అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/దోనయామాత్యుని సస్యానందము : సమకాలీనత
ప్రాచీన సాహిత్యం
అప్పిరెడ్డి హరినాధరెడ్డి99630 17187
దోనయామాత్యుని సస్యానందము : సమకాలీనత
భారతీయ సాహిత్యంలో ప్రాచీన కాలం నుండి అనేక శాస్త్ర గ్రంధాలు వెలువడినాయి. శాస్త్రగ్రంథాల కంటే ఎక్కువగా సాహిత్యం, చరిత్ర, మతసంబంధిత గ్రంధాలు వెలువడటం సహజం. ఇతివృత్తం ఏ కాలానిదైనా అప్పటి సమకాలీన సమాజం కూడా వాటిలో ప్రతిబింబిస్తుంది.
ప్రస్తుత సమకాలీన సమాజానికి ఆ రచనలు, లేదా అందులోని అన్ని అంశాలు ఉపయోగపడకపోవచ్చు. అవి ఒక చారిత్రక పరిణామక్రమం అధ్యయనానికి తోడ్పడతాయి. శాస్త్రగ్రంథాల విషయానికి వచ్చినప్పుడు నేటి సమాజానికి తప్పకుండా అవి వినియోగపడతాయి. మనిషి భౌతిక అవసరాలను తీర్చడానికి ఉపయోగపడే విజ్ఞానశాస్త్రం ఏ కాలంలో అయినా ప్రకృతి పరిశీలన కార్యకారణ సంబంధం, ప్రాథమిక శాస్త్ర నియమాలతో రూపొందుతుంది. ఆ శాస్తనియమాలు ఏ తరానికైనా ప్రామాణికంగా నిలుస్తాయి. అందుకే ఒకనాటి భారతీయ శాస్త్ర గ్రంథాలు నేటి సమకాలీన సమాజంలోనూ నిలబడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దోనయామాత్యుని “సస్యానందం లేదా వర్షశాస్త్రం” గ్రంథాన్ని గురించి ఇందులో పరిశీలిద్దాం.
దోనయామాత్యుడు గ్రంథ అవతారికలో రాసుకొన్న పద్యాన్ని బట్టి క్రీ.శ 1356 కాలం చెందిన వారని, తల్లిదండ్రులు మాచిరాజు, రుద్రమ్మలుగా తెలుస్తుంది. మరొక పద్యంలో...
“వనుధలోన బరమ వంశ విభూవణ/ వమైన నన్నుపేంద్రుడాదరింవ / శ్రీకరముగ నర్వలోకాశ్రయము జెపి /మిన్నుముట్ట కీర్తిగన్నవాడ.. అని చెప్పుకున్నాడు. ఉపేంద్ర చక్రవర్తి ఆదరణతో 'సర్వలోకాశ్రయం” అనే గ్రంథం రాసి లోకంలో ప్రసిద్ధి పొందానని తెలియజేసాడు. ఈ ఉపేంద్రుని విషయమై నిడదవోలు వేంకటరావు భారతిలో వంశవృక్షం ప్రకటించారు. ఉపేంద్రుడు తూర్పు చాళుక్య శాఖవాడు. కళింగ సీమలోని ఎలమంచిలి సర్వసిద్ధి మండలంలో పాలన చేశాడు. 1350లలో ఇతను ఉన్నట్లు నిడదవోలువారు నిర్ణయించారు.
సస్యానందం గ్రంథం నాలుగు తాళపత్రాలు, రెండు రాత ప్రతులు సి.పి బ్రౌన్ సేకరించాడు. ఇవికాక ఇంకా జనంలో ఉండే వీలుంది. 1891లో పువ్వాడ సూర్యనారాయణరావు అండ్ బ్రదర్స్ వారు తడకమళ్ళ వేంకటకృష్ణారావు గారిచే పరిష్మరింవచేసి ప్రచురించారు. సంగ శేషాచలశాస్త్రి తాత్పర్యం రాసారు. ఆ తర్వాత 1915, 1921లలో ఇది పునర్ముద్రణ అయింది. 1955లోను ప్రచురణ అయినట్టు ఆరుద్ర గారు పేర్కొన్నారు. 'సస్యానందము - దోనయామాత్యుడు” అనే వ్యాసాన్ని భారతిలో 1946లో జూన్ నెలన నిడదవోలు వేంకటరావు రాసారు. విలువైన అంశాలు అందులో వెలుగు చూశాయి. ఆ తర్వాత కాలంలో చాగంటి శేషయ్య, ఆరుద్రలు తమ గ్రంథాలలో దోనయామాత్యుడికి స్థానం కల్పించారు. 1921 ప్రతి ఆధారంగా ఉన్నం జ్యోతివాసు పరిష్కరణ - విస్తృత పీఠిక రాసారు. 2016లో శ్రీమతి రావి కృష్ణకుమారి, చీరాల వారు ప్రచురించారు. కొత్త చూపుతో జ్యోతివాసు ఇందులో విషయాలను ప్రస్తావించారు.
సస్యానందానికి మరో పేరు వర్ష శాస్త్రం. సస్యాలు అంటే పంటపొలాలు. అవి ఆనందంగా పండాలంటే వానలు కావాలి. వానల గురించి వివరిస్తుంది కాబట్టే వర్షశాస్తం అని కూడ ఈ గ్రంథానికి పేరు వచ్చింది. వాన రాకడ ప్రాణం పోకడ చెప్పలేమనే సామెత కూడా ఉంది. వానల రాక గురించి తెలుసుకోవాలసిన అవసరం, ఆసక్తి రైతులకు తప్పని సరి అవుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో నిష్ణాతుడయిన దోనయామాత్యుడు ఈ వానల విషయమై రాయలను కొన్నాడు.
“వానచేత సన్యవర్ధంబు వర్ధిల్లు /(సస్యవ్చద్ధి నకల జన సమృద్ధి/కారణంబు దాస గావున ధరలోన/ వానవలయు నెల్లవారలకును”....అని అంటాడు.
ఈ గ్రంథం రాయడానికి పూర్వుల గ్రంథాలను, అప్పటికే ప్రజలు అనుసరిస్తున్న పద్ధతులను ఆధారంగా చేసుకొన్నానని వివరిస్తూ... “అను లోకోక్తులాకర్ణించి గార, వరాహమిహిర, లల్లాది, సంహితా సారంబులు గూర్చి ప్రవర్ష వివర్షణంబులు జనులకు బోధ సేయుటకై సస్యానందము జెప్ప నుద్యోగించితిని” అని అంటాడు. తన పూర్వుల కృషిని నిజాయితీగా దోనయామాత్యుడు ప్రకటించాడు.
వేదాంగాలలో జ్యోతిషం ఒకటి. గ్రహగతులు, నక్షత్రాల ఆధారంగా కాలనిర్ణయం చేయడం, ఆయా కాలాల బట్టి మంచి చెడుల ప్రభావాలను జ్యోతిష్యం తెలియచేస్తుంది. జ్యోతిష్యశాస్త్రం ఆధారంగా వర్షాలపై కూడా పూర్వ గ్రంథాలలో అనేక ప్రస్తావనలు ఉన్నాయి. సంన్కృత భాషలో ఉన్న వాటిని తెలుగు భాషలో రైతాంగానికి అర్ధమయ్యే విధంగా పద్యగద్యాలలో దోనయామాత్యుడు రాసారు. సస్యానందంలోని పద్యాలు రైతుల నోళ్ళలో వ్యాపించాయి. కేవలం పూర్వ గ్రంథాలలోనివే కాకుండా, లోకంలో అనుసరిస్తున్న ఇతర శాష్రీయ పద్దతులను కూడ ఇందులో దోనయామాత్యుదు చేర్చాడు. ప్రకృతి, వాతవరణ పరిస్థితులను పరిశీలించి, ప్రయోగం ద్వారా నిరూపణలైైన వాడుకలోని అనుభవాలను కూడా సస్యానందంలో వివరించడం విశేషం.
సస్యానందంను మొత్తం 232 పద్యగద్యాలతో, నాలుగు ప్రధాన అధికారాలుగా విభజించాడు. ఆయా ఆంశాలబట్టి అంతర్గత విభజన కూడా చేశాడు. సరైన పద్ధతిలో మేఘము కనిపెట్టి, మేఘ గర్భ ధారణను, గర్భపాతమును, గర్భపాత కారణాలను, గర్భ పరిపక్వ కారణాలు, గర్భము ఫలించు కారణాలు చక్కగా తెలుసుకొని వర్షము కురియుట, కురవకపోవుట చెప్పాలి. నోటికి వచ్చనట్లు తెంపు చేసి చెబితే సభలలో అవమానం పొందుతారు; గౌరవం కోల్పోతారని దోనయామాత్యుడు హెచ్చరిస్తాడు. శాలివాహన శక సంవత్సరాలను ఎనిమిదితో పెంచి వచ్చిన మొత్తాన్ని తొమ్మిదిచేత భాగించగా వచ్చిన శేషము బట్టి ఆయా సంవత్సర మేఘాల నిర్ణయం చేయాలంటాడు. శేషము 1 అయితే ఆవర్తనమేఘము, 2 సంవర్తనమేఘము, 3 పుష్కరమేఘము, 4 ద్రోణమేఘము, 5 కాలమేఘము, 6 నీలమేఘము, 7? కారుమేఘము, 8 గౌనీమేఘము, 9 తమము అని శేషసంఖ్యల ఆధారంగా. మేఘనిర్ణయం చేశాడు.
వర్షానికి ఆధారమైన ధాతువులుగా వాన, మంచి ఎండ, మంచి శీతము నలువైపుల వ్యాపించు మేఘము, ఉరుము, మెరువు, పరివేషము, ఇంద్రధనుస్సు, మంచు, వాయువులను పేర్కొన్నాడు. సూర్యుని వేడికిరణాలు భూమిపై వ్యాపించి జలం ఆవిరి రూపాన పైకి తీసుకెళ్లే కాలాన్ని గర్భకాలము అన్నాడు. ఆ ఆవిరి మరల వర్షంగా మారే కాలాన్ని ప్రసవకాలం అని వివరించాడు. మేఘాలు గర్భం దాల్చి నూటనలుబదియేడవ దినం భూమంతయు కానరాకుండ వర్షిస్తుందని వివరించాడు.
గ్రహాల స్థితిగతులు, రాశుల బట్టి ఆయా మాసాలలో వర్షం పడే విధానాన్ని తెలిపాడు. ఉదాహరణకు... వృశ్చిక రాశియందు సూర్యుడు ఉన్నప్పుడు సూర్యుడు ఉండే రాశికి, రెండు, మూడు, నాలుగు రాసులతో అనగా ధనస్సు, మకర, కుంభమందు శుక్రుడు, బుధుడు, బృహస్పతి చంద్రుడు అనే ఈ నాలుగు గ్రహాలు ఉన్నట్లయితే భూమి అంతటా వర్షాలు పడతాయంటాడు.
సూర్యుడు అనూరాధలో ప్రవేశించునపుడు గానీ, మూలా నక్షత్రములో ప్రవేశించునపుడు గాని కొంచమైన వాన పడకపోతే ఆ కార్తె మొదలు పదునాలుగు దినాలు వాన ఉండదంటాడు. సూర్యుడు జేష్ట నక్షత్రంలో ప్రవేశించునపుడు మేఘాలు దట్టంగా ఉంటే వర్షం వస్తుందని వివరించాడు. మార్గశిర, స్వాతి, ఆరుద్ర, శతభిషములలో వాన, ఎండ మేఘము, ఉరుము, పరివేషము అనే ధాతువులలో ఏఒక్కటి ఆకాశంలో కనిపించినా సస్యసమృద్ధిగా వానలు వస్తాయి.
పుష్యమాసములో మూలా నక్షతం మొదలుకొని అమావాస్య వరకు తూర్పుగాలితో కూడిన వాన దట్టంగా వస్తే మొదటి కారు పంటలకు సమృద్ధిగా వానలొస్తాయి. చైత్ర శుద్ధ పూర్ణిమకు లోవల నాలుగు దినములలో వానలు కురిస్తే, ఆ సంవత్సరం రెండవ పంట సమయంలో వానలు తక్కువగా కురుస్తాయి.
వైశాఖంలో ముందుగా పడమటి వైపున మబ్బుపట్టి ఎంత నేల చినుకులు పడతాయో ఆ నేలంతా ఆ సంవత్సరం చక్కగా వానలు పడతాయి. ఈ మానంలో మబ్బుపట్టి ఉరుము శబ్దం ఎంతవరకు వినిపిస్తుందో అంత దాకా వానలుంటాయని వివరించాడు. ఈ విధంగా ఆయా మాసాలలో వర్షాల స్థితిగతులు క్రమపద్ధతిలో వివరించాడు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారమే కాకుండా ప్రకృతి పరిశీలన, వాతావరణ మార్పులు, జీవరాశుల ప్రతిస్పందనలబట్టి కూడా శాస్త్రీయంగా వానల గురించి సస్యానందంలో నమోదుచేశాడు.
సంవత్సర కాలంలో మొత్తంగా వానల పరిస్థితిని అంచనా వేసేందుకు నాగలికి దూది పెట్టి వర్ష రాకలను అంచనా వేసే తులాపరీక్ష పద్ధతిని వివరించాడు.
పుష్యశుద్ధ పూర్ణిమ నాటి ప్రదోష సమయంలో పలిమెడు దూది నాగలికి తగిలించి ఏ అడ్డు లేకుండా బయలులో ఉంచాలి. మరునాడు ఉదయం ఆ దూది పిండాలి. ధారగా నీళ్ళు వస్తే మరుసటి సంవత్సరం వానలు సమృద్ధిగా పడతాయి. కొన్ని బిందువులే దూది నుండి వస్తే మధ్యరకంగా వానలొస్తాయి. దూది మంచునీటితో కనీసం తడవకపోతే వానలు కురియవు అని పేర్కొన్నాడు. ఒక ప్రయోగం ద్వారా ఇలా శాస్త్రీయంగా ఇలా ఆరోజులలో ఒక అంచనాకు రావడం విశేషం.
మెట్టకప్పలు కూసినపుడు, జంతువులు నీళ్ళలోకి దిగినవుడు, చిన్న చిన్న చేపలు ఎగిరినపుడు, తామర పుప్పోడిలో తొండలు పొర్గాడినపుడు పంటలు బాగా పండేలా వానలొస్తాయి. భూనాగాలు మెట్టను విడవకుండా పొర్గాడినపుడు, పశువులు కారణం లేకుండా పుట్టలు, మెట్టల మీదికి ఎక్కినపుడు దట్టంగా వానలొస్తాయి. ఊరి పొలిమేరలలోని పశువులు తోకలెత్తుకౌని, అంభారాలు చేస్తూ గ్రామంలోకి ప్రవేశించినపుడు, సంతోషంతో చీమలు ముక్కున గ్రుడ్లు కరచుకొని బారులుతీరి పోతుంటే, సకల దిశల వ్యాపించిన మేఘాలు నడినెత్తిన మెరుములతో ఉంటే, అనేక సార్లు తూర్పుగాలులు భూమిపై వ్యాపిస్తే, ఆకాశంలో గోమూత్రం వంటి కాంతులు దట్టంగా వ్యాపిస్తే తప్పక వానలొస్తాయి.
సూర్యోదయం, సూర్యాస్తమయాలలో కొంచం ముందుగా కుక్కలు మొరుగకున్న ఎడల నష్టం కలిగించని, పైరులకు భంగంలేని వాన వస్తుందని వివరించాడు.
పై వాటిలో జంతువుల వింత ప్రవర్తనలు, అరుపుల వెనుక శాస్త్రీయ అంశాలు దాగి ఉన్నాయి. సునామి వచ్చిన సందర్భంలో కొంత ముందుగానే అనేక తీరప్రాంత జీవరాశుల విచిత్ర ప్రవర్తనను గుర్తించారు. అలాగే భూకంపాలు తదితర సందర్భాలలో తక్కువ స్థాయి తరంగాలను కూడా జీవరాశులు ముందుగా గుర్తిస్తాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఈ గ్రంథంలో వర్షాలకు ముందు జీవరాశుల ప్రవర్తనను దోనయామాత్యుడు నమోదు చేశాడు.
తొలకరి వాననీటి రుచిని బట్టి ఆ సంవత్సరం ఏయే పంటలు పండుతాయో ఇలా వివరిస్తాడు. వగరు, కారంగా ఉంటే కొర్రపైరు, చేదుగా ఉంటే నువ్వులు, తియ్యగా ఉంటే పత్తి, కుసుమలు, చప్పగా ఉంటే మద్దిగడ్డలు, కసురుగా ఉంటే జొన్నలు, గోధుమలు, పుల్లగా ఉంటే వరిగెలు, సజ్జలు, చిట్టిచామలు బాగా పండుతాయి. ఉప్పుగా ఉంటే ఆ సంవత్సరం పంటలు ఎక్కువ తాలు కంకులే అవుతాయని వివరించాడు.
వర్షం రావడానికి వాయువు కీలకం అంటాడు. వాయువు వలనే మేఘములు పుడుతాయి. మేఘాలు విచ్చిపోయి వానలు వస్తాయి. వాయువు వలన ఉరుముల వస్తాయి. సర్వానికి వాయువే కారణం అని వాయు లక్షణాలు వివరించాడు.
ఆషాదశుద్ధ పున్నమి నాడు మొదటి జామున గాలి వీస్తే శ్రావణంలో, రెండవ జామున గాలి వీస్తే భాద్రపద మాసంలో, మూడవ జామున వీస్తే అశ్వయుజమాసంలో, నాలుగోవ జామున వీస్తే కార్తీకమాసంలో తగినవిధంగా వర్షాలొస్తాయంటాడు.
వాయు ప్రసారం బట్టి వానలను అంచనా వేసే మరో ప్రయోగాన్ని వివరించాడు. ముతకనూలుతో ఎనిమిది మూరల పొడవు, రెండు మూరల వెడల్పు వస్త్రం నేయించాలి. నలభై ఎనిమిది మూరల పొడవున్న కర్రకు ఆ గుడ్డను పతాకంగా కట్టి ఆషాఢ శుద్ధ పూర్ణిమనాడు తెల్లవారుతున్నప్పుడు నిలబెట్టాలి. ఆ వస్త్రం గాలికి తూర్పుకు దిశకు ఊగితే వానలు బాగా పడతాయి. ఆగ్నేయ దిశకు పోతే వానలు పడవు. దక్షిణ, నైరుతి వైపు పోతే మేఘాల పుడతాయే కానీ వానలు ఉండదు. పడమటి దిక్కుకు పోతే అతివృష్టితో పాటు, గాలి ఉంటుంది. వాయువ్యం వైపు పోతే అతివృష్టి, సుడిగాలి ఉంటుంది. ఉత్తరం వైపు పోతే పంటలకు తగినంత వాన ఉంటుంది. ఈశాన్య వైపు పోతే మధ్యరకంగా ఉంటుంది. అన్ని వైపులకు తిరుగుతూ మెలికలు పడుతుంటే పంటలు పండే సమయంలో వానలు దట్టంగా పడి చెడిపోతాయి. లేదా శత్రువులైనా చెడగొడతారని వివరించాడు.
మేఘం పరివేషం లక్షణాలు, ఆకారాలను బట్టి కూడా వర్షాల రాకను వివరించాడు. భారతదేశంలో ఏయే ప్రాంతాలకు ఏయే గ్రహాలు ఆధిపత్యం వహిస్తాయో వివరించాడు.
“చందస్సు విషయంలో కొన్ని క్రొత్త సంగతులు చెప్పినట్లే దోనయామాత్యుడు మన భాషలో ఆనాడు వాడుకొనే కొన్ని మాటలను గురించి కూడా మనకు చెప్పాడు. ఇవి మనకు తరచుగా కనబడని ప్రయోగాలు, మన తిథులలో ద్వాదశి మనకెంతో పుణ్యమైనది. దానికి పారశి అనే పర్యాయపదమున్నట్లు దోనయామాత్యుడు యతి ప్రస్థానంలో వాడినందువల్ల తెలుస్తున్నది” అని ఆరుద్ర పేర్కొన్నారు. ఈ పదంపై జ్యోతివాసు వివరణ తర్వాత చూపుతాను. మేఘాల వర్ణనలో “కాటుక క్రోవులు” ఇంకా రైతులు వాడే “ఓదెలు, ఓరంత ప్రొద్దు, నులిపున్నమ, నొరకొలదులు వంటి పదప్రయోగాలను ఆరుద్ర చూపాడు.
నిఘంటువులకెక్కని పదాలు సస్యానందంలో ఉన్నాయని ఉన్నం జ్యోతివాసు వివరించారు. “తొలుతటి వానలోదోయంబు లొగరైన, వట్టన యగునేన కొర్రచేలు "..లో వగరుగా, వర్రగా పదాలలో వజ్ర నిఘంటువులలో లేదని బ్రౌణ్యం “కారము” గా స్వీకరించిందని చూపుతాడు. “తలివమ్ము ముతకనూలున"లో “తలివమ్ము” పదానికి పరుపు, శయ్య అర్ధాలున్నాయి. కానీ ఇక్కడ కంబళి, దుప్పటి అర్థం వస్తుంది. “వెంగలియై సస్యకోటి పెంపడగించున్”లో వెంగలికి అవివేకి, జధుడు, మూఢుడు అని అర్భాలున్నాయి. కానీ ఇక్కడ కవి “వెనుక " అనే అర్ధంలో వాడారు. ఇదే పద్యంలో రెండవ పాదంలో ముంగలి పదం ఉంది. దానికి వ్యతిరేకంగా వెంగలి అని వాడారు. “ప్రతిపద” పదాన్ని పాడ్యమి అర్ధంలో ఇందులో వాడటం ఉంది. “ద్వాదశి"కి వికృతి రోదసి, బారసి పదాలున్నాయి. బారసి పదం ఇందులో ప్రయోగించాడు. అచ్చు ప్రతిలో పారశి అని ఉండటంతో ఆరుద్ర గారు కొత్తపదంగా అనుకొన్నారని అది “బారసి” అని ఉన్నం జ్యోతివాసు వివరించాడు.
వన్తుపరంగాను, భాషాపరంగాను దోనయామాత్యుడి సస్యానందం ఎంతో విలువైంది. సమకాలీన సందర్భంలోను ఇది నిలబడుతుంది. ఈ గ్రంథంలో వర్షాల విషయంగా ప్రతిపాదించిన జ్యోతిషశాస్త్ర విషయాలు, అదే విధంగా వర్షాలపై లోకవ్యవహారంలో ఆ రోజులలో చేసిన ప్రయోగాలను నేటి ప్రస్తుత శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో మరింత అధ్యయనం చేసి అందులో ప్రామాణిక అంశాలను నిరూపించి వెలుగులోకి తీసుకొనిరావాలి.
పదనిష్పాదనకళ
- 25 వ పుట తరువాయి.....
ఆవశ్యకత వారికి లేదు.
కానీ భవిష్యత్తులో అవే సబ్జెక్టుల్ని తెలుగులో చెప్పాల్సివస్తే మాత్రం తెలుగు పదాలు కావాలి. అర్ధం కావడం అనేది ఒక కాలానుగతమైన ప్రక్రియ. పుడుతూనే మనకు ఏదీ అర్ధం కాదు. అందటికీ అర్ధం అవుతాయని చెబుతున్న ఇంగ్లీషు పదాలు కూడా శిక్షణాప్రక్రియలో నేర్చుకున్నవే. పుడుతూనే నేర్చుకున్నవి కావు. మన పదజాల పరిజ్ఞానం వయసుతో పాటు పెఱుగుతూ పోతుంది. ఆ పెఱిగే పదజాలంలో తెలుగు ఎందుకు ఉండకూడదు ? ఇంగ్లీషు పదాల పరిజ్ఞానాన్ని మాత్రమే ఎందుకు పెంచుకోవాలి ? మన వర్ధమాన పదజాలంలో తెలుక్కి ఎందుకు స్థానం ఉండకూడదు ?
కాబట్టి కొత్త తెలుగు పదాలు జనానికి అర్ధం కావనే వాదాన్ని మనం అంగీకరిస్తే దాని సారాంశం ఏమౌతుందంటే -
1 తెలుగులో ఏ శాస్త్రానికి సంబంధించీ, ఏ విధమైన సాంకేతిక పదజాలమూ ఉండకూడదు. డు, ము,వు.ల్లాంటివి మాత్రమే ఉండాలి. ఇంగ్లీషుని తెలుగులిపిలో వ్రాస్తే అదే తెలుగు.
2. ఉన్నా అది అందఱికీ అర్థం కాకూడదు. (ఎందుకంటే వాళ్ళకు ఏది అర్ధం కావాలో ఏది కాకూడదో మనం ముందే నిర్ణయించేశాం. అంతకు మించి వాళ్ళకు ఇంకేమీ అర్థం కాకూడదు)
3. తెలుగులో సాంకేతిక పదజాలాన్ని ప్రచారం చేయకూడదు (ఎందుకంటే మేము ఇదివణకే ఒక విధమైన ఇంగ్లీషు పదజాలాన్ని ప్రచారం చేసేశాం. దానికి మీరు అడ్డం రావద్దు)
4. కాబట్టి తెలుగులో సాంకేతిక శాస్త్రాలేవీ వద్దు. అవన్నీ ఇంగ్లీషులోనే ఉండాలి.
5. ఆ విధంగా తెలుగులో సాంకేతికపదాలూ, సాంకేతిక పదాలూ లేకుండా చేస్తాం కనుక తెలుగు పొట్టపోసుకోవడానికి పనికి రాదు. పోనివ్వండి. మాకు ఇంగ్లీషుంది.
6. తెలుగు మనకు పొట్టపోసుకోవడానికి పనికిరాదు కనుక మనం అసలు అది మాట్లాడొద్దు. నష్టమేముంది ?
- తరువాయి- వచ్చే సంచికలో
మాతృభాషకాని భాషలో విద్యాభ్యాసం విద్యార్ది చదువుకు అడ్డంకిగా మారుతుంది - 'యునెస్కో