అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/రెండు తెలుగు రాష్ట్రాలూ తమ భాషావిధానాన్ని ప్రకటించాలి!
సంపాదక హృదయం సంపుటి:1 అమ్మనుడి మార్చి 2015
రెండు తెలుగు రాష్ట్రాలూ తమ భాషావిధానాన్ని ప్రకటించాలి
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రెండు రాష్ట్రాలైంది. ఏడాది కావస్తున్నా రెండు ప్రభుత్వాల అధినేతలూ తమ విద్యావిధానం ఏమిటో, భాషా విధానం ఏమిటో ప్రకటించలేదు. ఎన్నికల ప్రచార సమయంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాము అధికారంలోకి వస్తే ఒకటో తరగతి నుంచే ఇంగ్లీషు మీడియంలో చదువులు చెబుతామని అన్నారు. కానీ దాన్ని ఆధారం చేసుకొని అయినా ఇంతవరకు తమ విద్యావిధానాన్ని ఆయన ప్రభుత్వం ప్రకటించలేదు. ఇటు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ అంశాన్ని దాటవేస్తున్నారే తప్ప, ఎక్కడా స్పష్టంగా తమ భాషా విధానం ఏమిటో చెప్పలేదు.
తెలుగు భాషోద్యమకారులు 2012లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా పెద్దఎత్తున ఉద్యమించి తెలుగుభాషా మంత్రిత్వశాఖను సాధించారన్న అంశాన్నే ఆంధ్రప్రభుత్వం మరచిపోయింది. సమైక్యరాష్ట్రంలో జీ.వో.నెం.909/31.12.2013న జారీ అయిన సంగతిని విస్మరించి తమ మొదటి బడ్జెట్ లో గతంలో వున్న యువజనాభ్యుదయం, పర్యాటకం, సాంస్కృతిక మంత్రిత్వశాఖ పేరిటనే కేటాయింపు ప్రకటించారు. ఆ శాఖలోనుంచి సాంస్కృతిక శాఖను విడదీసి భాష, సాంస్కృతిక మంత్రిత్వశాఖగా ఏర్పాటుచేశారన్న స్పృహే వారికి లేకుండాపోయింది. విచిత్రమేమిటంటే వారి ప్రభుత్వంలో భాషాసాంస్కృతిక శాఖకు ప్రత్యేకంగా మంత్రి వున్నారు! కాని బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేదు!
ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ భాషాసాంస్కృతిక మంత్రిత్వశాఖలున్నాయి. కాని, వారికి భాషావిధానమంటూ ఒకటి లేకపోవటం విచిత్రం. ఆ శాఖ ఏ విధానం ప్రకారం పనిచేస్తుందో అసలు ఆ శాఖ వున్నందుకు ఉపయోగం ఏమిటో అర్థంకాదు. ఈనాడు (ఫిబ్రవరి 21న) మళ్ళీ అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. యునెస్కో డైరెక్టర్ జనరల్ ఈ సందర్భంగా యిచ్చిన సందేశంలో మాతృభాషలతోనే ముందడుగు వేయాలని, గణితంతో సహా అన్ని పాఠ్యాంశాలు మాతృభాషలో నేర్పితేనే విద్యార్థులకు సరియైన జ్ఞానం అందించినట్లవుతుందని చెప్పారు. మాతృభాషలో విద్యాబోధన అన్నది ప్రాథమిక మానవహక్కు అని, అన్నిరకాల నిరంతర అభివృద్ధికి సరియైన, బలమైన శక్తి మాతృభాషేనని, యునెస్కో ప్రకటించింది. ఇలా 15 యేళ్ళుగా యునెస్కో మొత్తుకుంటూనే వుంది. మన రాష్ట్రప్రభుత్వాలు ఆర్భాటంగా ఉత్సవాలు జరిపి, వాగ్దానాలు కుమ్మరిస్తాయే తప్ప ఏదీ ఆచరణలోకి రాదు.
మన పొరుగు రాష్ట్రప్రభుత్వాలకు భాషావిధానంలో స్పష్టత వుంది. అందువల్లనే కర్నాటక, తమిళనాడువంటి రాష్ట్రాలు ప్రగతిపథంలో వున్నాయి. ఇది తెలిసి కూడా మన ప్రభుత్వాలు దారికి రాకపోవడం వారి ప్రజాస్వామ్య వ్యతిరేకధోరణికి అద్దం పడుతున్నది.
మనవి రెండూ తెలుగురాష్ట్రాలే. తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డానికి కారణం ఆంధ్ర, తెలంగాణలలో వెల్లువెత్తిన భాషాభిమానమే. తెలుగువారంతా ఒకే రాష్ట్రంలో వుండాలన్న తాపత్రయమే. ఎందరో ఎన్నో త్యాగాలు చేసినమీదట ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. కానీ ఈ 60 ఏళ్ళలో మన పాలకుల స్వార్థరాజకీయాల వల్ల విభజన జరిగి ఇప్పుడు రెండు రాష్ట్రాలయ్యాయి. సమైక్య రాష్ట్రంలో భాష విషయంలో ఎంత నిర్లక్ష్యం చేశామో, ఇప్పుడు కూడా అదే వైఖరి రాజకీయనాయకుల్లో కనిపిస్తున్నది. ఈ ధోరణి కొన్నేళ్ల తర్వాత ఈ రెండు రాష్ట్రాల విచ్ఛిత్తికి కూడా దారితీస్తే ఆశ్చర్యపోనక్కరలేదు.
60 యేళ్ళ క్రితం సంయుక్త మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పర్చుకోవాలనే ఉద్యమం చేశారు. పైకి భాషారాష్ట్ర వాదాన్ని ముందుకు తెచ్చినా, దాని వెనుక వున్న అసలు విషయం నాటి రాజకీయనాయకుల రాజ్యకాంక్షే. అందువల్లనే ఆంధ్రరాష్ట్రం ఏర్పడగా తక్కిన మద్రాసు రాష్ట్రంలో మిగిలిపోయిన నలభైశాతం మందికి పైగా వున్న స్థానిక తెలుగువారు నష్టపోయారు. అక్కడ తమిళ రాజకీయం ఊపందుకుంది. అక్కడి తెలుగు రాజకీయనాయకులు పదవీకాంక్షతో తమిళీకరణ చెందారు. అందువల్లనే నాటికీ, నేటికీ తమిళనాట రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో వున్న అధికార, ప్రతిపక్షాలవారు తమిళం మాట్లాడే తెలుగుబిడ్డలే !
ఇప్పుడు అక్కడ తెలుగు మూలాలున్న యువతలో క్రమంగా స్వభాషాభిమానం, ఆత్మాభిమానం చిగురులు తొడుగుతున్నాయి. తెలుగు అక్షరానికి దగ్గర కావాలన్న తపన పెరుగుతున్నది. ఇది రాజకీయకోణాన్ని సంతరించుకొని రానున్న పది పదిహేనేళ్ళలో కొత్త మార్పులకు దారితీయనున్నది. ఈ మా మాటలు అతిశయోక్తులుగాను, తొందరపాటుగాను పలువురు అనుకోవచ్చు గాక. కానీ ఇది వాస్తవం. అణచివేత - ముఖ్యంగా భాషా సాంస్కృతిక అణచివేత ఆత్మగౌరవాన్ని రెచ్చగొడుతుంది. ఒకప్పుడు ఆ రాష్ట్రంలో ద్రవిడోద్యమం తమిళ భాషోద్యమంగా రూపుదిద్దుకొని రాజకీయాలను శాసించింది. మరొక రూపంలో ఇవే పరిస్థితులు ఆంధ్ర, తెలంగాణల్లో ఏర్పడకుండా వుండాలంటే, సాంస్కృతికత, సామాజికత అంశాలుగా ఉద్యమాలు బలం పుంజుకోకుండా వుండాలంటే మన ప్రభుత్వాలు ప్రజలందరి శ్రేయస్సును లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలి. అందుకూ వారు మాతృభాషనే నమ్ముకోవాలి. తెలిసి తెలిసీ పరాయీకరణ చెందడానికి ఏ సమాజమూ ఒప్పుకోదు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాషాసాంస్కృతిక వివక్ష అంశాన్ని కూడా ముఖ్యమైన అంశంగా ముందుకు తెచ్చారు. నిజానికి భాషా వివక్ష మన సమాజంలో తొలినుండీ వ్రేళ్లూనుకున్నదే. కులవ్యవస్థ, చదువులు కొన్నివర్గాలకే పరిమితం కావటం, అందరికీ సమానంగా విద్యాసాంస్కృతిక అవకాశాలు లేకపోవటం ఈ వివక్షకు దారితీసింది. మాట్లాడేభాషకు, పుస్తకాల్లో భాషకూ సంబంధం లేకుండాపోయింది. సామాన్య ప్రజల్లో వాడుకలో వున్న ఎన్నో మాటలు మన నిఘంటువుల కెక్కలేదు. అప్పుడు సంస్కృతం, ఇప్పుడు ఇంగ్లీషు తోడు లేనిదే విద్యావంతులు నాలుగు మాటలు వ్రాయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇదంతా మన పాలకులకు సరియైన భాషావిధానం లేకపోయినందునే. శాస్త్రసాంకేతిక అంశాలతో సహా అనేక అవసరాలకు తెలుగును పనికిరానిదిగా ముద్ర వేశారు. ఇప్పుడైనా వాస్తవాన్ని గమనించి తెలుగు మూలాలపై ఆధారపడి తెలుగు నుడిని ఆధునికంగా పెంచుకోకపోతే ఇంకా మిగిలివున్న తెలుగు కూడా పరాయీకరణ చెందుతుంది. ఈ ప్రమాదం రెండు రాష్ట్రాల్లోనూ పొంచివుంది. ఇప్పటికైనా రెండు ప్రభుత్వాలూ మేల్కొనాలి. తమ సమాజాల్లో ఉన్న వైవిధ్యాన్ని కాపాడుతూనే, ప్రజల ఉమ్మడి భాషను పాలనాభాషగా, బోధనాభాషగా పెంపుచెయ్యాలి.
రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు ప్రాధికారసంస్థల్ని ఏర్పాటుచేసి భాషాభివృద్ధికి పరస్పరం సహకరించుకొంటూ ముందుకు సాగితేనే, రెండు తెలుగురాష్ట్రాలూ బలమైనవిగా ఎదుగుతాయి. అన్ని రంగాల్లోనూ ఇచ్చిపుచ్చుకొనే ధోరణితోనే అభివృద్ధిని సాధించగలం. ఇది భాషారంగంతోనే మొదలు కావాలి.
21-2-2015
సామల రమేష్ బాబు
ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా తెలుగువారంతా ఒక్కటే