Jump to content

అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/'గానకళ' మునుగంటి శ్రీరామమూర్తి

వికీసోర్స్ నుండి
​

స్ఫూర్తి ప్రదాత

- డా॥ నాగసూరి వేణుగోపాల్

తెలుగు సంగీత సేవను చరిత్ర కెక్కించిన

'గానకళ'
మునుగంటి శ్రీరామమూర్తి

"... 1962వ సం॥ జూన్ నెలలో 'గానకళ' ప్రారంభించాం సంగీతానికి ఆంధ్రప్రదేశంలో ఒక పత్రిక ఉండాలనే భావన సాహసోపేతమైనదే! ఈనాడు మద్రాసు నుంచి ప్రచురితమవుతున్న సంగీత పత్రికలకు కొన్ని దశాబ్దాలకు ముందే నాకీ ఆలోచన కలగడం సాహసమే! పత్రిక ప్రచారం కోసం నాతోపాటు స్వర్గీయ మహేంద్రవాడ కామేశ్వరరావు అనేక పట్టణాలకు తిరిగి కష్టసుఖాలను పంచుకుంటూ పత్రికకు ఎనలేని సేవచేశారు. వారి సేవను నేను ఎప్పుడూ మరువలేను. కనీసం 15, 20 పట్టణాలలో ప్రముఖులను కలుసుకుంటూ, సభ్యులను చేర్పిస్తూ చాలా కృషి చేశాము. ఈ పర్యటన అనంతరం నా ఆరోగ్యం చెడింది. డబుల్ టైఫాయిడ్ బారిన పడ్డాను. 40 రోజులు రుగ్మతను అనుభవించాను. మామూలు స్థితికి రావడానికి వాడిన ఇంగ్లీషు మందుల ప్రభావం ఒక నెలపోయిన తర్వాత నాలో కన్పించింది. ఒళ్ళంతా తెల్లబడింది. - తలతో సహా. ఆస్థితి నుండి బయటపడటానికి నాకు సంవత్సరకాలం పట్టింది. దాని చికిత్సకు వాడని మందు లేదు, చేయని ప్రయోగం లేదు. ఆ 40 రోజులలో ఒక రోజున ఇంజక్షన్ తీసుకొన్నప్పుడు 20 నిమిషాలు నేను పైలోకానికి పోయాను. అంతా అయిపోయిందనే అనుకున్నారు. మొండిప్రాణం కనుకనో ఏమో తిరిగి నేల మీదకి దిగి వచ్చాను. ఈ అనుభవాలన్నీ సంగీత పత్రికను నిలబెట్టాలనే తపనతో ఉన్న చోటనే ఉండక, తిన్నచోట తినక అవిశ్రాంతంగా కష్టపడటం వల్ల వచ్చిన పర్యవసానమే.

ఇలా తన సంగీత మాసపత్రిక 'గానకళ' కోసం పడిన యిడుముల కథను మునుగంటి శ్రీరామమూర్తి 2014 నవంబరు సంచిక 'నాజీవన యానం'లో విపులీకరించారు. నవంబరు సంచికలో. ఇప్పుడే ఎందుకు ఈ సంగతులు రాశారా? అనే సందేహం కలుగుతోంది. 1962 జూన్లో మునుగంటి శ్రీరామమూర్తిగారు సంగీతం కోసం 'గానకళ' అనే పత్రికను ప్రారంభించి - విజయవంతంగా నడుపుతూ ఈ జనవరి 12న తన తొంబైమూడవ ఏట కాలధర్మం చెందారు. అరశతాబ్ధం మించి సంగీతం కోసం ఒక మాసపత్రికను పెట్టి కొనసాగించడం నిజంగా సాహసమే.

