అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/కమలా దేవి

వికీసోర్స్ నుండి

కమలా దేవి

ఈమె సత్యవతి కాలము (సత్యవతి చరిత్ర చూచునది) నందే యుండెనని యూహింపఁబడుచున్నది. ఈమె భర్త ముర్షీదాబాదు సమీపమునం దొకగ్రామవాసియగు బ్రాహ్మణుఁడు; ఆయనపేరు జగన్నాధభట్టాచార్యుఁడు. ఈదంపతులకు ముగ్గురుపుత్రులుండిరి. మానసింహుఁడనెడివాఁడువీరికిఁ గొంత భూమి ధర్మార్ధముగా నిచ్చినందున వారు దానివలననే సుఖ జీవనము చేయుచుండిరి. కమలాదేవి శాంతసుశీలాది గుణములు గలదైనందున నాయూరివారంద ఱామెను మిగుల మన్నింపు చుండిరి. అప్పుడాదేశపు ప్రభుత్వము కంపెనీవారిచేతికిఁ గ్రొత్తఁగా వచ్చెను. ఆసమయమున నొకగొప్పక్షామము సంభవించినందువలన పంటలు పండక జనులు మిగుల హీనస్థితికి వచ్చిరి. ఇదే సమయమని తలఁచి దొరతనమువారి యుద్యోగస్థులు కొందఱు క్షామమువలనఁ బీడింపఁబడిన జనులను దాము విశేషముగాఁ బీడించి, మిగుల బాధ పెట్టుచుండిరి. అప్పటి దొరతనమువారికి నింకను మనదేశభాష తెలియనందున వారు ప్రజలకుఁ గలుగుబాధలను తెలిసికొనఁజాల కుండిరి. ఇట్టిసమయమున మర్షీదాబాదున గంగాగోవిందసింహుఁ డనుదుష్టుని యధికారము చెల్లుచుండెను. వాఁడుసుఖముగాఁగాలము గడపుచున్న జగన్నాధుని కుటుంబము నొక్కసారిగా దు:ఖసముద్రములోనికిఁద్రోచెను. అదెట్లనిన, వారి కాసంవత్సరము పంట బొత్తుగాఁ బండనందున దొరతనమువారి కియ్యవలసిన పన్నిచ్చుటకు వారికి శక్తిలేక యుండెను. అట్టిసమయమున గంగాగోవింద సింహుఁడు పొలముపన్ను నెప మిడి వారింటఁగల సమస్తవస్తువులను వేలముపాడించెను. అందువలన వారికిఁ గట్టువస్త్రములుదప్ప రెండవవస్త్రమయినను లేక పోయెను. సద్గుణవతియగు నాకమలాదేవికి నొడలంతయు మూయుటకుఁ జాలినంతవస్త్రమైనను లేకయున్నందున నామెయింటినుండిబైటికి వెడలఁజాలకుండెను. ముగ్గురు పిల్లలనుదెచ్చిన భిక్షాటనపుగింజలు వారికే కడుపునిండకుండెను. ఈదు:ఖమునంతను గని జగన్నాధభట్టాచార్యుఁడు ప్రాణత్యాగము చేయ నిశ్చయించెను. కాని కమలాదేవియతనికిఁ గొంతధైర్యము సెప్పినందున నతఁడు కొన్నిదినములాఁగి యుండెను. తుదకు దారపుత్రాదులదు:ఖముఁ జూడఁజాలక జగన్నాధభట్టాచార్యుఁ డెవ్వరికిని దెలియకుండనొకదినము రివేసికొని ప్రాణములను విడిచెను. అప్పుడు కమలాదేవి యపారమగు దు:ఖసముద్రమున మునిఁగియుండియుఁ దనపుత్రులు బెంగ పెట్టుకొనకుండ వారి నోదార్చుచుండెను. ఇట్లుండఁగా వారిలోఁ బెద్దవాఁడగు క్షేత్రనాధుఁడను వాఁడు తమపొలముల విడుదలకై డిల్లీకిఁ బోవలయునని తండ్రిచెప్పఁగా వినినందున డిల్లీకిఁ బ్రయాణముకాఁగా, కమలాదేవి పోవలదనిచెప్పి యాపెను. కాని పాపండ్రెండు సంవత్సరములబాలుఁ డామాటలను వినక యొక నాటిరాత్రి లేచి డిల్లీకిఁ బ్రయాణమయిపోయెను. కమలాదేవికి దు:ఖములపైదు:ఖములే వచ్చుచుండెను. కాని యామె మిక్కిలి ధైర్యవతిగాన నా యిరువురు పుత్రులను రక్షింపుచుప్రాణములతోనుండెను. ఇట్లుండఁ గొన్ని దినములకు నాబాలకులు అన్నము లేనందున మృతులైరి. అంతనామె కడుపులోనుండి వచ్చుదు:ఖమును బట్టజాలక మృతులైన బాలకుల నిద్దఱిని రెండుభుజములపై వేసికొని చేత నొకచిన్న కత్తినిఁ బట్టుకొని గంగా గోవిందసింహునిసమీపమునకుఁబోయి మిగుల కోపమురాఁగా నాకత్తితో నతనినిఁజంప నుంకించెను. అప్పు డామె జగన్నాధుని భార్య యని తెలిసికొని గంగా గోవిందసింహుఁడు మిగుల భయముచే దిగులొందెను. కాని యాతనిసమీపమున నుండు బంట్రోతు లామెచేతికత్తినిఁ దీసికొని యాబాలకులనొకరి కొప్పగించి యామె నచటనుండి వెడలఁగొట్టిరి. అప్పు డామె దు:ఖాతిరేకమువలన మతిభ్రమ కలదియై యన్న పానాదులను మఱచి వీధులలోఁ దిరుగు చుండెను.

గంగా గోవిందసింహుని క్రింది యధికారియగు దేవీసింహుఁడు సుందరలగు స్త్రీలనందఱినిఁబట్టి తెప్పించి యొకగృహమునం దునిచి, వారిని దొరలకడకంపి వారిశీలమును గొని దొరలయనుగ్రహము సంపాదింపుచుండెను. ఇందువలన కమలాదేవిని సహితము దేవీసింహుని చారులు పట్టుకొనిపోయి యాగృహమునం దునిచిరి. అచట నామె దేవీసింహుని కపటము నెఱిఁగి యొక చిన్నకత్తిని దనయొద్ద దాఁచియుంచెను. ఒకదిన మామెను దేవీసింహుఁ డొకదొరయింటికి నంపెను. ఆదొర కమలాదేవి నంటరాఁగానామె కత్తితోనతని యురమునఁ బొడిచెను. కాని యతనియెడల దుస్తులు దళముగానుండినందున నతనికి విశేషాపాయముగాక కొంచెము గాయమయ్యెను. అంత నాదొర కమలాదేవి నంపి యట్టి స్త్రీనిఁ బంపినందుకు దేవీసింహునిపై మిగుల కోపపడెను. దేవీసింహుఁడు కమలాదేవిని మరల నాగృహమునందే యుంచి యామె కనేక దుర్భోధలను జేయింపు చుండెను.

ఇట్లుండ దేవీసింహుని జమాదారగు లక్ష్మణ సింహునకు కమలాదేవిపై మిగుల దయకలిగి యామెవృత్తాంతమునంతను నడిగి తెలిసికొని యామెయందు మాతృభావముగలవాఁడయి గుప్తముగా నామె నచటనుండి తీసికొనిపోయి దీనాజ్ పురమునందున్న తనతమ్ముఁడగు రామసింహునివద్ద నుంచెను. తదనంతరము లక్ష్మణసింహుఁడును నుద్యోగము చాలించుకొని దీనాజ్ పురమునకు వచ్చి కమలాదేవికి సేవచేయుచు క్షేత్రనాధుని వెదకుటకు మనుష్యుల నంపెను. ఇంతలో దేవీసింహునిచారులు కమలాదేవిని వెద కెదరని వీరికిఁ దెలియఁగా, సమీపారణ్యమున నొక కుటీరమును నిర్మించి యందుకమలాదేవి యోగినివేషముతో నుంచిరి. అచట నామె కొన్నిరోజులున్న పిదప క్షేత్రనాధుఁడు పొలములను విడుదల చేయించుకొని తల్లికడకు వచ్చెను. అప్పు డాతల్లికొడుకులు కొంతసేపు దు:ఖించి లక్ష్మణసింహునియందు మిగుల కృతజ్ఞత గలవారలై తమగ్రామమున కరిగిరి.

తారాబాయి

మహారాష్ట్రరాజ్య సంస్థాపకుఁడయిన శివాజీకిఁ బుత్రుఁడగు రాజారామున కీమె జ్యేష్ఠభార్య. తారాబాయి రాజ్యపాలనము నందు బహు నిపుణురాలని ప్రసిద్ధిఁగాంచెను. శివాజీ మరణానంతరము కొన్నిదినము లాతని ప్రధమ పుత్రుఁడగు సంభాజీ రాజ్యముచేసెను. కాని కొన్ని రోజులకు సంభాజీని డిల్లీశ్వరుఁడగు ఔరంగ జేబుపట్టుకొనిపోయి బహుక్రూరముగా వధియించి యాతనిపుత్రునిని భార్యను తనయొద్దనే కైదులో నుంచెను. కాన సంబాజీ తమ్ముఁడగు రాజారాము రాజ్యము పాలింపుచునుండెను. రాజారాము పరిపాలనదినములు ప్రజల కతిసంతోషకరములై యుండెను. కాని క్రీ. శ. 1700 వ సంవత్సరమునం దతఁడు దీర్ఘ వ్యాధిచే మృతుఁ డగుట తటస్థించెను. మరణకాలమునందు రాజారామునకు జ్యేష్ఠభార్యయగు తారాబాయియందుఁ గలిగిన శివాజీయను 10 సంవత్సరముల పుత్రుఁడును, ద్వితీయభార్యయగు రాజసాబాయి యందుద్భవించిన సంభాజీయను 3 సంవత్సరముల సుతుఁడునునుండిరి.

రాజారాముగారి యనంతరమునందు తారాబాయి తనపుత్రునిని సింహాసనమునం దునిచి, తాను రామచంద్రపంతు, శంకరాజీ, నారాయణ, దనాజీ, జాధవ్ మొదలగు ప్రధానుల సహాయమున రాజ్యము చేయుచుండెను. ఆమె యొక్కస్థలముననే కూర్చుండియుండక ప్రతికోటకును దానే