Jump to content

అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల/వడగళ్ళు

​

వడగళ్ళు

వడగండ్ల వాన కురిసి పంటంతా పాడైంది. అంతటితో పతంజలి మనసు కుంగిపోయింది. ముదుసలి తల్లీ, పెళ్ళీడు వచ్చిన చెల్లెలూ, చదువుకుంటూన్న తమ్ముడు, అయిదెకరాలమీదా సొంత వ్యవసాయం చేసుకొని కుటుంబాన్ని పోషించాలనుకున్నాడు ఈ ఏడు. నూతిక్రింద ఒక ఎకరం వరిఊడ్చినాడు. తక్కిన నాలుగెకరాలు జొన్నవేశాడు. ఎంతవుతుందీ? ఏమవుతుందీ? ఆనూతి దగ్గరే ఒక చిన్నపంపులో పాదులుచేసి తోటకూరా, పాలకూరా మొదలైన ఆకుకూరలూ, ఓ సన్న జాజిపందిరీ పెంచుతున్నాడు. ఏడాది జైలుకు వెళ్ళి వచ్చినాడు. జైలులో ఉన్నప్పుడే గ్రామస్థులు కొందరు సహాయంచేసి వ్యవసాయం సాగించారు. అతడు పందొమ్మిది వందల నలుబది ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబరులో విడుదలైన దగ్గరనుంచీ గ్రామస్థుల సహాయానికి కృతజ్ఞత చూపిస్తూ వారిని రక్షించమని భగవంతుణ్ణి ప్రార్థించుకొన్నాడు. పంటకోసే బంగారం వంటి పంటకాలం ముందర మిత్తిలా ఈ వడగళ్ళవాన చక్కా వచ్చింది. పతంజలిశాస్త్రి జీవితం మూలమంతా కదలిపోయింది. జీవితంలో ఏలాంటి కష్టాలనైనా చిరునవ్వుతో ఎదుర్కొనే స్వభావంగల శాస్త్రికి ప్రపంచములో విరోధులనేవాళ్ళు ఎవరూలేరు. అతన్ని హింసించిన రజాకార్లకే అతనియందు కోపంలేకపోయింది. వరంగల్లు కాలేజీలో చదువుకున్నాడు. ఇంతలో తండ్రిపోవడం వల్ల జన్మభూమి అయిన జనగామ వచ్చి చేరుకున్నాడు. పతంజలి శాస్త్రికి ఆంధ్రభూమి అన్నా, ఆంధ్రత్వమన్నా ఆకాశమంత అభిమానం. చదువుకున్నన్నాళ్ళూ ఆంధ్రదేశంమీద పాటలు రాస్తూ తెలంగాణా రాయలసీమా కోస్తాజిల్లాలూ సిరివంచా చాందా బస్తరుఅన్నీ కలసి అఖండాంధ్రరాష్ట్రము స్థాపితమై ఆ రాష్ట్రానికి ముఖ్యపట్టణము హైదరాబాదు కావాలని అతని కోరిక.

పతంజలి శాస్త్రి అఖండాంధ్రస్వప్నము అతడు చదువు మానగానే ఒక మహాకెరటము చిన్ననావను తీసుకువెళ్ళినట్లు అతన్ని తీసుకువెళ్ళి ఆంధ్ర మహాసభలో సభ్యుణ్ణి చేసింది. ఇంతట్లో ఆంధ్ర మహాసభలోనే చీలికలు వచ్చాయి. అసలాంధ్రమహాసభ కమ్యూనిస్టుల పాలైంది.

ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, మందుములు నరసింగరావు, జమలాపురం కేశవరావు, మాడపాటి హనుమంతరావు, మందుముల రామచంద్రరావు మొదలైన నాయకులు పోటీ ఆంధ్ర మహాసభ పెట్టి విజయవంతంగా కొనసాగిస్తున్నారు. పతంజలి గాంధీ పూజా నిరతుడు కాబట్టి కోటి ఆంధ్ర మహాసభలలో చేరాడు. ​సకల భారతావనికీ పందొమ్మిది వందల నలభైఏడు ఆగష్టు శుభ ముహూర్తము నందు పవిత్ర స్వాతంత్ర్యం ఉదయించింది. కాని హైదరాబాదుకు మాత్రం నిజమైన స్వాతంత్ర్యం లేకపోయింది. పతంజలి హృదయం తల్లడిల్లిపోయింది. భారతమాత గర్భంలో హైదరాబాదు స్వాతంత్ర్యం ఒక వ్రణం అనుకున్నాడు ఆ యువకుడు. తనబాగు తనకు తెలియదు నైజాం ప్రభువుకి. ప్రపంచంలో ప్రభువులు దూదిపింజలై ప్రజాభ్యుదయ ప్రభంజనంలో దిశాంతాలకు కొట్టుకొనిపోతూంటే ఇత్తేహాద్ ముసల్మీన్‌కి ఇంత మూర్ఖత ఏమిటి అనుకున్నాడు పతంజలి.

రాష్ట్ర కాంగ్రెసు సత్యాగ్రహం ప్రారంభమైంది. తన కుటుంబపు దైన్యస్థితి, తన నిస్సహాయతా ఆలోచించకుండా ఆ శాంతరణంలోనికి వీరుడై ముందుకు ఉరికాడు. మరుసటి క్షణంలో పోలీసులు లాఠీ ప్రయోగానికి గురియై గుల్బర్గా జెయిలులో ప్రవాశి అయిపోయినాడు.

2

వడగళ్ళ వాన పెనుభూతంలా వచ్చిపడింది. వడగళ్ళకు దయాంతఃకరణలు లేవు. దేశంలో ఆహారపదార్థాలు తక్కువగా వున్నాయని ఆ వడగళ్ళవాన ఆలోచించదు. అసలే హిమగర్భమూర్తి వడగళ్ళవాన; కర్కశరూపి. అశనిపాతం ఒక చిన్న ప్రదేశం మాత్రమే నాశనంచేస్తుంది. వడగళ్ళపాతం పంటలకు కోటి అశనిపాతాలు! పతంజలి ఏడుపు రంగరించిన నవ్వు నవ్వుకున్నాడు.

