అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/కృపాబాయి

వికీసోర్స్ నుండి

కృపాబాయి

               ఉ. హర్తకుఁ గాదుగోచర మహర్నిశమున్ సుఖపుష్టి సేయు స
                   త్కీర్తిఘటించు విద్యను దివ్యధనం బఖిలార్థికోటికిన్.

తమవిద్యవలనను సద్గుణములవలనను భరతఖండమును నలంకరించిన యాధునిక స్త్రీలలో కృపాబాయి యొకత యని గణింపఁబడుచున్నది. ఈమె యల్పవయస్సునందే పరలోకమున కేగినను తనకీర్తిని నాచంద్రార్కముగా భూమియం దుంచిపోయెను.

కృపాబాయి 1862 వ సంవత్సరమునం దహమదునగరమున జన్మించెను. ఈమె జనకునిపేరు హరిపంతులు; జనని పేరు రాధాబాయి. వీరు పూర్వము మహారాష్ట్రబ్రాహ్మణులుగా నుండి పిదప క్రైస్తవధర్మము స్వీకరించిరి. ఈమె చిన్నతనమునే తండ్రి పరలోకయాత్ర స్వీకరించెను. కాన కృపాబాయికి పితృసుఖ మేమియుఁ దెలియదు. అట్లయినను రాధాబాయి మిగుల దక్షతతోఁ దనసంతానముయొక్క విద్యాబుద్ధులకు లోపము జరుగకుండ చూచుచుండెను. ఆమె తాను విద్యావతి గాకున్నను సద్గుణవతిగాన విద్యావతు లయిన స్త్రీలచే విని నటుల కార్యదక్షురాలై తనబిడ్డలకు సదాసద్గుణములే యలవడునట్లు చేయుచుండెను. వారింట సదాశరీరసౌందర్యమున కనుగుణము లగుదుస్తులును ధరియించుటకంటెను శరీ రారోగ్యకరము లగుదుస్తులను ధరియించు నలవాటు గలిగి యుండుటచే వారిపిల్లలకు విలువవస్త్రములయం దెంతమాత్రము నిచ్చలేక వారుమిగుల వినయముతో వర్తించుచుండిరి.

ఇట్లు ధీమతి యైనతల్లిచే నన్నిరీతుల సురక్షిత యైనందున నామెకుఁ చిన్న తనమునందుఁ దండ్రిలేని లోపమంతఁగాఁ గానుపించదయ్యె. కృపాబాయి బాల్యమునుండియే మిగుల తెలివి గలది యనిపించుకొనెను. ఈమె విద్య నభ్యసించునపుడు తనసహోదరునితోడఁ గూర్చుండి చదువవలయునని కోరుచుండెనుగాని యామె తనవద్ద చదువ కూర్చుండినచో తనతప్పిదములను దిద్దునని యెంచి యట్టియవమానమున కోర్వఁజాలక యామె సహోదరుఁ డామెను డగ్గరఁ జేరనిచ్చెడివాఁడు కాఁడు. చిన్న యన్న యిట్లు చేసినను కృపాబాయియొక్క జ్యేష్ఠభ్రాత యగుభాస్కరుఁడు తనముద్దు చెల్లెలియం దధిక ప్రీతి కలవాఁడై యామె విద్యాభ్యాసము చక్కఁగా జరుపుచుండెను. ఆమెకు సృష్టిసౌందర్యవలోకమునం ధధికప్రీతిగాన నామె నిత్యము భాస్కరునితోడఁ బోయి యనేకపర్వతములను, వనములను, ఉపవనములనుదప్పక చూచుచుండెను. అల్పవయసునందుసహిత మామెకు సృష్టిసౌందర్యముఁ గనిన మిగుల నానందము గలుగుచుండెను. ఇట్లుండఁగాఁ గొంతకాలమునకు భాస్కరుఁడును దివి కరిగెను. తనశ్రేయము నపేక్షించు ప్రాణ సమానుఁ డగుసహోదరుఁడు చనిపోయినందువలన కృపాబాయియొక్కదు:ఖ మపారమయ్యెను. ఆదు:ఖమువలననే యామె దేహమునకస్వస్థత ప్రాప్తమాయెను. ఆమెదు:ఖమును మఱవవలయునని యామెను బొంబాయినగరమునందలి జనానా మిషనరీపాఠశాలలో విద్యాభ్యాసమునకయి పంపిరి. అచటికిఁ బోవువఱకు కృపాబాయి తనతోడిబాలికలతో సాటిగా తనకు విద్య రాదనుకొనుచుండెను. కాని యచటి కరిగినపిదప నాపాఠశాలయందలి బాలికల కందఱికంటెను ఈమెయే విద్యయం దధికురాలని నిర్ణయమాయెను. అందువలనఁ భాఠశాలాధ్యక్షుఁ డామె నేతరగతియందును జేర్చక విడిగా విద్య నేర్పున ట్లేర్పాటు చేసెను. అచట నుండుకాలములో కృపాబాయికి వైద్యవిద్యానిపుణురా లగు నొకయమెరికాస్త్రీతోడి సహవాసము కలిగెను. కాన నామె సాంగత్యమువలనఁ గృపాబాయికి వైద్యవిద్య నేర్చుకొనవలయునని యిచ్ఛపొడమెను.

కృపాబాయికిఁగల యాసక్తియుఁ దెలివి తేటలును గని వైద్యవిద్యాభ్యాసము కొఱ కామె నింగ్లండున కనుపవలయునని యామె యాప్తులకుఁ దోఁచెను; గానియామెశరీరమున కాదేశపుగాలి సరిపడదని తెలిసినందున నాప్రయత్నమును మానుకొనిరి. తదనంతరము చెన్న పట్టణమునందలి మెడికల్ కాలేజియందు స్త్రీలకు వైద్యవిద్య నేర్పునట్లేర్పడినందున కృపాబాయి వైద్యవిద్య నేర్చుకొనుటకై చెన్న పట్టణమునకుఁ బోయెను. అపు డామె యొంటరిదైనందున నాగ్రామమునందు వసియించు రెవరెండు సత్యనాధనుగారను గృహస్థునియింట వాసముచేయుచుండెను. అసత్యనాథన్‌గారు మిగుల పెద్దమనుష్యులు. ఆయనభార్యయుఁ గొమార్తెయు మిగుల మంచివారగుటచే వారుకృపాబాయి సద్గుణములను గని యామెయం దధిక ప్రీతి గలిగియుండిరి. అందువలన కృపాబాయికి వారింట నున్న దినము లధిక సుఖప్రదములుగాఁ గడచెను. ఇట్లీమెయొక సంవ త్సరము చదివి సంవత్స రాంతమునందైన పరీక్షయందు సమస్తవిషయములలోఁ గృతార్థురాలాయెను. ఆమె తెలివి గని పరీక్షకుఁ డామెను మిగుల మెచ్చుకొనెను. కాని కృపాబాయి యామెప్పున కెంతమాత్రమును గర్వపడక పూర్వమువలెనే వినయాదిగుణము గలిగి వర్తించుచుండెను.

కృపాబాయికి విద్య నభ్యసించుటయం దధికాసక్తి కలిగినను, ఆమె దేహము మాత్ర మాశ్రమనోర్చునంతటి దృఢమైనది గానందునఁ బరీక్షకై చదువునపు డామెకెంత మాత్రము శ్రమదోఁచకుండినను పరీక్షానంతరము వెంటనే విశేషముగాఁ గాయలాపడెను. అప్పటినుండియు మరల నామె శరీర మెప్పుడును స్వస్థపడనందున విధిలేక విద్యాభ్యాసమును మానుకొనవలసిన దాయెను. ఇట్లు వైద్య విద్యాభ్యాసమును విడిచినంతమాత్రమున నామె నిరుత్సాహురాలుగాక వేరువిధముగా జనులకు హితముచేయ యత్నింపుచుండెను.

రెవరెండు సత్యనాథనుగారి పుత్రుఁడగు సాముఎల్ సత్యనాధనుగారు ఇంగ్లండునందలి కేంబ్రీజు విశ్వవిద్యాలయమునందు విద్య నభ్యసించి పరీక్షయందుఁ గృతార్థుఁడయి 1881 వ సంవత్సరమునందు మరల స్వదేశమునకు వచ్చెను. సాముఎల్ సత్యనాధనుగారు కృపాబాయియు నొకయింటనే వాసము చేయుచుండినందునవా రిరువురును ఒకరి సద్గుణముల నొకరు కని పరస్పరానురాగము గలవారైరి. తదనంతరము స్వల్పకాలములోనే వారికి వివాహమయ్యెను. వివాహానంతరము సాముఎల్ సత్యనాధనుగారిని ఉదక మండలమందలి యొకకళాశాలయందు ముఖ్యోపాధ్యాయునిగా నియమిం చిరి. అందువలన నానూతనదంపతు లచటికి నరిగిరి. అచట నీలగిరిపర్వతమునందలి గాలివలన కృపాబాయిదేహ మించుక యారోగ్యముగా నుండెను.

అచట నుండుకాలమునం దామె యూరకుండఁ జాలక నాగ్రామమునందలి యవనబాలికలకొఱ కొకపాఠశాల స్థాపించెను. ఆపాఠశాల ప్రస్తుతము చక్కఁగా నడుచుచున్నదఁట. ఈమె యచ్చట నున్న కాలముననే యాంగ్లేయ వారపత్రికలకును, మాసపత్రికలకును వ్యాసములు వ్రాయుచుండెను. ఆమెవ్రాసిన వ్యాసము లత్యంతప్రశంసనీయము లగుటచే స్వల్పకాలముననే కృపాబాయి కీర్తి నలుగడల నల్లుకొనసాగెను.

1884 వ సంవత్సరము మి. సత్యనాథను గారిని రాజమహేంద్రవరమునకు మార్చిరి. అచటికి వచ్చినది మొదలు కృపాబాయిగారి రుగ్ణత విశేషింపసాగెను. ఇట్లురోగగ్రస్తురాలుగ నుండియు నామె యనేకవ్యాసములను వ్రాయుచునే యుండెను. ఆమరుసంవత్సర మామె కుంభకోణమున కరిగెను. అచట నామెరుగ్ణత యించుక నిమ్మళముగా నుండెను. అచట ను ఆమె వ్యాసములను వ్రాయుచునే యుండెను. కుంభకోణమునందుండు కాలముననే కృపాబాయికి కవిత్వస్ఫూర్తియు ప్రబంధరచనేచ్ఛయుఁ గలిగెను. అప్పు డామె కొన్ని పద్యములు రచియించెను. వానిని జదివినయెడలనామెకుఁ గల ఆంగ్లభాషాకవిత్వస్ఫూర్తి వెల్లడి యగునని తజ్ఞులు చెప్పుచున్నారు. ప్రబంధరచనేచ్ఛ కలిగియుఁ దనవలన నదియగుట దుస్తరమని తలఁచి యామె బహుదినము లాప్రయత్నమే చేయకుండెను. 1886 వ సంవత్సరమునం దామెభర్తను చెన్నపట్టణమునకు మార్చిరి; యచటికి వచ్చిన యనంతరము పత్రికలకు వ్యాసములు వ్రాయుటలోనే కాలము గడపక ప్రబంధరచన చేయుట మంచిదియని యామె భర్త సూచించెను. అందుపై నామె తనబాల్యము నందలి యనేక సంగతులను జ్ఞప్తికిఁదెచ్చుకొని వానితోఁ దన కల్పనలను గూర్చి 'సగుణమ్మ' యనుప్రబంధము నొకదాని నింగ్లీషునందు వ్రాసెను. అది ప్రస్తుతము తెలుఁగునందు భాషాంతరీకరింపఁబడి యున్నది. దానిలో నీదేశపు క్రీస్తుమతస్థుల గృహస్థితులును నదీపర్వతారణ్యముల సౌందర్యమును మిగుల చక్కఁగా వర్ణింపఁబడియున్నవి. ఈ గ్రంథము వ్రాసి ముగించినపిదప నామె కొకకొమార్తె గలిగెను. ఆబిడ్డ విస్తారదినములు జీవింపకయే చనిపోవుటవలనఁ గృపాబాయికి దు:ఖము ప్రాప్తమయ్యెను. అందుచే నామె కదివఱకుఁగల యుత్సాహము తగ్గిపోయెను. కాని కృపాబాయి యంతతోఁ దనప్రయత్నమును మాని సదాదు:ఖింపుచునుండక తా నెటులనైన నితరులకు నుపకార మొనర్చి యందువలనఁ దనదు:ఖమును నుపశమింపఁ జేసికొనవలయునని సదా ప్రయత్నింపుచుండెను. ఆ సమయమునం దామె శరీరముసహితము అస్వస్థముగా నుండినందున మి. సత్యనాధనుగారామెను బొంబాయినగరమునకుఁ గొనిపోయిరి. అచటి గాలివలన నామెశరీర మించుక స్వస్థపడునని వారు తలఁచిరి; కాని ప్రయాణశ్రమవలన నారుగ్ణత హెచ్చుకాఁగా నామెను వెంటనే మరల మద్రాసునకుఁ గొనిపోవలసివచ్చెను. అచట నామె బహుదినము లాంగ్లేయవైద్యశాలలో నుంచఁ బడినపిదప నామె దేహము కొంచెము స్వస్థపడెను. కాని యామెరోగ మసాధ్యకరమయినదని డాక్టరు లప్పుడె కనిపెట్టి యాసంగతి కృపాబాయికిఁ దెలిపిరి. అందువలన నామె యెంత మాత్రమును చింతించినది కాదు.

ఆమఱుసంవత్సర మామె యాప్తు లొకరిద్దఱు గతించుటచే నాదు:ఖమువలన నామెరుగ్ణత మఱింత హెచ్చసాగెను. ఇట్లు దేహ మస్వస్థమైనను లక్ష్యముచేయక కృపాబాయి తనలేఖనక్రమమును జరుపుచుండెను. ఆసమయమునందే యామె 'కమలా' యనుప్రబంధ మొకటివ్రాయసాగెను. నీలగిరి యందలి చల్లగాలివలన నామె కాఁరోగ్యము కలుగునని తలచి యామె నటకుఁ బంపిరి. కాని యచట నామెరోగము హెచ్చెను. అచట నుండునపుడే కృపాబాయి తనరుగ్ణత హెచ్చుచున్నను సరకుగొనక కమలయను ప్రబంధము వ్రాసి ముగించెను. పిమ్మట నాప్రబంధ మొకమాసపత్రికయందు ముద్రింపఁబడి ప్రచురింపఁబడియెను. అందుచేతఁ గృపాబాయికి మిగుల నానందము కలిగెను. ఆమె హిందూస్త్రీయై యుండియు నాంగ్లేయభాషయందు వ్రాసిన యీగ్రంథములు మిగుల ప్రశంసనీయములుగా నున్నవని నుడివెదరు. వానిఁ జదివినయెడల ప్రబంధరచనయందుఁ బ్రవీణుఁ డయిన యొకానొకయాంగ్లేయదేశీయునిచే వ్రాయఁబడిన వని తోఁచునఁట. ఈసాధ్వీమణి 1894 వ సంవత్సరము ఆగస్టు 8 వ తేదిని పరలోకగమనము చేసెను. మృత్యుసమయమున కామెకు ముప్పదిరెండు సంవత్సరముల ప్రాయ ముండెను. కృపాబాయి యింకను కొన్ని సంవత్సరములు జీవించి యుండినయెడల నింకను కొన్నిగ్రంథములు వ్రాసియుండును. కాని దేశముయొక్క దౌర్భాగ్యమువలననే యామె యాయువు క్షీణించెను. ఇఁక ముం దయినను విద్యావతులును సద్గుణసంపన్నులు నగుస్త్రీ లుద్భవించి యీదేశమును సౌభాగ్యసంపన్నముగా జేయుదురుగాత మని కోరుచు నీచరిత మింతటితో ముగించెదను.