Jump to content

అబద్ధాల వేట - నిజాల బాట/ఎం.ఎన్.రాయ్ - అబ్బూరి లేఖలు

వికీసోర్స్ నుండి

ఎం.ఎన్.రాయ్ - అబ్బూరి లేఖలు

ఆంధ్రప్రదేశ్‌కు ఎం.ఎన్.రాయ్‌ను పరిచయం చేసిన,ఆద్యుడు కీ.శే.అబ్బూరి రామకృష్ణరావు. తొలుత కమ్యూనిష్టుగా ప్రారంభించిన అబ్బూరి, ఆంధ్ర యూనివర్శిటీలో లైబ్రేరియన్‌గా పనిచేశారు.నాట్యగోష్టి, నట్టాలి అనే సంస్థలు 1933 నాటి నుండే స్థాపించి స్టేజి ఆర్ట్స్ పెంపొందించిన ఘనత అబ్బూరివారిదే.

1937 నుండీ ప్రారంభించి చనిపోయేవరకూ, ఎం.ఎన్.రాయ్ తరచు అబ్బూరికి ఉత్తరాలు రాశారు. వాటన్నిటిని ఇప్పుడు వెలుగులోకి తెచ్చిన అబ్బూరి చాయాదేవిగారు, అభినందనీయులు. అయితే అబ్బూరికి వ్రాసిన ఉత్తరాలన్నీ లభ్యం కాకపోవడంతో కేవలం ఒక్క లేఖ ప్రచురించగలిగారు. 1948 ఎం.ఎన్.రాయ్ వాల్తేరు వస్తున్న సందర్భంగా లభించిన ఉత్తరం మాత్రమే ఉంది. 1940 ప్రాంతంల్లో నాటి బ్రిటీష్ పోలీసులు దాడి చేసినప్పుడు అబ్బూరి ఇంట్లో పట్టుకుపోయిన వాటిలో ఉత్తరాలు కూడా తీసుకెళ్ళినట్లు ఆయన కుమారుడు కీ.శే.అబ్బూరి వరదరాజేశ్వరరావు వ్రాశారు. ఎం.ఎన్.రాయ్ అనుచరులలో అబ్బూరి సంతానం ఉన్నది.

1936లో లక్నోలో అభ్యుదయ రచయితల సమావేశం జరిగింది. అందులో అబ్బూరికి మున్షీప్రేమ్‌చంద్‌కూ జరిగిన వాదోపవాదాలు, జైలులో ఉన్న ఎం.ఎన్.రాయ్ దృష్టికి వచ్చాయి. అబ్బూరి గురించి రాజేంద్రదత్తనిగం ద్వారా తెలుసుకొని కమ్యూనిస్టులలో అలా ఎదురుతిరిగి స్వేచ్ఛగా మాట్లాడగలగడాన్ని రాయ్ మెచ్చుకున్నారు. అప్పటికే రాయ్ జైలు నుండి, బయటకు వేసిన రాజకీయ సాహిత్యాని పంచుతున్నారు. హెచ్.ఆర్.మహాజని లక్నోలో అబ్బూరికి రహస్యంగా రాయ్ సాహిత్యం అందించాడు. వాల్తేరు తిరిగివచ్చిన అబ్బూరి కమూనిస్టు పార్టీ సెల్ సమావేశాలలో రాయ్ ప్రస్తావన రాగా, అది చర్చించవీల్లేదని అభ్యంతరాలు వచ్చాయి. రాయ్ పట్ల ఆకర్షితుడైన అబ్బూరి కమ్యూనిస్టు పార్టీకి దూరం అవుతూ రాయ్‌తో సంబంధం పెట్టుకోదలచాడు.

జైలు నుండి విడుదల అయిన ఎం.ఎన్.రాయ్ పైజ్‌పూర్ కాంగ్రెస్ సభలలో పాల్గొన్నాడు. ఈ సమావేశాలకు కాకినాడ నుండి ఎం.వి.శాస్త్రి(ములుకుట్ల వెంకటశాస్త్రి) వెళ్ళారు. కుందూరి ఈశ్వరదత్ మద్రాసు నుండి ఇంగ్లీషులో ప్రచురిస్తున్న ప్యూపిల్స్ వాయిస్ పక్షాన వెళ్ళినట్లు అబ్బూరి వరదరాజేశ్వరరావు ఈ పుస్తకంలో వ్రాశారు.

ఎం.ఎన్.రాయ్ పట్ల ఆకర్షితుడైన ఎం.వి.శాస్త్రి తిరిగొచ్చి, అబ్బూరికి విషయాలు చెప్పి, రాయ్‌ను ఆహ్వానించారు.

నెల్లూరులో 1937, ఆగష్టులో కీ.శే.వెన్నెలకంటి రాఘవయ్య ఆద్వర్యాన ఆంధ్ర వ్యవసాయకార్మికుల సభ జరిగింది. ఎం.ఎన్.రాయ్ దీనిని ప్రారంభించారు. అపుడు రాయ్ జబ్బునపడగా, కాకినాడ వచ్చి విశ్రాంతి తీసుకోమని ఎం.వి.శాస్త్రి ఆహ్వానించారు.కాకినాడ చేరుకొన్న రాయ్‌ను శాస్త్రి ఆదరించి జాగ్రత్తగా చూచారు. అక్కడే తొలుత అబ్బూరి రామకృష్ణారావు కూడా రాయ్‌ను కలుసుకొన్నారు. బొంబాయి నుండి ఎలెన్ వచ్చి చేరింది. అబ్బూరి ఆహ్వానంపై రాయ్ వాల్తేరు వెళ్ళి సముద్రతీరాన దాదాపు నెలన్నర విశ్రాంతిగా ఉన్నారు. అప్పుడే రాయ్ మేధాశక్తిని చర్చలలో గమనించిన అబ్బూరి జీవిత పర్యంతం రాయిస్టుగా మారిపోయారు. రాయ్ స్థాపించిన రాడికల్ డెమొక్రటిక్ పార్టీలోనూ, అది రద్దుచేసిన తరువాత ఉద్యమంలోనూ అబ్బూరి పనిచేశారు. అప్పటి ఉత్తరాలలో కొన్ని లభించగా డిల్లీలోని నెహ్రూ మ్యూజియంలో భద్రపరిచారు. అవే యిప్పుడు చిన్ని పుస్తకంగా రూపం దాల్చాయి.

1937 నుండీ అబ్బూరికి వ్రాసిన ఉత్తరాలలో రాయ్ కొన్నిపేర్లు ప్రస్తావించాడు. అలాంటి వారు అటు పార్టీలోగానీ, ఇటు ఉద్యమంలోగానీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పనిచేసి ఉండొచ్చు. వివరాలు చరిత్రకారులు పరిశీలించవలసి ఉంది. అలా ప్రస్తాననకు వచ్చిన పేర్లు: దేవకినంద(విజయనగరం), గుప్త(వాల్తేరు), రామకృష్ణ పరమహంస, కె.కృష్ణారావు(ఏలూరు), ఎం.వి.శాస్త్రి, జగన్నాధం, సుబ్రహ్మణ్యం, నారాయణమూర్తి (ప.గోదావరి), ఫణిరాజు, శర్మ (రాజమండ్రి), నరసింహారావు (విజయనగరం), సుప్రసిద్ధ ఆర్టిస్టు ఎన్.ఎన్.చేమకూరి ఒక సందర్భంలో రాయ్ పుస్తకానికి ఆర్ట్ ముఖచిత్రం గీసినట్లు ప్రస్తావన ఉంది.

కొత్త సచ్చిదానందమూర్తి తన ఇండియన్ ఫిలాసఫీ పుస్తకానికి రాయ్‌ను పీఠిక వ్రాయమని కోరిన విషయం చెబుతూ, ఆయన్ను గురించి వాకబు చేసిన మాటలు ఒక లేఖలో ఉన్నాయి.తరువాత ఆ పుస్తకానికి రాయ్ సుదీర్ఘ పీఠిక వ్రాశారు. సచ్చిదానందమూర్తి ఉత్తరోత్తరా తన భావాన్ని మార్చుకొని అ పుస్తకాన్ని కాదన్నారు. కీ.శే.నార్లవంటివారు అందుకు బాధపడ్డారు. ఎం.ఎన్.రాయ్ చనిపోయినప్పుడు అబ్బూరి ఒక కవితలో తన సంతాపాన్నివ్రాశారు. రాయప్రోలు శ్రీనివాస్ దీన్ని ఇంగ్లీషులో అనువదించారు. 1980 జనవరి రాడికల్ హ్యూమనిస్టులో ముద్రితమైంది. రాయ్ సమాధి శ్రద్దాంజలిలో భాగంగా ఈ గేయాన్ని ఆనాడు పెట్టారు.

రాడికల్ హ్యూమనిస్ట్ పత్రిక ఎడిటర్ ఆర్.ఎం.పాల్, మానవవాద ఉద్యమనాయకులు వి.ఎం. తార్కుండే వ్రాసిన వ్యాసాలు చాలా పుస్తకంలో చేర్చారు.

అబ్బూరి ఛాయాదేవి ఈ చిన్నపుస్తకాన్ని ప్రచురించి మంచిపని చేశారు. ఆర్.ఎం.పాల్ కుటుంబానికి ఆమె సన్నిహితురాలు. పాల్ కుమార్తె సంగీతామాల్ నేడు రాడికల్ హ్యూమనిష్ట్ పత్రిక సంపాదకత్వాన్ని బొంబాయి నుండి చూస్తున్నారు. పుస్తకంలో ఎలెన్ ఉత్తరం కూడా ఒకటి చేర్చారు.

అబ్బూరి అండ్ ఎం.ఎన్.రాయ్

ప్రచురణ:అబ్బూరి ట్రస్ట్,

బాగ్‌లింగంపల్లి,హైదరాబాద్-500 044.

వెల:రూ.40/-

-హేతువాది, అక్టోబరు 2000