మునుగంటి వారితో ముఖాముఖి పరిచయం జరిగి ఒక దశాబ్దం దాటి ఉండవచ్చు! నేను తెలుగు 'స్పోకెన్ వర్డ్స్' విభాగం చూస్తున్న కాలంలో వారిని సంగీత సంబంధమైన అంశం గురించి ప్రసంగించడానికి కాకినాడ నుంచి ఆహ్వానించాను. భౌతికంగా కలవడం 2005లో కావచ్చు కానీ వారి జర్నలిజం మూర్తిమత్వం పరిచయమై మూడు దశాబ్దాలు దాటింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో కనబడిన పత్రికలలో గానకళ ఒకటి - సంగీతానికి ఒక మాసపత్రిక వస్తోందని తెగ సంతోషం కల్గింది. సంపాదకులు మునుగంటి శ్రీరామమూర్తిగారి మీద గౌరవం పెరిగింది. వారెవరో తెలియదు కానీ కృషి గొప్పదని భావించాను. వారి పత్రికను మూడునాలుగేళ్ళు చూసి వుంటాను. తిరుపతిలో ముఖాముఖి పరిచయమైనప్పటి నుంచి వారి సౌజన్యం ఎంతో అనురాగం ఏమిటో ప్రత్యక్షంగా, పరోక్షంగా చూడగలిగాను. మనిషి పొడుగు కాదు, కొంచెం సగటు ఎత్తుతోనే మూర్తి. దాదాపు తెల్లచొక్కాలోనే వారిని చూసినట్టు గుర్తు. మూర్తి కన్నా వారి మాట మరీ మృదువు. దయాపూరితం. హంగూ ఆర్భాటం లేవు. ఎప్పుడూ నాసలహాలు పత్రికకు అవసరమని కొరేవారు. వయోలిన్ అద్భుతం. ద్వారం వెంకటస్వామినాయుడు గారి 50వ వర్ధంతి కార్యక్రమాలు ఇటీవల చెన్నయ్లో నవంబరు 13,14,15 తేదీలలో జరిగాయి. చివరి రోజున (శనివారం కావడంతో) నేను తేనాంపేట 'తత్వలోక' ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మునుగంటి శ్రీరామమూర్తి గారిని కలవటం, వారు ద్వారం వారి గురించి సవివరంగా, గంభీరంగా ఆంగ్లంలో ప్రసంగించగా వినడం సాధ్యపడింది. లేకపోతే వారిని కలిసి ఉండేవాడిని కాదు. ఆ మధ్య వారి ఆరోగ్యం తీసిపోయి, తర్వాత కుదుటపడ్డారు. అలాంటి మునుగంటివారు ఈ జనవరి 12 న సాయంత్రం అకస్మాత్తుగా మరణించారు. నిజానికి అదే రోజున ఓ సినీ నిర్మాత - దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ గారు కనుమూయటంతో టీవీ చానళ్ళు ఆయన సినిమా పాటలు వాడుకోవడంలో తనమునకలుగా ఉన్నాయి. మరుసటిరోజు మదరాసులో ఈనాడు పత్రికలో చదివేదాకా నాకు తెలియదు. రెండు నెలల క్రితం కలిశాను, హాయిగా మాట్లాడారు - అంతలోనే పోయారని బాధ కల్గింది.

శ్రీరామమూర్తిగారు 1925 మార్చి 25న కాకినాడలో జన్మించారు. తల్లిదండ్రులు సుభద్రమ్మ, మునుగంటి వెంకటరావు. తండ్రి గాయకులు. తాత శ్రీరాములుగారు త్యాగరాజస్వామి శిష్యపరంపరలు ఐదవతరానికి చెందినవారు. వీరి తాతగారు 115 సం॥లో క్రితం (లేదా ఇంకా ముందు) కాకినాడలో శ్రీరామ సమాజం ప్రారంభించారు. అలాగే ఉచిత సంగీత కళాశాలను శ్రీరామమూర్తి తాతగారు మొదలుపెట్టారు. అంతేకాకుండా వీరు గణపతి సంగీత ఉత్సవం పేరున 10 రోజులపాటు ఐదు హరికథలుండటం. శ్రీరామమూర్తిగారు ఈ నేపథ్యం నుంచి వచ్చారు. ​

