అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/అంజలి
అంజలి
| 31 |
| 32 |
| 33 |
| 34 |
| 35 |
| 36 |
| 37 |
| 38 |
| 39 |
| 40 |
| 41 |
| 42 |
| 43 |
| 44 |
| 45 |
| 46 |
వర్ణపతి
వర్ణపతి నీ కివే వందన సహస్రాలు దేవా!
స్వర్ణ కిరణావృతాప్లవిత చిత్రకళార్థినయ్యా!
కాలమే ఒంటి చ
క్రమ్మంట రథమునకు
వే లాంచలాయాత్ర
వేగాత్ముడవు దేవ!
వేయి పుటముల పద్మమోయి ఆ స్యందనము
అరుణకాంతుల వెలిగి
ఆకాశవీథిలో
రథముతోలేవాడు
పథములంటే పక్షిరాజా!
కాంతి రాజా! కాలజనకా!
శాంతి పూరిత జ్ఞానకాంతిని
ప్రజ్ఞ కలిగిన శక్తి కోరితి
బ్రతుకునంతా వెలుగునిమ్మని
ప్రణతు లివి గో నోయ్
(1939)
మృత్యుంజయ
విశ్వమంతా, సృష్టినంతా
వేగమై ఛటపటా రవళితొ
విలయ తాండవగతిని కదులుతు
వేల్చుతూ కమ్ముకొని వచ్చే
కాల విషమును చేతబట్టీ
సర్వ పథము లనంతమంతా
దివ్య జోత్స్నాకాంతి నింపగ
అవ్యయుడవై పెదవి చేర్చీ
'స్వాహ', అంచూ మింగినావూ
చలువ కప్పుర గొంతు నింపితి
నీలవర్ణములలమి కంఠము
నీలకంఠుడ వైతివోయీ
అమృతమొ హాలాహలమ్మో
ఆదిమూర్తి నీకు జీర్ణము
హస్తాన నమృతకలశాలతో
అభిషేకమౌతావు దేవా
ఒడిలోని అమృతకలశమ్మే
ఇడెదవే నాకు వరమిచ్చుతూ
(21.6.1940)
నీ పద పథము
ఒంటిగా పయనిస్తిరా!
నా నాథ!
ఇంటరము పాలయితిరా!
దారితెలియని నన్ను
చేరి చూపుము తెన్ను
కారడవిపాలయితి
చేర వెడలితి నిన్ను
ఏదారి ఎరుగలేనీ నాకు
నీ దివ్యపద పథమేగాని, ఇతరములు
“రాధారి” కాదురా, నాథా,
దుర్గమమ్మేనురా!
కంటకా వృతము లివి
కఠిన శిలపూర్ణములు
క్రూర మృగకీర్ణములు
దూరములు భారములు ॥ఏదారి॥
సన్న వెలుగుల దారి
తిన్నతిన్నని దారి
సకల పరిమళ పూర్ణ
సౌందర్యమే దారి ॥ఏదారి॥
అందాల రేకల్ల
చిందులు తొక్కేటి
అందె మువ్వల రవళి
అడుగులే నా దారి ॥ఏదారి॥
(30.6.40)
సూక్తి
నీలాంబుజ పుటాన నిలిచిపోయిన తళుకు
కాలమేఘాలలో కదలి వ్రాలినది.
పుష్ప గర్భితమైన పూదేనె కణములో
తరగలై పాల్కడలి కరిగిపోయినది.
(1939)
నేనొంటిని
గాలై ప్రసరిస్తే
వాగై ప్రవహిస్తే
మలయ పవనమై
మందాకినివై
రారా నారాజా
ఈ రాజ్యంలో
నే నొంటినిరా!
శాంతై జ్వలియిస్తే
కాంతై పులకిస్తే
శరత్ సుషమలై
శంపాలతవై
రారా నా రాజా!
యీ రాజ్యంలో,
నే నొంటినిరా!
(అక్టోబరు 1938)
కల
కన్నులు మూసేసరికి కలలో కనిపిస్తావు
కన్నులు విప్పేలోనె మిన్నుల కరిగీ పోదువు
కలకాల మీ బ్రతుకు కలలే వరములిచ్చి
కంటి పాపల్లోనె ఒంటిగ రారా నాథ
(ఏప్రిల్ 1922)
లీలా శుక వందితమూర్తీ
మాయా మానుష నీల శరీరా
మంగళమూర్తీ వేణు వినోదీ
లీలాశుక సంవందిత బాలా
మంజుల కింకిణి పదయుగఖేలా!
కృష్ణా కృష్ణా గోపకిశోరా!
నారద వీణా తంత్రీచారా!
వ్రజరమణీ కుచకుంకుమ చిత్రిత!
వక్షాంచిత ప్రాలంబిక నర్తిత!
