అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/కడుపుతీపు
చదివితీరవలసిన పొత్తం
సన్నిధానం నరసింహశర్మ
కడుపు తీపు
చదువతగిన పుస్తకాలు ఎన్నో వుంటాయి... కానీ చదివితీరవలసిన పుస్తకాలు కొన్నే వుంటాయి. చదివితీరవలసిన వాటిలో వర్తమానకాలానివీ వుంటాయి. అటువంటివాటిలో - ముఖ్యంగా ఖండకావ్యాలలో వేటూరి ప్రభాకరశాస్త్రి 'కడుపుతీపి' ఒకటి.
తెలుగు సాహిత్యానికి వేయేళ్ళ సేవ చేసిన ప్రక్రియ పద్యకవితా ప్రక్రియ. అన్ని ప్రక్రియల ఫలాలూ అనుభవైకవేద్యాలుగా చేసుకుంటే తెలుగు సాహిత్య వృక్ష శాఖలన్నీ తెలుస్తాయి.
2015 ఫిబ్రవరి 7వ తేదీకి ఓ ప్రత్యేకత వుంది. అది భాషా సాహిత్యాల పరిశోధకుడు, ప్రజావాఙ్మయానికి కొంత సేవ చేసిన వేటూరి ప్రభాకరశాస్త్రి గారి 127వ జయంతి రోజు. అరవై రెండు సంవత్సరాలే జీవించిన ఆయన అనేక రచనలతోపాటు 'తెలుగు మెఱుగులు' పొత్తమును తెలుగు సరస్వతి కలంకారం చేశారు. "ఒడిదొడుకులు లేని తేట తెలుగు కవితా రచన చేసినవారిగా, అచ్చుయంత్రముల వెలుగు నెఱుగక మట్టి బ్రుంగిన తాటి యాకులను బట్టుకుని కన్నులు చిల్లులుచేసికొనెడి నిరంతర (సాహితీ) వ్యవసాయము చేసినవారిగా వేటూరివారిని 'ఆంధ్ర రచయితలు' ప్రామాణిక గ్రంథంలో మధునాపంతులవారు శ్లాఘించారు. ’భాషాపరిశోధకులు, విమర్శకులు కవులుగా నగుట అరుదు. ఆ యదృష్టము ఒక్క ప్రభాకరశాస్త్రిగారికి పట్టినది' అనేది కూడా సత్యనారాయణ శాస్త్రిగారి సత్యవాక్యము.
ఆయన కేవలం కవేకాదు, ప్రత్యేకించి చెప్పుకోదగ్గ సవర్ణదీర్ఘసంధి రహిత మహాకవి కూడా. ఈ విషయాన్ని ఖండితంగా చెప్పడానికి ఆయన రాసిన నాలుగు ఖండకావ్యాల్లో 'కడుపుతీపు' 'కపోతకథ' సాక్ష్యాలు పల్కుతాయి. అందులో 'కడుపుతీపు' చదవితీరవలసిన కావ్యంగా భావించాలి. ఇప్పటికి తొంభైసంవత్సరాల క్రితం అంటే 1925లో చెన్నపురిలో ఆంధ్రపత్రికా ముద్రాలయం వారు అచ్చొత్తించిన ఖండకావ్యం కడుపుతీపు. ఇది అచ్చమైన తెలుగుదనం కల శీర్షిక. టేపటివేళ, మాపటివేళ, చీకటివేళ, ముగింపు అనే నాలుగు శీర్షికల్లో కైత బిగింపు సొంపులుంటాయి.
కథ చెప్పినట్లు సాగుతాయి పద్యాలు
కలదెగద యంధ్రవిష్ణు
స్థలమై, శ్రీకాకుళాభి ధానమ్మున బే
ర్వేలసిన పురమంధ్రావని
వెలనాటన్ గృష్ణపెంపు వెలసిన చోటన్ - అనేది మొదటి పద్యం
కొన్ని శాసనాల్లో ఆంధ్రకు ఆంధ్ర అనే వుంది.
