అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/బాపిరాజు వచనాలు
బాపిరాజు వచనాలు
| 51 |
| 53 |
| 55 |
| 57 |
| 59 |
| 62 |
| 64 |
యానాది అతిథి
1
ఈ కుక్క నా స్నేహితుడు
నాతోటి అతిథి
మేమంతా గొప్ప చుట్టాలం
కాకులూ, కుక్కలూ, యానాదులూ
2
ఈ ఇస్తళ్లలో అన్ని పిండి వంటకాలూ ఉన్నవి
అన్ని వంటకాలూ ఉన్నవి.
ఒకళ్ళ కొకళ్ళు దయచెయ్యండయ్యా
అని కాకుల్నీ, కుక్కల్నీ, యానాదుల్నీ పిలుచుకుంటాం.
3
కిందపడి ఆకుల్లో మట్టి పడుతుంది.
కూరలకీ, నారలకీ
పచ్చళ్లకీ, పప్పులకీ
అన్నానికీ, అన్నిటికీ
మట్టి అంటుకుంటుంది.
అయితే ఏం ?
మట్టీ ఒక పిండి వంటే.
4
ఈ ఇస్తరాకుల్లోనూ విందులు కుడవనివ్వరేం?
ఈ సేవకులు మమ్మల్ని కొట్టి తరుముతారేం?
ఆకుల్ని మా చింపిగుడ్డల్లోసోకుగా మూటకట్టుకు
పోతాం అప్పుడో ?
5
మా జుట్టు చింపి జుట్టు
చిరిగి పోయిన పాతరోతగుడ్డలు మా బట్టలు
మా జుట్టే మబ్బు
మా బట్టే పట్టు.
6
ఈ పుల్లిస్తిరాకుల్లోని వన్నీ కుండల్లోకి ఎత్తి
నాపిల్లది, నాపాపలు, నేనూ
ఈ రోజున పండగ
ఎండిపోయిన మాకు పండగ.
7
ఏడాది పనిచేసినా
ఇంత పట్టెడన్నం పడేయని సామి
ఈ ఇస్తళ్ళనో కూడు తిన్న
సాములకెంత కూలి - సంబళమో?
(2-5-1934)
కూలి
1
వెడుతున్నావు
పడుతున్నావు
పడిన వాళ్ల ఒడిలో
పెడుతున్నావు
2
కండపట్టిన ఒళ్లు
దండ తిరిగిన సుళ్లు
మొండి తనంలేని దండితనంలేని
నిర్మలమైన బ్రతుకు దారి.
3
కట్టినావోయి గుళ్లూగోపురాలూ
ఎత్తినావోయి శిఖరాలు, బురుజులు, మహాభవనాలు
అజంతాల ఎల్లోరాలు దొలిచినావోయి
అజ్ఞాత కూలీ
అమరుడవోయి నువ్వు
అమరత్వానికి ఆశపడని
యశానికి వశుడవుకాని
ఆనందరూపీ !
4
కూలీ! శూలీ! మాలీ ! పాలీ !
నేల ఏలినవాడవు నువ్వు
ఏలించిన ప్రోడవు నువ్వు
హూణుల్నైనా దూరాలకు
తోలిన వాడవయ్యా !
5
అన్నం పెట్టిన దాతవో
మాతవో, తాతవో
అర్థం దెచ్చిన గనివో, పనివో
నీల వనివో !
6
రైతువో గుఱ్ఱపు
రౌతువో
అవధారు నీకు
దేవతవో భూవ్రతివో
సేవకుడవో !
దేశికుడవో
వెడుతున్నావు
పడుతున్నావు
పడిన వాళ్ల - నీ ఒడిలో
పెడుతున్నావు
(16-7-1939)
హరిజన బాలకుడు
1
ఓయి హరిజన బాలకుడా !
నువ్వు ఎన్నియుగాల, ఈ కులం వాళ్లని, ఈ పొలం వాళ్లని
దవ్వుగా ఉంచి దరి చేరకుండా
తపస్సు చేసుకుంటున్నావు
2
ఈ పశువుల్ని మేపి, నిసువుల్లా వాటితో మాట్లాడి
కసవు తినిపించి
పసిరి మొక్కలలో, పలురంగుల పూవుల్లో
పంటల్లో !
ఆడుకుంటున్నావు. పాడుకుంటున్నావు!
3
నువ్వు ఆనందరూపివి
గువ్వలా ఆనందిస్తుంటావు ఎప్పుడూ
నిన్ను దరికి రానివ్వని
వీళ్లకష్టాలు, నిష్ఠూరాలూ చూస్తూ
నీ ఎద తరుక్కు పోతుంటే
కన్నీరు విడుస్తావు
కరుణామూర్తివి ! వరమూర్తివి !
4
అందరికీ సేవచెయ్యడమే, పరమ ధర్మమన్నావు
వీరధర్మమన్నావు
వీరుడవో ! శూరుడవో !
