అన్నమాచార్య చరిత్రము/తాళ్ళపాక

వికీసోర్స్ నుండి


అట్టి పొత్తపినాటి యౌఁదల సిరుల
పట్టుఁగొమ్మై తాళ్ళపాక చెన్నొందు.

ఆ పురిఁ గేశవుండను రమావిభుఁడు
చేపట్టి జనుల రక్షింపుచునుండ

1పరికించి యచ్చటి ప్రజలెల్ల మిగుల
నరుదంద మున్నూటయఱువది నాళ్ళు

ఫలముల చక్కెర పస పెర్గు రేఁగు
చెలరేఁగు నా వేల్పుచెంత నెంతయును;

అఖిలదేవతలకు నది యాటపట్టు
నిఖిల సన్మునులకు నిజ నివాసంబు;

సిరిగొల్చు నవనాథసిద్ధులు మున్ను
పరుసంబు రససిద్ధిఁ బడసినచోటు;

నళినాళి తులసీవనములు వైష్ణవులు
వెలయుదు రెచ్చోట విష్ణుఁ డచ్చోట

సన్నిధిసేయు నిచ్చలు నండ్రు మౌను;-
లన్నియు నచ్చోట ననిశంబు నుండు;

నందు వశించు నయ్యఖిలభూసురులు
నిందిరారమణపదైక మానసులు

అతులిత వేదవేదాంగ పారగులు
జితసర్వకరణు లంచిత తపోధనులు

కనుట గోవిందు మంగళవిగ్రహంబె
వినుట నారాయణ వృత్తాంతచయమె

చేయుట కౌస్తుభాంచితపూజె, తలఁపు-
సేయుట మాధవ శ్రీపాదయుగమె

కుడుచుట వనమాలి గొను ప్రసాదంబె
నడచుట నందనందను నగరికినె

కాని, దుర్విషయసంగతి కలలోన-

1 'పరికించి అచ్చఫలముల చక్కెరపస పెర్గురేఁగు' అని మాతృక. ఇది దూషితపాఠము