అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల/వింధ్యాచలం
వింధ్యాచలం
మొదటి రంగం
నాకిది ఎన్నోసారో వింధ్యాచలం దాటి ఉత్తరాదికి వెళ్ళటం! నేను అగస్త్యుణ్ణి మాత్రం కాను! అగస్త్యుడే పుట్టకపోయి ఉంటే, ఆంధ్రులు దక్షిణానికి వలస వచ్చి కృష్ణా గోదావరీ మధ్యస్థ భూమిలో ఏలా వలస ఏర్పరచుకొని ఉందురు?
హిమాలయపర్వతం కన్న మేరుపర్వతం కన్న పైకెగసి, ధ్రువపథందాటి, సూర్యపథందాటి, సూర్యదేవకక్షకు అడ్డంగా పెరిగి సగర్వంగా నిలుచున్నాడట వింధ్యపర్వతేశ్వరుడు. ప్రతి సంవత్సరం దక్షిణాయనంలో యవద్వీప ప్రాంతాకాశపథాల సంచరించే సూర్యదేవుడుగారు ఆ ఏడు మళ్ళీ ఉత్తరాకాశ పథాల సంచరించటానికి వస్తూంటే ఈ వింథ్యాచలం గారు అడ్డంవచ్చారు. దక్షిణానికి ఒకటే రోహిణీకార్తి అవతరించింది. ఉత్తర భారతవర్షానికి ఒకటే మంచుమయమైన చీకటి. అప్పుడు ఈ దేశభక్తుడైన అగస్త్యుడుగారిని దేవతలంతా రక్షించవలసిందని ప్రార్థించారుట! అగస్త్యమహర్షిగారు దక్షిణాపథయాత్ర సంకల్పించి బయలుదేరారు. వింధ్యాచలంగారు ఆయనకు భక్తితో గురుపాద నమస్కారం చెయ్యటానికి సాష్టాంగమాతుడైనాడు. "నేను తిరిగి వచ్చేవరకూ ఇలాగే ఉండు నాయనా!" అని ఆ దివ్య ఋషి దక్షిణానికి వెళ్ళినాడుట! వింధ్యగారు అలాగే ఉన్నారుట!
ఇక నేను ఉత్తరాదికి వెళుతూంటే పొరపాటున ఈ వింధ్యధరాధరేంద్రుడు మా బండిలోంచి తొంగిచూస్తోన్న నన్నుచూచి, వీడే ఒక అభినవ అగస్త్యుడనుకొని, “అగస్తుల్యవారు తిరిగి ఉత్తరానికి వెళ్ళిపోతున్నారు. ఇంక మనం ఒకనాడాక్రమించిన మహోన్నతోన్నతోన్నతోనత గగన పథాలకు ఉప్పొంగిపోదా” మని విజృంభించాడా, ఇంక ఉత్తర భారతదేశంలో జరిగే అల్లరి వర్ణనాతీతమై చక్కాపోతుంది. ద్రావిడైర్ కషగంవాళ్ళు వింధ్య పర్వతంతో కుట్రచేసి, ఆ వింధ్యపర్వతంగారికి ప్రోత్సాహమిచ్చి "నువ్వు నిక్కమైన తమిళుడవోయి వింధ్య అన్నా! హిమవత్పర్వతంగారు వట్టి శుద్ధమైన ఆర్యుడు. భారతప్రధాని నెహ్రూగారు హిమాలయపర్వత మధ్యస్థభూమి అయిన కాశ్మీరంలోంచి వచ్చిన నిఖారసుడైన ఆర్య బ్రాహ్మణుడు. కాబట్టి నువ్వు మనద్రావిడ సంస్కారముయొక్క మహోన్నతోన్నతత్వము కశ్మలం కాకుండా ఆకాశానికి ఎగిరి అడ్డంగా నిలువు” అని రామస్వామినాయకరు ఈ వింధ్యమలై గారికి బోధించి ఉంటాడని ఏ 'హిందూస్థాన్ టైమ్సో' వ్రాయవచ్చును.
అది కాదంటారా కొంప ముంచి, ఈ కుట్ర అంతా ఆంధ్రుల నెత్తిమీద పడవేసే సావకాశాలూ ఉన్నాయి. ఏ ఉత్తరాది కాంగ్రెసు నాయకుణ్ణి పత్రికా విలేఖరులు సందర్శించి "ఈ వింధ్య పర్వతము ఇలాపైకి పాకిపోవడానికి కారణం ఏమిటండీ?" అని అడిగారనుకోండి. అప్పు డా ఉత్తరాది నాయకుడు ఇలా చెప్పి తీరుతాడు. "ఈ మధ్య థార్ నివేదిక కాదండీ వచ్చింది! తత్ నివేదిక ఆంధ్రులనందరినీ రోషానల సంతప్త హృదయాంతరంగులచేసి పారవేయడంచేత, ఏ సాంబమూర్తిగారో ఈ వింధ్య పర్వతం గారికి ప్రోత్సాహమిచ్చి యుండవచ్చును. దానితో పట్టపగ్గాలు లేకుండా ఈ అచలంగారు - చలంగారో - ఆకాశంలోకి చొచ్చుకుపోయి ఉండాలి” అని ఉద్ఘాటించి తీరుతాడు. ఇంకేముంది కొంపలు మునిగిపోతాయి. ఈలాంటి ఆలోచనలు ఆ వింధ్య పర్వతపులోయలో మహావేగంతోపోయే కలకత్తా మెయిలులో కూర్చున్న నాకు వచ్చిన మాట సత్యం. జబ్బల్పూరు దాటినాము. నర్మదానదము దాటినాము. మా రైలు సిహోలీ రోడ్డుస్టేషన్ దాటినది. ఒక్కొక్క స్టేషన్ మా రైలు సమీపించింది అనగానే, నా హృదయం మింటికెగసి లోతులకుపోతూ ఉంటుంది. నర్మద దాటేటప్పుడు పాలరాతి కొండలు, మాహిష్మతీ నగరం జ్ఞాపకం వచ్చినవి. అటు ఢిల్లీ వెళ్ళే దారిలో సాంచీ స్థూపము జ్ఞప్తికి వచ్చింది. ఆ దారిని ఢిల్లీ వెళ్లివుంటే అవన్నీ చూచి ఉండేవాణ్ణి! ఉజ్జయినీ ఆ పక్కనే వుంది. వుదయనుడు, విక్రమార్కుడు, కాళిదాసు వుజ్జయినీ భావ సంబంధాలు; ఇక్కడ నుంచి ఉత్తర భూమి పూర్ణరూపంతో ప్రత్యక్షమౌతుంది. ఆ ఉత్తరభారత భూమాత పోలికలన్నీ పుణికి పుచ్చుకున్న ఆమె అనుగుబిడ్డ ఒక బాల, కాట్నీ స్టేషన్లో మాసెకండ్ క్లాస్పెట్టె ఎక్కింది.
̼2
ఆ అమ్మాయి వెనకే, ఈనాటి ఈ క్షణం ఫేషన్లో ఉన్న అతి నవీన దుస్తులతో పెట్టె ఎక్కాడు ఓ యువకుడు. నేను ప్రయాణం చేస్తున్న పెట్టె నాటి ఇంటరు తరగతి, ఈనాటి తరగతి రెండు. పెట్టంతా పూర్తిగా నిండిఉన్నారు. ప్రయాణీకులు, అది శీతాకాలం కాబట్టి సరిపోయింది. గడచిన రాత్రి అంతమంది ఉన్నా కూచున్నవాడు కూచున్నట్టూ, ఒరిగినవాడు ఒరిగినట్టుగానూ కాలం గడిపినాము! అదృష్టవంతుడు పైన పక్క వేసుకొన్నాడు.
రెండు బెంచీల మధ్యనూ, గేట్ల దగ్గరనూ, ఎల్లాపడితే అల్లా నిదురబోయాము తక్కినవాళ్ళం. ఉత్తరానికి వెళ్ళినకొలదీ జనం ఎక్కువవుతూ ఉన్నారు. నేను సంస్కారమూ, స్త్రీ భక్తీ కలవాణ్ణి కాబట్టి సౌందర్యపు పోగైన ఆ అమ్మాయి కాట్నీ జంక్షన్ స్టేషన్లో మా పెట్టెలోకి ఎక్కగానే ఎత్తుమడమల జోడుతోనూ, అతి నవీనమైన చీరకట్టు విధానముతోనూ ప్రత్యక్షమగుటచేత, ఆమెకాలేజీలో చదువుకున్న బాలికయని నిర్ధారణ చేసుకున్నవాడనై చటుక్కునలేచి, ఆమె ఇటూ అటూ చూస్తూ 'ఎక్కడ కూర్చుందామా' అని ఆలోచిస్తున్న సమయంలో "మీ రిక్కడ కూర్చోవచ్చును” అని ఇంగ్లీషు భాషలో ఆమెను కోరినాను. “కృతజ్ఞురాలను” అని ఇంగ్లీషులో అంటూ, నాల్గు చిరునవ్వులు నాపై విలాసంగా విసరివైచి, నా స్థలంలో ఆమె కూర్చున్నది. ఆమె వెనకాలే వచ్చిన యువకుడు ఆమె ప్రక్కనే చటుక్కున సర్దుకు కూర్చున్నాడు.
నాకు వళ్ళు మండిపోయింది. నేను కూర్చుందామనుకొన్న స్థలం కాదా అది? నేను లేచి హాయిగా వున్న నా స్థలం ఆమెకిస్తే ఈయనగా రెవరూ నా స్థలం ఆక్రమించడానికీ?
నేను ఆ క్రిందటిరోజు సాయంత్రమే ఇటార్సీలో గ్రాండ్‌ట్రంక్ ఎక్సుప్రెస్లో దిగాను. 'నర్మదానదిని చూచినట్లూ ఉంటుంది. జబ్బల్పూరు నగరాన్నీ రైల్లోంచి దర్శించవచ్చును' అని మరునాడు కలకత్తా మెయిల్ వచ్చేవరకూ ఉండి పదకొండు గంటలకు ఏలాగో మంచి తెలివితేటలు చూపించి ఆ బండిలో చేరాను. కాట్నీ వచ్చేటప్పటికి సాయంకాలం అయిదున్నర అయింది. ఇంకా అయిదుగంటలు ఆ బండిలో ఉండాలి, 'ఇన్ని గంటలూ ఆ అమ్మాయికీ ఆ అబ్బాయికీ నా స్థలం ఇచ్చేసుకుని నుంచోవలసిందేనా' అని మరీ బాధ ఎక్కువైంది. ఒక నిట్టూర్పు విడిచి అలాగే నుంచున్నాను. పైగా నుంచోడానికి కారణం నా చుట్టుప్రక్కన ఉన్న బెంగాలీవారికీ, యు.పి. వాళ్ళకూ ఇంకోరకంగా స్ఫురించకుండా ఉండాలని, ఇంగ్లీషులో, “ఎంతసేపని కూచోగలం, కాళ్లు గుదులు పెడితే? ఓ అరగంటైనా నిలుచుంటేగాని మళ్ళీ రక్తం స్రవించదు” అని పైకి అన్నాను. నాకూ గౌరవము దక్కింది. కానీ నేను అరగంటా నిల్చుంటానని గంటన్నర నిల్చున్నాను, తలుపు దగ్గరే పరుగెత్తే ప్రకృతి దృశ్యం గమనిస్తూ. ఆ అమ్మాయి పక్కన కూర్చున్న యువకుడు మేమిద్దరం ఎంతోకాలం నుండి స్నేహితులమైనట్లూ, నే నేదో గౌరవం చేసుకోడానికని లేచి నిలుచుండినట్లు భావించాడు కాబోలు, నాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం ప్రారంభించాడు.
యువకుడు: మీరు బొంబాయినుంచి వస్తున్నారా?
నేను: కాదు, బెజవాడనుంచి గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చి నిన్నల్లా యిటార్సీలో కాలం వెళ్ళబుచ్చి ఇవాళ ఈ కలకత్తా మెయిలు ఎక్కినాను.
యువతి: మీరు ఆంధ్రులా అండీ?
నేను: ఔనండీ. మీరు బెంగాలీవాళ్ళలా లేరే?
యువ: మేము యు.పి. వాళ్ళము. మాది అలహాబాదు.
నేను: నేనూ అలహాబాదు వెడుతున్నాను.
యువ: మేమూ అలహాబాదే వెడుతున్నాము. ఇక్కడ కాట్నీలో మా యింటికి వచ్చి ఈ సెలవులు గడిపి అలహాబాదు వెడుతున్నాము.
నేను: మీకు అక్కడ ఉద్యోగమా అండీ? (యువకుణ్ణి ప్రశ్నించాను.)
యువ: ఔను! కలక్టరేటులో అసిస్టెంట్ కలక్టరుగా పనిచేస్తున్నాను లెండి. ఈవిడగారు మిసెస్ సుప్రియా త్రిపాఠీ. నేను సుప్రియా త్రిపాఠిని లెండి. మాది కాట్నీ నగరం. మీరెందుకు వస్తున్నారు అలహాబాదు? మీపేరు తెలుసుకోవచ్చునా? నేను: ఆ తప్పకుండా! నా పేరు ఎం. చతుర్వేది. ఆంధ్రంలో చతుర్వేదుల మల్లికార్జునశాస్త్రి. నేను ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఎస్సి. మొదటిగా కృతార్థుడనయ్యాను. అలహాబాదు యూనివర్సిటీవారు డి.ఎస్సి. పరిశోధనకు స్కాలర్షిప్పుతో సీటు ఇచ్చినారు. అది పూర్తి కావచ్చినది. ఇది ఆఖరు సంవత్సరం. శీతాకాలం సెలవులకు ఇంటికి పోయి ఇప్పుడు వస్తున్నాను.
యువ: మీరు చతుర్వేదులా? మా నాన్నగారి ఇంటిపేరు త్రివేది వారు! హైకోర్టులో మా నాన్నగారు ఎడ్వకేటుగా ఉన్నారు. ఈ పెద్దమనిషి గారు అలహాబాదులోనే అయిందికదా ఉద్యోగమని అత్తవారింట్లోనే మకాం పెట్టారు లెండి!
యువ: అయితే, చతుర్వేదిగారూ! అసలు నేను అలహాబాదు వేయించుకోవటానికి కారణం ఏమిటో ఆవిణ్ణి అడగండి.
యువ: నా పేరు జ్యోతిర్మయి లెండి. అందుకనే వెలుగును గురించిన రహస్యాలన్నీ తెలుసుకుందామని అలహాబాదు యూనివర్సిటీ బి.ఎస్.సి. ఆనర్సు ఫిజిక్సులో చేరాను. తానేమో నాచదువు పాడు చేయకూడదనిట, అలహాబాదులోనే వేయించుకున్నారట ఉద్యోగం. ఈయనగారు 1945 సంవత్సరంలో తయారై వచ్చిన ఐ.సి.ఎస్. లెండి.
నేను: త్రివేదులూ, త్రిపాఠులూ, చతుర్వేదులూ! బాగానే ఉంది మన స్నేహం.
3
ఇంతట్లో శాత్నా పట్నం వచ్చింది. నా అదృష్టం కొద్దీ జ్యోతిర్మయి పక్కనే కూర్చున్న ఒక ముసలాయన, ముసలావిడ లేచి రైలుదిగి వెళ్ళిపోయినారు. వాళ్ళు లేచి వెళ్ళడమేమి, నేను గబుక్కున వారిస్థానంలో కూర్చోటమేమిటి. మేము ముగ్గురం చక్కగా, హాయిగా సర్దుకు కూర్చున్నాము.
మాకు ముగ్గురకు సంతోషం కలిగింది.
“మీరు మాకు ఏవిధంగానైనా చుట్టాలు కారుకదా!" అని జ్యోతిర్మయి పకపకా నవ్వుతూ నావైపు తిరిగింది.
“ఆంధ్రులు ఆరువేల సంవత్సరాల క్రితం మనదేశం నుంచి కదిలి కృష్ణా గోదావరీ దేశానికి వలస వెళ్ళినవారేగా?” అని ఆ యువకుడు సుప్రియుడన్నాడు.
ఉత్తరాది వాళ్ళకూ, దక్షిణాది వాళ్ళకూ ఇలా రైల్లో స్నేహం కుదరటం విచిత్రంగానే ఉంది. వాళ్ళు గంగానది వాళ్ళు, నేను గోదావరి నదివాణ్ణి. గోదావరి, గంగానది పూర్వావతరము. గోదావరే ప్రాచీన జన్మఅట. త్రయంబకేశ్వరుడే గంగోత్రికడ, జటామకుటేశ్వరుడయ్యాడట. అలాగే కృష్ణ నుద్భవింపజేసిన మహాబలేశ్వరుడు. యమునా కృష్ణానదులొకే అవతారములు.
రైలు మాణిక్యపూర్ దాటిన తర్వాత ఏదో మాటల సందడిని "మీకేం, మీరు చాలా అదృష్టవంతులుగుటచేత మీ రాష్ట్రం మీకు ఇదివరకే వచ్చి వుంది. కాని మీ రాష్ట్రం వాడయిన నెహ్రూగారికి మాయందు ప్రేమ లేకపోవడంవల్ల థార్ నివేదికపై ఏమీ చెప్పకుండా ఊరుకొన్నారు” అనికొంచెం తీక్షణంగానే అన్నాను. ఆ యువకునికి చాలా కోపం వచ్చినట్లున్నది, “మీకు రాష్ట్రం రాకపోతే ఏమి లోటు వచ్చింది చెప్పండీ? మీ ఒక్కరిమీద ఇంకా రాజ్యంచేస్తున్నారా?” అని అడిగినాడు.
నేను: ఎంత చక్కని భావం వెల్లడించారు! మీ రాష్ట్రం అవతలున్న పంజాబుతోనో, ఇవతలున్న బీహారుతోనో, అడుగున ఉన్న మధ్యరాష్ట్రాలతోనో కలిసిపోకూడదా? అలా కలిస్తే మీలో ఉన్న ఇంగ్లీషు తత్వము ఒదిలి పోవునేమో?
