Share Alike 4.0 International license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed—and if you alter, transform, or build upon this work, you may distribute the resulting work only under the same license as this one.