Jump to content

అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015

వికీసోర్స్ నుండి
పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/2

మొన్నటిదాకా 'నడుస్తున్న చరిత్ర'
అదే ఇప్పుడు ‘అమ్మనుడి'

1993 డిసెంబరులో ఒక చిన్న పత్రికగా సామాజిక, రాజకీయాంశాలతో మొదలైన 'నడుస్తున్న చరిత్ర' క్రమంగా ఎదిగి తెలుగు భాషోద్యమ పత్రికగా రూపుదిద్దుకొంది. తెలుగు భాషోద్యమ సమాఖ్య నిర్మాణంలోను, ఎదుగుదలలోను వెన్నుదన్నుగా నిలిచి ఒక భాషోద్యమ పత్రికగా పేరు గడించింది.

నడుస్తున్న చరిత్ర ప్రోత్సాహంతో ఎందరో రచయితలు తయారైనారు. కాలవాహిని అలలవాలున జారిపోయేదిగా కాక, ఏటికెదురీది నిలిచి గెలిచిన పత్రికగా నడుస్తున్నచరిత్ర పేరు గడించింది. ఎక్కడ ఎవరు ఏ సభలో మాట్లాడినా, పత్రిక పేరు ప్రస్తావించక తప్పని విధంగా ఉద్యమంతో పత్రిక మమేకం అయింది. ప్రభుత్వాన్నయినా, పెద్దలనయినా తెలుగు జనశ్రేయస్సు కోసం నిలదీసిన చరిత్ర, తెలుగుకు ప్రాచీనభాష హోదాకోసం జరిగిన పోరాటానికి దారిచూపి అండగా నిలిచిన చరిత్ర 'నడుస్తున్న చరిత్ర'దే. తెలుగుపై ఇతర భాషలు మితిమించిన ఆధిపత్యాన్ని ప్రశ్నించి తెలుగును కాపాడుకొని పెంపుదల చేసుకోవడానికి ప్రయోజనకరమైన రచనలను ప్రోత్సహించి ప్రచురించిన ఘనత 'నడుస్తున్న చరిత్ర'దే.

అటువంటి పత్రికకు ఆర్థిక వనరులు అడుగంటడంతో 2013 అక్టోబరు సంచికతో ప్రచురణను ఆపివేయ వలసివచ్చింది. నా అనారోగ్యంతో ఒక ఏడాదికి పైగా విశ్రాంతిగా గడుపవలసి వచ్చింది. ఇప్పుడు ఆరోగ్యాన్ని పుంజుకొని, మళ్లీ నా భాషోద్యమ యాత్రను కొనసాగిస్తున్నాను.

ఇప్పుడు నడుస్తున్న చరిత్ర స్థానంలో 'అమ్మనుడి' పేర పత్రికను మీ ముందుకు తెస్తున్నాను. నడుస్తున్నచరిత్ర పత్రిక ఏ ఆశయాలకు నిలబడిందో, దానికి తగ్గ పేరునే ఎంచుకోవాలనిపించింది. సహచరుల, చదువరుల తలంపులను కూడ తెలుసుకొని, ‘అమ్మనుడి' పేరును నమోదు చేయించి, ఇప్పుడు తొలిసంచికను మీ ముందుకు తెస్తున్నాను.

అమ్మనుడి' పత్రికకు నడుస్తున్న చరిత్ర చదువరులే తొలి చదువరులు, ప్రోత్సాహకులు. స్పష్టమైన లక్ష్యాలతో ఇప్పుడు పత్రిక మీముందుకు వచ్చింది. దీని నిర్వహణ కోసం 'తెలుగుజాతి' ట్రస్టును మిత్రులతో కలిసి స్థాపించాను. ఆ ట్రస్టు తరఫున ఈ పత్రిక వెలువడుతున్నది. ఆ వివరాలు తర్వాతి పుటలో ఇచ్చాము. చూడండి.

