అమ్మనుడి/సంపుటి 6/ఫిబ్రవరి 2021/మా ఊరు
హోసూరు తావు నవల
అగరం వసంత్ 094883 30209
“ఏెమి సిక్కనోనికి సద్ది సిక్కితే తిరిప్తిగంటా తిరిగి చూడకుండా తింటా పోయెనంటా అట్లా నాయాళ్లప్పా ఈ ఉడుకు (వయసు) చిన్నోళ్లు. ఊరి ముందర రచ్చతావ కూకొౌని పుంగు మాటలు చెప్పేదాంట్ల వీళ్లని మీరినోళ్లు ఇంగెవురు లేదు” వెళ్ళాసముగా అనె పిల్లన్న తాత.
“వాళ్లకి దానికన్నా పంగేముంది, రాగులు, వడ్లు వచ్చి ఇండ్లు చేరిండాయి కదా, తినేది, తిరిగేది, ఆరట్లు కొట్టేది ఇదే పని” వక్మాకు నమలతా నారాయణన్న అనె.
ఆ పక్కనింకా ఆడబిడ్లు నడస్తా వస్తా వుండారు. వాళ్లను చూస్తానే ఉడుగు చిన్నోళ్లంతా కోతులు, ఉడతలు అయి మాన్లు ఎక్కిరి. పువ్వులు, కాయలు పీకి ఆడబిడ్లపైన వేసిరి.
ఇది కోతుల పనే అని ఆడబిడ్ల నగుకొని పోతావుండారు.
ఇది చూస్తానే రంగన్న తాతకి రేగిపోయె. వీళ్లకి ఎట్లన్నా బుద్ది చెప్పాలని యోచన చేస్తావుండె.
“తాగతా నీయబ్బ తాగతా, నీ సొమ్ము తాగతా నా సొమ్ము తాగతా ఎవడప్పా సొమ్మైనా ఎంతైనా తాగతా” పాట పాడతా వూగుకొని వస్తా వుండాడు కాపోళ్ల మునిగాడు.
“సారాయి సొర్గము సేద్యము నరకము రామసెంద్రా” అంటా ఎదురు పద్యము పాడి వాన్ని తన అద్దులా పెట్టుకొనె పిల్లన్న తాత.
ఇద్దరూ చేరి పనికివచ్చే పద్యాలు, పనికిరాని పద్యాలు పది పాడిరి.
“ఈ ఉడుకు చిన్నోళ్లు వుండారు చూడు మునిగా వీళ్లకి అద్దుపొద్దు లేదు. వాళ్లు ఆడిందే ఆట పాడిందే పాట. వీళ్ల రావిడికి వూరిలా వయసు ఆడబిడ్లు ఎవురూ పారాడేనట్లలే. అబుడే మీ వీదినింకా ఇద్దరు ఆడబిడ్లు వచ్చిరప్పా. వాళ్లను అడ్డమేసి, జడలు ఈడ్చి “గేలి చేసిరప్పా” అంటా మునిగాన్నీ కొండ ఎక్కించె.
అంతే మునీగానికి ఏడలేని కోపము వచ్చేసె. రచ్చతాకి పోయె.
"రేయ్! ఎవడ్రా అబుడే మా వీది ఆడబిడ్లని గేలి చేసింది. మీ ఇండ్లలా ఆడబిడ్లు లేరేంరా. మీ అక్కచెల్లెల్ని ఎవరైనా గేలి చేస్తే మీరు కలకుండా వుంటారా. మీకు సిగ్గు, శరము లేదేంరా, మిమ్మల్ని కాదురా మిమ్మల్ని పుట్టిచ్చిన వాళ్లని అనాలిరా” అనీ నోటికొచ్చిన మాట అని పెట్టేసె.
అందాతలికే ఊరివాళ్లు కొందరు వచ్చి, సమాచారము తెలుసుకొని తిట్టుమీద తిట్టు తిట్టి పెట్టిరి.
