అబద్ధాల వేట - నిజాల బాట/నేనెలా పుట్టాను ?

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
నేనెలా పుట్టాను?

పిల్లలందరు అడిగే ప్రశ్న నేనెలాపుట్టాను?

ఎప్పుడోకప్పుడు అమ్మను అడిగే ప్రశ్నకు సరైన సమాధానం రాదు, అబద్ధాలు చెప్పి తప్పుకుంటారు. దేవుడు పుట్టించాడంటారు. ఏవో కట్టుకధలు అల్లి మాట తప్పిస్తారు. కనుక పిల్లలకు అదొక వింతగా, మిగిలిపోతుంది. చాలాకాలానికి గాని అసలు విషయం తెలియదు. అప్పటికే చాలా అసంబద్ధ నమ్మకాలు నాటుకపోయి వుంటాయి.

పిల్లలకు నిజం చెప్పాలి. చెప్పేది ఆకర్షణీయంగా వాస్తవంగా వుండాలి. అసత్యం పలకాల్సిన అవసరం లేదు.

తల్లి కడుపులో సూక్ష్మమైన అండాలు వుంటాయి. తండ్రి పొత్తికడుపులోనూ సూక్ష్మమైన జీవరేతస్సు కణాలు వుంటాయి. తల్లిదండ్రులు కలుసుకున్నప్పుడు సంపర్కంవలన తండ్రి రేతస్సు,తల్లి అండం చేరడానికి ప్రయత్నిస్తాయి. అలా కలిసినప్పుడు తల్లికడుపులో బిడ్డ పుట్టటం మొదలౌతుంది. తల్లి గర్భంలో బిడ్డ ఒక సంచిలో పెరగడం మొదలౌతుంది. అక్కడ చీకటి గనుక బిడ్డ కదులుతుంది గాని చూడలేదు. క్రమేణా పెరుగుతూ కాళ్ళు చేతులు కళ్ళు అలా శరీరభాగాలు ఏర్పడతాయి. బిడ్డ పెరుగుతుంటే తల్లి కడుపు పెరుగుతుంటుంది. తల్లి తినే ఆహారం బిడ్డకుసైతం ఒక పేగుద్వారా చేరుతుంటుంది. బిడ్డపుట్టిన తరువాత యీ పేగును కోసేస్తారు. అక్కడ ఏర్పడే దానినే బొడ్డు అంటారు.

అబ్బాయి , అమ్మాయి అనేది తండ్రి జీవరేతస్సు కణం వలన నిర్ధారితమౌతుంది. గర్భంలో వుండగానే అబ్బాయి, అమ్మాయి అనేది యిప్పుడు చెప్పగలుగుతున్నారు.

తండ్రి రేతస్సు, తల్లి అండం వలన ఏర్పడే సంతానం, అటు తల్లి యిటు తండ్రి లక్షణాలతో పుడతారు. తల్లి కడుపులోని ఒక సంచిలో పెరిగే బిడ్డ చుట్టూ గోరువెచ్చని ద్రవపదార్ధం వుంటుంది. అందులో బిడ్డ కదులుతుండడం తల్లికి తెలుస్తుంటుంది.

9 మాసాలపాటు తల్లిగర్భంలో పెరిగిన తరువాత, బిడ్డ బయటకు వస్తుంది. అప్పుడు ఎముకలు చాలా మెత్తగా వుంటాయి. బిడ్డ పుట్టబోయేముందు తల్లిగర్భసంచి పగిలి అందులోని ఎమ్నియాటిక్ ద్రవం కారిపోతుంది. బిడ్డ పుట్టబోయే ముందు శరీరమంతా లానూగో అనే వెంట్రుకలుంటాయి. పుట్టేనాటికి తలపై తప్ప మిగిలిన వెంట్రుకలు రాలిపోతాయి. తల్లిగర్భసంచిలో వున్న వెనిక్స్ అనే మైనం వంటి పదార్ధం బిడ్డను కాపాడుతుంది. పుట్టిన అనంతరం యీ మైనంకూడా పోతుంది.

తల బరువు వలన పుట్టబోయే ముందు బిడ్డ, గర్భసంచిలో తలక్రిందులుకాగా, ప్రసవంలో తల ముందుకు బయటపడుతుంది. బిడ్డ బయటపడడానికి సమయం రాగానే తల్లికి, నొప్పులు వస్తాయి. అప్పుడు ప్రసవానికి సిద్ధపడుతుంది.

పుట్టగానే బిడ్డ వూపిరి పీల్చడం వదలడం ఆరంభమౌతుంది. తల్లిగర్భంలో అవసరమైన, ఆహారం అందించే పేగు (అంబలికల్ కార్డ్) తుంచేస్తారు.

అబ్బాయి పుడితే పురుషాంగం, అమ్మాయి పుడితే స్త్రీ అంగం వుంటుంది. అది ప్రధానతేడా. అబ్బాయి ఒక రకంగా అమ్మాయిని ఒక రకంగా చూడడం, పెంచడం ఆనవాయితీగా వస్తున్నది.

అమ్మాయిలు 12 ఏళ్ళు వచ్చేసరికి చనుకట్టు పెరుగుతుంది. ఇవి పిల్లలు పుట్టిన తరువాత పాలు యిచ్చేందుకు ఉపకరిస్తాయి.

సెక్స్ లో అమ్మాయిలకు అబ్బాయిలకు తేడా వుండడం వలన మిగిలిన వాటిలోనూ తేడా వున్నదని చాలాకాలం అనుకున్నారు.

ఆటపాటల్లో, అభ్యాసాలలో అభిరుచులలో, శక్తిపాటవాలలో యిరువురూ సమాన స్థాయి కలవారే. ఉభయులూ అన్ని పనులూ చేయగలరు. సంతానంలో ప్రసవించడం, బహిష్టు అనేవి ప్రధానంగా స్త్రీపరమైనవి. ఏ ఉద్యోగమైనా, వృత్తి అయినా యిరువురూ చేయగలరు. ఈ విషయాలు చెప్పాలి. సులభంగా, సునిశితంగా, ఆకర్షణీయంగా చెబితే, ఎంత జటిలమైన శాస్త్రీయ విషయమైన పిల్లలు బాగా నేర్చుకుంటారు.

- హేతువాది, ఏప్రిల్ 2000