Jump to content

అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల/శైలబాల

​

శైలబాల

శిథిలమై ఒరిగిపోయిన మండపాలు; ముక్కలై భూపతనమైన అంతఃపురాలు; కూలి వ్రీలిపోయిన గోపురాలు; పొడవడగి ప్రోగులుపడ్డ దేవాలయాలు; తలక్రిందులైన శిఖరాలు; రాలిన విగ్రహాలు; ఒకనా డాంధ్ర ప్రపంచానికి శిరోమణియైన శత్రురాజ్యాలకు నిర్భేద్యమైన సమస్త దక్షిణా పథాన్ని ఏకఛత్రంగా ఏలిన విద్యానగర మహాపురము నేడు నామమాత్రమై పెద్ద వస్తుప్రదర్శనశాలయై యాత్రికులను నిశ్చేష్టులను చేసి, కళ్ళనీరు నింపుతున్నది.

తన ఆనందాన్ని చీకుసల్పుతూన్న ఆ శిధిలత్వంలో ఏదారిని నడుస్తున్నాడో తెలియక, తిరిగిన దారినే తిరుగుతూ, ఏది చూస్తున్నాడో తెలియక చూచినదాన్నే చూస్తూ, కళ్ళ కాంతులు శిలాత్వము పొందగా తుంగభద్రానదీ తీరాన, పెద్ద ముళ్ళపొద ప్రక్కనే నాగచంద్రుడు చదికిలపడ్డాడు.

నాగచంద్రుడు చిత్రకారుడు. రసానంద తన్మయుడు. మహా శిల్పగానంలో ఆ భయంకరాపశ్రుతి అతని జీవితాశయాలను భగ్నం చేసింది.

ఇంతలో వెనుక ఎవరో అతన్ని తీవ్రదృష్టులతో పరికిస్తున్నట్లుంది. చైతన్యరహితుడై ఉన్న నాగచంద్రునికి ఆచూపుల తీవ్రత చురుక్కుమని తగిలి మత్తు విరిగే మందిచ్చినట్లయింది. అతడు లేచాడు. వెనక్కి పరికించి చూచాడు. పెద్దపొద; మరేమిన్నీ కనబడలేదు. ఆ అదృశ్యవ్యక్తి చూపులు చల్లనై తోచినవి. నాగచంద్రుడు ఇదేమని పొదచుట్టూ చూచి యేదిన్నీ కానక, పొగమంచు కమ్మిఉన్న హృదయపథం మరిన్నీ చీకట్లు అలుముకోగా, వెఱ్ఱివాని విస్మయం పొందుతూ మళ్ళీ నది ఒడ్డున కూర్చున్నాడు. ఈసారి అతనికి నిట్టూర్పు వినబడింది. నాగచంద్రుడు లేచి, సగము నిద్ర మత్తు తెలుస్తున్నవానిలా తూలుతూ, పొదదగ్గిరే నిల్చుని, పొదలోనికి పార చూచినాడు, అస్పష్టంగా మెడలోహారాల చప్పుడు. నాగచంద్రుడు తూలి ముళ్ళడొంకలో పడబోయినాడు. స్పష్టంగా మళ్ళీ నిట్టూర్పు, అది ఘంటారావమై అతని మెదడులో మోగింది. నాగచంద్రునికి పూర్తిగా మెళకువ వచ్చింది. పక్కనేఉన్న సంచిలోనుంచి చేతిగొడ్డలితీసి పొద నరకడం ప్రారంభించాడు.

బర్రెంక, రక్కెస, నాభిలత, అడవిమల్లె, పురుగుడు, పాలకర్ర, చిట్టిరేగూ విసవిసా వీరభద్రుడై నాగచంద్రుడు అరజాములో నరికిపారవేసినాడు. సగము నరికిన ఆ పొదమధ్య నృత్యము చేయబోయే శిలాబాలిక! పరువము పండించుకొన్న కోటి కోటి సంవత్సరాల యీడు కలిగిన దక్కను పీఠభూమి నల్లరాయిలో, స్నిగ్ధతిస్నిగ్ధమైన చెక్కడం. స్త్రీ ప్రపంచాన అందం ఏరితెచ్చి, చేర్చి ముద్దపోసి ఆ బాలికామూర్తిని శిల్పించినారు. కోలమోము, ​లోతెరుగని నాసికామూలము సమప్రవాహపతనమైనరేఖ. రేక మందార మొగ్గవంపులో తిరిగి ఓష్ఠాంచలముపైన సుడితిరిగిపోయింది. చిరునగవున వికసించబోయే ఆమె పెదవులు కొద్దిగా విడివడి స్విన్నాలై, ఈవలావల కాశీరత్న పూవుల చెక్కిలి గుంటలను అలంకరించుకొన్నవి. అధరముదిగువ నిమ్నమై, చిరురసాల ఫలమైన ఆమెచిబుక మాధుర్యముగ్రీవ శంఖాన ధారై చేరుకొన్నది.