యువ: ఇంగ్లీషు తత్వమంటే?
నేను: సామ్రాజ్య తత్వం.
యువ: అంటే తక్కిన దేశాన్నంతా మా చెప్పుచేతల్లో ఉంచుకొని, తక్కిన రాష్ట్రాలన్నీ మా సామ్రాజ్యం క్రింద ఉంచుకొన్నామనేనా? మీ మాటల్లో ధ్వని అదేగా?
నేను: నిజమైన ప్రజాపరిపాలన అయ్యేటట్లయితే, ఈ ముప్ఫై సంవత్సరాలు వాదించి ఒప్పుకొన్న ధర్మసూత్రాలలో ఒకటి కదా భాషా రాష్ట్ర విభజన. అది వెంటనే స్వతంత్ర భారతం ఎందుకు అమలులో పెట్టలేదు చెప్పండీ?
జ్యోతి: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము అనేక విధాల కష్టాలు పడేటప్పుడు దానితో సహకరించక, అతి ముఖ్యంకాని భాషా రాష్ట్ర సమస్య ఎందుకండీ?
నేను: ఇంగ్లీషువారు కాస్తకాస్త స్వరాజ్యం ఇస్తానంటే మహాత్మాగాంధీజీ ఒప్పుకున్నారా? స్వరాజ్యం వచ్చినప్పుడు సంపూర్ణ స్వరాజ్యం రావాలి. దేశంలో ఒక భాగానికి స్వరాజ్యం వచ్చి రెండో భాగానికి రాకుండా ఉండటమా?
యువ: అయితే ఆంధ్రులకు స్వరాజ్యం రాలేదంటారా?
నేను: ముమ్మాటికీ రాలేదంటాను. మీ భార్యాభర్త లిద్దరూ బయలుదేరి ఆంధ్రదేశం వెళ్ళి ప్రతి ఆంధ్ర స్త్రీనీ పురుషుణ్ణి ప్రశ్నించండి! ఎంత బాధతో ఆంధ్రులు యావన్మందీ క్రుంగిపోతున్నారో?
శంకర్‌ఘర్ స్టేషన్ వచ్చి వెంటనే వెనక్కు వెళ్ళిపోయింది.
యువ: ఈ రాష్ట్రాల సంగతి అలా ఉంచి మా ప్రార్థన ఒకటి ఉంది. వింటారా? నేనూ, మా వారూ కలసి అడుగుతున్నాము. మన బండి అలహాబాదు చేరేసరికి పదిన్నర అవుతుంది. మీరు మాతో మా యింటికి రావలసిందని కోరుతున్నా, నా తరపునా, మా ఆయన తరపునా.
యువ: మా రాణీగారు నా మనసులో ఉన్నది నిమిషంలో గ్రహించారు. మా అత్తగారు ఇల్లు పెద్దమేడ. మీరు యూనివర్సిటీ హాస్టలులో మీ బసకు పోయేలోపున మా ఇంట్లో నాలుగు రోజులపాటు ఉండాలని మనవి. మా మామగారు కొంచెం పూర్వసాంప్రదాయం వారు. మీరు మాకు అతిథులుగా ఉండమని కోరుతున్నాము.
యువ: మేము పూర్తిగా శాకాహారులమే నండోయ్!
నేను: మిమ్ము ఇబ్బంది పరుస్తానని భయం.
యువ: ఏమీ భయంలేదు. మా చెల్లెలు ఉంది. నాకన్న అందంగా ఉంటుంది. నాకన్న మధురంగా పాడుతుంది. రెండోఏడు బి.ఎస్.సి. కెమిస్ట్రీ చదువుతోంది. యువ: కాని మా ఆవిడలా చిలకలా గంటలకొలదీ మాట్లాడదు. బాపూజీ మౌనవ్రతంలో ఏ శుభముహూర్తంలోనో పుట్టి ఉంటుంది. ఆవిడ గారు.
యువ: మీరు ఏమీ మాట్లాడలేని నంగనాచులు!
4
ఏవేవో ఆలోచనలలో పడినాము. రైలు వేగంగా వెడుతూ ఉన్నది. మా కందరికీ కొంచెం నిద్రమైకంకూడా వచ్చింది. ఇంతట్లో నైనీ జంక్షన్ వచ్చింది. మా కలకత్తా మెయిలు అక్కడ ఆగకుండా అలహాబాదుకే వెళ్ళిపోయింది. వచ్చింది మాస్టేషన్. మేమందరమూ త్రివేది గారింటికే వెళ్ళినాము. నాకు వారి తల్లిదండ్రులు ఏమనుకుంటారో అని భయం. కాని వారందరూ ఏదో దగ్గరచుట్టం వచ్చినట్లే చూచినారు.
వింధ్యాచలం వెనకనే ఉండిపోయినాడు. నర్మదానది భారతమాతకు మొలనూలై ప్రవహిస్తూనే ఉన్నది. నేనీ త్రివేణీ సంగమ పవిత్ర స్థలానికి వచ్చిచేరినాను. ఇక్కడి వారికీ ఆంధ్రులకూ అన్ని ఆచారాలూ తేడాగానే ఉన్నాయి. వారి భోజనాలు వేరు. వారు గోధుమరొట్టెలు ఎక్కువ తింటారు. వారి తర్కారీలకు మన కూరలకు సంబంధంలేదు. వారు పులుసులలో చింతపండువేయరు. కొందరు మామిడిఒరుగు, కొందరు ఆల్బకరావేస్తారు. వారికి పచ్చళ్ళు ముఖ్యంకాదు. ఆవకాయ ముఖ్యంకాదు. ఊరగాయలు అవోరకం.
కాని ఇవన్నీ వింధ్యాచలం వేరుచేసిందా? అయితే అరవవారి భోజనానికీ తెలుగువారి భోజనానికీ అంతతేడా ఉందేమి? ఆచారాలు మాత్రం పైపైన తేడాలేగాని అసలు మడీ గిడీ, స్నానం శుద్ధీ, జపం తపం వారికీ వీరికీ ఒకటే.
త్రిపాఠీ ఐ.సి.ఎస్. గనుక ఆ యువకునకు ఛాందసాలు ఏమీలేవు. భారతీయుని హృదయం ఒకటే! సంస్కృతి ఏలాంటి మహారాజ పథాలు నిర్మించలేదు గనుకా! భారతజాతికి విముక్తి వచ్చిన ఈ దినాల్లో సర్వదేశాలకూ ఆదర్శముకాగల రాజ్యాంగ చట్టం భరతదేశం నిర్మించుకుంటోంది. భాషలు తేడా అయితే హృదయాలు తేడాలు కావాలా! పంజాబు, బెంగాలు అల్లరులు, తూర్పు పశ్చిమ పాకిస్థానుల నుండి కోట్లకొలది హిందువులను భరతదేశానికి తరిమివేశాయి. ఆ కాందిశీకులు భరతదేశం అంతా వలస ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది. వారి ఆచారాలు, వలసరాష్ట్రం ఆచారాలూ సంస్కృతులు పవిత్రప్రయాగ అవుతున్నాయి. ఒక మహాకష్టంలోంచి ఒక దివ్యమైన శుభమూ అవతరిస్తున్నది. ఈ ఆలోచనలతో నిదుర కూరినాను.
5
నేను త్రివేదీ గారింట్లో ఉన్న మూడవ దినాన సాయంకాలం జ్యోతిర్మయి చెల్లెలు ఆనందమయి నేను అతిథిగా మకాం చేసి ఉన్న గదిలోనికి వచ్చి, “నమస్కార్ చతుర్వేదిజీ!” అని రెండుచేతులూ జోడించి నమస్కరిస్తూ, నా సోఫాకు యెదురు గుండా ఉన్న ఆసనం అధివసించింది. ఆనంద: మీ చదువేమీ పాడుచేయటం లేదుగదా?
నేను: ఎబ్బెబ్బె, నేను ఏవో ఆలోచనలో తేలిపోతున్నాను లెండి. వాటికీ నా చదువుకీ ఏమీ సంబంధంలేదు.
ఆనం: అలాంటి ఆలోచనలలో తేలిపోయారంటే, భూగ్రహణ శక్తికి మీరిపోయిన విశ్వపథంలో పడిపోయి మళ్ళీ ఈ లోకానికి రారేమో?
నేను: (నాకు నవ్వు వచ్చి పక పక నవ్వినాను) అప్పుడు యితర లోకాలేవైనా కొత్తవి కనుక్కుని రాడార్ ద్వారా మీకు కబురు పంపుతాను!
ఆనం: అప్పుడు మీకు నెహ్రూమీద కోపం పోతుందనుకుంటాను.
నేను: నాకు నెహ్రూమీద కోపమేమిటండోయ్!
ఆనం: మొన్న ప్రయాణంలో వస్తూదారంతా అదేటగా మీ వాదన!
నేను: రామ రామ! నాకు నెహ్రూజీ మీద ఉన్న భక్తి అపారం. నా హృదయంలో ఆయన మహాత్మాజీకి నిజమైన ఆశయ పుత్రుడన్న సంపూర్ణ నమ్మకం. ఏటు వచ్చినా మా ఆంధ్రులకు అన్యాయం చేసేవారి కుట్రలకు నెహ్రూ పండితులు, అన్ని విషయాలూ తెలిసి ఉండి, చేయూత ఇస్తున్నారని బాధపడుతున్నాను.
ఆనం: తెలిసిఉండి చేయూత యిస్తున్నారనా మీ అభిప్రాయం?
నేను: తెలిసిఉండి సహాయం చేస్తున్నారా, అది తీరని తప్పు. తెలుసుకోకుండా సహాయం చేస్తున్నారా, అది మరీ తప్పు.
ఆనం: అలాంటి దోష విషయాలకు ఆయన చేయూత ఇస్తున్నారనే మీ నమ్మకం?
నేను: చేయూత ఇస్తున్నారంటే తాను చేయాలని సహాయం చేస్తున్నారని నా అభిప్రాయంకాదు. అందరూ గాంధీజీ శిష్యులనీ, అందరూ ధర్మపథాన్ని నడపవలసి ఉందనీ, అలా వివిధాభిప్రాయాలవారూ ధర్మం నెరవేర్చడానికి సంకల్పం వహిస్తే ఉత్తమ మార్గం అప్పుడే ద్యోతకం అవుతుందనీ, నెహ్రూగారి అభిప్రాయమని నా నమ్మకం. అదేగా వారు మద్రాసునకు వెళ్ళి మంత్రివర్గం వారికి బోధచేసింది.
ఆనం: ఇంక మీరు బాధపడవలసిన అవసరం ఏమిటి? మీ ఆంధ్రుడైన పట్టాభిగారు రాష్ట్రపతి అయినాడు. మీ ఆంధ్రుడే కళా వెంకట్రావుగారిని ఆయన ఒక కార్యదర్శిగా చేసుకున్నారు. ఇక మీకు ఆంధ్ర రాష్ట్రం సత్వరంగా రావచ్చుకాదా?
నేను: నిజమే, మీ రన్నదానిలో నిజం లేకపోలేదు. ఆంధ్రుడు రాష్ట్రపతికావడం మాకు అదృష్ట కారణమే అవుతుందో, దురదృష్ట కారణమే అవుతుందో! భవిష్యత్తు భగవంతుని చేతిలో ఉంది.
ఆనందమయి తాను కూర్చున్న కుర్చీలోనుండి లేచి నా దగ్గరకువచ్చి నా భుజంమీద చేయివైచి “ఆంధ్రులకు రాష్ట్రం విషయంలో ఎంత గాఢకాంక్ష ఉందో, ఆశ్చర్యమే! మీ బాధ మాకేం తెలుస్తుంది చెప్పండి. మాకా సమస్య ఎన్నడూ ప్రత్యక్షం కాలేదు” అని అంటూ "చతుర్వేదిగారూ! మీరీ రెండేళ్ళన్నరనుండీ ఈ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్నారు కదా, మా యు.పి. వారు, మీ విషయంలో ఏలా సంచరించారు?” అని ప్రశ్నించింది. ఆ బాలిక ఇరువది ఏడుల ఎలప్రాయపు జవ్వని. ఆంధ్రులలో సాధారణంగా కానరాని స్వచ్ఛసువర్ణచ్ఛాయ శరీర కాంతిగల మహోజ్జ్వలాంగి. ఒయ్యారాల హంసయాన. నా భుజంపైన చేయివైచినప్పుడు నాకు ప్రపంచమంతా మత్తిల్లి ఒరిగిపోయినట్లయినది. నాకు మాటరాలేదు. నా ప్రజ్ఞ అంతా పటాపంచలైనది.
నా హృదయావేదనాభరిత మౌనం ఆమె అపార్థం చేసుకున్నది కాబోలు, నా ప్రక్కనే సోఫాలో కూర్చుండి, “మిమ్ము మా రాష్ట్రం సరిగా ఆదరించలేదా? చెప్పండి” అని ఆదుర్దాగానే ప్రశ్నించింది.
మీద చేయివేస్తేనే, నేను మైమరచినవాణ్ణి, ఆమె నా దగ్గరగా సోఫాలో కూర్చుంటే నా స్థితి ఎవరికి గ్రాహ్యం కాగలదు? మాటరాలేదు. జవాబు చెప్పాలని ప్రయత్నం చేశాను. నోరు తడియారిపోయింది. హృదయ మృదంగం భేరీభాంకారమై ద్రుతకాలమైపోయింది. ఏలాగో తెప్పరిల్లగలిగాను. మాట తడబడుతోనే,
“ఆ... ఆ... ఆనంద... ఆనంద.... మయీ దేవిగారు... అబ్బే ఏదో... ఆలోచనలలో... మాట్లాడలేదు... మీ... మీ రాష్ట్రం నా యెడల చూపించిన ప్రేమ.... ప్రేమ.... అపారం! మీ కుటుంబమే దానికి.... దాని.... చిహ్నం అనుకోండి" అని అన్నాడు.
అనాలోచితంగా జరిగే అనేక సంఘటనలు జీవితంలో విప్లవాలు తీసుకు రావచ్చును. ఆనందమయి, నా హృదయంలో అవతరించిన తుఫాను ఏమి అర్థం చేసుకోగలదు?
నేను ఇరవై ఆరేళ్ళ యువకుణ్ణి. చదువులలో మాత్రం ముందంజ గలవాడిని. లోకం నా చదువు చూచి నాకు సహాయం చేయ సంకల్పించింది. నేను 'దేహి' అని ఇతరులను యాచించలేదు. హైస్కూలులో మా ప్రధానోపాధ్యాయుడు నాచదువుచూచే నాకు ఉచిత వేతనం ఇప్పించినాడు. మా తండ్రి పురోహితుడు, స్వంత వ్యవసాయదారుడు. మాకున్నది రెండెకరాల మాగాణి. అదే మాకు జమీ. ఎలా సంసారం ఈదేవాడో, ఎలా నాకు చదువునకై ఖర్చులు పంపేవాడో! కాలేజీలో అర్థ ఉచిత వేతనం వచ్చింది. ఆంధ్రా యూనివర్శిటీవారు పూర్తిగా ఉచిత వేతనం ఇచ్చారు. అదే ఆశ్చర్యమన్నారు మావాళ్ళు.
మా ఆంధ్రదేశం బ్రాహ్మణ బ్రాహ్మణేతర సమస్యతో మండిపోతోంది. గట్టిగా చూస్తే బ్రాహ్మణులలో లక్షాధికారులు పదిమంది ఉండరు. నూరు ఎకరాల మాగాణి ఉన్నవారు రెండు డజన్లుకూడా ఉండరు. ప్రజారాజ్య విధానంలో బ్రాహ్మణుల ఓట్లు నూటికి ఒక్కటికూడా ఉంటుందో ఉండదో! గ్రామాలలో వారికి ఏమీ బలంలేదు. అయినా వారిమీద రెడ్డి, కమ్మ, కాపుకులాల వారికున్న కోపం ఇంతింతనికాదు. అయినా ఆ కోపం పైపైనే అనే నా నమ్మకం. సంస్కృతిలో పైకి విజృంభించిపోవాలన్న ఆవేదనతో వారిపైన వారికే ఉద్భవించిన క్రోధం బ్రాహ్మణ ద్వేషం అని అనుకుంటున్నారని నా నమ్మకం. కాని ఈలోగా దేశంపొందే సంక్షోభం ప్రజాజీవితాన్ని కలచివేస్తున్నది. బ్రాహ్మణులపైన ఉన్న ద్వేషం మానసిక నైర్మల్యాన్ని ధ్వంసంచేసి వారిలో వారికే ద్వేషం ఉద్భవింపజేసినది. అయినా ఇవన్నీ హృదయగతం కాకపోవడంవల్ల, న్యాయం చేయవలసి వచ్చినప్పుడు ఆంధ్రులు న్యాయపథము అనుసరించి తీరుతూనే ఉన్నారు. అందుకనే నాకు మా ఆంధ్రా యూనివర్శిటీవారు విద్యావేతనం దయచేయించినారు. నేడు అలహాబాదువారూ విద్యావేతనమిచ్చి నన్ను డి.ఎస్.సి.కి పరిశోధన చేయడానికి సావకాశం ఇచ్చారు. దేశంలో ఎవరికి ఉన్న భావాలు వారు ఫలవంతం కావాలని ఆశిస్తారు. అవి కాకపోతే జరగలేదని విషాదం పొంది, అక్కడనుంచి ద్వేషాగ్ని ప్రజ్వరిల్ల చేసుకొని ఈ సంస్థనూ ఆ సంస్థనూ, ఈ వ్యక్తినీ, ఆ వ్యక్తినీ ఆడిపోసుకుంటారు. ఇతరుల జీవితాలు విచ్ఛిన్నం చేస్తారు.
“మీరు నాకు కాస్త ఇంటిదగ్గర పాఠాలు చెబుతూ ఉంటారా? మా నాన్న మీకు తగిన పారితోషికం ఇస్తారు. మీరీ విషయంలో మోహమాట పడకండి.”