దేశానికి భారతీయ సైన్యదళాలు విముక్తి సముపార్జించి, స్వేచ్ఛను నెలకొల్పినా, రజాకారుల దురంతాలు అణగిపోయినా కాంగ్రెసులోనే వడగళ్ళ వాన కురిసింది. రెండు కాంగ్రెసు పక్షాలయ్యాయి. ఒకదానికి రామానందతీర్థ అధ్యక్షుడు. రెండవదానికి దేశాయిగారధ్యక్షుడు. దేశాయిగారి వెనకాల పెట్టనికోటలా రామకృష్ణారావుగారు, నెహ్రూగారు వచ్చి వెళ్ళినా రెండు పార్టీలలో రాజీ కుదరలేదు. పతంజలి రామకృష్ణారావుగారిని 'కాకతీయకటకసన్నాహా' 'తెలంగాణా దక్షిణభుజదండా' అని పొగడుకొన్నాడు. అతడు రామకృష్ణారావుగారి పక్షం తరపున వేలకువేలు కాంగ్రెసు సభ్యులను చేర్పించాడు. ఇంతట్లో పటేలుగారి రాక మంత్ర ప్రయోగమై రెండుపార్టీలూ కలుసుకున్నాయి. అదివరకే వడగాళ్ళవాన కురవటమూ, పంటలు పాడవటమూ అయిపోయింది. తన ఇంట్లో జొన్నకూడే! తెలంగాణా తెల్ల జొన్నలు పిండి విసురుకొని రొట్టె కాల్చుకొని తింటారు.

వడగళ్ళు రాల్పగా మిగిలిన కొద్ది పంటా ఈనాటికి అయిపోయింది. ఏలాగో హైదరాబాదు స్కూలు ఫైనలు పరీక్ష రెండవతరగతిలో కృతార్థుడయ్యాడు. వరంగల్లులో ఇంటరు చదువుతూండగా తండ్రిపోవడం, స్వగ్రామమైన జనగామ చేరుకోవటం తటస్థించింది.

తన చెల్లీ, తల్లీ, తమ్ముళ్ళ దుఃఖాలను ఉపశమింపజేస్తూ తాను తన విషాదాన్ని శివునిలా దాచుకొంటూ గరళకంఠుడయ్యాడు. ​"తమ్ముడూ! నువ్వు చదువుమానకు! ఇరవైమూడేళ్ళు దాటిన నాబోటి అన్న ఉండీ నిన్ను చదువు మాన్పించటమా?" అన్నాడు.

తల్లి: నాయనా, ఈ సంసారం ఎట్లా ఈదను? ఈ దినంతో ఇంట్లో జొన్నలూ, జొన్నపిండీకూడా అయిపోయాయి.

చెల్లి మాలక్ష్మి: అన్నయ్యా! నేనూ చదువు మానేస్తాను. నన్ను బట్టి కూడా ఇంకా మనకు కొంత ఖర్చు. మనం భరించగలమా?

తమ్ముడు లక్ష్మీనరసింహశాస్త్రి : అన్నా, నేనూ చదువు మానేస్తాను. డాక్టరుగారి దగ్గర కాంపౌండరుగా వుంటే పదిరూపాయలు యిస్తామంటున్నారు.

పతంజలి: తమ్ముడూ, చెల్లీ! మీ ఇద్దరూ చదువుమానకండి. నారు పోసిన భగవంతుడు నీరు పోయక మానడు. మన వూళ్ళో పెద్దరెడ్డి ఓ ఎకరం మెరకపొలం పుచ్చుకుంటానన్నాడు. అది నూతిక్రింద పల్లపు పొలానికి దగ్గరగా వుండడంచేత మన పొలంకూడా పల్లంచేసుకుని అది కూడా నూతిక్రింద వ్యవసాయానికి తీసుకువస్తాడుట. తక్కిన నాలుగెకరాలూ అతనికే కవులుకు ఇస్తున్నాను. పొలం ఖరీదుకిచ్చే మూడు వందలూ, కవులుకోసం ముందరే ఇచ్చే వంద రూపాయలూ పట్టుకుని అందరం హైదరాబాదు పోదాం. సుల్తాన్ బజారులో ఓ కాంగ్రెసువాది తన కొట్టులో ఒక చిన్నభాగం వీథి అరుగుమీద ఆరునెల్లపాటు అద్దెలేకుండా ఇస్తానన్నాడు. తమలపాకుల బీడాలూ, సిగరెట్లూ, బీడీలూ అలాంటి వస్తువులేవో పెట్టి వర్తకం సాగిస్తాను. మన భుక్తి, చదువులు అవిచ్చిన్నంగా సాగిపోతాయనే ఆశిస్తున్నాను.

3

సుల్తాన్‌బజారులో పతంజలి శాస్త్రి పాన్ బీడాషాపు పెట్టాడు. కాంగ్రెసువాడవడమూ, ఉత్తముడూ, చాలా కష్టపడినవాడూ అని పేరు ఉండడమువల్ల అనేకమంది అతని దుకాణంలోనే తమలపాకు బీడాలు, సిగరెట్లు, బీడీలు, చుట్టలు మొదలైనవి కొనసాగించారు. తమ్మునికీ, చెల్లెలుకూ పాఠశాలలో ప్రవేశం దొరికింది. తమ్ముణ్ణి ఆంధ్ర స్కూలులోనూ, చెల్లెలిని ఆంధ్ర బాలికా పాఠశాలలోనూ చేర్చుకొన్నారు.