64 సం॥ క్రితం సంగీత విద్వత్సభ ప్రారంభించి సంక్రాంతి సంగీతోత్సవం నిర్వహిస్తూ వచ్చాడు. ఇదికాకుండా 53 సం॥ క్రితం సంగీతానికి ఒక డాక్యుమెంటేషన్ ఏర్పరుస్తూ, రేపటి సంగీత చరిత్రకు ఆధారాలు తయారు చేశారు. పుస్తక రచన కాకుండా ప్రతినెలా పత్రిక తేవాలని - జర్నలిస్టుగా, సంపాదకుడుగా మారిపోయాడు. ఇపుడు 'గానకళ' అర్ధశతాబ్దం దాటిన వ్యవస్థగా తయారైంది. ఈ పత్రిక సేవ ఎలా ఉంటుంది? ఉదాహరణకు 2014 నవంబరు సంచిక చూడండి - అది ద్వారం వెంకటస్వామినాయుడు సంస్కరణ సంచికగా శ్రీరంగం నారాయణబాబు, శ్రీపాద పినాకపాణి, ఎన్.సి. హెచ్ కృష్ణమాచార్యులు, ద్వారం భావన్నారాయణరావు, రజని, నూకల, ఆరుద్ర, ఇలపావులూరి కామేశ్వరరావు, నండూరి రామమోహనరావు, గుంటూరు శేషేంద్రశర్మ, సూరిబాబు, కొమండూరి శేషాద్రి, మునుగంటి శ్రీరామమూర్తి గార్ల వ్యాసాలతో అలరారుతోంది. 2014 డిసెంబరు సంచిక నేదునూరి కృష్ణమూర్తి మృతి సందర్భంగా వారి ప్రత్యేక సంచికగా వెలువడింది. ఇప్పుడు జనవరి సంచిక శ్రీరామమూర్తిగారి మీదనే తయారైంది.

మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఆవంత్స సోమసుందర్ వంటి పెద్దల పేర్లతోపాటు సుమారు నలభై మందికి పైగా సంపాదక, సారధ్య వర్గాలతో ఈ పత్రికను పర్యవేక్షిస్తున్నారు. సంగీత సభల సమాచారం, ఫోటోలతోపాటు చక్కని వ్యాసాలు ప్రచురిస్తోంది ఈ పత్రిక. మృదంగం, వీణ, తాళం బొమ్మలతో గానకళ లోగో సంగీత భరితంగా కనబడుతుంది. నిజానికి ఈ పత్రిక నిర్వహణకు చాలా కష్టాలు పడ్డారు. ఒకవైపు ఆర్ధికవనరులను చేకూర్చుకుంటూ, మరోవైపు సంగీత సమాచారం క్రోడీకరించడం, ఇంకోవైపు కాకినాడ నుంచి పత్రికను ప్రచురించడం! విజయవాడ నుంచి, హైదరాబాదు నుంచి పత్రికను ప్రచురించడం సులువు. కాకినాడలో అన్ని సౌలభ్యాలు వుండవు. అయినా క్రమంతప్పకుండా పత్రికను కొనసాగిస్తూ వస్తున్నారు. పంచరంగుల అట్టతో, దాదాపు ప్రకటనలు లేకుండా ప్రతినెలా 36 పేజీల పత్రికను ఒంటిచేత్తో నెగ్గుకు రావడం ఆషామాషీ కాదు. ఈ సమస్యలన్నీ ఒకఎత్తు! సంగీత కళాకారుల అహంకారాలు భరించడం మరో ఎత్తు. సంగీత విద్వాంసుల రాజకీయాలు వారి విద్వత్తును మించి ఉంటాయి. కనుక ఈ సంబంధమైన వత్తిడిని కూడా ఈ పత్రిక నిర్వహణలో నిరంతరం చవిచూడాల్సి ఉంటుంది.

గానకళలో ప్రచురింపబడే ఫోటోలు కళాకారులకు ఇష్టం. అయితే మాలాంటి వారికి వారు ప్రతినెలా 'నా జీవనయానం' పేరున స్వగత విషయాలు 135 మాసాలుగా రాస్తున్న శీర్షిక ఆసక్తి కల్గిస్తుంది. ఈ "నా జీవనయానం' త్వరలో పుస్తకంగా వస్తోందని శ్రీరామమూర్తి కుమారుడు, ప్రస్తుతం గానకళ సంపాదకుడు వెంకట్రావు చెబుతున్నారు. అలాగే ఇటీవల సంవత్సరాలలో మీడియా మెరుపులు పేరున సంగీతానికి సంబంధించిన మీడియా కబుర్లు శ్రీరామమూర్తి రాసేవారు. ఈ రెండు శీర్షికలు ఒకేచోట ఉండేవి. శ్రీరామమూర్తిగారు అదృశ్యమైనా వారి కుమారులు వెంకట్రావు తప్పక 'గానకళను మరింత మెరుగ్గా నిర్వహిస్తారని నాకు నమ్మకముంది. ఈ పత్రిక నిర్వహణలో చాలామంది సంగీత విద్వాంసులున్నారు. అయితే పత్రికల నిర్వహణ తెలిసిన వారి లేని లోటు స్పష్టంగా కనబడుతోంది. ఈ పరిమితి ఒక్క గానకళకే కాదు - తెలుగు విద్యార్థి, గ్రంథాలయసర్వస్వం వంటి పత్రికలలో కూడా కనబడుతుంది. మొత్తం పత్రికలో వాడే భాష, శైలి ఒకే రకంగా ఉండాలి. పేజీలను, అంశాలను మరింత అర్థవంతంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. అలాగే పత్రిక నెట్లో లభ్యం కావాలి. ప్రస్తుతం కర్ణాటక సంగీతం ద్వారా తెలుగు ప్రపంచ వ్యాప్తంగా ఉంది. వారందరికీ గానకళ చేరాలి.

మునుగంటి శ్రీరామమూర్తి గారి దృష్టి విశాలమైంది. పట్టుబట్టి సంగీతం-టెక్నాలజీ' అంశానికి సంబంధించి సాంకేతిక విజ్ఞానం సంగీతాన్ని ఎటువంటి మార్పులకు గురి చేసింది అనే విషయాలను వారి సభలో నాతో మాట్లాడించారు. ఉదయరాగం, సంధ్యారాగం - వంటి విభజన ఎ.సి. ఆడిటోరియం సౌలభ్యం వచ్చిన తర్వాత చెల్లుబాటు అవుతుందా? - వంటి సాంకేతిక విభజన పరమైన పార్శ్వాలు చర్చించే వారికి ఉండనే ఉంటాయి, పాతికేళ్ళక్రితం గోవాలో నేను ఉద్యోగం చేస్తున్నపుడు బొంబాయి ఎడిషన్ 'ది టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రిక ధ్యాన్ నాద్ కర్ణి సంగీత సమీక్షలు, విశ్లేషణలు తరచు ప్రచురించేది. సాంకేతిక సంబంధమైనవి. ఈనేపధ్యంతో తప్పక ప్రసంగించాలి అని సంగీత అస్వాదన సంబంధమైన అంశాలతోపాటు ఆయన రేకత్తించే కోరినపుడు నేను 'సంగీతానికి శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతోపాటు' అనే విషయం గురించి వారి సభలో మాట్లాడాను. ఆ విషయాలను 'మిసిమి’ కళారూపం - సైన్స్' అనే పుస్తకంలో చేర్చాను కూడా! పత్రికలో వ్యాసంగా ప్రచురించాను. అవ్యాసాన్ని పిమ్మట అత్యున్నత

బెంగుళూరు నాగరత్నమ్మగారు తన జీవితాన్ని ధారపోసి త్యాగరాజు స్వామి కీర్తనలను మనకు పంచారు. ఇలా ఎంతోమంది తమదైన కృషిని కర్ణాటక సంగీతానికి చేశారు. అటువంటి తరహా సేవను మునుగంటి గారు 'గానకళ' పత్రిక ద్వారా చేశారన్నది వాస్తవం!

రచయిత ఫోన్ : 9440732392

హైదరాబాదులో ‘అమ్మనుడి' మాసపత్రిక లభించేచోటు నవోదయ బుక్ హౌస్, ఆర్యసమాజ్ భవనం ఎదురుగా, కాచిగుడా. ఫోన్ : 040-24652387