ఆమె చతుర్భంగాభిరామ. ఆమె పరమవశనర్తకి. సన్నని బంగారు దుకూలమో ఏమో కటి ప్రదేశాన వ్రేలాడే మొలనూలు మెలపులలో కలిసి పోయి విద్యున్మాల అయినది. మంజీరములున్నూ, చిరుగంటలున్నూ అలంకరించిన ఆమెపాదము తరులతై భూమిమీద వాలబోతున్నట్లున్నది. ఆమె ఎడమపాదపు వేళ్ళపైన ఎగరబొయ్యే పక్షిలా నృత్యగతిలో ఆకాశ పథభంగిమతో ఉన్నది. ఆటాడే తాచుబాము దక్షిణహస్తము, అర్ధచంద్రికాముద్ర: సవ్యహస్తము లోలముహంసముద్రిక; కంకణాలతో, గాజులతో, భుజభూషణాలతో, చెదిరిపోయే వేణీబంధముతో, పొంకాలయి ప్రేమ వాహినీమూలాలై, కదంబపుష్పాలై కలలవిధులైన వక్షాలపైన ఉబికె అనేక హారాలతో నృత్యావేళ దివ్యసుందరియైన కాలాన ఒకక్షణికంలో శిల్పి ఒకడు శాంబరీవిద్యచేత శిలగా మార్చినట్లు ఆమె ప్రత్యక్షమైంది.

2

నాగచంద్రుడు అలాగే నిలుచుండిపోయినాడు! అతని ఊహాపథాలు దాటిపోయిన శిల్పసౌందర్యం తొందర తొందరగా ఆవిగ్రహంచుట్టూ ఉన్న డొంకలు నరికిపారవేసి, ఆ ప్రదేశం అంతా శుభ్రంచేసి, తంగభద్రలో నుంచి తన సంచిలో కలశంతో నీళ్ళు తెచ్చి ఒత్తుగా చల్లినాడు. వివిధ పుష్పాలు సేకరించి, దండలు గుచ్చి ఆమె మెడలోను వేణీభరంపైన అలంకరించాడు. పూవులతో ఆమె పాదాలు పూజచేసినాడు. తనివితీర చూపులతో ఆమెనుచూస్తూ మోకరిల్లాడు. అప్రయత్నంగా అతనిఫాలం చివురు జొంపాలలాలిత్యం చూపిస్తూ కఠినమైఉన్న ఆమెపాదంపైని చేరింది. లోతెరుగని ఉత్కంఠ నాగచంద్రుని వణికించింది.

ఏమిది? అతని శిరస్సుపైన నాతిదూరాన ఉన్న ఆమె కుడిపాదము నెమ్మదిగా దిగుతూ అతనిమూర్ధానికి కొంచెం తగిలింది. నాగచంద్రుడు ఉలిక్కిపడిలేచి ఆమె మోముపైన తీక్షణదృష్టులు పరిపినాడు. అతని కుడిచేయి ఆమె ఎడమమీగాలిపైన నఖంపచస్పర్శ నందింది. ఇంతలో ఆ బాలిక చిరుపులుగు ఎలుగుల నవ్వి ఒడలు కొంచెం కదలించింది. బిగిసిపోయే హృదయంతో నాగచంద్రుడు లేచి నిలుచున్నాడు.

చైతన్యోదయ మవుతూఉన్న అస్నిగ్ధ నీలోపల శరీరాన నులివెచ్చ రక్తము జలజల పోటెత్తి సమవిషమతలాల క్రొమ్మెరుగులు పులకించి సమస్త నాడుల స్పందించి మెత్తనిదారులై, కొంజివురై నవనీతమై పోయింది. చూస్తూ ఉండగానే ఆ శరీరము ఉదయ సంధ్యాకాశములో క్షణక్షణం వన్నెలు మారుస్తూ, కపిశమై, పిశంగమై, శ్వేతమయి, పాటలమయి, పీతమయి పుటములో బంగారమయిపోయినది. కర్కశమయిన ఆమె కబరీభరమునల్లపట్టుకుచ్చుల వేణీభరమయినది. నగలు బంగారులై తళుకులాడినవి.

“తణికిటతోం” అని ఆ బాలిక నాట్యమాడ ప్రారంభించింది. కాళ్ళ చిరుగంటలు చతురస్రగతి త్రిపుటతాళము వేసినవి. రానురాను స్ఫుటమయిన కంఠంతో ​


లలిత లవఙ్గలతా పరిశీలన కోమల, మలయసమీరే
మధుకరనికర కరచ్యుత కోకిల కూజిత కుంజకుటీరే
విహరతి హరిరిహ సరసవసంతే
నృత్యతి యువతిజనేన సమంసఖి!


