అబద్ధాల వేట - నిజాల బాట/రాజకీయాల్లో కులం: హేతువాదు లేమంటారు?

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
రాజకీయాల్లో కులం: హేతువాదు లేమంటారు?

ఎక్కడ చూచినా కులం, తప్పించుకోడానికి వీల్లేని తీరులో కులం, పుట్తినదగ్గర నుండీ చనిపోయేవరకూ కులం. దీన్ని గురించి హేతువాదులు మాట్లాడరా? అని ప్రశ్న ఉదయిస్తున్నది.

సమాజం ఎదుర్కొంటున్న ఏ సమస్యనుండీ హేతువాదులు పారిపోరు. నిశితంగా, శాస్త్రీయంగా పరిశీలిస్తారు. పరిష్కారాలు సూచిస్తారు. అవి చేదుగా వుండొచ్చు, ఎదురీత కావచ్చు. అబద్దాల వేట హేతువాదులకు అలవాటే. కులం విషయంలోనూ అంతే.

కులసమస్య కొన్ని వేల సంవత్సరాలుగా వుంది. ఇప్పుడు కొత్తగా చెప్పేదేమిటి? అని అడగొచ్చు. బ్రిటిష్ వారి పాలన నుండీ కులానికి కొత్త అంటురోగం వచ్చింది. రాజకీయాల్లో, పరిపాలనలో కులం ప్రవేశించింది. ప్రజలందరికీ కావలసిన రంగంలో కీలకవ్యక్తులు వుంటూ కులాన్ని పాటిస్తే ప్రమాదకర పరిణామాలు వస్తునాయి. కనుక రాజకీయాల్లో కులం గురించి విప్పి చెప్పవలసి వస్తున్నది.

కులం మనదేశానికి ప్రత్యేక లక్షణం. హిందూమతానికి పుట్టిన విషపుత్రిక కులం. దీని కవల పిల్లే అంటరానితనం. మానవ హక్కులకు, మానవ సమానత్వానికీ,గౌరవానికీ, ఏ మాత్రం విలువ యివ్వకుండా పుట్టిన కులాన్ని మతపరంగా కట్టుదిట్టం చేసినందున అది వ్యాపించి, ఘోర పరిణామాలకు దారితీసింది.

వేదాలలోని "పురుషసూక్తం" లోనే వర్ణ విభజన ప్రస్తావించారు. ఆ తరువాత వర్ణవ్యవస్థ "గీత" లో స్పష్టంగా చెప్పి, నేనే నాలుగు వర్ణాల్ని సృష్టించానని కృష్ణుడు చెప్పాడు. ధర్మశాస్త్రాలన్నీ వర్ణవ్యవస్థను ఎలా పాటించాలో వివరంగా పేర్కొన్నాయి. హిందువులు పవిత్ర గ్రంథాలుగా పేర్కొన్న గ్రంథాలలో యిలా వచ్చిన వర్ణ వ్యవస్థను ఆర్యసమాజ్ వారు సమర్థిస్తూ,వేదాలలో పేర్కొన్న వర్ణ వ్యవస్థ కులం కాదని భాష్యం చెప్పారు. అంబేద్కర్ సుదీర్ఘంగా చూచి వర్ణవ్యవస్తే కులం అని నిగ్గు తేల్చారు.

"వివేకచూడామణి" లో ఆదిశంకరాచార్యులు కుల ప్రస్తావన తెచ్చి,అన్ని జన్మలలో మానవజన్మ ఉత్తమమైతే బ్రాహ్మణజన్మ మరీ ఉత్తమమనీ అందులోనూ వైదికుల స్థాయి అత్యున్నతమనీ అన్నారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు కులాల్లో అనేక పిల్ల వూడలు బయలుదేరి బలపడ్డాయి. ఈ నాలుగు కులాలకూ దూరంగా అంటరానివారనే కులాన్ని అమానుషంగా సృష్టించిన తీరు అంబేద్కర్ వివరంగా చర్చించారు.

ఏ కులంవారు ఏమి చేయాలి? అనే వివరాలు ధర్మశాస్త్రాలు చర్చించి, హద్దు దాటితే ఎలాంటి శిక్షలు వేయాలో చెప్పాయి. కులంలోని హెచ్చుతగ్గులే శిక్షలలోనూ పాటించారు. కులవృత్తిని వీడకు గువ్వలచెన్నా అంటూ ప్రబోధించారు. కులాలలో చీలికలు వచ్చాయి. కొట్లాటలు సంభవించాయి. లెక్కించడానికి వీలుగానన్ని ఉపకులాలు బయలుదేరాయి. కాని మూలం దెబ్బ తినలేదు. కులాన్ని సమర్థించే మతం వున్నంతకాలం యీ బలం అలానే వుంటుందని రుజువైంది. వేదాలు పవిత్ర ప్రమాణ గ్రంథాలని, గీత చేతిలో పట్టుకొని ప్రార్థనలు చేస్తున్నంత కాలం కులం ఉంటుంది.

కులం అంటే ఏమిటి అని శాస్త్రీయంగా పరిశీలిస్తే నిలువదు. బ్రాహ్మణులలో, కమ్మ, రెడ్డి, కాపు, మాల మాదిగలలో రక్త పరిశీలన చెస్తే అన్ని కులాల్లో అన్ని రకాలైన రక్తం వున్నది. ఒకరి రక్తం మరొకరికి యిచ్చి ప్రమాదాలలో, ఆపరేషన్ల సందర్భాల్లో ఉపయోగిస్తే-కుల రక్తం లేదని, ఏ కుల రక్తమైనా మరొక కులానికి డాక్టర్లు వాడవచ్చనీ రుజువైంది. రంగును బట్టి కులం నిర్ధారించే వీల్లేదు. అన్ని రంగులవారు అన్ని కులాల్లోనూ వున్నారు. గుణాన్ని బట్టి, వంశపారంపర్యతను బట్టి అనడానికి ఆధారాలు లేవు. అన్ని లక్షణాలు, తెలివితేటలు, మూర్ఖత్వాలు అన్ని కులాల్లోనూ వున్నాయి. కనుక కులం ఏ పరిశీలనకూ నిలువదు.

కులం ప్రమాదాన్ని గుర్తించిన మత, సాంఘిక, రాజకీయ సంస్కర్తలు వున్నారు. కులం పోవాలని వారు ప్రచారం చేశారు, రాశారు, కులాంతర వివాహాలు ప్రోత్సహించారు. అంతవరకు బాగానే వున్నది. కులానికి మూలం మతం అనే విషయం వారికి తెలియకపోలేదు. అయినా మతం సంస్కరిస్తే చాలనుకుంటే వీలుకాలేదు. వేదాల్ని, ఇతిహాసాల్ని, గీతను, శంకరాచార్య రచనల్ని వీరు సంస్కరిస్తే మత మౌలికవాదులు ఒప్పుకుంటారా? మూలవేరును తొలగించకపోతే, అది పిలకలు పెడుతూనే పోయింది. మతం బ్రతికి వున్నన్నినాళ్ళు కులం చావదని సంస్కర్తలు గ్రహించలేదు. కనుక కులాన్ని ఎంత వ్యతిరేకించినా అది నిష్ప్రయోజనమే అయింది. కులం పోవాలన్న గాంధీజీ వర్ణవ్యవస్థ నేనే సృష్టించానన్న భగవద్గీతను బోధించారు. కులం పోవాలన్న ఆర్యసమాజ్ వర్ణవ్యవస్థ గల వేదాల్లోకి పోదామన్నది. వివేకానంద ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా కులాన్ని పాటించిన అద్వైతే. ఈ విధంగా సంస్కర్తలు మూలం జోలికి పోకుండా ప్రాకులాడి విఫలమయ్యారు. కులాంతర పెళ్ళిళ్ళు చేసుకున్న తరువాత కూడా, వారి సంతానానికి చట్టరీత్యా తండ్రి కులాన్ని పాటిస్తారు. ఇది మతరీత్యా వచ్చిందే. కులాంతర పెళ్ళి చెసుకున్న తరువాత చేసుకున్నవారికీ, వారి సంతానానికీ కులం వుండరాదు. అలా చట్టాల్ని మార్చుకోవాలి. పాలకులు మార్చలేదు. ఇది మత ప్రభావమే. కులాన్ని అధ్యయనం చేసి,విశ్లేషించి, విడమరచి చెప్పిన ఆధునికులలో యం.యన్.రాయ్, అంబేద్కర్, లోహియాలు పెర్కొనదగినవారు. వీరు మూలానికి పోయారు. మతం పోవాలన్నారు, అంటే హిందుమతం పాటించి నన్నాళ్లు కులం వుంటుందని సారాంశం. ఈ ధోరణికి భిన్నంగా మత సనాతనులు కులాన్ని సమర్ధిస్తున్నారు. ఇందులో శంకరమఠాలు ప్రాధాన్యత వహిస్తున్నాయి. ఈ శతాబ్దంలోనే కంచి శంకరాచార్య వాయిస్ డివైన్ వ్రాసి కులాన్ని హిందూమత ధర్మంగా సమర్ధించారు. కులాన్ని పోగొట్టలేనివారు అంటరానితనాన్ని రూపుమాపుతారనుకోవడం భ్రమ.

అంటరానితనం పాటించరాదని, అలా చేస్తే శిక్షార్హమని రాజ్యాంగంలో రాసుకున్నారు. అందుకు విరుద్ధంగా హిందూమతధర్మాల్ని పాటించే చట్టాలు చేశారు. ఆవును చంపరాదని ఆందోళనలు చెసి సాధించుకున్నారు. సతిని సమర్ధించే పూరి శంకరాచార్యుల్ని ఏమీ చేయలేకపోయారు. దేవాలయ ప్రవేశాన్ని అంటరానివారికి లేకుండా చేస్తున్న పురోహితుల్ని ఆపలేకపోయారు. కులాన్ని పాటిస్తున్న శంకరాచార్యుల మఠాల చుట్టూ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రదక్షిణలు చేస్తున్నారు. పెళ్ళిళ్ళల్లో కులం పాటిస్తున్నారు. మళ్ళీ కులసంఘాలు విజృంభించాయి.

కులం రాజకీయాల్లో, పరిపాలనలో ప్రవేశిస్తే కీలక స్థానాలల్లో కుల ప్రాధాన్యత వుంటే అనేక ప్రమాదకర పరిణామాలు వస్తాయని బ్రిటిష్ పాలకులు గ్రహించారు. కనుక కుల ప్రాధాన్యత తగ్గించాలనుకున్నారు. ఈ ప్రయత్నం 19వ శతాబ్దంలోనే బ్రిటిష్ వారు ఇండియాలో ఆరంభించారు. అయినా విఫలమయ్యారు. అదెలా జరిగిందో పరిశీలిద్దాం.

బ్రిటిష్ వారు నిరోధక ప్రయత్నాలు

బ్రిటిష్ పాలకులు వచ్చేనాటికి దేశంలో మతంపై పట్టు వున్నది బ్రాహ్మణులకే. మతానికి ఆయువుపట్టుగా వున్న దేవాలయాల్లో పురోహిత వర్గం బ్రాహ్మణులే. సమాజం మత ప్రభావంతో వుండేది. ఇది గ్రహించిన బ్రిటిష్ వారు, మతం జోలికి పోకుండా, పాలనారంగంలో జాగ్రత్తపడదలచారు. ఆనాటి పాలనలో కీలకస్థానం రెవిన్యూశాఖదే. గ్రామస్థాయిలో కరణాలు, మునసబ్ లు ప్రధానపాత్ర వహించారు. బ్రిటిష్ వారు ప్రతి వివరానికి కరణాలపై ఆధారపడవలసి వచ్చేది. మతరీత్యా చదువుకున్న వర్గం బ్రాహ్మణులే. మిగిలిన కులాల వృత్తులు వేరు. ఇది పరంపరగా వచ్చింది. బ్రిటిష్ వారి రాకతో బ్రాహ్మణులు ఉద్యోగాల్లో ప్రవేశించారు. మన రాష్ట్రంలోకి తొలుత తమిళనాడు, మహారాష్ట్ర బ్రాహ్మణులు ఉద్యోగరీత్యా వచ్చారు. వారి ప్రాబల్యం చూచి బ్రిటిష్ వారు ఉత్తరువులు జారిచేయాల్సిన స్థితి ఏర్పడింది.

కమ్యూనల్ జి.ఓ.1851లోనే

వివిధ కులాలకు ఉద్యోగాలలో ప్రాతినిధ్యం వుండాలంటూ 1851లోనే బ్రిటిష్ పాలకులు ఉత్తరువు జారిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిని స్టాందింగ్ ఆర్డర్-నెంబరు 128 క్లాజు 2 అంటారు. రాష్ట్ర జనాభాలో 3.2 శాతం వున్న బ్రాహ్మణులు రెవిన్యూ శాఖలో ఆధిపత్యం వహించారు. ఉత్తరువు అమలుజరిగే తీరు ఆర్నెల్లకొకసారి పరిశీలించమన్నారు. ఈ స్థితి ఎందుకు వచ్చింది? అనంతపురంలో హుజూర్ తహసీల్ దారుగా వున్న కృష్ణారావు అనే బ్రాహ్మణాధికారి తన వారిని 108 మందిని వివిధ ఉద్యోగాలలో ప్రవేశపెట్టాడు. ఇందుకు శిక్షగా ఆయనను కడపకు బదిలి చేశారు. అక్కడ 117 మందిని తన కులంవారిని ఉద్యోగాలలో వేసుకున్నాడు. కేవలం తన కుటుంబాలకు చెందినవారే 80 మంది వున్నారు. కృష్ణారావును పోలిన సంఘటనలే గోదావరి, కృష్ణా జిల్లాలలోను బ్రిటీష్ వారు గమనించారు. బ్రిటీష్ వారి ఉత్తరువు కాగితాలపై వున్నదేగాని ఖచ్చితంగా అమలు జరగలేదు.

(ఆసక్తికరమైన వివరాలకు-ఆర్.ఇ.ఫ్రికన్ బర్గం పుస్తకం గుంటూరు డిస్ట్రిక్ట్-ఆక్స్ఫర్డ్ ప్రచురణ 1965 చూడండి.)

దేవాలయాలకు, మఠాలకు ఆస్తిపాస్తులుండేవి. వాటిపై స్థానిక అగ్రకులాల వారి ఆధిపత్యం వుండగా, ప్రతి సలహాకు పురోహితులపై ఆధారపడేవారు. ఆస్తుల విషయంలో యెన్నో కలహాలు వచ్చాయి. అయినా బ్రిటీష్ వారు దేవాలయాల జోలికి పోరాదని నిర్ణయించుకున్నారు. స్థానిక పరిపాలన బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారు. అప్పట్లో పన్నులు వసూలు చేసుకోవడంలోనే వారు ఆసక్తి చూపారు. ఈ రంగంలో కూడా వంశపారంపర్యంగా కులరీత్యా వున్న కరణాలు, మునసబులే గ్రామాలలో ఆధిపత్యం వహించారు. బ్రిటిష్ వారికి ఈ కులాధిపతులపై ఆధారపడడం తప్పనిసరైంది. బ్రిటిష్ వారిచ్చిన ఉత్తర్వులు అమలు జరగకుండా కులం అడుగడుగునా అడ్డుపడింది. నెల్లూరు జిల్లాలో జి.వెంకటరమణయ్య(నియోగి) తన కులం వారికి 49 మందికి రెవిన్యూశాఖలో ఉద్యోగాలిచ్చినట్లు తెలుసుకున్నారు. 1893-95 మధ్య ఉద్యోగాలలో బ్రాహ్మణులే అత్యధిక సంఖ్యలో వున్నారని గ్రహించారు. కనుక ప్రభుత్వమే చొరవ తీసుకొని 1896-1911 మధ్య బ్రాహ్మణేతర అగ్రకులాల వారికి ఉద్యోగాలిచ్చారు. 1851లో యిచ్చిన ఉత్తరువు 60 సంవత్సరాలు అమలు జరగకుండా వుండిపోగా, 1912లో మరొకసారి గట్టి ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఉద్యోగాల పరీక్షకు పోటీలో 1892-1904 మధ్య 16 ఉద్యోగాలలో 15 బ్రాహ్మణులకే దక్కాయి. చదువులలోనూ, ఉద్యోగాలలోనూ బ్రాహ్మణులదే అగ్రస్థానం అయింది. కళాశాల హాస్టళ్ళలో బ్రాహ్మణ, బ్రాహ్మణేతర హాస్టళ్ళు పెట్టుకున్నారు. కాపు, రెడ్డి, కమ్మ, క్షత్రియ, రాజు, వైశ్య కులాలు వారు క్రమేణా తమ కులసంఘాలు పెట్టుకోనారంభించారు. మరోప్రక్క రాజకీయాల్లో కాంగ్రెసుపార్టీ కూడా బ్రాహ్మణాధిపత్య నాయకత్వంలో వుంది.

జస్టిస్ పార్టీ కుల రాజకీయాలు

కాంగ్రెసులో బ్రాహ్మణ నాయకత్వానికి వ్యతిరేకంగా బ్రిటీష్ వారికి అనుకూలమైన జస్టిస్ పార్టీ పుట్టడానికి పరిస్థితులు సానుకూలించాయి. మద్రాసు రాష్ట్రంలో వున్న ఆంధ్రులు యిందుకుగాను తమిళులతో చేతులు కలిపారు. కాంగ్రెసు లో బ్రాహ్మణులు మధ్య నియోగి- వైదిక స్పర్థలు ఒక వైపున వుండగా, ఆంధ్ర-అరవ బ్రాహ్మణుల మధ్య కలహాలు మరోవైపు సాగాయి. ఇందులో దివ్యజ్ఞాన సమాజ నాయకురాలు అనిబిసెంట్ అరవ బ్రాహ్మణ కోపు వేసుకున్నది.

1912లో నటేశ మొదలియార్ ద్రావిడ సంఘాన్ని స్థాపించారు. ద్రావిడ సాహిత్య ప్రచురణ జరిగింది. బ్రాహ్మణేతర హాస్టళ్ళను ప్రోత్సహించారు. 1916లో దక్షిణ ప్రజాసంఘం వచ్చింది.

జస్టిస్ పార్టీకి నాంది పలికారు. అధికారంలోకి రావాలనే ఆకాంక్ష యిందులో వుంది. ఆంధ్ర, తమిళ బ్రాహ్మణేతరులు కలిసి 1916లో యీ పార్టీని స్థాపించారు. బ్రిటీష్ వారి ఆశీర్వచనం వీరికి వుంది.

జస్టిస్ పార్టీ పుట్టేనాటికి రూరల్ బోర్డులు, తాలూకా బోర్డులు రాగా, ఆ తరువాత జిల్లా బోర్డులు వచ్చాయి. స్థానిక సంస్థలలో తమ ఆధిపత్యానికి ఆయా అగ్రనాయకులు ప్రయత్నించారు.

జస్టిస్ పార్టీ అధికారానికి వచ్చిన తరువాత కొత్తకుల రాజకీయాలు వచ్చాయి. బ్రాహ్మణేతర పార్టీగా పేరు తెచ్చుకున్న పార్టీ బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ద్వేషించింది గాని, బ్రాహ్మణత్వాన్ని అనుకరించింది. బ్రాహ్మణుల వలె తామూ కావ్యాలు రాయగలమని,మంత్రాలు చెప్పగలమని, పాండిత్యం ప్రదర్శించగలమని నిరూపించదలచారు. అలాగే అనేక పుస్తకాలు వచ్చాయి. అన్ని రంగాలలో బ్రాహ్మణులను అనుకరించారు. పెళ్ళిళ్ళలో పౌరోహిత్యం చేయించారు. దీనివలన కమ్మ బ్రాహ్మణులనే పేరు కూడా వచ్చింది. మిగిలిన వారి కంటె కమ్మకులంవారు బ్రాహ్మణులతో బాగా పోటీపడ్డారు. కనుక వృత్తిరీత్యా తమ భృతిని దెబ్బతీశారనే కోపం బ్రాహ్మణులకు సహజంగానే కమ్మవారిపై ప్రబలింది. రెడ్లు, క్షత్రియలు, రాజులు, కాపులు అధికారం కోసం తిప్పలుపడినా వృత్తిరీత్యా బ్రాహ్మణులతో తారసిల్లలేదు. బ్రాహ్మణ, కమ్మద్వేషం బాగా ప్రబలి, నాటుకపోయింది. జస్టిస్ పార్టీలో నాయకులు, ముఖ్యంగా పానగల్లు రాజా అవసరమైతే బ్రాహ్మణుల సహాయం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. బొబ్బిలిరాజా జస్టిస్ పార్టీలో బ్రాహ్మణుల్ని చేర్చుకోవాలన్నారు. మునిస్వామి నాయుడు కమ్మ ముఖ్యమంత్రిగా జమీందారులైన రాజులు, క్షత్రియులపై పోరాడారు. జస్టిస్ పార్టీలోని బ్రాహ్మణేతరులు, ముఖ్యంగా రాజులు, క్షత్రియులు ఒక వైపు, కమ్మ మరోప్రక్క కొట్టుకున్నారు.

దేవాలయంపై బ్రాహ్మణులకు వున్న పట్టు తప్పించాలని జస్టిస్ పార్టీ ప్రయత్నించి విఫలమైంది. అధికారంలో మంత్రులుగా జస్టిస్ పార్టీవారున్నప్పటికీ, కీలక ఉద్యోగాలలో ఐ.పి.యస్. అధికార్లలో బ్రాహ్మణులు ఎప్పటికప్పుడూ జస్టిస్ వారికి అడ్డుపడుతూ వచ్చారు. సాధ్యమైనంతవరకు జస్టిస్ పార్టీవారు తమ కులాల్ని ప్రోత్సాహించి, పెంచి పోషించారు. విద్యారంగంలో, హాస్టళ్ళలో కులరీతులు విస్తరిల్లాయి. స్థానిక సంస్థలలో ఉద్యోగాలు, పదవులు, కులరీత్యా పంపిణీ జరిగింది. అలా వీలులేనిచోట అవసరమైతే ఎన్నికలు వాయిదావేసి, నామినేట్ చేసిన సందర్భాలున్నాయి. బ్రాహ్మణులు జస్టిస్ పార్టీకి దూరంగా వుండగా, కాంగ్రెస్ లో ఉత్తరోత్తరా ప్రముఖపాత్ర వహించిన కమ్మవారు జస్టిస్ పార్టీకి సుముఖంగా వున్నారు.

కాంగ్రెసులో అన్ని కులాల వారున్నప్పటికీ పెత్తనం బ్రాహ్మణులదే. స్వాతంత్ర్యం వచ్చేవరకూ అదే స్థితి కొనసాగింది. అయితే అందులో ఏకత్వం లేదు. వైదికనియోగ కలహాలు సంభవించాయి. ప్రకాశం-పట్టాభి రాజకీయాలన్నీ యీ బ్రాహ్మణశాఖల పరంగానే సాగాయి. అలాగే కొండా వెంకటప్పయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు మొదలైన నాయకులు, వి.వి.గిరి, తెన్నేటి విశ్వనాథం, కళా వెంకటరావు ప్రభృతులు యీ కలహ పురాణాల్లో రాజకీయాలు నడిపారు. కాంగ్రెసులో యీ బ్రాహ్మణ నాయకత్వాల చుట్టూ మిగిలిన అగ్రకులాలు పరిభ్రమించాయి. ఎన్నికలలో అభ్యర్థుల ఎంపికలోనూ యివి పనిచేశాయి.

జస్టిస్ పార్టీ 1937లో అంతమైన తరువాత క్రమంగా కాంగ్రెసులో చేరిన జమీందార్లు, పెద్ద రైతులు, బాబులు, ఆయా నాయకుల్ని ఆశ్రయించారు. జైళ్ళకు కూడా కులరాజకీయాల్ని మోసుకెళ్ళారు.

అధికారం కోసం కులాన్ని అడ్డం పెట్టుకొని కొట్టుకున్నారేగాని, అందరి సంక్షేమం కొరకు కాదని గ్రహించాలి. ఈ కుంపటి యజ్ఞంలో కొందరు కులాల పేరిట చదువుకొని, ఉద్యోగాలు సంపాదించి, ఆర్థికంగా బాగుపడి వుండొచ్చు. కాని సమాజంలో ఉత్తరోత్తరా ప్రబలిన కులద్వేషాలకు యివి దోహదం చేశాయి. ఆజ్యం పోశాయి. రాజకీయాల్లో కులాన్ని ప్రవేశపెట్టిన పాప ఫలితమే య్దంతా.

ఫిర్కా సంస్కరణ ద్వారా ఉద్ధరించాలని పథకం వేసిన టంగుటూరి ప్రకాశం, మద్రాసు ప్రభుత్వాధినేతగా అందరూ బ్రాహ్మణులనే ఫిర్కాస్కీంలో నియమించారు. ఇతర కులమంత్రులు తమ చేతనైనంతగా తమ కులంవారికి తోడ్పడ్డారు. ఎవరికి వారే కులాధిపతులుగా చలామణి అయ్యారు.

స్వాతంత్ర్యం వచ్చే నాటికి యిదీ కుల రాజకీయాల పరిస్థితి! కులసంఘాలు ఏర్పడి, తీర్మానాలు చేశాయి. కాని కులం పోగొట్టుకోవాలనే వామపక్ష ధోరణులు కూడా అప్పుడే వచ్చాయి. కులాంతర వివాహాలు జరిగాయి. పురోహితుడుకాని, మంత్రాలుకాని లేకుండా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కాని వారి సంతానానికి కులం పోగొట్టలేకపోయారు.

అంటరానితనం పోవాలనే కార్యక్రమం చేబట్టిన వారు కూడా పైపైన ఏదో పనులు చేశారుగాని, మూలం మతం రీత్యా వుందని గ్రహించారు. వెనుకబడిన కులాలవారు సైతం అంటరానివారిని కలుపుకోలేక పోయారు. అందరికీ ఓట్లు వచ్చిన దృష్ట్యా అంటరానివారికి అత్యంత ప్రాధాన్యత యిచ్చి, రిజర్వేషన్ లకు ఒప్పుకున్నారు. వారి ఓట్లకోసం అనేక ఆకర్షణలు విసిరారేగాని, అంటరానితనం పోగొట్టడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించలేదు. ప్రయత్నించరు కూడా.

తెలంగాణా ప్రాంతంలో బూర్గుల రామకృష్ణారావు-కొండా వెంకటరంగారెడ్డి కొట్లాటలు,రావు, రెడ్డి ముఠాల పేరిట బ్రాహ్మణ-రెడ్డి కలహాలు రాజకీయాల్లో ప్రవేశించాయి. ఆంధ్రతో కలిసే వరకూ యీ కులపోరాటాలు రాజకీయాల్లో సాగాయి. ఇందులో మహారాష్ట్ర, కర్నాటక వారు కూడా చేతులు కలిపారు.

మద్రాసు నుండి విడిపోయి ఆంధ్ర ఏర్పడినప్పుడు రెడ్డి నాయకత్వం జాగ్రత్తగా బ్రాహ్మణుల్ని కలుపుకున్నది. టంగుటూరి ప్రకాశాన్ని అడ్డం పెట్టుకుని సంజీవరెడ్డి పాలన సాగించారు. బెజవాడ గోపాలరెడ్డి ఈ సమరంలో సంజీవరెడ్డికి లొంగిపోయాడు. కమ్మ నాయకత్వం కోసం రంగాచేసిన కృషి, బ్రాహ్మణ ఆధిపత్యానికి బూర్గుల రామకృష్ణారావు ప్రయత్నం విఫలమయింది. తెలంగాణా ఆంధ్ర కలిసేసరికిరెడ్డి నాయకత్వం బలపడింది. ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి నాయకత్వం తిరుగులేనిదిగా ప్రారంభమైంది.

ముఖ్యమంత్రి పదవి కీలకమైంది. అధికారం చేజిక్కించుకుంటే మిగిలినవి సమకూర్చు కోవడం సులభం. కులాన్ని బలపరచడమూ సాధ్యమే. ముఖ్యమంత్రి కులానికి ప్రాధాన్యత వస్తుంది. "మన వాళ్ళకు" పనులు జరుగుతాయి. ఇతర కులాలవారికి కొంత మేత పడేసి అట్టిపెట్టవచ్చు. రాజకీయాల్లో ప్రవేశించిన కులం, పరిపాలనలో, న్యాయవ్యవస్థలోనూ ప్రాకింది. ఆంధ్రప్రదేశ్ లో వున్నతంతు ఇతర రాష్ట్రాలలోనూ వుండేవి. సంజీవరెడ్డి, బ్రాహ్మానందరెడ్డి, చెన్నారెడ్డి, అంజయ్య, విజయభాస్కరరెడ్డి, భవనం వెంకట్రామ్, జనార్ధనరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా రెడ్డి కులాన్ని జాగ్రత్త చూచుకోగలిగారు. సంజీవయ్య రాజీ అభ్యర్ధిగా ముఖ్యమంత్రి అయినందున అట్టే చేయలేకపోయారు. వెంగళరావు వెలమలకు సేవచేసినా వారి సంఖ్యాబలం తక్కువ అయినందున అట్టే రాలేదు. పి.వి. నరసింహారావు ముఖ్యమంత్రిగా బ్రాహ్మణ రాజ్యస్థాపనకు కృషి చేశారు. వర్ణవ్యవస్థ కావాలన్న విశ్వనాధ సత్యనారాయణ పుస్తకాలు కొనిపించడంతో బాటు, వేయిపడగలు హిందీలోనికి అనువదించడం, పురోహితవర్గాన్ని కొమ్ముకాయడం వంటివి చేయగలిగారు. కేంద్రంలో ఇందిరాగాంధి తెలివిగా అంటరాని కులోద్ధరణ కార్యక్రమాలు చేబట్టి ఓట్లు దండుకోగా, రాష్ట్రాలలో అది బాగా ఉపయోగపడింది. బ్రాహ్మణేతర అగ్రకులాలకు వ్యతిరేకంగా హరిజనులు, బ్రాహ్మణులు కలవడం పెద్ద వ్యూహమే. ఇందిరాగాంధి తమ ఉద్ధరణకై చిత్తశుద్ధితో పనిచేసిందని నమ్మేవారూ, పి.వి. నరసింహారావు నాయకత్వాన్ని అంగీకరించే షెడ్యూలు కులాల వారూ యీ వ్యూహంలో పడి కొట్టుకుంటున్నవారే! రాష్ట్ర ముఖ్యమంత్రిగా యన్.టి.రామారావు వున్నప్పుడు కమ్మకులానికి యెక్కడలేని ప్రాధాన్యత వచ్చింది. మారుమూలనున్న వారిని వెతికి తెచ్చి పదవులు కట్టిపెట్టారు. కమ్మ రాజ్యస్థాపనకు రామారావు కృషి చేశారు. రెడ్లు దీనిని వ్యతిరేకించారు. కాపులు యింకా విజృంభించి కమ్మద్వేషం పెంచుకున్నారు. వంగవీటి మోహనరంగా హత్యతో కాపు-కమ్మ ద్వేషం పరాకాష్టకు చేరింది. కర్ఫ్యూ కూడ ఆపలేని కలహాలు, హత్యలు జరిగాయి. కమ్మరాజ్యంలో కాపు సంఘాలు తామర తంపరగా వెలిశాయి. రెడ్లు, బ్రాహ్మణులు కాపులతో చేతులు కలిపారు. బ్రాహ్మణుల్ని దెబ్బతీసే ప్రయత్నంలో బౌద్ధాన్ని తిరగదోడడానికి రామారావు ప్రయత్నించారు. కంచి శంకరాచార్య మొదలు బ్రాహ్మణులు దినికి శాపనార్థాలు పెట్టారు. వంశపారంపర్యంగా వస్తున్న గ్రామాధికారులను తొలగించడానికి రామారావు చేసిన ప్రయత్నం కూడా బ్రాహ్మణుల్ని దెబ్బతీయడానికేనని మరో కమ్మ నాదెండ్ల భాస్కరరావును అడ్డం పెట్టుకొని తాత్కాలికంగా విఫలమైన తరువాత ఎన్నికలలో రెడ్డి-కాపు-బ్రాహ్మణ కలయికతో కమ్మనాయకత్వాన్ని వూడగొట్టగలిగారు.

రిజర్వేషన్ల పేరిట రాష్ట్రంలో, కేంద్రంలో జరిగే కాండ అంతా కులోద్ధరణకు ఉపకరించింది. ఓట్ల కోసం జరిగే ప్రయత్నంగా మిగిలింది తప్ప ఇందులో మరో దృష్టి కనిపించలేదు. మండల్ కమీషన్ నివేదికతో అగ్రకులాల నిజస్వరూపం బయటపడింది. కులాధిక్యతను మెరిట్ పేరిట వారు వెల్లడించారు. ఈ ధాటికి తక్కువ కులాలవారు నిలవలేకపోయారు. రాష్ట్రంలో మురళీధరన్ కమీషన్ నివేదిక అమలుపరుస్తానని రామారావు అన్నప్పుడే యీ అగ్రకులాల ధోరణి వెల్లడైంది. అదే దేశవ్యాప్తంగా కనిపించింది. అంబేద్కర్ పేరిట జరుగుతున్న మోసం కూడా యీ రీతిలోనే వున్నది. హిందూ మతం కులాన్ని కట్టుదిట్టం చేసింది గనుక అదిపోతేగాని కులం పోదని చెప్పిన అంబేద్కర్ రాజకీయ పార్టీలకు అవసరం లేదు. ఆయన్ని అడ్డం పెట్టుకొని విగ్రహాలు వేసి, ఆరాధనలు చేసి, దండలు వేసి, నినాదాలతో షెడ్యూలు కులాల వారిని ఆకర్షించే ప్రయత్నం అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఆ వూబిలో పడి కొట్టుకుంటున్న షెడ్యూలు కులాల నాయకులు నిజాన్ని గ్రహించలేక, వేసిన మేత వరకే తృప్తిపడుతున్నారు. అంటరానితనం వూరి వెలుపల అలాగే కొనసాగుతున్నది. మాల మాదిగ కొట్లాటలతో వారూ సతమతమౌతున్నారు. రాజకీయవాదులు యీ బలహీనతల్ని బాగా వాడుకుంటున్నారు. రాజ్యాంగంలో రాసుకున్న అంటరానితన నిషేదం అక్కడికే పరిమితమైంది. పదవులు పొందిన షెడ్యూలు కులాల నాయకులు ఉద్యోగాలలో వున్నవారు అంతవరకే చాలు అనుకుంటున్నారు. అంబేద్కర్ ను వీరు చదవలేదు, చదివినా అంతుపట్టలేదు. రాజకీయాలలో చాలాకాలం మోసం చేయవచ్చు అని షెడ్యూల్ కులాల వారు గ్రహించలేకపోవడం గమనార్హం. బుద్ధుడ్ని అవతారం చేసి చంపినట్లే అంబేద్కర్ ను హతమార్చేస్తున్నారు. ఇది మతపరంగా చాకచక్యంతో జరుగుతున్న కులయజ్ఞమే. ఒక మంత్రి లేదా శాసనసభ్యుడు శాసనాలు రాష్ట్ర ప్రజలందర్ని వుద్దేశించి చేస్తాడు. ఎన్నికలలో ప్రజలు ఓటర్లుగా పాల్గొంటారు. కనుక గెలిచినవారు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. రాజ్యాంగం మానవ హక్కుల్ని అంగీకరించి అందరికి న్యాయం చేకూర్చుతానంటుంది. అందులో కులప్రసక్తి లేదు కనుక మంత్రిగాని శాసనసభ్యుడు గాని కులసభకు వెళ్ళి పాల్గొని ప్రోత్సహించడం రాజ్యాంగవిరుద్ధం, అన్యాయం, నేరం కూడా. అందరికీ పరిపాలన అందించాల్సిన మంత్రి ఒక్క కులాన్ని సమర్ధించరాదు. మతం మనుషుల్ని గౌరవంగా చూడదు. మనుషులు దైవం కోసం బతకాలంటుంది. అన్ని మతాలు మానవ విలువలకు, హక్కులకు విరుద్ధమే. అందులో హిందూమతం ఒకటి. ఆ మతం ఇన్నాళ్ళూ కని, పెంచిన విషపుత్రికలే కులం, అంతరానితనం. పూర్వజన్మ సుకృతం,కర్మ అనే సిద్ధాంతాలను హిందూమతం ప్రవచించి ప్రబలింది. కులానికి అవే ఆధారం కనుక మతాన్ని పెరికి వేయకుండా,కులాన్ని మాత్రమే తెంచివేయాలంటే సరిపోదు. ఇది మూలరహస్యం.

మనదేశంలో మతాన్ని సంస్కరించాలని కొందరు ప్రయత్నించి విఫలమయ్యారు. కులాన్ని పోగొట్టాలని మరికొందరు కృషిచేసే విఫలమయ్యారు. మూలానికి పోకుండా తాత్కాలికంగా పైపై ప్రయోజనాలకై పనులు చేస్తే యిలాగే వుంటుంది.

మతం మార్చి, బౌద్ధ, ఇస్లాం, క్రైస్తవ మతాల్లోకి కొందరు మారారు. కాని వారితో బాటుగా కులాన్ని తీసుకువెళ్ళారు. క్రైస్తవ దేవాలయాలలో అగ్రకులాలు, అంటరానివారు వేరుగా కూర్చుంటున్న సందర్భాలు చూచాం. పెళ్ళిళ్ళలోనూ యిలాగే జరుగుతున్నది. అయితే యిది ప్రధానాంశం కాదు.

హిందూమతంలో వుంటూ, వేద ప్రమాణాన్ని అంగీకరించి, గీతాబోధన సరయినదనే వారు కులాన్ని పోగొట్టడం అసాధ్యం. మతం-కులం విడదీయరానంతగా పెనవేసుకపోయాయి. కులాన్ని మాత్రమే తొలగించాలని కమ్యూనిస్టులు, సోషలిస్టు కుల నిర్మూలన సంఘాలవారు ప్రయత్నించి విఫలమయ్యారు. మతం జోలికి యెవరూ పోలేదు. అంబేద్కర్ మాత్రమే కొంతవరకు యీ ప్రయత్నం చేసి, బౌద్ధంలో అంటరానితనం, కులం వుండదు గనుక అది స్వీకరించమన్నాడు. ఆయన చెప్పిన బౌద్ధాన్ని యీ దేశంలో ఏనాడో చంపేశారు. మిగిలినదల్లా క్షీణించిన హీనయాన మహాయాన వజ్రాయాన జాడ్యాలన్నీ అందులో వున్నాయి. కనుకనే బౌద్ధంలోకి మారిన షెడ్యూల్ కులాల వారి స్థితి ఏ మాత్రం మారలేదు. మతాలన్నీ మానవుడికి కొరముట్టుగా చూస్తాయే గాని వ్యక్తిత్వపు విలువ యిచ్చి చూడవు. మతం మానవ వ్యతిరేకి, మానవద్వేషి.

కులం పోగొట్టడమనేది యెదురీత కార్యక్రమం. మతంతో ముడిపడి వున్న యీ సమస్యను దీర్ఘకాలికంగా పరిష్కరించాలి. ప్రారంభం యిప్పుడే చేయవచ్చు. చదువుకున్నవారిలో యీ మార్పు ప్రారంభం కావాలి. అదేమంత సులభం కాదు. శాస్త్రబద్ధతకు, హేతువుకు దూరమైన కులాన్ని గుడ్డిగా నమ్మి ఆచరిస్తున్న వారికి నచ్చజెప్పడానికి పెద్ద కృషి జరగాలి.

ఏం జరగాలి?

పేర్లలో కులాన్ని సూచించడం మానాలి. ఇకముందు అలాంటి పేర్లు పెట్టవద్దని తల్లిదండ్రులకు చెప్పాలి. శాస్త్రి, శర్మ, రెడ్డి, కమ్మ,నాయుడు ఇత్యాదులు పేర్లకు తగిలించుకోరాదు. కుల సభలకు, సమావేశాలకు ప్రజా ప్రతినిధులు వెళ్ళరాదు. వాటిని నిరసించాలి. ప్రభుత్వం ఏ స్థాయిలోనూ వాటికి గుర్తింపు యివ్వరాదు. వాటి కట్టడాలకు అనుమతి నిరాకరించాలి.

కులబోధన చేసే అంశాలు పాఠాలలో రాకుండా చూడాలి. కులచరిత్ర చెప్పి కుల విషబీజాల్ని పిల్లలకు విడమరచాలి.

కులాంతర వివాహాలు చేసుకున్నవారికి కులం పాటించరాదు. వారి సంతానానికీ అంతే. అలా వివాహాలు చెసుకున్నవారు ప్రస్తుతం తమ సంతానానికి తండ్రి కులాన్ని పాటిస్తున్నారు. రిజర్వేషన్ల లాభాలు పొందే నిమిత్తం కొందరు దుర్వినియోగం చేస్తున్నారు.

కులాంతర వివాహాలకు అత్యధికంగా,అపరితంగా ప్రభుత్వ ప్రోత్సాహం లభించాలి. ఆర్ధికంగా,సామాజికంగా అనేక విధాల యీ సహాయం వుంటే త్వరగా కులాంతర వివాహాలకు ప్రోత్సాహం లభిస్తుంది.

కులాన్ని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రోత్సహించే మత క్రతువులు,మంత్ర తంత్రాలు నిరసించాలి. కులాన్ని బట్టి వివాహాలలో మంత్రాలు చదివే తీరుకు అభ్యంతరం రావాలి.

కంచి కానుకోటి పీఠాధిపతి ఆశ్రమంలో నేటికీ స్మార్త బ్రాహ్మణులే వంటకు అర్హులని అగేహానందభారతి రాశారు. అలా కులాన్ని పాటించే ఆశ్రమాలను అధికారంలో వున్న రాష్ట్రపతి, ప్రధాని మొదలైనవారు బహిష్కరించాలి. ఇందుకు విరుద్ధంగా నేడు వీరక్కడకు వెళ్ళి పాదాక్రాంతులౌతున్నారు. ఈ దారుణం ఆపాలి.

కుల, మతపరమైన ఆస్తులకు పన్నుల మినహాయింపు ఎలాంటి స్థితిలోనూ యివ్వరాదు. ఇవి వ్యాపార పద్ధతులుగా స్వీకరించి, పన్నులు వేసి వసూలు చెయ్యాలి. ఈ నియమం ఆశ్రమాలకు,దేవాలయాలకు, వక్ఫ్ బోర్డులకు, బాబాలకు, మాతాశ్రమాలకు విధిగా అంవయించాలి.

కులం పేరెత్తడం సిగ్గుచేటుగా చూచే అలవాటు రావాలి.

ఇదీ వేయాల్సిన ప్రశ్న

నీవు హిందువు కావచ్చు,ముస్లిం కావచ్చు,క్రైస్తవుడవు కావచ్చు, మనిషివి ఎప్పుడౌతావు?

నీవు బ్రాహ్మణుడవు, క్షత్రియుడవు, వైశ్య, కమ్మ, రెడ్డి, కాపు, వెలను, షెడ్యూల్ కులం కావచ్చు. మనిషిగా ఎప్పుడు మారతావు?

ఇవీ రావాల్సిన ప్రశ్నలు


మనిషిని తక్కువచేసి చూసేవే మతాలు, కులాలు. మనిషిని మళ్ళీ మనిషిగా రూపొందించాలనేదే మానవవాదం. మనిషికి విలువ యిచ్చేదే మానవహక్కుల ఉద్యమం. మనిషి దైవంకోసం, మతం కోసం, మోక్షం కోసం బ్రతకాలనే భ్రమ తొలగాలి. ఈ మోసం యిక సాగనివ్వరాదు.

నా మతం గొప్పది, దాని ద్వారానే మోక్షానికి పోతారని, ఏ మతానికి ఆ మతం బోధిస్తున్నది. నేను నమ్మిన దేవుడే సర్వోత్తముడని భక్తులు నమ్ముతారు. మిగిలిన మతాలు, మిగిలిన దేవుళ్ళు తక్కువే అని అర్థం. ఆ దృష్టితోనే మత మార్పిడులు, మత కలహాలు వచ్చాయి. మత దూషణలు-కాఫిర్లు, మ్లేచ్ఛులు, పేగన్లులాంటి మాటలు వచ్చాయి.

కులమూ అంతే. ఎవరికి వారు నా కుల కట్టుబాటు మంచిది అనుకుంటారు. అన్నిటికంటె ఉత్తమమైన బ్రాహ్మణకులం వైపుకు యెదగాలని ప్రయత్నిస్తూ సంస్కృతీకరణ చేశారు. ఇదీ మతపరంగానే వచ్చింది.

మతం, కులం కట్టుబాట్లు లేకుంటే మానవుడు కట్టలు తెంచిన స్వేచ్ఛతో అరాచకత్వం సృష్టిస్తాడని భయపెట్టి, స్వర్గం, పాపం, నరకం, దేవుడు, మతం, కులం అనే భయంకర అమానుష ఆయుధాలు వాడారు.

మనిషి స్వేచ్ఛాపిపాసి. హేతుబద్దుడుగా ఆలోచించి,నిత్యమూ తెలుసుకుంటాడు. ఈ అన్వేషణలో ఇతరుల సహకారం స్వీకరిస్తాడు. ప్రకృతిలో మానవుడు సహకారజీవి. అతడి సహకార లక్షణాన్ని మతం, కులం చంపేశాయి. అసహనం పెంచాయి. దురభిమానానికి పాలుపోశాయి. మానవతత్వం మనుగడ సాగించాలంటే మతం, కులం పోవాలి. ఆలోచనను చంపేసే నమ్మకాలు కుల, మత, ఛాందసాలు నాశనం చేయాలి. అవి చరిత్రగా మిగలాలి. వాటికి వాస్తవికతను ఆపాదించిన దోషం తొలగించాలి. ఇదీ మన కర్తవ్యం. ఇందుకు శాస్త్రీయపద్ధతి ఒక్కటే ఆయుధం.

- హేతువాది, జనవరి 1992