‘ప్రతివాని జీవితంలోనూ ఎన్ని వడగళ్ళ వానలు వస్తాయో' అని పతంజలి నిట్టూర్పు విడిచినాడు. ఇది కర్తవ్యతా మూఢత్వం లేకుండా, ఏ తక్కువ కార్యమైతేనేమి, గౌరవప్రదంగా జీవించడం ముఖ్యంకదా! శక్తిలేని వానికి ఉదరపోషణ నిమిత్తం ఉద్యోగాపేక్ష! రాష్ట్ర పరిపాలన కాంగ్రెసువారి చేతికివస్తే తానేమన్నా మంత్రిత్వం చేస్తాడా? దేశపాలన ఎవరు ధర్మంగా నడిపిస్తారో వారు రాజకీయ నావకు చుక్కానిపట్ట అర్హులు అవుతారు. కాని, కాంగ్రెసులో వారిలో వారికి పోటీలుపడి అనేక ముఠాలు సిద్ధమై కాంగ్రెసు ఆశయాలూ మూలపడి, కాంగ్రెసు సంస్థబలం నానాటికీ విచ్ఛిన్నం అయిపోతున్నది. మదరాసు మొదలయిన అన్ని రాష్ట్రాలలోనూ ఇలా కాంగ్రెసుబలం అడుగంటిపోతున్నది.

ఎన్ని చీలికలు, ఎన్ని కక్షలు! ​దేశం అంతా గాంధీజీబోధ మరచిపోయిందా?

పూర్ణ పురుషుడు, అవతారమూర్తి, అనాసక్తి యోగరూపుడు మహాత్ముడు ప్రజల హృదయాలలోనుండి మాయమయ్యాడా?


"ఏ మహాకాంతి నీవుగా మూర్తించినదో?
ఏ దిశ్యశక్తి నీవుగా రూపం తాల్చినదో?
ఏ పవిత్రత కూడుకొని నీ వవతరించావో?
ఓ సత్యపురుషా! అవ్యయరూపాత్మా!
సర్వవేద మంత్రాలు నీ స్వరములో నినదించినవి
ఉపనిషత్ స్వరాలే నీ బోధనలలో ప్రకాశించినవి!
పార్థసారథి గీతాదివ్యోపదేశామృతం ఝరులుగా నీ వాక్యాల ప్రవహించినది!
మహాత్మా! ఏకై కావతారా! మా తండ్రీ! జాతిపితా!
మా జీవితం అంతా నీవు ప్రసరించి ఉండలేదా?
ప్రళయాగ్ని మధ్య నీవు హిమాచలశిఖర శీతలత్వానివి!
భయంకర ఝంఝామారుతంమధ్య నీవు సునిశ్చల శాంతివి; నాశనం మధ్య సృష్టివి.
అసత్తుమధ్య సత్యానివి.
ఘోరతమస్సులు మాయంచేసే పరమపవిత్ర కాంతివి!
మహాత్మా! మా బాపూ! జాతిపితా! లోకగురూ!”


ఈలా అతని ఆలోచనలు సుళ్ళు చుట్టుకుపోతున్నవి. హైదరాబాదుపై రాజకీయపు వడగళ్ళవాన కురవక పూర్వమే పంజాబులో, సింధులో నాశనదేవత భీభత్సతాండవం సలిపినది. నేడు హైదరాబాదుకు శాంతి రాగానే, పంజాబునుంచి, సింధునుంచి కాందిశీకులై వచ్చినవారు కొంతమంది హైదరాబాదులో నివసించడానికై భారతీయ ప్రభుత్వం యేర్పాటు చేసింది.


సింధునించి వచ్చినవారు కోటీశ్వరు లవడంచేత వారు పెద్దపెద్ద మేడలు కొనుక్కొని పెద్దపెద్ద వర్తకాలు ప్రారంభించినారు. కాని పంజాబునుంచి వచ్చిన కాందిశీకులు పతంజలి శాస్త్రి స్థితిలోనే ఉన్నారు.


4


పతంజలి శాస్త్రి అడిగెమెట్టుకు దిగువ బొగ్గులకుంటలో చిన్న పటకుటీరం నిర్మించుకొని కాపురం సాగించినాడు. బొగ్గులకుంటకు ప్రక్కనే మిలటరీ ప్రభుత్వం ఒక చిన్న శిబిరం ఏర్పాటుచేసి పంజాబు కాందిశీకులు నివసించడానికి ఏర్పాటు చేసింది. వారందరికీ భారత ప్రభుత్వమే అనేక విధాల సహాయం చేస్తున్నది. అలావచ్చిన పంజాబీ కుటుంబాలలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉన్నది. పండిట్ కృష్ణకుమార గాయత్రీ అసలు అయోధ్య బ్రాహ్మణవంశంవాడు. అతని పూర్వులెపుడో అయోధ్య రాజవంశాలవారు పంజాబు వీరోద్యోగాలకు పోయినప్పుడు, వారు తమకు పురోహితులుగా గాయత్రీ వంశంవారిని తీసుకొనిపోయినారు. ఆ వంశంవారు రాను రాను అనేక కుటుంబాలుగా ​వృద్ధి పొందినారు. ఆ చుట్టుప్రక్కల హిందూ రాజకుటుంబాలకూ, హిందూ వర్తక కుటుంబాలకూ వీరు పురోహితులయ్యారు.

భారతదేశానికి 1947, ఆగష్టులో సంపూర్ణ స్వరాజ్యం రాగానే జరిగిన పంజాబు హత్యలలో పండిట్ కృష్ణకుమారగాయత్రీ తన ఆస్తిపాస్తులన్నీ నాశనం అయిపోయినప్పుడు, తనవారిలో చాలామంది హతమైనప్పుడు, ఏలా పారిపోయి వచ్చాడో కూతురుతోనూ, చిన్న కుఱ్ఱవాడితోనూ. భార్య దుర్మరణం పాలయింది. ఆ ఇద్దరే తనకు ఏడుగడా. తన సర్వస్వమూ అనుకొని గాయత్రీ పండితుడు ప్రవాహంగా వరదలు కట్టే కంటినీరు ఆపుకుని ప్రభుత్వంవారికీ ఇద్దరు బిడ్డలతోనూ అప్పగించుకొన్నాడు. చాలాకాలం ఆ ఇద్దరితో ప్రభుత్వంవారు ఏర్పరిచిన కాందిశీక శిబిరాలలో ఉన్నాడు. ఆ మహాప్రళయం వెనుక గాయత్రీ పండితుని పౌరోహిత్యం ఎవరికీ కావాలి? ఒక భయంకర బృందదుఃఖం కాందిశీక శిబిరాలన్నీ నిండి మహాసముద్రమై ఉన్నది. ఆ ప్రదేశాలు చూడలేక తోటివారి దుఃఖం భరించలేక గాయత్రీశాస్త్రి 'దక్షిణంలో ఏడుగడ ఏదైనా దొరకదా' అని హైదరాబాదు వచ్చాడు.