అని పాడుతూ ఆ బాలిక అభినయిస్తున్నది. నాగచంద్రుని ముఖము విరిసిపోయిన దిరిసెనచెట్టులా ప్రఫుల్ల మయింది. పొంకాలయి పొలుపు మీరిన ఆమె హస్తాల విన్యాసవేగము అడవి నిమ్మపూవుల పరిమళమయింది. చిరుచెమ్మటలు నఖాగ్రాలతో తుడుచుకుంటూ నాట్యమాడి, మధురమయిన ఊర్పులు విడుస్తూ ఆ బాలిక వచ్చి, నాగచంద్రుని భుజాల పైన చేతులు ఉంచింది. అతని దేహాన గగుర్పాటులు మలయసమీరము రివ్వున ప్రవహించినప్పటి చెరువులో నీటికెరటాలలా పరువులిడినవి. విడివడి ఆమె పెదవులు పరిమళములో అతని కపోలాలపైన అలమిపోయినవి. దివ్య యౌవనం విరిసిపోతూ పరమసౌందర్యం విరజల్లుతూ ఆ బాలిక చటుక్కున తనను ఆవరించినప్పుడు నాగచంద్రుని చేతులు అప్రయత్నంగా ఆమెను కౌగలించుకోబోయి మరల వాలినవి.


"ఏమయ్యా! తుంగభద్రాతీరాన కూర్చుందాము రా” అని ఆమె అతని కుడిచేయి పట్టుకొని నదిగట్టుదగ్గిరికి అతనికి దారిచూపుతూ అక్కడే ఉన్న ఓ నల్లరాళ్ళ గుట్టమీద అధివసింపజేసింది. అతని పక్కనే ఆమె ఆసీనమయింది.


"నీ హృదయంలో నే నెవరా? అన్న ప్రశ్న మొలకెత్తింది! ఈ రాళ్ళన్నీ ఒకరకం చుట్టాలు నాకు. ఈ సంధ్యాశబల రాగంలో అవ్యక్తంగా కనబడే అమాతంగగిరి ఒక్క చిన్నశిల నా పూర్వరూపం. ఈ కథ విను!


“ఆనాడు ఎందుకో సార్వభౌముడు విచారమేఘంతో పొదువబడ్డ మలయగిరిశృంగం అయ్యాడు. అప్పాజీ పలుకులు ఆ ధీరుని హృదయానికి ఉపశమనం కూర్చలేదు. పెద్దన్నగారి పద్యాలు మేఘంలో ఉరుములయ్యాయి. పేరుపొందిన అందకత్తెల్ని వెలవెల పోవచేసే మావాళ్ళు భరతపయోరాశి మథించగా పుట్టిన అప్సరసలు, రాజులో రసజ్ఞతా చంద్రికలను వుదయింప చెయ్యలేక పోయినారు.


“ఒక నృత్యాంగన చెంగల్వరాయ సేనానాయకుల వలపుకత్తె. శ్రీకృష్ణరాయసార్వభౌములవారి ఆదరణ పొంది శ్రీవారి ఆగ్రహానికి గురియైన తన స్వామికి ఉపకారం చేయ చూస్తూ ఉన్నది. ఆమె తన కుమార్తెను పిలిపించి గజ్జెకట్టించింది. ఆ బాలిక తిలోత్తమకు అందం వంకలు దిద్దగలదు. ఆటలో ఊర్వసికి అపరావతారం, అంతవరకూ, ఆమె కన్నె చెర వీడలేదు. ఆ బాలికను సార్వభౌమునికి సమర్పింపడానికి తల్లి చెంగల్వరాయనితో మంతనం సలిపి అదను చూస్తున్నది. ఇంతకన్న వేరేసమయంరాదని ఊహించి ఆ నట్టువరాలు తనకుమార్తెను సభలోకి ఉత్సవములతో కొనివచ్చింది.


ఆ మేళానికి గురువు అమ్మనాచార్యులవారు. చక్రవర్తికి జోహార్లు చేసి, మహాప్రభూ! దివ్యనృత్యేశ్వరు పాదాలకడ పూజచేస్తూ విద్యనభ్యసించిన ఓ అప్సరాంగన దేవరరాజ్యంలో ఉద్భవించింది. ఆ బాలిక భరతంలో పదహారు సంప్రదాయాలూ నేర్చుకొన్నది ఆమె ​విద్య అపర దేవేంద్రులైన సార్వభౌములు దివ్యచిత్తాన అవధరింతురుగాక! రాజరాజేశ్వరుల హాసాంచనుషను లా కన్నెపైన ప్రసరించి ఆమెను పవిత్రను చేయుగాక!” అని నివేదించుకొన్నాడు. మహారాజులుంగారు అంగీకార సూచకంగా తల పంకించారు.