వాళ్లపొలాలు సేద్యం చేశావు
వాళ్ల ఊళ్లు కత్తిగట్టి కాపాడావు
వాళ్ల పితరులు శయనించే పవిత్ర ప్రదేశం
కత్తిగట్టి కాపాడావు
5
నీ దైవం వేషాలు వేసిరాడు
నీ దైవం అబద్దాలు చెప్పడు
నీకు ఆస్తిలేదు ;
అస్థులు ఉన్నాయి, పుణుకలు ఉన్నాయి.
నువ్వు శివుని బిడ్డడవా పవిత్రమూర్తీ.
(3-5-1934)
హరిజన శ్యామసుందరి
1
నీరూపం ఎంత అందమైంది
నువ్వు ప్రకృతిలో లీలా స్వరూపిణివై పెరుగుతున్నావు
శుభ్రమై చినుగుల మావిడి చిగురు వన్నె చీర కట్టి
చింతపూరైక తొడిగి సవ సవ లాడే నీ సౌందర్య రేకలు
దోబూచులాడిస్తూ, పొలాల నడుస్తూ, కూటిబుట్ట
తలమీదెట్టుకొని, చెవిలో తురాయి పెట్టి నువ్వు
శిల్ప సుందరిలా ఉంటావు.
2
తెలిపడి, ప్రాణంలేని పట్టణాలలో, పల్లెటూళ్లలో
కవికీ శిల్పికీ శిల్పాధారం ఏది ?
శ్రుతికోసం తిరిగారు తిరిగారు వాళ్లు
వారియాత్ర ఒళ్లో బిడ్డను మరిచిన తల్లి సామెతయింది.
3
నీ గొంతులో పాట తేనెతుంపర ಜల్లు
నీకంటిలో వెలుగు మినుకు చుక్కల తళుకు
నీ మూర్తిలో సౌరు గున్నమామిడి తీరు
ఆటలై అందాల పాటలై
నిగ నిగై తొగరు పూవుల ప్రోవై
నీకు జోహారు.
4
మెరుము మెరసిన నీరూపు, నీరేక, నీవిలాసము
ఈ నాటికే కవికి, శిల్పికి దర్శనమైంది
ఇరువురూ నీకు జోహారు
ఇరువురూ నిన్ను పీఠాన్ని అధివసింప చేశారు.
5
నువ్వు శ్యామలవు, శారదవు.
నువ్వు భారతదేశం యొక్క రాయబోవు ప్రకరణానివి.
నీ వెలుగు ఒక మహాత్ముడు చూసి
నీ హృదయము ఒక మహాకవి పాడి
నీమూర్తి ఒక దివ్యశిల్పి లిఖించి
నీ ఎదుట తలవంచి నిలిచినాము మేము.
9-10-34.
రూపకల్యాణి
1
ఓదేవీ !
మహారాగిణీ !
నీలకుముద కిరీటినీ !
తప్త జాంబూనదోజ్జ్వలాంగినీ !
ఆనందరూపిణీ ! అమర పథవిహారిణీ !
గౌర రోహిత వసన ధారిణీ !
సర్వ రత్నాలంకార శోభినీ !
వల్లకీ తంత్రీ స్పందన ప్రేమరాగోల్లాసినీ ! రూపకల్యాణీ !
2
నీ పూజకై సర్వకుసుమాలూ వివిధోద్యాన వాటికల
సేకరించినాను
మాలల కూర్చినాను, మందార పూల చెండులు రచించినాను
దశాంగుల ధూపాల నింపి
దెసల బంధించి
అత్తరుల భమిడి వత్తుల దీపాలు వెలిగించి
అగరు గంధము పూసి, ఆరతిచ్చి
హృదయమే నైవేద్య మిచ్చినాను
3
నువ్వు రాగచిత్రాల నాబ్రతుకుపై రచించినావు
నువ్వు దివ్యగానాల నా ఆత్మ స్పందించినావు
ప్రణయాన కౌగలించి,
దీప్త కాంక్షల వక్షానకు గాఢంగా అదిమి
కళ్లలో కళ్లు చూసి
కలస్వనాల ప్రణయ మంతనాల మంత్రాలు పలికి
పాటలాధరాల వివశం చేసే తమితో నా పెదవుల చుంబించి
నాలోన లీనమైపోయినావు !
4
ఇంతలో మాయమయ్యావు నువ్వు
వంతల నన్ను ముంచి నావు
అది ప్రేమికుల ప్రణయ కోపమో, ప్రళయ భావమో!
నీకా రూపంవదలి, నాజీవితమే ప్రిదిలి,
మూలబంధాలే కదిలి, చిదికి, భువికి దూరమై
గుండెరక్తంతో చిత్రాలు రచించి, పత్రాలు ఆవేదనే నింపి
......................................
5
నాతపస్సు అనంతమై, నాచుట్టు అడవులు పెరిగి,
సంవత్సరాలు ప్రవహించి
నేను మ జునూనై !
కలలు లేని కాళరాత్రినై
6
తారాకాంతలు నన్ను ఓదార్చి,
గంధర్వ సుందరులు, విధ్యాధరకుసుమాంగినులు,
నాబాధల పంచుకొని
7
నా విరహము లోకాని కొక్క కలై
లోకంనన్ను విడిచి నడచి
.................
8
ఇంతలో మరల నువ్వు జన్మించినావు:
నీ శిశు పాటలు నే విన్నా, పోల్చుకున్నా
అవి ఆశలై, ఆ ఆశలకు నన్ను తేల్చి,
అవి దివ్య మంత్రాలై, నన్ను పవిత్రమధురాలనింపి
అమృత రసవాహినే పొంగి ..........
9
నువ్వు దినాలలో యవ్వనం తాల్చినావు
నువ్వు సౌరభమూర్తివి, నువ్వు దివ్య మంగళోజ్జ్వలవు
నువ్వు పరమ సుందరివి, నువ్వుపద్మాసనాసీనవు
నీ కడ మోకరిల్లి నేను .............
9-11-1930
30-8-1941.
నిత్యబాలక:
1
ఆ బాలకుడు వేయి వర్ణాల వెలుగు వాడు
గంగాస్రవంతీ పవిత్ర జలాంబువులు,
తొలిపాటలనేర్చే పరమ మనోహర ప్రదేశాలలో,
భావాశయ-రూపయామినీబాల వానికి తల్లి అయింది.
జననకాల శుభముహూర్తంలో
తెలితామర కుట్మలాల గుప్పిళ్లతో
ధవళ పుష్పగుచ్ఛాల చూచికిలకిల నవ్వినాడు
సంకేతికా ప్రదేశయాన అభిసారిక నూపుర ధ్వనిలా
కలస్వనాలపాటలు పాడినాడు.
ఉదయాంశ చుంబన ప్రపుల్ల పుష్ప దళాల
ఆబాలుడుయ్యాల లూగువాడు.
మహేశ్వర జటాజూటాంచల స్రవణ జాహ్నవీ పతనతోయాల
నెగురు తళత్తళ జ్వలితరత్నాల కందుకాల నాటలాడువాడు.
2
ఆ బాలుడు నా ప్రేమ నిధానం
నేను రచింపలేని శిల్ప మూర్తి అతడు
నేను పాడలేని పాటలే ఆతని కంఠము
నా స్వప్నమే అతడు.
3
గోపురంధ్రి తన వత్సలంపై వర్షించు ప్రేమకన్న
ఎక్కువ ప్రేమ నాకా బాలకునిపై
చుక్కలు మినుకు మినుకుమనే మిల మిలను నీలి ఆకాశ
పట్టు తెర లలంకరించిన
శోభన మందిరంలో
స్విన్న మధురాంగి ఉప్పొంగు బింకాలైన
వక్ష సౌభాగ్యాలు అనంత పథాలకు నిక్కిన
చూచుకాలున్న పరమ సుందరి,
దీర్ఘకుంతల స్నిగ్ధ నీల వపుష, ఉజ్వల దిశాంబరి,
నిశాకాంత నాగాఢాశ్లేషాన వివశయైన
రుద్రహాలీలజుడే, ఆశయరూపి ఆ బాలుడామె
గర్భమలంకరించినాడు.
21-12-1933.
అపశ్రుతి
ఈనాడు నా గొంతుక జీరపోయింది.
నువ్వు నాకంఠాన ప్రత్యక్షం కాలేదు
నా నోరు తడియారింది; నా నాల్క మొరడు బారింది
ఇన్ని నాళ్లుగా నువ్వు ఈ పీఠంపై అధివసించిన విధానం
ఈనాటి రీతి వేరైపోయినవి;
నీకళ్లు తళ తళ లాడవు, ప్రేమకాంతుల ఆర్ద్రత తాల్చవు
నీ పెదవుల తడి తేనె ఎరుపులు ఇంకిపోయినవి,
నవ్వులు ఎండిపోయినవి,
నీ దేహం కర్కశమైంది.
త్రిభంగము కాని, ఏ భంగమూకాని,
పద్మాసనం కాని, సుఖాసీనం కాని ; ఏ ఆసనం కాని
నీమూర్తి కఱ్ఱబారి ఉన్నది.
నువ్వు కట్టుకున్న చీర కఠినత వహించి,
ప్రవాహ రేఖలు లేక
లోహ ఫలకంలా బిఱ్ఱ బిగిసి ఉంది.
నీ జడ ముడి పొంకాలు పోలేదు,
మధుర పుష్పాల రచింపని పొడితనం శిరస్సుపై
కాగితపు పూలు నీ చేతిలో
నీమాటలో ఆర్ద్రతలేదు, శ్రుతులు లేవు,
స్వరాలు జీరపోయినవి
నీవెనక అపశ్రుతి నీడ
నా పూజ కొరతపోయి
నే సమకూర్చిన పూలు వాడిపోయి
పన్నీటి కలశాన, కమ్రవారి పసరు తాల్చి
లోకమే అపశ్రుతి
12-10-1934.