అబద్ధాల వేట - నిజాల బాట/చిన్నపిల్లలకు ఎలా చెప్పాలి?

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
చిన్నపిల్లలకు ఎలా చెప్పాలి?

పిల్లలకు చక్కగా విషయాలు చెప్పడం అంత సులభమేమి కాదు. అందుకు కృషి అవసరం. ఉపాధ్యాయులకు శిక్షణ ముఖ్యం.

మూఢ నమ్మకాలు చెప్పడం సులభం. ఆలోచించనక్కరలేదు. తర్కం, పరిశీలన, పరిశోధన అన్నీ శ్రమతో కూడిన పని. పిల్లల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, అటు తల్లిదండ్రులు, యిటు పెద్దలు, ఉపాధ్యాయులు అదిరించి బెదిరించి ఏవో చెప్పేస్తుంటారు. అందులో అబద్ధాలు, అసత్యాలు, అసంబద్ధాలు, అశాస్త్రీయాలు పుష్కలంగా వుంటాయి. అన్నింటికీ మించి గుడ్డి నమ్మకాలుంటాయి.

అవే పిల్లలకు హాని. పెద్దయినా చెరగని ముద్రవేస్తున్న యీ మూఢ నమ్మకాలకు భిన్నంగా పిల్లలకు చెప్పే పద్ధతుల కోసం మానవవాదులు, హేతువాదులు, నాస్తిక సంఘాలు కృషి చేస్తున్నాయి. తదనుగుణంగా పుస్తకాలు రాస్తున్నారు. ఇటీవల అమెరికాలో అలాంటి పుస్తకం వెలువడింది. పుస్తకం పేరు (Just Pretend - A Freethought Book for Children) డాన్ బార్కర్ దీని రచయిత. 72 పేజీల గ్రంథం ఆకర్షణీయ కార్టూను చిత్రాలతో అత్యంత అధునాతన శాస్త్రీయ దృక్పథంలో వుంది.

భారతదేశంలో దీనిని అనుసరించి ఉత్తమ రచనలు రూపొందించవచ్చు. ఆ పుస్తకం ఎలా సాగింది?

ఇద్ద్దరు పిల్లలు మాట్లాడుకుంటారు. ప్రపంచంలో నీకు సరిగా పోలిన వారెవరూ లేరు అని ఒకరంటారు. (చేతిలో అద్దం వుంటుంది) నీవు ఒక ఆలోచనగల వ్యక్తివి. నీకు మెదడు వున్నది. అది ప్రత్యేకమైంది. మంచిచెడ్డలను నిజానిజాలను మెదడు చూపుతుంది. నీవు చదివే పుస్తకం వెనుక కోటి రూపాయలున్నాయంటే, నమ్ముతావా? (ఒకబ్బాయి అడుగుతాడు) రెండో అబ్బాయి పుస్తకం వెనక్కు తిప్పిచూస్తాడు. కోటి రూపాయలు లేవు. కనుక నమ్మను. అంటాడు.

అయితే కథలలో, పురాణాలలో, గీతలో, వేదాలలో, ఇతిహాసాలలో ఇలాంటి నమ్మశక్యంగానివి ఎన్నో వింటుంటాం. అప్పుడేం చేయాలి?

అవన్నీ కథలుగా ఆనందించాలి. మరచిపోవాలి. నిజం అని నమ్మరాదు. పుస్తకం వెనుక కోటిరూపాయలుండడం ఎంత కట్టుకథో, మిగిలిన గాథలు అంతే. కథలలో విషయాలు నిజం అని నమ్మితే అది గుడ్డి నమ్మకం అవుతుంది.

ఎందరో దేవుళ్ళు,దేవతలు, పిశాచాలు కథల్లో వస్తాయి. అవన్నీ కథలు రాసినవారు ఊహించనివే. నిజంగా వున్నాయని నమ్మరాదు.

శంకరుడు ఏటా ఏదోక జంతువుపై వస్తాడంటారు. అదీ వూహే. క్రైస్తవులు శాంతాక్లాజ్ మిధ్యను నమ్మినట్లు! పిల్లల్ని భయపెట్టడానికి పెద్దలు కొన్ని కథలు అల్లుతారు. వినాయకుడికి దండం పెట్టకపోతే చదువురాదు అనేది అలాంటి నమ్మకాలలో ఒకటి. దేవుడి విగ్రహానికి కాలు తగిలితే కళ్ళుపోతాయంటారు. అదీ కథే.

ఎలా పుట్టాను నేను అని పిల్లలు అడిగితే, దేవుడు పుట్టించాడని చెప్పడం అబద్ధం. పిల్లలకు యింతకంటే అన్యాయం చేయడం మరొకటి లేదు. ఇప్పుడు అనేక దేశాలలో శాస్త్రీయంగా ఆకర్షణీయంగా సులభంగా చెబుతున్నారు. అమెరికాలో ప్రామిథిస్ ప్రచురణకర్తలు యీ విషయమై చక్కని పుస్తకం ప్రచురించారు. పిల్లలకు దాచిపెట్టడంలో వుండే యిబ్బంది కన్నా, విప్పి చెప్పడంలో ఉపయోగం ఎక్కువ.