అంతే బిర్నా ఈ సమాచారము ఉడుకు చిన్నోళ్ల అమ్మలకి తెలిసిపోయె.
కొందరు అమ్మలయితే ఏమి జరిగె అని తెలుసుకోకుండానే వాళ్ల చిన్నోళ్లని పరకల్లా వేసిరి, అది చూసినంక పిల్లన్న తాతకి పరమాన్నము తినినంత ఆనందము ఆయె. నగుకొనీ ఇంట్లోకి వెల్లీసె.
ఆ పొద్దునింకా ఉడుకు చిన్నోళ్లు ఊరి వెనక వుండే చింత మాను తావుకి మకాం మార్చిరి.
“ఆ తాగుబోతు మునిగాని నింకా మనము వూర్ణా మానము పోగొట్టుకొంటిమి. వానికి ఈపొద్దు సరైన పూజ చేయాల” అని చిన్నోళ్లంతా వాడు వచ్చే దోవలా నిలిచిండారు.
వాడు వచ్చి మందుగుండు తీసుకొని పక్కలా వుండే మామిడి మాను తావ తాగేకి సురువు చేసె.
చిన్నోళ్లంతా మొకాలకి తువ్వాలు చుట్టుకొని వాని పక్కలా ఒగొగరే చేరిరి.
“మొన్న మన పక్కుర్లా ఆడబిడ్డని గేలి చేసిందానికి ఆవూరి జనాలు వాళ్లకి బాగా పూజ చేసిరంట” అంటా మాట్లాడిరి.
ఆ మాట వింటానే మునిగానికి రెక్కలకి నీళ్లు వేసినట్ల అయె. “అట్ల చేసింది ఎవరనుకొంటా వుండారుపా నేనే” వీరావేశముగాఅనె.
“నీ అట్ల అడిగేవాళ్లు చేసేవాళ్లు వుంటే ఊర్లు బాగు పదతాయినా” అంటా పురమాయిచ్చిరి. బాగా తాపి తినిపిచ్చిరి.
“అనా నువ్వు ఎబుడు చూసినా ఈడే వుంటావు కదా, వూర్లా నడిసే విషయాలు నీకెట్లా తెలుస్తాయనా?" సందేహము పడతా ఒగ చిన్నోడు అడిగె.
“నీ మాట నిజమే పా, నాకెట్ల తెలుస్తాది. నేను ఎబుడూ మాదిరిగానే నాపాటికి నేను పోతా వుంటినీ. మావూర్లా వుండే పిల్లన్నతాత నాకు అసలు విషయము చెప్పె” అనె.
“ఓ ఇదీ సమాచారము, మేము నిన్ను అకలాయముగా తంతావుంటిమే” అని మనసులా అనుకొని ఆడనింకా వచ్చిరి. పిల్లన్న తాతపైన కన్నేసిరి.
ఆపొద్దు మావూర్లా నాగులకు కాయలు కొట్టే పండగ. దీన్ని ఇంతకు ముందర టెంకాయల పండగని, ఈ నడమ వినాయకచవితి అని అంటావుండారు.
ఆదోళ్లంతా తట్టలా పూజ సామాను, అంటిపండ్లు, 'సేపుకాయలు దోసకాయలు, జొన్నెన్నులు ఎత్తుకుని నాగులబాయి తావ వుండే నాగులకి పూజ చేసి నానిన బీము, నూగులు, బెల్లము, కలిపిండే ప్రసాదము అందరికీ ఇస్తా వుండారు. ప్రసాదము తీసుకొనేకి పిల్లన్నతాత కూడా వస్తా వుండాడు.
అది చూసిన ఒక చిన్నోడు “తాతకి ప్రసాదము కావాలంటకా” అని అడిగె. ఆయమ్మ పిడికిలి నిండా పట్టి ఆ చిన్నోని దోసిల్లా పోసె.