హైదరాబాదులోనూ ఎక్కడ చూచినా కాందిశీకులే, ఒక ప్రక్క భారత ప్రభుత్వంవారు తెచ్చి ఉంచిన పంజాబు కాందిశీకులు, వేరొకప్రక్క హైదరాబాదు లాయకాలీ ప్రభుత్వం తెచ్చిపెట్టిన ముస్లిం కాందిశీకులు. ఆ సమయంలోనే గాయత్రీశాస్త్రికి 1947, నవంబరు నెలలో పతంజలి శాస్త్రి స్నేహం లభ్యమైంది. ఆ శిబిరంకడ చక్కని వటకుటీరం నిర్మించుకొని బొగ్గులకుంటలో కాపురం చేస్తున్నాడు. సైకిలుమీద బజారుకుపోయి తన తమలపాకు బీడా - సిగరెట్టు - బీడీ దుకాణానికి వెడుతూ ఉంటాడు. తమ్ముణ్ణెక్కించుకొని వచ్చి ఆంధ్ర పాఠశాలలో వదులుతాడు. చెల్లెలు బొగ్గులకుంటనుంచి అన్నగారితో రోడ్డువరకూ నడిచివచ్చి అక్కడే కాపురం చేస్తున్న బోయినాగన్న రిక్షా సిద్ధంగా ఉంటే అది ఎక్కి నారాయణగూడాలో ఆంధ్ర బాలికా పాఠశాలకు పోతుంది.

పతంజలి శాస్త్రికి ధర్మశాస్త్రాలుకాని, చివరకు విఘ్నేశ్వరపూజైనా చేయించడముగాని ఏమీరాదు. వచ్చినదేదో ఆ కాస్తా ఉరుదూ భూయిష్టమైన చదువు. ఉర్దూలో మాత్రం ఆరితేరిన పండితుడు తెలుగు అంతంతమాత్రం. హైదరాబాదు వచ్చిన దగ్గరనుండీ పట్టుదలతో తెలుగు నేర్చుకుంటున్నాడు. అందుకు అతనికి దోహదమూ ఉత్సాహమూ ఇచ్చినది ప్రక్కనే ఇల్లు కట్టుకొని కాపురం చేస్తున్న వెంకటాచారి.

వెంకటాచారి రజస్థుడు: ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు. భారతీయ సంస్కృతీ, ముఖ్యంగా ఆంధ్ర సంస్కృతీ అంటే ప్రాణం అర్పిస్తాడు. కళలంటే ఆత్మే అర్పిస్తాడు. ఒక్కొక్క శిల్పమూ, చిత్రలేఖనముచూచి, ఆనందంతో మైమరచిపోతూ ఉంటాడు. అతనికి ప్రాచీన నాణేలు సమకూర్చడం, వాటినిగూర్చి పూర్తిగా పరిశోధించి తెలుసుకొనడం జీవితానందకర్మ! పాతబజార్లు జుమాదాత్ బజారు వ్రతంలా అంటుకొని ఉంటాడు. ఒక్కొక్క ప్రాచీననాణెం దొరికిందంటే ఇక ఆ రోజునుండీ నెలలతరబడి అతనికి పండగే! ఆ నాణెము స్నేహితులకు చూపిస్తూ వెఱ్ఱి ఆనందంలో మునిగిపోతూ ఉంటాడు. ​ఆ వెంకటాచార్యులతో పరిచయం ప్రథమంలోనే సంభవించింది పతంజలి శాస్త్రికి. అసలు అతని బొగ్గులకుంట కాపరానికి కారకుడు వెంకటాచార్యులు. హైదరాబాదు కాపురానికి రావడానికి ముందు పతంజలి శాస్త్రి మంచీ చెడ్డా చూచుకోవడానికి ఆ నగరం వచ్చినప్పుడు అనుకోకుండా ఒక కాఫీహోటలులో పతంజలి శాస్త్రి, వెంకటాచారి కలుసుకున్నారు. ఎందుకు వారిద్దరకూ మాటలు కలిసినచో మరి, పదినిమిషాలలో స్నేహితులయ్యారు. అరగంటలో ప్రాణమిత్రులయ్యారు. బొగ్గులకుంటలో గజం మూడురూపాయల చొప్పున స్థలాలు ఉన్నాయనీ, రెండువందల గజాలు పుచ్చుకొని వెంటనే ఒకపాక నిర్మించుకొని అందులో ప్రవేశించమనీ వెంకటాచార్యులు సలహా యిచ్చాడు.

వెంకటాచార్యులు తన దొడ్లో రకరకాల మొక్కలు వేసుకుంటాడు వేసవి శీతాకాలాలలో తానే నీళ్ళుతోడుకొని, మొక్కలకు పోసుకుంటాడు. భూమిబలము మంచి దవడంవల్ల మొక్కలు ఏపుగా వచ్చి అన్ని కూరలు పుష్కలంగా కాస్తవి. అతడీ కూరల వ్యవసాయం ప్రారంభించిన కడనుండీ బజారునుండి ఒక్క కూరగాని, పచ్చిమిరపకాయగాని కొనలేదు.

పతంజలి శాస్త్రి యీ నూత్నమిత్రుని సూచన వెంటనే అమలులోపెట్టినాడు. రెండువందల గజాలు స్థలంకొని పాక నిర్మించుకొన్నాడు. ఆ ప్రక్క ఒకదొడ్డి కౌలుకు పుచ్చుకొని కూరలు వేయడం సాగించాడు. అతని దుకాణమూ వృద్ధి అవుతున్నది; కూరలపంటా వృద్ధి అయింది. కాలీ, కాబేజీ పువ్వులు, వంకాయలు, బీర, పొట్లకాయలు, టొమాటోలు, పాలకూర మొదలయిన కూరలు, పచ్చిమిర్చీ, అన్నీ తనకొట్లో ఓ ప్రక్కగా పెట్టి వాటి అమ్మకమూ సాగించాడు.