చాలామంది దేవుణ్ణి నమ్ముతారు. తినేముందు పడుకోబోయే ముందు పరీక్షలు ముందు దేవుడికి దండం పెట్టుకోమని పిల్లలకు చెబుతారు. దేవుడు అంటే ఏమిటో తెలియకుండానే పిల్లలు ఆ పని చేస్తుంటారు. అదొక అలవాటుగా మారిపోతుంది.

అడిగిన వరాలన్నీ దేవుడు యిస్తాడని పిల్లలకు చెబుతారు. దేవుడి గురించి చిన్నప్పటి నుండీ రకరకాలుగా యిలా తల్లిదండ్రులు నూరిపోయడం వలన చాలా హాని జరుగుతున్నది. ముఖ్యంగా పిల్లల్లో అడిగితెలుసుకునే జిజ్ఞాస చచ్చిపోతుంది. ప్రశ్నిస్తే తప్పు అని దేవుడి విషయంలొ భయం కల్పిస్తున్నారు. పిల్లలకు దేవుడి విషయం చెప్పాలి. కాని నిజం చెప్పాలి.

దేవుళ్ళు అనేకం అనేక చోట్ల వున్నారని చెప్పాలి. ప్రాచీనకాలం నుండి నేటివరకు దేవుళ్ళు పుడుతూనే వున్నారని చెప్పాలి. ముస్లింలు అల్లాను, క్రైస్తవులు జీసస్ ను, బౌద్ధులు బుద్ధుడిని, ఇలా అనేక మతాలు తమ దేవుళ్ళను సృష్టించుకున్నాయని చెప్పాలి. వీటికి భిన్నంగా భారతదేశంలో లక్షల సంఖ్యలో హిందూ దేవుళ్ళు దేవతలు వున్నారు. ఇందులొ స్త్రీలు, పురుషులు, జంతువులు, ప్రకృతి శక్తులు వున్నాయని చెప్పాలి. విగ్రహాలు, పటాలుగా దేవుళ్ళను గుడిలో దేవాలయంలో, మసీదులో(రాత పూర్వకంగా) దేవుళ్ళను పెట్టారు.

ఇవన్నీ ఎవరు చేశారు. మనుషులు.

కనుక దేవుడిని సృష్టించింది, కనిపెట్టింది. ఎవరు? మనుషులే.

సృష్టికర్త ఎవరు? మనిషి.

అందుకే మనుషుల తీరులో దేవుళ్ళు కనిపిస్తారు. ఇది చెప్పాలి.

పిల్లలు ప్రశ్నలు వేస్తారు. ఓపికగా చెప్పాలి. తెలియని వాటికి బుకాయింపు,అబద్ధం సమాధానం కాదు. తెలుసుకుందాం అనాలి.

అన్నిటినీ దేవుడు సృష్టించాడంటే,దేవుడిని ఎవరు పుట్టించారనే ప్రశ్న సహజమైనది. అందుకు జవాబు కన్నెర్ర చేయడంకాదు. దేవుడి పుట్టుపూర్వోత్తరాలు విడమరచి చెప్పడమే. పవిత్ర గ్రంథాలలో విడ్డూరపు కథల్ని పిల్లలకు కథలుగానే చెప్పాలి. పరమసత్యాలుగా నమ్మించరాదు.

పవిత్రగ్రంథాలలో జంతువులు మాట్లాడతాయి. అది కథ:పవిత్ర గ్రంథాలలో మగవాడి పక్కేముక నుండి ఆడదాన్ని దేవుడు పుట్టిస్తాడు. అది కథ: అలాంటి కథల్ని వినోదంగా ఆనందించాలి. పిల్లలకు అలాగే చెప్పాలి.

ప్రవక్తలు చేసిన పాపకృత్యాలు, తప్పుడుపనులు. రుషులు చేసిన వ్యభిచారం అన్నీ దేవుడి ప్రేరణగా చెప్పి తప్పుకున్నారు. జనాన్ని నమ్మించడానికి అది పెద్ద ఎత్తుగడ.

ఏదైనా రుజువుకు నిలబడాలి. లేకుంటే నిరాకరించాలి.

పిల్లలకు శాస్త్రీయంగా అలవాటు చేయాలి. ప్రవక్త,రుషి,మహాత్మ, బాబాలు చెప్పేది ప్రశ్నించవచ్చు. రుజువు చేయమనవచ్చు. పిల్లల్లో అలాంటి ధోరణి అవసరం.

ప్రార్థన చేస్తే రోగాలు తగ్గుతాయని భక్తులు ప్రచారం చేస్తారు. పిల్లలకు వైద్యం లేకుండా చంపుతున్న సంఘటనలున్నాయి.

ప్రార్థన చేస్తే ఎవరూ పలకరు. ఎవరికీ వినిపించదు. ప్రార్థన అంటే, అవతలివైపు ఎవరూ లేకున్నా ఫోనులో వారితో మాట్లాడినట్లు! ఇది వృధా. పిల్లలకు యిది చెప్పాలి.

ఇలా శాస్త్రీయంగా చెబితే పిల్లలు అభివృద్ధి చెందుతారు.

ఈ విషయాలను చక్కగా కార్టూనుల ద్వారా అందించాలి.

- హేతువాది, డిశంబరు 1999