అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/సత్యవతి

వికీసోర్స్ నుండి

సత్యవతి.

బంగాళాయిలాకాలోని మాల్ హదనీ యనుప్రాంతములోనిదగు గౌడమగ్రాసు నివాసియగు రామానందగోస్వామికి నీమె కోడలు. గోస్వామిభార్య పేరు సునీతి. ఈమె మిగుల దయగలది యయి యింటిపని నంతను జేసి యూర నెవ్వరును క్షుత్తుచే బాధపడుచుండలేదుగదా యని తెలిసికొనినపిదప పతి సుతులకుఁ గుడువఁబెట్టి పిదపఁదాను భుజించును. రామానందుఁడు భగవద్భక్తుఁడు, పాపభీతుఁడునై తనకుఁ గలమాన్యములో వచ్చినవానితో జీవనము చేయుచు సింతుష్టుఁడయి యుండెను. రామానందుఁడు తనపుత్రు డగు ప్రేమానందునికి విద్యాబుద్ధులు గఱపి సద్గుణవంతునిగాఁ జేసెను. వారికోడలగు సత్యవతి మిగుల రూపవతి యగుటయేగాక విద్యావతియయి వినయ వివేకాదిసద్గుణనిధిగా నుండెను. ఈమె రాణీభవాని కాలమునందుండినట్లు తెలియుచున్నది. సత్యవతి యత్తమామలకు సేవచేయుచుఁ బతి యాజ్ఞను శిరసావహించి మిగుల నమ్రతతో నుండుటవలన వారును ఆమెయం దధికాదరము కలవారలయిరి. ఇట్లీకుటుంబమధిక సుఖములో నుండఁగా వారి కకస్మాత్తుగా నొకగొప్పయాపద సంభవించెను. ఆయాపదవలననే సత్యవతియొక్క ధైర్యస్థైర్యములు బాగుగా బయలుపడి యామె కీర్తి శాశ్వతపఱిచెను. ఆకాలమునం దాదేశమున కంపనీవారి ప్రభుత్వము క్రొత్తగాఁ బ్రారంభ మయ్యెను. ఆసమయమున ననావృష్టి దోషమువలన నాదేశమున నొకగొప్పక్షామంబు సంభవించె. ఆక్షామంబున పంటలులేక కాపులు మిగుల హీనస్థితికి వచ్చిరి. కాని దొరతనమువారి యుద్యోగస్థులు, దొతనమువారి కియ్యవలసిన పన్నుకొఱకయి కాపుల యిండ్లనమ్మియు, పొలములను విక్రయించియు పన్ను దీసికొని వారి ననేక బాధలఁ బెట్టుచుండిరి. వాండ్రను రక్షకభటుల కొప్పగింపఁగా వారు వారిని, వారి స్త్రీలను సకలబాధలపఱిచి సభలలో నవమానింపుచుండిరి. ఇట్టిసమయములో నదివఱకు మాన్యముగా నిచ్చిన రామానందుని భూమికి నచటి యుద్యోగస్థుఁడగు దేవీసింహుఁ డన్యాయముగా పన్ను నడిగెను. అప్పుడు రామానందునివద్ద ద్రవ్యమేమియు లేనందున నాయధికారి వారి యింట నున్న వస్తువులన్నియు వేలము వాడెను. అట్టియాపత్సమయములో రామానందుఁడు తనపరివారముతోడ రంగపురమున తనశిష్యు లుండినందున, నచటికిఁ బోవుచుండెను. కాని రాజభటులు వారి నందఱిని త్రోవలోఁ బట్టుకొని రాజస్థానమునకుఁ దీసికొనిపోయిరి. అచటఁ గులాంగనల లొందు నవమానమును జూచి సహింపలేక ప్రేమానందుఁడు దీని కంతకును కారణుఁ డగుదేవీసింహుని తనచేతికత్తితో నఱకఁబోయెను. కాని యింతలో రాజభటుఁ డొకఁడు వచ్చి యతని చేయిపట్టుకొనియెను. అంత నా రాజభటుఁ డొకగదిలోని కతనిఁ దీసికొనిపోయి వీపుపైని లెక్కలేని దెబ్బలను గొట్టెను. అదివఱ కట్టి దెబ్బలచేత నలుగురుమనుష్యు లచట మృతు లయిరి. ఆవార్త విని రామానందుఁడును, సత్యవతియు, ప్రేమానందుఁడు చచ్చెనని వగచిరి. తదనంతరము రామానందుఁడు కారాగృహములోని కరిగి యచట దెబ్బలచేత విరూపియయి మూర్ఛఁజెందిన పుత్రుని గుర్తింపక చచ్చెనని తలఁచెను. అంత నతఁ డీవలకు వచ్చి కోడలి కాదు:ఖవార్త నెఱిఁగించి యామెను దీసికొని యరణ్యమార్గమునఁ బోవుచుండెను. సత్యవతి పతి మరణమున కధిక దు:ఖితయయి యనుగమనము చేయ నిశ్చయించెను. కాని రామానందు లామె నట్లు చేయనియ్యకుండెను. వీరిట్లరుగుచుండ దేవీసింహుఁడు సురూపవతు లగు సతులను బట్టి తెప్పించి వారిని దొరల కర్పించి యాదొరల యనుగ్రహము సంపాదించుచుండు ననివార్త వీరికిఁ దెలిసెను. నాఁటినుండియు వారు గ్రామమునందెప్పుడును సంచరింపక అరణ్యముననే తిరుగుచుండిరి. కాన వారు రాజభటులకు జిక్క లేదు. ఇట్లు వీరు నడుచుచు నొకగ్రామ సమీపారణ్యమునకు రాఁగా నాగ్రామమున నొక సౌందర్యవతిని వెదకుచు రక్షకభటులు వచ్చి రనినవార్త వారికి దెలిసెను. అప్పుడు రామానందుఁడు కోడలినిఁ జూచి 'అమ్మా! నీవు నాతోనుండిన నీకు విశేషసంకటములు కలుగును. కాన నీ నీవృద్ధ దాసిని నొక సేవకునినిఁ దీసికొని కాశీక్షేత్రమున కరుగుము' అనిపలికెను. అందుకు సత్యవతి 'మీరు నాకు మామగారైనను నన్ను మీకన్యకకంటె నెక్కుడుగాఁ జూచెదరు. మిమ్మును విడిచిపోవుటకు నే నెప్పుడును సమ్మతింపను. మన మిరువురము కలసియుండుటయే నాకు దు:ఖములో సహితము సుఖముగానుండును. పతివ్రతల నెవ్వరును జెఱుపలేరు. మనో నిశ్చయముగల నాతుల నెవ్వరును నవమానింప శక్తులుకారు' అని పలికి దు:ఖాతి రేకమువలన సత్యవతి మూర్ఛిల్లెను. కొంత సేపటి కామె సేదతేరి 'హా పరమేశ్వరా! నన్ను నాప్రాణనాధునితోడఁ గొనిపోవక యేల బ్రతికించితివి ? బ్రతికించినను నాకీసౌందర్య మేల యిచ్చితివి. దీనివలన సుఖము ననుభవించు వారు లేరయిరి. ఇఁక దీనితోడి ప్రయోజన మేమి? సంకట మూలమగు నీసౌందర్యముతో నీప్రపంచమున నుండుటకష్టము కాన ముక్కు, చెవులుగోసికొని విరూపి నయ్యెద' ననియామె యట్లు చేయఁబోఁగా రామానందు లామె నట్లు చేయనియ్యక ననేకనీతులను చెప్పి వృద్ధదాసిని విశ్వాసార్హుఁ డగు భృత్యుని నిచ్చి యామె నరణ్యమార్గమునఁ బంపెను. అప్పుడామెకుఁ గట్టువస్త్రము దప్ప నన్యవస్త్రముగాని దగ్గర ధనముగాని లేదయ్యెను.

కోడలినంపి రామానందులు భగవన్నామ సంకీర్తన చేయుచుండఁగా రాజభటు లచటికి వచ్చి యతనిని బట్టుకొని పోయి కారాగృహమునం దుంచిరి. సత్యవతి కొంతదూర మరిగి ముందుపోవ మనసొప్పక మరలి మామగా రున్నస్థలమునకువచ్చి యతనిని రాజభటులుగొనిపోయి కారాగృహమునం దుంచిరని వినెను. అప్పుడామె మిగులదు:ఖించి యూరకుండక మరల ధైర్యమవలంబించి మామగారిని విడిపించు నుపాయము వెదకి, తాను పురుష్వేషమును ధరియించి బంధిఖానాను సమీపించి తన సేవకుల నచటనే యునిచి తాను ముందుకువచ్చెను. అచట నధికారియగు రామసింహ జమాదారా బాలునుఁజూచి నీ వెవ్వఁడవనియు, నేలవచ్చితివనియు నడుగఁ గా నతఁడు తనపేరు 'నాన'కనియుఁ దన నివాసస్థలము గయా జిల్లాలోని పూర్ణియా యనుగ్రామమనియుఁ దా నుద్యోగము నిమిత్తము వచ్చితిననియుఁ జెప్పెను. అందుపైనతఁడా బాలునిఁ దనయొద్ద నల్పజీతమున కుంచుకొనియెను. ఈ వేషధారి బాలకుఁడు నిత్యముయజమానునిసేవ బాగుగాఁజేసి యతని కృపకుఁ బాత్రుడయ్యెను. అంతనొకనాఁడతఁడు కైదు ఖానాలోనికి యజమానునియనుజ్ఞ వలన నరిగి మిగుల యుక్తిగారామానందుల నచటినుండివిడిపించి విపినమార్గమున నరణ్యమధ్యమునందున్న యొక యోగిని [1]గృహమునకుఁ దీసికొనిపోయెను. వారచటికరిగియామెతోఁ గొంత ప్రసంగించునంతలో చచ్చిపోయెననుకొనిన ప్రేమానందుఁడు బ్రతికి కలకత్తాలో కారాగృహమునందుండినట్లు తెలిసెను. అప్పుడు సత్యవతి యొకభృత్యుని వెంటఁదీసికొని భర్తను విడిపింతునని పురుషవేషముతో రామకృష్ణుడు డనునామమునఁ కలకత్తాకుఁ బయలు దేరెను. ఆపదలు మనుష్యులకు శత్రువులని తలఁచెదరుగాని నిజముగా విచారింపఁగా గొప్పవారి కవి మిత్రులనియే చెప్పవచ్చును. ఆపత్కాలము వలననె గొప్పవారిపవిత్రచరిత్రము, చాతుర్యము ధైర్యము మొదలైనగుణములు వెల్లడియగుట కవకాశము కలిగి వారికీర్తి జగద్విఖ్యాతమగును. సత్యవతి రాత్రిందివములు నడచి మూఁడుదినములకు కలకత్తానగరము ప్రవేశించెను. అచట బందిఖానా రామానందులను బట్టిన యధికారి చేతిదిగాక యతనికంటె గొప్ప యధికారిచేతిలో నుండెను. అందువలన నచటవ్యాజ్యమునకుఁ బోయినచో ప్రేమానందుఁడు విముక్తుఁడగునని తెలిసెను. కాని యాకోర్టు వ్యాజ్యమునకు విశేషద్రవ్యముకావలసియుండెను. ద్రవ్యముకొఱకు సత్యవతి విచారింపుచుండఁగా, నాగ్రామమునందు గంగా గోవిందసిహుఁ డనుగృహస్థు నింటికి యాచనార్థము కొందఱు బ్రాహ్మణు లరుగుచున్న ట్టామెకుఁ దెలిసెను. అప్పు డామెయు బురుష వేషముతో నచటి కరిగెను. కానియచట నేమియుఁ దొరకదయ్యె. అంత నాసాధ్వి మిగులచింతించి రాజవీధిలో నొకవృక్షచ్ఛాయను గూర్చుండింద్రాహారములు లేక కొన్నిదినములు గడపెను. అంత నొకదిన మాత్రోవ నొకగొప్ప యుద్యోగస్థుఁ డరుగుచుండెను. ఆయన చేతిలోనుండి యతనికిఁ దెలియకయే కొన్ని యగత్యములైన కాగితములు క్రిందఁ బడెను. అవి పడుటనుగని త్వరగా సత్యవతి వానినెత్తి తెచ్చి యాగృహస్థున కిచ్చెను. వానిని దీసికొనియాతఁ డాబాలకునికి మిగుల కృతజ్ఞుఁడయి "నీవు నాకువచ్చు గొప్ప యాపదలను దొలఁగించితివి. నీ కేమికావలయునో యడుగు"మనెను. అందుకు నామె తనబంధుఁడొకఁ డాయూర బందివాసములో నుండినందున నతని విడిపింపవచ్చి ద్రవ్యహీనతవలన నాపని సాధ్యముకాక యుండెననియు, తమ రాకార్యమునకుఁ దోడుపడ వలెననియు వేఁడుకొనెను. అందు కాగృహస్థుఁడు సమ్మతించి రామకృష్ణుని (సత్యవతినామము) యిచ్ఛప్రకార ము ప్రేమానందును విడిపించెను. కారాగృహమునుండి బైటికి వచ్చినపిదప పురుష వేష ధారిణియగు తనసతినిఁజూచి ప్రేమానందుఁడు గుర్తింపక తనబంధువుఁ డెవఁడో తనను విడిపించెనని తలఁచెను. తదనంతరము వారు గృహమునకు వచ్చినపిమ్మట సత్యవతి భర్తకుఁ దన నెఱిఁగించి యతని పాదములపైఁబడెను. అంత ప్రేమానందుఁడును తనసతి చేసిన యద్భుతకృత్యమున కచ్చెరు వంది యామె నాలింగనము చేసికొనియెను. మృతుఁడయ్యె నను కొనిన ప్రియభర్తను పండ్రెండుసంవత్సరములకుఁ గాంచెనుగాన సత్యవతి సంతోషమునకుఁ బారము లేదయ్యె. తదనంతరమువా రిరువురును భృత్యుని వెంటఁ దీసికొని కొన్ని దినములకు రామానందుఁడును యోగినియు నున్నస్థలమునకువచ్చిరి. అప్పుడు రామానందుఁడు పరమానందమగ్నుఁడయి కోడలిని బహువిధముల నుతియించెను. అంత వా రందఱును రంగపురమున కరిగి సుఖముగానుండిరి.

  1. ఈయోగిని యవతయో తెలియదు; కాని యాకాలమునందే యుండి యాదేవిసింహుని భయముచేతనే యరణ్యమునందు యోగినిగా వాసము చేయుచుండిన 'కమలాదేవి'యే యై యుండవచ్చునని యూహింపఁబడుచున్నది. కమలాదేవిచరిత్రచూచునది.