అచింత్య ప్రణయానందవిహారీ
మునిజన వందిత పాదమురారీ ॥కృష్ణా॥
(1939)
ఎన్నాళ్లు వెదికేను
తీర్థాల కృంకాను దేవుళ్ల కొలిచాను,
సౌందర్య జ్వలితం నీదు మోము చాటైపోయె రాజ
ఎన్నాళ్లు వెదికేను, ఎన్నాళ్లు తిరిగేను?
నాథుడేడీ అనీ వీథిలో అడిగితే
అడుగొ అంచూ నిన్ను గుడిలొ చూపించారు
రాతిబొమ్మా నన్ను రాతికళ్లా నవ్వె ॥ఎన్నాళు॥
కాననానా నువ్వు కనిపిస్తువన్నారు
మురళిగీతిక తోడ మురిపిస్తువన్నారు
కాకలీస్వన మూల కళ్యాణి ప్రియమనిరి
నీలపు చీరగట్టి నీలపురైకా తొడిగి
నగలు తాల్చి వేణి వగలూర జడనల్లి
కనకాంబరాలుంచి కస్తూరి బొట్టెట్టి
పళ్లేన పూలుంచి పళ్లు భక్ష్యాలుంచి
కమ్మనత్తరు అలది కళ్లకాటుక దిద్ది
కృష్ణాభిసారికనై తృష్ణలూర వెడితి
నాథుని జాడలేదు నవ్వైన వినబడదు
మొదలూ నరికిన తరువు మోడై పడి పోయాను
నా నాథ దయలేద నా ప్రభూ నా ప్రభూ! ॥ఎన్నాళ్లు॥
(ఏప్రిల్ 1922)
ఆటపాట
ఆడుకొందామురా! పాడుకొందామురా
ఈడుగా జోడుగా
ఆడుకొందామురా! పాడుకొందామురా!
మురళి మోయించితే
ముద్దుబాలుడవైతె
మురళికే శ్రుతి కలిపి
మురుపిస్తు గీతాలు ॥ఆడు॥
శిఖిపించె మాడగా
చిరుగజ్జెలే మ్రోయ
నృత్తాన తళుకాడు
నీకు నేనే హంగు ॥ఆడు॥
ముద్దియ్యరా చెలీ
మోవిపై నొసటపై
మోహ రాగాలాప
మూర్ఛనలు నను ముంచె ॥ఆడు॥
(అక్టోబర్, 1938)
అచిత్రితము
గోపబాలా!
గోపబాలా!
కృష్ణా కృష్ణా
రాధా హృదిలోలా!
గోపబాల గోపబాల
అంబారవలోలా!
గోపబాలు
నీలి రూపమే
నిఖిల భావమై
నిర్మలకాంతై
నిశ్చలమై ఉంటే
నిన్ను లిఖింపా
నేరదు హస్తం
నేరదు కుంచే
నేరదు వర్ణం
నిస్తబ్ధుణ్ణె
నిలిచా లేరా
కృష్ణా కృష్ణా
బృందావన చారా!
(అక్టోబర్,1938)
మెచ్చవద్దూ?
ఎంతకాలం నేను యిచటా
పంతగించిన నువ్వు అచటా
బాగుగా తోచెనే నీకు
పదిమంది నను మెచ్చవద్దా?
ఎంతకాలం ...
ప్రణయ కోపమేమొ లేక
ప్రళయ హృదయమొ నీకు
ప్రాణేశ నిర్దయ పాలబడి పోయాను
ఎంతకాలం...
బంధువులు స్నేహితులు
పలుమాటలాడేరు
అందరిలో తలవంపులన్న నీకేమిరా!
ఎంతకాలం...
సుందరాంగిని కాను
సొబగు చేయగలేను
నిన్ను ప్రేమించుటే నేను నేర్చినదాన!
ఎంతకాలం...
(1936)
ఉదయ సంధ్యా నృత్యం
మధుర లాస్య పరవశరతి
పదములల్లె లయలు గతులు
నవ్యమైన ప్రణయావేశమ్ములు
అవ్యక్త ప్రధమత్వమ్ములు
హావ భావ విభ్రమాలు
హాసకరుణ రాగమ్ములు
వ్రీడావతి ముగ్ధత్వము
విప్రలంభ సంవేగము
కరుగు కతలు కలకంఠమ్ములు
కలల వలపును త్సాహమ్ములు
మధుర లాస్యపరవశ రతి
పదములల్లె లయలు గతులు
అరుణ ధవళమిశ్రమాలు
చరణయుగళ సుమతలాలు
కాలాతీత పదమ్ముల
లీలాంచిత నృత్తమ్ముల
అర్థమెరుగ రాని నిసుగు
కుర్దనములు ముద్దు పలుకు
భావరహిత వ్యంజనములు
గోవత్సపు పేరెమ్ములు
హరిణనేత్ర సంచలనము
అలవోకకు వెడలు పాట
స్వరలహరీ విహరణమ్ము
మురజ ధిమింధిమి ధ్వాన హళంకిత
మధుర నృత్త పరవశ రతి
పదములల్లె చారగతులు
(సెప్టెంబర్, 1937)
పట్టిసం.....
గోదారి మధ్యనే కొండొకటి వెలిసింది
కొండపై జంగమయ కొలువు వేం చేశాడు,
గోదారి గంగలో కూడె తీర్థాలన్ని
కొండపై జంగమయ కోటి అభిషేకాలు,
గోదారి వరదలో కోటిపూవులు పత్రి
కొండపై జంగమయ వెండి పూవుల పూజ.
గోదారి కెరటాలు కొండతో గుసగుసలు
కొండపై జంగమయ కునుకు బంగరుడోల!
(జనవరి 1941)
చార్వాకుడు
నీవు లేవని సభల
నిలుచుండి వాదించి
నిన్ను కొలిచే మమ్ము
నిందించి పోసేరు
నీ వుంటివో లేదొ
నిజము తెలియదు సామి!
నిన్ను సృష్టించింది
నిక్కమే నరుడంట
నీనుంచి మేమేనొ?
మానుంచి నీవేనొ?
నీ వితము మాకింత
నిజము తెలియదు సామి!
మా సృష్టియనుకొన్న
మా శాస్త్రముల రీతి
మాకు నిజమే అయితె
మావాడ వగు నీవు
మాకేల నిజభావ
మై మమ్ము చేరవూ
నీ ఆట లివి దేవ!
నీ చిత్ర మిది సామి!
(28.10.41)
ఆత్మేశరామయ్య
ఆత్మేశరామయ్య
ఆశిస్తినొక నవ్వు
ఆలకిస్తుంటిరా
అడుగు సవ్వడి కొరకు.
నీ కొరకె ఈ కలలు
నీ కొరకె ఈ కళలు
నిలువు దోపిడికోరు
ఈ జాణ తనమేల? ॥ఆత్మేశ॥
ఘుమ ఘుమాయుత గంధ
గృహసీమ సుందరిని
వ్రజకామినిని గాను
ప్రజలలో ఒకరితిని ॥ఆత్మేశ॥
శృంగార నాయకా
రంగేశ శ్రీరమణ
బంగారు కమలాల
పూజింపలేనయ్య ॥ఆత్మేశ॥
డమరువు
ఓం
భోం భోం భోం భో
ఢం, ఢలట్, డ డి లట్
ఢమ ఢమ ఢమ ఢల లట్ డలట్
డల లకి ఢం ఢం డల లట్
ఢం ఢం ఢం డోం
"ఓం", అనగా
నీ డమరువు మ్రోగే శివా!
కాంతి తరంగాలుత్తుంగాలై
కాలాలన్నీ జ్వాలలు ముంచీ
ధళ ధళ ధళ ధళ ధళ
సర్వ పథాలూ
సకల శూన్యములు
కోటిసూర్య తేజస్సులనైనా
చీకటి కణముల చేసే జ్యోతీ
ఢం ఢం ఢమ ఢమ ఢలలట్
ఢం ఢం ఢమ ఢమ ఢలలట్
దళ ధళ ధళ ధళ ధళ
జ్వలిత జ్వలిత జ్వలితాను కోటి
ఆవరించి చిచ్ఛక్తుల శిఖలూ
సుడిగుండాలై వడులై ఝరులై
ప్రవహించింది డమరువు మ్రోతా
ఓం
భోం భోం భోం భోం
డోం డోం డోం డోం
ఢం ఢం.ఢలలట్
ఓం
ప్రణవనాదమున డమరువు మ్రోగె శివా!
ఓం
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ
బ్రహ్మ పదార్థము తెలియలేనిదట
సత్య మదంటా నిత్యపదంరా
సత్యములోనా ఇమిడిన శక్తీ
శక్తిమానుడు శక్తియు లీలలు
పూరుషోత్తముడు పురుషుడు ప్రకృతీ
భోం భోం ఓం ఓం
ధళ ధళ ధళ ధళ తేజోధారే
జ్వలతి జ్వలిత జ్వలించిపోవుచు
సర్వ సృష్టిగా మారిపోయినది
జ్వలిత, జ్వలిత జ్వలితానుకోటి
కోటి కోటి కోటానేక
ప్రభాశూన్యతలముల్
లోకాలు
తారల్
సూర్యు లోకమట
సూర్య ఖండములు గ్రహరాజములు
సర్వ దేవతలు
సర్వ భువనములు
భువనములోనే
'మనుజులు' జంతులు, పురుగులు, ప్రాణులు
భోం భో మని డమరువు మ్రోగె శివా!
సకల సృష్టికీ
సర్వ జగత్తుకు
ప్రాణ ప్రదీప్తముగ
'ఓం, భోం' మని నీ డమరువు మ్రోగె శివా!