5

1948 నవంబరు నెలలో గాయత్రీ పండితుడు బజారుకువచ్చి పతంజలి శాస్త్రి కొట్లో ఒక బీడీలకట్ట కొనుక్కొంటూ “మీరు మా శిబిరం ప్రక్కనే కాపురం చేస్తున్నారుకాదా?” అని ప్రశ్నించాడు.

"అవును. మిమ్మల్ని చూస్తున్నాను. మీరు ఏదైనా పని చూసుకున్నారా?”

పతంజలి ఉర్దూలో పండితుడు. అతని భాష వింటూ గాయత్రీ పండితు డాశ్చర్యం పొంది “మీరు ఉత్తరాదివారా?” అని ప్రశ్నించాడు.

"కాదండి, మేము అచ్చమైన ఆంధ్రులం. అయినా ఈ సంస్థానం తురక సంస్థానం అవడంవల్ల, రాజభాష ఉర్దూ అయింది మీకు అంగరీజువలె! కాబట్టి అన్ని భాషలు మేము నేర్చుకోవాలె. ఆంధ్రభాష మాత్రం మాకు దూరం! మేము ఉర్దూపత్రికలే చదువుతాము. నలుగురం కలుసుకుంటే తెలుగులో మాట్లాడుకోము. ఉర్దూ మాకు ఉగ్గుపాలలా వస్తుంది. మాట్లాడే తెలుగులోనూ ముప్పాతిక మాటలు ఉరుదూ మాటలే!”

“చాలాచిత్రమే! నాకేమీ పనిదొరకలేదు బాబూజీ! ఎంతకాలమని ఈలా ప్రభుత్వ సహాయం పొందుతూ ఉండను? పంజాబులో రాజ్యం ఏలినాను. ఈరోజు ఇక్కడ బానిస బ్రతుకుకన్న అధ్వాన్నంగా ఉంది.” ​పతంజలి శాస్త్రి పండిజ్జీ విషాదముఖం చూచినాడు. అతని హృదయం ద్రవించిపోయింది. కొంచెం గొంతుకు సవరించుకొని, అతడు గాయత్రీ పండితుని చూచి-

"పండిజ్జీ! మీరు నాతో భాగస్వాములు కండి. ఈ కొట్టు నేను ఒక్కణ్ణి చూసుకోలేకుండా ఉన్నాను!” అని గాఢ కంఠంలో ప్రార్థనగా అడిగినాడు.

"మీతమ్ముడు ఒక అబ్బాయి ఉన్నట్టున్నాడు.!”

"ఉన్నాడు. వాడికి చదువు బాగా వస్తోంది. వాడికి ఎంత చదువైనా చెప్పించ దలచుకొన్నాను.”

"మా అమ్మాయి లాహోరులో బాలికా పాఠశాలలో అయిదవఫారం చదువుతూ ఉండేది."

"మీకు సంతానం ఎందరు?”

గాయత్రీ పండిజ్జీకి కంటనీరు తిరిగింది. తలవంచుకొన్నాడు.

"మా అమ్మాయీ అయిదేళ్ళ చిన్నకుఱ్ఱవాడూనండి. మా పెద్దబ్బాయిని మీ యీడువాణ్ణి మాకళ్ళఎదుటే పొడిచేశారు. వాడు బ్రతికేఉన్నాడోప్రాణమే వదిలాడో! మేము ప్రాణాలకు వాణ్ణి అలావదిలి పారిపోయాము. ఆ దృశ్యం చూసి, గుండె ఆగి నాభార్య గతించింది. నా తమ్ముడి కుటుంబం సగం నాశనమైంది. తక్కినవాళ్ళందరూ “థెల్హీ” ప్రక్క శిబిరాలో వుంటున్నారు.”

“పండిజ్జీ, మీరు వెంటనే శిబిరంవదలి నేను కౌలు పుచ్చుకున్న దొడ్డిలో కాపురం పెట్టండి. నాలుగువందల గజాలస్థలం. ఆ స్థలం మీ పేర కొందాం. నేను ఎక్కడో అప్పు పట్టుకువస్తాను. మీరు నెమ్మదిగా ఆ అప్పు తీర్చుకోవచ్చును.”

“నాయనా! మీకు నేను మెడను కట్టినరాయిలా తయారవుతాను.”

"అలా మీరేమీ అనుకోకండీ! నేను ఏవో సబ్బులూ, తలనూనెలూ, ఇంకా ఇతర షాపుసామానులూ అమ్మడం ప్రారంభించాను. అవీ బాగా అమ్ముతున్నాయి. అదీకాక ఈమధ్య ఆంధ్రపత్రిక, భారతి, బ్లిడ్జి పత్రికల అమ్మకము సాగించాను. ఇవన్నీ ఒఖ్ఖణ్ణే చూసుకోలేకుండా ఉన్నాను పండిజ్జీ!"

"ఇంత చిన్నకొట్టు వ్యాపారానికి మనం ఇద్దరం ఏలా ఇముడుతాము శాస్త్రిజీ?”

"ఈ ప్రక్క ఓ పెద్దకొట్టు అద్దెకు వచ్చింది. దానికి బజానా ఇచ్చాను. అక్కడ సాగిద్దాము. ఈ కొట్టు ఇచ్చిన స్నేహితునకు ఇబ్బంది అవుతున్నది. అందుకనే ఆపనిచేశాను.”

“సరే, కానివ్వండి. తక్కిన మాటలు ఇంటి దగ్గిర మాట్లాడుకుందాం.”

ఒకనెలలో గాయత్రీశాస్త్రికోసం పటకుటీరం తయారైంది. ప్రభుత్వ సహాయంతోనూ, పతంజలి తెచ్చిన అప్పుతోనూ ఆ నాలుగు వందల గజాల భూమి కృష్ణకుమార గాయత్రీ పండితుడు కొనుక్కున్నాడు. పతంజలి, గాయత్రీ పండితులిద్దరూ కలిసి వ్యవసాయమూ, కొట్టూ రెండూ చూచుకొనడం సాగించారు.