అబిటికే వీళ్లు తెచ్చి పెట్టుకాని వుండే జాపాళము విత్తనాల్ని (వేరుశెనగ విత్తనాల్లా వుంటాయి. వీటిని తింటే విపరీతంగా విరేచనాలు అవుతాయి) కలిపి తాతకి ఇచ్చిరి. తాత నగతా తీసుకొని బాగా తిని చేతుల్ని నాకి పెట్టేసె.
ఉడుకు చిన్నోళ్లంతా నగుకాని వెలెసిరే. పిల్లన్న తాతకి బేదులు నిలస్తాలేదంట, సర్కారి ఆసుపత్రిలా అయ్యేలేదనేసి రంటా, బెంగుళూరుకి పోయిండారంట అనే సుద్ది ఊరువూరంతా పాకిపోయె.
“అయ్యో! తాత సావాలనీ మేమిట్ల చేయలే. తమాషాకి చేస్తిమి. తాత బతికి బాగుపడాలా” అని ఉడుకు చిన్నోళ్లంతా దేవునికి మొక్కుకొనిరి.
వీళ్ల మొక్కులు విని ఆ దేవుడే తాతని కాపాడినో, లేదా డాక్టర్లు దేవుళ్లయి తాతని కాపాడిరో కాని పిల్లన్నతాత బతికె. కాని సాకన్న తాత ఎదనెప్పి వచ్చి సచ్చిపాయె.
ఊరువూరంతా సాకన్నతాత ఇంటితావ గుమిగూడి వుండారు. పెద్దోళ్లంతా వచ్చి పీనిగమించ పువ్వుల ఆరాలు వేసి కాళ్లకి దండం పెట్టి పోతావుండారు. సాకన్నతాత సావుసుద్దిన్ని చెప్పేకి ఎవురెవురు ఏయే వూర్లకి పోవాలని గౌడు చెప్పతా బస్సు చార్జీలకి దుడ్లు ఇస్తా వుండాడు.
పొద్దప్పడు ఫొద్దు మునిగింది. సెంద్రుడు చూసినట్లుండాడు. ఆకాశములా గూరాడతా పైపైకి వస్తావుండాడు.
“వీళ్లకి ఎపుడూ వచ్చేది పోయేది ఒగే పంగ (పని). అదే పంగ. వీళ్లకి వేరే పంగ లేదేమో, ఎపుడూ చేసిందే చేస్తారు. కాని మనుషులు అట్ల కాదు. పుట్టినబుటినింకా చచ్చేవరుకు వేరే వేరే పంగలు ఎన్నెనో పాట్లు పడాలా, అయినా మనుషులు ఏమిటికి ఈ పంగ చేసేది. ఆడేమన్నా పంగ లేకుండా ఈడికి వచ్చిరా? లేదా ఈడినింకా ఆడేమన్నా పంగ చేసేకి పోతావుండారా? ఆ పొద్దునింకా ఈపొద్దు కంటా ఎందరో జనాలు అదెందరో జనాలు. అదేమిటికి వచ్చిరో. అదేడకి పోయిరో. వచ్చేది పోయేది. ఇదే పంగ. ఒగే పంగ. ఆ వూరోళ్లది ఈ వూరోళ్లది. ఆ దేశమోళ్లది ఈ దేశమోళ్లది. ఇదే పంగ, ఇదే పంగ. ఏమిటికి వీళ్లకి ఈ పంగ ఏమిటి కోసరము వీళ్లు పంగ చేసేది. ఎందరప్పా! ఇబుటికి ఎందరప్పా.. పాతలెక్క ఎంతని లెక్క తీసేకి అవుతుంది? కొత్తలెక్క కత ఇంతని ఇట్లని కనిపెట్టేకన్నా అవుతుందా? సాములమని, దేవుళ్లమని, కీర్తులు రాసులు పోసుకొన్న వాళ్లంతా పోయిరి. ఏమీ లేనోళ్లూ పోయిరి. ఇంగెవుడు, ఈ పంగ ఏమని చెప్పేది పంగ గుట్టు కనిపెట్టేది ఎవరు, అదెవరో” ఏకనాదము వాయిస్తా ఎర్రన్న ఏమేమో మాట్లాడతా వుండాడు.