"అయ్యయ్యో! అదేమిటండీ, అలాంటి మాటలని నన్ను బాధపెట్టకండి. నాకు వీలయినప్పుడు హాస్టలునుంచి వచ్చి సంతోషంతో మీకు పాఠాలు చెప్తాను.”
“ఆ వీలు ఏ నెలకు ఒకమాటో అవుతుంది కాబోలు.”
"వా! వా! అదా నా ఉద్దేశం.”
ఈ బాలిక పేరు ఆనందమయి. ఆనందపూర్ణమైన జీవితమే రూపం కట్టిందా యీమె!
ఈ ఆలోచనలన్నీ రెండుమూడు నిమేషములలోనే నా హృదయాన ప్రసరించి పోయినవి. ఆనందమయి నన్ను చూచి "ఏమిటండీ మీ ఆలోచనలు ఏండ్లు యిక్కడ చదువుకుంటూ ఉండికూడ మీ దర్శనభాగ్యం యెప్పుడూ మాకు కలుగనిచ్చారు కాదు. మీ దక్షిణాది వాళ్ళెప్పుడూ యింతేలెండీ!" అని ఆ బాలిక పకపక నవ్వింది.
"మేము దక్షిణాదివాళ్ళము కాదండి. మేము తెలుగు వాళ్ళము!”
"తెలుగువాళ్ళు దక్షిణాది వాళ్ళు కాకపోతే ఉత్తరాది వాళ్ళ! నా కెప్పుడూ తెలియదే యీ విషయం!"
“మేము ఉత్తరాది వాళ్ళమూ కాదండీ.”
“అయితే మీరే ఆది వాళ్ళు? తూర్పాది వాళ్ళ? పడమటి అది వాళ్ళా?”
"మీకు తూర్పు ఆది వాళ్ళు బెంగాలీవాళ్ళూ, అస్సాము వాళ్ళూ, పడమటి ఆదివాళ్ళు రాజపుత్రులూ, గుజరాతీ వాళ్ళూ, నా ఉద్దేశ మేమిటంటే దక్షిణాదివాళ్ళంతా దక్షిణ పెన్నకి దక్షిణంగా వుండేవాళ్ళు మాత్రమే. వాళ్ళు అరవవారు, మళయాళీ వాళ్ళూను. మేము దక్కనువారము.”
“మీరూ, తమిళులూ, మలయాళీలూ, కన్నడులూ ఒక జాతికి చెందినవారు కదా?”
“ఇలా జాతీ జాతీ తేడాలగా చెప్పలేము. ఒకే భాషవారు ఒకే జాతి అని ఎలా చెప్పగలను? ఒకే భాష మాట్లాడేవారిలో అనేక జాతులవారు కలిసిపోయి యుండవచ్చును. విడివిడిగాను ఉండవచ్చును. ఒకేజాతికి చెందిన వారు వివిధ ప్రాంతాలలో వివిధ భాషలు మాట్లాడుతూ వుండవచ్చును. వివిధ భాషలలో వున్న సౌందర్యము ఉన్నతస్థాయిని పొంది సర్వభారతీయమైన సంస్కృతిలో శ్రుతియుక్తమైన భాగమౌతుంది. అప్పు డాసంస్కృతి మహత్తరమైన లాభము పొందగలదు.”
“మీరు చెప్పింది నిజం.” నాకు ఆశ్చర్యమెక్కువైంది. నేను ఉత్తరాది వారికీ, దక్షిణాదివారికీ చాలా తేడాలున్నాయని వాదించడానికి సంసిద్ధుడనై యుంటిని. కాని ఆనందమయిదేవి నావాదన తీసుకోవడము, నేను ఆమె వాదన బలపర్చడమైనది. ఈ సంగతి యిద్దరం ఒకేసారి గ్రహించాము. గ్రహిస్తూనే యిద్దరం పకపకా నవ్వుకున్నాము.
6
నేను మా విశ్వవిద్యాలయం హాస్టలుకు వెళ్ళిపోయాను. వెళ్ళి వారం రోజులవరకు త్రివేదిగారి యింటికిరాలేదు. తొమ్మిదవరోజు సాయంకాలం త్రిపాఠీ దంపతులూ, ఆనందమయీ త్రిపాఠీగారి కారుమీద మా వసతి భవనానికి చక్కావచ్చారు. నాగది నంబరు తెలిసిన త్రిపాఠీగారు రెండవమేడలో మూడవ అంతస్థులో ఉన్న నా 20వ నంబరు గదికి గబగబా వచ్చి "హల్లో, చతుర్వేది” అని పిలిచారు. నేను అప్పుడే లైబ్రరీ నుంచి వచ్చి టీతాగి, పడక కుర్చీలో మేను వాల్చి, ఆనందమయీ సౌందర్యం తలపోసుకుంటూ ఏవేవో అంతులేని కలలు కంటున్నాను. త్రిపాఠీగారి పిలుపుకు ఉలికిపడి లేచి "మీరా త్రిపాఠీగారు! రండి, ఆ పడకకుర్చీమీద దయచేయండి. రెండు నిమిషాలలో టీ ఆర్డర్ చేసి చక్కా వస్తాను” అని అన్నాను. ఆయన రాకకు నా ముఖం ప్రఫుల్లమైనట్లు నాకే స్పష్టమైనది.
“నాకు 'చా’వద్దు, ‘చీ’వద్దు. మీరు వెంటనే దుస్తులు ధరించి నాతో రావాలి. ఇవి ప్రభుత్వంవారి ఆజ్ఞలు” అని త్రిపాఠీ చిరునవ్వుతో హెచ్చరించాడు.
“ఏ ప్రభుత్వంవారు!' అన్నాను నేను.
“ఆ ఆజ్ఞలు మీకేమీ తెల్పడానికి వీలులేదు. రహస్యపు టపాలో వచ్చాయి.
గబగబా ఉచితమైన వేషం వేసుకొని ఆయనతోపాటు కిందకుదిగి హాస్టలు భవనాల ముందున్న తోటలోనికి వస్తిమి గదా - అక్కడ తోట రోడ్డుమీద త్రిపాఠీగారి కారు సిద్ధంగా ఉంది. ఆ కారులో జ్యోతిర్మయీ, ఆనందమయీ ఇద్దరూ కూర్చుని ఉన్నారు. త్రిపాఠీగారు నన్ను వెనుక సీటులో ఆనందమయి ప్రక్కన కూర్చుండమని తాను తన భార్య ప్రక్క ముందు సీటులో కూర్చుని ఉన్నాడు. జ్యోతిర్మయి కారును మేల్కొలిపి, గుర్రున నడక సాగింపించినది. నేను ముందుకుపడబోతే ఆనందమయి నన్ను రెండు చేతులతో ఆపుచేసి తనవైపునకు లాగుకొంది.
“కొంచెమయితే పడిపోయి ఉందురు. మా అక్క ఎప్పుడూ ఇంతే లెండి. ఆవిడ డ్రైవ్ చేస్తూ ఉంటే కొత్తవాళ్ళయితే ప్రాణాలు ఎప్పటికప్పుడు ఎగిరిపోయినవనే అనుకుంటారు. మాకు అలవాటు అయింది లెండి” అని అంటూ ఆనందమయి కొంచెం దూరంగా జరిగింది.
“అయితే దారిపొడుగునా మీరు నన్నిలా రక్షిస్తూ ఉండవలసినదేనా యేమిటి?” అని నవ్వుతూ అన్నాను.
“అలా అని, అవసరం కలగకపోయినా నాకు పని కలిగించేందుకు ముందుకు వాలిపోకండేం!”
“పని కలిగిస్తే మీకు...” “టర్నింగ్ వస్తున్నది. జాగ్రత్త చతుర్వేదిగారు, గట్టిగా పట్టుకోండి.”
మళ్ళీ టర్నింగ్ రానేవచ్చింది. ఆమె వొళ్లోకి నేను పడ్డాను. పాపం మళ్ళీ నన్ను గట్టిగా ఆనందమయి పట్టుకొన్నది. మా ప్రయాణం లక్నో రోడ్డుమీద సాగుతున్నది. నేను ప్రాణాలు బిగపట్టుకునే ఉన్నాను. అయిదు మైళ్ళు ఆ రీతిగా మా ప్రయాణం సాగింది. అక్కడ రోడ్డు ప్రక్కనే మంచి తోటలోనికి మా కారును పోనిచ్చింది జ్యోతిర్మయి. నాకు తుపానులో కొట్టుకుపోయిన విమానము జాగ్రత్తగా భూమిని వాలింది అనిపించింది.
త్రిపాఠి: ఈతోట మా మామగారిది చతుర్వేదిగారూ! ఆయన ఈ తోటలో యెక్కడో పనిచేస్తూనే ఉంటారు. మనం నలుగురం కలసి కాసేపు టెన్నిస్ ఆడుకొని, కాసేపు బ్రిడ్జి ఆడుకొని ఇక్కడే భోజనాలు చేయడం. ఇక్కడే ఈ రాత్రి మకాం. మా మామగారు కాసేపటికి వెళ్ళిపోతారు.
నేను: అయ్యో! నేను హాస్టలులో చెప్పిరాలేదే.
జ్యోతి: దానివల్ల మీకు నష్టమా?
నేను: నష్టంకాదనుకోండి.
త్రిపా: ఉండవయ్యా! టెన్నిసు ఆట కాగానే నేను కారు మీదపోయి టెలిఫోనుచేసి వస్తానులెండి.
నేను: మరి... మరి....
ఆనం: నత్తివస్తోందేమిటి చతుర్వేదిగారూ!
జ్యోతి: చతుర్వేదిగారు హాస్టలులో ఉండటం నాకేమీ బాగుండలేదు.
త్రిపాఠి: ఈ నెలాఖరునుంచి మన ఇంటిలోనే మకాం పెడతారులే.
నేను: అప్పుడు నాకిచ్చే ఉచితవేతనంలో కొంత తగ్గిస్తారు.
ఆనం: ఎంత తగ్గిస్తారు? మీ హాస్టలుచార్జీ వారే కట్తున్నారు. అది మాన్తారు ఏమిటి నష్టం?
నేను: అయ్యో! మీ ఇంటిలో ఉండడం యేమి బాగుంటుందండి?
జ్యోతి: ఎందుకు బాగా ఉండదు? మీరు వ్రాసే వ్యాసం వ్రాతకు మేమెవ్వరం అడ్డురాము. మీరు లేబరేటరీకి వెళ్ళాలన్నా, లైబ్రరీకి వెళ్ళాలన్నా మా ఆనందమయి తా నెల్లాగూ వెళ్ళాలి కనక కారులో మిమ్ములను తీసుకొని వెడుతుంది. మళ్ళీ సాయంత్రం కాగానే కారులో తీసుకువస్తుంది. రాత్రిళ్ళు మా అమ్మాయికి మీరు పాఠం చెప్పితీరాలి.
త్రిపా: అసలు రహస్యం చెప్పేయరాదూ?
జ్యోతి: ఏముంది లెండి, చతుర్వేదిగారు! హాస్టల్లో ఉండరనీ, మా ఇంట్లోనే ఉంటారని మేము విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షునికి చెప్పాము. హాస్టల్ వార్డనుకు చెప్పాము. ఈ సాయంత్రం నుంచే రారని చెప్పామండోయి.
త్రిపా: మీ సామానంతా రేపు మా యింటికే వచ్చేస్తుంది. మీరు అసలు హాస్టల్‌కే వెళ్ళనవసరంలేదు.
ఆనం: మీ గదిని వార్డెన్‌గా రెవ్వరికో ఇచ్చి వేయడం కూడా జరిగింది.
వీరందరూ ఇలా అంటుంటే నాకు మతిభ్రమణమే కలిగిందనుకొన్నాను. నేను: ఏమిటండీ! బ్లిట్జ్‌క్రీగ్.
జ్యోతి: బ్లిట్జ్ అని వెనుకటి యుద్ధం సంగతి మాట్లాడతారేం. వచ్చే యుద్ధంలో ఇది ఆటం క్రీగ్.
టెన్నిస్ ఆడుకొన్నాం. బ్రిడ్జి ఆటకు కూర్చున్నాం. నేనూ ఆనందమయీ ఒకటి; జ్యోతిర్మయీ త్రిపాఠీ ఒకటి. ఇంతట్లో ఆనంద, జ్యోతిర్మయిల తండ్రి, త్రివేదిగారి కారు వెళ్ళిపోతున్న చప్పుడయింది. మేము బ్రిడ్జి కల్బర్స్టన్ విధానాన్నే ఆడాము. వారు ముగ్గురూ ఆ ఆటలో నిధులు. నేనంత పెద్ద ఆటకాణ్ణికాను. అందులో నా మనస్సు యే మాత్రమూ నిలకడ లేకుండా పోయింది. ఆలోచనలు ఒకపక్క; ఆటలు ఒకప్రక్క నేను రెండు ఆటలు అలా పాడుచేసేసరికి చాలా సిగ్గు వేసింది. “ఇవాల్టికి ఈ ఆటతో చాలు నండీ!" అని వారి ముగ్గురికీ కొంత సిగ్గుతో మనవి చేసుకున్నాను. ఆనందమయి లేచి నా దగ్గరకువచ్చి "మీరు ఇంతమాత్రము ఆడుతారనుకోలేదండీ. రండి, అలా తోటలోకి షికారు వెడదాము” అని చేయి పట్టుకు లేవదీసింది.
ఆ అమ్మాయి ఇంత చనువుగా నాతో సంచరించడం నాకు ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంది. మేమిద్దరం పూలతోటలో తిరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి నా ఆలోచన గ్రహించింది కాబోలు - “చతుర్వేదిగారూ! మా కందరికీ ఎందుచేతనో మీరు చాలా దగ్గరి చుట్టమైనట్లు భావం కలిగింది. నే నందరితోను ఇలా చనువుగా ఉండను. మా బావగారంటేనే దూరదూరంగా ఉంటాను. ఒక్క మా అన్నయ్య అంటే చాలా చనువు. మా జ్యోతి మీరు తనకు కాస్తా అన్నగారయినట్లే భావిస్తుంది. మా చనువుకు మీరేమీ అనుకోవద్దేం” అని అంటూ నా మొగంవైపు చూపులు ప్రసరించింది.
ఆనందమయి సాన్నిధ్యము నాకు నిజంగా మతి పోగొడుతున్నది. ఏమి మాట్లాడాలో నాకు తోచదు. ఆమెతోకూడా మౌనంగా తిరుగుతున్నాను. ఆమె కూడా మౌనం తాల్చింది.
నేను బ్రహ్మచారిని, అతిబీదవాడిని; కాస్త చదువులో పదిమందికన్నా నయమవడం చేత పరీక్షలో మొదటి వాణ్ణిగా నెగ్గుతూ వచ్చాను. నాకు వివాహం సంగతి ఎప్పుడూ తట్టలేదు. నేను చదువుకొనేటప్పుడు నా తోటి విద్యార్థినులు కాని, యితర బాలికలుగాని నన్నే విధంగా ఆకర్షించలేదు. వారిలో చాలామంది అందమైనవారేకాని నా బుద్ధి ఆడవాళ్ళమీదనే ప్రసరించని రోజులలో వాళ్ళ అందచందాలు కాని, వాళ్ళ తెలివితేటలుకాని నన్నేమి ఆకర్షించగలవు. కనక? బి.ఎస్సి. పట్టం పొంది ఏ మంచి ఉద్యోగమో సంపాదించుకొన్న తర్వాత వివాహం మాట ఆలోచిస్తానన్నాను, మా పెద్దలందరితోను, డబ్బుకలవాళ్ళ పిల్లల సంబంధాలు వచ్చినవని నా తల్లితండ్రులూ, నా మేనమామా చాలా సార్లు ఒత్తిడిచేశారు. కాని నా నిశ్చయం ఏ మాత్రం వదలినాను కాను. ఇప్పుడీ ఆలోచనలన్నీ రావడం దేనికి? హిందూదేశంలో వింధ్యపర్వతేశ్వరుడు లేనేలేడా? గంగా గోదావరులు ఒకేచోట పుట్టాయా? సర్వసమమైన భావాలు మానవ జీవితంలో చొచ్చుకు వచ్చినప్పుడే ఇది గంగ, అది గోదావరి అవుతుంది. ఇది తూర్పు కనుమా అది పడమటి కనుమా అవుతుంది. ఆనందమయి చటుక్కునాగి 'చతుర్వేదిగారూ! మీకు మా ఎవ్వరిమీద కోపం కలగలేదుకదా? నేను ఎప్పుడు మీతో మాట్లాడుదామని వచ్చినా, మీరు ఏదో ఆలోచిస్తూ ఉంటారేమి? మీరు మాయింట్లో ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసింది మా అక్కే సుమండి. ఆవిడకు నిజంగా మీవద్ద కొన్ని విషయాలు నేర్చుకోవాలనిఉంది. నాకు కొన్ని విషయాలు, మా అక్కకు కొన్ని విషయాలు నేర్పుతూ కూర్చున్నారంటే మీ కాలమంతా భగ్నమై మీ చదువుకు అంతరాయం కలగవచ్చు. అయినా మా అక్క మాటను ఎవ్వరం కాదనలేము. ఆవిడ ఒకటి చెప్పిందంటే అది అశోకాజ్ఞ” అని తలవాల్చుకొని తొందరగా చెప్పింది.
మే మిద్దరం ఆ ప్రక్కన నున్న ఒక ఉద్యానవనాసనంపై కూర్చున్నాం.
