అభాగ్యోపాఖ్యానము/ప్రబంధము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అభాగ్యోపాఖ్యానము


హాస్య ప్రబంధము


క. శ్రీరమణీహృల్లోలా ।కారుణ్యలతాలవాల కాంచనచేలా
ఘోరాహవజయశీలా । శ్రీరాజమహేంద్రవరపురీగోపాలా. ౧

వ. భవదీయికరుణాకటాక్ష వీక్షాసమాసాదిత సరసకవిత్వ పటుత్వంబు పెంపున నేఁ
గల్పింపంబూనిన హాస్యరసప్రధానంబగు నభాగ్యోపాఖ్యానంబునకుఁ గథాక్రమం
బెట్టిదనిన. ౨

క. అడవులలోఁగడునిడుమలు । గుడుచుచుధర్మాత్మజుండు కొందలపడఁగన్
వడిఁ బరిహాసకుఁడొకఁడ । య్యెడకునుజనుదెంచి మ్రొక్కి యీకథచెప్పెన్ ౩

గీ. వింధ్యధాత్రీధరప్రాంత వంధ్యభూమి । జలములేనట్టి యొకపాడుకొలనుదరిని
దండకారణ్యమధ్యంబుఁ దనరఁజేయుఁ । బాపసదనంబు వ్యాఘ్రాఖ్య పట్టణంబు. ౪

క. ఆపురము లచ్చియప్పకుఁ ।గాపురము, జగంబులందుఁ గలపురములలోఁ
గాపురము, పాపసమితికి । దాపురము, మహాపుర మలదానవతతికిన్. ౫

క. అన్నగరంబునఁ గరమ ।భ్యున్న తివహియించుకుజనపుంగవకౌటి
ల్యోన్నతి కోడుటఁ గాదే ।పన్నగకులమెల్లఁ జేరెఁ బాతాళంబున్ . ౬

సీ. వెలయాలినింటనె విడియించి దానిచేఁ దిట్లునుదన్నులుఁ దినెడువారు
తల్లిపోయిననాఁడు దానింట నేయుండి పనియున్నది దెవత్తున నెడివారు
కన్నెఱికముచేయు కార్యంబునకుఁ బూర్వులార్జించుమాన్యమ్ములమ్మువారు
భోగకాంతలుగాక పొరుగువారల భార్యలనుజేరి సౌఖ్యంబుగ నెడువారు
విలువసారాయిసీసాలకొలఁదిఁద్రావి।యొడలు దెలియక వీధులఁబ డెడువారు
నగుచుమర్యాదలనుగాంతు రనవరతము । బ్రాహ్మణోత్తములాదివ్యపట్టణమున. ౭

చ. కురుబలముం గనుంగొనుచుఁ గోటితురంగజవంబుతోడ ను
త్తరుఁ డరదంబుడిగ్గి పురితట్టునఁబాఱియుఁ గ్రీడిప్రేరణన్
మరలఁగఁ బోరికేగుటకు నవ్వుచునుందురు పోటుబంటులై
పిఱికితనంబునం బురిని బేరువహించిన రాజపుంగవుల్. ౮

గీ. బియ్యమున వడ్లు బెడ్డలు పెక్కుగలిపి
నేతిలో నంటిపండ్లను నెఱయఁబిసికి
తప్పుతూనిక తూచుచుఁ దక్కువగను
గొలుచుచును గోమటులు సొమ్ముఁగూర్చుకొండ్రు. ౯

గీ. కూట సాక్ష్యంబు బ్రాహ్మణగురులవలన । బాగుగా నేర్చుకొని పాటుపడుటమఱచి
జూదములదొంగతనముల శూరులగుచు । శోభఁగాంతురు పురిలోన శూద్రజనులు. ౧౦

చ. తనపలుముండ్లవాఁడిమిని దప్పక వాసవువజ్రమున్ జయిం
ప నతిదృఢంపుమట్ట లనుమైమఱువొప్పఁగనేగి ముండ్లచే
ననిఁ గులిశంబు గెల్చి తనకడ్డగు వేల్పులకండలొల్చి తా
నొనరెననంగ బ్రహ్మజెము డొప్పగు నెఱ్ఱనిపండ్లగుంపుతోన్. ౧౧

చ. పురిఁదగుఁ జుట్టునుంగదిసి భూరిభయంకరలీల దట్టమై
పెరిఁగినగచ్చపెన్బొదలు పెట్టనికోటగ, లోనియీతచాల్
బురుజులుగాఁగ, దాపునను బొల్చినతుమ్మలు పెద్దముండ్లతో
సురియలుదూసి సద్భటులు స్రుక్కక కావలిగాచుతీరుగాన్. ౧౨

సీ. మార్దవం బంగ నామణులచన్నులయంద సాహసంబాహారసమయమంద
ప్రజ్ఞయంతయును దంభములుకొట్టుటయంద బంటుతనము వంటయింటియంద
మితభాషణము శాస్త్రతతులచర్చలయంద కలిమి పురంధ్రులకౌనులంద
నిలుకడ నెలఁతల నేత్రయుగ్మములంద ధైర్యంబు పెద్దలఁదఱుముటంద
వడి లతాంగుల వంకరనడలయంద ।శాంతి యెంతయు దుష్కర్మసహనమంద
కానిమఱియెందువెదకినఁ గానరాద ।నంగఁ దద్దయు నాపట్టణమువెలుంగు. ౧౩

గీ. తివిరిపాప పుంజంబు మూర్తీభవించి ।నచ్చిగుమిగూడి ప్రోల్చొరఁబాఱుకరణిఁ
బందిగున్నలు చెరలాడు సందులందు ।దున్నపోతులకైవడిఁ జెన్నుమీఱి. ౧౪

