అబద్ధాల వేట - నిజాల బాట/మూర్ఛ రోగులకు మొక్కితే మోక్షం వస్తుందా ?

వికీసోర్స్ నుండి
మూర్ఛ రోగులకు మొక్కితే మోక్షం వస్తుందా?

రామకృష్ణ పరమహంసగా మారిన గదాధర్

యువకులు ఉద్రేకంగా వుండడం సహజం. వయోధర్మం కూడా. కొన్ని ఆదర్శాలతో ఉత్తేజితులు కావడం, వాటిని సాధించడానికి హింసకు సైతం వెనుదీయకపోవడం యువకులలో చూస్తాం. వివిధ రాజకీయ పార్టీలు యువకులను వాడుకోవడం కూడా గమనిస్తున్నాం. కాని యువతరం భక్తిమార్గంలో పడినా,భజనలు మొదలెట్టినా, పూజా పునస్కారాలలో మునిగిపోయినా ఆశ్చర్యపడాలి. ఇటీవల కొందరు యువతీయువకులు రామకృష్ణ ఆశ్రమాలకు, శభరిమలైకు, ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలకు ఆకర్షితులౌతున్నారు. అంటే యీ జాతిలో ఏదో పెద్ద లోపం వున్నదన్నమాట. ఈ లోపాలలో ఒకటి ఉపన్యాసాల వాగ్ధోరణిలో కొట్తుకుపోతూ, వాస్తవాలు తెలుసుకోకపోవడం. ఉదాహరణకు రామకృష్ణ పరమహంస, వివేకానంద గురించి ఎంతమందికి నిజాలు తెలుసు? అవి గ్రహించకుండా గుడ్డిగా పెద్దల్ని అనుకరించడం, ఆలోచనను చంపుకోవడం యువతరంలో రుగ్మతను సూచిస్తుంది. ఆ దృష్టితో రామకృష్ణ, వివేకానందలను గురించి కేవలము వాస్తవాలు దృష్టికి తెస్తాను.

రామకృష్ణ పరమహంస

రామకృష్ణకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధర్. తండ్రి క్షుధీరాం మధ్యతరగతి పురోహితుడు. గదాధర్ కు ఎనిమిదేళ్ళు వచ్చేసరికి తండ్రి చనిపోయాడు. పెద్దన్న రాంకుమార్ కూడా పౌరోహిత్యం చేసినా,కుటుంబం ఆర్ధికంగా చితికిపోయింది. గదాధర్ గ్రామంలోని పాఠశాలకు వెడుతుండేవాడు. ఇది హుగ్లీ జిల్లాలో వున్నది. కామార్జుకర్ గ్రామం సన్యాసులకు కూడలి. బర్ద్వాన్-నీలాచలం మధ్య వున్న ఈ గ్రామం మీదుగా సాధువులు, సన్యాసులు తరచు పయనిస్తుండేవారు. వారు సమీప సత్రంలో విడిది చేస్తుండేవారు. ఆ విధంగా గదాధర్ సాధువులను చూస్తుండేవాడు. తన కుమారుడు సాధువుల్లో కలసిపోతాడేమోనని తల్లి చంద్రమణి భయపడుతుండేది.

గదాధర్ ఇంట్లో కొందరికి మూర్ఛల జబ్బు వుండేది. మేనత్త రాంషేకు, గదాధర్ సోదరి కాత్యాయనికి మూర్ఛలు వచ్చేవి. హిస్టీరియాతో కూడ ఈమె బాధపడుతుండేది. కారణాలేవైనా, గదాధర్ కు కూడా యీ జబ్బులు సంక్రమించాయి. గదాధర్ బక్కప్రాణి. చదువు ఒంటపట్టలేదు. గదాధర్ కు చిన్నతనంలో హఠాత్తుగా ఫిట్స్ రావడం, పడిపోవడం గమనించిన గ్రామస్తులు అతడికి వాయురోగం వచ్చిందన్నారు. కారుమబ్బుల మధ్య మెరుపులు చూచినప్పుడు తొలుత గదాధర్ మూర్ఛవచ్చి పడిపోయాడు. అనూర్ అనే గ్రామానికి స్త్రీల వెంట వెడుతుండగా రోడ్డుమీద రెండో పర్యాయం మూర్ఛ వచ్చింది. స్వగ్రామంలో శివుడుగా నటిస్తున్నప్పుడు మూడోసారి మూర్ఛ వచ్చింది. (మూర్ఛల వివరాలకు శారదానంద "లీలా ప్రసంగ" చూడండి. 5 సంపుటాలు)

