Jump to content

అన్నమాచార్య చరిత్రము/అవతరణిక

వికీసోర్స్ నుండి

శ్రీ యలమేల్మంగఁ జిరకృపాపాంగఁ
గాయజుఁ గనతల్లిఁ గాంతామతల్లి,

శ్రీవేంకటేశుఁ బోషితపద్మ కోశు
సేవకపరతంత్రు జితదైత్యతంత్రు,

దనుజకర్శనము మాధవ సుదర్శనము,
నినకోటితేజంబు హేతిరాజంబు,

నరహరిసంకీర్తి నవవిధు లొసఁగు-
పరమోపకృతిఁ దాళ్ళపాకాన్నయార్యు-

నాచారవిజితామరాచార్యుఁ దిరుమ-
లాచార్యు ఘను మదీయాచార్యుఁ గొలిచి

యార్యులు విని యన్నమాచార్యవర్యు-
చర్యకు మిగుల నాశ్చర్యంబుఁ జెంద,

జలజాతవాసిని చనుఁబాలపుష్టిఁ
బలికెద నా నేర్చుపరిపాటి నిపుడు,

జనపరంపరా శతసహస్రముల
వెనుకకు మేము దుర్విషయానురక్తిఁ

గుక్షింభరులమైన కొదవెల్లఁ దీఱ
రక్షించి, మా యపరాధము ల్మఱచి

యేపుట్టువున మిమ్ము నెఱుఁగంగఁజేసి
నీ పాలివారిఁగా నియమించి మమ్ము

హరి! మిమ్మునే కొనియాడు మా జిహ్వ
నొరులను గొనియాడకుండంగఁజేసి

కంటులేనట్టి లక్ష్మణగురు మతము-
వంటి సన్మతము మీవంటి దైవతము

తనవంటి గురుని నందఱలోనఁ దెచ్చి
వనజాక్ష! నేఁడు మావంటివారలకుఁ

గరతలామలకంబుఁ గావించెఁ గనుక,
అరయఁగఁ దాళ్ళపాకాన్నయాచార్యు-

పరమోపకార మెప్పటికి డెందమున
నరయుచుఁ గొనియాడు టది యొప్పుఁగనుక,-

నాయనఁ జూచి మాయపరాధకోటు-
లేయెడఁ దలఁచక యెడఁబాయ కెపుడు-

నే యాపదలు మమ్ము నెనయక యుండ
మా యిలవేల్పవై మన్నించుకతన,

నందను సద్వర్తనము తండ్రి ప్రియము-
నొందఁ గీర్తించుట యుచితంబు గనుక,

అఱలేక యీ యన్నమాచార్యచరిత
వెఱవక నీకు నే విన్నవించెదను;

మన్నించి యలమేలుమంగతో నీవు
నిన్నుఁ బాయని భక్తనికరంబుతోడ

నవధారు శ్రీవేంకటాచలాధీశ!
అవధరింపుఁడు గురుహరిభక్తులార !