“ఆనందమయీదేవిగారూ! మీరు నాకేమీ కష్టం కలిగించలేదు పైగా పూర్తికావచ్చిన నా వ్యాసాన్ని బాగా ముగించడానికిన్నీ, వ్యాసమంతా మళ్ళా మొదట్నించీ సరిచేసుకోడానికీ హాస్టల్ వీలైన ప్రదేశంకాదని అనుకొంటూ ఉన్నాను. పైగా నావ్యాసం అంతా ఎప్పటికప్పుడు ఊళ్ళో ఉన్న ఒక టైపు షాపుకు వెళ్ళి టైపు కొట్టుకుంటున్నాను. అది రాత్రిళ్ళు వీలుకాకుండా ఉన్నది. నేను టైపుమిషను కొనుక్కోలేను. వీలుగావుంటే ఆ టైపుపెట్టెను నేను ఉపయోగించుకోగలను” అని ఆమెతో నెమ్మదిగా అన్నాను.
7
ఆ రాత్రి భోజనాలయిన వెనుక ఆ తోట భవనంలో మేము చాలా సేపు రాజకీయాలు, సారస్వతాలు, కళలు, శాస్త్రవిషయాలు చర్చించుకున్నాము. ప్రస్తుత పరిస్థితుల్లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చితీరాలని నావాదన. భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే భావమే సకలభారతావని ఒక్క మహాశక్తితో విజృభించడానికి అన్ని విధాలా అడ్డమని త్రిపాఠీ వాదన.
నేను: ఉన్న భాషలు తీసివేయలేము. ఒకే భాష మాట్లాడేవారు సన్నిహితంగా రావడం తప్పించలేము; బ్రాహ్మణా బ్రాహ్మణ విభేదాలు మా రాష్ట్రంలో వున్నమాట నిజమే. అవి మీ రాష్ట్రాలలో తక్కువ ఉండవచ్చును. అయినా మా రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు ఇతర రాష్ట్రాలలో ఉన్న బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులకన్నా తమలోతాము ఎక్కువ సన్నిహితంగా ఉంటారు.
త్రిపా: అది నేను నమ్మను. మీ మద్రాసు శాసన సభ సంగతులు చూస్తూవుంటే, మీ మంత్రిత్వపు గడబిడలు గమనిస్తూ వుంటే తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, బ్రాహ్మణేతరులంతా ఒకటై ప్రకాశంగారి మంత్రివర్గాన్ని పడగొట్టారని స్పష్టంగా తెలుస్తున్నది.
నేను: అది అంతా పూర్తిగా నిజంకాదు, మొదటిసారి ప్రకాశంగారిని ఓడించడంలో ఎవరో ఒకరిద్దరు తప్ప చాలామంది తమిళ బ్రాహ్మణులు ప్రకాశంగారికి వ్యతిరేకులయ్యారు. తెలుగు వారిలో ప్రకాశంగారి తరఫున చాలామంది బ్రాహ్మణేతరులున్నారు. ఈ కక్షలన్నీ నా ఉద్దేశంలో వ్యక్తి సంబంధమైనవని మాకు ఆనాడు కావలసింది కాంగ్రెసువారిరాజ్యం. అందులోకల్లా యీ పక్క పెద్ద ప్రకాశంగారు, ఆ ప్రక్క రాజగోపాలచారిగారు. ఈ ఇద్దరూ కలసి మంత్రివర్గం ఏర్పాటు చేసివుంటే మద్రాసురాష్ట్ర వ్యవహారాలు చాలా అద్భుతంగా వుండి వుండును. కాని ఇక్కడ కూడా భాష అడ్డు వచ్చింది. రాజగోపాలాచారిగారూ, ప్రకాశంగారూ కలవడానికి ఏవో అడ్డువచ్చాయి. ఇంతకూ నా వాదన సత్వరంగా ఆంధ్రరాష్ట్రం వచ్చితీరాలి.
జ్యోతి: అయ్యయ్యో! మీరలా అంటారు. మారాష్ట్రమంతా ఒకే భాషేనా, అయినా చూడండి! కాంగ్రెసు వారిలో ఎన్ని ముఠాలున్నాయో?
ఆనం: నిన్నటివరకూ రాక్షసుల్లా కష్టపడ్డారు కాంగ్రెసువారు; స్వరాజ్యం సంపాదించారు; రాజ్యరథం నడపడానికి పగ్గాలు చేతపట్టారు. ఇంక తమదేశం మాట మరచిపోయారు.
నేను: ఎవరో నెహ్రూ, పటేలు, రాజేంద్రబాబు, అజాద్ ఇంకా అలాంటి పెద్దలు తప్ప తక్కినవారందరూ తామింకా అసలైన గమ్యస్థానం చేరలేదన్న విషయాన్ని మరచిపోయారు.
త్రిపా: అది మరచిపోవడం కాదేమో. వారు అనుకోని ఊహించలేని ప్రళయాలు వచ్చిపడ్డం చేత ఈ మోస్తరుగా సంచరించవలసి వచ్చిందేమో ఆలోచించారా?
నేను: మీరన్నదానిలోనూ నిజం లేకపోలేదు. కాని అసలు గాంధీతత్వం వెనుక పడిందంటారా లేదా?
ఆనం: నేను తప్పకుండా నిజమంటాను.
జ్యోతి: నేను పూర్తిగా నిజం కాదంటాను. ఎందువల్ల నంటారా బ్రిటిష్ వారి పరిపాలనవల్ల నేమి, మరి భారతీయుల సంప్రదాయ ఛాందసంవల్లనేమి మనలో మధ్యయుగపు భావాలన్నీ కరడుకట్టి వున్నవి, గాంధీగారిని అనుసరించిన రోజులలో కూడా ప్రతి కాంగ్రెసు వీరుడూ నూటికి పది పాళ్ళు మాత్రమే అనుసరించాడు. ఆ మాత్రానికే అతడు వీరుడనుకున్నాడు.
ఆనం: లేకపోతే స్వరాజ్య మెలా వచ్చింది.
నేను: ఇది నిజమైన స్వరాజ్యమంటారా ఆనందమయిగారూ! నిజమైన స్వరాజ్యమయితే పాకిస్థాన్ విడిపోనేపోదు. కాంగ్రెసులో జైలుకు వెళ్ళినవాళ్ళు, దెబ్బలు తిన్నవాళ్ళు, ప్రాణాలు కోల్పోయినవాళ్ళు, ఆస్తులు పోగొట్టుకున్నవాళ్ళు, ఎందుకూ పనికిరాకుండా పోయినవాళ్ళు నూటికి పదిపాళ్ళు అనుసరించిఉండినా పంజాబు హత్యలు నవఖాళి హత్యలురానేరావు.
ఆనం: అవతారమూర్తి అయిన ఒక మహానుభావుడు వుద్భవించినప్పుడు ప్రజలు ఆయనను నూటికినూరుపాళ్ళు ఎప్పుడూ అనుసరించలేరు. నూటికి ఏ అయిదుపాళ్ళు అనుసరించినా మానవ సంస్కృతి ఎన్నోమెట్లు పైకి నడిచిపోగలదు.
నేను: ఇంతకూ మీరు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలంటారా అక్కర్లేదంటారా?
త్రిపా: కొంత కాలానికైనా అవి పోవాలి. రాజ్య పరిపాలనా సౌకర్యం మాత్రం కోసమే రాష్ట్రాలు ఏర్పడాలి.
నేను: అలా ఏర్పడ్డంవల్ల రష్యాలో ఏమీ నష్టం కాలేదే? స్విట్జర్లాండులో ఏమీ కష్టాలు కలుగలేదే? ఇలా మా సంభాషణ సాగించి మేమింత గట్టిగా వాదించుకొనడం వల్ల ఆంధ్రదేశానికి ప్రత్యేక రాష్ట్రం వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. దక్షిణాదిన ఉండే ఆంధ్రులే ఆంధ్రరాష్ట్రానికి వ్యతిరేకమయినారు. భాష ఒకటైనంత మాత్రాన అందరినీ ఏకోన్ముఖంగా చేస్తుందా ఏమన్నానా? ఆ రాత్రి రెండుగంటలకు నిద్రపోయాం.
తెల్లవారి ఆరుగంటలకు నాకు మెళకువ వచ్చింది. కళ్ళు తెరిచేటప్పటికి నా గదిలో గుమ్మం దగ్గర నన్ను గమనిస్తూ ఆనందమయి నిలుచుని వుంది. నేను ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. “రాత్రి ఎంత నిద్రలేకపోయినా, నాకు పెందలకాడె మెలుకువ వచ్చేదండి. ఈవాళ నాకిలా వొళ్ళు తెలియకుండా నిద్రపట్టిందేమిటో” అని కొంచెం సిగ్గుతోనే అన్నాను.
“మీరేమీ కంగారుపడకండి. నేను ఒక్కతెనే లేచాను. బావా, అక్కా ఇంకా నిదురపోతూనే ఉన్నారు. మీరు లేచారేమో, మీకు కాఫీ కావాలా, టీ కావాలా అని అడగటానికి వచ్చాను” అని ఆనందమయి అంటూ “మీరు ముఖం కడుక్కుని హాలులోకి రండి" అన్నది.
“నాకు కాఫీ అంటేనే యిష్టం. మీ దేశానికి వచ్చాక టీకూడా అలవాటులెండి. అయినా ప్రొద్దున్నప్పుడు కాఫీయే పుచ్చుకుంటాను" అని అన్నాను.
"మీ హాస్టల్లో కాఫీ తయారు చేస్తారాండీ?”
“తెలుగువాళ్ళము, అరవవాళ్ళము, కన్నడవాళ్ళము అంతా కలసి పదిమందున్నాము హాస్టల్లో. మా వంటవాళ్ళకి కాపీ చేయడంకూడా నేర్పాము.”
“అయితే మీరు నాకు కూడా నేర్పండి. నేను మా వంటవాళ్ళకి నేర్పుతాను.”
మే మిద్దరమూ నవ్వుకున్నాము. ఆమె వెళ్ళిపోయింది.
హాలులో మే మిద్దరమూ ఉపహారాలు పుచ్చుకొనే సమయంలో జ్యోతిర్మయీ సుప్రియా త్రిపాఠీ మేడమీదనుంచి కిందకు దిగివచ్చారు.
8
నా పరిస్థితి చిత్రంగానే ఉంది. త్రివేదీగారింట్లో నేను చుట్టాన్నయ్యాను. ఆ యింట్లో నన్నందరూ ఎంతో గౌరవంగానూ, ప్రేమతోనూ చూస్తున్నారు. జ్యోతీంద్రనాథ త్రివేదీగారు ఉత్తముడైన అడ్వొకేటు. నెలకు ఇరవై ముప్ఫైవేలు ఆదాయం వస్తుంది. ఆయన మొదట మోతీలాల్ నెహ్రూగారి దగ్గిర జూనియర్‌గా చేరినారు. భారత ప్రధాని నెహ్రూజీతో ఆయన సమకాలికుడు. మొదటనుండీ కాంగ్రెసు అభిమాని. నెహ్రూ కుటుంబం దేవతల కుటుంబం అని ఆయన నమ్మకం.
ఆయన సంప్రదాయాభిమాని. జప తపాదులు దైనందిన ధర్మంగా నిర్వహించే సనాతనవాది. అయినా సంఘంలో వచ్చే మార్పులంటే ఆయనకు ఇష్టమే! మరీ పెద్దమార్పులు తార్కికంగా ఆయన ఒప్పుకున్నా వచ్చే ఉద్యమ విషయంలో ప్రథమ సమయంలో ఆయన విముఖంగానే ఉండేవారు. హరిజనులు దేవాలయాలకు రావడం ఆయనకు కిట్టలేదు. హిందూ వివాహానికి విడాకుల శాసనం తీసుకురావడం ఆయన మనస్సుకు వజ్రాఘాతంలా తగిలింది. మదరాసు రాష్ట్రం సనాతన ధర్మ పూర్ణము అని ఆయన భావించుకొనేవారు. మదరాసు రాష్ట్రవాసుల ఆచారాలు సనాతన ధర్మపూర్ణాలనుకొన్నాడాయన. కాని అక్కడ విడాకుల చట్టం ఆయనకు ఆశ్చర్యం వేసింది.
అయినా ఆయనకు వేదకాలపు మహాఋషుల శక్తి అంటే అపారమైన నమ్మకం. ముందు యుగాలలో అవసరమైన మార్పులు వస్తూఉండేటట్లే వారు నిర్ణయించారనీ, రాను రాను యుగాలు అవతరించిన కొలదీ, ప్రపంచంలో అన్నిభాగాలూ వేద ధర్మానుసరణమైన దివ్యభావాలు గ్రహించి, భారతీయ సంస్కృతిలో చేరిపోతాయని ఆయనకు గాఢ విశ్వాసం. మార్పు వచ్చినప్పుడు బాధపడతాడు. వచ్చిన కొద్ది సంవత్సరాలకు సమన్వయం చేసుకుంటాడు. 'మహాత్మాగాంధీ అవతార పురుషుడే కాని మాలవ్యా శివుని అవతారం. వీరిద్దరూ లోక సంగ్రహణానికి అవసరం' అని ఆయన వాదించుకుంటాడు; ఇతరులతో వాదిస్తాడు. శారదా శాసనం వలదని వాదించాడు. వచ్చిన వెనక చాలా బాగుందన్నాడు. హిందూ మహమ్మదీయ సమన్వయం కూడదన్నాడు. కాని రానురాను మహాత్మాజీని బాగా అర్థం చేసుకున్నాడు.
ఇంతకూ ఆయనకు ఉత్తర రాష్ట్రాల బ్రాహ్మణులే నిజమైన ఆర్య ఋషి సంజనితులనీ, దక్షిణాది పంచద్రావిడులు, ఎవరో తురేనియన్ జాతులలోనుండి ఉద్భవించి వుంటారనీ నిశ్చితమైన సిద్ధాంత సూత్రం! అందుకనే చతుర్వేది తన పంక్తిలో ఎప్పుడూ భోజనం చేయడం ఆయనకు ఇష్టంలేదు. త్రిపాఠీ ఆంగ్ల దేశాది పాశ్చాత్య దేశాలలో సంచరించి రావడంవల్ల అతడూ పంక్తి బాహ్యుడే. అతని భార్య, తన పెద్దకూతురు జ్యోతిర్మయీ అంతే! ఒక్క ఆనందమయి మాత్రం తన ప్రక్కను కూర్చుని భోజనం చేయవచ్చును.
ఒకరోజు రాత్రి త్రివేదీగారి భవనంలోని హాలులో నవజవాన్లము మేము నల్వురమూ కూర్చుండి హోరాహోరీ వాదించుకుంటూ ఉంటే త్రివేదీగారు అక్కడకు వచ్చి ఒక ఆసనం అధివసించినాడు. యువతీ యువకులమైన మేము నల్వురం మౌనం తాల్చినాము. ఆయన నవ్వుతూ ఆనందమయి వంకచూచి "బేటీ! ఏమిటి మీరు వాదించే విషయం?” అని ప్రశ్నించాడు. ఆనందమయిని ఆయన గాఢంగా ప్రేమించాడు. అలా అని జ్యోతిర్మయి అంటే తక్కువ ప్రేమకాదు. బ్రూటను చెప్పినట్లు అతడు “సీజరును తక్కువ ప్రేమించుట లేదు; రోము అంటే ఎక్కువ ప్రేమ.”
ఆనం: దాదాజీ! చతుర్వేదిగారంటారు దక్షిణాది బ్రాహ్మణులు అసలైన ఆర్యఋషి సంతతివారని, అక్క ఉత్తరాది పంచ గౌడులే సిసలైన వారంటుంది.
త్రివే: నీ వాదన?
ఆనం: నేను విద్యార్థినిని; అందుకని వాదనలన్నీ విని నా అభిప్రాయం నిశ్చయం చేసుకుందామని అనుకున్నాను.
జ్యోతి: దాదాజీ! చతుర్వేదిగారంటారు: రామాయణకాలంలో దక్షిణాదికి వలసవెళ్ళి, మహర్షులు ఆశ్రమాలు స్థాపించినారని సిద్ధాంతం ఉందిగదా! ఆ ఋషుల సంతతిలో తాము ఉద్భవించినారట. ఇక్కడ ఉత్తరాది శకులు, హూణులు, పహ్లవులు తండాలు తండాలుగా వచ్చి ఆర్యులలో కలసిపోయారట. వారిలో కొందరు క్షత్రియులైనారట; కొందరు బ్రాహ్మణులైనారట!
త్రివే: నీ అభిప్రాయం సుప్రియా?
త్రిపా: ఆ వాదనా ఈ వాదనా రెండూ శుద్ధ నిష్ప్రయోజనాలే. చరిత్రాత్మకంగా నిజం గ్రహించలేము. వట్టి అంచనాలు, ఊహాగానాలు చారిత్రక సత్యంకాజాలవు. మన పంచగౌడులలో కాశ్మీరులు, బెంగాలీలు, ఓడ్రులు, సారస్వతులు, మత్స భుక్కులు, మాంస భుక్కులు, మైథిలులు, ఘూర్జరులూ మాత్రం శాకాహారులుకదా? పంచద్రావిడులైన ఆంధ్రులు, కన్నడులు, తమిళులు, మహారాష్ట్రులు, మలయాళ నంబూద్రీలు - అందరూ శాఖాహారులే.
త్రివే: చతుర్వేదిగారూ! మీ సిద్దాంతం అంతా పూర్తిగా చెప్పండి.
చతు: దక్షిణాదిని ఋష్యాశ్రమాలు రామాయణకాలంలో బాగా వెలిశాయి. అప్పటికి ఆర్యావర్తమైన ఉత్తరాది అంతా జనాకీర్ణమైన గ్రామాలతో పట్టణాలతో నిండిపోయింది. కాబట్టి ఆర్యఋషులు ఆశ్రమాలు హిమాచలంలోనన్నా నిర్మించుకోవాలి. లేదా దండకారణ్యంలో నన్నా నిర్మించుకోవాలి.
జ్యోతి: అయితే అప్పటి ఋషులకు దండకారణ్యం అపవిత్రమూ, నివాసయోగ్యతా రహితమూ అయిన ప్రదేశమని భావం వుంది కాదా అండి.
చతు: ఆర్యావర్తం ఎందుకు పవిత్రమైనదీ? ఆర్యఋషులు వర్తించడంవల్ల యజ్ఞయాగాది పవిత్రకర్మలు జరపడంవల్లా, తద్వారా ఆ ప్రదేశాలకు దేవతలు దిగిరావడంవల్ల కదా!
త్రివే: అవును.
చతు: అయినప్పుడు వింధ్య దాటి శరభంగుడు, మతంగుడు, ఇంకా అనేకులు దండకారణ్యానికి పోయి ఆశ్రమాలు ఎందుకు నిర్మించుకొన్నారు? ఆ ప్రదేశాన్ని కూడా తమ యజ్ఞయాగాదులచే పవిత్రం చేయాలనికదా! కాని అచ్చటి రాక్షసులైన నీగ్రోజాతి అడవి మనుష్యులు ఆ ఆశ్రమాలను నాశనం చేస్తూవుంటే వాటిని కాపాడేందుకు శ్రీరామచంద్రుడు రావలసి వచ్చింది. రాక్షసులను నాశనం చేసి ఆశ్రమాలు సుస్థిరం చేశాడు శ్రీరామమూర్తి.
ఎవరు లొంగుతారు! పూర్వకాలంలో వాదనలో ఓడిపోతే తమ మార్గం కూర్చుకునేవారని చరిత్ర చెబుతుంది. ఈనాడు న్యాయంగా వాదించుకోడాలు అవతలవారిని ఏడిపించడానికే. అలా అని తెలుసుకోవాలని వచ్చి ఆ విషయం అర్థమయ్యే వరకూ పిడుగులా వాదించి, ఆవెనక తమకు నచ్చితే ఆ వాదన ఒప్పుకునేవారూ ఉన్నారు..
9
ఇంత వాదనలలోనూ ఆనందమయి మాట్లాడకుండా కూర్చుండి, ఎవరు మాట్లాడుతో ఉంటే వారిని తీక్షణంగా గమనిస్తూన్నది. ఆనందమయి జ్యోతిర్మయీదేవికన్న చాలా అందమైన అమ్మాయి. జ్యోతిర్మయే చాలా చక్కని బాలిక. ఇద్దరు అక్క చెల్లెళ్ళూ సరస్వతీ, శారదలు. ఒకరికన్న ఒకరు అందంగా కనబడతారు. జ్యోతిర్మయికన్న ఆనందమయి ఒక ఛాయ ఎక్కువ. జ్యోతిర్మయి పూర్ణిమ ముందు చతుర్ధశినాటి వెన్నెలైతే, ఆనందమయి పూర్ణిమాజ్యోత్స. ఎంతో జాగ్రత్తగా గమనిస్తే గాని ఈ తేడా తెలియదు. ఇద్దరూ వికసించిన దేహసౌష్ఠవం కలవారు. ఆనందమయికన్న జ్యోతిర్మయి రెండేళ్ళు పెద్ద. ఆతేడా మాత్రం వాళ్ళిద్దరిలో కనిపిస్తుంది.
ఇద్దరివీ సమనాసికలు, ఇద్దరివీ విశాలమైన కళ్లు. కాని జ్యోతిర్మయి పెదవులు కొంచెం పెద్దవి. ఆనందమయి పెదవులు సమంగా ఉంటాయి. జ్యోతిర్మయి పెదవుల అంచులు నవ్వుతున్నట్లు పైకి తిరిగి ఉంటాయి, ఆనందమయి పెదవుల అంచులు సమరేఖాంచలములై ఏదో ఎప్పుడూ ఆలోచిస్తున్నట్లుంటాయి.
నాకు కళలలో ఏమీ ప్రజ్ఞలేదు. నేను సంగీతం పాడలేను; బొమ్మలు వేయలేను; పాటలూ పద్యాలూ సృష్టించలేను. కాని నవలలన్నా, నవలలకన్న నాటకాలన్నా, నాటకాలకన్న కథానికలన్నా, కథానికలకన్న పాటలన్నా, పాటలకన్న పూర్వకవుల కవిత్వమంటేనూ మహాఇష్టం. నా చిన్న లైబ్రరీలో ఎన్నో తెలుగు ప్రబంథాలు, భారత సంపుట భాగాలు, పోతనామాత్యుని భాగవతమూ ఉన్నాయి.
జ్యోతిర్మయి, ఉత్తరాది బాణీ సంగీతంలో ఘటికురాలు; కథక నృత్యంలో మంచి ప్రజ్ఞావంతురాలు. ఆనందమయికి బొమ్మలంటే ఇష్టం. ఆవిడ స్వంత గ్రంథాలయంలో భారతీయ చిత్రలేఖనాన్ని గూర్చీ, శిల్పాన్ని గూర్చీ, వాటి ఆశయాలను గూర్చీ ఎన్నో గ్రంథాలున్నాయి. ఆమె సంగీతం పాడుతుంది. కాని శాస్త్రంగా నేర్చుకోలేదు. అక్కగారు కథక విధాన నృత్యం నేర్చుకుంటూ ఉన్నప్పుడు తానూ కొన్ని కరణాలు అలవరచుకొన్నది.
ఆనాడు బ్రాహ్మణత్వాన్ని గూర్చి అలా వాదించుకొంటూ ఉంటే, దక్షిణాపథదేశాల - బ్రాహ్మణేతర బ్రాహ్మణ ప్రశ్నను వాదనలోనికి తీసుకువచ్చి జ్యోతిర్మయి "ఒకవేళ మీ తమిళ సోదరులు కొందరు వాదించిన రీతి దక్షిణాది బ్రాహ్మణులు ఆర్య బ్రాహ్మణులైతే అయి ఉండవచ్చును.”
నేను: నేను ఆ వాదము ఒప్పుకోను. దక్షిణాది బ్రాహ్మణేతరులలో అనేకులు ఆర్యులే. మా రెడ్లూ, కమ్మవారూ, రాజులూ, బలిజలూ ఒకనాడు బ్రాహ్మణులే. బౌద్ధమత జైనమత సంఘాతంవల్ల బ్రాహ్మణత్వం కోలుపోయి సచ్ఛూద్రులయ్యారు. అలాగే దక్షిణాది వెల్లాలులా అంతే. కూర్గువారిలో చాలామంది అంతే!
త్రిపా: ఇంతకూ ఈ వాదన ఏమి తేలినట్లు? నేడు మనకు కావలసి నది, బలమైన భారతము. అజేయమైన భారతము, మతాలూ, కులాలూ అన్నీ ఏకమైపోవాలి.
త్రివే: హరహరా, ఇన్ని యుగాలనుండీ హిమాలయంకన్న శాశ్వతంగా నిలిచిన సనాతనధర్మం నాశనమయి పోవలసిందే?
నేను: నిజం మీరు చెప్పింది. ఆ ధర్మాన్ని ఎవరు నాశనం చేయగలరు?
త్రిపా: అసలు ధర్మం మంటగలిపినా, సనాతన ధర్మం మాత్రం ఎందుకు నిలవాలి దాదాజీ?
త్రివే: సనాతనధర్మమే అసలు ధర్మం! త్రిపా: మానవధర్మం అంటూ వేరేలేదూ? ఈ మతాలు ఈ భారతదేశం, ఈ ఋషిప్రోక్తమూ ఇదేనా మానవధర్మం?
నేను: సర్వకాలాలకు సర్వదేశాలకు సత్యమయిన ధర్మమేదో అదే ఋషులకు తపస్సులో దర్శనమిచ్చింది. కాని ఆ ధర్మం వేదంలోనూ, ఉపనిషత్తులలోనూ వ్యక్తం అయి ఉంది. తక్కిన ధర్మశాస్త్రాలు కాలానుబద్ధాలు. అదీ మా రాధాకృష్ణపండితులు తెలిపింది.
ఆనం: వారి పుస్తకం నాకు చదివి వినిపించి, అర్థం చెప్పండి చతుర్వేదిగారూ!
జ్యోతి: సైన్సు చదువు త్రివేణీలో సంగమించాలా?
త్రివే: ఏమో, చతుర్వేదిగారు అన్న ముక్కా నాకు నచ్చలేదు. ధర్మశాస్త్రాలే వేదోపనిషత్తుల భాష్యాలు.
త్రిపా: అంతేనంటారా దాదాజీ! మీరు పేరుపొందిన అడ్వకేట్లు. ధర్మశాస్త్రాలను లా పుస్తకాలలోనికి దింపినవారిలో దిట్టమయినారు. ధర్మ శాస్త్రాలు కాలానుసారంగా మారలేదంటారా?.
త్రివే: మారినాయి. కాని మూలధర్మం ఇంతైనా మారలేదు.
త్రిపా: కులాలూ మతాలూ కలిసిపోతే మూలధర్మమయిన బ్రహ్మ పదార్థం మారుతుందా?
ఈ వాదన అంతటితో ఆగిపోయింది. హాలు గడియారం సంగీతంలా పదకొండు గంటలు కొట్టింది. “ఇంక పడుకోండి; చాలా ప్రొద్దుపోయింది” అంటూ త్రివేదిగారు లేచినారు. అందరం లేచినాము, ఎవరి గదులలోనికి వారు వెళ్ళడానికి, “మూలధర్మం అనేది బ్రహ్మపదార్థం కాదనుకుంటాను. జీవితాన్ని ఆధ్యాత్మిక సత్యాన్నీ సమన్వయం చేయడంలో ఉద్భవించిన వరవడిరాయే మూలధర్మం అవుతుందనుకుంటాను. అదే భారతీయ సంస్కృతి. ఆ సంస్కృతి దేశమంతా నిండి ఉందని నా నమ్మకం" అన్నాను.
త్రివేదిగారు మేడమెట్లు ఎక్కబోతూ, “ఒకే సంస్కృతి భారతం అంతా నిండి ఉందని నేననుకోను. దక్షిణ భారత సంస్కృతికీ, ఉత్తర భారత సంస్కృతికీ చాలా తేడా ఉంది” అన్నారు.
“ఆ రెండూ ఒకే మహా సంస్కృతికి కవలపిల్లలలాంటివి కావాలండి?”
“తరువాత మాట్లాడువచ్చులెండి" అని అంటూ ఆయన మేడమెట్లక్కి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోతూ ఉంటే మేమందరం వారికి నమస్కారాలు చేసినాము.
ద్వితీయ భాగము
ఏప్రిల్ వచ్చింది. నేను వ్యాసం విశ్వవిద్యాలయం వారికి సమర్పించాను. జ్యోతిర్మయి ఆనందమయిల పరీక్షలయ్యాయి. నేను బాగా సహాయం చేశానట. అందుచే వాళ్ళిద్దరూ మొదటి తరగతిలో కృతార్థలవుతారట. ఆ సహాయానికి వారు తాము నాకు తీరని బాకీకి లోబడి ఉన్నారట. ఆ నాలుగు నెలలు ఎంత హాయిగా గడిచిపోయాయో! ఆ కుటుంబంలో ఒకణ్ణయిపోయాను. ఆనందమయి నేనంటే నానాటికి విపరీతమైన భక్తిలోకి దిగింది. మొట్టమొదటి రోజుల్లో చనువు తగ్గించుకుంది. పాఠం అవసరం ఉన్నప్పుడే ఆమె చదువుకునే మేడమీదహాలులో మేమిద్దరం కలిసేవాళ్ళం, సాయంకాలాలు మేము నలుగురమూ టెన్నిసు ఆడుకునేవాళ్ళం. ఎప్పుడైనా మేము నలుగురమూ వారి తోటకు వెళ్ళేవాళ్ళం.
మార్చి నెలలో త్రిపాఠీకి బారైలీ జిల్లా బదిలీ అయింది. అతడు తన వంట మహారాజుతో, పరివారంతో బదిలీ ప్రదేశానికి పోయాడు. పరీక్షలు కాగానే నేనూ, జ్యోతిర్మయీ, ఆనందమయిలూ కలిసి ఆయన ఉద్యోగ నగరానికి వెళ్ళవలసి ఉన్నదట.
మాది గోదావరీ తీరం, పశ్చిమ గోదావరి జిల్లా, పెద్ద కుటుంబం. మేము అయిదుగురం అన్నదమ్ములం. నేను మూడోవాణ్ణి. నాకన్న పెద్ద వాళ్ళిద్దరూ చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒకడు రేడియోలో అసిస్టెంటు ఇంజనీరుగా ఉన్నాడు. తిరుచునాపల్లిలో పని. రెండవ అతడు బి.ఏ. ఆనర్సు ఆంగ్లభాష విషయంగా మొదటి తరగతితో కృతార్థుడై, రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో సహాయ ఆచార్యపదవిని పొంది కాలక్షేపం చేస్తున్నాడు. నాకన్న చిన్నవాళ్ళిద్దరూ ఒకడు ఇంటరూ, ఒకడు వ్యవసాయ కళాశాలలోనూ చదువుతున్నారు.
మాకు ఒక్కత్తే సహోదరి, ఆమె మా అందరికన్న పెద్దది. ఆమె నలుగురు బిడ్డల తల్లి. నాకు చాలా సంబంధాలు వచ్చాయి. కాని ఉద్యోగం లేకుండా, ఏవో నాలుగురాళ్ళు సంపాదించుకుంటూ ఉండకుండా వివాహం చేసుకోనని పట్టుపట్టాను. నాకు ఇరవై ఆరోఏడు జరుగుతూ ఉన్నది. నేను పరిశోధించిన విషయం చాలా ముఖ్యమైన విషయం. అలహాబాదు విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు ఈ రోజుల్లో, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు ఆ రోజుల్లో, నేను పాశ్చాత్య దేశాలలోని సైన్సు మాసపత్రికలకు వ్యాసాలు వ్రాస్తూ ఉన్నాను. అవి చాలా మెచ్చుకుంటూ ఉద్దండులైన పాశ్చాత్య పండితు లెందరో నాకు ఉత్తరాలు వ్రాసినారు, వ్రాస్తూ వున్నారు.
మేమంతా కుమాయూన్ జిల్లా వెళ్ళి, త్రిపాఠీతో ఆ హిమాలయ కీకారణ్య ప్రదేశమైన జిల్లా అంతా తిరిగినాము. పెద్దపులులు బరిమీద తిరుగుతూ ఉంటే కనుక్కొన్నాము. ఆ హిమాచల ప్రజల ఆచార వ్యవహారాదులు గమనించాం. వారి దైనందిన జీవితంలోని కష్ఠనిష్ఠురాలు, దుఃఖానందాలు గమనిస్తూ ఈప్రజలకూ భారతమందు ఇతర ప్రజలకూ ఎన్ని పోలిక లున్నాయో అవి అనుకున్నాను. మామిడి జాతులు ఎన్నివేలున్నా అవి రుచులలో, అసలు తత్వంలో ఒకటేకదా!
నేను తిరిగి వెళ్ళేసమయం వచ్చింది. నేనూ, ఆనందమయీ, వాళ్ళ దాదీ ముగ్గురం కలిసి తిరిగి అలహాబాదు వచ్చి, అక్కడనుంచి నేను దక్షిణానికి రావడం నిశ్చయం చేసుకున్నాము. త్రిపాఠీ, జ్యోతిర్మయీ ఎంతో ప్రేమ పూర్ణమైన వీడికో లిచ్చారు నాకు.
జ్యోతి: చతుర్వేదిగారూ! ఆంధ్రరాష్ట్రంకోసం మీరేమి ప్రయత్నాలు చేయదలచుకొన్నారు? ఆంధ్రరాష్ట్రం సంగతి తేల్చవలసిందని కాంగ్రెసు కార్యవర్గానికీ, కాంగ్రెసు పెద్దపెద్దలకూ మీ ప్రకాశంగారూ, రంగాగారూ గట్టిగా వినతిచేశారా? ఏంచేయగలరు వారు? నేను: గవర్నరు జనరల్చే వారు ఆర్డరు వేయించవచ్చును. పై సంవత్సరం జనవరినుంచి కొత్త రాజ్యాంగపు బిల్లు శాసనం అవుతుందట. అప్పటినుంచీ అమలులోనికి వస్తుందట. అది రాకమునుపే ఆంధ్రరాష్ట్రం రావాలి.
ఆనం: వస్తుందని మీకు ధైర్యంగా వుందా?
నేను: రాజగోపాలాచారిగారు రానియ్యరండి.
త్రిపా: అదేమిటండీ, ఆయనకు ఆంధ్రులుమీద కోపమా?
నేను: కోపమనికాదు. ఆయన గాఢమైన రాజకీయ పరిజ్ఞానం కలవారు. తమిళులందరికీ మదరాసు విషయంలో చాలా పట్టుదల వుంది. కాని మదరాసు తమిళ రాష్ట్రానికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రానికే పూర్తిగా వెళ్ళినా, ఎవరికో ఒకరికి నష్టం. అందరికన్న ఎక్కువ నష్టం తమిళ బ్రాహ్మణులకు, మరీనష్టం వర్తకానికీనూ.
ఆనం: మీరెలా అయితే బాగుంటుందంటారు?
నేను: చరిత్ర అలా వుంచండి. ఆ విషయమే తేల్చాలంటే వీరివాదనా నిజమే, వారి వాదనా నిజమే. కాని ఈనాటి పరిస్థితులు గమనిస్తే మదరాసు రెండు రాష్ట్రాలకి సమంగా పంచితే రాజ్యాంగనీతి మొదటిరకంగా నిర్వహింపబడుతుందని నాకు గట్టినమ్మకం.
త్రిపా: ఇదెక్కడి తీర్పయ్యా! ఒక మహానగరం రెండుగా విభజిస్తే వచ్చే కష్టాలు మనం తీర్చలేనివౌతాయి.
నేను: అది వట్టిమాటలెండి, కాదంటారా, రెండో రకం, మదరాసు నగరం కేంద్ర ప్రభుత్వ పాలనలోనే ఉండాలి. అప్పుడు తమిళ బ్రాహ్మణులకూ, ఆంధ్రులకూ, మదరాసులో ఉన్న ఇతర ప్రాంతాల వారికి అన్యాయం జరగదు.