ఆంధ్రదేశంలో నెలనాట కృష్ణానది వెలసిన చోట,
ఆంధ్రవిష్యస్థలమైన శ్రీపురం శ్రీకాకుళం అని వుంది కదా అని శ్రవణ సుభగంగా ప్రారంభం.
ఆ ఊళ్ళో ఒక ఓవర్సీర్ కుటుంబం వుంది. వయసులో ఉన్నవాడు. తమిళుడు, ఆయన ఇల్లాలు, నలుగురైదుగురు బిడ్డలు. అందపు గందులు, ఆ కుటుంబంలో సర్వ సౌఖ్యాలూ వున్నాయి. చక్కని సంస్కృతి కల కుటుంబం పిల్లాడు ఆ తల్లిపాలు త్రాగడం సహజంగా ఒక్క పద్యంలో
"గొబ్బున వచ్చి యొక్కలను గుడ్చుచు
నీడ్చుచు ఱైక మారుచే,
బ్రబ్బి మరొక్క సన్ దడవి పట్టుచు
రెండును బాలవంకలై
యుబ్బి స్రవింపగా జననియుం దల
మూర్కొన పొట్టనిండగా
జుబ్బనజూఱలాడెడు నినుంగు
గనుంగొన వేడుకయ్యెడున్"
అని చెప్పారు. తల్లీబిడ్డల ప్రేమపాళ్ళు సహజక్రియలూ గల ఈపద్యంలోని భావదృశ్య శిల్పం భావించి మనంకూడా బిడ్డలుగా మారుతామనిపిస్తుంది. ఈసందర్భంలో - బెద్దలకి పాలెక్కడిస్తే స్తనసౌందర్యం తగ్గిపోతుందనుకునే తల్లుల భావాలపై వేటూరివారు ఒక వేటువేస్తారు తెలుగుదనం నిండుగాగల ఓ పద్యంలో
"కుచసంపన్నత కూలిపోవుననియో క్రొవ్వారు మైసౌరు విం
త చమత్కారములంతరించునని యో స్తన్యంబులేకుండ గు
బ్బ చనుల్ దిబ్బలుగా నొనర్చుకొని ద(డ)బ్బా పాలచే నిప్డు పు
త్త్ర చయంబుం బరిమార్చు మాతలటె మాతల్! కాలదూతల్గదా!
కదుపుతీపు కధలో కవి వేటూరి జోక్యం కల్పించుకుని చెప్పిన పద్యంలోని భావం సువ్యక్తమే.
పదలాలిత్యం, తర్కశుద్ధి, శబ్ద స్థైర్యం, అలంకార విశేషం ఇలాంటి వెన్నో వుండి గుఱ్ఱంలా సాగాలి పద్యం అనే లక్షణాలన్నీ సలక్షణంగా ఈ ఒక్కపద్యంలోనే కాదు అన్ని పద్యాలలో ఉండడం ఈ కావ్యవిశేషం.
ఎంతటి మహాకవి పద్యరచనలోనైనా ఎక్కడో అక్కడ పదులు వదులు Loose Compostion కలయికలుండవచ్చేమోగాని, వేటూరి పద్య రచనలో ముఖ్యంగా ఈ కడుపుతీపులో పద్యంలోనూ కనీసం ఒక్క పాదంలో నైనా ఉండకపోవడం అసాధారణం. సరే, కథా ప్రవేశం చేద్దాం.
అది శ్రావణమాసం. బెజవాడ ఆనకట్ట కృష్ణమ్మ అరవై అడుగులకు దాటి రెండు ఒడ్డుల మధ్యనా నిండి, మిగిలినది సముద్రంలోకి వెళ్ళిపోతోంది. వరదలొచ్చాయి. పల్లెల అవస్థలు హెచ్చాయి. పశువుల్నీ ధనధాన్యాల్నీ కాపాడుకోవడం కష్టమైపోయింది. అంత వరదలోనూ కృష్ణలో ఆడువారు, స్నానమాడువారు, పుణ్యకాంతల పూజాపునస్కారాలు చేస్తూనేవున్నారు. సరే మన కథానాయిక అయిన ఇల్లాలు ఇంటాయనతో పిల్లలతో స్నానానికి వెళ్ళింది. భర్త - రేవుని భార్యకి చూపించాడు- భార్య పిల్లల్ని ఒక్కొక్కర్నే స్నానం చేయిస్తోంది, ఇంతలో ప్రవాహంలో తుమ్మముళ్ళ కొమ్మ ఆమెచేయి దగ్గరికి వచ్చేసింది.
'పై కేగుదెంచు నంచుం
గైకొని యాకొమ్మవిసరె గడగా బడగా
నాకొమ్మ, యందు మిసమిస
బ్రాకిన యట్లయ్యె అదియు బామో ఏమో'
పురుగు భయంలేకుండా రక్షించమంది. స్నానంచేసింది. బిడ్డలు కాళ్ళకు అడ్డాలు పడుతూండగా ఇంటికి వచ్చింది. భర్తవచ్చాడు. తరువాత తపాలా ఉత్తరం ఒకటి వచ్చింది. అది అధికారలేఖ భర్తకు మదరాసు బదిలీ, జీతం పెంపునకు చెందిన లేఖ. వారిద్దరికీ ఉన్నవూరు నుండి చెన్నపట్నం వెళ్ళడానికి ఇష్టం లేదు, తప్పదు. ఆలోచిస్తున్నారిద్దరూ. తరువాత రాత్రివేళ భోజనాలు చేశారంతా. ఇల్లాలు "వాన యీదురు గాలి వస్తోంది. ఆ మంచంమీద పిల్లల మధ్య మీరు పడుకోండి" అంది భర్తతో, పిల్లలు "అమ్మా నాన్న దగ్గర పడుకుంటే మాకు నిద్ర రాదు" అని నేలమీద తల్లి దగ్గరే పడుకుని పంతం నెగ్గించుకున్నారు. శ్రీకాకుళాధీశ్వరా! మా పిల్లల్ని జాగ్రత్తగా చూడమని ప్రార్ధించుకుంది. పడుకున్నారు. మధ్యలో పాలకు పిల్లాడేచ్చాడు. తల్లి మేలుకుని తలుపు తీసి బయట కాళ్ళు కడుక్కు వచ్చి, తలుపు వారగా వేసి, చేపు రాగా పాలివ్వడానికి కుమారుణ్ణి తీసుకుని కూర్చొంది. అప్పుడు ఘోరం జరిగింది.
"తెల్లంద్రాచట (తెల్లత్రాచు) అప్పుడామె పయి కుద్రేకించి
దూకెన్ బుసల్
చల్లెం పైబడగార్చె, అంత సుతరక్షా చింతయేదక్కత
కెల్లం ద్రోపడ నాపె పాపశిర మట్టే పట్టె నిర్వీతులన్ (ఇరుచేతులా)
'పిల్లల్ పిల్లలు పిల్లలంచునఱచెన్, బీభత్స కంఠధ్వనిన్"
తెల్లత్రాచును చేత్తో పట్టుకుని తన దగ్గరున్న పిల్లల్ని మంచం మీదకి చేర్చండి. మంచంమీదకి చేర్చండి అనగా, భర్త లేచి పిల్లల్ని మంచంమీదకు చేర్చాడు ఖంగారుగా.
"అయ్యో బిడ్డల జేకొను
డయ్యోబిడ్డల'ని యేడ్చు సంతే కానీ
అయ్యమ్మ పాము బట్టితి
చెయ్యిదిగో కరచునంచు జీర దయారే!
ఆ విషపు తోకతో ఆమె రెండు చేతుల్ని చుట్టేసింది. ఈమె ఆ పాము ఎక్కడికి వెళ్ళి పిల్లల్ని ఏంచేస్తుందో అని దాన్ని పట్టుకునేవుంది. పాము తలతో కొట్టడం వల్ల చేతులనిండా రక్తం కారింది. వచ్చి చేరిన జనంలో ఒకరు ఉత్తరీయాన్ని పాము తలపై వేసి ఎలాగో చంపేశాడు. ఇల్లాలు గుడ్లు తేలేసింది. ఇంకా చనిపోవదు పిల్లాడు తల్లి శరీరంపై పడినా పాలు విషపుసాలయ్యాయి. ఇవ్వలేని ఆ సందర్భంలోనూ బాధపడింది. పసిబిడ్డల్ని ఉపేక్షించకుండా చూసుకుంటానని భర్తచే శపథం చేయించుకుని 'పసిబిడ్డలు పసిబిడ్డలగంటూనే ప్రాణం విడిచింది.
కొడుకుగుఱ్ఱలకై జంకు గొంకు లేక
పాసె దన ప్రాణముల దృణ ప్రాయముగను
బూటకంబయ్య నిప్పుడీ బోటి వలస, ప్రాణమన్నింటి కంటే తీపనెడి
పలుకు అన్నారు. కవి -
ప్రాణం అన్నింటికంటే తీపే అయినా అంతకంటే కరువుతీపే తీవు - అని ఈకావ్యంద్వారా సందేశమిచ్చారు. వేటూరివారు. ఇది 105 పద్యాల ఖండకావ్యం, ప్రతీపద్యం చిక్కగా ఉండి అందులో తెలుగుదనం చక్కగా నిండిస్తూ కరుణరసస్ఫోకరంగా వ్రాశారు. అంతేకాదు దీనిలో సంస్కృతీ విశేషాలున్నాయి. ఆచారవ్యవహారాలున్నాయి. శ్రీకాకుళం నుండి తప్పనిసరి బదిలీ తెలిసినప్పుడు స్వస్థాన ప్రేమాంశాలు, వాని అనుభూతులూ వున్నాయి.
అంతేకాదు. ఇందులో ఆంధ్రుల గొప్పతనాలున్నాయి. చెన్నపురి వెడితే శ్రీకాకుళస్వామి దర్శనం, కృష్ణానదీస్నానం. ఇవేకాక
"దొరకునో లేదో మధుర వర్తనము గల్గు తెల్గు గేస్తుల చెల్మితీరు మరల” అనుకొంటారు. ఎందుకంటే వారిది తమిళుల కుటుంబం, "ప్రశస్త వస్తు భరితమగు ఆంధ్రభూమిని" కాపురం మళ్లీ వస్తుందా అనుకుంటారు. కృష్ణాప్రాంతం ఊళ్ళ పొలాల ప్రకృతి మళ్ళీ దొరుకుతుందా అనుకుంటారు.
"హృదయమిచ్చి ఆదరించుగృహస్థుల
నడుమ కాపురం బొనర్పగలిగె
కేలు మోడ్పు నీకు కృష్ణాతరంగిణీ
తీరశోభితాంధ్ర దేశలక్ష్మి" అంటారు. ఆ దంపతులు.
'చక్కెర అక్కఱలేనివి చిక్కనిపాల్ గడ్డ పెరుగు
ఉడ్డగు వేయున్ మిక్కిలి చవిగల కూరలు.
చిక్కున్ కృష్ణాస్రవంతి చెంతల యూళ్ళన్' అంటారు వేటూరికవి,
అంతేకాదు
"ఆతిధ్యగౌరవంబును స్వాతంత్య్ర్య ప్రియత, స్వల్పసంతోషము, దుర్నీతినిహీనత, నైచ్యా
పేతత్వము నాంధ్రులందు పేర్పడు గుణముల్" అని కూడా పాత్రలతో చెప్పిస్తారు వేటూరివారు. నిమ్నోన్నతాలు అనడానికి 'వైపువాటములు' అని అనిన తెలుగుకవి వేటూరి ప్రభాకరశాస్త్రిగారే. కడుపుతీపిలో ఉనికితీపి, బాసతీపి, బతుకుతీపి ఇన్ని - ఎన్నో ఉన్నాయంటే చదివితీరవలసిన పొత్తం కదా!
(పొత్తాన్ని అందించిన శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయానికి ముప్పిడాలు)
రచయిత ఫోన్ : 9292055531