“అర్ధచిటికలో క్రొక్కారు మెరుగుతీగలా ఆ బాలిక చక్రవర్తి ఎదుట నాట్యాన సాగిలపడి. ప్రభువు “లే” అనేవరకూ భూమిపైన వ్రాలిన చంద్రకళలా, పచ్చికలో ప్రసరించే కేతకి పన్నగిలా ఆ సభాచంద్రశిలాతలము పైన అట్లే పడి ఉన్నది. మహారాజు కనుసన్న అయినది. ఒక్కుమ్మడిగా తోలుతిత్తిశ్రుతులతో ఒక విపంచి, ఒక కిన్నెర, ఒక సైరంధ్రి పక్క వాద్యాలయినవి. దశావతార కథనము ఎత్తుకొని హంగుచేసే గణికలు తాళాలు వాయిస్తున్నారు. మృదంగం పూర్ణలయావతారమైనది రసము తొలుకాడే ఒక్క విహంగవృత్తగతిలో ఆ బాలిక సుడిగాలిలా లేచి :


“ప్రళయ పయోధిజలే ధృతవానసి వేదం
విహిత వహిత్ర చరిత్ర మభేదం ధృతవానసి వేదం.
కేశవ, ధృతమీనశరీర, జయ జగదీశ హరే!
క్షితి రతి విపులతలే తవ తిష్ఠతి పృష్ఠే
ధరణి ధరణి కిణ చక్రగరిషే తవ తిష్టతి పృష్టే
కేశవ, ధృత కచ్ఛపరూప, జయజగదీశ, హరే!...


అని పాడుతూ అభినయించి సభను సమ్మోహనం చేసింది.”

3

నాగచంద్రు డా బాలిక మాటలు వింటూ, సంభ్రమాశ్చర్యాలకు లోనౌతూ, తుంగభద్రనీళ్ళు చీకట్లు తాలుస్తూ ఉండడం కనుగొంటూ, ప్రణయ పూజాసేవకుడౌతూ, ఆ బాలిక అందాల మోము పరికించి చూస్తూ, దగ్గిరగా అధివసించిన ఆమె యౌవనానందానికే సమ్మోహితుడౌతూ, నిలువునా పులకిస్తున్నాడు.

"ఈ ప్రదేశం నన్ను దివ్యానందంలో పరవశుణ్ణి చేస్తున్నది!”

“సార్వభౌముల కాలంలో ఇక్కడే ఒక్క శిల్ప మందిరం ఉండేది.”

నాగచంద్రు డామెవంక చకితుడై చూస్తూ “ఈ తుంగభద్రా నదీ సౌందర్యము ఏలాంటి దివ్య స్మృతులు మొలకలెత్తిస్తున్నది!” అన్నాడు.

"నీ హృదయ సౌందర్యమున్ను అలాంటిదే.”

“సుందరతరమైన నీరూపజ్యోతి నన్ను పాదాక్రాంతుణ్ణి చేసుకుంటూంది!”

"అయితే నాకు హృదయం లేదంటావా, ప్రభూ?”

“ప్రభూ! ప్రభూ!” అనుకుంటూ నాగచంద్రుడు విస్మయం పడ్డాడు.

"నీ హృదయం నా ఊహ కందరానిది.”

"పణ్యస్త్రీకి హృదయం ఉంటుందా స్వామీ?”

“సర్వ ప్రపంచానికి సౌరభాలు చూరలిచ్చిన పణ్య స్త్రీల హృదయాలు వందనీయాలు.” ​“హేళనా ప్రభూ?”

"హేళనా? నీ ఆవిర్భావం ఇంతవరకు నన్ను అచేతనుణ్ణి చేసింది. ఏ అందాన్ని నేను ఊహచేసుకోలేకుండా ఉన్నానో. ఏ అందం నాకు ఇంత వరకూ ప్రత్యక్షంకాలేదో, ఏ అందం ఉంటుందని భావించి భావించి, దేహం పరవశంకాగా, హృదయం ద్రవించి పోగా, నా ఆత్మ స్వార్పణకోసం ఎదురుచూస్తున్నదో, ఆ అందం ఈనాటికి నీలో చూపిన నాకు హేళనా ప్రణయ దేవీ?”

ఆ బాలిక అతని ఒడిలోకి వాలిపోయింది.

నాగచంద్రుడు ఆవేశంతో, పూజ్యభావంతో ఆమెను బిగియార కౌగలించుకొన్నాడు. ఆ ముహూర్తము అతి పవిత్రమైనది. ఆ సంశ్లేషములో వారిప్రేమ మరీ గాఢమై మధురాతి మధురమైనది.

“దేవీ! దేవీ!” - గద్గదమైన అతని గొంతుక అతిప్రేమ పూర్ణమైనది. ఆమె కంఠంనుంచి అదృష్టమైన విచారస్వనము వినిపించి అతని శ్రవణాలకు భూకంప నిస్వనమైంది!

"ఏమీ! ఏమిటిది! కళ్ళనీళ్ళు నింపుతున్నావే? నీబంగారు దేహలత వణుకుతూ ఉన్నదేమిటి? ఈ విచారమెందుకు పవిత్రమూర్తీ!”

“నీ పూజ నన్ను మూలానికి కదులుస్తున్నది. రూపం అమ్ముకొని బ్రతికే మేము ప్రేమమాధుర్యము రుచియైనా ఎరగం. నన్ను పూజాపీఠ మెక్కించి పరవశురాల్ని చేస్తున్నావు!”