గీ. చేరినిల్చిన వంటయిల్ చేరినిల్చుఁ ।గానవచ్చినఁ బరువెత్తి కానసొచ్చు
డంబుమీఱిన భటసమూహంబుతోడ ।సాటియౌదురె మాననకోటినెవరు. ౧౫

గీ. వీటఁగల్గిన ఘోటక కోటితోడ ।నిలిచిప్రాఁకంగ నేరక నీరుసొచ్చె
వెఱచి తాఁబేటిగుంపులు వేయునేల ।పురినిబుట్టిన నుక్కైనఁబుచ్చిపోవు. ౧౬

చ. దనుజులు మర్త్యులందునిమి తత్తనుమాంసము మెక్కి పోవఁగా
నెనసి పురంబునల్గడల నెమ్ములరాసులు భూధరంబుల
ట్లనుపమలీలనుండఁ బ్రమథావళితోడ మనోజవైరి యా
మనికికి వెండికొండయని మాటికివచ్చుఁ బరిభ్రమమింపుచున్. ౧౭

ఉ. కొంపలమీఁదితుక్కెగరఁగొట్టుకుపోవఁగఁ దూముకాల్వలోఁ
గంపునుగూడి తోఁటలనుగల్గిన కుక్కపొగాకుచెట్లబల్
గుంపులవాసనంగలిగి కుప్పలు నిప్పులు రాల వేఁడిలో
ముంపుచు వాయువుల్ పొలయు ముక్కునవెండ్రుకలెల్లమాడఁగన్. ౧౮

ఉ. అంగన లూర మెల్లఁ జనునప్పుడు కూడెదమంచు లేళ్ళుఁ జి
వ్వంగులుఁజేరి యోటువడువారినిఁ గెల్చినవారు మ్రింగఁగాఁ
బొంగుచుఁబన్నిదంబడఁచి పోవఁగఁ జాలక లేడులో డెఁజి
వ్వంగులు గెల్చెఁ గానియెడ వానికి లేళ్ళనుజంపనేటికిన్. ౧౯

ఉ. ఆ పురమేలు రాక్షసమహాకులవారిధిబాడబుండు, కా
శీపురనాథవిష్ణుసరసీరుహసంభవపాదభక్తసం
తాపకరుండు, పుణ్యవసుధాధర వజ్రధరుండు, ప్రోల్లస
త్పాపధనంజయానిలుఁడు, దానవుఁ డొక్కఁ డభాగ్యనాముడై. ౨౦

సీ. వానిదుష్కీర్తితో వాసిచెందఁగఁ బూని కుందుచుఁజీఁకట్లు గుహలనడఁగె
వానిమైబిగితోడ వాదులాడఁగ బూని ఖడ్గమృగంబులు కానడాగె
వానిచాపలముతోఁ బ్రతిఁబొందఁగాఁ బూని వానరజాలంబు వనముదూఱె
వానిమాంద్యముతో సమానంబు రాఁబూని దున్నలు బురదలో దొర్లఁదొడఁగె
వాని క్రౌర్యంబుతో దినుసూనఁబూని । జడిసి వ్యాఘ్రంబు లడవిలో సంచరించె
వాని కంఠస్వరంబుతో వాదుపూని ।పొరలె గార్దభబృందంబు బూదిలోన. ౨౧

క. నిరతము శంభునిపూజలు ।కరమొనరుచుచుండుపఙ్క్తికంఠుఁడు సరియే
పరమాధమగుణుఁ డగునీ ।హరదూషణపరున కవని వ్యభిచారమునన్. ౨౨

క. వదలక వారలసమ్మతి ।ముదమున దినమొకని బకుఁడుపొలియించెను వీఁ
డదరక బలవంతంబుగఁ ।బదుగుర నూర్వుర దినంబుఁ బట్టివధించున్. ౨౩

క. ధీరహితుండైతగియు న ।ధీరహితుండై ధరిత్రి దీనత నేలెన్
గ్రూరాగ్రేసరుఁ డావిబు ।ధారాతి తనదుచరిత్ర మతిచిత్రముగాన్. ౨౪

ఉ. అతనికిఁ బొట్టకోసినను నక్షరమొక్క టిలెదు; కాగడన్
వెతికకినఁ దెల్విలేదు; దయ వీసమునుం గలనైనలేదు; ప్రో
న్నతనయవిద్యలేదు పదునాల్గుపుటంబులు వెట్టికాల్చినన్;
జతురత వాతపెట్టినను సత్యము జిహ్వకు రాదొకప్పుడున్. ౨౫

వ. అతండొక్కనాఁడు. ౨౬

సీ. ఒకదిక్కుననుగుక్కలొక గ్రుక్క గాఁగూయ నొకచెంత బలుదుంత లొలసియార్వ
నొకమూల ఖరజాల మురులీలనోండ్రింప నొకచోట గుడిసేటియువతులడల
నొకదండ ముదిముండ లొకదండుగాఁగూడ నొకవంక బలుకుంక లొదిగియుండ
నొకపొంతఁగడముంతలొకదొంతరగనుండ నొకక్రేవ మధుసేన లొనరఁ జేయఁ
బెంటపోగులుఁ జీపుళ్ళుఁ బేడకుప్ప ।లలుకుగుడ్డలుఁ గోడియీఁకలునుదనర
డంబుమీఱిన శునకాసనంబునందుఁ ।గొలువులోఁ జచ్చినట్టులు కూరుచుండె. ౨౭