రాత్రి తొమ్మిదిగంటల పొద్దు కావస్తుంది. నందిమంగలం, తోటగిరి, పాతకోటల నింకా బజన గుంపోళ్లు వచ్చి బజన సురువు చేసిరి.
- "జీవా నీవిది కానవా నువ్వుండే ఇంటి మర్శము ఎరుగావా ౹౹జీ౹౹
- తొమ్మిది వాకిండ్ల కొంప దుఃఖములకిది మూలదుంప
- ఎంచితే కలగూరగంప - తెలునుకో నీ తాడు తెంపా ౹౹జీ౹౹
- డెబ్బదిరెండువేల నాళ్లు అరువది తొమ్మిది కీళ్లు
- తోక వురుగులు మూడుపాళ్లు నిండి వున్నది నీచునీళ్లు ౹౹జీ౹౹
- మలమూత్రముల కుంట మాంనమునెత్తూరు. పెంట
- మురికి పేగుల ముద్దుజంట కూడినది మలకోవి తుంటా ౹౹జీ౹౹
కైవారము నారాయణ తాతగారి తత్వాలు పాడతా వుండారు. కొంతసేపు పాడినంక కొందరు 'టీ ' ఇంకొందరు నీళ్లు తాగి తిరగా పాడేకి సురువు చేసిరి.
- “నీవ్లూరు. పేరేమి జీవయ్య నీవు ఎందూకు వస్తివి జీవయ్యా
- నీకు బంధువులెవరు జీవయ్య - నీ చందాము ఏమందు జీవయ్యా
- అన్నాలుంటేనేమి జీవయ్య బంధు బళగముంటే నేమి జీవయ్యా
- పారాడి పారాడి జీవయ్యా నీవు కుంటుచూనున్నావు జీవయ్యా
- కర్మబంధనాలు జీవయ్యా నిన్ను కష్టపెట్టునయ్య జీవయ్యా
- దుర్మార్గములు విడచి జీవయ్యా నీవు సన్నార్గమున వుండు జీవయ్యా
- ఇహములోనా బుట్టి జీవయ్యా గురుని మహిమ కనలేవు జీవయ్యా
- పుట్టినందుకు ఏమి జీవయ్యా నీకు పుణ్యఫలమున్నాది జీవయ్యా
- మోహపాశములందు జీవయ్యా నీవు మునుగుచున్నావు జీవయ్యా
- ఈ మురికిదేహమందు జీవయ్యా నీవు ఎట్లావున్నావు జీవయ్యా
- తనువు విడచినీవు జీవయ్యా ఇక ఎందు పోయేవు జీవయ్యా
- తనువుతో ఒకమాట జీవయ్య నీవు చెప్పకా పోవలదు జీవయ్యా
- నీవున్నా వురమునా జీవయ్యా బేరినాదా మృదంగాము జీవయ్యా
- ఓంకార ప్రణవము జీవయ్యా ఘణఘణ నాదములు జీవయ్యా
- నీవెంతో మోసకారి జీవయ్యా ఇకను నమ్మతగదూ నిన్ను జీవయ్యా
- సంసారబంధనా జీవయ్యా - నీవు సరిచూడగలేవా జీవయ్యా
- నిన్ను నమ్మివుంటి జీవయ్యా నన్ను విడనాడిపోయేవు జీవయ్యా
- బ్రహ్మాండపురమునా జీవయ్యా నీవు బయలుదేరవయ్యా జీవయ్యా
- రామాకృష్ణార్యులు జీవయ్యా గురిజూపిరి గుట్టెల జీవయ్యా
- అంజనేయదాసు జీవయ్యా గురుని మరువడు మనసునా జీవయ్యా”
- ఈకిత ఆంజన్నప్ప స్పాముల తత్వము పాడిరి. ఆమీట(తర్వాత)
“కైవారం తాతగారి పాదాలకు గోవింద. సీకనపల్లి ఆంజనప్ప పాదాలకి గోవింద. అరసపల్లి దేవప్ప సామి, లక్కూరు కిష్టసామి, బేరిక బుట్టప్ప సామి. చూడగొండపల్లి రామలింగప్ప సామి, దొడ్డి వెంకటగిరియప్ప సామి పాదాలకి గోవిందా గోవిందా” అంటా గోవిందులు పెట్టిరి.
నేను గోవిందులు పెడతా అదెబుడు కన్ను మూసితినో పొద్దిన కన్ను తీసేతలికి ఇంట్లో వుండా.
తాత సావాసగాళ్లు, సొంతమోళ్లు వూరువూరంతా నిండిపోయి వుండారు. తాత చేసిన మంఛిపనుల గురించి మాట్లాడతా వుండారు.
మనిషి పుట్టేతబుడు ఉసురుతో పుడతాడు. పోయేతబుడు దాన్ని విడచి పోతాడు. నాది నేను అని ఒళ్లుతో తిరగే మనీషి కడకి దాన్ని విడచి పోతాడు. అది తెలుసుకోకుండా ఒకర్ని ఒగరు కొట్టుకొనేది తిట్టుకొనేది. జాతిపేరులా కొందరు, నీతిపేరులా ఇంకొందరు. ఇంకా దేవుడు, దెయ్యమని జనాలని ఏమారిచ్చి (మోసంచేసి) సంపాదిస్తారు. సచ్చేతబుడు ఏ సంపద వస్తుంది. ఏ సొంతమోళ్లు వస్తారు. నిజానికి మనిషి సంపాదించాల్సింది నలుగురు మనుషుల్ని. తను పోతే “పాడి” మోసేకి నలుగురు పోటీ పడతా వస్తే వాడే గొప్పమనిషి అంటా గుర్రన్న గుంపుజనాలకి చెప్పతా వుండాడు.
ఆయప్ప మాటలకి కొందరు తలలు గుంకాయిచ్చి ఏదో గేణము (ఆలోచన) చేస్తా వుండారు. అది గూబగేణమా ఘనమైన గేణమా నాకైతే తెలీలా.
ఇంకొందరు మొకాలు మాడినట్ట సోడ.
మొకాలు పెట్టుకొని నిలచిండారు. రేపు మనకి ఇదేగతి వస్తుందనేమో... మేమూ సావాలనేమో... దిగులనుకొంటా...
“సావంటే నాకు దిగులు లేదు” కిట్టన్న గట్టిగా అనె.
“అది వొచ్చినబుడు తెలుస్తుంది అన్నకి” పిట్టన్న అనె.
“సావు వొచ్చినపుడు మనకి గేణము వుంటే కదా తెలిసేది. ఒళ్లులా సత్తువ పోయి, గేణము పోయినంకే మనము సచ్చేది” శీకలన్న చెప్పె.
“అదీ నిజమే సావు చెప్పి వస్తుందా?” చింతచేసె సొణ్ణప్ప.
సావు సమాచారము మాట్లాడతా చానా జనం వీదంతా నిలచిండారు.
“శివుడు గలడనుచు శిలలకు మొక్కెడి వెర్రి జీవులారా వెతలు విడుడి జీవులందో కాక శిలలనేమున్నది
విశ్వదాభిరామ వినుర వేమ అన్నట్లుగా... సచ్చిపోయిన మారాజు నేరుగా సొర్గానికి పోవాలని తలచి మా రామచంద్రన్న పదిరూపాయలు ఇచ్చి బలే పొగిడించిరప్పో” అంటా పలక వాయిస్తా మోటప్ప ముందర నడస్తా వుంటే పీనిగని ఎత్తుకొని జనం వెనక నడస్తా వుండారు.
వాళ్లవాళ్ల బతుకుల్లా తాత నెనపుల్ని నెమరు వేసుకుంటా...మసాణములా తీసిండే గుంతలా తాతని పెట్టి మన్ను చేసిరి.
ఇందాగంట నేలపైన నడిచిన తాత, ఇబుడు నేల లోపలికి పోయె ఏల? ఏల గుంతలా వేసిరి అంటా గూబగేణము చేస్తిని.
“రేయ్! నా గేణము ఏమిటికిరా నీకు, అయినా మనిషి వచ్చిన తావుకే తిరిగి ఫొయ్యేది. దాన్నింకానే ఆ తాతని అట్ల చేసిరా అనె గుడ్లగూబ.
“ఏమి గూబమ్మ, మనిషి గుంతలా నింకా వచ్చెనా, బలే చూసినట్ల చెప్పతావు” అంటిని.
“రేయ్! తిక్కల తిమ్మా, మీ బతుకులు నాకు తెలీదా, మాజాతి బూమిమింద బతికి బట్టకట్టినంకే మీ జాతి పుట్టింది. విష్ణుమూర్తి అవతారాలు నీకి తెలీదేంరా” అనె.
“లేదు” అని తల తిప్పితిని.
“ఇదీ తెలీకుండా, ఇన్నాళ్లు ఈనేల పైన నడచి అదెట్ల బతికి బట్టకడితివిరా అంటా నన్ను ఉమిసె.
“ఈపొద్దు నా జాతకము సరిలే” అని తలగీరుకొంటిని.
“ఏం రా! జాతకము, గీతకము అంటావు. పరక(చీపురు)లా వేస్తా నా బట్టా, మీరు, మీ తోలుబలము, బుద్దిబలముతో బతికేది వదలి పెట్టి గ్రహాలు, నక్షత్రాల పైన పడి ఏడుస్తారేంరా” కోపముగా పరక ఎత్తుకానె.
“అయ్యో! గూబమ్మా నీకు నామీద కోపము వుంటే పరకలా వేయి పర్వాలేదు కాని అలకామాటిల్లా తిట్టద్దే. అందరి మాదిరిగానే నేను, గుంపులా గోవింద అన్నెట్ల నాకు ఈ జుతకము గేణానికి వచ్చె. నన్ను విడువుమా అంటా బేళాడితిని (బతిమిలాడితిని).
“సరే అని గూబమ్మ తన గూట్లోకి వెల్లేసె.
అన్నా. అక్కా... గూబ గేణము, గూబనా బట్ట, గూబ ముండ గూబ గుడ్లదాన్నా అని నోటికొచ్చినట్లు తిట్టేది ఇంగన్నా విడచి పెట్టండ. గూబగేణము ఎంత పెద్ద గేణమని మీకు ఇబుడు తెలిసె కదా.
XXXXXXX
“అంబపలుకు... జగదాంబ పలుకు” అంటా బుడబుడికి అడిస్తా జోస్యం చెప్పతా ఇంటి ముందర నిలచిండాడు బుడబుడకలాయప్ప.
తలకి ఎర్రతువ్వాలు, తెల్లనిపంచె, నల్లకోటు చేసుకొని చూసేకి బలేగా వుండాడు. అమ్మ ఇచ్చిన తెల్లబట్టను బుజముమింద వేసుకొని బీమును జోళిగిలా పోసుకొని, ఇంగో ఇంటి ముందరికి పోయె. నేను అన్నము తిని అవతలికి వస్తిని.
- “గొబ్బియాలో వాగుల్లో గోవులు క్షేమంగుండాల
- గొబ్బియాలో వాగుల్ని కాచేది వన్నాశంకరుడే
- గొబ్బియాలో గోవుల్ని మేపేది గోపాల సామి
- గొబ్బియాలో అమంద ఈమంద మునిమందలాయ”
“ఎవురుమా వాళ్లు? వాళ్ల తలమింద వుండే మక్కర్లలా ఏముంది మా” అంటా అడిగితిని.
“వాళ్లు జంగాలోళ్లు చిన్నా ఆ మక్కరిలాని ఇత్తడితట్టలా గౌరమ్మని (పసుపుముద్ద) పెట్టుకొని, చేమంతి, చెలుమల్లి, గన్నేరి, తంగేడి పువ్వులతో అలంకారము చేసి పెట్టుకొని వుంటారు” అనె.
“ఏలమ్మా వాళ్లట్ల చేసేది”
“అది వాళ్ల పబ్బతి, ఈ సుంకురాతిరి నెలంతా వాళ్లట్ల చేసి, కడగా గౌరమ్మని జలిదిలా విడస్తారు. అబుడు వూర్ణావుండే ఆడోళ్లందరు పసుపుముద్దని అదే గౌరమ్మని ముట్టుకొని తాళిబొట్టుకు పసుపు పెట్టుకొంటారు” అంటా అమ్మ చెప్పతావుంది.
అందాతలికే (ఆవేళకే) “రేయ్! గంగెద్దులాయప్ప వచ్చిండాడ్రా” నా సావాసగాడు రాంగాడు పిలిచె. నేను ఒగే వుసురులా గుడితావు పారితిని.
నేను పొయేతలికే రామునికి సీతకి పెండ్లి అయిపోయివుండె. అదేడన్నా పోని అంటే, మనిషి ఎదపైన ఎద్దు నిలుచుకొనే గట్టమూ అయిపోయిండె.
గోపన్న పదిరూపాయలు తీసి గంగెద్దులాయప్పకి ఇచ్చె. ఆ కాసుల్ని జేబులా పెట్టుకొని,
- “అడవి పక్షులకెట్ల ఆహారమెవ్వరిచ్చె
- మృగజాతి కెవ్వరు మేత పెట్టె
- వానరజాతికి భోజన మెవ్వరిచ్చె
చెట్లకెవ్వరు నీళ్లు చేది పోసే” అంటా నరసింహ శతకము పద్యాలను సొంపుగా పాడె గోపన్న,
వెున్న బేరికలా లేపాళ్ళి రామాయణము ఆడినబుడు పోయింటిని. ఎదురెదురు చప్పరములు వేసుకొని రామకథని రెండుదినాలు పద్యాలు, పాటలుగా పాడింది నాకు ఇబుడు గేణానికి వచ్చి. నా నోటికి వచ్చిన పాటను నేను అట్లే పాడితిని.
కంచుతట్ట ఎత్తుకాని పొద్దప్పనివక్క తిప్పేసి మల్లేసి చూస్తా వుంచాడు మాతాత.
“క్కకిత సంకురుడు దేనీిమింద వచ్చిందాడు మామా రామక్మ అడిగె.
“నందిమీద మా”
“నంది అయితే పర్వాలేదు, పోయిన కిత, పంది మిందవచ్చి దేశములా శానా అనిష్టాలు జరిగె” అంటా పాత గేణము చేసె రామక్క
నంకురాత్రి పండగ ముందుదినము సంకరుడు పుడతాడంట. ఈ దినములా అనపకాయల్ని ఉడకేసుకొని తింటే ఒళ్లుకు చానా మంచిదంట. నాకు ఆ గేణము వచ్చినా సావాసగాళ్ల జతలా చేనులకి పారితిని.
కుక్కతొలసి రెంబల్ని యించి సట్టి చుట్టూరా పేరిచి, దాంట్లో అనపకాయలు, సెనక్కాయలు, సెన్నసిన్నగా కత్తిరించిండే చెరుకు ముక్కలు వేసి మూతగా కుక్కతొలిసి రెంబల్ని సట్టిపైన బాగా కూరిస్తిని.
ఆమీట నేలని రవంత గుంత చేస్తిమి. ఈ గుంతలా సట్టిని తిప్పేసి పెట్టి సుట్టారా మన్ను తోస్తిమి. సట్టి పైన ఎండిండే పిడకలు, ఎండిండే కట్టెలు పేరిచి అగ్గి మంటేస్తిమి.
అగ్గి బాగా కాలి, నిప్పులు చల్లారినంక సట్టిని పైకి తీసి కుక్మతొలసి రెంబల్ని పక్కకేసి లోపల ఉడికిండే అనపకాయలు 'సెనక్కాయలు తింటా వుంటే ఆ రుచే వేరే. ఇంగ రేపే సంకురాత్రి పండగ.
నేను నీద్రలేచేతలికే అమ్మ ఇంటి ముందర ముగ్గేసి ముగ్గు మద్దిలా పేడదీపము (గొబ్బెమ్మ) పెట్టి దానికి గొబ్బియాల పువ్వులు, గురుగు పువ్వులు, తీళ్లతీగ, జిల్లడి పూలు కుచ్చింది. దాల్బందరము (ఇంటి ద్వారం) తావ, మూడుపళ్మలా గోడకి పేడ మెత్తిచ్చి పువ్వులు కుచ్చింది.
నేను, అబ్బ కూదా ఆవుల్చి గొర్రెల్ని కడిగేకి ఏటితావుకి పోతిని. మొదలు గొర్రెల్ని మేకల్ని ఈ గడ్డనింకా ఏట్లోకి తోలితిమి. అవి మీజుకొంటా (ఈదు) ఆ గడ్డతాకి వస్తానే ఆడే నీళ్లలా నిలుపుకొని బాగా కడిగితిమి.
ఆమీట ఆవుల్ని దూడల్చి ఎద్దుల్ని కొమ్ములనింకా, కాళ్ల గారిసెలవంకా (గిట్టలు) బాగా వుజ్జి కడిగి, రంగులు పూసి మెడలకి కూరిసిపెట్టిండే సెనక్మాయలు, చెరుకు సరాలు వేస్తిమి.
“మంద ఎచ్చుకాని.. మంద ఎచ్చుకాని” కాటమరాజు పూజ అయినంక వూర్ణాకి నడిస్తిమి.
ఊరి ముందర అగ్గేసి మామిడితోరణాలు కట్టిండారు. అద్దుతావ ఊరి గౌడు, పెద్దోళ్లు, దాసప్ప నిలిచిండారు. దాసప్ప రోకలిని అద్దుకి అడ్డముగా వేసి పూలుపెట్టి పూజ చేస్తానే, డోలు కొట్టేకి సురువు చేసిరి.
ఎద్దుల్ని ఆవుల్ని అద్దు దాటిచ్చిరి. దీన్నే కుచ్చులపండగ అనేది. దిగువ తమిళనాడులా దీన్ని జల్లికట్టు అని అంటారు.
వయసు చిన్నోళ్లంతా ఎగిరి ఎద్దుల వెనక పారతా, ముగుదాడు పట్టుకొని వొంచి కాసులు పీక్కోని జేబుల్లా వేసుకొని, సెనక్మాయ, చెరకు సరాలు పీకి చిన్నోళ్లకి ఇస్తా వుండారు.
దాసప్ప పోయి వూర్లా వుందే ఆవులిండ్లలా తీర్ధము చల్లి వచ్చె.
నేను ఇంటికి ఫోయి కారం పిదకపప్పు, తీపి పిదకపప్పు (అనప విత్తనాలతో చేసే వంటలు) తిని ఆయిగా పనుకొంటిని.