గాయత్రీ పండితుని కొమరిత జయనందిని అందాల పుంజము. కోలమోము, తీర్చిదిద్దిన కనులు, ముక్కు, నోరు తీరు, పసిమి బంగారులో పాటలవర్ణము సమ్మిశ్రితమైన ​ఛాయ. పదునేడేండ్ల మిసిమి మిఠారీ పుత్తడి బొమ్మ. తేనెలు జీరలుకట్టి ఆవుపాల మీగడ తరగలు కట్టినట్టి చిక్కని మధుర కంఠధ్వనితో ఉరుదూ పంజాబీలు మాట్లాడుతూ ఉంటే పతంజలి హృదయం జల్లుమనేది. ఈ మధుర పుష్పంకోసం పంజాబీ కాందిశీకులలో యువకులు ప్రథమంలో అస్తమానమూ వస్తూ ఉండేవారేగాని గాయత్రీ పండిజ్జీకి అవేమీ గిట్టక వచ్చినవారిని తన తోట ఇంటిబయట రోడ్డుమీదనే నిలబెట్టి మాట్లాడేవాడు. తాను లేనప్పుడు కొమరిత పతంజలి ఇంట్లో ఉండేటట్లు కట్టుదిట్టం చేశాడు. ఆ కారణంవల్ల పంజాబీ యువకులు నిట్టూర్పులు విడిచి లాభం లేదనే నిస్పృహవల్ల గాయత్రీ పండితుని ఇంటికి రావడం నెమ్మదినెమ్మదిగా మానివేసినారు.

జయనందినికీ, పతంజలి చెల్లెలు మాలక్ష్మికీ నానాటికీ స్నేహం గాఢం అయింది. మాలక్ష్మి జయనందినికి తెలుగు నేర్పసాగించింది. జయనందిని లాగు, చొక్కా, వల్లెమాని, మాలక్ష్మి పరిష్కర్తృత్వంలో తెలుగు బాలికల రీతిని చీరా జంపరూ ధరించడం నేర్చుకున్నది. గాయత్రీ పండితుని కొడుకు రాధాకుమార్ ఐదేండ్ల బాలుడు. తెలుగుదేశం బాలకుడే అయినట్లు మాలక్ష్మి దగ్గిర తెలుగు మాట్లాడడం నేర్చుకున్నాడు. ఒక్క నిమిషంకూడా మాలక్ష్మినీ, పతంజలి తల్లి సుందరమ్మగారినీ వదిలేవాడుకాదు. సుందరమ్మ గారికి రాధాకుమారుని పెంపకము పరమసంతోషం కలుగజేసే వ్రతం అయినది. ఆ బాలుడు ఈమే తన తల్లిగా ‘అత్తా' అంటూ ఆవిడ పక్కలోనే పండుకొనడం సాగించాడు.

జయనందిని ఆలోచనాపరురాలు. భయంకరమైన హృదయ విచారణ దృశ్యాలెన్నో పంజాబులో చూచింది. ఆమె పులుల గుంపులను చూచిన కురంగిలా వణికిపోయింది. ఎన్నిదినాలో ఆమెకు పీడకలలు వస్తూ ఉండేవి. పంజాబు విశ్వవిద్యాలయ ప్రవేశిక పరీక్షకు చదువుతూ ఉండగా ఆ దేశం ముక్కలయింది.

ఈనాడు పతంజలి శాస్త్రి ఆ బాలికకు నెహ్రూ అవతారంలా కనుపించినాడు. ఆ బాలికకు పతంజలిని చూచినప్పుడల్లా ఏదో శాంతి. ఏదో ధైర్యము, ఏదో వర్ణింపలేని ఆశా కలుగుతూ ఉండేది.

పంజాబూ, హైదరాబాదు రాష్ట్రం ఏదో కొద్ది తేడాలుగా ఉంది. కాని పంజాబులో తాను కోరిన ఏదో విచిత్ర సౌందర్యం ఈ తెలుగువారిలో దృశ్యమైనది. తల్లీ చీరే కట్టుకొనేది. కాని ఆ విధానం అయోధ్యవిధానం. తెలుగువారి కట్టూ, బొట్టూ ఏదో శాంతిపూరితంగా వున్నవి. వీరి శుచిత్వము లోతులనుంచీ ప్రవహించి జీవితం అంతా ప్రసరిస్తుంది. తెలుగువారిలో హుందాతనం భారతజాతికి వన్నెగా కనబడింది. జీవితం సౌందర్యవంతం చేసుకోవడం తెలుగువారికే తెలుసును. అలా సౌందర్యము పురుష జీవితానికి చిహ్నితంగా పతంజలి శాస్త్రి కనబడినాడు.

6

పతంజలిశాస్త్రి రాత్రిళ్ళు చెల్లెలికీ, జయనందినికి పాఠాలు చెప్పేవాడు. పాఠాలు చెప్పుతూవుంటే శాస్త్రి మోము పూర్ణిమాజ్యోత్నలా వెలిగిపోయేది. అతని మాటలలో ఉత్కంఠతా, అతడు చెప్పే ఉత్సాహమూ జయనందిని చూచేది. జీలంనదీ తీరంనుంచి ​వచ్చిన ఆ ఔత్తరాహ యౌవన హృదయానికి ఈ ముచికుంద నదీతీరవాసుడైన పతంజలి బాలికలను కష్టాల నుండి రక్షించే వీరుడై కన్పడినాడు. నరకాసురుని సంహరించి బదునారువేల రాజకుమారికలను రక్షించిన శ్రీకృష్ణు డీలాంటివాడేనా యని జయనందిని అనుకున్నది. జయనందిని గోధుమతోవండే పిండివంటలు మాలక్ష్మి నేర్చుకొనేది. తమ దేశపు పిండివంటలు జయనందినికి నేర్పేది; వీ రిరువురకూ చదువులు నేర్పే పతంజలి శాస్త్రి వీరిద్దరి ప్రాణస్నేహము చూచి పులకరించి పోయేవాడు.