ఉ. ఆగతిఁ గొల్వులోన దనుజాధముఁడుండి గులామునొక్కనిన్
వేగమపిల్చి వేఁటపయి వేడుక నాకిపుడుద్భవిల్లే వే
వేగమ వేఁటకాండ్ర మనవేపులఁ దోడ్కొనిరమ్ము నావుడున్
సాగి యతండు చచ్చిచెడి చాలఁగఁజెప్పినరీతిఁ జేసినన్. ౨౮

గీ. ముడ్డియొండియున్న మొద్దు గుఱ్ఱముమీఁదఁ ।గదలకుండ నెక్కి కాళ్లునేలఁ
దగులగూరుచుండి తక్కినవారలు ।వెనుకఁజేరితోల వెడలెనతఁడు. ౨౯

వ. అట్లుమిడిమిడియెండం గాళ్లుగాల నెత్తిమాడఁ బురంబువెడలి. ౩౦

చ. మలమున మూఁగునీఁగలక్రమంబునఁ బీనుఁగుచుట్టుఁ జేరున
క్కలగతిఁబుల్లెపైఁగవియుకాకులకైవడి వేఁటకాండ్రుఁ గు
క్కలసరదార్ల నల్లడలఁగ్రమ్మి రయంబున నేగుదేరఁగా
వెడలె నతండు కాకములు వేపులు నక్కలుఁ గూయుచుండఁగన్. ౩౧
వ. అంత. ౩౨
చ. దనుజునిఁజూడ సూక్ష్మతరదారుణనేత్ర యొకర్తు ముందుగా
నెనసినమొండిగోడపయి నెక్కిన ముద్దియయోర్తు వచ్చి తా
వెనుకకుఁద్రోచె నందుననువెన్కకు నెమ్ములురాలఁగూలి మా
నిని వెసమూర్ఛపోయె వడి నెచ్చెలు లేడిచి రొక్క పెట్టునన్. ౩౩

ఉ. వీతశిరోజ యొక్కరిత వే దనుజుంగన గోడయెక్కి యు
ర్వీతలమందు జాఱిపడి రింగునదొర్లుచు దైత్యుఁజేరె ని
ర్భీతమనోబ్జయై కలన బీరమునం దనుగెల్వఁ జాలుబం
ట్రౌతుల డించి తన్నుఁగొని గ్రక్కునఁ బొమ్మని వేఁడవచ్చెనాన్. ౩౪

ఉ. బాడిదచెట్టు శుష్కకుచభాగ యొకర్తు నరాశనాధమున్
జూడఁగ నెక్కఁ దన్మహిజసూనచయం బొగి నెండుకాయలం
గూడి సుపర్వవైరిపయి గుంపులుగాఁ బడు పెంపువొల్చెఁ బె
న్వేఁడిమి మింట దైత్యుపయి వేలపు లుల్కలు రాల్చిరోయనన్. ౩౫

చ. అటుచని యూరి బైట గలయంజరియించుచు నొక్కతావునన్
బెటుకున ముందుగాఁ జెవులపిల్లిని గన్గొని కుక్కగుంపులన్
బటుమతి దానిపైఁ గవియఁబంపఁగ నవ్వియు నేగి క్రమ్మఱన్
దటుకున వచ్చెఁ గాట్లుపడి తత్పురికుక్కల ధైర్యమేమనన్. ౩౬

ఉ. అవ్వల నూరఁబందియొక టడ్డమువచ్చినఁ దద్భటావళుల్
చివ్వకు నీటెలంగొనుచు శీఘ్రమ పర్విడఁ బంది వారలన్
దవ్వులఁజూచి లో బెదరి దారుణభంగిని ఘర్ఘురింపఁగా
నెవ్వడిఁ బాఱిరాభటులు నిల్వక దానికిలొంగ కుక్కునన్. ౩౭

గీ. పందిఁ బొడువంగ చచ్చిన భటచయంబు ।బెండువడి పందితోడనే బెదరియుఱికె
శశముఁ బట్టంగవచ్చినసార మేయ ।వితతి శశకంబుతోడనే వెనుకఁ దిరిగె. ౩౮

వ. ఇట్లు భటశ్వాసంబులు బెదరి చెదరిన రాక్షసాధ్యక్షుండు రూక్షవీక్షణుండయి
కుర్కుర మర్కట మార్జాల శశకాద్యనేకాక్షుద్రమృగకులంబులఁ బొలియించి
మృగయావినోదంబయి సలుపుచుండ నొక్కచో నొకతరుక్షువువీక్షించి తురంగంబు
భయాకులాంతరంగంబయి యికిలించుచు నపరాహ్ణసమయంబున సరోవరసమీ
పంబున బురదనేల నతనిం గూలవైచి చనినయనంతరంబ యంతకుమున్న విట్చ
రంబుచేఁ దఱుమంబడి యచ్చట డాఁగియున్న భృత్యుండొక్కరుండు చనుదెంచి
లేవనేత్తిన. ౩౯

గీ. బురదతుడిచికొనుచుఁ బొక్కుచుఁజనుదెంచి ।యతని గ్రుచ్చియెత్తి యాదరించి
పందిచేతఁబడక పఱచివచ్చినయట్టి ।పౌరుషంబుకొంత ప్రస్తుతించె. ౪౦

వ. అట్లు సేదతేఱి తీరస్థితవటమహీరుహచ్ఛాయం జేరి భృత్యసహితంబుగా నందు
విశ్రమించియున్న యవసరంబున. ౪౧

చ. శునక మురోదనంబుగతి సూకరనాదముభంగి గార్దభ
స్వనమువిధంబునన్ బ్రబల సైరిభరావముపోల్కి దవ్వులన్
వినఁబడె రాక్షసాధమునివీనుల కెంతయు విందుసేయుచున్
ఘననినదంబు భూమిధరగహ్వరజాలము మాఱుమ్రోయఁగన్. ౪౨