జ్యోతి: పండిట్టీ యిప్పుడప్పుడే రాష్ట్రాల సంగతి తలపెట్ట వద్దంటారు.
నేను: అదే పెద్దలకు ప్రజల హృదయం కొంచెమైన తెలియదన్న మాటకు సాక్ష్యం. ఆంధ్రులందరూ స్వరాష్ట్రం కావాలంటున్నారు. కాంగ్రెసు పెద్దలు ఆ విషయంలో జాప్యంచేసిన కొలదీ ఆంధ్రులలో నిస్పృహ, నిరాశ, కాంగ్రెసంటే నిరసనా ఉద్భవిస్తున్నవి. మా దేశంలో కమ్యూనిస్టులు దుష్టచర్యలకు పూనుకున్నారు. కాని, వారే సరియైన మార్గంలో నడుస్తూ వుంటే తప్పకుండా ఎన్నికలలో నెగ్గితీరుతారు.
త్రిపా: సరి. మార్గం లేదుగనుకనే కమ్యూనిస్టు దురంతాలను అణచివేయడానికి వీలుగా వుండడానికి రాష్ట్రవిభజన పనికిరాదన్నారు, ఆ కాంగ్రెసు పెద్దలే.
నేను: అవునండీ! ఉత్తరాదివారికీ, దక్షిణాదివారికీ వింధ్యాచలం అడ్డురావడం అదే అంటాను.
ఆనం: అడ్డురావడంలేదుగా ఇప్పుడు. అగస్త్యుడు ఇంకా దక్షిణాపథంలోనే ఉన్నాడు.
త్రిపా: కాంగ్రెసు వర్కింగు కమిటీవారు పటేల్ గారికీ, నెహ్రూ గారికీ, రాజేంద్రబాబుకూ తుదినిర్ణయం వదలుతారుటగాదా. అదేమి జరుగునో చూద్దాము.
ఆనం: దేశమంతా మాకు రాష్ట్రం కావాలని వాంఛించేవారే. కాని సమయం ఉందికాదా చతుర్వేదీ! 2
రైలు బయలు దేరేవేళ అవుతున్నది. మేమంతా స్టేషనుకు వచ్చాము. బారైలీనుండి అలహాబాదుకు మేము ఇద్దరం రెండవ తరగతిలో ఎక్కినాము. ఆనందమయి నా దగ్గిరగా కూర్చుంది. మాతో వచ్చే దాది మూడవతరగతిలో ఎక్కింది. ఆనందమయి ఒక అరగంటసేపు మౌనంగా కూర్చుంది. నేనూ ఏదో ఆలోచనలకులోనై మాటలులేకుండా కూర్చున్నాను. నేనెక్కడ? ఈ త్రివేదీ కుటుంబం ఎక్కడ? ఏ పురాతనానుభూతివల్ల ఈ కుటుంబానికీ నాకూ ఈలాంటి సన్నిహిత స్నేహం ఏర్పడిందో! నేనున్న ఇన్నాళ్ళూ నాకు ఈ కుటుంబం ఉందనే తెలియదే? వీరందరినీ వదలి తిరిగి వింధ్యాచలందాటి దక్షిణాపథానికి వెళ్ళిపోతాను.
“ఏమిటండి చతుర్వేదిజీ మీరాలోచించేది?”
"మిమ్మిందరినీ వదలి వెళ్ళిపోవడం ఎట్లాగా? అని అనుకుంటున్నాను.”
“మిమ్మల్ని కొన్ని అంతరంగికమైన విషయాలు నే నడగ దలచుకొన్నాను. సిగ్గుపడకుండా నిజం చెప్పాలని ప్రార్థిస్తున్నాను. మీ వివాహ విషయమై ఏదైనా సంబంధం ఏర్పాటై ఉందా?”
నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఈ అమ్మాయి నన్నీ ప్రశ్నలు వేస్తూంది. ఆ అమ్మాయి నాజూకుగా పొడుగుగా ఉన్న బాలిక, ఆమె ఒంటిపై బంగారం నల్లగా కనబడేటంత తెలుపు పసిమిఎరుపుల రంగుతో వెలిగిపోయే బాలిక. పెద్దకళ్ళు, కాటుక అంచులతో సగం దాగుకొనిన పెద్ద నీలి కనీలికలతో గంభీరమైన ఆలోచనలు లోన దాచుకునే బాలిక. ప్రతి అవయవమూ తీర్చిదిద్దినట్లు, మేలిమి బంగారంతో పోతపోసిన విగ్రహంలా ఉంటుంది. కోలమోము, సమనాసిక, నిండు పెదవులతో విలువంపులు తిరిగిన నోరు. ఆ పెదవు లెప్పుడూ కాశ్మీర కుసుమాలవలె ఎరుపు లలమి ఉంటాయి.
నేను ఆ బాలికను ఏదో దివ్యానురాగంతో నా హృదయాంతరంలో పూజిస్తున్నానని నేనే అనుకొనడానికి భయపడి, అలాంటి ఆలోచనలు రానిచ్చేవాణ్ణికాను. ఆమెకు చదువు చెప్పేటప్పుడు ఎంతో మధురమయిన తన కంఠంతో ప్రశ్నలు వేసే సమయాల, ఆమె వాక్కులలోని ప్రతి చిరు స్పందనమూ నా హృదయాన్ని 'మైక్‌కు'ను చేసి ప్రతి స్పందనమై నాజీవితం అంతా ఆ అమృత శబ్దాలతో తరంగితమైపోయేది. వారింటిలో ఉన్న ఆమూడు నెలలూ నా విషయమై స్వయంగా ఆ బాలికే అన్ని ఏర్పాట్లు చేసేది. ఏలోటూ జరగనిచ్చేదికాదు.
నాకూ, ఆమెకూ వింధ్యాచలం అడ్డం. 'ఆ పర్వత శిఖరాలూ, లోయలూ, నర్మదా తపతులూ నా జీవితానికీ, ఆమె జీవితానికీ నా ఆలోచన పథంలో శాశ్వతంగా అడ్డం వచ్చినవి' అనే నిశ్చయం నాకు మొదటనే ఉద్భవించింది.
“నాకే వివాహ సంబంధం ఏర్పాటైలేదు ఆనందమయీ! నేను ఎప్పుడూ ఆ విషయమయి ఆలోచించుకొనేలేదు.”
“మీరు ఏ బాలికనైనా ప్రేమించినారా?” "ఆఁ! నాకు ప్రేమ అంటే ఏమిటో తెలియదు. నా పరిశోధనా, నేను అంతే నాబ్రతుకు. నేను ప్రేమిస్తే గీమిస్తే నా పరిశోధననే.”
“అబద్దం ఆడకండి. ఒకరోజు మీరు తెలుగుభాషలో ఏదో పాటపాడుతున్నారు. ఆ పాట చాలా అందంగా ఉంది. ఏమిటండీ ఆపాట అని అడిగినాను. మీరు సిగ్గుపడుతూ ఆ పాట కర్ధం చెప్పినారు. మీ కవులలో కిషన్ శాస్త్రి పాట అన్నారు. ఇదంతా జ్ఞాపకం ఉందా?
"ఉంది, ఆనందమయీ!"
“ఆ పాట అర్థం వినగానే, మీ హృదయంలో కొన్ని రహస్యస్థలాలు నాకు దర్శన మిచ్చాయి. నిజం చెప్పండి! ఎవరా అమ్మాయి?
“నిజం చెపితే నీకుకోపం రాదుకదా!” నా గుండె ఝంఝావేగం దాల్చింది.
“నాకుకోపం ఎందుకండీ?”
"నీ ప్రశ్నకు జవాబు చెప్పేముందు ఎందుకు నీ వీ ప్రశ్నలు వేస్తున్నావో అడగవచ్చునా?”
“అడగండి. నాకు కారణం ఉంది. అయినా తర్వాత చెప్తాను. ముందు మీరు నాప్రశ్నకు జవాబు చెప్పండి!”
“నిన్ను గురించే?” అనేశాను. ఏం చేయను? నన్నా పరిస్థితిలోనికి ఆ అమ్మాయి తీసుకు వచ్చింది.
"నిజం ?”
“నిజం!"
“సరే! నేను చెప్పే కారణం వినండి. మీ హృదయంలో నన్ను ఎందుకు తలపోసుకుంటున్నారో, ఏమో? నేనుమాత్రం మిమ్మల్ని, మీరు మాయింటికి వచ్చిన మొదటి క్షణంలోనే ప్రేమించాను, నాసర్వస్వమూ ఆక్షణంలో మీకు దత్తమయిపోయింది. మీరు చూపులోగాని మాటలోగాని మీ హృదయం ఏమిటో నాకు ఎంతకాలమో అర్థంకానియ్యలేదు. ఆ పాటతో నాకు కొంత అర్థమయింది. 'తొలి ఉషస్సును నేనె, తొలి ప్రేయసిని నేనె!” అని.”
ఆ మాట లా బాలిక అంటున్నది, నాగుండె ఆగిపోయింది! ఎక్కడ వింధ్యాచలం! కలలోనన్నా అంత దివ్యమయిన పవిత్రనాదంతో నిండిన మాటలు వింటానని ఊహించుకోలేదు.
“నిజమేనా! ఆనందమయీ.... ని... ని... నిజమేనా!"
ఆ అమ్మాయి మోము ఏదో పరమాద్భుత కాంతులతో వికసించిపోయింది. స్వచ్ఛమయిన చెంపలు అరుణరాగ రంజితమై ఆమె కన్నులు జ్యోత్స్నాపూర్ణ కిరణాంకితమై ఆమె ఫాలము ఆనందక్షీరవీచీ మూర్తిమంతమై నాకు దర్శన మిచ్చింది.
'ఆనందమయీ ఏమి చెప్పను! ఈ ఆలోచన ఆలోచించడానికయినా తగనివాడిని. నువ్వు దివ్య సౌందర్యవతివి. ఉత్తరాది బాలవు, భాగ్యవంతుల బిడ్డవు.' 'అయితే! అవి మీ ప్రేమకు అడ్డాలా!' ఆనందమయి నా వంక ఆశ్చర్యంగా చూచింది. ‘కాబట్టి మీరు భయపడిపోయారా!'
ఎవరైనా నా మాటలు వింటున్నారేమోనని భయపడినాను. మాతో పాటు ఆ ప్యాసింజరులో ఆ సెకండు స్పెషల్ తరగతిలో ఇద్దరో ముగ్గరో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు మమ్ము భార్యాభర్తలే అని అనుకున్నారు కాబోలు. మాయిద్దరికి ఒక సీటు వదలివేసి తాము ఇతర సీట్లు ఆక్రమించినారు. వారు మాకు దూరంగానే వున్నారు.
“కాదా ఆనందమయీ! మీ నాన్నగారూ! అమ్మగారూ ఒప్పుకుంటారా? మీ అక్కగారూ, బావగారూ తెల్లబోరూ.”.
"నిజమే!”
“తిన్న ఇంటివాసాలు లెక్కపెట్టిన కృతఘ్నుడను అయిపోనూ, వారి దృక్పథంలో!”
విషాదచ్ఛాయలు ఆక్రమించిన చిరునవ్వు ఆమె మోముపై ప్రసరించింది. “మా అక్కకూ నా హృదయం తెలియజేశాను. ఆమె మా బావతో చెప్పింది. మా బావకూ చాలా ఆనందం కలిగింది. అందుకనే మా బావ మిమ్మల్ని కూడా బారైలీ రమ్మన్న కారణం. మా అక్కో, బావో ఈ సంగతి మీతో మాట్లాడుదాము అనుకున్నారు. నేనే వద్దన్నాను. నేనే మీతో మాట్లాడాలని నిశ్చయించుకున్నాను. మా తండ్రిగారు ఇష్టపడకపోవచ్చును. కాని నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. నా కిప్పుడు పందొమ్మిది. నేను మేజరు నయ్యాను.”
“ఆనందమయీ!”
“ఏమండీ?”
“నువ్వు - నువ్వు అవతరించిన దేవతవు - నన్ను - ఈ వికారిని నిజంగా -”
“ప్రేమిస్తున్నానా, అంటారా? మీకు నమ్మకంలేదా? వాళ్ళంతా చూస్తున్నారుగాని, మిమ్ము గాఢంగా నా హృదయానికి -”
“నేను నిన్ను దరికైనా తీసుకోలేని దద్దమ్మను ”
"మీకు ధైర్యం లేదు. మీ హృదయాన్నే మీరు నమ్మలేరు.”
"ఒక దేవకన్య -"
"నేను దేవకన్యనూ కాను, మీరు దేవులూ కారు. మనమిద్దరమూ మానవత్వము పూర్ణంగా స్పందించే మానవులం. మీ అభిప్రాయం చెప్పండి.”
“ఎక్కడ నిన్ను ప్రేమించిపోతానో అని భయపడిపోయాను. నా సంగతి ఎవరు గ్రహిస్తారో అని భయపడిపోయాను. పాఠం చెప్పేటప్పుడు, నువ్వూ నేనూ ఒంటిగా ఉన్నప్పుడు నా పూజ ఎక్కడ బయలుపడిపోతుందో, నీవేమి గ్రహించిపోతావో, నిన్నేమి బాధపెట్తానో అని లోలోన గజగజ వణికిపోయాను దేవీ!"
'అంత గాఢంగా ప్రేమిస్తున్నారుటండీ నన్ను! ఎంత ఆనందం! మీ హృదయం ఏమీ గ్రహించలేక పోయాను. మీరు గొప్ప శాస్త్రవేత్తలేకాకుండా, మంచినటకులు కూడా!'
“నాకు నిన్ను ముట్టకోవడమే భయంవేసేది. నువ్వు నన్ను స్పర్శించినప్పుడు ఏం మూర్ఛపోతానో అని బిఱ్ఱబిగుసుకుపోయేవాణ్ణి.” “అదా అసలు విషయం! నేను మిమ్ము ముట్టాలనే ముట్టుకునేదాన్ని, ఏ వంకనో మీ చెయ్యి, భుజం స్పృశించేదాన్ని. ఏ మాత్రం వీలు దొరికినా మీ దగ్గిరగా కూర్చునేదాన్ని. మీరు బిగుసుకు ఉన్నారు. మీ హృదయంలో ప్రేమలేదు. ఎందుకు నన్ను నేను ఇంత చులకన చేసుకుంటున్నాను అని ఒంటిగా ఉన్నప్పుడు బాధపడేదాన్ని సుమండీ! ఈనాటికి నాజన్మ సాఫల్యం అయింది.”
"అయ్యో వెఱ్ఱిదానా! మీ నాన్నగారు ఒప్పుకోరే. మనగతి ఏమిటి ఇకముందు?”
“ఆయన ఒప్పుకున్నాసరే, లేకపోయినా సరే, మన వివాహం తథ్యం.”
మా ప్రయాణం మహదానందపూర్ణమై సాగిపోయింది.
మేం అలహాబాదు వెళ్ళినరాత్రే తల్లిదండ్రులతో తన వివాహం సంగతి చెప్పింది కాబోలు. అప్పటికి తొమ్మిది గంటలయింది. చరచరా నేనున్న గదిలోనికి త్రివేదీగారు చక్కావచ్చారు. “ఇంత ద్రోహివని అనుకోలేదే నిన్ను? ఇంత కుట్రపన్నుతావురా? నువ్వు మా ఇంటిలోంచి వెంటనే వెళ్ళిపో. తలక్రింద మూడు తలల శిఖండిని పెట్టుకున్నా. ఓ రాక్షసుడా!” అని అగ్ని బాణాలవంటి మాటలు తుపాకీ పేల్చారాయన. నేను నిలువునా నీరైపోయా. తుపాకీ పేలుస్తే నీరెల్లా అవుతానులెండి. శాస్త్రనిజం కాదామాట. గుండె దూసుకుపోయి రక్తహీనుణ్ణయి ఉంటాను. వారు రాగానే నిలుచుండి నమస్కరించాను, ఏవేవో భావాలతో ఆయనకు నచ్చచెబుదామనుకున్నాను. ఆయన అగ్నిహోత్రుడే. మాటలూ, వాదనలూ వినే శాంతమేలేదు.
"వెంటనే వెళ్ళు. సిగ్గూలేదు, లజ్జాలేదు, ఇంటిలో మదరాసీవాణ్ణి ప్రవేశపెట్టుకోడానికి నాకేమీ ఇష్టంలేదు. కాని ఆ మూర్ఖురాలు జ్యోతిర్మయికి మంచీ, చెడ్డా ఏమన్నా తెలుస్తేనా?”
నేను మౌనం వహించి తలవాల్చుకొని నిలబడి ఉన్నాను.
“నువ్వు బందిపోటువు, వెనుకనుంచి బాకుతో పొడిచి చంపే నీచహంతకుడవు. ”
నా హృదయం పాతాళాలకు క్రుంగిపోయింది.
“నువ్వు థగ్గువు, పిండారీవి!”
ఇంతట్లో ఆ గదిలోకి ఆనందమయి క్రోధ సంతప్తవదనంతో విసవిస నడిచివచ్చింది.
“నాన్నగారూ! ఇక నోరు మూయండి. నా భర్తను నోటికి వచ్చినట్లు తిట్టడానికి మీ కధికారం ఎవరిచ్చారు?”
“నీ భర్తా? అప్పుడే పెళ్ళి కూడా అయిందీ? ఎంత కొంప ముంచావు?”
“నేను కొంపముంచలేదు. మీ కొంప తరింప చేశాను. మీరు వేయి సంవత్సరాలు తపస్సు చేసినా ఇటువంటి అల్లుణ్ణి సంపాదించలేరు. మీ ఇంటిలో ఒక్క నిముషం మేమిద్దరమూ ఉండం. రండి చతుర్వేదిగారూ! మీ సామాను సర్దుకోండి. నా సామాను సర్దుకొని నేనూ వస్తున్నాను.”
“నీ సామానేముంది? అంతా నేను కొని ఇచ్చిందే!” “నాకిచ్చిన వెనుక నా సామానే! అయినా మీరిచ్చినది నేనేమీ తీసుకు వెళ్ళదలచుకోలేదు. మాయి తన భూముల రాబడిలోంచి వచ్చిన అయిదువేలలో నాకు రెండువేలిచ్చింది. అవి పట్టుకువెళతాను. ఇవిగో మీరిచ్చిన నగలు.”
ఆ బాలిక నెమ్మదిగా తన మెడలో నుండి చేతుల నుండి కొన్ని నగలు తీసి బల్లమీద పెట్టింది. నాచేయిపట్టుకుని గదిలో నుండి, హాలులో నుండి, మెట్లమీద నుండి క్రింది హాలులో నుండి వీధిలోనికి నడిచి వెళ్ళిపోయింది. వీధిలో మేమిద్దరమూ అలా చేయిచేయి పట్టుకునే అలహాబాదు స్టేషన్వరకూ నడిచిపోయాం.
ఆనందమయి హృదయంలో ఏ తుపానులు వీస్తున్నాయో నాకు తెలియదు. నా హృదయంలో వేసవికాలపు గాడ్పులో ఏవో నిండిపోయాయి. ఈ బాలిక జీవితము భగ్నం చేశానా? వింధ్యాచలం ఎంతపని చేశాడు. ఎందరి జీవితాలు విచ్ఛిన్నం చేస్తున్నాడు, కాదు. దేశంలో ఎన్ని త్రివేణీ సంగమాలు సాధ్యం చేస్తున్నాడో!
'ఆనందమయీ, నీ తల్లిదండ్రుల్ని, నీ భాగ్యభోగాలను అన్నీ వదలి ఇలా నాతో వచ్చేస్తున్నావే!”
మీతో నేను రావడమేమిటీ, మీరే నాతో వచ్చేస్తున్నారు. మీ భావి ఆంధ్రబాలికా వధువును, మీ చుట్టాలను, పక్కాలను మీ దేశంలో మీకు మీ చుట్టాలలో కలుగబోయే గౌరవాన్నీ, అన్నీ వదిలి నాతో వచ్చేస్తున్నారు.”
మేమిద్దరమూ అంత దూరం నడిచే వెళ్ళినాము. స్టేషన్లోకి వెళ్ళి మొదటితరగతి విశ్రాంతి మందిరం ముందున్న కుర్చీలలో కూర్చున్నాము. ఎక్కడికి పోవాలి? మాఊరు పోవాలా? ఎక్కడికి? నాకేమీ ఆలోచనలే లేవు. అనుకున్నంతా అయింది. ఆ దేవి తనంతతాను తన ప్రేమ నాకు తెలిపింది కొన్ని గంటల ముందే కాదూ, ఆనందతరంగము ఏ ఆకాశపథాలలో మమ్మిద్దరినీ ఎత్తుకుపోయింది. ఆ కల్లోలము అక్కడే మాయమైంది. ఆ ఎత్తునుంచి ఎంతో లోతుకు గభీమని పడిపోయాము.
ఆనందమయి మాట్లాడక అతితీక్షణంగా చూడని చూపులతో ఏవో చూస్తున్నది.
ఇంతట్లో గబగబ జోడు చప్పుడు అవుతుండగ త్రివేదిగారు మేము కూర్చునిఉన్న కుర్చీలదగ్గరకు చక్కావచ్చారు. “చతుర్వేదిగారూ! నాకోపానికి మీరు క్షమించాలి. మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. ఈ నవ్యయుగంలోకూడా నేను మహా తెలివైనవాడిలా ప్రవర్తించాను. నన్ను మీరు సంపూర్ణంగా క్షమించాలి. బేటీ, నీ ముసలితండ్రి తెలివితక్కువగా అన్న మాటలు పాటించక, నన్ను క్షమించి ఇంటికి రా తల్లి” అని అంటూ ఆయన కుడిచేతిలో కొమరిత చేతిని, ఎడమ చేతిలో నాచేయిని పట్టుకొని, మా ఇద్దరినీ లేవదీసి నడిపించుకు తీసుకువెళ్ళాడు.
బైట వారి పెద్దకారు సిద్ధంగా ఉన్నది. కారులో త్రివేదిగారి సతి కాళిదాసి గారున్నారు.
"చతుర్వేదిగారూ! మీరు ముందు కూచొండి. నేను, అమ్మాయి వెనకాల కూచుంటాము” అని అంటూ త్రివేదిగారు నన్ను ముందుసీటులో కూర్చోబెట్టి తానూ ఆనందమయీ వెనుకసీటులో కూర్చున్నారు. ఆనందమయి ఏమీ మాట్లాడలేదు. నేనూ ఏమీ మాట్లాడలేదు. ఇంత తొందరలో ఆయనలో మార్పు కలిగిందేమిటి? ఆనందమయి తల్లి త్రివేదిగారికి గట్టిగా ఏమయినా చెప్పిందా? నా చరిత్ర సుఖాంతం కాదలచుకొని ఉన్నదా? ఇంత మార్పు ఇంతలో ఆయనకు కలగడం అత్యాశ్చర్యకరమే. ఆయన సహజంగా చాలా సున్నితమైన మనసు కలిగినవాడై ఉండాలి. ఒకసారి వింధ్య ప్రాంతానికి ఉత్తర దక్షిణాలకు వివాహ సంబంధం కలుగడం ఆయన మనస్సుకు వజ్రాఘాతంలా తగిలి ఉండవచ్చు. కాని ఉత్తమ హృదయం కలవాడవడం బట్టి ఆశయాలూ అభిప్రాయాలు ఎన్ని ఉన్నా మనసు మార్చుకోక తప్పిందికాదు, అని అనుకున్నా.
ఇంతలో వారిభవనం ముందర మా కారు ఆగింది. మేమంతా దిగి లోనికి వెళ్ళిపోయాం. ఆ రాత్రికి నేను ఆనందమయిని కలుసుకొనడానికి వీలులేకపోయింది. నాకు రాత్రి ఏమీ నిద్రపట్టలేదు. లేచి కూర్చున్నాను, పడుకున్నాను. గది అంతా బోనులో వున్న జంతువులా పరిక్రమించాను. మనసులో ఏదో తెలుసుకోలేని ఆవేదన. ఏంచేస్తారు త్రివేదిగారు? ఇంతత్వరలో మార్పు రావడం నిజమైన విషయమేనా? ఏదైనా భయంకర రహస్యం వెనకాల దాగి వున్నదా? ఏముంటుంది! నాయీ నీరసపు మనసులో ఏవో వికృతమైన ఆలోచనలు పుడుతూ ఉంటాయి.
గంటలు వరసగా కొట్టుకొంటూ గడచిపోతున్నవి. నాకు కాలం ఆగిపోయినట్లే కనబడింది. అంతుతెలియని ఆలోచనలు. చూపు ప్రసరింపలేని అగాధమైన స్థలాలు, దారి కనపడరాని కంటకభూయిష్టమైన చీకటి అడవులు. ఎక్క వీలులేని ప్రాంతాలు కలిగిన ఎత్తయిన కొండలు. ఆటంలో అంతర్గర్భితమైన సాక్ష్యస్వరూపుడైన ప్రోటనులోని మహాశక్తి, కాలాంతక గర్జనతో విచ్ఛిన్నమైపోయిందా?
తెల్లవారింది, నేను స్నానాదికాలు నిర్వర్తించుకుని గదిలో కూర్చున్నాను. వంటమహారాజు కాఫీ, పండ్లు, పూరీలు, తర్కారీ పట్టుకు వచ్చాడు. ఏదో కతుక్కతుగ్గానే తిన్నాను. ఈ సమయంలో త్రిపాఠీగారువుంటే ఎంత సంతోషంగా వుండేది. చల్లగా హాయిగా ఒడుదుడుకులు లేకుండా సాగిపోయే నాజీవితం పతనాలై, ప్రభంజన తాడిత కల్లోలాలై, రాళ్ళల్లో గుట్టల్లో, మెరక పల్లాల ప్రవహించడానికి సిద్ధమైపోయింది. అంత దారిద్ర్యం లోనూ చెక్కు చెదరని ధైర్యంతో కలో గంజో తాగుతూ గౌరవంగా బ్రతికి వచ్చిన నేను యేమికష్టాలకు లోబడాలో అన్న ఆలోచన కలిగింది.
ఏమికష్టాలయితే నేమి? ఎన్ని హింసలకు లోనయితేనేమి, జీవితం ప్రచండపూరిత సమస్యలను ఎదుర్కొనవలసి వస్తేనేమి, యీ సర్వసౌందర్యరాశి, ప్రేమమయి, ఆనందమయి నన్ను తన్నుతా వలచి వచ్చినప్పుడు, ఆ పవిత్రాదృష్టాన్ని జీవితం మధ్య దాచుకొంటానుగాక!
ఈ ఆలోచన వచ్చింది. ఏదో చప్పుడు విని తలెత్తాను. నా దేవి, నా ఆత్మేశ్వరి, ఆనందమయి వస్తున్నదని గుమ్మం దీక్షగా చూచాను. గుమ్మంలో ఇద్దరు పోలీసు ఇన్స్పెక్టర్లు ప్రత్యక్షమయినారు. అందులో పెద్ద అతను "హల్లో! చతుర్వేదిగారూ, గుడ్‌మార్నింగ్; మీమీద ఒక వారంటు జారీ అయింది. మిమ్ములను అరెస్టు చేస్తున్నాను. క్షమించాలి. మీరు మాట్లాడకుండా నాతోరండి. మేమేమీ గడబిడ చెయ్యం. మా పోలీసుకారు ఆవరణలోకే తీసుకొచ్చాం. ఎవ్వరికీ తెలియకుండా చడీచప్పుడూ కాకుండా వెళ్ళిపోదాం. మా డిప్యూటీ కమీషనర్ త్రివేదిగారితో మీ అరెస్టు విషయమై మాట్లాడుతున్నారు” అని చలిపిడుగులలాంటి నాలుగుమాటలూ అని నవ్వుతూ నిలుచున్నాడు. నా స్థితి వర్ణించుకోలేను. తల తిరిగిపోయింది. తూలి పడబోయాను. రెండవ ఇన్స్పెక్టరు గబుక్కున వచ్చి నన్ను అదిమి పట్టుకొన్నాడు. నే నింతటిలో ధైర్యం తెచ్చుకొని “ఎందుకండీ వారంటు” అని ప్రశ్నించాను.
“మీరు హాస్టల్లో యేవో అరాచకపు పనులు చేసేందుకు కుట్ర పన్నారట!” అని ఏదో కాగితం తలపట ఆడిస్తూ చూపించినాడు.
“ఇదేదో చాలా పెద్ద పొరబాటు. మీరు వైస్‌ఛాన్సలర్ గారిని అడగండి. మీరు చాలా భ్రమపడుతున్నారు, ఆ వారంటు నామీద అయివుండదు. ఈ విషయంలో త్రివేదిగారు ఏమన్నారు?”
“త్రివేదిగారు ఏమంటారో మాకిప్పుడు ప్రస్తుతం అవసరంలేదు. మిమ్మల్ని ఈ రాష్ట్రాన్నుంచి పంపించి వేయడమే ఈ వారంటులో వున్న విషయం. ఆలస్యమైపోతున్నది రండి, లెండి" అని అంటూ అతడు నా దగ్గరకు వచ్చి చేయిపట్టుకొన్నాడు. నేనిక మాట్లాడకుండా వారితో నడచి వెళ్ళి త్రివేదిగారి భవనంముందు పోర్చిలో నిలుచుని వున్న పోలీసు కారులో ఎక్కి కూర్చున్నాను. నా ఇరుప్రక్కలా ఇద్దరు ఇన్స్పెక్టర్లు కూర్చున్నారు. మాకారు సాగిపోయింది.
4
ఆ కారు ఎంతదూరం వెళ్ళిందో ఎంతకాలం నడిచిందో నేను గమనించే స్థితిలోలేను. నేను ఏదో అని భయపడినది నిర్ధారణ అయింది. “నేనేమిటి, కుట్ర చేయడమేమిటి! ఇది త్రివేదిగారు పన్నిన పన్నుగడ" అని తళుక్కుమని నాకు ఆలోచన హృదయంలో మెరుపు మెరిసింది.
ఆనందమయి గతి ఏమవుతుంది? ఆ బాలికకు ఈ విషయం తెలిసిందా? నా మీద నిజంగా ఏదయినా కృత్రిమపు, ఘోరమైన నేరం ఆరోపించారా? నా గతి ఏమౌతుంది? దీనివల్ల నా డి.ఎస్సి. పరీక్షకు అంతరాయమేమైనా కలుగుతుందా? ఆనందమయిని ప్రేమించడమే తప్పు. ఆ బాలిక తనంత తాను తన ప్రేమను తెలుపుకోకపోతే నాప్రేమను నేను తెలిపి వుండేవాణ్ని కాదే? ఉత్తమంగా, ధర్మంగా ప్రేమించుకొన్న ఇద్దరు యువతీ యువకుల మధ్య వింధ్యాచలేశ్వరుడు అడ్డంవస్తాడని నాకు ఈషణ్మాత్రం ఆలోచన తట్టలేదే? వింధ్యాచలేశ్వరుడే నా కీ దివ్యప్రేమను ప్రసాదించాడు. ప్రేమ అణుశక్తికన్న మహత్తరమైన శక్తికలది. సీసంవంటి నా బ్రతుకును బంగారం కింద మార్చివేసింది.
మాకారు సాగిపోతూవుంది. నేను కారులో ఒళ్లు తెలియని నిద్రకు లోనయ్యాను. మెలుకువ వచ్చేసరికి మేము కాశీకి వచ్చినాము. మాకారు బెనారస్ కాంటౌన్మెంటు స్టేషనుదగ్గిర ఆగింది. మేము ముగ్గురం దిగాము. అరెస్టు చేసిన ఇన్స్పెక్టరు నన్ను చూచి, “చతుర్వేదిగారూ! మీ పైన వారంటుమాట అబద్ధం. త్రివేదిగారు మాకు గాఢమైన స్నేహితులు. వారికీ సహాయం చేయమంటే మేము చేశాం. మీ సామాను. పుస్తకాలు వగైరా అన్నీ వారి బంట్రోతు సేతూరాం పట్టుకువస్తాడు. మీరు ఇక్కడే ఉండండి, మీకు ఖర్చులకై ఈ రెండువందలు ఇయ్యమని త్రివేదిగారు మాచేతికిచ్చారు. ఈ కారు వారి స్నేహితునికారు. మీరు మామీద రిపోర్టు వగైరాలు చేయకండి, మీ పుణ్యం. మా ఉద్యోగాలు పోతాయి. ఆయన చేసినపని మాకేమీ నచ్చలేదు. ఈ రోజుల్లో కూడా త్రివేదిగారు ఇలాచేయడం చాలా పొరపాటు. ఈ విషయం ఇంతటితో వదలదు. ఆనందమయి అంటే మా కందరికీ ఎంతో ఆపేక్ష" అని అంటూ రెండు నూరు రూపాయిల నోట్లు నా చేతిలో పెట్టబోయాడు.
"ఇన్స్పెక్టరుగారూ, నాకానోట్లు వద్దు. త్రివేదిగారికీ మీకూ నాగాఢ అభివందనాలు. మీరంతా చాలా గొప్పనాటకం ఆడారు. మీరంతా యేదైనా సినిమా కంపెనీపెట్టి, అందులో వేషాలు వెయ్యవలసినవారే. నెహ్రూగారి కొమరిత ఇందిరాదేవి ఒక పార్సీ యువకుని పెళ్ళిచేసుకుంటే తండ్రి వద్దన గలిగారా? రోజులు మారిపోయాయి. మనకు పూర్ణ స్వాతంత్ర్యం వచ్చింది. కాని మనదేశం హిట్లరు రాజ్యంకాదే. అయినా మీరు కోరినారు గనుక మీ పైన రిపోర్టు చేయను” అని నేను వారిని వదలి ప్లాటుఫారంమీద వేరేచోటికి వెళ్ళి, వెంటనే అలహాబాదుకు పోయే బండికి టిక్కెట్టుకొని ఆ బండిరాగానే వెళ్ళి అందులో కూర్చున్నాను. పోలీసు వారిద్దరూ తిరిగి కారులో వెళ్ళిపోయారు. నేను అలహాబాదుకు తిరిగివస్తానని వారికి తెలియదు. అలహాబాదుకు సాయంకాలం చేరుకున్నాను. స్టేషన్ నుండి ఒక హోటలుకుపోయి భోజనంచేసి, టాక్సీ చేసుకొని మా గురువుగారైన రాంప్రసాద్ విద్యాలంకార్ గారి ఇంటికి వెళ్ళాను. మా గురువుగారు ఎంతో ఆదరంగా నన్ను ఆహ్వానించారు. డాక్టరు విద్యాలంకార్ ఇంగ్లండు, అమెరికా 'డాక్టర్ ఆఫ్ సైన్సు' డిగ్రీలు పొందివచ్చిన ప్రజ్ఞావంతులు. న్యూక్లియర్ ఫిజిక్స్‌లో ఆచార్యోత్తములు. ఆయన నన్ను తమ పుత్రునికన్న ఎక్కువగా ఆదరించేవారు. వారి శిష్యునిగా ఉన్న ఈ రెండేళ్ళూ నన్ను అత్యంత ప్రేమతో వేయికళ్ళ కనిపెట్టి ఉండేవారు.
"ఎక్కడనుండి వస్తున్నావు చతుర్వేదీ!”
"కాశీనుంచి పితాజీ!”
"కాశీకి ఎప్పుడు వెళ్ళావు? బారైలీ వెడుతున్నానని చెప్పావుగా! అక్కడనుండే తిన్నగా కాశీకి వెళ్ళావా?”
“లేదండి. ఆ కథ అంతా రామాయణం అంత ఉంది!” అని జరిగిన విషయాలన్నీ మనవి చేశాను.
"రాం! రాం! త్రివేది ఇంతటి పనిచేశాడా! వారి కుటుంబం నాకు బాగా పరిచయమే! జ్యోతిర్మయినీ, త్రిపాఠీని, ఆనందమయినీ బాగా ఎరుగుదును. వారంటే నాకు ప్రాణం! సరేకాని ఆ ఇన్స్పెక్టర్లను చివాట్లు పెడతాను. నువ్వు ఇక్కడే నా యింట్లో ఈ విషయం ఏదో తేలేవరకూ ఉండు. ఇల్లు నీదే. ఏమీ మొహమాటం పడకు. మీ గురుపత్ని నీవంటే ఎంతో ఆనందపడుతుంది.”
అని తన భార్యకడకు తీసుకువెళ్ళినారు. అక్కడ ఆయన నా కథ అంతా భార్యతో చెప్పినారు. ఆమె చాలా ఆశ్చర్యం పొందింది. ఆమెకు నలుబది ఏళ్ళుంటాయి. నన్ను “బేటా, చతుర్వేదీ!” అని పిలుస్తారామె. ఆమె ఇంటరు ప్యాసయిన ఇల్లాలు, హిందీలో కవయిత్రి, రేడియోలో తాము రచించిన గీతాలు తీయని కంఠంతో పాడుతూ ఉంటారు. జ్యోతిర్మయి, ఆనందమయిలంటే ఎంతో ఇష్టం ఆమెకు. ఆనందమయి నేనూ మా ఆచార్యులవారి దగ్గిరకు ఎన్నిసార్లో వచ్చేవారం. ఆనందమయి మా గురుపత్నితో అరగంటైనా సంతోషంగా కాలం వెళ్ళబుచ్చకుండా ఇంటికి ప్రయాణం కాదు. మాగురుపత్ని పేరు ఉమాసుందరీదేవి.
ఉమాసుందరీదేవి: ఏమయ్యా చతుర్వేదీ! లోకమోహిని అయిన బాలికను వశపర్చుకున్నావే. ఏమన్నా వశీకరణమంత్రం ఉపదేశ మయ్యావా!
నేను: మీ ప్రయాగ త్రివేణి సంగమములో స్నానం చేయగానే మా కెన్నో మహత్తరశక్తులు సన్నిహితం అవుతాయి మాతాజీ!
ఉమ: కాదయ్యా! మీ దక్షిణాదివారికి చాలా మంత్రతంత్రాలు వచ్చునని మావైపు ఎంతో ప్రతీతి.
నేను: అలాగే మా వైపున ఉత్తరాది వారంతా మహర్షులనీ, వారి ఇళ్ళలో దేవతలు పరిచారకులుగా తిరుగుతూ ఉంటారని మావాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. మా అమ్మ నేను మీ విశ్వవిద్యాలయంలో జేరడానికి వచ్చేముందు, 'నాయనా మాయచేసి తీసుకుపోయి దేవికి బలియిస్తారు జాగ్రత్త' అని చెప్పింది.
ఉమ: రాకపోకలు తక్కువై, పరిచయాలు ఏమాత్రమూ లేక ఈలా అవకతవక అభిప్రాయాలు ప్రచారంలోకి వస్తాయి.
గురూజి: చతుర్వేదీ! నువ్వు బాగా విశ్రాంతి తీసుకో. నీకో గది సిద్ధం చేయిస్తాను. రేపు ఉదయం అన్ని విషయాలు మాట్లాడుకొందాము.
వారి ప్రేమ నా హృదయానికి వర్ణింపలేని శాంతి ప్రసాదించింది. నాకు ఒళ్ళు తెలియని నిదుర పట్టింది. సాయంకాలము ఉలిక్కిపడి లేచాను. ఆనందమయి వచ్చి నన్ను తన హృదయానికి అదుముకొన్నట్లు కలవచ్చింది. ఆ కలలో నా కౌగిలిలోనుండి ఆ బాలికను ఆమె తండ్రి బరబరా లాక్కొని పోయినట్లు వచ్చి “ఓ” అని గుండె దడ దడమంటూ ఉండగా లేచాను.
ఎంతవరకోగాని నా కా దడ దగ్గలేదు. లేచి స్నానాల గదికి వెళ్ళి వచ్చాను. మా గురువుగారి దుస్తులు నా గదిలో సిద్ధంచేసి ఉంచారు. అవి ధరించి నా గదిముందు హాలులోనికి వచ్చేసరికి ఆనందమయి ఎదురుగుండా నన్ను రక్షింపవచ్చిన పరమ సాన్నిధ్యంలా నిలుచుని ఉంది. ఇంకెవ్వరూ ఆ హాలులో లేరు.
నన్ను చూడడమేమిటి ఆమె రెక్కలు వచ్చినట్లు నా దగ్గిరకు వాలి నా కౌగిలిలో ఒదిగిపోయింది.
“నా దివ్యదేవీ!”
నా పరమదేవా!” 5
ఆమెను నా గదిలోనికి తీసుకొనిపోయాను. అలా ఒకరి కౌగిలిలో ఒకరం ఒదిగిపోయి వున్నాము. మా ప్రేమకు మాటలులేవు.
ఇంతట్లో తలుపు దగ్గిర “పండిజ్జీ!” అని వంట మహారాజ్ మాట వినబడింది.
మేము ఇద్దరమూ కౌగిలిలోనుండి విడిపోయి చెరి ఒక కుర్చీమీద కూర్చున్నాము. మహారాజ్ బల్లమీద ఫలోపహారాదులు, కాఫీ, అన్నీ ఉంచి “ఇద్దరూ సేవించండి” అంటూ తలుపు దగ్గిరగా వేసి వెళ్ళిపోయాడు.
“ప్రీతమ్ ! మిమ్ము పోలీసువారు తీసుకువెళ్ళడం అదీ నాకు ఉమామయి చెప్పింది. నాన్నగారు అంత క్రూర హృదయులని కలలోనన్నా అనుకోలేదు. నన్ను స్టేషనునుండి ఇంటికి చేరాక లోపలికి తీసుకుపోయి ఒక గదిలోపెట్టి తాళంవేశారు. అప్పటినుండి ఇంతవరకూ నాకు భోజనంలేదు. ఇంతవరకూ మా అమ్మతోగాని, నాయన గారితోగాని మాట్లాడలేదు. యేం చెయ్యాలో నేను నిశ్చయం చేసుకొన్నాను. తలుపు తాళం వేసినన్నాళ్ళు భోజనము చేయను. ప్రాణం పోతుందని భయపడలేదు.”
"ప్రాణకాంతా! మహారాజీ! ఓహో! యెల్లా వచ్చా విక్కడకు?”
“పక్షిలా మారిపోయి, కిటికీలోంచి దూరి ఇక్కడకు ఎగిరి వచ్చి ఇక్కడ మామూలు రూపం పొందాను.”
“నేనిక్కడ ఉన్నానని ఎలా తెలిసింది?”
“చెప్తా ఉండండి” అంటూ నా ఒళ్లో కూర్చుంది. “నాకు చాలా ఆకలిగా ఉంది. నా చేత మీరు తినిపిస్తేగాని ఏమీ సహించదు” అని నా మెడచుట్టూ తన ఎడంచేయి వేసింది. కుడిచేత్తో నాగడ్డం పట్టుకొని తనవైపు తిప్పుకొని "ప్రభూ! నేను నా నిరశనవ్రతదీక్ష మానివేసేముందు మొదటి ముద్దుగా మీ ముద్దు ఆరగిస్తానని ప్రతిజ్ఞ చేసుకున్నాను. నాకు మీ ప్రథమ చుంబనము ప్రసాదించండి!" అని నవ్వుతో, ప్రయాణము అయిన కంటి నీటితో నావైపు చూచింది.
నాకూ కన్నుల నీరు తిరిగింది. ఆమెను గాఢంగా అదుముకొని, మాటలు లేక కాశీ విశ్వేశ్వరుని మనస్సులో తలచుకొంటూ, ఆమె పెదవులు చుంబించాను. ఆమె నాకు ప్రతిఫలం ప్రసాదించింది. మాకంటి నీటి ప్రవాహాలు త్రివేణీ సంగమం అయ్యాయి.
ఆమెచే నెమ్మదిగా చా తాగించాను. తర్వాత పాలలో నానవేసిన రొట్టె కొంత తినిపించాను. పళ్ళరసం త్రాగించాను.
“ఏం చేస్తున్నారు పిల్లకాయ లిద్దరూ” అని చటుక్కున తలుపు త్రోసికొని మా గురుపత్ని లోనికి చక్కావస్తూ “ఎల్లా ఉన్నవారు అలాగే ఉండాలి. నేను చూడాలి. నా కళ్ళు చల్లబడాలి, నా జన్మ తరించాలి” అని అన్నది.
నా ఒడిలోనుండి ఆనందమయీ, నేను కుర్చీ మీదనుండీ, సిగ్గుపడుతూ లేచి నిలుచున్నాము.
"ఎందుకు లేచారు? నాకు కోపం వచ్చింది, మళ్ళీ యథాప్రకారం కూర్చోండి. మీ ప్రొఫెసర్ సాబ్ ఎన్ని అల్లర్లో చేసేవారు.” ఏం చేస్తాం! అలాగే యథాతథంగా కూర్చున్నాం. మాఎదురు గుండా ఉమామయి కూర్చున్నారు. చెప్పవద్దూ నేను సిగ్గు అణచుకోడానికి విశ్వప్రయత్నం చేశాను. ఆనందమయి విజయం పొందింది. అల్లరిపిల్ల! చెయ్యాలని నా జుట్టు సవరించింది. నా మోము అదిమిపట్టి తనవైపు త్రిప్పుకుని, ఒకనిమేషం తేరిపారచూచి, ఉమామయివైపు త్రిప్పి, “ఏమండీ పిన్నీ! ఈ అబ్బాయి మోము బాగానే ఉందనుకుంటాను. దక్షిణాది వారంతా కోతులనుకున్నాము. కాదని కొంచెం నిర్ధారణ అయింది సుమండీ!" అని అంటూ మోములో గంభీరముద్ర దాల్చింది.
ఉమామయి పకపక నవ్వుతూ “అల్లరిపిల్లా! అతని ముందు దివ్విటీ ముందు దీపంలా ఉన్నావు. కాస్తరంగు ఉంటే సరేనా? నాకొడుకు మన్మథుడు. నువ్వో” అని నవ్వి ఆమె కూడా మోములో గంభీర ముద్ర ధరించింది.
నేను: “ఇంతకూ మేమాంధ్రులం. ఆంధ్రులెవ్వరో నిర్ధారణ చేశారా!" అన్నాను.
ఆనందమయి “రాక్షసు”లని అన్నది.
ఉమామయి “దేవతలు, దేవతలే!” అని దృఢంగా చెప్పింది.
మేము ఇద్దరమూ లేచి ఆ తల్లికి పాదాభివందనాలు చేశాం. ఆమె మా తలపై చేతులుంచి ఆశీర్వదించి, “చతుర్వేదీ! నీ వధువును వాళ్ళ తలిదండ్రులతో మాయ మాటలు చెప్పి తెల్లవారుతూనే తీసుకువచ్చాను. నువ్వు ఈ ఊరు తిరిగి వచ్చేశావని వారెవరికీ తెలియదు. నువ్వు ఇంటినుంచి కదిలి బయటికి వెళ్ళు. ఆనందమయి ఇక్కడే ఉంటుంది. ఆమె పెట్టే బేడా తర్లించుకు వచ్చేటట్లు చేశాను. మీ ప్రొఫెసర్‌గారు జ్యోతిర్మయికీ, త్రిపాఠీకి టెలిగ్రాము ఇవ్వడానికి వెళ్ళారు. వీలయితే ట్రంకు ఫోనులో మాట్లాడతానన్నారు. ఈలోగా లక్నో రిజిస్ట్రారుతో మాట్లాడి అక్కడ మీ ఇద్దరికీ రిజిష్టరు వివాహం జరిగే ఏర్పాట్లు చేస్తూఉన్నారు. మధ్యాహ్నం లక్నోకు వెళ్ళివస్తారు. ఆ పైన సంగతులు ఆలోచిద్దాం" అని ఆమె లేచి "జాగ్రత్తగా ఉండండి. రెండు మూడురోజులలో వివాహం. నేనూ, ప్రొఫెసరూ ఇతర సైన్సు ఆచార్యులూ ఇద్దరో ముగ్గురో భార్యలతో లక్నో వస్తాము. ఈ విషయం ఏమాత్రం ఎవరికీ తెలియకుండా ఉంచదలచుకొన్నాం” అని అంటూ ఆమె తలుపు దగ్గిరగా వేసి వెళ్ళిపోయింది.
మా ఆనందం సుధాసముద్రం అయిపోయింది. ఆనందమయి నా శ్రీమహాలక్ష్మి!
6
ఆ సాయంకాలానికి జ్యోతిర్మయీ, త్రిపాఠీ మాప్రొఫెసర్గారి ఇంటికి చక్కావచ్చారు. జ్యోతిర్మయి చెల్లెలిని కౌగిలించుకొని, “చెల్లీ ఎంత అదృష్టవంతురాలివే!” అన్నది.
రాగానే నా చేయి విరిగేటట్లు జాడించిన త్రిపాఠీ “నువ్వు దురదృష్టవంతురాలవా!” అన్నాడు కోపం నటిస్తూ. “నేనేగాక నా చెల్లి కూడా అదృష్టవంతురాలు” అని జ్యోతిర్మయి మూతిముడిచింది.
త్రిపా: అంతేకద!
జ్యోతి: మీరు మరీనండి. ఏమో, నాకన్న నాచెల్లే అదృష్టవంతురాలేనేమో? ఆలోచిస్తే అలాగే కనబడుతోంది. ఉమా: ఒకరికన్న ఒకరు అదృష్టవంతులు లెద్దురూ!
ఆ మర్నాడు మేమంతా లక్నో వెళ్ళాం. నాకూ ఆనందమయికీ రిజిష్టరు వివాహమయింది.
దారిలో త్రిపాఠీ నాతో రహస్యంగా “మామగారికి నీమీదకోపం ఏమీ తగ్గలేదు భాయ్! అంతా నీపనే అంటారు. నేను జ్యోతి ఎన్నో చెప్పాం. ఆయన మనస్సు తిప్పలేక పోయాం. కాని అత్తగారి మనస్సు తిరిగింది” అని చెప్పినారు.
వివాహం కాగానే లక్నోనుండి వెంటనే అలహాబాదు వచ్చి వేశాం. నేను తక్క తక్కినవారందరూ త్రివేదీ గారింటికి వెళ్ళారు.
మాటలమధ్య నెమ్మదిగా మా గురువుగారు త్రివేదీ గారితో అంతా చెప్పారట. ఆయన నోట మాటరాక కుర్చీలో కూలబడిపోయారట. కొమరిత పాదాభివందనం చేయడానికి వెడితే “ఛీ దుర్మార్గురాలా! నీ మొహం చూపకు నాకు” అని ఆమెను కాలితో తన్నినారట. అంతతో మాగురువుగారు ఉగ్రుడైలేచి “నీ సంగతి దేశదేశాలా చాటుతాను. ఏ యుగంలో ఉన్నావు నీవు? వింధ్యాచలం ఇంకా ఆకాశం అంటే ఉందనుకున్నావా!” అని లేచినారట.
త్రిపా: “మామగారు! మీరంత తెలిసిన వారూ, భక్తులు, గాంధీజీ, జవహర్ పండిజ్జీల శిష్యులే, ఇలాంటివారవుతారని కలలోనన్నా అనుకోలేదు, కూతుర్ని తన్నారా? నన్నూ జ్యోతిర్మయినీ తన్నండి. ఈ పరిణామానికి కారకులం మేము. ఆనందమయి చతుర్వేదిని ప్రేమించేటట్లు చేశాము. అతడు ఉత్తముడు. మహోదారచరిత్రుడు. అలాంటివాడు అల్లుడవడం మీరు పూర్వజన్మలో చేసిన పుణ్యం" అని విసవిస ఆవలకు నడిచిపోయాడట. అందరూ అన్ని విధాలా చెప్పినారట. ఆనందమయి తండ్రిపాదాలకడనే పడివుందట. ఆనందమయి తల్లి కాళీమాయివచ్చి కూతుర్ని లేవదీసి "అమ్మడూ! నాన్న గారు తన్నినారా? నీ కర్మమేమి, నేనూ నీతో వస్తాను పద. ఇంత ఉత్తములే ఇలా అయ్యారేమి? అది నా కర్మ” అంటూ కౌగలించుకుందట ఆ బాలికను తల్లి.
మా మామగారు సింహంలా లేచారట. “సరే! మీరంతా సంస్కృతి కలవారు. నేను మాత్రం పరమఛాందస్తుణ్ణి! అనుకోండి, కన్నతల్లీ, నీకూ చతుర్వేదికే నిజమైన వివాహం చేస్తాను. ఆచార్యా! మీరు ఆ శుభకార్యం వైభవంగా జరిపించండి. తల్లీ! నిన్ను తన్నిన పాపానికి నివృత్తి ఏ ప్రాయశ్చిత్తం చేసుకుంటే పోతుందో!” అని ఆనందమయిని తన హృదయానికి అదుముకొని వెక్కి వెక్కి ఏడ్చినారట! అప్పుడందరి కళ్ళూ చెమర్చినాయట! జ్యోతిర్మయీ త్రిపాఠీ, ఆనందమయీ తండ్రికడ సాష్టాంగ పడినారట.
నా వివాహం పరమాద్భుతంగా జరిగింది. మా వాళ్ళంతా ప్రయాగ తర్లి వచ్చారు.
వింధ్యాచలేశ్వరుడు పకపక నవ్వుతున్నాడు. భారతదేశంలో అన్ని నదీ నదములూ త్రివేణీ సంగమానికి చుట్టాలై వచ్చినాయి.
"ఓం అసతో మా సద్గమయ
తమసో మా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతం గమయ.”
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse