అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/సమన్యాయం!
ప్రకృతి
డా॥ కొప్పుల హేమాద్రి
సమన్యాయం!
ప్రకృతిమాతా పాహిమాం! మా జాతికి మీరే న్యాయం చెయ్యాలి.
నాయనా నారికేళా? నా వల్ల నీకేమన్యాయం జరిగింది? ఎవరికేది చేసినా (ప్రకృతి) ధర్మాన్ననుసరించే కదా చేస్తాను?
అహహ... అది కాదు మాతా! నేను విన్నవించేది “సమన్యాయం” గురించి.
కాస్త వివరంగా చెబుతావా నాయనా?
అటులనే తల్లీ! వృక్ష సంతతికే చెందిన మేము సముద్రతీర ప్రాంతాలలోనే ఎందుకు జీవించాలి? మిగత చెట్లలాగే కొండలమీద పెరిగే అర్హత మాకు లేదా?
ప్రకృతి ధర్మమంటే నీకు అర్థమైనట్లు లేదు నారికేళా! కాడి పెట్టండి - అందుకే అన్ని నీళ్లండి. ఆయ్! నీకిప్పుడు ఎంత చెప్పినా ఆకాశాన్ని తాకుతున్న నీ తలకెక్కదు. ఇంతకు ముందు కూడా నీ జాతివారు నాతో ఇలాగే మొర పెట్టుకున్నారు! నేను సర్ది చెప్ప బోయాను. ససేమిరా ఒప్పుకోలేదు! దానితో "స్వయంగా అనుభవిస్తేగాని తలకెక్కదని వాళ్ళకి మచ్చుకి ఒక కొండమీద నివసించే యేర్పాటు చేశాను. ఆ తరువాత ఏమయ్యిందో నీ మూడు కళ్ళకు గోచరమయ్యేలా చేస్తాను తిలకించు" అంటుండగానే ప్రదర్శన మొదలైపోయింది.
ఒకటో అంకం సారాంశం: ఓ కొండ. ఆ కొండ మీద కొబ్బరిచెట్లతోసహా రకరకాల వృక్షజాతులు ఉన్నాయి. ఋతు ధర్మాల ననుసరించి అన్నిచెట్లూ పూలు పూచాయి. కాయలు కాచాయి. పండిపోయిన కొన్ని జాతుల ఫలాలు రాలిపోయాయి. కొన్ని ఎగిరిపోయాయి. తల్లి చెట్ల సమీపంలోనే రాలిన గింజలు వర్షాకాలంలో అక్కడే మొలకెత్తాయి. మరికొన్ని తమ తమ భౌతిక స్వరూపానికీ, నిర్మాణ పద్ధతికీ అనుగుణంగా దూరప్రాంతాలకు చేరుకుని వీలు కుదిరిన చోట్ల మొలకెత్తి స్థిరపడ్డాయి.
రెండో అంకంలో దృశ్యమాల ఇలా ఉంది. వరుసగా కొన్నేళ్ళ పాటు వర్షాలు పడకపోవడంతో ఆ కొండ మీద పెరుగుతున్న అన్ని జాతుల చెట్లు-గడ్డీ గాదంతో సహా చచ్చిపోయాయి. కార్చిచ్చు వ్యాపించి కాలి బూడిదైపోయాయి. బండరాళ్ళు బయట పడ్డాయి. కొంత కాలం గడిచిన తరువాత కనబడిన దృశ్యంలో కొండమీద పూర్వపు వృక్షవైభవం జాడలేదు. గాలికెగిరివచ్చిన విత్తులూ, పక్షులూ తదితర అడవిమృగాల ద్వారా వచ్చి పడిన గింజలూ మొలకెత్తడంతో గడ్డి మొక్కలూ, తీగలూ, ఏవేవో జాతుల చెట్లూ పెరిగాయి. మరి కొబ్బరిచెట్ల సంగతో? అప్పటి వాతావరణం అనుకూలించక పోవడంతో కొండమీద కొబ్బరిచెట్లన్నీ నశించిపోయాయి. కాకపోతే, గతంలో ఆ కొండ నుండి ప్రవహించిన వాగుల్లో తేలుకుంటూ పోయి సముద్రతీరానికి చేరిన కొబ్బరిబోండాలు ఆ ప్రాంతంలో మొలకెత్తి ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందాయి.
ఈ దృశ్యాలను తిలకించిన నారికేళుడికి జ్ఞానోదయమయ్యింది. తమవంటి వృక్షాలు తీర ప్రాంతాలకు పరిమితం కావడమే "సమ న్యాయం' అని బోధపడింది.
మరికొంత వివరణ:
ప్రకృతికి సంబంధించినంత వరకు "సమ న్యాయం” అంటే యేమిటో మరింత చెప్పాల్సి ఉంది. మనం ఒక గొయ్యి తవ్వి, దాని మానాన దాన్ని వదిలేస్తే- కొంత కాలానికి అది మానవ ప్రమేయం లేకపోయినా పూడ్చుకుపోతుంది. అంతేకాదు, ఆ పక్కనే కుప్పలా పోసిన మట్టి కూడ కొంచెం కొంచెంగా తరిగిపోయి అక్కడున్న నేల మట్టానికి సమమైపోతుంది.
మరొక్క సంగతి. ఖాళీగా ఉన్న ఓ గదిలో ఒక దూదిపింజను ఉంచి, “ఫుల్ స్పీడ్”లో పంఖా వేసి, గదికి తాళం పెట్టి, కొన్ని గంటల తరువాత తెరిచి చూస్తే- దూదిపింజ ఆ గదిలో ఏదో ఒక మూలకు చేరి ఉంటుంది. ఇలా ఎన్నిసార్లు చేసినా ఎన్ని దూదిపింజలు వేసినా అవన్నీ ఆ మూలకే చేరుకుంటాయి. ఐతే, ఆ గది తలుపులు తెరచి ఉంచినా, లేక మరే మార్పు చేసినా ఆ దూదిపింజలు మరో చోటును వెతుక్కుని అక్కడ స్థిరపడతాయి.
పర్యావరణశాస్త్ర పరిభాషలో పైన ఉటంకించిన మార్పుల క్రమాన్ని "ప్రకృతిసిద్ధమైన వ్యవస్థాపన" (ఇకసిస్) అంటారు. ఈ ప్రక్రియ ద్వారా వచ్చిన పరివర్తన యొక్క అంతిమ ఫలితమే పర్యావరణ పరాకాష్ఠ (క్లైమాటిక్ క్లైమాక్స్). ఆ స్థితినే జీవావరణ సమతుల్యత (ఇకలాజికల్ ఈక్విలిబ్రియం) అంటారు.
మానవజాతి పరిణామక్రమాన్ని పర్యావరణ సిద్ధాంత చట్రంలో బిగించి చూస్తే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఘటనా ప్రకృతిసిద్ధమే అనిన్నూ, "క్లైమాటిక్ క్లైమాక్స్"ను చేరడానికీ, తద్వారా "ఇకలాజికల్ ఈక్విలిబ్రియం”ను సాధించడానికే అనిన్నూ మనకు అవగతమవుతుంది. ఈ కథలాంటి వ్యాసం ద్వారా నేను ప్రతిపాదించ దలచుకున్నది ఇదే !
ఫోన్: 09848296865 ఇదే మాదిరిగా మీరూ శాస్త్రీయ అంశాలను పత్రికకు రాయవచ్చు. సం॥ 23