అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/మొల్ల

వికీసోర్స్ నుండి

మొల్ల

                 కింకులేన విశాలేన విద్యాహీ నేన దేహినాం
                 దుష్కులం చాపి విదుషో దేవైరపి సుపూజ్యతే [1]

మొల్ల యాత్మకూరి కేశయసెట్టి కూఁతురు. ఈమె కులాలవంశ సంభూత యని పరంపరగా వాడుక వచ్చుచున్నది. ఆంధ్రమునందు నీమె రామాయణము రచియించినందున నీమెకీర్తి జగములో నజరామరమయి యున్నది. ఈ యువతి 16 వ శతాబ్దారంభమున నున్న ట్లూహింపఁబడుచున్నది.

.......................................గోప

వరపు శ్రీకంఠమల్లేశు వరముచేత నెఱిఁ గవిత్వంబు చెప్పఁగ నేర్చినాను.

అని చెప్పుకొనుటచే నీమె నివాసస్థలము నెల్లూరి మండలములోని గోపవరమని తెలియుచున్నది. ఈమె రామాయణమును చదివినవా రంద ఱీమెకుఁ దెనుఁగునందత్యంతప్రావీణ్య ముండెనని యొప్పుకొనక మానరు. ఈమెకవిత్వము మృదు మధురమయి, 'తేనె సోఁక నోరు తియ్యన యగురీతిఁ దోడ నర్థమెల్లఁ' దోఁచునదియయి, 'గూఢశబ్దవీతతి కొట్లాట' లేనిది యయి ద్రాక్షాపాకమయి యొప్పుచున్నది. గూఢపదగుంభనముచే నర్థకాఠిన్యము సాధించి చదువరులను బాధపెట్టుట యామె కెంతమాత్రమును ఇష్టము లేదు. కవిత్వధోరణియెట్టు లుండవలయునో యన్నవిషయమయి యీమె సుందరమయిన మూడుపద్యములు వ్రాసియుంచినది. ఆమూడు పద్యములు కవిత్వము జెప్పువా రందఱును తమతమ హృత్పటములమీఁద వ్రాసి యుంచుకొనఁ దగినవి. అవి యేవియన : _

                క. మును సంస్కృతంబు తేఁటగఁ
                    దెనిఁగించెడిచోట నేమి తెలియక యుండన్
                    దనవిద్య మెఱయఁ గ్రమ్మఱ
                    ఘనముగ సంస్కృతము చెప్పఁగా రుచియగునే.

                గీ. తేనె సోఁక నోరు తియ్యన యగురీతిఁ
                    దోడ నర్థ మెల్లఁ దోఁచకున్న
                    గూఢశబ్దవితతి కొట్లాటపని యెల్ల
                    మూఁగ చెవిటివారి ముచ్చటరయ.

                క. కందువమాటల సామెత
                    లందముగాఁ గూర్చి చెప్ప నవి తెనుఁగునకుం
                    బొందై రుచియై వీనుల
                    విందై మఱికానిపించు విబుధుల కెల్లన్.

మొల్లకుఁ గవిత్వస్ఫూర్తి విశేషముగానుండినందున నామె యాశుకవిత్వము సులభముగాఁ జేయుచుండెను. మొల్ల తలయంటికొని స్నానము చేసిన పిదప రామాయణరచన కా రంభమును చేసి తలవెంట్రుక లారులోపల నొకకాండమును ముగించెనని లోకవార్త గలదు. "అక్కడక్కడఁ గొన్ని వ్యాకరణదోషము లున్నను మొత్తముమీఁద నీమెకవిత్వము మిక్కిలి మృదువై, మధురమై రసవంతముగా నున్నది. ఈరామాయణము గొంతకాలము క్రిందటివఱకును వీధిబడులలో బాలురకు పాఠముగాఁ జెప్పుచుండిరి. ఇది పురుషులు చెప్పిన గ్రంధములలో ననేకముల కంటె మనోజ్ఞమై ప్రౌఢమైయున్నది." అని కవిచరిత్రకారు లీమెకవిత్వమునుగుఱించి వ్రాసి యున్నారు. మొల్లభక్తిపూర్వకముగా రచియించిన రామాయణము మొల్లరామాయణ మను పేరిట నాంధ్రదేశమునం దంతటను సువిఖ్యాతమే. ఈరామాయణములోని కొంతభాగము ప్రవేశపరీక్షకుఁ బఠనీయగ్రంధముగా నప్పుడప్పుడు నియమింపఁబడియున్నది. ఇందువలన నీరామాయణ మొకశ్రేష్ఠ మైన కావ్యమని స్పష్టమగుచున్నది. ఈమె కవనధోరణిఁ దెలుపుటకయి మొల్లరామాయణమునందలి కొన్ని పద్యముల నిందు దాహరించెదను.

                 ఉ. రాజులు కాంతియందు రతిరాజులు రూపమునందువాహినీ
                     రాజులు దానమందు మృగరాజులు విక్రమకేళియందు గో
                     రాజులు భోగమందు దినరాజులు సంతతతేజమందు రా
                     రాజులు మానమందు నగరంబున రాజకుమారు లందఱున్

                 ఉ. సాలముపొంతనిల్చి రఘుసత్తముఁ డమ్మరివోసి శబ్దవి
                     న్మూలముగాఁగ విల్ దివిచిముష్టియుదృష్టియుఁగూర్చిగోత్రభృ
                     త్కూలము వజ్రపాతహతిఁ గూలువిధంబునఁ గూలనేసెన
                     వ్వాలిఁ బ్రతాపశాలి మృడువందనశీలి సురాలిమెచ్చఁగన్

                 ఉ. పున్నమచందరుందెగడిపొల్పెసలారేడుమోముదమ్మియున్
                     గన్నులు కల్వఱేకులను గాంతి జయించెడుఁ గానిరక్తిమన్
                     జెన్నుదొలంగియుండవఱచేతులుఁబాదములున్‌దలంపఁగా
                     నున్నవి వర్ణముల్ గలిగియొప్పుతొఱంగదు రాఘవేశ్వరా.

ఈమొల్ల కుమ్మరకులమునం దుద్భవించియుఁ దనవిద్య వలన నుచ్చవర్ణమువారిచేఁ గూడ గౌరవింపఁబడఁ బాత్రురాలాయెను. ఇట్టివిద్య మాసోదరీమణుల కందఱకును గలిగినయెడల మనదేశ మితరదేశము లన్నిఁటికిని మాన్యస్థాన మగు ననుట కెంతమాత్రమును సందియము లేదు.

  1. శ్రేష్ఠ మయినకులమునందుఁ బుట్టి విద్య లేకుండిన నేమిలాభము; నీచకులము నందుఁ బుట్టినను విద్యావంతు లయినవారు అందఱికిఁ బూజ్యులు అనఁగా కులము ప్రధానము గాదు; గుణమే ప్రధాన మన్నమాట.