Jump to content

అబలా సచ్చరిత్ర రత్నమాల/జిజాబాయి

వికీసోర్స్ నుండి

జిజాబాయి

ఈమె మహారాష్ట్ర రాజ్య సంస్థాపకుడగు శివాజీకి దల్లి. ఈమె శా.శ. 1518 వ సంవత్సరమున జన్మించెను. ఈమె భర్తపేరు శహాజీ. ఈయన జిజాబాయి నంతగా గౌరవింపక తుకాబాయి యను నామెను మరల వివాహమాడెను. జిజాబాయికి శివాజీ సంభాజీలను నిరువురు పుత్రులు గలిగిరి. కాని సంభాజీ యొక యుద్ధమునందు చచ్చెను. భర్త యనుకూలము లేక యుండినను జిజాబాయి తన కొమారుడగు శివాజీయొక్క తెలివితేటల కానందింపుచు నతని స్వదేశ స్వమతములయందలి యభిమానమును వృద్ధిపరచుచుండెను. ఆమె భర్త తురక ప్రభువులయొద్ద సరదారుగా నుండినను నామె కా మ్లేచ్ఛప్రభుత్వమునం దధిక ద్వేషము కలిగియుండెను. ఆమె సద్బోధ వలననే శివాజీ మిగుల శూరుడయి తమ దేశమునందలి తురక ప్రభుత్వమును రూపుమాపి మరాఠీ రాజ్యమును స్థాపించెను. ఆయన చేసిన పరాక్రమమున కంతకును జిజాబాయియే మూలమనుటకు సందియము లేదని న్యాయమూర్తులగు మహాదేవ గోవిందరావు రానడేగారు వ్రాసియున్నారు. శివాజీ తా నేపనినిజేసినను దల్లి యనుజ్ఞ వడయనిది చేసెడివాడుకాడు. శివాజీ మ్లేచ్ఛులతో వైరముచేయుట యతనితండ్రి కెంతమాత్రమును సమ్మతిలేదు. కాని తల్లి సహాయము వలననే శివాజీ మిగుల విఖ్యాతి గాంచెను. జిజాబాయి తా నేమి మహాకార్యము చేయజాలకున్నను దనకుగల స్వదేశ స్వమతాభిమానములను కొడుకునకు బోధించి తనకు గల యుద్దేశముల నతనిచే నెరవేర జేసెను. ఈ వీరమాత యెనుబదిరెందు సంవత్సరములు జీవించి శా.శ. 1600 సంవత్సరమున కాలము చేసెను.