గాయత్రీపండితుడు నెమ్మదిగా తన కష్టాలు మరిచిపోయాడు. తన యాభైరెండు సంవత్సరాల జీవితమూ దక్షిణాన కృష్ణా గోదావరీ మధ్య దేశంలోనే గడచినట్లయింది. వర్తకమునందూ, ఇంటిదొడ్డి కాయకూరల పెంపకమునందూ అతనికి విచిత్రమైన అనురాగం కలిగింది. అరటికాయ కూర, దోసకాయ పచ్చడి, ఆవకాయ, గోగుకూరపులుసు మొదలైన తెలుగు వంటకాలు అతని జిహ్వకు నూత్నరుచులు కొనితెచ్చి, అతని కలలో కనుపించే పంజాబు హత్యాదృశ్యాల్ని మాయంచేసినవి.

పతంజలీ, గాయత్రీ పండితుడూ కలిసి కాంగ్రెసూ, బాపూజీ బోధనలూ ముందు దేశంలో జరుగబోయే మార్పులూ చర్చించుకొనేవారు. వేదాంత విషయాలు మాట్లాడుకొనేవారు. వీరితో వెంకటాచార్యులు చేరుతూ వుండేవాడు. వీరి ముగ్గురి సంభాషణా జయనందినీ, మాలక్ష్మి చెవులార వింటూ ఆనందం పొందేవారు.

వెంకటాచారి: పండిజ్జీ, ఏదో రూపంగా మనుష్యుని మనస్సు ఆనందం కోరుతూ ఉంటుంది. రాజకీయాలలో, ఇతరులకు ఉపకారం చేయడమో, ధనం సేకరించడమో, అధికారంలో ఇతరులను పాలించడమో ఈలా మానవుని మనస్సునకు సంతత వ్యాపారమత్తత ఉంటోనే ఉండాలి.

పండిజ్జీ: అయితే, మనుష్యుని ఆత్మకు ఆనందం కలిగే విషయాలను మనుష్యుడు వాంఛించడా?

పతంజలి: ఆత్మ వ్యక్తంకాని వస్తువు. మనస్సు వ్యక్తం అయిన మానవ జీవితంలోని ముఖ్య వస్తువు.

పండిజ్జీ: మనస్సు అతిసున్నితమై పోనుపోను మనస్సు తత్వాన్ని మించి పొందే వ్యవస్థే ఆత్మవ్యవస్థ. ఆ వ్యవస్థకూ మించిన వ్యవస్థ సర్వాంతర్యామి స్థిత అయిన ఒక మహోత్కృష్టమైన అనిర్వచనీయావస్థ, పరమాత్మావస్థ భౌతిక విషయజ్ఞానమైన స్థితిలో ప్రాథమికమైన మనస్సు స్థితి.

వెంకటాచారి: కాబట్టే మహాత్ముడు ఈ మనస్సును ధర్మపరమైన కార్యాలలో నిమగ్నం చేయమన్నాడు. లోకోపకారమూ, స్వకీయానందమూ రెండూ మిశ్రమై మనుష్యుని జీవితం ఒక ఉత్తమమైనదీ ప్రవాహంలా ప్రవహించిపోతుంది.

ఈ సంభాషణలు జయనందినికి అర్థమైనట్లుండి అర్థం కానట్లయ్యేవి. పతంజలి మాట, పతంజలి కంఠము, పతంజలి మోము త్రిప్పటము, అతడు కూర్చొనే విధానము, చేతులుత్రిప్పే రీతులూ హృదయానికి ఏదో తెలియగారాని ఉప్పొంగు నిచ్చేవి. ​ఆ బాలికలో కలిగే పరివర్తనం, ఆ వాతావరణం పరిమళంలా కమ్ముకుని పతంజలి జీవితాన్ని స్పర్శించేది. ఆ బాలిక తన్ను చూడడం లేదనుకొన్నప్పుడల్లా పతంజలి ఆమెను తనివితీర గమనించేవాడు, ఆమె పంజాబీ పాటలు, ఆమె ఆటలు, ఆమె తోటపని చేసే అందమైన తీరులూ చిత్రాలై అతని హృదయ ఫలకంపైన నవనవలాడేవి. కాని అతని హృదయంలో ఆ బాలికపైన స్త్రీ వాంఛ అతనికి దర్శనముకాలేదు. ఆమె ఏదో అజంతా చిత్రలేఖనము; పాలంపేటతో సౌందర్య విన్యాసవంతమైన శిల్పము.

7

1949 మే నెల వచ్చింది. ఎండలు తీక్షంగా కాస్తున్నాయి. ఉన్నట్టుండి ఒక ఆదివారంనాడు పతంజలి భోజనానికి ఇంటికి వచ్చిన సమయంలో పదునొకొండు గంటలకు ఆకాశం చటుక్కున మేఘాలతోనిండి ప్రపంచం అంతా ఒక్కసారి చల్లబడి వడగళ్ళవాన కురిసింది. పతంజలి స్నానానికని దొడ్డిలోనికిపోతూ బీర చిక్కుడు పాదులను చూస్తున్నాడు. ఆ ఎండలో మేలిముసుగు వేసుకుని ఏదో కూనిరాగం తీస్తూ, పందిరిఛాయల నిలుచుండి బీన్సుకాయలు కోస్తున్నది జయనందిని. వడగళ్ళవాన కురవబోయే ముందు ఆ చల్లదనానికి కంఠం ఎత్తి.

“మై గిరిధర ఘర్కేజాఊ" అని పాడుకుంటున్న జయనందిని పతంజలిని గమనించలేదు. పతంజలి ఆమెను చూస్తూ ఆనందముతో అలా నిలుచుండిపోయినాడు.

జల్లుమని వడగళ్ళు కురియడం ప్రారంభించాయి. జాజి పువ్వులులా, పారిజాతం పువ్వులులా, ఆణిముత్యాలులా చిన్నవై ఆ వడగళ్ళు కురిసినవి. అవి దేవతలు కురిపించే పూలవర్షంలా ఉన్నవి.

కాని పతంజలికి వెనుక తాను పొలంలో ఉన్నప్పుడు ఉసిరికాయ లంత వడగళ్ళు మహావేగంగా అశనికోటిపాతంలా పడిన రోజు మనస్సులో మెరుము మెరిసింది. అతనికి ఈ తోటలూ, ఈ ఇళ్ళూ, ఈ ప్రియబంధువులూ నాశనం అయిపోతున్నట్లు దిగ్భ్రమయుక్తమై విపరీత భయం ఆవహించింది. పిడుగు తగిలినవానిలా తూలి "అమ్మయ్యా!” అంటూ కూలిపోయాడు.

అతడు పడిన చప్పుడు విని చటుక్కున తిరిగి చూచి జయనందిని “ఏమిటది మామా!” అని అతని కడకు పరుగుడి వచ్చింది. అతని ప్రక్కనే చటుక్కున చతికిలబడి "ఏమిటి! దెబ్బ తగిలిందా? మాట్లాడు మామా!" అని గజగజ వణుకుతూ పతంజలిని తన వొళ్ళోకి తీసుకుని అతని తల తన హృదయానికి అదుముకున్నది.

అతడూ నిమేషంలో తెప్పిరిలి, ఆమె స్పర్శ సుఖం అనుభవిస్తూ మరి రెండునిమిషాలు అలాగేఉండినారు. ఇద్దరి హృదయాలలో తెరలు వీగిపోయినాయి. అతని జీవితానికి ఆమె ఆగష్టు పదిహేనవ తేదీ అయింది. ఆతడా బాలిక జీవితానికి రాబోవు పవిత్రాశయమూర్తియై గోచరించినాడు. తనకు తెలియకుండా పతంజలి బాహువు లామెను గాఢంగా చుట్టివేసినవి.

చుట్టూ వారిపైన వడగళ్ళు మల్లిమొగ్గలై జలజలా రాలుతున్నవి. ​రాధాకుమారుడూ, లక్ష్మీ నృసింహశాస్త్రి, మాలక్ష్మి వడిగళ్ళు ఏరుకోడానికి దొడ్లోకి వచ్చినారు, "ఏమిటి అక్కా!” అనీ, “ఏమిటి బహిన్" అని రాధాకుమారుడూ, “ఏం జరిగిన దన్నయ్యా? పడ్డావా? ఏమిటి జయాబహిన్" అని శాస్త్రి వీరిరువురి దగ్గిరకు పరుగిడివచ్చారు. మాలక్ష్మి "అమ్మో! ఏమి జరిగినదేమిటి?” అని ఒక్క గంతులో వీరిని సమీపించింది. ఇదంతా మూడునిమేషాల కాలం మాత్రం!

వడగళ్ళు అక్షతులులా, తలంబ్రాలులా ఇంకను చిన్నవై కురుస్తున్నవి.

చటుక్కున పతంజలి లేచి “తల తిరిగింది, తూలిపోయినాను చెల్లీ! జయ నన్ను పట్టుకోకపోతే, చాలా దెబ్బ తగిలిఉండును!" అంటూ నిలుచుండినాడు.

జయనందిని మోము పలాశపుష్పవర్ణకాంతితో వెలిగినది. సిగ్గుతో ఆమె మోము ఆర్ద్రత తాల్చినది.

జయనందిని లేస్తూ “మామకు కాలు జారింది కాబోలు!" అని నిలుచుండినది.

వడగళ్ళవాన వెలిసింది.

ఆ రాత్రి వెంకటాచార్యులు గాయత్రీ పండితుని కడకు వివాహ బేరానికి వచ్చినాడు. పండిజ్జీ హృదయానందానికి కడపలు లేకపోయినవి.

“ఆచార్యభాయ్! నా హృదయంలో ఈ కోర్కె మొదటినుండీ ఉంది నాయనా! ఇంతకన్న నా జన్మకు సంతోషం ఏముంది!" అనినాడు.

పతంజలి తల్లి సుందరమ్మగారు తన జన్మకు ఇంతకన్న మోక్షానందం ఏమున్నది అనుకున్నది. వారిద్దరికీ ఆ రాత్రి ఆమె కన్నులనుండి ఆనందబిందువులు రాలుతూ వుండగా ఒకచోట కూర్చోబెట్టి దృష్టితీసింది.

వడగళ్ళు, తుఫానులు, దావానలాలు, ప్రళయాలూ మానవజీవితానికి ఏలాంటి మార్పులు తీసుకొనివస్తాయి! హిమాలయ తనయ అంశలో ఉద్భవించిన ఈ జయ తన జీవితం వెతుక్కుంటూ ఈలా దక్షిణానికి వచ్చింది. ఆ మనోహర మూర్తికి కర్కశుడైన తాను తగిఉండడు. అయినా తెనుగునాట ఔత్తరాహశక్తి ప్రసరించే దివ్యముహూర్తం ఆసన్నమైంది. కాబోలుననుకొన్నాను, జయకు తానే దైవమట, తానే చక్రవర్తి ఆట, తానే నాయకుడట! అని మాలక్ష్మి ఆనందంతో పొంగిపోతూ అన్న చెవిలో గుసగుసలు పలికినది.

జయ తేరిచూడజాలని సౌందర్యంతో నందనవన పారిభద్రపుష్పంలా వికసించిపోయింది.

అవతారమూర్తి తన గురువు! అతని మోము తన హృదయంలో దాచుకొని ఆదుముకొన్నప్పుడు వర్ణింపలేని అంత ఆనందం తన్ను ముంచి వేసినదేమి?

ఆమెను మాలక్ష్మి "మా అన్నను వివాహ మాడగలవా వదినా?” అని అడిగినప్పుడు కలిగిన పులకరింపులతో మాలక్ష్మినే గట్టిగా కౌగలించుకొని, ఆమె చెంపలు గాఢంగా చుంబించింది. ఆమె కన్నులలో మధురత్రపాజ్యోత్స్నలు అలుముకు పోయినవి. "భాభీ! నాకేం తెలుసును? నీకే తెలుసును” అన్నది.

వడగళ్ళు అమృత బిందువులై కురిసి వెలిసినవికదా!


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse