అబలా సచ్చరిత్ర రత్నమాల/రూపమంజరి

వికీసోర్స్ నుండి

రూపమంజరి

బంగాళప్రాంతమున వర్ధమాన్ జిల్లాలోనిదగు కలాయింగటీ యను గ్రామమునందుండు నారాయణదాసు భార్యయగు సుధాముఖికి ఈమె క్రీ.శ. 1726 వ సంవత్సరమున జన్మించెను. నారాయణదాసు గొప్ప విద్వాంసుడు. వారికి రూపమంజరి దప్ప వేరు సంతానము లేనందున నామెను కడు గారాబముగా బెనుచుచుండి యామెకు బాల్యముననే విద్య నేర్ప మొదలు పెట్టిరి. రూపమంజరి తీవ్రబుద్ధి కలదగుటవలన నల్పకాలముననే విశేషవిద్య నార్జించెను. ఆమెకుగల విద్యాభిలాషనుగని నారాయణదా సామెకు వ్యాకరణశాస్త్ర శబ్దశాస్త్రములను నేర్పెను. అవి త్వరలో నేర్చుకొనినందున నారాయణదాసు తన కూతును బహాదుర్ పురమునందలి వదాన్‌చంద్ర తర్కాలంకారు నింటికి విద్య నేర్చుకొనుటకు బంపెను. అచట నామె మగపిల్లలతో గూడ పాఠశాలయందు వదనచంద్రు నొద్ద విద్య నేర్చుకొనుచుండెను. తదనంతరము నరాయణదాసు త్వరలోనే మృతుడయ్యెను. అప్పుడు రూపమంజరి స్వగ్రామమునకువచ్చి తండ్రికి జరుపవలసిన ప్రేతకర్మల నన్నిటిని జరిపెను. పిదప నామెకు గావ్యముల జదువవలయునని యిచ్చ పొడమగా సరగామునందుండు పండిత గోపాలానంద వద్దికరిగి విశేషవిద్యనేర్చి యతని యొద్దనే వైద్యశాస్త్రమును సహితము నభ్యసించెను.

ఈ విద్వాంసురాలు మిగుల సుగుణవతిగా నుండెను. ఈమె వైష్ణవమతావలంబిని. రూపమంజరి గొప్ప విద్వాంసు రాలయి పురుషులవలెనే క్షౌరము చేయించుకొని తల వెనుక జుట్టుమాత్ర ముంచుకొనెను. ఆమె పురుషవస్త్రములనే ధరియింపుచుండెను. రూపమంజరి జన్మమంతయు నవివాహితగా నుండి తాను విద్యాభ్యాసము చేయుచు ననేకులకు విద్యాదానము చేయుచుండెను. ఆమె వద్ద నెల్లప్పుడు వ్యాకరణము కావ్యములు నేర్చుకొనుచు విద్యార్థు లనేకు లుండుచుండిరి. మానక గ్రామవాసియగు కవినాథ బోలానాథు డనునాత డీమె యొద్ద వైద్యశాస్త్రము నభ్యసించి గొప్ప ప్రవీణుడయ్యెను. రూపమంజరికి వ్యాపారులయొక్కయు, సంసారులయొక్కయు లెక్కలు బాగుగా దెలియుచుండెను. వైద్యమునం దామె కపార పాండిత్యము కలిగియుండెను గాన నామె దాని వలననే జీవనమునకు మూలమగు ధనమును సంపాదించుచుండెను. సాధారణలోకులీమెను విద్యాలంకారయనియు, తర్కాలంకారయనియు బిలుచుచుండిరి. ఈమె 90 సంవత్సరముల ముసలిదయి సర్వ తీర్థములను సేవించుకొని స్వగ్రామమునకు వచ్చి కొన్ని సంవత్సరములు జీవించి 102 సంవత్సరముల ప్రాయమున క్రీ.శ. 1875 వ సంవత్సరమున గతించెను.


________