శా. ఆనాదం బతఁడాలకించి మది నాహాయంచు భావించి చి
త్తానందంబున భృత్యునింబిలిచి నీవాచప్పుడేతెంచుసు
స్థానంబారసి వేగ మాధ్వని ప్రభూతంబౌటకుంగారణం
బానందంబునఁ జేరఁబోయి కనిరమ్మా యెవ్వరట్లార్చెరో. ౪౩

క. ఆనాదము విన్నంతనె ।మానసమున కెన్నరానిమమతజనించెన్
శ్వాసనినాదమొ యొకఖర ।యాననినాదంబొ వేగ నారసిచెపుమా. ౪౪

చ. అనవిని భృత్యుఁ డాక్షణమ యానతిఁగైకొని గట్టుడిగ్గి కా
ళ్ళను బెనుముండ్లు గ్రుచ్చుకొనలాగుచు మ్రొగ్గుచు వేగలేచుచున్
జనిచని డొంకముండ్ల మెయి సర్వముఁ జీరుకుపోవ నోర్చుచున్
బొనుపడుచున్న పాడుగుడిపొంతను మొద్దగుచాపరాతిపైన్. ౪౫

మ. కనియెన్ దానవదూత సూక్ష్మనయనన్ గాలాంతకాకార ని
ర్ధనజీవన్ ఖరవాణిఁ గీశసమవక్త్రన్ రక్తవర్ణాలకన్
గనదుద్యద్వసుధాధరాంచితవలగ్నన్ భూరినీలాధరన్
ఘనదేహన్ లసదుష్ట్రయాన విలసత్కాంతాకదంబాధమన్. ౪౬

చ. కనుఁగొని దైత్యుచెంగటికిఁ గ్రమ్మఱ వచ్చి యతండువల్కె నో
దనుజకులావతంసమ ముదంబున నీవటు నన్నుఁ బంపఁగా
ఘనమగుముండ్లచెట్లనక కంకరరాళ్ళన కెంతదూరమో
చనిచని పాడు దేవళముచక్కిని నేను మహాద్భుతంబుగన్. ౪౭

సీ. వ్రేలుచన్నులు కొంత బిలమువెల్వడిక్రింద జనుకొండచిలువలజంటగాఁగ
నేత్రాంతములనుండి నెంవడిఁ బఱతెంచుకన్నీళ్ళు సెలయేటిగ ములుగాఁగఁ
గర్ణరంధ్రంబులు ఘనవక్త్రబిలమును రమణీయతరగహ్వరములుగాఁగ
గాత్రమంతట నిక్కుఘనరోమసంఘంబు ధాత్రీరుహములబృందంబుగాఁగఁ
గుఱుచలౌ యెఱవెండ్రుకగుంపులడరి ।యడవిదహియించునట్టి దావాగ్ని గాఁగ
గొప్పపర్వతముకరణిఁ గూరుచున్న ।పొలఁతిఁగంటిఁ బురాకృతపుణ్యమునను. ౪౮

వ. తదీయరూపాతియంబులు వివరించెద నాకర్ణింపుము. ౪౯

చ. చెడుగులనేఱ యొక్కగుమిచేసి విధాతృఁడు గార్దభంబులన్
బుడమి సృజింప వానిమెయి భూరికురూపము చాలమిం బదం
పడి యొనరించెలొట్టియల వానికి మిక్కిలి కుస్వరంబు చే
పడమి నొనర్చె నేర్పుమెయి భామను రెండునుగల్గియుండఁగన్. ౫౦

చ. పవలునునుండు పెన్దమము పాడుగుణంబులు రూపుదాల్చి యీ
భువనములోనఁ గ్రుమ్మరఁగఁబుట్టినభీకరవిగ్రహంబు బాం
ధవనిచయంబునేచ వసుధాస్థలిఁగల్గుపిశాచభామ తా
భువిఁ జరియించుసంపదలముద్దియయక్క నెలంత యెంతయున్. ౫౧

ఉ. చారునగంబులన్, ధనువు, సంపెగపూవును, గెంపుఁ గూర్చి, సిం
గారపుఁజన్నులన్, బొమల, ఘ్రాణము, వాతెఱఁ జేసి, బ్రహ్మ తా
వారక వానికర్కశత, వంకరఁ, బచ్చన, రక్తకాంతిఁ బెం
పారఁగఁ దీసి చేసె, మెయి, యారును, గన్నులుఁ, గుంతలంబులున్. ౫౨

చ. ఘనతరమధ్యభారమునఁ గంపమునొందెడునూచకాళ్లు పెం
పొనరఁ బిఱుందులుం ఘనతనొందినఁ దాళఁగలేవటంచుఁ దా
వనరుహగర్భుఁ డెంతయును నంత మదిం దలపోసి సూక్ష్మలో
చనకుఁ బిఱుందులు న్మిగుల సైకముగానొనరించె నేర్పునన్. ౫౩

గీ. కొమ్మగాదది మేటి పెద్దమ్మగాని ।బాల గాదది యముచేతికోలగాని
కన్నె గాదది బలిసినదున్న గాని ।నారిగాదది జనులకుమారి గాని. ౫౪

గీ అట్టి కన్నియమును నీవు ననఁగి పెనఁగి ।కనరులేనట్టి మమతల గలసిరేని
యెందునీత చెట్టుపయిఁ గోరెందతీఁగె ।యల్లుకొను రీతిగాదెయోయమరవైరి. ౫౫

చ. అని చెలికాఁడు తెల్పుటయు నాక్షణ మారజనీచరేంద్రుఁడున్
మనమున సంతసంబడర మానినిఁజూడఁగ మిత్రువెంటనే
చనియెను ద్రోవలోఁగలుగుసర్వమహీజలతావిశేషముల్
గనుఁగొనుచున్ మృగావళులఁగాంచుచు డొంకలముండ్లఁజూచుచున్. ౫౬

చ. కనుఁగొను సంగడీఁడ యదె గట్టుకుఁజేరువ గచ్చతీఁగ మిం
చినతమి గట్టిగా ముసిఁడిచెట్టును జుట్టుకయుండె మేలుమేల్
దనుజుకులాగ్రగణ్య నిను దారుణలీలఁ గవుంగిలించి యా
వనితయు నట్టులే మిగులవంతలఁ బెట్టి కలంచు మీఁదటన్. ౫౭

క తెప్పానపకాయలఁగను ।ముప్పులబలంముండ్ల బెచ్చులూడెను సఖుఁడా
యప్పడఁతిచన్ను తిత్తులఁ ।దప్పక నీవట్లుంచీరి తనరెదు నాథా. ౫౮

క చూడుమదె గార్దభాంగన ।తాడనమొనరించెఁ దనదుధవుని వయస్యా
చేడియ నిన్ను నుసరసం ।బాడెడునపు డిట్లుతన్ను నమరవిరోధి. ౫౯

క. ఇటు లన్యోన్యంబును ము ।చ్చటలాడుచు నేగియేగి చామను గుడిచెం
గటఁ గని మేనువడంకఁగ ।నటమటతో నిర్జరారి యనియెనుదనలోన్. ౬౦

ఉ. దీనిని నేనువేఁడినను దిట్టునొ కొట్టునొ లోనికేగునో
మానిని బల్మిఁబట్టుటయు మంచిదిగాదని యూరకుండి నే
సూనశ రా ర్తినెక్కరణి స్రుక్కుడు నేవిధినైన నిప్పుడీ
చానను గూడువాఁడనని చప్పుడు సేయక మెల్ల మెల్లఁ గాన్. ౬౧

చ.వెనుకకువచ్చి చేయొడీసి వేగనుబట్టిన లేచి దానవున్
    గనుఁగొని కొమ్మ తానెడమకాలున ముందరిపండ్లురాలఁ దా
    చినఁ దగనోర్చి నెచ్చెలియు ఛీయన వెండియుఁ గౌఁగిలింపఁ జూ
    చినఁ జెలి భీతి గర్భగుడి చేరెను దల్పులువైచి గొబ్బునన్. ౬౨

ఉ. అంతట దైత్యుఁడుం దలుపులల్లనగుద్దుచు నిన్నుఁగూడ కొ
    క్కింతయుఁ దాళలేననుచు నేడ్చుచు లబ్బున మొత్తుకొంచు మి
    న్నంతయుఁగూలి పైఁబడినయట్లు వితాకునంగూరుచుండ నా
    చెంతకుఁ దార్పుకత్తెయొకచేడియ నచ్చె మెలంతనారయన్. ౬౩

గీ. వచ్చి గుడిచెంతఁగూర్చున్నవారిఁగాంచి।మీరు రక్తవర్ణాలక సైరిభాంగి
    మర్కటానన పర్వతమధ్యభార । వనిత నెందైనఁ గంటిరేయనుచునడుగ. ౬౪

ఉ. దానవభర్తవల్కు వనితా వినుమిచ్చటి కేను వేఁటకై
    సేనలఁగూడివచ్చి గుడిచెంగట నేడ్చుచునున్నదాని నీ
    వానతియిడ్డక్షణములన్నియుఁ గల్గినదాని నొక్కకీ
    శాననఁగాంచి కేలొకటనంటిన నీగుడి దూఱె నివ్వెఱన్. ౬౫

ఉ. ఆకనుదోయి సూక్ష్మతయు నాచనుతిత్తులమార్దవంబు నా
    మైకఠినత్వసంపదయు మానిన నేఁగనుఁగొన్న యంతనే
    సూకర గాత్రిపై మనస్సుస్సొచ్చెను నిక్కువ మెట్టులైన నా
    కాకపివక్త్రఁగూరిచి రయంబున నేలుము నీకుమ్రొక్కెదన్. ౬౬

ఉ. ఎయ్యది యూరు దీనివిభుఁడెవ్వఁడు పుట్టినవంశమెద్ది పే
    రెయ్యది యొంటిగా నిచటి కేటికివచ్చె నిటేడ్వఁ గారణం
    బెయ్యది నాకుఁజెప్పఁగదవే కలరూపు కిటీంద్రయాన నీ
    వెయ్యది గోరినన్ సరగనిచ్చెద దానిని నన్నుఁగూర్చినన్. ౬౭

చ. అన నదివల్కు నోజనపరా ఖరగామినిరీతిఁ జెప్పెద
న్వినుము సుబుద్ధినాఁబరఁగు నీయమభర్తయతండు రూపునన్
మనసిజుగెల్చు నైనఁ జెలి పల్లవసంగతి యెప్డుకోరు గ్ర
క్కునఁ బొరుగింటి పుల్లనగుకూరయుఁ దా రుచిగాదె యేరికిన్. ౬౮

ఉ. నిన్నటి రాత్రి యీమె యొకనీచభుజంగునిఁ గూడుచున్నచోఁ
గ్రన్ననవచ్చి వల్లభుఁడు కన్గొని కోపముతోడ వీఁడు నేఁ
డిన్నడిరేయి యొంటి మనయిల్లుచొరంగ నిమిత్తమేదియో
యున్నది యున్నయట్లు చెపు మూరకదాపక యన్న విన్ననై. ౬౯