ఈ పత్రిక ముఖచిత్రం తెలుగుజాతి సాంస్కృతిక చిత్రపటం. 18 కోట్లకు పైబడిన తెలుగుప్రజలు కేవలం ఆంధ్ర తెలంగాణాల్లోనే గాక మరి అనేక రాష్ట్రాల్లో వేలాది ఏళ్లుగా పాడుకొని వున్నారనే వాస్తవాన్ని నడుస్తున్నచరిత్ర వెలుగులోకి తెచ్చిన సంగతి మీకు తెలిసిందే! ఇప్పుడీ సంగతి అందరి గుర్తింపుకు వచ్చింది. 'అమ్మనుడి' ఈ కృషిని కొనసాగిస్తుంది. ఇందుకు మీ అందరి ప్రోత్సాహం, సహకారం కొనసాగించాలని కోరుతున్నాను. 'అమ్మనుడి'కి మీ ఆశీస్సులు కోరుతున్నాను.

మీ
సామల రమేష్ బాబు
సంపాదకుడు

పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/4 పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/6 పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/7 United Nations

Educational, Scientific and Cultural Organization అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా యునెస్కో డైరెక్టర్ జనరల్ శ్రీమతి ఇదీనా బొకోవా సందేశం

భాష ద్వారా, భాషతోనే అంతరీకరణ విద్య

పదిహేనవ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని 2015వ సంవత్సరంలో జరుపుకోబోతున్నాము. అంతర్జాతీయ సమాజానికి ఇది ఒక మలుపు వంటి సంవత్సరం కూడా. కారణం సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలకు ఇదే చివరి సంవత్సరం. అంతేకాకుండా ప్రపంచవ్యాప్త నిరంతర అభివృద్ధికి దేశాలు ప్రణాళికలని నిర్వచించుకుంటున్న కాలం కూడా ఇదే.

2015 తర్వాత వచ్చే కాలానికి అభివృద్ధి ప్రణాళికలో అందరికీ నాణ్యమైన విద్య అనే అంశం ప్రధానాంశం కావాలి. విద్య అందుబాటును విస్తృతపరచడం. నాణ్యతని పక్కాగా చూచుకోవడం ఇప్పటిదాకా విద్య అందని వారిని విద్య బోధనలోనికి చేర్చుకోవడం, ప్రపంచంలోని అందరికీ విద్య అందుబాటులోనికి తేవడం అనేవి నిరంతర అభివృద్ధి ప్రణాళికలో ప్రాధాన్యాన్ని సంతరించుకోవాలి. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి విద్యాబోధన అనేది మాతృభాషలోనే జరగడం అన్నది తప్పకుండా జరగాలి. నేర్చుకునే ప్రక్రియ, నేర్చుకునే ప్రక్రియకు దన్ను, గణితం, చదవడం, రాయడం అన్నీ మాతృభాషలో జరగాలి. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి విద్యాబోధన, శిక్షణ, విద్యా కార్యక్రమాలు, సరైన శిక్షణ వాతావరణాన్ని కల్పించుకోవాలి.

ఈ లక్ష్యాలను యునెస్కో ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకుపోతుంది. అంతరీకరణ విద్య (ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్)లో భాగంగా లాటిన్ అమెరికాలో యునెస్కో చిల్డ్రన్స్ ఫండ్ (యునెస్కో బాలలనిధి)తో ద్విభాషా విధానంతో ద్విసంస్కృతి విధానంతో అంతరీకరణ విద్యను అమలుచేయడం జరుగుతూ వుంది. దేశీయమైన సంస్కృతిని ఇతరేతర సంస్కృతిని కలగలిపేందుకు ఈ విధానాన్ని అనుసరించడం జరుగుతూ వుంది. యునెస్కో ప్రాంతీయసంస్థ, ఆసియాలో, బాంకాక్, థాయ్లాండులలో (పసిఫిక్ ప్రాంత) మాతృభాష విస్తృతపరిచే ప్రయత్నం చేస్తూ వుంది. నేర్చుకునే ప్రక్రియ బాగా నాణ్యంగా ఉండడానికి మాతృభాషలో విద్యాబోధన చాలా బలమైన శక్తి. బహుభాషా విధానానికి దన్ను కావాలన్నా ఈ శక్తి చాలా అవసరం. భాషాపరమైన, సంస్కృతిపరమైన వైవిధ్యాలను గౌరవించడానికి కూడా ఈ మాతృభాషా శక్తి చాలా అవసరం. త్వరత్వరగా పరిణామాలు జరుగుతున్న సమాజాలలో ఈ విధమైన మాతృభాషా విద్య చాలా అవసరం.

