అబద్ధాల వేట - నిజాల బాట/అమెరికాలో ఆధ్యాత్మిక వ్యాపారం! ఇండియా ఎగుమతులు!

వికీసోర్స్ నుండి
అమెరికాలో ఆధ్యాత్మిక వ్యాపారం!
ఇండియా ఎగుమతులు!

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఆధ్యాత్మిక వ్యాపారం విచ్చలవిడిగా, యధేచ్ఛగా సాగిపోతున్నది. పెట్టుబడిలేని సంపాదనగా మనుషుల బలహీనతలే ఆధారంగా, భక్తి పేరిట దోపిడీ పెరిగిపోతున్నది. ఈ రంగంలో భారతదేశం నుండి కొందరు తమ విశ్వాసాలను అమెరికాలో అమ్ముకొని విలాస జీవితాల్ని గడుపుతున్నారు.

అమెరికాలో సంవత్సరంన్నర కాలంపాటు పరిశీలించిన అనంతరం,600 మతశాఖలు ఆధ్యాత్మిక వ్యాపారంలో వున్నట్లు గమనించాను. ఇందులో చిన్న, పెద్ద స్వాములు, బాబాలు వున్నారు. వివిధ దేశాల నుండి అమెరికా చేరుకున్న ఆయా మతగురువులు సొంత దుకాణాలు పెట్టుకొని, తమ దేశస్తులకే పరిమితమై గుట్టుగా దోపిడిలో నిమగ్నులై వున్నారు. ఇందులో సుమారు 75 శాఖలు మహత్తులు, మాజిక్ లు, మోసాలు, భీభత్సాలు, చికిత్సలు, భయానక వాతావరణం సృష్టించి తమ వారిని ఆకట్టుకొని, పీల్చి పిప్పి చేస్తున్నారు. మతస్వేచ్ఛ పేరిట వీరు చేసే ఆగడాలు యిన్నీ అన్నీ కాదు. అందులో కొన్ని రహస్య కార్యకలాపాలలో నిమగ్నమైనాయి. విషాదాంతంగా విపరీత సంఘటనలు బయటపడినప్పుడే వాటి గుట్టు జనానికి తెలుస్తున్నది. అలా యిటీవల తెలిసిన మత సంఘాలలో డేవిడ్ శాఖ, జిమ్ జోన్స్, డేవిడ్ కొరేష్ రహస్య సామూహిక హత్యలు, ఆత్మహత్యలు సుప్రసిద్ధమైనవి.

మన దేశానికి చెందిన ఎగుమతి ఆధ్యాత్మిక శాఖలు అమెరికాలో కొంత ప్రచారం పొంది, అపఖ్యాతి పాలయ్యాయి. అందులో రజనీష్ ఆశ్రమం ఒకటి. సెక్స్ తో ఆధ్యాత్మికతను రంగరించి, డబ్బు విపరీతంగా సంపాదించి, ఒక వూరునేకొనేసి విమానాలు,కార్లు, అమ్మాయిలతో రభస చేసిన నేరానికి రజనీష్ ను వెళ్ళగొట్టిన ఉదంతం కొందరికి జ్ఞాపకం వుండి వుంటుంది. ఆయన ఇండియావచ్చి పూనాలో చనిపోయాడు.

కృష్ణ చైతన్య అంతర్జాతీయ సంఘం ఒకటి ఇండియాలో పుట్టి అమెరికాలో మెట్టింది. మరొకటి మహేష్ యోగి ఆధ్వర్యాన అలౌకికధ్యానం పేరిట జోరుగా వ్యాపారం సాగిస్తున్నది. డివైన్ లైట్ మిషన్ కూడా భారతీయ ఎగుమతి సంస్థలలో ఒకటి.