గీ. బొంకుటకుఁజేతగాక యీఱంకులాడి ।నోర గుటకలు మ్రింగుచు నూరకున్నఁ
గాంచి కోపించి యొక పెద్దకఱ్ఱతోడ| వీపు బద్దలుగాఁగొట్టె వెలఁదినతఁడు. ౭౦

ఉ. కొట్టినమొత్తుకొంచు నడి గ్రుడ్డుల నీరొగిఁగ్రుక్కుకొంచుఁబెన్
ఱట్టులఁబెట్టివీధిఁఱాగతనంబునఁ బాఱవచ్చి యీ
కట్టిఁడిఱంకులాడి తనకాపురమూడుటకోర్చి దేవళం
బిట్టులుదూఱెఁ గన్గొనఁగనిట్టివెయౌఁ గద జారిణీగతుల్. ౭౧

వ. అని కురంగగమన సవిస్తరంబుగా నా మెఱుంగు బోఁడి తెఱం గెఱింగించి తలపుచేరి
యిట్లని పిలువందొడంగె. ౭౨

ఉ. డాయనుభీతిఁబొంద మగఁడా యనుఁ దల్పులు తీయరాదె రం
డాయనుఁ బల్కవేమి చెవుడాయను సొమ్ములు వెట్టు ఱంకుముం
డాయను వేగరావె మొఱడాయను లోపలఁజేరి యేడ్వగా
డాయను సిగ్గుఁబూనుటిపుడాయను నెచ్చెలి మాటిమాటికిన్. ౭౩

తే. గొంతుపగులంగవినువారికెంతోచెవులు ।తడకలుగట్ట నాలుకపిడచవాఱ
నెంతయార్చినఁ జెవిఁ జొరనీకయుండె ।దున్నపోతుపై వర్షంబు తొరఁగినట్లు. ౭౪

చ. తడిసిననుల్కకుక్కిగతిఁ దామ్రశిరోరూహ యంతకంతకుం
గడుబిగియంగఁజూచి తటకాపడి గుండెనుఱాయిపడ్డ వే
నడవఁగలేక గోతిదరినక్క తెఱంగునఁ గాచియున్నయా
చెడుదనుజుండు నెత్తికిఁకఁజేతులువచ్చెనటంచు రోఁజుచున్. ౭౫

ఆ. కొంతసేపు పాడుగుడిచెంతఁగూర్చుండి ।రోదనంబుచేసి రోసి కూర్కి
తలుపుతీయుజాడఁ గలనైనఁ గానక ।విసిగి దూతిఁగొంచు వెడలెగుడిని. ౭౬

చ. అటువలె దేవళంబపుడె యాయమతోడను దాననేంద్రుఁ డు
త్కటనుగుకన్కతో వెడలి గార్దబగామినిమీఁదిప్రేమచేఁ
దటుకునఁ బాయలేక నుదిఁదాలిమిఁ దాలిచి పొంతనిల్చి మి
క్కుటమగుదీనభావమునఁ గూర్మిబయలడ్ప దూతికిట్లనున్. ౭౭

క. ఓసీననునీవిపుడీ ।కానరాని భగాత్రి తోడఁ గలిపెదవేనిన్
గానులపేరిచ్చెదనీ ।యాసకుఁదగినట్టీరొక్క మటులుండంగన్. ౭౮

తే. అనిన నదియెంతపనియని యపుడె బయలు ।దేఱి దేవాలయంబును జేరఁబోయి
మెల్లఁగా మిత్రురాలిని మేలమొప్పఁ ।బిలిచినంతనెయాజెంత తలుపుతేసె. ౭౯

క. తలుపునుదేసినవెనుకను ।బలుకులుచెవిలోనఁ గొన్ని బహురమ్యముగా
వలుచొప్పఁగఁజెప్పిన విని ।యలఖరవాణియు విచారమంతయుఁదీఱన్. ౮౦

క. చెలికత్తియతో గుసగుసఁ ।బలుమాఱునుమాటలాడి బహుధనమును సొ
    మ్ములు వలువలునున్ రాక్షస ।కులబాడబుఁ డియ్యనొప్పుకొన్నసువార్తన్. ౮౧

ఉ. తిన్నఁగ విన్నపిమ్మటను దీయనిమాటలు చెప్పి వానితోఁ
    గ్రొన్ననవిల్తుకయ్యమునఁ గూడుట కుబ్బున సమ్మతించె నా
    చెన్నఁటిదూతియు న్మరల శీఘ్రముగా దనుజాధమాధమున్
    దెన్నునఁగాంచి సర్వమును దెల్పి సురాలయబాహ్యభూమికిన్. ౮౨

తే. తోడుకొనివచ్చి గుడిలోన దూఱుమనుచు । సైగచేసిన వాఁడును వేగఁజొచ్చి
    తలుపు లోపలబిగియించి తగినయంత । గబ్బిలపు పెంటగమ్మునఁ గంపుకొట్ట. ౮౩

తే. ఉక్కలోనాపెతో సౌఖ్యమొందుచుండె ।మిగులఁదనలోనగుటకలు మ్రింగుకొనుచుఁ
    జేతు లొండొంటితోఁ జేర్చి దూతికయును ।గడపముందటఁ గావలి కాచుచుండె. ౮౪

తే. ఈ కథానాయిక యయిన యిగురుఁబోఁడి ।మగఁడుకొట్టిన వీధులుమాఱుమ్రోయఁ
    బెద్దపెట్టున నేడ్చుచు వీడువెడలి ।పోయి యెందునుగనరాక మాయమయిన. ౮౫

సీ. ఏనూతిలోపల నేగికూలెనొయంచు భయపడి మగఁడును బంధువులును
    వీధివీధులవెంట వెదకుచుఁ బఱతెంచి జాడలఁబట్టి యాపాడుగుడిని
    జేరియచ్చోటను జిడుముపొక్కులు గోకుకొంచును గడపలోఁ గూరుచున్న
    దూతికఁబొడగాంచి దుర్మార్గురాలైనయీలంజెముదిముండమూలముననె
    మనకు నిన్ని పాటులువచ్చెననుచుఁబలికి । యందఱునుజేరి యాదూతినంటఁగట్టి
    నెమక సున్నములోనికి నెముకలేక ।యుండ దంచిరి పిడిగుద్దులొకటఁబఱపి. ౮౬

గీ. అటుపిదప నర్ధచంద్రప్రహారములను ।దానియబ్బతోడను జెప్పుకొనుబంచి
వెనుక దేవాలయముతల్పు వేసియుంట ।కాంచి లోపల నెవ్వరో కలరటుంచు. ౮౭

గీ. ఒదిగివడఁకుచున్న యుష్ట్రయానను రాక్ష ।సాధమునిని జూచి యలుకతోడ
వీసెగుద్దులొకట వేనవేల్ కురిపించి ।కొప్పు జుట్టుఁ బట్టి గుంజియీడ్చి. ౮౮

గీ. ఊహించి తలుపులొక్కట ।బాహుబల మొప్పగుంజి పగిలిమీఁదన్
సాహసమున లోఁజొరబడి ।దేహంబంతయు జెమర్ప దిగులున మూలన్. ౮౯

గీ. వెలుపలికిఁదీసికొనివచ్చి వీపుమీఁద ।ముఖముమీఁదను మెడమీఁద ముక్కుమీఁద
    మణుగుగుద్దులవానలు మచ్చుచూపి | పిండిపెట్టి రభాగ్యుని నిండుగాను. ౯౦

గీ. దెబ్బలకుఁదాళఁజాలక దితిజవరుఁడు ।తిరుగఁబడి బండతనమునఁ దెగువచేసి
    వారితోడను బోరాడ వడిఁగడంగ ।వారలందఱు నాగ్రహావార్యవృత్తి. ౯౧

చ. తటుకునఁ జుట్టుముట్టి పదతాడనకూర్పరఘట్టనంబులన్
జిటిపొటిమొట్టికాయలను జేరలనిండిన చెంపకాయలన్

బటుతరముష్టిఘాతములఁ బల్మఱును న్వెదచల్లి దేహమం
తట రుధిరమ్ము గ్రమ్మఁ గణిదైత్యుని నెఱ్ఱవానిఁ జేసినన్. ౯౨

ఉ. తాళఁగలేక సొమ్మసిలి దానవుఁ డల్లనమూర్చవోవఁగా
బాలికబంధువుల్గని యభాగ్యుఁడు చచ్చెనటంచు నెంచి యా
భీలతఁ జాపలోపలనుబెట్టి యభాగ్యునిఁ జుట్టికట్టి దే
వాలయపూర్వభాగ మునయందలిగోతను వైచిరొక్కటన్. ౯౩

క. వైచి పురంబు తలారులు ।చూచిన మోసంబువచ్చుఁ జూడకయుండన్
వేచననలె నని గొబ్బున ।నాచంచలహృదయఁ గొంచు నరిగిరిపురికిన్. ౯౪

ఉ. అంత నిచ్చట. ౯౫

గీ. విట్చరంబుతఱుమ విఱచిపర్విడివచ్చి ।గోతియందుదాఁగి కూరుచుండి
పందిగుంపులచట బయలనుదిగుగుచు ।నునికిఁ జేసి పయికిఁజనఁగనోడి. ౯౬

క. భటులిరువురు గర్తమునం ।దటునిటువీక్షించుచుండి యదటునఁదమపై
నటు దయ్యమువలె శవమొ ।క్కటిపడిన న్మూర్చ పొంది ఘటికాద్వయికిన్. ౯౭

క. తెలివొంది కనులువిప్పుడు ।నలశవముం గదలఁజొచ్చె నాశూరులకున్
గళవళ మినుమడికాఁగను ।బెళపెళయని చాపచుట్ట బిట్టుగ మ్రోయన్. ౯౮

ఉ. అంతట నాభటద్వితయ మాత్మఁదలంకుచుఁ బైకిఁబోయినన్
గంతునవచ్చి ఘర్ఘురము గ్రక్కునఁజంపునొ క్రిందనుండినన్
సంతసమాఱ దయ్యమిది చంపునొ యక్కట యేమిబుద్ది యం
చెంతయుఁ జింతనొంది పనియేమియుఁ దోఁచకయుండ నింతలోన్. ౯౯

గీ. చాపలోనుండి "ఘనులార! చావకుండ ।బంధములువిప్పి నన్నింత । బతుకఁజేయుఁ"
డనెడువాక్యంబు విననైన నానవాలు ।పట్టి తమరాజుస్వరమౌట వడి నెఱింగి. ౧౦౦

గీ. కట్లు విప్పితీయఁ గాయంబునిండను ।గాయములు చెలంగఁ గనులువిచ్చి
దైత్యనాథుఁడపుడు తనప్రాణభృత్యుల ।యాననములంజూచె దీనవృత్తి. ౧౦౧

క. అన్యోన్యముఖాలోక ।ధన్యత్వముఁ జెంది భటులు దనుజేంద్రుండున్
నవ్యక్తభయభాృంతత ।నన్యోన్య క్షేమవార్త లారసి కల్లన్. ౧౦౨

క. ఆరసి తమకొదవినయా ।ఘోరాపదలెల్లఁ బాపి కుట్టూపిఱితో
ధారుణిలోఁ గ్రమ్మఱఁదా ।మీరీతిన్మెలఁగఁ గనుట చెలమింగనుచున్. ౧౦౩

గీ. రాజు తమచెంతనున్న ధైర్యంబుకతన ।బయలఁ దిరిగెడుకీటులకు భయముపడక
విభునితోఁ గూడి యాగోయి వెడలఁజూడ ।లేచుటకు రాజు కాలెత్తిలేకపోయె. ౧౦౪

క. ఆసైరిభాస్యబంధులు ।చేసినయుపచారమహిమచేతను జరణం
బాసమయంబున దనుజా ।గ్రేసరునకు వశముగాక కీలుతొలం గెన్. ౧౦౫

క. అదిగని సందేహింపక ।సదుపాయధురీణులై నసద్భటవర్యుల్.
ముదమునఁ బైకెక్కి నృపున్ ।సదమలగతి నీడ్చి రతఁడు శ్రమచేమూల్గన్. ౧౦౬

శా. ఎంతో కష్టము మీఁద దైత్యవిభుఁ బైకి ట్లీడ్చి యామీఁదటన్
    వంతు ల్వెంబడి మోవనెంచి యదియున్ భారంబుగాఁ దోఁచినన్
    స్వాంతంబు ల్చలియింపఁ జింతిలి మహోపాయంబుఁ గ న్పెట్టియ
    త్యంతంబు న్మది సంతసిల్లి గుడిచెంతం జేరి యొక్కుమ్మడిన్. ౧౦౭

క. పందిరిగడలనురెంటిన్ ।సందిటఁ గొనివచ్చికట్టి సద్వాహనమున్
    సుందరగతిఁ జేసి మహా ।నందముతో రాజు నందు నయమొప్పారన్. ౧౦౮

క. శయనింపఁజేసి యిద్దఱు ।దయతోడ న్మూపుపైనిఁ దద్వాహనమున్
    గయికొని పారమపదంబున ।కయి చేర్చుమహానుభావుకరణిని నృపునిన్. ౧౦౯

మ. వహియించి మృగయావినోదమహోత్సవంబు నిర్వర్తించి పునఃపురప్రవేశంబుచేయ
నవధరించు నవనీధవపుంగవుం బురవీధుల నూరేగించు మహావైభవం బపూర్వంబై
యుండె నాసమయంబున. ౧౧౦

సీ. అత్యద్భుతంబైన యావాహనంబును వీక్షించి కుర్కురవితతిమొఱుగ
    వీధివెంటనుబోవు విధవాంగనలుచూచి శవమని వెనుకకు సరగనరుగఁ
    బయినుండి బాధచే వడిమూల్గుటాలించి తమచుట్టమని ఘాక తతులుచేరఁ
    గ్రొత్తగా శవవాహకులువచ్చి రెందుండియని ప్రాఁతవాహకు లడుగుచుండ
    శ్వాననినదంబు మాగధస్తవముగాఁగ । విధవలభయస్వరములు దీవెనలుగాఁగ
    ఘాకఘాంకారములు వాద్యఘోషములుగ నగరుచొత్తెం చెనా ఱేఁడునడిమిరేయి. ౧౧౧

వ. ఇట్లుపరమరహస్యంబుగా నంతఃపురప్రవేశంబుచేసి. ౧౧౨

ఉ. మంచముమీఁద దేహమిడి మాల్గుచు మూల్గుచు బాధనొందుచున్
    జంచలదృష్టిఁ జూచుచును జారులకెప్పుడునిట్టిపాటులే
    మించుగ సంభవించునని మించువెతి న్మదిలోఁదలంచుచున్
    బంచత యింతకంటె బహుభంగుల మేలనుచున్వెతంబడెన్. ౧౧౩

గీ. వైద్యులను బిల్వనంపించి వారిచేత ।నౌషధంబులుచేయించి యక్కజముగ
    బాధకుసహింపలేక యభాగ్యనృపుఁడు । మందుపట్టింపక శరీరమందొకింత. ౧౧౪

క. వరుసగమొలయునుదలయును ।శిరమును గరములును వాచి చెప్పంగఁ గవీ
శ్వరులెవ్వారును నొల్లని ।మరుదళ మానస్థ నతఁడు మానకచెందెన్. ౧౧౫

క. ధరణి నభాగ్యమహాసుర ।చరితము విన్నట్టిపుణ్యచరితుల కెల్లన్
బరవనితారతి చెడునని ।పరిహాసకుఁ డానతిచ్చెఁ బాండుసుతునకున్. ౧౧౬

క. ధరణీజనమందారా ।సురమునిగణనుతవిహార సుగుణాధారా
పరిభావితరిపువీరా ।దురితనిచయఘనసమీర దుఃఖవిదారా. ౧౧౭

మాలి. అనుపసుగుణసాంద్రా యాదవాంభోధిచంద్రా
జనఘననుతిపాత్రా సజ్జనాంభోజమిత్రా
వనధికృతవిహారా వల్లవీచిత్తచోరా
దనుజచయవిరామా దర్పితారాతిభీమా. ౧౧౮


గద్యము. ఇది శ్రీమత్సకలసుకవిజనవిధేయ కందుకూరి వీరేశలింగ

నామధేయ కల్పితంబయినయభాగ్యోపాఖ్యానంబను

హాస్యప్రబంధంబునందు సర్వంబును

నేకాశ్వాసము.