"విద్య నాలో వ్యక్తమౌతూవున్న ఇంతనాటినుంచీ ఒక అద్భుత మూర్తినీ, ఆ మూర్తిని ఆవరించి ఉండే ఓ విచిత్ర హృదయాన్నీ, ఆ సర్వాన్ని ఆవరించి పూర్ణించుకొని ఉన్న పవిత్రాత్మను ఉత్కృ ష్ణాశయం చేసుకొని నేను ఆ దేవికోసం లోకాలు గాలిస్తూ, నా హృదయం దేవాలయం చేసుకొని పూజాద్రవ్యాలతో అంతులేని యాత్ర చేస్తున్నాను.”

"ఆ ఆశయం మృగతృష్ణ మాత్రమేకదా ప్రభూ!”

“నిజమనుకొనే ఈ ప్రపంచానికన్న మృగతృష్ణ ఎక్కువ నిజంకాదా దేవీ!” అంటూ నాగచంద్రు డా విచిత్ర బాలికను మరీగాఢంగా కౌగలించుకొన్నాడు. ఆ అమృతమూర్తిని అలముకొన్న పరీమళాలతో వివశుడయ్యాడు.

చక్రవర్తి పరమేశ్వరపదజనితమైనట్టిన్నీ, నందికేశ్వర సముపదిష్టమైనట్టిన్నీ, భరతమహర్షి ప్రచారితమైనట్టిన్నీ ఏ విద్య ఉన్నదో, ఆ మహాకళ నాడు ఆ బాలికలో మూర్తీభవించి, వికసించడం కనుగొన్నాడు.

నాగచంద్రుడు విప్పారిన నయనాలతో ఆమెను తిలకిస్తూ, “దేవీ! ఆ బాలికవు నువ్వుకావుగదా” అని అడిగినాడు.

"ప్రభూ! నేను కానని చెప్పనా, అవుదునని చెప్పనా?”

ఈషవదనమైన ఆమె మోమును నాగచంద్రుడు చుబుకముపట్టి లేవనెత్తుచు దేవీ! నీ పెదవుల్లో మందహాస లేశమన్నా నర్తింపకుండా నన్నీ విచిత్రస్వప్నంలో తేలుస్తున్నావా?” అన్నాడు. ​ప్రభూ! నా సర్వస్వము నీకుపూర్ణార్పణం చేస్తున్నా. ఆదివ్య క్షణాలు స్వప్నమో నిజమో నాకే తెలియకుండా ఉన్నవి.”

“ఆ దివ్యస్వప్నమే ఎప్పుడూ నిలిచిఉండరాదా!”

“అవును ప్రభూ!”

అని విశ్వసిస్తూ ఆ బాలిక "ఆ నృత్యము సార్వభౌమునికి ఆనందం నివేద నిచ్చింది. ఆ రాత్రి -” అన్నది.

"ఆ రాత్రి?"

“సార్వభౌముని అంతఃపురానికి ఆ బాలికను పంపడమయింది” నాగ చంద్రుడు కూలిపోయినాడు. అతని చేతులు వాడిపోయిన తామరతూళ్ళయి వాలిపోయినవి. అతడు నిట్టూర్పు విడుస్తూ ఆ నల్లరాతిమీద తల వాల్చాడు. “ఇక వినలేను దేవీ!”

“ప్రభూ, నేను పణ్యస్త్రీని.”

"నిన్నారాత్రి పంపిన పాతకులు భ్రష్టులు, పిశాచాలు!”

“ప్రభూ! అతి హీనకులంలో జన్మించిన మా పాప హృదయాలు పవిత్రం కాగలవా? సార్వభౌముని క్రీగంటిచూపు మమ్మల్ని అప్సరసల్ని చేయదా!”

"మీవి దివ్యజన్మలే దేవీ! మిమ్మల్ని అనుభవించే ఆ నీచాతి నీచులు- ”

"ప్రభూ, విను- సర్వాలంకారాలతో వాసకనజ్జికనై, మహారాణినైనట్లు ఉప్పొంగిపోతూ, చక్రవర్తి రాకకై ఎదురు చూస్తుంటిని. ముహూర్తాలూ గడచినవి. కోటలో ఘంటారావాలు మోగుతున్నవి. అర్ధరాత్ర తూర్యారావాలు తృతీయ యామపు ఢంకా నినాదాలూ వినబడుతూనే ఉన్నవి. అంతఃపురాలన్నీ నిశ్శబ్దంలో జోగిఉన్నవి. ఆ చిన్నమాంబారసికుడు రాలేదు. నా హృదయంలో దావానలం చిగురించింది. లజ్జతో కుంగి పోయాను. ఆ మహాపరాభవంలో వైతాళికుల హెచ్చరికలు, వందిమాగధుల పాటలు నా హృదయకుహరంలో బ్రహ్మాండము పగిలినట్లు ప్రతిధ్వనించి, ఒళ్ళు తెలియని మూర్ఛలో మునిగిపోయినాను.

నాగచంద్రుడు చివుక్కునలేచి కూర్చున్నాడు.

"సార్వభౌముని సౌజన్యము నే నొక్క క్షణమాత్రం సందేహించాను. నువ్వంతఃపురంలోకి వెళ్ళిన సంగతి మహారాజుకు తెలుసునా?”