చిన్నతనం నుంచీ గదాధర్ కు కామప్రవృత్తి, చింతన ఎక్కువగా వుండేది. గ్రామ స్త్రీలు స్నానంచేసేచోటుకు తరుచు వెళ్ళగా, ఆడవాళ్ళు అభ్యంతరపెట్టారు. చెట్టుచాటున దాగి స్నానంచేసే స్త్రీలను చూచేవాడు. అది గమనించిన స్త్రీలు గదాధర్ తల్లికి చెప్పారు. ఆమె గదాధర్ ని చితక్కొట్టింది. అయినా స్త్రీల సాంగత్యం అంటే గదాధర్ కు మక్కువ తగ్గలేదు. పెళ్ళీ చేసుకోవాలనుకున్నాడు. కబుర్లు చెప్పి, పాటలు పాడి స్త్రీలను ఆకర్షించేవాడు. స్త్రీ వేషాలు వేసేవాడు. ఎక్కువగా స్త్రీలమధ్య గడిపేవాడు.

విపరీత కామవాంఛను అణుచుకోటానికి గదాధర్ చేసిన ప్రయత్నం అతడిని మరింత రోగగ్రస్తుణ్ని చేసింది. శారదను పెళ్ళాడి కూడా ఆమెను తల్లిగా చూడాలని ప్రయత్నించాడు. స్త్రీని చూస్తేనే గదాధర్ కు కామవాంఛ కలిగేది. అది అణచుకోడానికి తీవ్రప్రయత్నం చేసి మరింత రోగగ్రస్తుడైనాడు. ప్రతి స్త్రీని తల్లిగా భావిస్తేగాని కామవాంఛ అణగిపోయేది కాదు. రానురాను కామాన్ని తగ్గించుకోలేక, మెడలో ఒక ఉచ్చును తగిలించుకొని, కోరిక కలిగినప్పుడు ఉచ్చు బిగించుకొనేవాడు. బాధ భరించలేక మూర్ఛపోయేవాడు. అదలా ఉంచండి.

జాన్ బజార్ జమీందారీ కుటుంబానికి చెందిన రాష్ మణి 9 లక్షల రూపాయలతో దక్షిణేశ్వర్ లో దేవాలయ సముదాయాన్ని నిర్మించింది. అందులో జగదాంబ విగ్రహప్రతిష్టాపన చేయించి, అన్న భోగం ఏర్పరచాలని, బ్రాహ్మణ పురోహితుడిని నియమించాలని తలపెట్టింది. ఆమె శూద్రకులానికి చెందినదిగావడంతో బ్రాహ్మణులెవరూ ముందుకు రాలేదు. గదాధర్ అన్న రాంకుమార్ ఆమెకు సలహాయిస్తూ దేవాలయాన్ని బ్రాహ్మణులకు యిచ్చేస్తే సమస్య పరిష్కారమౌతుందన్నాడు. ఆమె ఆ సలహాను పాటించి రాంకుమార్ నే పురోహితునిగా నియమించింది. అతని వెంట గదాధర్ కూడా వూరు విడిచి దక్షిణేశ్వరానికి వచ్చేశాడు. పల్లెటూరు వాతావరణంలో పుట్టి పెరిగిన గదాధర్ కు అంతా కొత్తగా వింతగా వున్నది. తన అన్న పురోహితుడుగా జగదంబ విగ్రహ ప్రతిష్టాపన చేసినప్పటికీ, గదాధర్ మాత్రం బజార్లో అటుకులు కొని తిన్నాడే తప్ప, అన్న భోగంలో పాల్గొనలేదు. వైష్ణవ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన తాను జంతుబలి యిచ్చే శాక్తేయుల గుడిలో యిమడలేక, చివరకు ప్రసాదం కూడా స్వీకరించలేని స్థితిలో గదాధర్ సతమతమయ్యాడు. అన్న రాంకుమార్ ఎంత బ్రతిమిలాడినా గదాధర్ అంటరానితనాన్ని పాటించకుండా వుండలేకపోయాడు.(చూడండి లీలా ప్రసంగం)

తండ్రి తరువాత తండ్రివలె తనను చూస్తున్న పెద్దన్న రాంకుమార్ కూడా చనిపోయేసరికి,గదాధర్ మానసికంగా కుంగిపోయాడు. తనకంటె 31 సంవత్సరాల పెద్ద అయిన రాంకుమార్ మరణంతో, అసలే మూర్ఛలతో, రుగ్మతలతో బాధపడుతున్న గదాధర్ యింకా బలహీనపడ్డాడు.

దక్షిణేశ్వరంలో రాష్ మణి నిర్మించిన సత్రంలో సాధువులు తరచు వచ్చి బసచేస్తుండేవారు. గదాధర్ కు వారితో సంబంధం ఏర్పడింది. వారు చెఫ్ఫేది పాటించి, ఉపవాసాలంటూ, విశ్రాంతిలేని రాత్రులతో కాలం గడుపుతూ ఆరోగ్యం మరింత క్షీణింపజేసుకున్నాడు.

రాష్ మణి అల్లుడు మధురమోహన్ చాలా చురుకైనవాడు. ముందుచుాపుగలవాడు. గదాధర్ రోగలక్షణాలను పరిశీలించి వాటికి దివ్యత్వాన్ని అంటగట్టాడు. రాంకుమార్ వద్దని చెబుతున్నా వినకుండా గదాధర్ ను ఒక దేవాలయానికి పురోహితుడిని చేయించాడు. గదాధర్ మూర్ఛలు కేవలం మూర్ఛలు కావని, దైవలక్షణాలని మధురమోహన్ ప్రచారం చేశాడు. ఈలోగా గదాధర్ ఒక భైరవి వద్ద తాంత్రికవిద్యను అభ్యసించాడు. తన కామప్రవృత్తి అంతా తాంత్రికతతో తీర్చుకొన్నాడు. ఆధ్యాత్మిక చింతన,మధురప్రేమ పేరిట గదాధర్ తన కోర్కెల్ని తీర్చుకున్నాడు. భైరవి ప్రేరణ ప్రోత్సాహాలతో మధురమోహన్ ప్రచారంచేస్తూ, గదాధర్ దైవస్వరూపుడనీ, అవతారమని చెప్పాడు. ఈ విషయం నిర్ధారించటానికి ఒక సభ ఏర్పాటుచేశాడు. మధురబాబు చేతి చలవతో బ్రతుకుతున్న యిద్దరు పండితులు ఆ సభలో వున్నారు. అలాంటి వారంతా కలసి గదాధర్ ను అవతార పురుషుడన్నారు. మధురమోహన్ కథలు అల్లి,గదాధర్ ను రామకృష్ణుడని నామకరణం చేశాడు. తన కుటీరంలో నుంచి ఒకనాడు చూస్తుండగా, అటూ ఇటూ తిరుగుతున్న గదాధర్ తనవైపుకు వస్తుండగా కాళీకామాతగానూ, అటువైపు పోతుండగా సాక్షాత్తు శివుడుగానూ కనిపించాడనీ మధురబాబు చెప్పాడు. గదాధర్ అప్పటినుంచీ రామకృష్ణుడయ్యాడు. (చూడండి క్రిస్టోఫర్ ఈషర్ వుడ్ వ్రాసిన రామకృష్ణ అండ్ హిజ్ డిసైపుల్స్ పుట 54-1965) అంతటితో ఆగకుండా రామకృష్ణకు పరమహంస అని కూడా చేర్చి ప్రచారం చేశారు.

రామకృష్ణ కాళీ ఆలయ పురోహితుడుగా అతిగా నిష్టలు పాటించి,దేహాన్ని శిష్కింపచేస్తే, నరాల బలహీనత వలన, మూర్ఛలు రావడమే గాక, పిచ్చి లక్షణాలు కూడా స్పష్టపడ్డాయి. అలా పిచ్చెక్కినప్పుడు ఆయన్ను తాళ్ళతో కట్టేవారు. (చూడు:ధర్మప్రచారక్ 1384 ఆగస్టు 6) పురోహితుడుగా పిచ్చి లక్షణాలున్న రామకృష్ణను చూపి, అవన్నీ దైవలక్షణాలని చెప్పి, మధురబాబు బంధువు హృదయ్ డబ్బు వసూలు చేస్తుండేవాడు. వచ్చినవారికి యీ లక్షణాల ఔన్నత్యం చెబుతుండటం విని, రామకృష్ణ ఒక సందర్భంలో హృదయ్ ను బాగా చివాట్లు పెట్టాడు. అంతేగాక కఠోర నియమాల వలన తనకు మానసిక స్థితి బాగాలేదని,ఉన్మత్త లక్షణాలు వచ్చాయని కూడా రామకృష్ణ స్పష్టంగా ఒప్పుకున్నాడు.(చూడండి.శివనాధశాస్త్రి 'మెన్ ఐహేవ్ సీన్ పుట 103)

మధురమోహన్ యీ విధంగా ఎందుకు చేశాడు? అతడు జమీందారుడుగా కర్కోటకుడు. రైతుల్ని హింసించి, డబ్బు పిండేవాడు. హత్యలు, దోపిడీలు చేయించేవాడు. రైతులు యితనిపట్ల జుగుప్సతో వుండేవారు. కసి తిర్చుకోడానికి సిద్ధంగా వుండేవారు కూడా. అలా ఆగ్రహావేశులైన రైతుల వద్దకు వెడుతూ, రామకృష్ణను వెంటబెట్టుకొని పోయేవాడు మధురబాబు. మత మనస్తత్వంగల ప్రజలు, ఎవరో మహానుభావుడు వచ్చాడని, రామకృష్ణను చూస్తూ పూజిస్తూ వుంటే, మధురబాబు తన పని తాను చూచుకునేవాడు. మధురబాబు తనతోబాటుగా యితర జమిందార్లను కూడా రామకృష్ణ దగ్గరకు తెచ్చాడు. అలా సన్నిహితమైన జమీందార్లలో బలరాంబసు ఒకడు. జమీందార్లు తమ నిరంకుశ పాలనకు రామకృష్ణను అడ్డం పెట్టుకుని వాడుకున్నారు.

మధురబాబు, రాష్ మణి జమీందార్లకు కుటుంబవైద్యుడు మహేంద్రరావ్ సర్కార్ తరచు రామకృష్ణకు చికిత్స చేస్తుండేవాడు. స్త్రీలను, బంగారాన్ని తాకితే దేహం స్థంభించిపొతుందని, ఆ విధంగా కామినీ కాంచనాలకు తాను దూరమని రామకృష్ణ చెప్పాడు. ఇదంతా నరాల బలహీనత జబ్బు లక్షణాలని డాక్టర్ సర్కార్ ఆయనకు వివరించాడు. రామకృష్ణ పూజించే కాళికామాత సంతాల్ జాతికి చెందిన ఆటవిక దేవత అనీ ఉత్తరోత్తరా ఆర్యులు తమ దేవతగా మార్చారని డా॥సర్కార్ వివరించి రామకృష్ణకు చెప్పాడు. రామకృష్ణ అవతారంకాదని అతడికే కుండబ్రద్ధలు కొట్టినట్లు చెప్పాడు. (చూడు: రామకృష్ణ కధామృతం. మహేంద్రనాథ్ లాల్ గుప్త రచన)

గొంతు కేన్సర్ తో రామకృష్ణ చావుబ్రతుకులమధ్య వున్నప్పుడు డా॥సర్కార్ చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది. శిష్యులు మాత్రం పడకచుట్టూచేరి, యిదంతా లీల అనీ, ఆయన ఆడుకుంటున్నారనీ, యధాస్థితికి త్వరలోనే చేరుకుంటాదనీ అంటుండేవారు. గొంతులో ఏదీ మింగుడుపడక ఆయన యమయాతన పడుతుంటే, కాళికను అడగమని శిష్యులు కోరారు. ఇతరుల నోటిద్వారా ఆహారం స్వీకరిస్తున్నావుగదా అని కాళి చెప్పిందట. అయితే కేన్సర్ వచ్చే వరకూ ఎందుకు తిన్నట్లు, అప్పుడు యితరులు లేరా అంటే, అలాంటి ప్రశ్నలు వేయరాదంటారు. ఇదొక ఆధ్యాత్మిక ఆత్మవంచన. యోగశక్తితో కేన్సర్ ను నయం చేసుకోమని శిష్యులు కోరాగా, దైవ సాన్నిధ్యం నుంచి దృష్టి మరలించడం తనకిష్టంలేదనేవాడు. ఈ విధంగా తనకు తాను మోసం చేసుకుంటూ, ఇతరులను నమ్మిస్తూ బాధతో రామకృష్ణ చనిపోయాడు. చిన్నప్పటినుండీ రోగాలతో బాధలు పడిన రామకృష్ణను పురోహితుడుగా రాష్‌మణి జమిందారిణి, పరమహంసగా మధురబాబు జమిందారూ బాగా వాడుకున్నారు. గ్రామస్తులు, బంధువులు, ఇంట్లోవారు మాత్రం రామకృష్ణను వాయురోగంతో బాధపడే కాముకునిగానే చూచారు.

రామకృష్ణకు చదువులేదు. ప్రాధమిక పాఠశాల దశలోనే ఆయన చదువు ఆగిపోయింది. బెంగాలీ తప్ప మరో భాషరాదు. అదికూడా మాట్లాడటమేకాని, చదవడం వ్రాయడం ఆయన వంతుకాదు. కాగా జ్ణాపకశక్తి ఎక్కువగా వుండేది. ఇంట్లో పౌరోహిత్య సంప్రదాయం వలన మాటకారి అయ్యాడు. శిష్యులుచేరి ఆయన చెప్పిన మాటలంటూ మనకందించిన వాటిలో అతిశయోక్తులు వున్నా, అనుకోకుండా కొన్ని నిజాలు చెప్పారు.

రామమోహన్‌రాయ్ చనిపోయిన తరువాత రామకృష్ణ పుట్టాడు. పునర్వికాస ఉద్యమం ఆరంభమైన బెంగాల్‌లో రామకృష్ణ ప్రభావం వలన దేశం వెనుకంజ వేసింది. కాంగ్రెసుపార్టి పుట్టిన మరుసటేడు ఆయన చనిపోయాడు. కాని ఆయన పేరిట వేదాంత ప్రచారం చేసి, మఠాలు స్థాపించి రామకృష్ణ పేరును నిలబెట్టిన ఖ్యాతి వివేకానందకు దక్కుతుంది. మేధావుల పట్ల యిష్టత కనబరచని రామకృష్ణ తన పేరు ప్రతిష్టలు యినుమడింప జేసుకోడానికి వివేకానందను గట్టిగా పట్టుదలగా వెంటపడి ఆకర్షించాడు. అదే రామకృష్ణకు ఎంతో ఉపయోగకారి అయింది. వివేకానంద కొన్నాళ్ళు కనిపించకపోతే రామకృష్ణ స్వయంగా ఆయనింటికి వెళ్ళేవాడు. వివేకానందకు పెళ్ళిచేయాలని తల్లిదండ్రులు తలపెట్టగా, చేయిజారిపోతున్నాడని రామకృష్ణ అడ్డుపడ్డాడు. భగవంతుడిని తాను చూచానని చెప్పేసరికి, రామకృష్ణలో గురికుదిరిన వివేకానందుడు, సందేహాలను వదలి గురువును గౌరవించడం, ఆదరించడం, ప్రచారం చేయడం మొదలెట్టాడు. రామకృష్ణుడు తన లక్ష్యాన్ని సాధించాడు.

-హేతువాది, ఫిబ్రవరి 1985