మహేష్ యోగి అమెరికాలో బీటిల్స్ సంగీతకారుల్ని, జేన్ ఫాండాను, మియా ఫొరెను ఆకర్షించి,బహుళ ప్రచారం పొందాడు. ఒక రాష్ట్రంలోని కళాశాలనుకొని,దానికి అంతర్జాతీయ విశ్వవిద్యాలయం అని పేరు పెట్టి అలౌకిక యోగవిద్య ప్రత్యేకంగా నేర్పిస్తున్నారు. 1970 ప్రాంతాలలో దాదాపు 10 లక్షల అమెరికన్లను ఆకర్షించిన మహేష్ యోగి రానురాను క్షీణదశలో పడ్డాడు. తనది మతం కాదన్నాడు. తన బోధనలు సృష్టి పూర్వక సైన్స్ గా పేర్కొన్నారు. కాని తగాదాలతో కోర్టుకు వెళ్ళగా మహేష్ యోగి ధ్యానం మతమేనని తీర్పు వచ్చింది. మహేష్ యోగి విధానం మతమేనని తీర్పు వచ్చింది. అదలా వుండగా,మహేష్ యోగి గాలిలో ఎగరడాన్ని తన శిష్యులకు నేర్పినట్లు చాటాడు. ఇది అసత్యమంటూ ఆయన శిష్యుడు కోర్టుకు వెళ్ళగా, 2 లక్షల డాలర్ల జరిమానా మహేష్ యోగి చెల్లించవలసి వచ్చింది. కోర్టు వెలుపల 5 వేల డాలర్లు చెల్లించి, పరిష్కారం చేసుకొని, మహేష్ యోగి బయటపడ్డాడు. మహేష్ యోగి ధ్యానవిద్య వలన కొన్ని ప్రదేశాలలో నేరాలు తగ్గాయని, శాంతి నెలకొన్నదని ప్రచారం చేసుకున్నారు. అది అబద్ధమని అమెరికా సెక్యులర్ హ్యూమనిస్ట్ సంఘం వారు పరిశోధించి వివరంగా తేల్చిచెప్పారు. ప్రస్తుతం మహేష్ యోగి తరచు అమెరికా పత్రికలో విపరీతంగా ఖర్చుపెట్టి, ప్రకటనలు యిచ్చే స్థాయికి దిగజారారు.

హరేకృష్ణ ప్రచారాలు:

భక్తి వేదాంతస్వామి ప్రభుపాద ఇండియాలో స్థాపించి, అమెరికాకు ఎగుమతి చేసిన యీ కృష్ణచైతన్యశాఖ కొందరు అమెరికన్లను ఆకర్షించింది. భగవద్గీత వీరి పవిత్రగ్రంథం. హరేకృష్ణ, హరేరామ అంటూ మంత్రపఠనం చేసే యీ సంఘంవారు సన్యాసత్వం ప్రచారం గావించడం వలన కొందరికే పరిమితమైంది. కొత్తవారిని అట్టే ఆకర్షించలేదు. వీరు అమెరికాలో విమానాశ్రయాలు, ఇతర బహిరంగ ప్రదేశాలలో డబ్బు వసూలు చేస్తున్నారు. ఇది అభ్యంతరకరంగా పరిణమించగా కోర్టువరకూ వెళ్ళింది. కొందరు కృష్ణచైతన్య స్వాముల వద్ద ఆయుధాలు దొరికాయి. ఆధ్యాత్మికతకు ఆయుధాలు ఎందుకనే మీమాంస వచ్చింది. అమెరికాలో ప్రస్తుతం వీరి సంఖ్య 3 వేలకు మించలేదు. బోడిగుండు, కాషాయి వస్త్రం, బహిరంగ ప్రదేశాలలో హరేకృష్ణ పారాయణం వలన వీరు తాత్కాలిక ఆకర్షణకు దారితీసినా, యిదీ క్షీణదశలో వున్నది.

డివైన్ లైట్ మిషన్:

హన్స్ జి మహరాజ్ 1960లో భారతదేశంలో యీ శాఖను స్థాపించారు. ఆయన చనిపోగా ఆయన 8 సంవత్సరాల కుమారుని గురువుగా మార్చారు. అతడి చుట్టూ కథలు అల్లారు. అభూత కల్పనలు ప్రచారం చేశారు. అమెరికాకు పంపారు. తొలుత బాగా ఆకర్షించిన యీ సంఘం 1973 నుండే తగ్గుముఖం పట్టింది. కొన్ని దుర్ఘటనల వలన సంఘానికి చెడ్డపేరు వచ్చింది. మహరాజ్ జి మయామిలో స్థిరపడగా, యీ శాఖ కొన్ని ఆశ్రమ కేంద్రాలకు కుంచించుకపోయింది.

జపాన్, కొరియాల నుండి వచ్చిన సంఘాలు అమెరికాలో తిష్టవేసి అధ్యాత్మిక వ్యాపారం చేస్తున్నాయి.

అమెరికాలో ఎప్పటికప్పుడు కొత్త సంఘాలు తలెత్తడం, వింత బాబాలు పుట్టుకరావడం జనాన్ని వంచించడం సర్వసామాన్యమైంది.

జిమ్ జోన్స్ అనే అతడు గయానాలోని జోన్స్ టౌన్ లో 900 మందితో సామూహిక ఆత్మహత్యలు జరిపినప్పుడు ప్రపంచం విస్తుపోయింది. తానే జీసస్ క్రీస్తును అంటూ అతడు భ్రమింపజేసి అలాంటి ఘాతుకంతో అంతమయ్యాడు.

కృష్ణచైతన్య సంఘం వారు బహిష్కరించగా బయటకు వచ్చిన కీత్ హాం అనే అతడు కీర్తానందస్వామి భక్తిపాద అని పేరు పెట్టుకొని దారుణాలకు పాల్పడ్డాడు. 1987 నుండీ అతడు చేసిన, చేయించిన హత్యలు, హింసలు, రహస్య ధనసేకరణ బయటపడగా 30 ఏళ్ళ జైలుశిక్ష విధించారు. కొత్త బృందావనం స్థాపించిన కీత్ హాం 4 వేల ఎకరాలు స్థలంలో విలాసాలు సృష్టించాడు. (వెస్ట్ వర్జీనియా మౌండ్స్ విల్లి) గుడి శిఖరానికి బంగారు తొడుగు అమర్చగా, అది యాత్రికులకు ఆకర్షణగా మారింది. పోలియోతో చిన్నతనం నుండి బాధపడుతున్న భక్తి పాదస్వామి సమాజానికి దూరంగా వుండాలని ఫెడరల్ కోర్టు ఆదేశాలిచ్చింది. మూడవ ఫ్రెడరిక్ అనే అతడు జెన్ మాస్టర్ రాము అనే పేరుతో కంప్యూటర్ కల్ట్ ను స్థాపించి లక్షలు గడించాడు. బౌద్ధాన్ని కేపిటలిజాన్ని మేలికలయిక చేశానంటాడీయన కాని, అతడివల నుండి బయటపడినవారు అతడి కామతృష్ణ, ఇతర ఘోరాన్ని బయటపెట్టారు. కేవలం కంప్యూటర్లు వాడి ఏడాదికి 10 మిలియన్ డాలర్ల వరకూ వీరు ఆర్జిస్తున్నారు. ఆ డబ్బుతో గురువు విలాసవంతంగా జీవిస్తున్నాడు. 390 మంది శిష్యులు అమెరికాలో యీ శాఖలో పనిచేస్తున్నారు. అమెరికాలో ప్రశాంత జీవనం సమకూర్చుతామనీ, యోగం ద్వారా చింతల్ని దూరం చేస్తామనీ కొందరు బయలుదేరి చిన్న సంస్థలు పెట్టి ధనార్జన చేస్తున్నారు. అమెరికాలో మతస్వేచ్ఛను స్వాములు బాగా దుర్వినియోగపరుస్తున్నారు. ఇతరులకు హాని చేయనంత వరకే మతస్వేచ్ఛను వాడుకోవాలని వున్నా, అన్ని మతాలు కూడా జనాన్ని పీల్చి, డబ్బు వసూలు చేస్తున్నాయి. రహస్య కార్యకలాపాలు సాగిస్తూ అనేక చిత్రహింసలపాలు చేస్తున్నాయి. పైగా ప్రభుత్వం జోక్యం చేసుకోగూడదంటున్నాయి! జెహోవా విట్ నెసెస్, అడల్ట్ క్రిష్టియన్ సైంటిస్టులు మతస్వేచ్ఛ పేరిట, రోగాలకు మందులు తీసుకోకుండానూ, రక్తమార్పిడి నిరాకరిస్తూ వున్నారు. అయితే పిల్లలకు సైతం యిలా చేయవచ్ఛా అనేది తీవ్ర చర్చనీయాంశం అయింది.

మత కార్యకలాపాలకు వచ్చే డబ్బుపై పన్ను వేయకపోవడంతో దుర్వినియోగం కూడా విపరీతంగా సాగిపోతున్నది. రానురాను కొందరు బయలుదేరి "దయ్యం వదలగొట్టే పనిలో నిమగ్నులమయ్యాం-మాకూ పన్ను మినహాయించండి" అని కోరారు.

టెక్సాస్ రాష్ట్రంలోను,వాకోలో ఏకాంతభవనంలో మారణాయుధాలు పెట్టుకొని, డేవిడ్ బ్రాంచ్ అనే క్రైస్తవశాఖ నాటకాలు ఆడింది. అందులోని పిల్లల్ని, తల్లుల్ని కాపాడాలని పోలీస్ ప్రయత్నిస్తేలోనుండి కాల్పులు జరిపారు. చివరకు ఎందరో చనిపోతేగాని, కొందరు బయటపడలేదు. గత సంవత్సరం జరిగిన యీ సంఘటన గమనిస్తే, మతం పేరిట నేటికీ ఎంత దారుణం జరుగుతున్నదో చూడవచ్చు. మతానికి ఆయుధాలు దేనికి?

మతం వ్యక్తిగత విషయంగా భావించి సంస్థాగతం నుండి తప్పిస్తే చాలామంది నాటకాలు అంతమౌతాయి. పన్నుల మినహాయింపు తీసేస్తే ఆదాయం పడిపోయి, అవినీతి తగ్గుతుంది. 1995 నాటికి ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనది, మూడవ ప్రపంచ యుద్ధానికి మించినదీ మతహింస మాత్రమే.

- హేతువాది, మే, జూన్,1995