అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/నాచి

వికీసోర్స్ నుండి

నాచి

ఈవిద్వాంసురాలు ఏలేశ్వరోపాధ్యాయుల కూఁతురు. ఏలేశ్వరోపాధ్యాయులు ఆంధ్రబ్రాహ్మణుఁడు; మిక్కిలి విద్వాంసుఁడు; ఈయన నివాసస్థలము ఏలేశ్వరపురము. ఈఏలేశ్వరపురము శ్రీశైలమునకుఁ బశ్చిమముననుండును. ఈయన విద్యార్థులకుఁ జెప్పు సంస్కృతము నిత్యమును విని యీతని యింటివారందఱును సంస్కృత మతి స్వచ్ఛముగా మాటాడుచుండిరఁట. ఈయనయే మన యాంధ్రదేశమునం దంతటను నాడుల భేద మేర్పఱచి యాయా నాడులలోనే వివాహాదికము లగునటుల నిబంధనఁ జేసెనని చెప్పెదరు. ఆవిభాగంబులు నేఁటి వఱకును మనదేశమునఁ బ్రచారములో నున్నవి. ఈయనకుఁ బుత్రసంతతి లేదు. ముగ్గురుబిడ్డలుమాత్ర ముండిరి.

ఏలేశ్వరోపాధ్యాయులు శా. శ. ము యొక్క 7 వ శతాబ్దమునం దుండినటు దెలియుచున్నది. కాని నాచి సహిత మాశతాబ్దములోనిదనియే యూహింపవలసియున్నది. ఈమె యాంధ్రబ్రాహ్మణ స్త్రీయైనను నీమె చరితమును కాంధ్రదేశమునందెచటను నాధారములు దొరకకపోవుట కెంతయు వ్యసనపడుచు మహారాష్ట్రమునందు దొరకిన యాధారమువలన నీమెయల్ప చరిత్రము వ్రాయవలసిన దాని నైతిని. ఈమె బాలవితంతువు కాన తండ్రి యీమెకా దుఃఖము తెలియకుండుటకై యీమెను విద్వాంసురాలినిగా జేయదలచెను. అటులఁ దలఁచి యేలేశ్వరోపాధ్యాయులవా రామెకు విద్యనేర్ప మొదలుపెట్టిరి. కాని విద్య త్వరగా రాకుండినందుల కామె మిగుల చింతించి విద్యార్థులకు బుద్ధివైభవము కలుగుటకై తండ్రి చేసియుంచిన జ్యోతిష్మతియను తైలము నెవ్వరికినిఁ జెప్పక త్రాగెను. అందుపై నామెకు దేహతాప మతిశయిల్ల నింటిలోనుండిన బావిలోఁ దుమికెను. తదనంతరమున నింటిలోనివా రామెను వెదకి యెందునుగానక తుదకు బావిలో చూచిరి. అప్పటి కామె తాపము కొంత చల్లారినందున నామెకుఁ దెలివి వచ్చి వారికిఁ దనవృత్తాంతమునంతను జెప్పెను. అదివిని తండ్రి యామె నాబావిలో మరి కొన్నిగడియలుంచి బైటికిఁ దీసెను. నాఁడు మొద లామెకు విశేషమైన తెలివియు జ్ఞాపకశక్తియుఁ గలిగినందున నాచి తండ్రియొద్దఁగల సంస్కృత విద్యనంతను నేర్పెను.

విద్యావతియైనపిదప నీమెకు దీర్థయాత్రలు చేయవలయుననిబుద్ధి పొడమఁగాఁ దండ్రియందున కంగీకరించి యామెను యాత్రలకంపెను. నాచియుఁ దీర్థాటనమునుఁ జక్కఁగాఁ జేసికొని వచ్చుచుండెను. అప్పుడు కాశీ మొదలగుస్థలములయం దీమెకు పండితులతో వాదముచేయుట సంభవించెను. అప్పు డా విద్యావతి వారి నోడించి మిగుల మెప్పుగాంచెను. ఇదిగాక యాపండిత డిల్లీ యాగ్రా మొదలగు స్థలముల కరిగి రాజసభల యందు విద్వాంసులతో వాదముచేసి గెలిచి విశేష బహుమతులందెను. ఆమె యాకానుక లన్నియుఁ దీసికొనివచ్చి తండ్రికిఁజూపి యతనకిఁ దన యాత్రా వృత్తాంతమంతయు వినిపించెను. బ్రాహ్మణుఁడు కొమార్తెకుంగల వైధవ్యదు:ఖమునం తను మఱచి తనకూఁతును పుత్రునిగా నెంచి యామె యిట్టి విద్యాసంపన్న యగుటకు మిగుల సంతోషించెను. ఈమె తన చరితము ననుసరించి నాచినాటక మను నొకనాటకమును సంస్కృతమున రచియించెను. ఈమె విద్యాసంపదలచే మిక్కిలి వైభవముగాంచినందున నేలేశ్వరోపాధ్యాయులకుఁ బుత్రులు లేని కొఱఁత తెలియకుండెను.