“ఈ పణ్యస్త్రీకి అంత విచారణచేసే యోగ్యత కలదా ప్రభూ! చిన్నమాంబాదేవి సరసల్లాపానందుడైన చక్రవర్తికి ఆ దేవిపైన యేదో కారణంచేత కొంచెం కోపం వచ్చిందనీ, ఆనాటి నా నాట్యం ఆయన హృదయంలో సందేహాన్ని వెన్నెలై చీకట్లు పారదోలిందనీ, సభనుంచే, ఆ పట్టునే మహాప్రభువు చిన్నమాంబాదేవి అంతఃపురానికి పోయి క్షమాపణ వేడి ఆమెను అనునయించినాడనీ తరువాత నేను విన్నాను.”

“చెంగల్వరాయని దుశ్చేష్టితంసుమా దేవీ ఇది!”

“అయిదురోజుల వెనుక, తీవ్రజ్వరంలో ఉన్న నాకు స్ఫుటాస్ఫుటంగా మెలకువ వచ్చింది. నృత్యంనాటి ఆ సభలో రాజశిల్పి శిష్యులతో వచ్చి ఉన్నాడట. ఒక శిష్యుడు - ఆనందరసైక జీవి, దివ్య సౌందర్యానందుడు - ఈ పాపినీ ఈమె నాట్యాన్నీ చూచి వెర్రి ప్రేమలో మునిగిపోయినాడట -” ​“మునిగిపోవటం అబ్బురమా దేవీ?”

“ఆ బాలిక ఆ జ్వరంతో కృశించి కృశించి అసువులను నాలో కలయించు" ఆ మాట ముగించకుండానే నాగచంద్రుడు ఆ శిలాబాలను, చెమర్చే కన్నులతో దరికి చేరదీసుకొని ఆ మోము తన హృదయాని కద్దుకొని, ఆమె తల కన్నీటితో తడిపినాడు.

తూర్పున కొండలపై ప్రక్కనే ఎర్రనై నాగచంద్రుని సంతోష రాగములా చంద్రబింబము ఉదయించింది. తుంగభద్ర నీళ్ళు శిలాబాల హృదయములా కెంపుజీరలు సాగినవి. సర్వప్రపంచము జోత్స్నానందంలో వివశత్వమొందింది.

ఆ శిలావేదికపైన నాగచంద్రుడు మెత్తని తల్పము అమరించి ఆ బాలికను అధివసింపచేసినాడు. ఆమె మోమును తనివితీరగా పారకిస్తాడు. ఆమె సౌందర్యరేఖల చేతులు హృదయాని కద్దుకొని దూరాన్నుండి దగ్గర నుండి గమనిస్తాడు. ఆమె లావణ్యము పుడిసిళ్ళ కన్నుల కద్దుకుంటాడు. ఆమె ఇంకనూ శిలాబాల కాదుకదా అన్న అనుమానము వీడనిచూపులతో, స్పర్శతో కదుష్ణతను, కాంతులను పరిశీలిస్తాడు.

ఆమె చిరునవ్వుతో, సిగ్గుతో కొంచెం వంచిన మోముతో నీలాలజాలరులైన కనురెప్పలచాటున నుండిన అతని ఆనందము తనహృదయాన్ని నింపుకుంటూన్నది.

నాగచంద్రుడు ఆమెయెదుట మోకరించి “నువ్వు నా స్వప్నబాలవు. నా జీవితాధిష్ఠాన దేవతవు. నేను తుంగభద్రను, నీవు కృష్ణవు" అని ఆమె ఒడిలో వాలినాడు.

4

అతడా ఆనంద తన్మయత్వంలో, తమి నిండిన హృదయముతో, అరుణావిర్భావమును గుర్తింపలేదు. మాల్యవత్పర్వత సానువులపైన ఒక రెప్పపాటు తన రథము ఆపి కర్మసాక్షియైన సూర్యభగవానుడు ఆ నూత్న దంపతులపైన తన అరుణకిరణ కుంకుమాక్షంతలు చల్లినాడు. సుఖపారవశ్యముద్రితాలయిన కనుదమ్ములతో, చెదరిన ముంగురులతో సడలిన వేణీ భరంతో, తన హృదయతలముపైన కలువపూదండలా వాలి ఉన్న శైలబాలలోని తీయని వన్నెను నాగచంద్రుడు అరమోడ్పు కనులతో ఆస్వాదిస్తున్నాడు. ఆలసాలసాలయిన వేబోక తెమ్మెరలు తుంగభద్రాతరంగ శీకర శైత్యాలలో ఆయితమైవచ్చి శైలబాల ముంగురులను పాపటకు చక్కనొత్తుతూ కనుదమ్మిరేకులను ఇంచుమించు విప్పసాగినవి. నాగచంద్రుని కంఠాన పెనవేసికొన్న బాహులత ఇంచుక సడలించి చటుక్కున కళ్లు తెరచి తల ఇంచుక ఎత్తి ఆమె అతని మోము తిలకించినది. ఆమెచూపులలో నునుసిగ్గులు చిరుకెరటాలై ఆనందకాంతుల మిలమిలలాడి, అంతలో ఆమె రెప్పలమాటున అదృశ్యములైనవి. అర్ధపూరితాలైన చిరునవ్వులు ప్రసరిస్తూ అతడామెను గట్టిగా హృదయాని కదుముకున్నాడు.

రూపవిలాస ముగ్ధలైన శిల్పుల ఆనందము రూపలయాన్ని కోరుతుందా? ఉత్కృష్ట రూపాన్ని సృష్టించే ఆశయం మాత్రం శిల్పుల తపస్సు కాదా? అల్పదోషమైనా ఎరుగని రూపౌత్కృష్టాన్వేషణకు ఫలము ప్రాకృత జనులు కోరే దేహానందము మాత్రమేనా? రూపురేఖలు పొదిగించుకొనే వికాసము నులివెచ్చని దేహంచే బంధితమైనదా! ఏమిటీ విచిత్ర సంఘటనం! ​"ప్రభూ! మీ శంకిత హృదయాన్ని ఆవరించిన తెరను తీయలేను. కాని, సంశయా లెరుగని ఆ తరుణశిల్పి సభలో నన్ను చూచిన మరుక్షణాన్నుండి ఉన్మత్తుడై పోయినాడట!”

“నువ్వు మూర్తీభవించిన సౌందర్య సర్వస్వానివి!”

"అపశ్రుతిలేని దివ్య సౌందర్యము స్వప్న మాత్రము ప్రభూ!”

“మనోరథప్రాయమైన రూపానికి రేఖలులేవు. మూర్తిలేదు. మూర్తించుకోగలిగిన ఉత్కృష్ట రూపమే శిల్పికి ఆశయం. తీర్థాలు తిరిగిన ఈనాకు ఈనాడు ప్రత్యక్షమైనావు.”

“ఆనాడు కాదా ప్రభూ!” అంటూ కంఠాన భుజలతలు పెనవేసి కన్నులలోకి చూపులు చొనిపి హృదయాన్ని మేలుకొలుపుతున్న శైలబాలను కంపించిపోతున్న కరములతో ఎడంగా చాచిపట్టి దేహమనః ప్రాణాల్ని చూపులలోకి తెచ్చుకొని, ఒక్క నిమేషం ఒరసిచూస్తూ, సుఖ స్వప్నంనుంచి లేవలేక నిద్రలేస్తున్నవానిలా "దేవీ! ఎన్నాళ్ళకు! ఎన్నాళ్ళకు!" అంటూ ఆనందమూర్ఛితుడైనాడు నాగచంద్రుడు.

తుంగభద్రా తరంగాలవంటి కరతలాలతో ప్రియుడి మేను నిమురుతూన్న శైలబాలను - ఒక్క నిట్టూర్పుపుచ్చి, “దేవీ, స్వప్నం కాదుకదా?" అంటూ హృదయానికి అదుముకుని "దేవీ! మధురతరమైన మన కథనము నన్నింక చెప్పనీ” అని నాగచంద్రుడన్నాడు -

"నిన్ను చూచిన నాటినుంచీ నీ స్వరూపాన్ని పరువాలు నింపుకొన్న నీలగ్రామంలో మూర్తింప నారంభించాను.

"ధన్యను!”

"నీ జబ్బులో ఎప్పుడున్నూ, మీ యింటికి వచ్చేవాడను. జీవవర్ణాలు వెలిగే వివిధ పుష్పాలు సేకరించి, రసహృదయాలయిన ఫలముల కాన్కలతో దినదినమూ మీ మేడకు వస్తూ, నీ కవి అర్పించుకొన్నాను.”

"ఫలములే కాదు, నీ ప్రణయమే ఔషధానికి అనుపానం చేశావు.”

"దేవీ, నేను సంకల్పించిన శిల్పమూర్తికి నా ప్రేమరసంతో మెరుగులు దిద్దుకొన్నాను. ఎంత రసభావన ధారపోసినా, మూలానికి నా నిర్మించిన ప్రతిమబింబ మాత్రమే అయిపోయిందని సిగ్గుపడ్డాను. నీ నయనాంచలాల మెరుపులూ, నీ మందహాసాల శీతద్యుతులూ, ఆనాటి నీనాట్య భంగిమలో సౌకుమార్యమూ, హృదయానపదిలించుకొని తెచ్చి నాటకంపు మొనతోముంచి, నా శిలాబాలకు అందిచ్చుకున్నాను. నా పూజా కల్పనం నీ యెదుట నిలపడానికి నాకు ధైర్యం చాలింది కాదు.”

"శిల్పి శేఖరా! నీ పత్ని యేది? అని నేను దినదినం ప్రశ్నించేదాన్ని ప్రభూ!”

"తేరుకొంటున్న నీ ఆరోగ్యానికి భంగం కలిగించలేక”

“దినములు గడుపుతూండే నేనొకనాడు పట్టుపట్టినాను చూస్తానని కదా ప్రియా?”

"దేవీ! ఆ దారుణ కథ మళ్ళా ఎందుకు స్మరిస్తావు?”

"ప్రభూ! ఉండు. నేను ఎవరు వాదించినా వినక, ఒకనాడు పల్లకీలో బయలుదేరాను. నువ్వు నరికివేసిన పెద్దపొదే నీ శిల్పమందిరం కూలగా బయలు దేరినది. ఆ శిల్పమందిరానికి ఆపరాని ఉద్వేగంతో, నిలుపలేని ఉత్కంఠంతో పల్లకీ దిగివచ్చి నా ప్రతిబింబాన్ని చూచాను. నా రూపంలో నాలో ఉండే లోపాన్ని సవరించుకొని దివ్యత్వం దాల్చిన సౌందర్యం ముందు లజ్జించి నిశ్చేష్టనై చాపకట్టులా పడిపోయాను.” ​"దేవీ! నా శిల్పబాలకు నేను పోయలేని ప్రాణాన్ని నీ వప్పుడర్పించి నన్ను ధన్యుణ్ణి, అధన్యుణ్ణి కూడా చేశావు.”

"ప్రభూ! ఆ విగ్రహాన్ని చూచి నేను నీప్రేమ గంభీరతనూ విశ్వరూపాన్నీ తెలుసుకొన్నాను. నా తుచ్ఛదేహాన్ని వదిలేసి, నా దివ్యరూపంలో చేరుకొని తరతరాలనుంచీ నీకోసం ఈ మందిర శిథిలాల్లో ఈ నదీతీరాన తపస్సు చేశాను.”

5

పవిత్రాలయిన మూడురాత్రిళ్ళు లిప్తలై జరిగినవి. దీర్ఘాలు అర్ధనిమీలితచకోరాలు, బెళుకులీను కురంగనయనాలైన ఆమె వెడదకన్నులు తనివి తీరని చూపుల పూవులపూజతో తన్ను నింపివేస్తున్నప్పుడు, సరసమై, స్పష్టమై, సున్నితమై, దివ్యరేఖలు కలదై, నులువెచ్చనై, ఉదయారుణ కాంతిలా మెరిసిపోతున్న ఆమె శరీర సౌందర్యము తన్ను సుడిగుండంలా, చంద్రకిరణంలా వికసించిన మల్లికా వనంలో సువాసనలా చుట్టివేస్తున్నప్పుడు, ఆమె తనలో లీనమైపోతున్నప్పుడు, కోటిపాటల కుసుమాలలో మధువుల వాకలు ఆమె పెదవులు తన పెదవుల గాఢమైన తమిలో చుంబించేటప్పుడు నాగచంద్రుని దివ్యానంద తన్మయత్వము. కోటిఉద్యానాల సౌరభాలొక్క బిందువులో సమాహృతాలయినట్లయినది.

అది నాల్గవనాటి రాత్రి - సంపూర్ణ పూర్ణిమాజ్యోత్స్న తుంగభద్రా తోయాలపై పన్నీటిపరిమళాల తుంపురు చల్లుతున్నది.

ఆ ఉత్కృష్ట యువయుగ్మానందంలో లయమై లోకమంతా నిశ్శబ్దమైంది.

వారిరువురూ యుగాలనాడు ఏ మహాతారలలో ఉద్భవించి యాత్ర చేస్తూ భూమి కవతరించిన కిరణద్వయమో!

"ఓ కళాదిష్టానదేవా, సుధాకర సార్వభౌమా! పూర్ణతతో తూగే సౌందర్యబాలకై కల్పాలలో తపస్సు చేసుకొన్నాను. ఆమెను సందర్శించుకున్నాను. పరిపూర్ణతనుచేరే సౌందర్యమూర్తిగా సృష్టించుకొన్నాను. రూపరేఖాకాంతి సౌందర్య సంపూర్ణత్వాన కలిగే అద్భుతానందం ఒక క్షణికము మాత్రము. ఈ సౌందర్యం, ఈ ఆనందం, ఈ దివ్యనిమేషమూ అనంతం చెయ్యివోయి ప్రభూ!” అని మహాయోగవంతమైన అభ్యర్థనము చేశాడు నాగచంద్రుడు!

ఒక చిరుమబ్బు చంద్రబింబాన్ని ఒక లిప్తమాత్రం కప్పినది. ఒక లిప్తమాత్రము గాంఢాంధకారమయినది.

ఇంతలో దిక్కులు స్పష్టాలై మళ్ళీ చంద్రకాంతులతో తళతళ లాడినవి.

శిల్పబాల యధాప్రకారం శిలావిగ్రహమై అనంతనాట్యమొనరిస్తున్నది. నాగచంద్రుడు మోకరించి దివ్యానంద భంగిమలో ప్రణయ శిల్పి స్వరూపాన ఆమె ఎదుట కాలశిలా విగ్రహమూర్తిలో ఘనీభూతుడై నాడు -

తుంగభద్ర ప్రవహిచింది.

తుంగభద్ర ప్రవహించింది.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse