అబద్ధాల వేట - నిజాల బాట/రచ్చగెలిచిన జర్నలిస్టు చింతామణి

వికీసోర్స్ నుండి
రచ్చగెలిచిన జర్నలిస్టు చింతామణి

తెలుగువాడేగాని తెలుగులో రాయలేదు. ఉన్నది హిందీ ప్రాంతంలో అయినా ఆ భాషరాలేదు, రాయలేదు! అదీ సి.వై. చింతామణి విశేషం.

భారత జర్నలిజంలో పోప్ అని పేరు తెచ్చుకున్న చిర్రావూరి యజ్ఞేశ్వర చింతామణిస్వాతంత్ర్యానికి ముందున్న సుప్రసిద్ధ జర్నలిస్టు. విజయనగరం సంస్కృతి, సంప్రదాయం పుణికి పుచ్చుకున్న చింతామణి 1880 ఏప్రిల్ 10 న పుట్టారు. ఆద్యంతాలు ఆయనిది ఇంగ్లీషు చదువు. రాతకోతలు అన్నీ అందులోనే సాగాయి. విజయనగరం మహరాజ కళాశాల విద్యాభాసం అయిన తరువాత చింతామణి తన జర్నలిస్ట్ అభిరుచి తెలుగు వీక్లీ ద్వారా కనబరచారు. అలాగే వైజాగ్ స్పెక్టేటర్ వారపత్రికలోనూ రాశారు. అలా ఆరంభమైన ఆంగ్ల రచనా వ్యాసంగం చింతామణి జర్నలిజానికి బాటలువేసింది.

బహుశ 18 సంవత్సరాలకే పత్రిక ఎడిటర్ అయిన ఖ్యాతి చింతామణికే దక్కుతుందేమో! 1898లో విజయనగరం నుండి వెలుబడిన ఇండియన్ హెరాల్డ్ సంపాదకుడుగా కొన్నాళ్ళు తన వ్యక్తిత్వాన్ని చూపారు. అక్కడ నుండి మద్రాసు వెళ్ళి మద్రాసు స్టాండర్డ్ లో చేరారు. జి.సుబ్రహ్మణ్య అయ్యర్ సంపాదకుడుగా వున్న ఆ పత్రికలో చింతామణి రాణించలేదు.

అలహాబాద్ కు ప్రవాసం వెళ్ళిన చింతామణి ఇంగ్లీషు జర్నలిజంలో అసమాన ప్రతిభ కనబరచి, లీడర్ అనే దినపత్రిక సంపాదకుడయ్యాడు. 1909లో మొదలైన సంపాదకత్వం 1941 వరకూ సాగి, ఆగింది. అన్నేళ్ళు అలహాబాద్ లోవున్నా చింతామణి హిందీ నేర్చుకోలేదు. ఇంగ్లీషులోనే ఈతకొట్టారు.

పత్రికకు అంకితమైన చింతామణి అన్ని పనులు చూసుకోవడమేగాక, నిర్దిష్టత కోసం ప్రయత్నించే వారు. పత్రిక రాగానే పొద్దున్నే రెడ్ పెన్సిల్ తీసుకొని తప్పులన్నీ చూపుతూ ఆఫీసుకు అందించేవారు. లీడర్ పత్రిక అలహాబాద్ నుండి వెలువడుతున్న రోజులలో ఉతత్రప్రదేశ్(నాడు ఉత్తర పరగనాలు)కు అదే రాజధాని. తరువాత లక్నోకు రాజధాని మారినా, పత్రిక మారలేదు.

కాంగ్రెస్ రాజకీయాలలో చింతామణికి సంబంధం సన్నిహితంగా వుండేది. అయితే ఆయన గోఖలే వర్గానికి చెందిన లిబరల్(ఉదారవాది). గాంధీకి,తిలక్ కు భిన్నంగా వున్న గోఖలే కాంగ్రెస్ లో మితవాదేగాక, అల్పసంఖ్యాకుడు కూడా. అయినా నిలదొక్కుకున్నాడు. లిబరల్ పక్షంలో గోఖలేకు గౌరవ పాత్రుడయ్యాడు. అభిప్రాయాలలో రాజీపడకుండా చింతామణి తన వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాడు.

జర్నలిస్ట్ గా, లీడర్ పత్రిక సంపాదకుడుగా కొనసాగుతూనే, ఎన్నికలలో నిలిచి, గెలిచి, ఉత్తరపరగణాలలో శాసనమండలికి చింతామణి వచ్చారు. 1920 నాటి మాట అది. గెలిచిన తరువాత విద్యామంత్రి అయ్యారు. ఆ ఎన్నికలలో కాంగ్రెసు బహిష్కరించగా,లిబరల్ పక్షం మాత్రం పాల్గొన్నది.

1921 జనవరిలో విద్యామంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చింతామణి 28 మాసాల అనంతరం ప్రభుత్వంతో, వైస్ ఛాన్సలర్ తో పేచీలు రాగా పదవికి రాజీనామా యిచ్చి చరిత్ర సృష్టించారు. 1923 ఏప్రిల్ 19న మంత్రి పదవి వదలిన చింతామణి, లీడర్ పత్రికా సంపాదకుడుగా తన జర్నలిస్ట్ యాత్ర కొనసాగించారు. 1930లో జరిగిన లండన్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని చింతామణి ప్రధాన పాత్ర వహించాడు. తరువాత జరిగిన లండన్ సమావేశాలలో గాంధీజీ పాల్గొనడానికి చింతామణి కీలకపాత్ర వహించాడు. చింతామణి అలవాట్లలో శాకాహారి అయినా, నిరంతరం సిగరెట్లు తాగి, కిల్లీలు నమిలేవాడు. అవి రెండూ ఆరోగ్యానికి చెరుపుగా మారాయి. అనారోగ్యం దాపురించి ఆయన పడుతున్నప్పుడు చింతామణి నేలమీద పడి దొర్లేవాడని ఆయన కుమారుడు గణేష్ విశ్వనాధ్ చెప్పారు. చనిపోయినప్పుడు మంచంమీద వుండరాదని నమ్మకం అట. అంతేగాక, నమ్మకాలు లేకుండా జీవితాన్ని ఆరంభించిన చింతామణి, రానురాను పూజాపునస్కారాలతో బాగా నమ్మకాలలో మునిగిపోవడానికి కారణం తెలియదని గణేష్ విశ్వనాధ్ అంటారు. చింతామణిచే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చక్కని ఉపన్యాసాలు యిప్పించిన ఘనత నాటి వైస్ ఛాన్సలర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దే. అలహాబాద్, బెనారస్ విశ్వవిద్యాలయాలు గౌరవ పట్టాలిచ్చాయి. నేటివలె సంతర్పణగాక, నాడు గౌరవ పట్టాలకు గౌరవం వుండేది.

అన్నట్లు చింతామణి చదువుకున్నది విజయనగరం మహారాజా కాలేజీలో కేవలం ఇంటర్ మాత్రమే!

ఆయన రచనలలో పుస్తక రూపం దాల్చినవి బహుకొద్ది. ఇండియన్ పాలిటిక్స్ అండ్ ది మ్యూటినీ; ఇండియన్ సోషల్ రిఫాం, స్పీచెస్ అండ్ రైటింగ్స్ ఆఫ్ సర్ ఫిరోజ్ షా మెహతా అనే పుస్తకాలున్నాయి. చింతామణి లేఖలు, పత్రాలు, పుస్తకాలు, డైరీలు అన్నీ ఢిల్లీలోని నేషనల్ ఆర్కైవ్స్ లో భద్రపరిచారు. బ్రిటిష్ ప్రభుత్వం చింతామణికి 1939 జూన్ లో సర్ బిరుదు యిచ్చింది. బ్రిటిష్ వారిని తగిన సందర్భాలలో విమర్శించడానికి ఆయన వెనుకాడలేదు. ఎం.ఆర్.మసానితో కలసి భారత రాజ్యాంగంపై వ్యాఖ్యానాలు రాశారు.

1941 జులై 1న చింతామణి మరణించారు. భారత జర్నలిజానికి గొప్ప నష్టం అని గాంధీజీ వ్యాఖ్యానించారు. అలహాబాద్ లో నేడు చింతామణి రోడ్ ఒకటి వున్నది. సుప్రీంకోర్టు తొలి రిజిస్ట్రార్ పి.నరసింహమూర్తితో వియ్యమందిన చింతామణి అద్యంతాలు జర్నలిస్ట్ కుటుంబాలతో సంబంధం పెట్టుకున్నారు. చింతామణి మనమడు రామకృష్ణ, సుప్రసిద్ధ జర్నలిస్ట్ జి.ఎస్.భార్గవ కుమార్తె ప్రొఫెసర్ పుష్పను వివాహమాడారు. వారంతా చింతామణి కీర్తి యినుమడింపజేసే ప్రయత్నాలలో వున్నారు.

- వార్త, 28 అక్టోబరు,2001