అందరికీ విద్య అనే లక్ష్యాన్ని చేరడానికి 2000 సంవత్సరం నుండి చాలా విరివిగా కృషి జరుగుతూ వుంది. ఇంకా పూర్తి కాని లక్ష్యాల దిశగా, కొత్త సవాళ్ళను ఎదుర్కొనేందుకు మనం ఇంకా విశేషంగా కృషిచేయాలి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అనేది లక్ష్యసాధన దిశగా పనిచేసే మంచివేదిక అన్నిరకాల విద్య అవసరాలకు మాతృభాష ప్రాధాన్యాన్ని గుర్తించడానికి నాణ్యమైన పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పటిదాకా విద్య చేరని వారిని చేరడానికి మనం మాతృభాష జెండాను మోసుకొని ముందుకు పోవాలి. ప్రతి బాలిక, బాలుడు, ఆడ, మగా వారి వారి సమాజాలలో ఈ లక్ష్యాల కోసం పనిచేయడానికి వారికి అవసరమైన పరికరాలు సమకూర్చుకోవాలి. మాతృభాషలో విద్యాబోధన అన్నది ప్రాథమిక మానవహక్కు. అన్ని రకాల నిరంతర అభివృద్ధికి బలమైన శక్తి.

ఇతర భాషల నుండి మాటల్ని తీసుకొంటే లాభమా, నష్టమా?

2013 నవంబరు 29న చెన్నపట్నం (చెన్నై)లోని కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ లాంగ్వేజి ఎసెస్మెంట్ డిపార్టుమెంటులో ఒక సదస్సు జరిగింది. ఇందులో దాని ప్రధాన అధికారి మైకేల్ మిలనోవిక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన అన్నమాటలివి :

"ఆంగ్లభాషలోకి ఇతరభాషల నుండి వచ్చిచేరిన మాటల వలన ఆంగ్లభాష సుసంపన్న మయింది అనడం కొంతమేరకే వాస్తవం. అవి ఆంగ్లాన్ని మరింత సంక్లిష్టంగా మార్చాయన్నది పూర్తినిజం. ఇప్పటి ఆంగ్లానికి షేక్స్పియర్ నాటి ఆంగ్లానికి తేడా ఉన్నమాట నిజమే అయినా ఆ మార్పు సహజంగా ఏర్పడింది. గత కొన్ని ఏళ్లుగా ప్రపంచ నలుమూలలనుండి వచ్చి పడుతున్న ఇతర భాషాపదాలను చేర్చుకుంటూపోతున్నకొద్దీ ఆధునిక ఆంగ్లం చాలా చాలా కటువుగా మారిపోతున్నది.”

వేరే నుడుల నుండి కొత్తగా వస్తున్న వేరే మాటలను ఉన్నవి ఉన్నట్లుగా కలిపేసుకోవడం అన్నది తెలుగునుడి గొప్పదనంగా మన తెలివిపరులు (మేధావులు) మొదటినుండీ చెప్తూ ఉన్నారు. అది తప్పు అని ఇంగ్లీషు తెలివివరులే ఇప్పుడు మొత్తుకుంటున్నారు. పెరనుడి మాటలను పలుకుతీరుతో సహా దిగుమతి చేసుకోవడం లేదా... ఒక పెరనుడి మాటకు మాటగా ఇంకొక పెరనుడి మాటలు వాడటం (ఇంగ్లీషుకు ముందుగా సంస్కృతాన్నో, ఉర్దూనో) నరి తీరుకాదు. ఎన్ని కొంగొత్త మాటలు వచ్చినా తన కుదుర్ల నుండి మాటలు పుట్టించి వాడుకలోకి తెచ్చుకోవడమే సరియైన తీరు.’ ప్రపంచవ్యాప్తంగా తెలివిపరులు ఇదే చెప్తున్నారు. కొంక్రొత్త ఆరయికలు (పరిశోధనలు) అదే తెలుపుతున్నాయి. తెలుగుజాతి ఈ విధంగా ముందుకు అడుగులు వేయాలి.